పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : సనకాదుల వైకుంఠ గమనంబు

  •  
  •  
  •  

3-507-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ గైవల్యంబు మూర్తీభవించిన తెఱంగునం బొలుపారుచు "నైశ్శ్రేయస" నామంబున నభిరామంబై సతతంబును సకలర్తుధర్మంబులు గలిగి యర్థిజనంబుల మనంబుల ఘనంబులుగ నీరికలెత్తిన కోరికలు సారికలుగొన నొసంగుచు నితరతరు రహితంబులును గామదోహన సహితంబులును బుష్పఫల భరితంబులును నై తనర్చు సంతాన వనసంతానంబులును, సమంచిత సౌభాగ్య సంపదభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయు లై యఖండ తేజోనిధి యగు పుండరీకాక్షు చరిత్రంబు లుగ్గడింపలేక ఖండితజ్ఞాను లయ్యును నిరతిశయ విషయసుఖానుభవ కారణం బగుట నిందిరాసుందరీరమణ చరణసేవా విరమణకారియై యున్న దని తలంచి; తద్గంధ ప్రాపక గంధవహునిం దిరస్కరించి నారాయణ భజనపరాయణు లై చరియించు సుందరీ యుక్తు లైన వైమానికులును, వైమానిక మానసోత్సేకంబుగం బారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి మయూర రథాంగముఖ్య విహంగ కోలాహల విరామంబుగా నరవిందనయన కథాగానంబు లనూనంబుగా మొరయ మదవదిందిందిర సందోహ కలిత పుష్పవల్లీమతల్లికలును, నకుంఠిత చరిత్రుం డైన వికుంఠనిలయుని కంఠంబునం దేజరిల్లు విలసిత తులసీ దామంబుం గనుంగొని యీ తులసీదామంబు హరి మంగళగళ విలగ్నంబై యుండు సౌభాగ్యంబు వడయుట కేమి తపంబు గావించెనో యని బహూకరించు చందంబున నొప్పు చందన మందార కుందారవింద పున్నాగ నాగ వకుళాశోక కురవకోత్పల పారిజాతాది ప్రసూన మంజరులును, మంజరీ పుంజ రంజిత నికుంజంబుల యందు నుత్తుంగ పీనకుచభారాకంపిత మధ్యంబులుఁ గటితట కనకఘటిత మేఖలాకలాప నినదోపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబ భరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు నసమశర కుసుమశర విలసితంబు నపహసించు నయనకమలంబులుం గలిగిన సుందరీ సందోహంబులం దగిలి కందర్పకేళీ విహారంబుల నానందంబు నొందక ముకుంద చరణారవింద సేవాపరిలబ్ధ మరకత వైడూర్య హేమమయ విమానారూఢు లై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును, నిందిరాసుందరి త్రైలోక్య సౌందర్యఖని యైన మనోహరమూర్తి ధరియించి రమణీయ రణిత మణినూపుర చరణారవింద యై నిజహృదయేశ్వరుం డైన సర్వేశ్వరుని మందిరంబునం జాంచల్య దోషరాహిత్యంబుగ వర్తింపం గరకమల భ్రమణీకృత లీలాంబుజాత యై తన నీడ కాంచనస్ఫటికమయ కుడ్యప్రదేశంబులం బ్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జన కైంకర్యంబ పరమధర్మం బని తెలుపు చందంబునం జూపట్టుచు నిజవనంబునం దనరు సౌరభాభిరామంబు లగు తులసీదళదామంబుల నాత్మనాయకుని చరణారవిందంబుల నర్పించుచు నొసలి మృగమదపు టసలున మసలుకొని తుంపెసలాడు కురులును, లలిత తిలప్రసూన రుచిరాభ నానం దనరు మోముఁదామర విమల సలిలంబులఁ బ్రతిబింబింప నిజమనోనాయకుచేతం జుంబితం బగుటగాఁ దలంచి లజ్జావనతవదన