పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ వామన చరిత్ర : దానముల సుతల గమనము

205
సార్ణి మనువు వేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భావిత మగు నా చోటికి
రావించెద; నంతమీఁద క్షింతు దయన్.
సావర్ణి = సావర్ణి; మనువు = మనువు; వేళను = కాలమునందు; దేవేంద్రుండు = దేవేంద్రుడు; అగున్ = అగును; ఇతండు = ఇతను; దేవతల్ = దేవతల; కున్ = కుకూడ; దుర్భావితము = ఊహించసాధ్యంకానిది; అగున్ = అయినట్టి; ఆ = ఆ; చోటి = పదవి; కిన్ = కి; రావించెదన్ = తీసుకొని వచ్చెదను; అంతమీద = ఆ తరువాత; రక్షింతున్ = కాపాడెదను; దయన్ = దయతో.
సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. దేవతలకు సైతం ఊహించడానికీ వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడతాను కూడ.

206
వ్యాధులు దప్పులు నొప్పులు
బాలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితఁ డందాకన్."
వ్యాధులు = రోగములు; దప్పులు = కష్టములు; నొప్పులు = నొప్పులు; బాధలు = బాధలు; చెడి = లేకుండపోయి; విశ్వకర్మ = విశ్వకర్మచేత; భావిత = సృష్టింపబడినట్టి; దనుజ = రాక్షసులచే; ఆరాధిత = సేవింపబడెడి; సుతలాలయమునన్ = సుతలలోకమున; ఏధిత = వృద్ధిపొందినట్టి; విభవమునన్ = వైభవముతో; ఉండున్ = ఉండును; ఇతండు = ఇతను; అంత = అప్పటి; దాకన్ = వరకు.
రోగాలూ శ్రమలూ ఆపదలూ దుఃఖాలు లేకుండా; విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతలలోకంలో, అంతవరకూ ఇతడు దానవుల సేవలు అందుకుంటూ. ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు."

207
అని పలికి బలిం జూచి భగవంతుం డి ట్లనియె.
అని = అని; పలికి = పలికి; బలిన్ = బలిని; చూచి = చూసి; భగవంతుండు = విష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = చెప్పెను.
ఈవిధంగా పలికిన భగవంతుడు అయిన వామనుడు బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు.

208
"సేమంబు నీ కింద్రసేన మహారాజ!;
వెఱవకు మేలు నీ వితరణంబు;
వేలుపు లం దుండ వేడుక పడుదురు;
దుఃఖంబు లిడుములు దుర్మరణము
లాతురతలు నొప్పు లందుండు వారికి;
నొందవు సుతల మందుండు నీవు;
నీపంపు జేయని నిర్జరారాతుల;
నాచక్ర మేతెంచి ఱకుచుండు;

208.1
లోకపాలకులకు లోనుగా వక్కడ
న్యు లెంతవార చట? నిన్ను
నెల్ల ప్రొద్దు వచ్చి యేను రక్షించెదఁ
రుణతోడ నీకుఁ గానవత్తు.
సేమంబు = మేలుకలుగును; నీ = నీ; కున్ = కు; ఇంద్రసేనమహారాజ = ఇంద్రసేనమహారాజ; వెఱవకు = బెదరిపోకు; మేలు = శ్రేష్ఠమైనది; నీ = నీ యొక్క; వితరణంబు = దాతృత్వము; వేలుపులు = దేవతలు; అందున్ = అక్కడ; ఉండన్ = ఉండుటకు; వేడుక = ఉత్సుకత; పడుదురు = పొందెదరు; దుఃఖంబులు = దుఃఖములు; ఇడుములు = కష్టములు; దుర్మరణము = దుర్మరణములు; ఆతురతలు = ఆతృతలు; నొప్పులు = బాధలు; అందున్ = అక్కడ; ఉండు = ఉండెడి; వారి = వారల; కిన్ = కు; ఒందవు = పొందవు; సుతలము = సుతలము; అందున్ = లో; ఉండు = ఉండుము; నీవు = నీవు; నీ = నీ యొక్క; పంపుజేయని = ఆజ్ఞనులెక్కచేయని; నిర్జరారాతులన్ = రాక్షసులను {నిర్జరారాతులు - నిర్జరుల (దేవతల) ఆరాతులు (శత్రువులు), రాక్షసులు}; నా = నా యొక్క; చక్రము = చక్రము; ఏతెంచి = వచ్చి; నఱుకుచుండున్ = సంహరించును.
లోకపాలకుల = ఏలోకపాలకుల; కున్ = కి; లోనుకావు = లొంగియుండవు; అక్కడ = అక్కడ; అన్యులు = ఇంక ఇతరులు; ఎంతవారలు = ఎంతటివారు; అచటన్ = అక్కడ; నిన్నున్ = నిన్ను; ఎల్ల = అన్ని; ప్రొద్దున్ = వేళలందు; వచ్చి = వచ్చి; ఏను = నేను; రక్షించెదన్ = కాపాడెదను; కరుణ = దయ; తోడన్ = తోటి; నీ = నీ; కున్ = కు; కానవత్తున్ = కనిపించుతుంటాను.
"ఇంద్రసేనమహారాజా! నీకు మేలు కలుగుతుంది. భయపడవద్దు. నీ త్యాగం శ్రేష్ఠమైనది. సుతలలోకంలో ఉండడానికి దేవతలు సైతం కుతూహల పడతారు. అంత చక్కటి ఆ లోకంలోనివారికి దుఃఖమూ, కష్టమూ, దుర్మరణమూ, రోగబాధలూ, కీడు కలగవు. అటువంటి లోకంలో నీవు ఉండు. నీ ఆజ్ఞమీరిన రాక్షసులను నా చక్రం నరుకుతుంది. ఆ లోకంలో దిక్పాలకులకు నీ మీద అధికారం ఉండదు. ఇంక ఇతరులను లెక్కించేది ఏముంది. ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తుంటాను. కనికరంతో కనిపెట్టి ఉంటాను.

209
దావ దైత్యుల సంగతిఁ
బూనిన నీ యసురభావమును దోడ్తో మ
ద్ధ్యామునఁ దలఁగి పోవును
మానుగ సుతలమున నుండుమామా యాజ్ఞన్."
దానవ = దానవుల {దానవులు - కశ్యపునకు దనువు వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; దైత్యుల = దైత్యుల {దైత్యులు - కశ్యపునకు దితి వలన కలిగిన పుత్రులు, రాక్షసులు}; సంగతిన్ = తోకూడుటవలన; పూనిన = కలిగిన; నీ = నీ యొక్క; అసురభావమున్ = రాక్షసత్వమును; తోడ్తోన్ = వెంటనే; మత్ = నా యొక్క; ధ్యానమునన్ = ధ్యానమువలన; తలగిపోవును = తొలగిపోవును; మానుగ = మనోజ్ఞంగా, సంతోషంగా; సుతలమునన్ = సుతలమునందు; ఉండుమా = ఉండుము; మా = మేము; ఆజ్ఞన్ = చెప్పినట్లుగా.
దైత్యదానవుల కలయికవలన నీకు కలిగిన రాక్షసత్వం నన్ను ధ్యానించడంవలన త్వరలో తొలగిపోతుంది. మా ఆజ్ఞప్రకారంగా సంతోషంగా సుతలంలో ఉండు."

