పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అమృతగుళికలు : వచన వైభవాలు -1


భాగవత వచనవైభవాలు

పద్య సూచిక;-
మఱియును; మధువైరి మందిరంబునుం బోలె ;
మఱియుఁ గైవల్యంబు మూర్తీభవించిన ;
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ ;

up-arrow (1) 1-39-వ.

మఱియును; మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథమహితంబై; బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై; నీలగళసభా నికేతనంబునుం బోలె వహ్ని, వరుణ, సమీరణ, చంద్ర, రుద్ర, హైమవతీ, కుబేర, వృషభ, గాలవ, శాండిల్య, పాశుపత జటిపటల మండితంబై; బలభేది భవనంబునుం బోలె నైరావతామృత, రంభా గణికాభిరామంబై; మురాసురు నిలయంబునుం బోలె నున్మత్తరాక్షసవంశ సంకులంబై; ధనదాగారంబునుం బోలె శంఖ, పద్మ, కుంద, ముకుంద సుందరంబై; రఘురాము యుద్ధంబునుంబోలె నిరంతర శరానలశిఖాబహుళంబై; పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై; దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట, జంభ, నికుంభ శక్తియుక్తంబై; కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచనస్యందనకదంబ సమేతంబై; కర్ణుకలహంబునుం బోలె మహోన్నతశల్యసహకారంబై; సముద్రసేతుబంధనంబునుం బోలె నల, నీల, పనసాద్యద్రి ప్రదీపింతంబై; భర్గుభజనంబునుం బోలె నానాశోకలేఖా ఫలితంబై; మరుని కోదండంబునుం బోలెఁ బున్నాగశిలీముఖ భూషితంబై; నరసింహ రూపంబునుం బోలెఁ గేసరకరజకాంతంబై; నాట్యరంగంబునుం బోలె నటనటీ సుషిరాన్వితంబై; శైలజానిటలంబునుం బోలెఁ జందన, కర్పూర తిలకాలంకృతంబై; వర్షాగమంబునుం బోలె నింద్రబాణాసన, మేఘ, కరక, కమనీయంబై; నిగమంబునుం బోలె గాయత్రీ విరాజితంబై; మహాకావ్యంబునుం బోలె సరళ మృదులతా కలితంబై; వినతానిలయంబునుం బోలె సుపర్ణ రుచిరంబై; యమరావతీపురంబునుం బోలె సుమనోలలితంబై; కైటభోద్యోగంబునుం బోలె మధుమానితంబై; పురుషోత్తమ సేవనంబునుం బోలె నమృతఫలదంబై; ధనంజయ సమీకంబునుం బోలె నభ్రంకష పరాగంబై; వైకుంఠపురంబునుం బోలె హరి, ఖడ్గ, పుండరీక విలసితంబై; నందఘోషంబునుం బోలెఁ గృష్ణసార సుందరంబై; లంకా నగరంబునుం బోలె రామమహిషీవంచక సమంచితంబై; సుగ్రీవ సైన్యంబునుం బోలె గజ, గవయ, శరభ శోభితంబై; నారాయణస్థానంబునుం బోలె నీలకంఠ, హంస, కౌశిక, భరద్వాజ, తిత్తిరి భాసురంబై; మహాభారతంబునుం బోలె నేకచక్ర, బక, కంక, ధార్తరాష్ట్ర, శకుని, నకుల సంచార సమ్మిళితంబై; సూర్యరథంబునుం బోలె నురుతర ప్రవాహంబై; జలదకాల సంధ్యా ముహూర్తంబునుం బోలె బహువితత జాతిసౌమనస్యంబై యొప్పు నైమిశారణ్యం బను శ్రీవిష్ణుక్షేత్రంబు నందు శౌనకాది మహామునులు స్వర్లోకగీయమానుం డగు హరిం జేరుకొఱకు సహస్రవర్షంబు లనుష్ఠానకాలంబుగాఁ గల సత్త్రసంజ్ఞికం బైన యాగంబు సేయుచుండి; రం దొక్కనాఁడు వారలు రేపకడ నిత్యనైమిత్తిక హోమంబు లాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుఁ జూచి.
భావము:- అంతేకాక ఆ నైమిశారణ్యం. . .
(1) పూలగురివింద చెట్లతోటి, వెలగచెట్లతోటి; మధు డనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో, మన్మథునితో కూడినట్లు అందంగా ఉంది.
(2) ఏడాకులఅరటిచెట్టతోటి; బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది.
(3) చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లీ, జువ్విచెట్ల తోటి; నీలకంఠుడైన పరమ శివుని సభామండపమును పోలి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, వృషభ వాహనము, గాలవ ముని, శాండిల్య ముని, మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది.
(4) నారింజ, ఉసిరిక, అరటి, అడవిమొల్ల చెట్లతోటి; దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము, అమృతం, అప్సరస రంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది.
(5) ఉమ్మెత్త, బలురక్కెస, వెదురు పొదలతో; మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు కలగలసినదై ఉంది.
(6) శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎఱ్ఱతామరలతోటి; కుబేరుని సౌధము లాగ (పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్ఛపము, ముకుందము, కుందము, నీలము, వరము లనే నవనిధులు లోని) శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది.
(7) దట్టమైన రెల్లు, శక్రపుష్పి చిక్కటి పొదలు తో; శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది.
