పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణి సందేశము పంపుట

18

న్న తలంపు తా నెఱిఁగి, న్నవనీరజగంధి లోన నా
న్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం
న్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ,
డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే.

భావము:- పరీక్షిన్మహారాజా! తన అన్న ఆలోచన తెలిసి, క్రొందామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన (పద్మినీజాతి సుందరి యైన) రుక్మిణి, మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తా నంటున్నాడు. ఏ విధాగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియ జెప్పుము.

19

య్యా! కొడుకు విచారము
య్యయు వారింపఁ జాలఁ టు గాకుండన్
నెయ్య మెఱిఁగించి చీరుము
య్యన నిజసేవకానుసారిన్ శౌరిన్."

భావము:- ఓ బ్రాహ్మణోత్తమా! కొడుకుమాట మా నాన్న కూడ కాదనలేడు. అలా కాకూడదు. కనుక, నాప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండు వాడు, శూరుని మనుమడు అయిన శ్రీకృష్ణుణ్ణి వెంటనే రమ్మని పిలు.”

20

అని కొన్ని రహస్యవచనంబులు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకుం జని, ప్రతిహారుల వలనఁ దనరాక యెఱింగించి య న్నగధరుం డున్న నగరు ప్రవేశించి, యందుఁ గనకాసనాసీనుండయి యున్న పురుషోత్తముం గాంచి “పెండ్లికొడుకవు గ” మ్మని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్యదేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి, బ్రాహ్మణుం గూర్చుండ నియోగించి, తనకు దేవతలు చేయు చందంబునం బూజలు చేసి, సరసపదార్థ సంపన్నంబైన యన్నంబుఁ బెట్టించి, రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం జేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున నతని యడుగులు పుడుకుచు మెల్లన నతని కిట్లనియె.

భావము:- ఇలా చెప్పి కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళాడు. ప్రతీహారుల ద్వారా తన రాక తెలిపాడు. అంతఃపురంలో బంగారు ఆసనం మీద ముసిముసి నవ్వుతూ ఉన్న కృష్ణుణ్ణి దర్శించి “కల్యణ ప్రాప్తిరస్తు” అని దీవించాడు. సంతోషించిన కృష్ణుడు గద్దె దిగి, ఆసీనుణ్ణి చేసి, భక్తిగా పూజించి, మంచి రుచికరమైన భోజనం పెట్టించేడు. ద్విగుణీకృతమైన ప్రేమతో తేజోరాశిలా ఉన్న బ్రాహ్మణుని దరిజేరి లోకాల్ని కాపాడే తన చేత్తో కాళ్ళొత్తుతూ, కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు.

21

"గతీసురేశ్వర! సంతోషచిత్తుండ;
వై యున్న నీ ధర్మ తిసులభము
వృద్ధసమ్మత మిది విత్త మెయ్యది యైనఁ;
బ్రాపింప హర్షించు బ్రాహ్మణుండు
న ధర్మమున నుండుఁ రలఁ డా ధర్మంబు;
గోరిక లతనికిఁ గురియుచుండు
సంతోషిగాఁ డేని క్రుఁడైన నశించు;
నిర్ధనుండైనను నింద్రుఁ బోఁలు

సంతసించెనేని, ర్వభూతసుహృత్త
ములకుఁ బ్రాప్తలాభ ముదిత మాన
సులకు శాంతులకును సుజనులకును గర్వ
హీనులకును వినతు లే నొనర్తు.

భావము:- “ఓ బ్రాహ్మణుడా! లోకులందరిచే గౌరవింపబడువాడ! నీ పద్దతి చక్కటిది, తీరైనది, పెద్దలు అంగీకరించేది. బ్రాహ్మణుడు దొరికిన ధనంతోనే తృప్తిపడతాడు. తన దర్మాన్ని వదలిపెట్టడు. ఆ ధర్మమే అతనికి కావలసినవన్నీ సమకూరుస్తుంది. విప్రుడు తృప్తి చెందకపోతే ఇంద్రుడైనా నాశనమైపోతాడు. తృప్తి చెందాడా, దరిద్రుడు కూడ యెంతో సుఖంగా ఉంటాడు. నేను సకల జీవులకు ఆప్తులు, దొరికిన దానితోనే తృప్తిచెందే వారు, శాంతస్వభావులు, మంచివారు, గర్వహీనులు అయిన విప్రులకి నమస్కరిస్తాను.

22

వ్వని దేశమం దునికి; యెవ్వనిచేఁ గుశలంబు గల్గు మీ
కెవ్వని రాజ్యమందుఁ బ్రజలెల్ల సుఖింతురు వాఁడు మత్ప్రియుం
డివ్వనరాశి దుర్గమున కెట్లరుదెంచితి రయ్య! మీరు? లే
వ్వులుగావు; నీ తలఁపునం గల మే లొనరింతు ధీమణీ!"

