పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : రాక్షసుల సుతల గమనంబు

  •  
  •  
  •  

8-671-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి హరికి నమస్కరించి బ్రహ్మకుం బ్రణామంబు జేసి, యిందు ధరునకు వందనం బాచరించి, బంధవిముక్తుండై తన వారలతోఁ జేరికొని బలి సుతలంబునకుం జనియె; నంత హరి కృపావశంబునం గృతార్థుండై కులోద్ధారకుం డయిన మనుమనిం గని సంతోషించి ప్రహ్లాదుండు భగవంతున కిట్లనియె.

టీకా:

అని = అని; పలికి = పలికి; హరి = విష్ణుని; కిన్ = కి; నమస్కరించి = నమస్కారముచేసి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; ప్రణామంబు = నమస్కారము; చేసి = చేసి; ఇందుధరున్ = పరమశివుని; కిన్ = కి; వందనంబు = నమస్కారము; ఆచరించి = చేసి; బంధ = బంధములనుండి; విముక్తుడు = విడుదలైనవాడు; ఐ = అయ్యి; తనవారల = తనవారి; తోన్ = తోటి; చేరికొని = కలిసి; బలి = బలి; సుతలంబున్ = సుతలమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అంత = అప్పుడు; హరి = విష్ణుని; కృపావశంబునన్ = దయవలన; కృతార్థుండు = ధన్యుడు; ఐ = అయ్యి; కుల = వంశమును; ఉద్ధారకుండు = ఉద్ధరించెడివాడు; అయిన = ఐన; మనుమని = మనుమడిని; కని = చూసి; సంతోషించి = సంతోషించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతున్ = విష్ణుని; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా విష్ణుమూర్తిని స్తుతించి, బలిచక్రవర్తి విష్ణువునకూ, బ్రహ్మదేవునకూ, చంద్రశేఖరుడైన శివునికీ నమస్కరించాడు. బంధనం నుండి విడుదలపొంది తన పరివారంతో చేరి సుతలలోకానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి దయతో ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనుమణ్ణి చూచి ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతునితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు.