పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1698-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్న తలంపు తా నెఱిఁగి, న్నవనీరజగంధి లోన నా
న్నత నొంది, యాప్తుఁడగు బ్రాహ్మణు నొక్కనిఁ జీరి "గర్వ సం
న్నుఁడు రుక్మి నేడు ననుఁ జైద్యున కిచ్చెద నంచు నున్నవాఁ,
డెన్నివిధంబులం జని బుధేశ్వర! చక్రికి విన్నవింపవే.

టీకా:

అన్న = సోదరుని; తలంపున్ = ఆలోచనలను; తాన్ = ఆమె; ఎఱిగి = తెలిసి; ఆ = ఆ యొక్క; నవనీరజగంధి = రుక్మిణి {నవనీరజగంధి - తాజా పద్మముల వంటి సువాసనలు ఉన్నామె, పద్మినీ జాతి సుందరి, రుక్మిణి}; లోనన్ = మనసులోపల; ఆపన్నతన్ = ప్రమాదస్థితిని; ఒంది = పొంది; ఆప్తుడు = కావలసినవాడు; అగు = ఐన; బ్రాహ్మణున్ = బ్రాహ్మణుడను; ఒక్కనిన్ = ఒకతనిని; చీరి = పిలిచి; గర్వ = గర్వముచేత; సంఛన్నుడు = కప్పబడినవాడు; రుక్మి = రుక్మి; నేడు = ఇప్పుడు; ననున్ = నన్ను; చైద్యున్ = శిశుపాలుని {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; కిన్ = కి; ఇచ్చెదను = వివాహమున ఇచ్చెదను; అంచున్ = అనుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఎన్నివిధంబులన్ = ఏవిధముగానైన; చని = పోయి; బుధ = పండితులలో; ఈశ్వరా = ఉత్తముడా; చక్రి = కృష్ణుని; కిన్ = కి; విన్నవింపవే = మనవిచేయుము.

భావము:

పరీక్షిన్మహారాజా! తన అన్న ఆలోచన తెలిసి, క్రొందామరల సుగంధాలు వెదజల్లే దేహం కలిగిన (పద్మినీజాతి సుందరి యైన) రుక్మిణి, మేలుకోరేవాడు అయిన అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుని పిలిచి ఇలా చెప్పింది “బుద్ధిమంతుడా! గర్వంతో కన్నులుగానక మా అన్న రుక్మి నాకు చేదిదేశపువాడైన శిశుపాలుడితో ఎలాగైనా పెళ్ళి చేసేస్తా నంటున్నాడు. ఏ విధాగానైనా చక్రాయుధుడు శ్రీకృష్ణుడి దగ్గరకి వెళ్ళి పరిస్థితి తెలియ జెప్పుము.