పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : రవ్వలు


భాగవత పద్యరవ్వలు

పద్య సూచిక;-
విజయ, ధనంజయ, ; విడిచితి భవబంధంబుల ; విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ ; విశ్వకరు విశ్వదూరుని ; విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు ; విషకుచయుగ యగు రక్కసి ; విషధరరిపు గమనునికిని ; విష్ణు కథా రతుఁ డగు నరు ; విష్ణుకీర్తనములు వినని ; వెడవెడ నడకలు నడచుచు ; వెన్నఁ దినఁగఁ బొడగని ; వెలయఁగ బద్మం ; వేలుపులఁటె; నా కంటెను ; వ్రతముల్ దేవ గురు ద్విజన్మ ; వ్రాలఁగ వచ్చిన నీ సతి ; శంకర! భక్తమానసవశంకర! ; శంభుకంట నొకటి జలరాశి నొకటి ; శరధిమదవిరామా! సర్వలోకాభిరామా ; శామంతికా స్రగంచిత ; శారదనీరదేందు, ; శుకుఁడు గోచియు లేక ; శ్రవణోదంచితకర్ణికారమునతో ; శ్రీకంఠచాప ఖండన! ; శ్రీకర కరుణా సాగర! ;

up-arrow (1) 1-371-క.

వియ, ధనంజయ, హనుమ
ద్ధ్వ, ఫల్గున, పార్థ, పాండునయ, నర, మహేం
ద్ర, మిత్రార్జున, యంచును
భుములు తలకడవ రాకపోకలఁ జీరున్.
భావము:- అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతు విజయ, ధనంజయ, హనుమద్ధ్వజ, ఫల్గున, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్రార్జున అంటు రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు కదా!

up-arrow (2) 6-149-క.

విడిచితి భవబంధంబుల
డఁచితి మాయావిమోహ మైన తమంబు
న్నొడిచితి నరివర్గంబులఁ
చితి నా జన్మ దుఃఖ ర్మార్ణవమున్.
భావము:- భవబంధాలను విడిచివేశాను. మాయతో కూడిన అజ్ఞానాంధకారాన్ని అణచివేశాను. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరుగురు శత్రువులను జయించాను. జనన మరణాలనే సముద్రాన్ని తరించాను.

up-arrow (3) 8-199-క.

విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
డుభరమున మొదలఁ గుదురు లుగమి గెడఁవై
బుబుడ రవమున నఖిలము
వడ వడఁకఁగ మహాద్రి నధి మునింగెన్.
భావము:- అమృతమథన సమయంలో వాసుకి “వదలండి వదలండి" అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ" మని మునిగింది. దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ" మని వణికింది.

up-arrow (4) 8-88-క.

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.
భావము:- ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయిన వాడు. లోకంలో బాగా తెలుసుకోదగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.

up-arrow (5) 2-100-క.

విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు,
విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ
విశ్వములోఁ దా నుండును
విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్.
భావము:- (పుత్రుడు నారదునికి విష్ణుతత్వాన్ని బ్రహ్మదేవుడు ప్రబోధిస్తున్నాడు) విశ్వమే తానైన వాడు; విశ్వమునకు ప్రభువు; విశ్వ మంతయు నిండి ఉండు వాడు; సర్వమునకు నడిపించు వాడు; విశ్వమును వ్యాపించి యుండువాడు; పుట్టుక లేని వాడు అయిన ఆ విష్ణువు ఈ జగత్తు లోపల ఉండును; జగత్తు సమస్తము ఆ విష్ణుని లోపలనే మిక్కిలి ప్రకాశిస్తూ ఉండును.

up-arrow (6) 10.1-655-క.

