అమృతగుళికలు : మణులు
భాగవత పద్యమణులు
పద్య సూచిక;-
భ్రమరా! దుర్జనమిత్ర! ;
మందునకు మందబుద్ధికి ;
మకర మొకటి రవిఁ జొచ్చెను ;
మగువా! నీ కొమరుఁడు ;
మన సారథి, మన సచివుడు, ;
మమ్ముఁబెండ్లి చేయు ;
మరలుపు మనియెడు కర్తయు ;
మా కందర్పుని శరములు ;
మాటిమాటికి వ్రేలు మడిఁచి ;
మానినీమన్మథు మాధవుఁ గానరే ;
మామా వలువలు ముట్టకు ;
మా వారి భస్మరాసుల ;
మీ పాపఁడు మా గృహముల ;
మున్నుగ్రాటవిలో ;
మృగనాభి యలఁదదు ;
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి ;
మేరువు దల క్రిం దైనను ;
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు ;
యతు లీశ్వరుని మహత్త్వము ;
హరిఁ జూడన్ నరుఁ డేగినాడు ;
రక్షకులు లేనివారల ;
రవిబింబం బుపమింపఁ ;
రాజఁట ధర్మజుండు, ;
రాజీవపత్రలోచన! ;
(1)
10.1-1458-మ.
"భ్రమరా! దుర్జనమిత్ర! ముట్టకుము మా పాదాబ్జముల్ నాగర
ప్రమదాళీకుచకుంకుమాంకిత లసత్ప్రాణేశదామప్రసూ
న మరందారుణితాననుండ వగుటన్ నాథుండు మన్నించుఁగా
క మమున్నేఁపుచుఁ బౌరకాంతల శుభాగారంబులన్ నిత్యమున్.
భావము:-
ధూర్తుల మిత్రుడ వైన ఓ మధుపమా! మా పాదపద్మాలు తాకకు; మా ప్రాణవల్లభుని పూమాలల యందలి మకరందం గ్రోలి, అక్కడ అంటిన మథురానగరపు కాంతల స్తనకుంకుమలుతో ఎఱ్ఱబారిన నీ మోము (అందాన్ని) చూసి అతడు మన్నిస్తాడేమో గాని; మమ్మల్ని విరహాలతో వేపుకుతింటు, అక్కడ నగర కాంతల శోభనగృహాలలో కులుకుతుండే నిన్ను మేము మాత్రం మన్నించము.
(2)
1-395-క.
మందునకు మందబుద్ధికి
మందాయువునకు నిరర్థమార్గునకును గో
విందచరణారవింద మ
రందము గొనఁ దెఱపి లేదు రాత్రిందివముల్."
భావము:-
(పారీక్షిత్త భాగవతం వివరించమని శౌనకాదులు సూతుని అడుగుతు కలియుగపు మానవుల గురించి పలికిన పలుకులు. కలి ప్రభావం వల్ల మానవులు మందబుద్ధులు అల్పతరాయువులు అవుతారని తెలిసే వ్యాసభగవానుడు భాగవత రచనకి ఉపక్రమించాడు కదా.) మందబుద్ధులు, సోమరిపోతులు, అల్పాయుష్కులు నైన మూర్ఖులు మాత్రమే పనికిమాలిన మార్గాలలో పడి కొట్టుకొంటూ ఉంటారు. అటువంటి వారికి హరిచరణ కమల సుధాధారలను చవిచూడటానికి రాత్రింబవళ్లు ఖాళీ సమయమే దొరకదు."
(3)
8-114-క.
మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
భావము:-
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
(మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్ని బెదిరిపోడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం యిది. (1) ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1మేషము 2వృషభము 3మిథునము 4కర్కాటకము 5సింహము 6కన్య 7తుల 8వృశ్చికము 9ధనుస్సు 10మకరము 11కుంభము 12మీనము అనబడే) ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం, (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1మహాపద్మము 2పద్మము 3శంఖము 4మకరము 5కచ్ఛపము 6ముకుందము 7కుందము 8నీలము 9వరము అనబడే) నవనిధులు ఉన్నాయి కదా వాటిలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.)
(4)
10.1-321-క.
