పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు

  •  
  •  
  •  

8-88-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్."

టీకా:

విశ్వకరున్ = జగత్తుని సృష్టించెడివానిని {విశ్వకర్మా అని విష్ణుసహస్రనామాలులో 50వ నామం, విశ్వరచన చేయగల్గినవాడు, జగత్తు సర్వము ఎవని క్రియయైనవాడు, విష్ణువు}; విశ్వదూరునిన్ = జగత్తుకి అతీతముగ నుండువానిని; విశ్వాత్మునిన్ = జగత్తు తన స్వరూపమన వానిని {విశ్వాత్మా - విష్ణుసహస్రనామంలో 225వ నామం, విశ్వమునకు ఆత్మ యైనవాడు}; విశ్వవేద్యున్ = లోక మంతటికి తెలుసుకొనదగ్గ వానిని; విశ్వున్ = లోకమే తానైన వానిని {విశ్వః - విష్ణుసహస్రనామాలులో 1వ నామం, దృశ్యమాన జగత్తంతయు తానైనవాడు}; అవిశ్వున్ = లోకముకంటె భిన్నమైనవాని {అవిశ్వ - దృశ్యమాన జగత్తంతకు విలక్షుణుడగు విష్ణువు అవిజ్ఞాత}; శాశ్వతున్ = శాశ్వతముగ నుండు వానిని {శాశ్వతః - విష్ణుసహస్రనామాలులో 56వ నామం, సర్వకాలము లందున్న వాడు}; అజున్ = పుట్టుక లేనివానిని {అజః - విష్ణుసహస్రనామాలులో 95వ నామం, 204వ నామం, 521వ నామం, ఏకాలమందును జన్మ లేనివాడు}; బ్రహ్మ = బ్రహ్మదేవునికి; ప్రభున్ = ప్రభువైన వానిని {ప్రభుః - విష్ణుసహస్రనామాలులో 35వ నామం, 299వ నామం, సర్వశక్తి సమన్వితుడు, సర్వక్రియల యందును సామర్థ్యాతిశయము కలవాడు}; ఈశ్వరునిన్ = లోకము నడిపించువానిని {ఈశ్వరః - విష్ణుసహస్రనామాలులో 36వ నామం, 74వ నామం, ఎవరి సహాయము లేకనే సమస్త కార్యములు నెరవేర్చగలవాడు, నిరుపాధికమైన ఐశ్వర్యము కలవాడు}; పరమ = సర్వశ్రేష్ఠమైన; పురుషున్ = పురుషుని; నేన్ = నేను; భజియింతున్ = స్తుతించెదను.

భావము:

సుళువైన పదాల ఈ ప్రార్థన మరో అమృత గుళిక.
ప్రభువు లోకాన్ని సృష్టించేవాడు. లోకులు అందుకోలేని వాడు. లోకానికి అంతరాత్మ అయినవాడు.లోకంలో బాగా తెలుసుకో దగిన వాడు లోకమే తానైన వాడు. లోకాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు. పుట్టుక లేనివాడు. బ్రహ్మదేవునికి అధి నాయకుడు. లోకాన్ని నడిపించేవాడు. పరమాత్మ. అట్టి ఆది పురుషుని నేను ఆరాధిస్తాను.