పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అనుయుక్తాలు- పారిభాషికపదాలు : కాలము - కొలత : సంక్షిప్త వివరణలు

త్రిభుజబాణం తట్టి వివరాలు చూడగలరు

కలి యుగే, ప్రథమ పాదే, శార్వరీనామ సంవత్సరే, మార్గశిర మాసే (ధనుర్మాసరే), శుక్ల పక్ష పంచమి తిథి
అనగా తత్కాల సామాన్య శకం (సిఇ) 2020, డిసెంబరు – 19వ తారీఖు.  అనేక సహస్రాబ్దాల వాడుకలు కల భారతీయ కాల గణన విధానంలో, దేశ కాలాల విస్తృతి రీత్యా అనేక పాఠ్యంతరములు కలవు. వ్యుత్పత్తి అర్థ భేదం వలననూ పాఠ్యంతరములు కలవు. అన్నీ ఏక సూత్రాధారములే, ఏక సంస్కృత్యాధారములే. ఈ కాలగణన సంక్షిప్తం వివరణ.


దినము అనగా రాత్రింబవలు. దినము కంటె చిన్న కాలములు సూక్ష్మకాలములు. అంతకంటె పెద్దవి బృహత్కాలములు.

సూక్ష్మకాలమాన సూచన:-
  1. దినము రెండు భాగములు పగలు, రాత్రి. అందలి అంశములు
(అ) వీటికి సంధ్యలు (సంధికాలాలు). వేకువ రాత్రి అంత్యసంధి 1 గంట, దినముఖ సంధి సూర్యోదయం నుండి 1 గంట (12/12 = 1) కలిపి ఉదయ సంధ్య 2 గంటలు;
అలాగే
(ఆ)సాయం సంధ్య పగలు అంత్యసంధి 1 గంట, అసురసంధ్య రాత్రి ఆది సంధ్య 1గంట కలిపి సాయంసంధ్య 2 గంటలు.
(ఇ) మఱియు; దినములో ముహూర్తం, ఘడియిలు, విఘడియలు, తిథి, నక్షత్రం ఉన్నాయి. వీటిని భాగవత గ్రంథంలో చెప్పబడ్డ వివరాలను జాలగూడులో ~ వివరములు విభాగంలోని~ అనుయుక్తాలు ఉప విభాగంలో ~ కాలము కొలతలలో చూడగలరు.
(ఈ) అంతేకాక వర్జ్యం, దుర్ముహూర్తం, గ్రహభుక్తి వంటి విశేషములు కూడా మన భారతీయ విధానంలో ఉన్నాయి.


  2. దినమున చంద్ర కళలు ఆథారంగా గణించేవి తిథులు. ఇవి పదిహేను. నక్షత్రముల ఆధారంగా గణించేవి నక్షత్రములు. తిథులతో పాటు సమాంతర గణన కలవి నక్షత్రములు . ఇవి 27. ఒక్కదానికి 4 సమాన పాదములు (గమనిక - మొత్తం 108 పాదములు) వీటిని పన్నెండు రాశులుగా విభజించారు


బృహత్కాల సూచన:-
  1. పక్షమునకు 15 దినములు, 15 తిథులు (గమనిక – తిథులు లేదా నక్షత్రముల కాల పరిమాణుము, దినముల కాల పరిమాణమునకు సమానము కాదు).


  2. నెలకి రెండు పక్షములు. 1. శుక్ల పక్షం, 2. కష్ణ పక్షం
పేర్లు - కాలములు, ఋతువులు, మాసములు, పక్షములు, తిథులు, నక్షత్రములు, రాశులు.


  3. రెండు నెలలు ఒక ఋతువు.
  రెండు ఋతువులు (నాలుగు నెలలు) ఒక కాలం.
  మూడు ఋతువులు (ఆరు నెలలు) ఒక ఆయనము.
  రెండు ఆయనములు – ఉత్తరాయణము, దక్షిణాయనము. (మూడుకాలములు – వేసవి, వానా, సీతా కాలములు), (ఆరు ఋతువులు), (పన్నెండు నెలలు) ఒక ఏడాది (సంవత్సరము)


  4. సంవత్సరాలు పేర్లు 60 ఉన్నాయి. (షష్టి లేదా మహాసంవత్సరము) ప్రస్తుతం కలి సం. 5121 పేరు శార్వరి నామ సంవత్సరం. (తత్సమాన సామాన్య శకం (సిఇ) 2020-21)
లంకె - సంవత్సరాల పేర్లు