యై యుండంజేయు ప్రవాళ లతికాకులంబు లైన కూలంబులు గల నడబావులును గలిగి పుణ్యంబునకు శరణ్యంబును, ధర్మంబునకు నిర్మలస్థానంబును, సుకృతమూలంబునకు నాలవాలంబును నయి పొలుపొందుచుండు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; కైవల్యంబున్ = కైవల్యము {కైవల్యము - కేవలము తానైన స్థితి, ముక్తి}; మూర్తీభవించిన = స్వరూపమును ధరించిన; తెఱంగునన్ = విధముగా; పొలుపారుచున్ = విరాజిల్లుతూ; నైశ్రేయస = నిశ్రేయస్సు అను {నైశ్రేయస్సు - నిశ్రేయస్సు (మిక్కిలి శ్రేయస్సు, ముక్తి) ను కలిగించునది}; నామంబునన్ = పేరుతో; అభిరామంబున్ = సుందరమైనది; ఐ = అయ్యి; సతతంబున్ = ఎల్లప్పుడును; సకల = సమస్తమైన; ఋతు = ఋతువుల యొక్క; ధర్మంబులున్ = లక్షణములును; కలిగి = కలిగి ఉండి; అర్థి = కోరు; జనంబులన్ = జనుల యొక్క; మనంబులన్ = మనసులను; ఘనంబులుగన్ = బహుమిక్కిలి యైన; ఈరికలున్ = మొలకెత్తిన; కోరికలున్ = కోరికలు; సారికలుగొన = చిందులు త్రొక్కుటలు(కోరికలు రేకెత్తించుటలు); ఒసంగుచున్ = అందజేయుచూ; ఇతర = అన్య; తరు = వృక్షములు, రహితంబులునున్ = లేనివియును; కామ = కోరికలను; దోహన = పితుకుటను; సహితంబులునున్ = కలిగినవి యైన; పుష్ప = పువ్వులు తోను; ఫల = పళ్లు తోను; భరితంబులున్ = నిండినవి; ఐ = అయ్యి; తనర్చు = అతియించుచున్న, తరింపజేయుచున్న; సంతాన = కల్పవృక్ష; వన = తోటల; సంతానంబులునున్ = సమూహములును; సమంచిత = చక్కటి; సౌభాగ్య = సౌభాగ్యమును; సంపద = సంపదలతోను; అభి = మిక్కిలి; శోభిత = ప్రకాశించుచున్న; వాసంతికా = అడవిమొల్ల, గురివింద; కుసుమ = పూల; విసర = సమూహముల; పరిమళ = సుగంధము; మిళిత = కలిసి; గళిత = స్రవిస్తున్న; మకరంద = మకరందమును; లలిత = మనోజ్ఞముగ; ఆమోద = ఆశ్వాదించుటచే; ముదిత = ఆనందిత; హృదయులు = హృదయములు కలవారు; ఐ = అయ్యి; అఖండ = నిరంతర; తేజస్ = ప్రకాశమునకు; నిధి = సముద్రము వంటిది; అగు = అయినట్టి; పుండరీకాక్షు = విష్ణుని {పండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణుమూర్తి}; చరిత్రంబులున్ = కథలు; ఉగ్గడింపన్ = పూర్తిగా చెప్ప; లేక = లేక; ఖండిత = అసంపూర్ణ; జ్ఞానులు = జ్ఞానములు కలవారు; అయ్యును = అయినప్పటికిని; నిరతిశయ = సాటిలేని; విషయ = ఇంద్రియార్థ విషయము లందలి; సుఖ = సుఖమును; అనుభవ = అనుభవించుట అను; కారణంబున్ = కారణములు; అగుటన్ = జరుగుటవలన; ఇందిరాసుందరీరమణ = విష్ణుని {ఇందిరా సుందరీ రమణుడు - ఇందిరా (లక్ష్మీ) సుందరీ (దేవియొక్క) రమణుడు (భర్త), విష్ణుమూర్తి}; చరణ = పాదములు; సేవా = సేవించుకొనుట యందు; విరమణ = విరామమును; కారి = కలిగించునది; ఐ = అయ్యి; ఉన్నదని = ఉందని; తలంచి = అనుకొని; తత్ = ఆ; గంధ = వాసనలను; ప్రాపక = వ్యాపింప జేయు; గంధవాహనిన్ = వాయువును; తిరస్కరించి = తిరస్కరించి; నారాయణ = విష్ణుని {నారాయణుడు - నారములు (నీటి)లో