(8) మద్ది అంకురాలు కలదై; పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది.
(9) వేప, నిమ్మ, దంతిచెట్లతో బలిసి; రాక్షసులయుద్ధంలాగ అరిష్ట, జంభ, నికుంభాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది.
(10) తుమ్మ, మద్ధి, సంపెంగ, నిమ్మి కడిమిచెట్ల తోటి కూడి ఉండి; ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగ ఉంది.
(11) చాలా ఎత్తైన మంగ, మామిడిచెట్లు కలదై; మహోన్నత మైన శల్యుని సహాయము కల కర్ణుని యుద్ధంలాగ ఉంది.
(12) వట్టివేరు, నీలి, పనసాది చెట్ల తోటి; నలుడు, నీలుడ, పనసుడు మొదలైన వానరవీరు లనే కొండలతో ప్రకాశిస్తున్నట్లు ఉంది.
(13) నానా రకాలైన అశోకాది వృక్షాల వరుసలు కలిగి ఉండి; అనేక శుభాలు కలిగి ఉండే శివుని భజనను పోలి ఉంది.
(14) సురపొన్నలు, తుమ్మెదలతో కూడి; పున్నాగ పూల బాణాలతో అలంకరింపబడిన మన్మథుని విల్లు వలె ఉంది.
(15) పొన్న, కానుగచెట్లతో వెలిగిపోతూ; జూలు, గోళ్ళుతో నరసింహ రూపంలా ప్రకాశిస్తోంది.
(16) దుండిగ, దొండ, గువ్వగుతికచెట్లు కలదై; నటులు, నటీమణులు, వాద్యవిశేషాలతో కూడి ఉన్న నాట్యరంగం లాగ ఉంది.
(17) చందనం, మంచిగంధం, కలిగొట్లు బొట్టుగచెట్లతో; చందనము, మంచి గంధము, కర్పూరతిలకములతో అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది.
(18) మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మచెట్లతో; ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో చూడచక్కని వానాకాలంలాగ ఉంది.
(19) మంచి వరుసలు తీరిన చండ్రచెట్లతో; గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది.
(20) తెల్లతెగడచెట్లతో, కోమలమైన తీగెలతో కూడినదై; సరళత్వ, సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది.
(21) అందమైన ఆకులతో; గరుత్మంతుడితో ఉన్న వినతానిలయంలా ప్రకాశిస్తున్నది.
(22) అందమైన పూలతో; దేవతలతో నిండుగా ఉన్న అమరావతీపురంలా అందంగా ఉంది.
(23) పూదేనెతో చక్కగా; మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటభుని కొలువు వలె మన్నింపదగి ఉంది.
(24) తియ్యని పండ్లుకలదై; మోక్షమును ప్రసాదించే హరి సేవలా మనోహరంగా ఉంది.
(25) ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడికలదై; ఆకాశంనిండా క్రమ్ముకున్న ధూళికల అర్జునుడి యుద్ధంలా ఉంది.
(26) సింహము, ఖడ్గమృగము, బెబ్బులుల క్రీడలు కలిగి; నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము, తెల్లదామరలతో ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది.
(27) చక్కగా ఉన్న నల్లజింకలతో; కృష్ణుని శక్తిసామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది.
(28) పెద్దదుప్పి, దున్నపోతు, నక్కలు కలిగి; రాముడి భార్య సీతని వంచించిన రావణాసురుడు ఉన్న లంకానగరంలాగ ఉంది.
(29) ఏనుగులు, కురుఁబోతులు, శరభమృగాలుతో ప్రకాశిస్తూ; గజుడు, గవయడు, శరభుడులతో శోభిస్తున్న సుగ్రీవ సైన్యంలాగ ఉంది.
(30) నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏంట్రితలు, తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతు; నీలకంఠుడైన పరమశివుడు, పరమహంసలు మరియు కౌశిక, భరద్వాజ, తిత్తిరి ఆది మహర్షులతో భాసురమైన వైకుంఠంలా ఉంది.
(31) చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకునిపక్షులు, ముంగిసలు మున్నగువాని సంచారం కలిగి; ఏకచక్రపురము, బకాసురుడు, కంకుభట్టుగ పిలవబడ్డ ధర్మరాజు, ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు, శకుని, నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది.
(32) మంచి మంచి కాలువలతో; మేలుజాతి గుఱ్ఱములు కల సూర్యరథంలా ఉంది.
(33) జాజి పూలు అధికంగా కలిగి ఉండి; మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగ ఉంది;
ఆ విధంగా ఒప్పియున్న శ్రీమహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో శౌనకాది గొప్ప ఋషులు స్వర్గలోక వంద్యుండైన విష్ణువుని చేరుట కోసం వెయ్యి సంవత్సరముల పాటు చేసే"సత్ర" అనే యాగం చేస్తున్నారు; ఆ యాగం చేసే కాలంలో, ఒకనాడు సూతమహర్షి తెల్లవారగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకొన్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని చూసి. . .