5. ప్రస్తుతం కలియుగంలో ప్రథమ పాదం నడుస్తోంది. యుగానికి నాలుగు పాదములు. కలి సంఖ్య (సంవత్సరాలు) 432,000 లో 4వ వంతు = 108,000 ఏళ్ళు లో కలియుగ సంవత్సరం 5121 వ సంవత్సరం (శార్వరీ నామ సం.) తత్సమాన సామాన్య శకం (సిఇ) 2020-21 సంవత్సరం నడుస్తోంది.
అనగా, ప్రథమ పాదం సుమారు సగం గడిచింది.
గమనిక:- (అ) కలిశకం – శ్రీకృష్ణఅవతరణం పూర్వసామాన్యశకం (బిసిఇ 3101) గా నిర్ణయింపబడింది.
శ్రీకృష్ణజన్మము నాడే కలియుగం ప్రారంభం అయింది. కనుక, సిఇ. (Common Era) +3101
ఆవిధంగా. 2020-21 కి 3101 కలిపితే కలిశకం లేదా కలిసంఖ్య 5121. (ఆ) పాఠ్యంతరం శంకర భగవత్పాదుల అవతార సంవత్సరం – కలిశకం 2593 తత్సమాన బిసిఇ 509 అని పండిత నిర్ణయం. కనుక ప్రసుత శార్వరి సం., సిఇ 2020 – 21 సంవత్సరం – 2593 +(509+2020=2529-1)= కలిశకం.5121 అవుతుంది.


  6. కృత, త్రేత, ద్వాపర, కలి అని నాలుగు యుగములు – ఇవి నాలుగు గడిస్తే ఒక మహాయుగం లేదా చతుర్యుగం. ఈ నాలుగు యుగాలకి మానవ సంవత్సరాల లెక్క. = మహాయుగ సంఖ్య 43,20,000. ఇదులో పదవ వంతు కలియుగ సంఖ్య. కలియుగ సంఖ్యకు 2 రెట్లు ద్వాపర; 3 రెట్లు త్రేత; 4 రెట్లు కృత. లంకె

(క) కృతయుగము = 17,28,000
(ఖ) త్రేతాయుగము = 12,96,000
(గ) ద్వాపరయుగము = 8,64,000
(ఘ) కలియుగము = 4,32,000
(మొ) మహాయుగము = 43,20,000
(అ) ప్రతి కృతాది యుగానికి ముందు 12వ వంతు వెనుక 12వ వంతు కాల ప్రమాణం చొప్పున యుగ సంధులు ఉంటాయి.
ఈ చతుర్యుగ సంఖ్య *4320000 మానవ సంవత్సరములు.
(*సూర్య సిద్ధాంతశాస్త్రంలో దివ్య సంవత్సరాలు లెక్క ఇస్తారు. ఇప్పటి అనుకూలత కోసం ఆది, అంత సంధి కాలాలను కలిపిన సమాన మానవ సంవత్సరాలు లెక్క చూపబడుతోంది)
(ఆ) కృతాదియుగాలు లెక్క.
శ్లో. యుగస్య దశమో భాగ శ్చతుస్త్రీద్వేక సఞ్గుణః|
  క్రమో త్కృతయుగాదీనాం షష్ఠాంశః సన్ధ్యోః స్వకః||
- సూర్య సిద్ధాన్తము
తాత్పర్యమ్. మహాయుగ ప్రమాణ సంవత్సరముల (సంఖ్య) యొక్క పదవ వంతును 4, 3, 2, 1 సంఖ్యలచే వేర్వరుగా హెచ్చించగా క్రమముగా కృత, త్రేత, ద్వాపర, కలియుగ ప్రమాణ సంఖ్య (సంవత్సరము)లు వచ్చును. ఆయా యుగ ప్రమాణ సంఖ్య యందు ఆఱవ వంతు ఆది, అంత సంధికాల ప్రమాణ మగును. (పాచికలకు 4, 3, 2, 1 చుక్కలతో నాలుగు ముఖములు ఉండును. వాటికి పై కృతాది గుణాంకానికి పోలిక గమనించ దగును). ఈ పాచికలో వలెనే 1, 2, 3, 4 తరువాత మరల 1 మొదలౌతుంది. కనుక పాచిక సామ్యం అద్భుతం
(ఇ) మరొక విధంగా అన్వయం :- కలియుగ సంఖ్య (సంవత్సరాలు) మహాయుగ సంఖ్యలో పదవ వంతు (1/10). కనుక కలి x 1 = కలి; కలి x 2 = ద్వాపర; కలి x 3 = త్రేత; కలి x 4 = కృత; సంఖ్యలు ఔతాయి. మఱియు ప్రతి యుగానికి ఆది లో ఆఱవ వంతులో సగం (1/12) ఉదయ సంధ్య. అంతంలో ఆఱవ వంతులో సగం (1/12) సాయం సంధ్య. అనబడతాయి. ఈ సంధ్యల వివరం విషయ విస్తార రీత్యా ఇక్కడ చూపుటలేదు.
వివరణ. మహాయుగ ప్రమాణ సంఖ్య 4320000. దీనిలో పదవ భాగం 432000.
ఈ 432000 x 4 = 1728000 కృతయుగ సంవత్సరములు;
ఈ 432000 x3 = 1296000 త్రేతాయుగ సంవత్సరములు;
ఈ 432000 x 2 = 864000 ద్వాపరయుగ సంవత్సరములు;
ఈ 432000 x 1 = 432000 కలియుగ సంవత్సరములు

(ఉ) కలియుగము 4,32,000 సం. లకు లెక్క –
ఆరంభ సంధి - 100 దివ్య సం. X 360 = 36,000 సం.
కలి ప్రమాణము – 1000 దివ్యసం. X 360 =3,60,000 సం.
ఆరంభ సంధి - 100 దివ్య సం. X 360 = 36,000 సం.
మొత్తం 432,000సం.
ఇలాగే కృత, త్రేత, ద్వాపరలు లెక్క కూడా.