భావము:- బుద్ధిశాలీ! మీరే దేశంలో ఉంటారు. ఎవని రాజ్యంలో నైతే మీరు కులాసాగా ఉంటారో, ప్రజలంతా సుఖంగా ఉంటారో వాడు మాకు ఇష్టుడు. సముద్రంలో ఉన్న ఈ కోట లోకి రావటం అంత సుళువైనపని కాదు. మీరెలా వచ్చేరు. మీరు కోరిన మేలు తప్పక చేకూరుస్తాను.” అని శ్రీకృష్ణుడు సందేశం పట్టుకొని వచ్చిన విప్రుని పలకరించాడు.

23

అని యిట్లు లీలాగృహీతశరీరుండైన య ప్పరమేశ్వరుం డడిగిన ధరణీసురవరుం డతనికి సవినయంబుగ నిట్లనియె “దేవా! విదర్భదేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలం; డా రాజుకూఁతురు రుక్మిణి యను కన్యకామణి; గల ద య్యిందువదన నీకుం గైంకర్యంబు జేయం గోరి వివాహమంగళ ప్రశస్తంబయిన యొక్క సందేశంబు విన్నవింపు మని పుత్తెంచె నవదరింపుము.

భావము:- ఇలా ఆ లీలామానవదేహధారి అయిన శ్రీకృష్ణపరమాత్మ అడుగగా, రుక్మిణీదేవి సందేశం తెచ్చిన ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు “భగవాన్! విదర్భ దేశానికి రాజు భీష్మకుడు. ఆ రాజు కూతురు రుక్మిణి. ఆ అందమైన కన్య ఒక వివాహ మంగళంబైన గొప్ప సందేశం నీకు విన్నవించమని పంపింది. సావధానంగా విను.

24

నీ గుణములు కర్ణేంద్రియంబులు సోఁక;
దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల;
ఖిలార్థలాభంబు లుగుచుండు
నే నీ చరణసేవ యే ప్రొద్దు చేసిన;
భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ;
డవిన బంధసంతులు వాయు

ట్టి నీ యందు నా చిత్త నవరతము
చ్చి యున్నది నీ యాన నాన లేదు,
రుణఁ జూడుము కంసారి! లవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!

భావము:- శ్రీకృష్ణప్రభూ! కంసాది ఖలులను సంహరించినవాడ! మంగళాకారా! మనస్వినిల మనసులు దోచేవాడా! నీ గురించి చెవులలో పడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకొంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ ఎడతెగకుండా చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచ లౌతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. నీ మీదొట్టు. సమయం లేదు. దయతో చిత్తగించు.

25

న్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ
న్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే
న్యల్గోరరు? కోరదే మును రమాకాంతా లలామంబు రా
న్యానేకపసింహ! నా వలననే న్మించెనే మోహముల్?

భావము:- ముకుందా! రాజులనే మత్తేభాల పాలిటి సింహమా! నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడవు. కులం, రూపం, యౌవనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన, పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు. మోహించకుండా ఉంటారు. పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించ లేదా. అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలననే మోహం అనేది పుట్టిందా ఏమిటి.

26

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుతమైన భవత్ప్రతాపమున్

భావము:- ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి ఐన శశిపాలుడు నీ పదభక్తురాలు ఐన రుక్మిణిని, నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.

27

వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.

భావము:- రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోకకల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శశిపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

28

అంకిలి జెప్పలేదు; చతురంగబలంబులతోడ నెల్లి యో!
పంజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయశౌర్యమే
యుంకువ చేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.

భావము:- ఓ పద్మనాభ! కృష్ణ! మహాత్మ! అడ్డుచెప్పడానికి లేదు; నీ పరాక్రమం చూపి, రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి, శిశుపాలుడు జరాసంధులను జయించి, నా దగ్గరకు వచ్చి, నన్ను (రుక్మిణిని) రాక్షస వివాహమున తీసుకుకొని వెళ్ళవయ్య! నేను సంతోషంగా నీతో వచ్చేస్తాను.

29

"లోపలి సౌధంబులోన వర్తింపంగఁ;
దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి;
కాని తేరా" దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద;
నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ;
బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ

నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
చ్చి కొనిపొమ్ము నన్ను నవార్యచరిత!

భావము:- ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! “నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణీ ! నిన్ను ఎలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ ఉన్న మీ బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా” అని నీవు అనుకుంటే, దీనికి ఒక ఉపాయం మనవిచేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును మా ఇలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడ అలాగే నగరి వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!