మగువా! నీ కొమరుఁడు మా
మగవా రటు పోవఁ జూచి మంతనమునకుం
దగఁ జీరి పొందు నడిగెను
జగముల మున్నిట్టి శిశువు చదువంబడెనే?
భావము:-
ఓ ఇల్లాలా! మా మగవాళ్ళు బైటకు వెళ్ళటం చూసి రహస్యం చెప్పాలి దగ్గరకి రా అని పిలిచి, నీ కొడుకు క్రీడిద్దాం వస్తావా అని అడిగాడు. ఇలా అడిగే పసిపిల్లాడు ఉన్నా డని ఇంతకు ముందెప్పుడైనా విన్నామా?
గోపికలు యశోదకి చెప్పిన బాలకృష్ణుని అల్లరి ఇది. ఇక్కడ పాలపర్తి నాగేశ్వర శాస్త్రి గారు చెప్పిన విశేషార్థం చూడండి. అసంభవ నాదుల చేత బ్రహ్మైక్యం భంగపరచే దుర్వృత్తులు లే నప్పుడు, రహస్యమున నా యం దైక్యము గమ్మని పిలిచేడు. (ఉపనిషత్ ప్రమాణం – చిదేవాహం చిదేవత్వం సర్వ మే త చ్చిదేవహి.)
(5)
1-359-క.
"మన సారథి, మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుఁడున్,
మన విభుడు, గురుడు, దేవర,
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!
భావము:-
"ఏం చెప్పమంటారు మహారాజా! మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండి మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడునీడలా ఉండే స్నేహితుడు, మేలుకోరే మేన బావ, వెన్నుదన్నుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడు ఐన కృష్ణుడు మనలని వదలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా"
(6)
10.1-689-ఆ.
మమ్ముఁబెండ్లి చేయు మా ప్రాణవల్లభు
ప్రాణమిచ్చి కావు భక్తవరద!
నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు
పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు.
భావము:-
భక్తులకు వరాలిచ్చే మహానుభావ! శ్రీకృష్ణ! మా ప్రాణప్రియుడైన కాళీయుడి ప్రాణాలు ప్రసాదించి, అతనితో మాకు కల్యాణం చేయించు. చిన్నప్పుడు జరిగిన మా పెళ్ళి కల్యాణం కాదు. ఇప్పుడు నీవు మాకు చేసేదే కల్యాణం శాశ్వతంగా ఉండేదీ, క్షేమకరమైనదీ.
(7)
10.1-513-క.
మరలుపు మనియెడు కర్తయు
మరలించు కుమారకులును మరలెడి క్రేపుల్
పరికింపఁ దాన యై హరి
మరలం జనె లీలతోడ మందకు నధిపా!
భావము:-
విచిత్రంగా మందలోని పశువులను తమ ఇంటి వైపు తోలమని చెప్పేవాడు తానే, అలా తోలుతున్న గొల్లపిల్లలు తానే, అలా తోలబడి తమ ఇళ్ళకు వెళ్తున్న పశువులు తానే అయ్యి ఆ శ్రీహరి గొప్పవినోదంగా రేపల్లెకు వెళ్ళాడు.
సూత్రధారి పాత్రధారి అభేదమా జీవాత్మ పరమాత్మల అభేదమా, ఆహా! ఏమి లీల!
(8)
9-604-క.
మా కందర్పుని శరములు
మాకందము లగుటఁ జేసి మా కందంబుల్
మాకందము లను కైవడి
మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్.
భావము:-
మా మన్మథునిబాణాలు మామిడిపూలు అగుటచేత మామిడిచెట్లు మాకు తగి ఉన్నాయి అంటున్నట్లుగా కోయిలలు కూస్తున్నాయి.
(9)
10.1-496-సీ.
మాటిమాటికి వ్రేలు మడిఁచి యూరించుచు;
నూరుఁగాయలు దినుచుండు నొక్క;
డొకని కంచములోని దొడిసి చయ్యన మ్రింగి;
"చూడు లే" దని నోరు చూపునొక్కఁ;
డేగు రార్గురి చల్దు లెలమిఁ బన్నిదమాడి;
కూర్కొని కూర్కొని కుడుచు నొక్కఁ;
డిన్నియుండఁగఁ బంచి యిడుట నెచ్చలితన;
మనుచు బంతెనగుండు లాడు నొకఁడు;
10.1-496.1-ఆ.