ఉండువాడు, విష్ణుమూర్తి}; భజన = సేవించుట యందు; పరాయణులు = నిష్ఠ కలవారు; ఐ = అయ్యి; చరియించు = వర్తించు; సుందరీ = అందమైన స్త్రీలతో; యుక్తులు = కలిసి ఉన్నవారు; ఐన = అయినట్టి; వైమానికులును = విమానముల పై తిరుగువారు; వైమానిక = వైమానికుల; మానస = మనసులలో; ఉత్సేకంబుగన్ = ఉత్సాహము కలిగించునట్టి; పారావత = పావురములు; హంస = హంసలు; సారస = బెగ్గరు పక్షులు; శుక = చిలుకలు; పిక = కోకిలలు; చాతక = చాతక పక్షులు; తిత్తిరి = తీతువు పిట్టలు; మయూర = నెమళ్ళు; రథాంగ = చక్రవాకములు; ముఖ్య = మొదలగు; విహంగ = పక్షుల; కోలాహల = కోలాహలముతో; విరామంబుగాన్ = విరాజిల్లుతుండగా; అరవిందనయన = విష్ణుని {అరవింద నయనుడు - అరవింద (పద్మము)ల వంటి నయనములు కలవాడు, విష్ణువు}; కథా = కథలు; గానంబులు = పాటలు; అనూనంబుగాన్ = నిండుగా; మొరయు = మారు మోగుతున్నదియును; మదవ = మదించిన; ఇందిందిర = తుమ్మెదల; సందోహ = సమూహములతో; కలిత = కూడిన; పుష్ప = పూల; వల్లీమత్ = తీగలతో చక్కగా; అల్లికలును = అల్లికలును; అకుంఠిత = సాటిలేని; చరిత్రుండు = వర్తనములు కలవాడు; ఐన = అయినట్టి; వికుంఠ = వైకుంఠమున; నిలయుని = నివసించువాని; కంఠంబునన్ = మెడలో; తేజరిల్లు = ప్రకాశించు; విలసిత = విలాసవంతమైన; తులసీ = తులసీ; దామంబున్ = మాలను; కనుంగొని = చూసి; ఈ = ఈ; తులసీ = తులసీ; దామంబున్ = మాల; హరి = విష్ణుని; మంగళ = శుభకరమైన; గళ = మెడలో; విలగ్నంబున్ = చక్కగా వేయబడినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండునట్టి; సౌభాగ్యంబున్ = సౌభాగ్యమును; పడయుట = పొందుట; కిన్ = కి; ఏమి = ఏవిధమైన; తపంబున్ = తపస్సును; కావించెనో = చేసినదో; అని = అని; బహూకరించు = గౌరవించు; చందంబునన్ = విధముగా; ఒప్పు = ఒప్పి ఉన్న; చందన = కుంకుమ పువ్వులు; మందార = మందారములు; కుంద = మల్లెలు; అరవింద = తమ్మిపూలు, పద్మములు; పున్నాగ = పన్నాగ పూలు; నాగ = పొన్నపూలు; వకుళ = పగడపూలు; అశోక = అశోకములు; కురవక = గురివిందపూలు; ఉత్పల = కలువపూలు; పారిజాత = పారిజాతములు; ఆది = మొదలగు; ప్రసూన = పువ్వుల; మంజరులును = గుత్తులును; మంజరీ = పూలగుత్తుల; పుంజ = సమూహములతో; రంజిత = ముచ్చటైన; నికుంజంబుల్ = పొదరిళ్ల; అందున్ = లో; ఉత్తుంగ = ఎత్తైన; పీన = పెద్ద; కుచ = స్తనముల యొక్క; భార = బరువుచేత; కంపిత = ఊగుతున్న; మధ్యంబులున్ = నడుములును; కటి = మొల; తటి = ప్రదేశమున; కనక = బంగారముచే; ఘటిత = చేయబడిన; మేఖలా = వడ్డాణములు; కలాప = చేయుచున్న; నినద = చక్కటి శబ్దములచే; ఉపలాలిత = బుజ్జగింపబడుతున్న; నీల = నీలిరంగు; దుకూల = పట్టువస్త్రములచే; శోభిత = శోభాయమానమైన; పృథు = పెద్ద; నితంబ = పిరుదుల; భర = బరువుచేత; అలస = మెల్లిగా; యాన = ఊగుతూ; హసిత = వేళాకోళము చేయబడుతున్న; కలహంస = కలహంస {కలహంస - కలకాలరావము చేయు