"వికుచయుగ యగు రక్కసి
వికుచదుగ్ధంబుఁ ద్రావి విషవిజయుఁడ వై
విరుహలోచన! యద్భుత
వియుండగు నీకు సర్పవిష మెక్కెఁ గదా!
భావము:- "ఓ కన్నయ్యా! విషపూరితమైన, దుష్టమైన స్తనాలతో వచ్చిన ఆ రాక్షసి పూతన విషపు స్తన్యం తాగి ఆ విషాన్ని జయించిన వాడవు నువ్వు; విషము (నీటి) యందు పుట్టు పద్మాలలాంటి కన్నులు కలవాడవు, అద్భుతమైన మూర్తిమంతుడవు. కమలాక్షా! అట్టి నీకు పాము విషం ఎక్కిందా? ఇదేంటయ్యా ఇంతకన్నా ఆశ్చర్యం ఏముంటుంది?
విషమము అంటే దుష్టము అని అర్థం (సూర్యారాయాంధ్ర) కూడా ఉన్నది. అలా పూతన, కాళీయుల దుష్టత్వాన్ని స్ఫురింపజేస్తూ, యమకానుప్రాసతో అలంకారిస్తూ, “ష"కార దుర్గమప్రాసతో చెప్పిన పోతన పాటించిన సందర్భ శుద్ధి బహు రమ్యంగా ఉంది. 10.1-656-క.

up-arrow (7) 10.1-233-క.

విధరరిపు గమనునికిని
విగళ సఖునికిని విమల విష శయనునికిన్
విభవభవ జనకునికిని
వికుచచను విషముఁ గొనుట విషమే తలపఁన్?
భావము:- విషము కోరలలో ధరించే నాగులను చీల్చెడి గరుత్మంతుడు వాహనంగా కలవాడు, కంఠమున విషము ధరించెడి శంకరుని మిత్రుడు, ప్రళయకాలమున విషము (జలము)పై శయనించు నిర్మలమైన వాడు, విషము (నీటి) యందు పుట్టెడి పద్మము నందు జనించిన వాడైన బ్రహ్మదేవునికి తండ్రియైన వాడు అయినట్టి సాక్షాత్తు మహావిష్ణువు యైన ఈ బాలుడికి విషము చిమ్మే చన్నులతో తిరిగే ఒక రాకాసి విషం లాగివేయటం విషమ (పెద్ద కష్ట)మైన పనా, కానేకాదు.

up-arrow (8) 10.1-13-క.

"విష్ణు కథా రతుఁ డగు నరు
విష్ణుకథల్ చెప్పు నరుని వినుచుండు నరున్
విష్ణుకథా సంప్రశ్నము
విష్ణుపదీ జలము భంగి విమలులఁ జేయున్.
భావము:- “విష్ణుకధా ప్రసంగం కూడా విష్ణుకథల యందు ఆసక్తి గలవారినీ, విష్ణుమూర్తి కథలు చెప్పేవారినీ; విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగాజలం వలెనే పునీతులను చేస్తుంది.

up-arrow (9) 2-50-సీ.

విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు;
కొండల బిలములు కువలయేశ!
క్రిపద్యంబులఁ దువని జిహ్వలు;
ప్పల జిహ్వలు కౌరవేంద్ర!
శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు;
కేకిపింఛాక్షులు కీర్తిదయిత!
మలాక్షు పూజకుఁ గాని హస్తంబులు;
వము హస్తంబులు త్యవచన!
2-50.1-ఆ.
రిపద తులసీ దళామోద రతి లేని
ముక్కు పందిముక్కు మునిచరిత్ర!
రుడగమను భజనతి లేని పదములు
పాదపముల పాదటల మనఘ!
భావము:- భాగవతం అంటే భగవంతుడు, భగవద్భక్తి, భక్తుడు కదా. అట్టి భాగవత విశిష్టత పరమ భాగవతుడు, భాగవత ప్రయుక్త, బ్రహ్మర్షి, అవధూతోత్తముడు, వ్యాసపుత్రుడు అయిన శుకుడు పరమ పావనుడు, నిర్మల భక్తుడు, పాండవ పౌత్రుడు అయిన పరీక్షిన్మహారాజుకి వివరిస్తున్నాడు – భూమండలేశ! కురువంశోత్తమ! యశోనాథ! సత్యం పలికేవాడ! రాజర్షి! పాపరహితుడా! విష్ణుమూర్తి నామ కీర్తనలు వినని చెవులు కొండ గుహలు. చక్రధారుడిమీద స్తోత్రాలు చదవని నాలుకలు కప్పల నాలుకలు. లక్ష్మీపతి మీద దృష్టిలేని కళ్ళు నెమలిపింఛాల మీది కళ్ళు. నారాయణుని చరణాలపై పూజింపబడే తులసీ దళాల సువాసన ఆఘ్రాణించని నాసిక పంది ముక్కు. పక్షివాహనుని స్తుతిస్తు అడుగులు వేయని కాళ్ళు అచరము లైన చెట్ల వేళ్ళు.