"కృష్ణుఁ జూడు" మనుచుఁ గికురించి పరు మ్రోల
మేలి భక్ష్యరాశి మెసఁగు నొకఁడు;
నవ్వు నొకఁడు; సఖుల నవ్వించు నొక్కఁడు;
ముచ్చటాడు నొకఁడు; మురియు నొకఁడు.
భావము:-
ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. – ఒక గొల్ల పిల్లాడు వ్రేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకొని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచంలోది చటుక్కున లాక్కొని మింగేసి, వాడు అడిగేసరికి ‘ఏదీ ఏంలేదు చూడు’ అంటు తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ, ఐదారుమంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేసాడు. మరో పిల్లాడు ‘ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహ మంటే పంచుకోడంరా’ అంటు బంతెనగుండు లనే ఆట ఆడుతు తింటున్నాడు. ఇంకో కుఱ్ఱాడు ‘ఒరే కృష్ణుణ్ణి చూడు’ అని దృష్టి మళ్ళించి, మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేసాడు. మరింకో కుఱ్ఱాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరిని నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడుతున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతున్నాడు.
(10)
10.1-1014-సీ.
మానినీమన్మథు మాధవుఁ గానరే;
సలలితోదార వత్సకములార!
సలలితోదార వత్సక వైరిఁ గానరే;
సుందరోన్నత లతార్జునములార!
సుందరోన్నతలతార్జునభంజుఁ గానరే;
ఘనతర లసదశోకంబులార!
ఘనతర లసదశోకస్ఫూర్తిఁ గానరే;
నవ్య రుచిరకాంచనంబులార!
10.1-1014.1-ఆ.
నవ్య రుచిర కాంచన కిరీటుఁ గానరే
గహనపదవిఁ గురవకంబులార!
గహనపదవి గురవక నివాసిఁ గానరే
గణికలార! చారుగణికలార!
భావము:-
మనోహరములు, ఉన్నతములు యైన కొడిసె చెట్లులార! మానవంతులైన మహిళల మనసులను మథించే మన్మథుడైన లక్ష్మీపతిని చూసారా? చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములార! మనోజ్ఞమైన రూపువాడు, ఉదారుడు, వత్సాసురుని వధించిన వాడు అయిన అచ్యుతుని కన్నారా? మిక్కిలి యెత్తైన చక్కటి అశోకతరువులార! చిక్కనైన లతలు అల్లుకున్న చక్కటి పొడవైన మద్ధివృక్షములను పడగొట్టిన పద్మాక్షుని పరికించారా? తాజాగా నున్న చక్కదనాల సంపెంగలలారా! దుఃఖరహితుడై వెలయుచున్న తోయజాక్షుని పరికించారా? ఎర్రగోరింటలార! ఈ వనమధ్యలో సరికొత్త బంగారు కిరీటము గల శౌరిని కాని కనుగొన్నారా? ఓ అందమైన అడవిమల్లెలలార! బృందావన మందలి ఎర్రగోరింట పొదలలో సంచరించే హరిని అవలోకించారా?
(11)
10.1-821-క.
"మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకుపోకు మన్నింపు తగన్
మా మాన మేల కొనియెదు?
మా మానసహరణ మేల? మానుము కృష్ణా!
భావము:-
నాయనా! కృష్ణా! మా బట్టలు తాకొద్దు. వాటిని తీయకు. మా మాట విను. మా సిగ్గు తీయకు. మా మనస్సులు దొంగిలించకు. ఈ ప్రయత్నం వదిలిపెట్టు.