210
అని యిట్లు పలుకుచున్న ముమ్మూర్తుల ముదుకవేల్పు తియ్యని నెయ్యంపుఁ బలుకుఁ జెఱకు రసంపుసోనలు వీనుల తెరువులం జొచ్చి లోను బయలు నిండి ఱెప్పల కప్పు దప్పం ద్రోచికొని కనుఁగవ కొలంకుల నలుగులు వెడలిన చందంబున సంతసంబునం గన్నీరు మున్నీరై పఱవ, నురఃఫలకంబునం బులకంబులు కులకంబులయి తిలకంబు లొత్తఁ, గేలు మొగిడ్చి నెక్కొన్న వేడుకం ద్రొక్కుడు పడుచుఁ జిక్కని చిత్తంబునఁ జక్కని మాటల రక్కసుల ఱేఁ డిట్లనియె.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = పలుకుచున్నట్టి; ముమ్మూర్తుల = త్రిమూర్తులందు; ముదుకవేల్పు = వృద్ధదేవుని; తియ్యని = తియ్యటి; నెయ్యంపు = స్నేహపూరిత; పలుకున్ = మాటలు యనెడి; చెఱకురసంపు = చెరకురసముయొక్క; సోనలు = జల్లులు; వీనుల = చెవుల; తెరువులన్ = ద్వారా; చొచ్చి = ప్రవేశించి; లోను = లోపల; బయలున్ = బయట; నిండి = నిండిపోయి; ఱెప్పలన్ = కనురెప్పలను; తప్పందోచుకొని = తొలగదోసుకొని; కన్ను = కళ్లు; గవ = రెంటి (2); కొలంకులన్ = కొలకులు యనెడి; అలుగులున్ = తూమునుండి; వెడలిన = వెలువడిన; చందంబునన్ = విధముగ; సంతసంబునన్ = సంతోషమువలన; కన్నీరు = కన్నీరు; మున్నీరు = ప్రవాహములు; ఐ = అయ్యి; పఱవన్ = ప్రవహించగా; ఉరఃఫలకంబునన్ = వక్షస్థలమునందు; పులకంబులున్ = పులకరింతలు; కులకంబులు = అంకురించినవి; అయి = అయ్యి; తిలకంబులొత్తన్ = అతిశయించినవికాగా; కేలు = చేతులు; మొగిడ్చి = జోడించి; ఎక్కొన్న = అధికమైన; వేడుకన్ = కుతుకముతో; త్రొక్కుడుపడుచు = తడబడుతు; చిక్కని = దృఢమైన; చిత్తంబునన్ = మనసుతో; చక్కని = చక్కటి; మాటలన్ = మాటలతో; రక్కసుల = రాక్షసుల; ఱేడు = రాజు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
ఇలా ప్రీతితో పరమాత్ముడు పలికిన తియ్యని మాటలు బలిచక్రవర్తి చెవులలో చెరకురసపు జల్లులవలే దూరి, లోపలా బయటా నిండాయి. సంతోష బాష్పాలు రెప్పల చాటునుండి త్రోసుకుంటూ కాలువలై వెలువడి ప్రవహించాయి. వక్షస్ధలమంతా పులకాంకురములు నిండాయి. అప్పుడు బలిచక్రవర్తి మిక్కిలి వేడుకతో చేతులు జోడించాడు. స్థిరమైన మనస్సుతో మెల్లగా ఇలా అన్నాడు.

211
"న్నడు లోకపాలకుల నీకృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
న్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
న్నగతల్ప! నిన్నెఱిఁగి ట్టిన నాపద గల్గనేర్చునే?"
ఎన్నడున్ = ఎప్పుడు; లోక = లోకములను; పాలకులన్ = పరిపాలించెడివారినికూడ; ఈ = ఇంత; కృపన్ = దయతో; చూడని = చూడనట్టి; నీవు = నీవు; నేడు = ఇవాళ; నన్నున్ = నన్ను; ఉన్నతున్ = గొప్పవానినిగ; చేసి = చేసి; నా = నా యొక్క; బ్రతుకున్ = జీవితమును; ఓజయున్ = తేజస్సును; ఆనతియిచ్చు = కలుగజేసి; కాచితి = కాపాడితివి; ఈ = ఇట్టి; మన్ననలు = గౌరవించుటలు; ఈ = ఇట్టి; దయారసమున్ = కరుణ; మాటలు = మాటలు; పెద్దఱికంబున్ = మర్యాదలు; చాలవే = సరిపోవా, సరిపోవును; పన్నగతల్ప = శేషశాయి; నిన్నున్ = నిన్ను; ఎఱిగి = తెలిసి; పట్టినన్ = ఆశ్రయించినచో; ఆపద = కష్టము; కల్గనేర్చునే = కలుగగలదా, కలుగదు.
"ఓ శేషశాయిశయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా, ఈ మాటలు, మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు."

212
అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందుధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరికృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.
అని = అని; పలికి = పలికి; హరి = విష్ణుని; కిన్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారము; చేసి = చేసి; ఇందుధరున్ = పరమశివుని; కిన్ = కి; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; బంధ = బంధములనుండి; విముక్తుడు = విడుదలైనవాడు; ఐ = అయ్యి; తనవారల = తనవారి; తోన్ = తోటి; చేరికొని = కలిసి; బలి = బలి; సుతలంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; హరి = విష్ణుని; కృపావశంబునన్ = దయవలన; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయ్యి; కుల = వంశమును; ఉద్ధారకుండు = ఉద్ధరించెడివాడు; అయిన = ఐన; మనుమని = మనుమడిని; కని = చూసి; సంతోషించి = సంతోషించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతున్ = విష్ణుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువునకూ, బ్రహ్మదేవునకూ, చంద్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.