up-arrow (2) 3-507-వ.

మఱియుఁ గైవల్యంబు మూర్తీభవించిన తెఱంగునం బొలుపారుచు "నైశ్శ్రేయస" నామంబున నభిరామంబై సతతంబును సకలర్తుధర్మంబులు గలిగి యర్థిజనంబుల మనంబుల ఘనంబులుగ నీరికలెత్తిన కోరికలు సారికలుగొన నొసంగుచు నితరతరు రహితంబులును గామదోహన సహితంబులును బుష్పఫల భరితంబులును నై తనర్చు సంతాన వనసంతానంబులును, సమంచిత సౌభాగ్య సంపదభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయు లై యఖండ తేజోనిధి యగు పుండరీకాక్షు చరిత్రంబు లుగ్గడింపలేక ఖండితజ్ఞాను లయ్యును నిరతిశయ విషయసుఖానుభవ కారణం బగుట నిందిరాసుందరీరమణ చరణసేవా విరమణకారియై యున్న దని తలంచి; తద్గంధ ప్రాపక గంధవహునిం దిరస్కరించి నారాయణ భజనపరాయణు లై చరియించు సుందరీ యుక్తు లైన వైమానికులును, వైమానిక మానసోత్సేకంబుగం బారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి మయూర రథాంగముఖ్య విహంగ కోలాహల విరామంబుగా నరవిందనయన కథాగానంబు లనూనంబుగా మొరయ మదవదిందిందిర సందోహ కలిత పుష్పవల్లీమతల్లికలును, నకుంఠిత చరిత్రుం డైన వికుంఠనిలయుని కంఠంబునం దేజరిల్లు విలసిత తులసీ దామంబుం గనుంగొని యీ తులసీదామంబు హరి మంగళగళ విలగ్నంబై యుండు సౌభాగ్యంబు వడయుట కేమి తపంబు గావించెనో యని బహూకరించు చందంబున నొప్పు చందన మందార కుందారవింద పున్నాగ నాగ వకుళాశోక కురవకోత్పల పారిజాతాది ప్రసూన మంజరులును, మంజరీ పుంజ రంజిత నికుంజంబుల యందు నుత్తుంగ పీనకుచభారాకంపిత మధ్యంబులుఁ గటితట కనకఘటిత మేఖలాకలాప నినదోపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబ భరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు నసమశర కుసుమశర విలసితంబు నపహసించు నయనకమలంబులుం గలిగిన సుందరీ సందోహంబులం దగిలి కందర్పకేళీ విహారంబుల నానందంబు నొందక ముకుంద చరణారవింద సేవాపరిలబ్ద మరకత వైడూర్య హేమమయ విమానారూఢు లై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును, నిందిరాసుందరి త్రైలోక్య సౌందర్యఖని యైన మనోహరమూర్తి ధరియించి రమణీయ రణిత మణినూపుర చరణారవింద యై నిజహృదయేశ్వరుం డైన సర్వేశ్వరుని మందిరంబునం జాంచల్య దోషరాహిత్యంబుగ వర్తింపం గరకమల భ్రమణీకృత లీలాంబుజాత యై తన నీడ కాంచనస్ఫటికమయ కుడ్యప్రదేశంబులం బ్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జన కైంకర్యంబ పరమధర్మం బని తెలుపు చందంబునం జూపట్టుచు నిజవనంబునం దనరు సౌరభాభిరామంబు లగు తులసీదళదామంబుల నాత్మనాయకుని చరణారవిందంబుల నర్పించుచు నొసలి మృగమదపు టసలున మసలుకొని తుంపెసలాడు కురులును, లలిత తిలప్రసూన రుచిరాభ నానం దనరు మోముఁదామర విమల సలిలంబులఁ బ్రతిబింబింప నిజమనోనాయకుచేతం జుంబితం బగుటగాఁ దలంచి లజ్జావనతవదన యై యుండంజేయు ప్రవాళ లతికాకులంబు లైన కూలంబులు గల నడబావులును గలిగి పుణ్యంబునకు శరణ్యంబును, ధర్మంబునకు నిర్మలస్థానంబును, సుకృతమూలంబునకు నాలవాలంబును నయి పొలుపొందుచుండు.
భావము:- మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లున్న ఆ ఉద్యానవనం ‘నైశ్శ్రేయసం’ అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనంనిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళలా అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ, అర్థిజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి.
కొల్లలుగా విరబూచిన మొల్లపూవుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మందమారుతాలు అక్కడ నలుమూలలా వెదజల్లుతూ ఉంటాయి. తమ సుందరీమణులతో విమానాలలో విహరించే గంధర్వులు ఆ కమ్మని పూలతేనెల సోనలను ఆస్వాదిస్తూ మైమరచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మరిచిపోతూ ఉంటారు. అంతలోనే వారు ఆ అజ్ఞానంనుండి తేరుకొని విచ్చలవిడిగా విషయవాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణుసేవాపరాయణులై సంచరిస్తూ ఉంటారు. పావురాలూ, హంసలూ, బెగ్గురు పక్షులూ, చిలుకలూ, కోకిలలూ, వానకోయిలలూ, తీతువుపిట్టలూ, నెమళ్ళూ, చక్రవాకాలూ మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్లు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణుకథలను నిరంతరం గానం చేస్తున్నట్లు ఝంకారం చేస్తున్న గండుతుమ్మెదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి.