(ఊ)  కలియుగం ప్రథమ పాదం లెక్క- కలియుగానికి నాలుగు పాదాలు.
ఒక్కొక్కపాదం 432000 / 4 = 108,000 సం.
ప్రస్తుతం కలిశకం 5121 కనుక, ప్రథమ పాదంలో సుమారు సగం అన్నమాట.


  7. ప్రస్తుతం నడుస్తున్న కలియుగం - 28వ చతర్యుగంలో నాలుగవ యుగం.


  8. 71 మహాయుగములు (చతుర్యుగములు) గడిస్తే ఒక మన్వంతరం


9. ప్రస్తుతం నడుస్తున్న వైవశ్వత మన్వంతరం లో ఇరవైఎనిమిదవ (28వ.) మహాయుగం నడుస్తోంది.
(అ) 28వ మహా యుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారం
24వ మహా యుగంలో త్రేతాయుగంలో శ్రీరామావతారం


  10. మన్వంతరములు పద్నాలుగు (14). ఇప్పుడు నడుస్తున్న శ్వేతవరాహకల్పంలో ఏడవది ఐన వైవశ్వత మన్వంతరం నడుస్తోంది.
లంకె – మన్వంతరముల పేర్లు


  11. వెయ్యి మహాయుగాలు ఒక కల్పం. ఒక కల్పంలో 14 మన్వంతరాలు, 1000 మహాయుగాలు ఉంటాయి. [వివరణ - 71 మహాయుగములు x 14 మన్వంతరాలు = 994 మహాయుగాలు + 3 మహాయుగాలు ఉదయ సంధ్య+ 3 మహాయుగాలు సాయం సంధ్య మొత్తం = 1000 మహాయుగాలు]


  12. ప్రస్తుతం ద్వితీయ పరార్థంలో శ్వేతవరాహకల్పం నడుస్తోంది.
లంకె – కల్పములు పేర్లు


13. బ్రహ్మదేవుని పగలు కల్పము లేదా అవాంతర కల్పము. (సృష్టి జరుగు కాలము) . బ్రహ్మదేవుని రాత్రి కూడా అంతే పరిమాణం. కనుక బ్రహ్మదేవుని దినము అంటే 2000 మహాయుగాలు.
(అ) రెండు కల్పముల మధ్యకాలము అంటే బ్రహ్మగారికి రాత్రి ప్రళయము లేదా అవాంతర ప్రళయము.


14. ఇట్టి 2000 యుగాల పరిమాణం కల బ్రహ్మ దినములు 360 ఐతే బ్రహ్మకి ఒక ఏడాది. అలా వంద ఏళ్ళు గడిస్తే బ్రహ్మదేవుని ఆయుః పరిమాణం పూర్తవుతుంది. ఈ కాలం (అనగా బ్రహ్మ ఉదయం నుండి బ్రహ్మ అస్తమయం వరకు) మహా కల్పము. బ్రహ్మ అస్తమయం నుండి తరువాతి బ్రహ్మ ఉదయం దాకా మహా ప్రళయము లేదా ప్రాకృతిక ప్రళయము.
ప్రస్తుతం నడుస్తున్న బ్రహ్మకల్పము లేదా మహాకల్పము పేరు ఆద్యబ్రాహ్మణ
(అ) బ్రహ్మదేవుని జీవిత కాలం మహాకల్పం.
(బ్రహ్మదేవుని జీవిత కాల పరిమితి 100 బ్రహ్మ సంవత్సరమలు)
(ఆ) రెండు మహాకల్పాల మధ్య కాలం మహాప్రళయం లేదా బ్రహ్మప్రళయం.


15. మహాకల్పము నందు 2 పరార్థాలు (సగభాగాలు). ప్రస్తుతం ద్వితీయ పరార్థం జరుగుతోంది.
(అ) ద్వితీయ పరార్థము మహాకల్పంలో రెండవ సగభాగం; మొదటి సగ భాగము ప్రథమ పరార్థం. ప్రథమ పరార్థంలో మహదాదుల సృష్టి,
యజ్ఞవరాహుని అవతారంతో ద్వితీయ పరార్థం ఆరంభం.
ద్వితీయ పరార్థంలో (బ్రహ్మ వయసు 51 నుండి 100 ఏళ్ళు వరకు) జీవ సృష్టి.