213
"తురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు;
ర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ,
న్యుల కెక్కడి? సురులకును మాకు;
బ్రహ్మాదిపూజితదుఁడ వయిన
దుర్లభుండవు నీవు దుర్గపాలుఁడ వైతి;
ద్మజాదులు భవత్పాదపద్మ
కరంద సేవన హిమ నైశ్వర్యంబు;
లందిరి కాక యే ల్పమతుల

213.1
ధిక దుర్యోనులము కుత్సితాత్మకులము
నీకృపాదృష్టిమార్గంబు నెలవు చేర
నేమి తప మాచరించితి మెన్నఁగలమె?
మ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!
చతురాననుడు = బ్రహదేవుడు {చతురాననుడు - నాలుగుమోములవాడు, బ్రహ్మ}; నీ = నీ యొక్క; ప్రసాదంబున్ = అనుగ్రహమును; కానడు = ఇంతగా పొందలేడు; శర్వుడున్ = ఈశ్వరుడు {శర్వుడు - ప్రళయమున భూతలములను హింసించువాడు, శంకరుడు}; ఈ = ఇంతటి; లక్ష్ములన్ = ఐశ్వర్యములను; పొందడు = పొందలేడు; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; ఎక్కడిది = ఎక్కడ దొరుకుతుంది; అసురుల = రాక్షసుల; కును = కు; మా = మా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగువారిచేత; పూజితుడవు = పూజింపబడువాడవు; అయిన = ఐన; దుర్లభుండవు = దరిచేర సాధ్యంకానివాడవు; నీవు = నీవు; దుర్గ = కోటను; పాలుడవు = కాపాడువాడవు; ఐతి = అయితివి; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగువారు; భవత్ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; మకరంద = మకరందమును; సేవన = సేవించిన; మహిమన్ = మహిమవలన; ఐశ్వర్యంబులున్ = ఐశ్వర్యములను; అందిరి = అందుకొనిరి; కాక = అలా అయ్యుండగ; ఏము = మేము; అల్పమతులము = అల్పులము; అధిక = మిక్కిలి.
దుర్యోనులము = నీచజన్ములు కలవారము; కుత్సిత = కుత్సితమైన; ఆత్మకులము = బుద్ధికలవారము; నీ = నీ యొక్క; కృపాదృష్టి = కరుణాకటాక్షపు; మార్గంబున్ = దారిలో; నెలవు = ఉండుటను; చేరన్ = చేరుటకు; ఏమి = ఎట్టి; తపమున్ = తపస్సును; ఆచరించితిమి = చేసితిమో; ఎన్నగలమె = తెలియగలమా లేము; మమ్మున్ = మమ్మలను; కాచుట = కాపాడుట; చిత్రంబు = ఆశ్చర్యకర విషయము; మంగళాత్మా = మంగళస్వరూపా.
"ఓ మంగళస్వరూపా! బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

214
అదియునుం గాక.
అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
అంతేకాకుండా.

215
ర్వగతుఁడ వయ్యు మదర్శనుఁడ వయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు
లఁపు లిత్తు కల్పరువు మాడ్కి."
సర్వగతుడవు = అన్నిటి యందు నుండువాడవు; సమదర్శనుడవు = సర్వుల ఎడల సమదృష్టి కలవాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఒకటన్ = ఒక్కొక్కసారి; విషమవృత్తిన్ = పక్షపాతబుద్ధితో; ఉండుదు = ఉండెదవు; అరయ = తరచిచూసినచో; ఇచ్ఛ = భక్తి; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; ఈవు = వరములీయవు; భక్తులు = భక్తులు; కోరు = కోరెడి; తలపుల్ = కోరికలను; ఇత్తు = ప్రసాదించెదవు; కల్పతరువు = కల్పతరువు; మాడ్కిన్ = వలె.
నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరిని సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్నిచూపుతావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షంవలె భక్తులైనవారి కోర్కెలు నెరవేర్చుతావు."