గోపికా వస్త్రాపహరణ బాగా ప్రసిద్దమైన ఘట్టం. కృష్ణుడు గోపికల వస్త్రములు పట్టుకొని నల్లవిరుగు చెట్టు (నీపము) ఎక్కాడు. నీళ్ళల్లో ఉన్న గోపికలు పెట్టు కున్న ఈ మొర బహు చక్కటిది. అక్షరం "మా” 7 సార్లు (మకారం 11 సార్లు) వృత్యనుప్రాసంగా ప్రయోగించ బడింది. మా మా – మా అందరివి, మామా – సంభోదన, మా మాన – మా యొక్క మానం, మా మానస – మా యొక్క మనస్సులు అని మామా 4 సార్లు వాడిన యమకాలంకారం పద్యానికి సొగసులు అద్దింది. గోపికలు అంటే ఆత్మలు, కృష్ణ అంటే బ్రహతత్వం, వలువలు అంటే అవిద్యా ఆవరణలు, మా అంటే అహంకారం అనుకుంటే వచ్చే శ్లేష విశిష్ఠ మైన అలంకారంగా భాసిస్తుంది. పాలపర్తి నాగేశ్వర శాస్త్రులు గారు "ప్రజ్ఞ అనె తల్లి తో బుట్టినది బ్రహ్మతత్వం గనుక జీవునికి మామ అయింది” అన్నారు.
(12)
9-221-క.
మా వారి భస్మరాసుల
నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్
నీ వారిఁ గలయ నాకము
మావారికిఁ గలుగు నిది ప్రమాణము తల్లీ!
భావము:-
“అమ్మా! మా వారి బూడిద గుట్టలను నీ నీటిలో కలిపేసుకో. మా వారికి నీ నీటిలో కలయుట వలన తప్పక ఉన్నత గతి లభిస్తుంది.
(13)
10.1-309-క.
మీ పాపఁడు మా గృహముల
నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్
గోపింపఁ బిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!
భావము:-
ఓ యమ్మా! మీ అబ్బాయికి మా యింట్లో తాగటానికి సరిపడగ పాలు కనబడలేదు. దానితో కోపించి పసిపిల్లలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. పసిపిల్లలేమో గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఓ బిడ్డకు తల్లివే కదా ఇదేమైనా బాగుందా చెప్పు.
(14)
1-353-శా.
మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో
సన్నాహంబునఁ గాలకేయుల ననిం జక్కాడుచోఁ బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం దోలుచోఁ
గన్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా కల్యాణమే చక్రికిన్?
భావము:-
“ఇందేమి టయ్యా? కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. పూర్వం భయంకర మైన ఆ అడవిలో పంది కోసం మూడు కళ్ళున్న ఆ పరమేశ్వరునితో పోరే టప్పుడు కాని, సర్వసన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కదనరంగంలో చీల్చి చెండాడే టప్పుడు కాని, పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధనుని విడిపించే పనిలో గంధర్వులను తరిమే టప్పుడు కాని ఇంతకు ముందు ఎప్పుడు కంట నీరు పెట్టి ఎరుగవు కదా. ఇప్పుడే మయిం దయ్యా? కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా? చెప్పు
(15)
10.1-1732-సీ.
మృగనాభి యలఁదదు మృగరాజమధ్యమ;
జలకము లాడదు జలజగంధి;
ముకురంబుఁ జూడదు ముకురసన్నిభముఖి;
పువ్వులు దుఱుమదు పువ్వుఁబోఁడి;
వనకేళిఁ గోరదు వనజాతలోచన;
హంసంబుఁ బెంపదు హంసగమన;
లతలఁ బోషింపదు లతికా లలిత దేహ;
తొడవులు తొడువదు తొడవు తొడవు
10.1-1732.1-ఆ.
తిలకమిడదు నుదుటఁ దిలకినీతిలకంబు
గమలగృహముఁ జొరదు కమలహస్త
గారవించి తన్నుఁ గరుణఁ గైకొన వన
మాలి రాఁడు తగవుమాలి యనుచు.
భావము:-
అన్యాయంగా కృష్ణుడు తనను ప్రేమతో కరుణించ డానికి రావటం లేదు అన్న తలపుల పరధ్యాన్నంలో పడి, ఆ సింహపు నడుము చిన్నది కస్తూరి రాసుకోడం లేదట. పద్మగంధం లాంటి మేని సువాసనలు గల పద్మగంధి జలకా లాడటం లేదట. అద్దం లాంటి మోముగల సుందరి అద్దం చూట్టం లేదట. పువ్వులాంటి సుకుమారి పువ్వులే ముడవటం లేదట. పద్మాల్లాంటి కళ్ళున్న పద్మాక్షి జలక్రీడకి వెళ్ళటం లేదట. హంస నడకల చిన్నది హంసలను చూట్టం లేదట. లత లాంటి మనోఙ్ఞమైన కోమలి లతలని చూట్టం లేదుట. అలంకారాలకే అలంకారమైన అందగత్తె అలంకారాలు చేసుకోవటం లేదుట. చక్కటిచుక్క లాంటి వనితాశిరోమణి బొట్టు పెట్టుకోటం లేదట. కమలాల లాంటి చేతులున్న సుందరి సరోవరాలలోకి దిగటం లేదట.