30

ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱుజన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబ, ప్రాణేశ్వరా!

భావము:- జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు. మహాత్ములు అజ్ఞానరాహిత్యం కోరి, శంకరుని వలెనే, ఆ పరాత్పరుని పదజనిత గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ అనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా!
రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది. భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.

31

ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని;
ర్ణరంధ్రంబుల లిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని;
నులతవలని సౌంర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని;
క్షురింద్రియముల త్వ మేల?
యిత! నీ యధరామృతం బానఁగా లేని;
జిహ్వకు ఫలరససిద్ధి యేల?

నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
న్యచరిత! నీకు దాస్యంబు జేయని
న్మ మేల? యెన్ని న్మములకు."

భావము:- శ్రీకృష్ణ! నీ మనోఙ్ఞమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు దండగ; పురుషోత్తమ! నీవు భోగించని వంటికి అంద మెందుకు దండగ; ప్రాణేశా! నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు దండగ; ప్రభూ! నీ అధరామృతం అందని నాలుకకు రుచెందుకు దండుగ; పద్మాక్షా! నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు దండగ; మహాత్మా! కృష్ణభగవాన్! ఎన్నిజన్మలకైనా నీ సేవచేయలేని దండగమారి జన్మ ఎందుకు; నాకు వద్దయ్యా!”

32

అని యిట్లు రుక్మిణీదేవి పుత్తెంచిన సందేశంబును, రూప సౌంద ర్యాది విశేషంబులును బ్రాహ్మణుండు హరికి విన్నవించి “కర్తవ్యం బెద్ది చేయ నవధరింపు” మని సవర్ణనంబుగా మఱియు నిట్లనియె.

భావము:- ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి పంపిన సందేశం, ఆమె అందచందాది విశేషాలు వివరంగా చెప్పి “ఏం చేయాలో చూడు” అని విన్నవించి, కుండిన పుత్రిని వర్ణిస్తూ ఇంకా ఇలా చెప్పాడు . .

33

"ల్లవ వైభవాస్పదములు పదములు;
నకరంభాతిరస్కారు లూరు;
రుణప్రభామనోరములు గరములు;
కంబు సౌందర్య మంళము గళము;
హిత భావాభావ ధ్యంబు మధ్యంబు;
క్షురుత్సవదాయి న్నుదోయి;
రిహసితార్ధేందు టలంబు నిటలంబు;
జితమత్త మధుకరశ్రేణి వేణి;

భావజాశుగముల ప్రాపులు చూపులు;
కుసుమశరుని వింటికొమలు బొమలు;
చిత్తతోషణములు చెలువ భాషణములు;
లజనయన ముఖము చంద్రసఖము.

భావము:- “ఆ పద్మాక్షి రుక్మిణీదేవి పాదాలు చిగురాకుల వంటివి. తొడలు బంగారు అరటిబోదెల కన్న చక్కటివి. చేతులు ఎఱ్ఱటి కాంతులతో మనోహరమైనవి. అందమైన కంఠం శుభకరమైన శంఖం లాంటిది. నడుము ఉందా లేదా అనిపించేంత సన్నటిది. స్తనాల జంట కనువిందు చేస్తుంది. నుదురు అర్థచంద్రుడి కంటె అందమైనది. జడ మత్తెక్కిన తుమ్మెదల బారు లాంటిది. చూపులు మన్మథ బాణాలకి సాటైనవి. కనుబొమలు మన్మథుని వింటి కొమ్ములు. ఆ సుందరి పలుకులు మనసును సంతోషపెట్టేవి. ఆమె మోము చంద్రబింబం లాంటిది.

34

యెలనాగ నీకుఁ దగు; నంగనకుం దగు దీవు మా యుపా
ధ్యాయుల యాన పెండ్లి యగుఁ; ప్పదు జాడ్యములేల? నీవు నీ
తోమువారిఁ గూడుకొని తోయరుహాననఁ దెత్తుగాని వి
చ్చేయుము; శత్రులన్ నుఱుముజేయుము; చేయుము శోభనం బిలన్."

భావము:- ఆ యువతి రుక్మణీదేవి నీకు తగినది. ఆమెకు వాసుదేవ! నీవు తగిన వాడవు. మా గురువులము ఇస్తున్న ఆనతి ఇది. మీ పెళ్ళి జరిగి తీరుతుంది. ఇంక ఆలస్యం ఎందుకు. నువ్వు నీ సేనతో కలిసి కన్యను తీసుకొచ్చెదవుగాని రమ్ము. శత్రువుల్ని నుగ్గునుగ్గుచేయుము. లోకానికి శుభాలు కలిగించుము.”