వందనీయ చరిత్రుడైన వైకుంఠనిలయుని కంఠంలో వనమాలికలుగా వెలసి విలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపుచెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, సురపొన్నలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసీవనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి.
అక్కడ ఒత్తుగా పూచిన పూలగుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో ఎత్తైన స్తనకుంభాల బరువుకు నకనకలాడే సన్నని నడుములు కల కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు. ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని, బంగారు గజ్జెల ఒడ్డాణాలు సింగారించుకొని ఉంటారు. వారి వయ్యారపు నడకల సొగసులు హంసలనూ, నెమళ్ళనూ ఎగతాళి చేస్తున్నట్లుంటాయి. వారి వాలుకన్నులు మన్మథుని పూలబాణాలను పరిహసిస్తుంటాయి. వారి సౌందర్యానికి లొంగక, వారితో శృంగారక్రీడలను కోరుకోకుండా, అక్కడి విష్ణుభక్తులు గోవిందుని చరణారవిందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్యప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు.
అందాలదేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించినట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడయిన వైకుంఠనాథుని మందిరంలో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణుమందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తున్న ట్లుంటుంది. వనంలోని పరిమళాలను వెదజల్లే తులసీదళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని పదకమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమవల్ల కలిగిన స్వేద బిందువులవల్ల నుదుటనున్న కస్తూరీ తిలకం కరిగి అంటుకొని కదలుతున్న ముంగురులతో, నువ్వుపువ్వువంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటినీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాలతీగలు అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది.

up-arrow (3) 7-285-వ.

ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వాల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.
భావము:- హిరణ్యకశిపుడు అలా శ్రీమహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగభగమండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము, అణుకువలను కాల్చివేశాయి. ధైర్యగాంభీర్యాల వలన అతని హృదయం ధగ ధగ మెరిచింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతట పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి “దీనిలో హరిని చూపించరా" అనంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పది దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడివలన ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ ఛటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. ఇంద్రధనుస్సులా వంగి ఉన్న ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి.శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీరకాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నాయి. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ, హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.