up-arrow (10) 8-541-క.

వెవెడ నడకలు నడచుచు
నెనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
భావము:- వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు.
(బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీపడుతోందా అన్నట్టు ఉంది.)

up-arrow (11) 10.1-314-క.

వెన్నఁ దినఁగఁ బొడగని మా
పిన్నది యడ్డంబు వచ్చి పిఱిఁదికిఁ దివియన్
న్నొడిసి పట్టి చీఱెనుఁ
జిన్ని కుమారుండె యితఁడు? శీతాంశుముఖీ!
భావము:- చంద్రముఖీ! యశోదమ్మా! మా ఇంట్లోకి చొరబడి నీ కొడుకు వెన్న తింటున్నాడు. అది చూసి మా చిన్నమ్మాయి అడ్డంవెళ్ళి ఇవతలకి లాగింది. మీ వాడు మా పడచుపిల్ల రొమ్ముమీద గోళ్ళతో గీరేసి పారిపోయాడు. చంద్రుళ్ళా వెలిగిపోతున్న ముఖం పెట్టుకొని మరీ చూస్తున్నావు గాని చెప్పవమ్మా! ఇవి పసిపిల్లలు చేసే పనులా.

up-arrow (12) 3-735-క.

"వెయఁగ బద్మం బేక
స్థముననే యొప్పుఁ గాని త్వత్పదపద్మం
బి బహుగతుల ననేక
స్థముల దనరారుఁ గాదె రుణాబ్జముఖీ!"
భావము:- క్రొత్తగా వికసించిన తామరపువ్వు వంటి ముఖం కలదానా! పద్మం ఒకే స్థలంలో ఉంటుంది, కాని నీ పాదాలనే పద్మాలు అనేక స్థలాలలో అనేక ప్రకారాలుగా ప్రకాశిస్తున్నాయి కదా!"

up-arrow (13) 10.1-313-క.

"వేలుపులఁటె; నా కంటెను
వేలుపు మఱి యెవ్వ" రనుచు వికవిక నగి మా
వేలుపుల గోడపై నో
హేలావతి! నీ తనూజుఁ డెంగిలిఁ జేసెన్.
భావము:- ఓ యమ్మ! యశోదమ్మ! గొప్పగా నవ్వేవు గాని దీనికేమంటావు. మా యింట్లో దేవతలను చిత్రించిన గోడను చూసి, “వీళ్ళా దేవతలు? నాకంటె వేరె దేవతలు ఎవరున్నారు?" అంటు పకపక నవ్వుతూ నీ కొడుకు గోడమీద ఎంగిలి చేసాడు.

up-arrow (14) 10.1-1707-మ.

వ్రముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దానధర్మాదులున్
జన్మంబుల నీశ్వరున్ హరి జగత్కళ్యాణుఁ గాంక్షించి చే
సితి నేనిన్ వసుదేవ నందనుఁడు నా చిత్తేశుఁ డౌఁ గాక ని
ర్జితు లై పోదురుగాక సంగరములోఁ జేదీశ ముఖ్యాధముల్.
భావము:- రుక్మిణీదేవి అను నేను కనక గత జన్మలలో భగవంతుడు లోకకల్యాణుడు ఐన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లైతే; దేవతల, గురువుల, విప్రోత్తముల సేవ చేసి ఉన్నట్లైతే; దాన ధర్మాలు మొదలైనవి చేసి ఉన్నట్లైతే; వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త ఔగాక! యుద్ధంలో శశిపాలాది అధములు ఓడిపోవుదురు గాక!

up-arrow (15) 10.1-320-క.