216
అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె.
అని = అని; విన్నవించుచున్న = మనవిచేసెడి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - అత్యున్నతమైనవ్యక్తి, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఇలా మనవిచేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు.

217
"త్స! ప్రహ్లాద! మేలు నీ వారు నీవు
సొరిది మనుమనిఁ దోడ్కొని సుతలమునకుఁ
యనమై పొమ్ము నే గదాపాణి నగుచుఁ
జేరి రక్షింప దురితంబు చెంద దచట."
వత్స = కుమారా; ప్రహ్లాదా = ప్రహ్లాదుడా; మేలు = సంతోషము; నీవారు = నీవారు; నీవున్ = నీవు; సొరిదిన్ = క్రమముగా; మనుమనిన్ = మనుమడిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సుతలమున్ = సుతలమున; కున్ = కు; పయనము = బయలుదేరినవాడవు; ఐ = అయ్యి; పొమ్ము = వెళ్ళుము; నేన్ = నేను; గదా = గదాయుధము; పాణిని = చేతధరించినవానిని; అగుచున్ = అగుచు; చేరి = వచ్చి; రక్షింపన్ = కాపాడుతుండగా; దురితంబు = ఏకష్టము; చెందదు = కలుగదు; అచటన్ = అక్కడ.
"నాయనా! ప్రహ్లాదా! మంచిది. నీవు నీమనుమనితోపాటు నీవారితోపాటు సుతలలోకానికి వెళ్ళు. నేను గదాహస్తుడనై వచ్చి మిమ్ములను కాపాడుతాను. అక్కడ మీకు ఏకష్టమూ కలుగదు.

218
అని యిట్లు నియమించినం బరమేశ్వరునకు నమస్కరించి వలగొని కరకమల పుట ఘటిత నిటల తటుండయి, వీడ్కొని, బలిం దోడ్కొని సక లాసురయూథంబునుం దాను నొక్క మహాబిలద్వారంబు చొచ్చి ప్రహ్లాదుండు సుతల లోకంబునకుం జనియె; నంత బ్రహ్మవాదు లయిన యాజకుల సభామధ్యంబునం గూర్చున్న శుక్రునిం జూచి నారాయణుం డి ట్లనియె.
అని = అని; ఇట్లు = ఈ విధముగ; నియమించినన్ = ఆజ్ఞాపించగా; పరమేశ్వరున్ = విష్ణుని; కున్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; వలగొని = ప్రదక్షిణచేసి {వలగొను - వలను(దక్షిణమువైపు) కొను, ప్రదక్షిణముచేయు}; కర = చేతులు యనెడి; కమల = పద్మములను; పుటఘటిత = జోడించిపెట్టబడిన; నిటలతటుండు = నుదుటిభాగము కలవాడు; అయి = ఐ; వీడ్కొని = సెలవుతీసుకొని; బలిన్ = బలిని; తోడ్కొని = వెంటబెట్టుకొని; సకల = సర్వ; అసుర = రాక్షస; యూథంబునున్ = సమూహమును; ఒక్క = ఒక; మహా = గొప్ప; బిల = గుహా; ద్వారంబు = ద్వారము; చొచ్చి = ప్రవేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; సుతలలోకంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; బ్రహ్మవాదులు = బ్రహ్మవేత్తలు; అయిన = ఐన; యాజకుల = ఋత్విజుల యొక్క; సభా = సమూహము; మధ్యంబునన్ = నడుమ; కూర్చున్న = కూర్చొని ఉన్న; శుక్రునిన్ = శుక్రుని; చూచి = చూసి; నారాయణుండు = విష్ణువు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
ఈ విధంగా సుతలమునకు వెళ్ళమని ఆజ్ఞాపించిన భగవంతునికి ప్రహ్లాదుడు నమస్కరించి ప్రదక్షిణ చేసాడు. నొసటిపై చేతులు జోడించి సెలవుతీసుకున్నాడు. ఆ తరువాత, అతడు బలిచక్రవర్తినీ రాక్షసుల సమూహాన్ని వెంటపెట్టుకొని, ఒక గొప్ప గుహ గుండా సుతలలోకానికి వెళ్ళాడు. అటు పిమ్మట, మహావిష్ణువు బ్రహ్మవేత్తలైన ఋత్విజుల నడుమ సభలో కూర్చుని యున్న శుక్రాచార్యుని చూసి, ఇలా అన్నాడు.