(16)
1-286-సీ.
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగుకైవడి మేని;
పై నున్న పచ్చని పటమువాఁడు;
గండభాగంబులఁ గాంచన మణి మయ;
మకరకుండలకాంతి మలయువాఁడు;
శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి;
కన్నుల నునుఁ గెంపు కలుగువాఁడు;
బాలార్కమండల ప్రతిమాన రత్న హా;
టక విరాజిత కిరీటంబువాఁడు;
1-286.1-తే.
కంకణాంగద వనమాలికా విరాజ
మానుఁ డసమానుఁ డంగుష్టమాత్రదేహుఁ
డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ
విష్ణుఁ డావిర్భవించె నవ్వేళ యందు.
భావము:-
అభిమన్యుని భార్య ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్ర తాపానికి కనలుతున్నాడు. శ్రీకృష్ణుడు ఉత్తర ప్రార్థన మన్నించి అంగుష్ఠ మాతృడై గదాధారియై ఇలా ఆవిర్భవించి గర్భస్త బాలకుడిని కాపాడేడు. మేఘంమీద మెరుపుతీగలా, నల్లని దేహం మీద పచ్చని చేలం ధరించినవాడు, చెక్కిళ్ళపై మణులు పొదిగిన మరకకుండలాల పసిడికాంతుల ప్రసరించేవాడు, ఆ బ్రహ్మాస్త్ర అగ్ని జ్వాలల్ని చల్లార్చే సంరంభం వల్ల కళ్ళు రవ్వంత జేవురించిన వాడు, ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలిన రత్నఖచిత సువర్ణ కిరీటం తలపై దాల్చినవాడు, కంకణాలతో, భుజకీర్తులతో, వనమాలికలతో విరాజిల్లేవాడు, అంగుష్ఠమాత్ర దేహుడు అయిన శ్రీమహావిష్ణువు గదాధరుడై కన్నులపండువుగా ఆ సమయంలో గర్భంలోని అర్భకుని ముందు అవిర్భవించాడు.
(17)
8-595-క.
మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ దప్పక యిత్తున్.
భావము:-
మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, ఆకాశం బద్ధలు అయితే కావచ్చు. కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.
(18)
2-95-క.
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు
యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్
యజ్ఞపురుషుఁగా మానస
యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్.
భావము:-
యజ్ఞం శరీర మైన వాడు, యజ్ఞానికి ఫలితా న్నిచ్చే వాడు, ప్రభువు, కర్తా అయినట్టి ఆ భగవంతుని యజ్ఞ పురుషునిగా చేసుకొన్నాను. ఆ యజ్ఞాన్ని ఆయనకే అర్పించా లనే బుద్ధితో మానసయజ్ఞం చేశాను.
బ్రహ్మదేవుడు నారదునికి విశ్వ ప్రకారం వివరించి చెప్తున్నాడు. ఇది నారయ పూరించిన భాగంలోని దని అంటారు.
(19)
1-274-క.
యతు లీశ్వరుని మహత్త్వము
మిత మెఱుఁగని భంగిఁ నప్రమేయుఁడగు హరి
స్థితి నెఱుఁగక కాముకుఁ డని
రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ!
భావము:-
ఓ బుద్ధిమంతుడైన శౌనకా! తపోనియతులైన యతులు పరమేశ్వరుని ప్రభావం ఇదమిత్థమని ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్త్వన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమణునితో క్రీడించారు.
(20)
1-334-మ.
హరిఁ జూడన్ నరుఁ డేగినాడు నెల లే డయ్యెం గదా రారు కా
లరు లెవ్వారును; యాదవుల్ సమద లోలస్వాంతు లీవేళ సు
స్థిరులై యుండుదురా? మురారి సుఖియై సేమంబుతో నుండునా?
యెరవై యున్నది చిత్త మీశ్వరకృతం బెట్లో కదే! మారుతీ!
భావము:-
మరున్నందనా! భీమా! మాధవుని వెంట మన అర్జునుడు కూడా ద్వారకానగరానికి వెళ్ళాడు గదా. ఇప్పటికి ఏడు మాసాలు గడిచి పోయాయి. ఇంతవరకూ తిరిగిరాలేదు. మళ్లీ మనకు వారిక్షేమం తెలియలేదు. చారులు కూడా ఎవరూ రాలేదు. యాదవులు కొంచెము ఉద్ధత స్వాభావులు. వారిది వేడిరక్తం. వారు ప్రశాంతచిత్తులై ఉండి ఉంటారు గదా? వాసుదేవుడు కుశలంగానే ఉంటాడు కదా? మనస్సంతా చికాకుగా ఉంది. ఈశ్వర సంకల్పం ఎలా ఉందో ఏమో?
(21)
2-22-క.
రక్షకులు లేనివారల
రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్
రక్షింపు మనుచు నొక నరు
నక్షము బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్?
భావము:-
దిక్కులేని వాళ్ళకు దిక్కై రక్షిస్తా నంటు చక్రం ధరించే విష్ణుమూర్తి సిద్ధంగా ఉన్నాడు. మరింకా ఆత్మజ్ఞానులు, ప్రాజ్ఞులు అయిన వారు ఎవరో అసమర్థుడైన మానవుణ్ణి ప్రాధేయపడటం అనవసరం కదా."
ఇలా శుకబ్రహ్మ పరీక్షిత్తుకి విరాడ్విగ్రహం వివరించి భాగవత తత్వం చెప్పాడు.
(22)
8-623-మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
భావము:-
వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట.
అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.
(23)
1-212-ఉ.
రాజఁట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రియఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁడ
య్యాజికిఁదోడు వచ్చునఁట, యాపద గల్గు టిదేమి చోద్యమో.
భావము:-
ధర్మజు అంతటివాడు రాజు; ఇంద్రుడి కుమారుడూ మహావీరుడూ అయినట్టి అర్జునుడు యోద్ధ; శత్రుభయంకరమైనట్టి గాండీవం అతని ధనుస్సు; సమస్త శుబాలనూ కలిగించే శ్రీకృష్ణుడు రథసారథి; చండ ప్రచండమైన గదాదండం ధరించే భీముడు కొండంత అండ; అయినా ఇంతటి మహా మహిమాన్వితమైన సహాయ సంపత్తులు ఉన్నా ఈ పాండవులు అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు చేసి మొదలైన ఆపదలు ఎన్నో పొందారు; ఎంత ఆశ్చర్యం!
(24)
1-528-క.
రాజీవపత్రలోచన!
రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి
భ్రాజితపాదాంభోరుహ!
భూజనమందార! నిత్యపుణ్యవిచారా!
భావము:-
కలువరేకుల వంటి కన్నులు కల వాడా! మహారాజుల కిరీటాలలోని మణుల కాంతులు ప్రతిఫలిస్తున్న పాదపద్మాలు కల వాడా! భూలోకవాసుల పాలిటి కల్పవృక్షమా! మంచివారిని ఎల్లప్పుడు పాలించు వాడా! నమస్కారము.
ఇది ప్రథమ స్కంధాంత స్తోత్రం., కళ్ళు కలువరేకులవలె అందంగా ఉన్నాయి అంటే స్వామి చక్కటి అనుగ్రహాల్ని వర్షింస్తూ ఉంటావు అని. లోకంలోని మహారాజులు సైతం నీపాదాభివందనాలు చేస్తుంటారు కనుక వారి కిరీటాలలోని మణుల కాంతులు నీ పాదాలపైన నిత్యం పడుతుంటాయి అంటే అంతటి శక్తిసామర్థ్యాలతో మమ్ము పాలిస్తావు అని. భూలోకులకు మందార అంటే ఆ మహారాజులు నుండి జనసమాన్యం వరకు మేమెవరి మైనా వలసినవి అనుగ్రహిస్తావు అని. ఎప్పుడు పుణ్యాత్ముల క్షేమ సమాచారాలు చూస్తుంటావు అంటే పుణ్యులమైన మమ్ము పాలిస్తుంటావు అని.