వ్రాలఁగ వచ్చిన నీ సతి
"చూలాలం దలఁగు" మనుడు "జూ లగుటకు నే
మూలంబు జెప్పు" మనె నీ
బాలుఁడు; జెప్పుదురె సతులు? ర్వేందుముఖీ!
భావము:- ఓ యశోదమ్మా! నీ కొడుకు ఈ ఇల్లాలు ఒళ్ళో కూర్చోడానికి వచ్చేడు. ఈమె “గర్భవతిని దూరంగా ఉండు అంది". “ గర్భవతివి కావటానికి కారణం ఏమిటి చెప్పు" అని అడుగుతున్నాడు నీ కొడుకు. సుందరి! ఈ తెలివితేటలకు నిండుపున్నమి నాటి చందమామలా నీ మోము వికసించిందిలే. కాని, అలా అడిగితే ఆడవాళ్ళు ఎవరైనా చెప్తారుటమ్మా.

up-arrow (16) 10.2-315-ఉ.

"శంర! భక్తమానసవశంకర! దుష్టమదాసురేంద్ర నా
శంర! పాండునీలరుచిశంకరవర్ణ నిజాంగ! భోగి రా
ట్కంణ! పార్వతీహృదయకైరవ కైరవమిత్ర! యోగిహృ
త్పంజ పంకజాప్త! నిజతాండవఖేలన! భక్తపాలనా! "
భావము:- “శంకరా! భక్తవశంకరా! దుష్ట మదోన్మత్త రాక్షసులను నశింపచేయువాడా! ధవళాంగా! నీలకంఠా! సర్పభూషణా! పార్వతీ ప్రాణవల్లభా! యోగిజనుల హృదయ పంకజాలకు సూర్యునివంటివాడా! తాండవ కేళీ ప్రియా! భక్తపరిపాలకా!"

up-arrow (17) 10.1-805-ఆ.

శంభుకంట నొకటి లరాశి నొక్కటి
ఱియు నొకటి మనుజ మందిరముల
నొదిగెఁగాక మెఱసియున్న మూడగ్నులు
లికి నులికి భక్తి లుపకున్నె?
భావము:- చలిదెబ్బకు తట్టకోలేక త్రేతాగ్నులు మూడు అగ్నులలోను ఆహవనీయం అనే అగ్ని ఒకటి శివుని మూడోవ నేత్రంలో అణగి ఉంది. దక్షిణాగ్ని అనే మరొకటి సాగర గర్భంలో చొచ్చింది. గార్హపత్యం అనే అగ్ని ఇంకొకటి గృహస్థుల ఇండ్లలో ఒదిగి ఉంది. అలాకాక బట్టబయల ఉంటే హేమంతఋతు చలికి త్రేతాగ్నులు కొంకర్లు తిరిగి పోయేవి.

up-arrow (18) 10.2-1342-మా.

ధిమదవిరామా! ర్వలోకాభిరామా!
సురిపువిషభీమా! సుందరీలోకకామా!
ణివరలలామా! తాపసస్తోత్రసీమా!
సురుచిరగుణధామా! సూర్యవంశాబ్ధిసోమా!
భావము:- శ్రీరామచంద్ర! సముద్రుని గర్వాన్ని అణచినవాడ! సర్వలోకాలకూ సుందరుడా! రాక్షసులకు పరమ భయంకరుడా! సుందరీ జనులకు మన్మథుడా! రాజ శ్రేష్ఠుడా! మునీంద్రులచేత స్తుతింపబడేవాడా! సుగుణాలకు అలవాలమైన వాడా! సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడా! శ్రీరామచంద్ర!

up-arrow (19) 10.1-799-క.

శామంతికా స్రగంచిత
సీమంతవతీ కుచోష్ణజితశీతభయ
శ్రీమంతంబై గొబ్బున
హేమంతము దోఁచె; మదనుఁ డేఁచె విరహులన్.
భావము:- ఇంతలో శ్రీమంతమైన హేమంతం ప్రవేశించేసింది. చేమంతి పూలు ధరించిన పూబంతుల చనుబంతల వేడిమిచే చలి భయాన్ని జంటలు జయించారు. కాని, వియోగులను మన్మథుడు వేధించాడు.

up-arrow (20) 1-8-ఉ.

శాదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కాత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
భావము:- భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

up-arrow (21) 1-77-త.

శుకుఁడు గోచియు లేక పైఁ జనఁ జూచి తోయములందు ల
జ్జకుఁ జలింపక చీర లొల్లక ల్లులాడెడి దేవక
న్యలు హా! శుక! యంచు వెన్క జనంగ వ్యాసునిఁ జూచి యం
శుములన్ ధరియించి సిగ్గున స్రుక్కి రందఱు ధీనిధీ!
భావము:- ఓ విజ్ఞానఖనీ! సూతమహర్షీ! ఒకమారు వ్యాసుని పుత్రు డయిన శుకమహాముని కనీసం గోచీకూడా లేకుండ దిగంబరంగా వెళ్తున్నాడు. ఆ పక్క దేవకన్యలు ఒక సరస్సులో బట్టలులేకుండా స్నానాలు చేస్తున్నారు. వారు శుకుని చూసి కూడ చీరలు ధరించలేదు. ఏమాత్రం సిగ్గుకి చలించకుండా ఉల్లాసంగా జలకాలాడుతూనే ఉన్నారు. శుకుడి వెనకాతలే, వయోవృద్ధుడు, పరమజ్ఞాన స్వరూపుడు అయిన వ్యాసమహర్షి, కుమారుణ్ణి పిలుస్తూ అటుగా వచ్చాడు. ఆయనను చూసి ఆ దేవకాంతలు అందరు ఎంతో సిగ్గుతో గబగబ చీరలు కట్టేసుకున్నారు.

up-arrow (22) 10.1-772-మ.

"శ్రణోదంచితకర్ణికారమునతో స్వర్ణాభ చేలంబుతో
తంసాయిత కేకిపింఛమునతో నంభోజ దామంబుతో
స్వశుండై మధురాధరామృతముచే వంశంబుఁ బూరించుచు
న్నువిదా! మాధవుఁ డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే?
భావము:- "సఖీ! మన కృష్ణుడు చూసావా? చెవిలో కొండగోగి పువ్వు అలంకరించుకొన్నాడు. పసిడి వన్నె పట్టు వస్త్రం కట్టుకున్నాడు. శిరోజాలందు నెమలిపింఛం ధరించాడు. మెడలో పద్మాల దండ వేసుకున్నాడు. పరవశత్వంతో వేణువు నందు తియ్యని అధరామృతం పూరించుతు, అడవిలో ఆలమందలను మేపుతు ఎంత చక్కగా ఉన్నాడో చూడవే చూడు!

up-arrow (23) 10.1-1-క.

శ్రీకంఠచాప ఖండన!
పాకారిప్రముఖ వినుత భండన! విలస
త్కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
భావము:- శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.

up-arrow (24) 5.1-1-క.

శ్రీర కరుణా సాగర!
ప్రాటలక్ష్మీ కళత్ర! వ్య చరిత్రా!
లోకాతీతగుణాశ్రయ!
గోకులవిస్తార! నందగోపకుమారా!
భావము:- సంపదలను కలిగించే శ్రీకృష్ణా! దయాసముద్రా! లక్ష్మీదేవికి భర్తవు అనే ప్రసిద్ధి కలవాడా! దివ్యమైన నడవడి కలవాడా! లోకాలకు అతీతమైన గుణాలకు ఆశ్రయమైనవాడా! గోసమూహాన్ని విస్తరింపజేసినవాడా! నందుడనే గోపకుని కుమారా!