హంసలు}; మయూర = నెమళ్ల; గమనంబులున్ = నడకలునూ; అసమశర = మన్మథుని {అసమశరుడు - సరిసంఖ్య గాక బేసి సంఖ్యలో (పంచ) శరములు (బాణములు) కలవాడు, పంచశరుడు, మన్మథుడు}; కుసుమ = పూల; శర = బాణములను; విలసితంబున్ = విలాసమును; అపహసించు = అపహాస్యము చేయజాలు; నయన = కన్నులు అను; కమలంబులున్ = పద్మములును; కలిగిన = కలిగినట్టి; సుందరీ = సుందరీమణుల; సందోహంబులన్ = సమూహము లందు; తగిలి = లగ్నమై; కందర్ప = మన్మథ; కేళీ = కేళి యందు; విహారంబులన్ = విహరించుటలో; ఆనందంబున్ = ఆనందమును; ఒందక = పొందకుండా; ముకుంద = విష్ణుని; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; పరిలబ్ధ = చక్కగాలభించిన; మరకత = పచ్చలు; వైడూర్య = వైడూర్యములు; హేమ = బంగారములు; మయ = తాపడము చేయబడిన; విమాన = విమానములను; ఆరూఢులు = అధిరోహించినవారు; ఐ = అయ్యి; హరి = విష్ణుని; దాసులున్ = భక్తులు; విహరించు = తిరుగుతున్న; పుణ్య = పుణ్యవంతమైన; ప్రదేశంబులును = ప్రదేశములును; ఇందిరాసుందరి = లక్ష్మీదేవి; త్రై = మూడు; లోక్య = లోకము లందలి; సౌందర్య = అందములకు; ఖని = నిధి వంటిది; ఐన = అయినట్టి; మనోహర = మనోహరమైన; మూర్తిన్ = స్వరూపమును; ధరియించి = స్వీకరించి; రమణీయ = అందమైన; రణిత = శబ్దము చేయుచున్న; మణి = మణిమయ; నూపుర = అందెలు ధరించిన; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మములు కలామె; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; హృదయేశ్వరుండు = భర్త {హృద యేశ్వరుడు – మనసు నందు అధికారము కలవాడు, భర్త}; ఐన = అయిన; సర్వేశ్వరుని = విష్ణుని {సర్వేశ్వరుడు - సర్వులకు (అందరకును) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణుమూర్తి}; మందిరంబునన్ = భవనములో; చాంచల్య = చంచలత్వము అను; దోష = దోషము; రాహిత్యంబుగన్ = లేకుండగా; వర్తింపన్ = ప్రవర్తిస్తుండగా; కర = చేయి అనెడి; కమల = కమలము అందు; భ్రమణీ = తిప్పుట; కృత = చేయబడుతున్న; లీలా = లీలార్థమైన; అంబుజాత = పద్మము కలామె {అంబుజాతము - అంబువులు (నీటి) అందు పుట్టినది, పద్మము}; ఐ = అయ్యి; తన = తన యొక్క; నీడ = నీడ; కాంచన = బంగారము; స్ఫటిక = స్ఫటికములు; మయ = తాపిన; కుడ్య = గోడల; ప్రదేశంబులన్ = తలముపై; ప్రతిఫలింపన్ = ప్రతిఫలిస్తుండగా; శ్రీనికేతనుని = విష్ణుని {శ్రీ నికేతనునుడు - శ్రీ (సిరికి, లక్ష్మీదేవికి) నికేతనుడు (నివాసమైనవాడు), విష్ణువు}; నికేతన = నివాసమును; సమ్మార్జన = తుడుచుట అను; కైంకర్యంబ = సేవయే {కైంకర్యము - కై (స్వంత చేతుల)తో కర్యము (చేయు) ఊడిగము, సేవ}; పరమ = అత్యుత్తమమైన; ధర్మంబున్ = చేయతగ్గ పని; అని = అని; తెలుపు = తెలియజేయు; చందంబునన్ = విధముగా; చూపట్టుచూ = కనబడుతున్న; నిజ = అతని; వనంబునన్ = ఉద్యానవనములో; తనరు = ఒప్పుతున్న; సౌరభ = సువాసనలతో; అభిరామంబుల్ = మనోజ్ఞములు; అగు = అయినట్టి; తులసీ = తులసీ; దళ = దళముల; దామంబులన్ = మాలలతో; ఆత్మ = తమ; నాయకునిన్ = నాయకుడి; చరణ = పాదములు అనెడి; అరవిందంబులన్ = పద్మములకు; అర్పించుచున్ = సమర్పిస్తూ; నొసలి = నొసటి; మృగమదపు = కస్తూరి {మృగమదము - కస్తూరి మృగము నుండి తీయబడు ఒక సుగంధద్రవ్యము, కస్తూరి}; టసలునన్ = తిలకము (బొట్టు)నందు; మసలుకొని = అంటుకొని; తుంపెసలు = తూగుతున్న; కురులును = వెంట్రుకలును; లలిత = అందమైన; తిల = నువ్వు; ప్రసూన = పూల; రుచిర = చక్కదనముతో; అభ = మెరుస్తున్న; నాసన్ = ముక్కుతో; తనరు = అతిశయించు; మోమున్ = ముఖమును; తామర = తామరపూలు కల; విమల = నిర్మలమైన; సలిలంబులన్ = నీటిలో; ప్రతిబింబింపన్ = ప్రతిఫలించగా; నిజ = తన యొక్క; మనోనాయకు = భర్త; చేతన్ = చేత; చుంబితంబు = ముద్దుపెట్టుకొన్నది; అగుటగాన్ = అయినట్లు; తలంచి = అనుకొని; లజ్జా = సిగ్గుతో; అవనత = వంచిన; వదన = మోముకలామె; ఐ = అయ్యి; ఉండన్ = ఉండునట్లు; చేయు = చేయగల; ప్రవాళ = పగడపు; లతికా = హారముల; కులంబులు = సమూహములు; ఐన = ఉన్నట్టి; కూలంబులు = గట్టులు; కల = కలిగినట్టి; నడబావులు = దిగుడు బావులును; కలిగి = ఉన్నట్టి; పుణ్యంబున్ = పుణ్యమున; కున్ = కు; శరణ్యంబునున్ = రక్షకములును; ధర్మంబున్ = ధర్మమున; కున్ = కు; నిర్మల = విమలమైన; స్థానంబునున్ = నివాసమును; సుకృత = పుణ్యములు అను; మూలంబున్ = చెట్టు మొదళ్ళ; కున్ = కు; ఆలవాలంబునున్ = పాదు వంటిదియును; అయి = అయ్యి; పొలుపొందుచున్ = ఒప్పారుతూ; ఉండున్ = ఉండును.

భావము:

మోక్షమే మూర్తీభవించిందా అన్నట్లున్న ఆ ఉద్యానవనం ‘నైశ్శ్రేయసం’ అనే పేరుతో కనువిందు చేస్తూ ఉంటుంది. ఆ వనంనిండా ఎన్నెన్నో కల్పవృక్షాలు స్వేచ్ఛగా పెరిగి పూలతో, పండ్లతో నిండి ఉంటాయి. అవి అన్ని వేళలా అన్ని ఋతువుల వైభవంతో శోభిస్తూ, అర్థిజనుల మనస్సులలో మొలకెత్తిన కోరికలను కొరత లేకుండా తీరుస్తుంటాయి.
కొల్లలుగా విరబూచిన మొల్లపూవుల సుగంధంతో కూడిన మకరంద బిందువులను మందమారుతాలు అక్కడ నలుమూలలా వెదజల్లుతూ ఉంటాయి. తమ సుందరీమణులతో విమానాలలో విహరించే గంధర్వులు ఆ కమ్మని పూలతేనెల సోనలను ఆస్వాదిస్తూ మైమరచి మహానుభావుడైన విష్ణుదేవుని కథలు చెప్పుకొనడం మరిచిపోతూ ఉంటారు. అంతలోనే వారు ఆ అజ్ఞానంనుండి తేరుకొని విచ్చలవిడిగా విషయవాసనలను రెచ్చగొట్టే ఆ సువాసనలు నారాయణుని పాదపద్మాల సేవకు ఆటంకాలని భావించి ఆ సువాసనలను తృణీకరించి విష్ణుసేవాపరాయణులై సంచరిస్తూ ఉంటారు. పావురాలూ, హంసలూ, బెగ్గురు పక్షులూ, చిలుకలూ, కోకిలలూ, వానకోయిలలూ, తీతువుపిట్టలూ, నెమళ్ళూ, చక్రవాకాలూ మొదలైన పక్షులు వారి మనస్సులలో ఆనందం పొంగిపొరలేటట్లు చేస్తూ ఉంటాయి. ఆ కోలాహలాన్ని మించి విష్ణుకథలను నిరంతరం గానం చేస్తున్నట్లు ఝంకారం చేస్తున్న గండుతుమ్మెదలతో కూడిన మేలుజాతి పూలతీగలు కనువిందు చేస్తుంటాయి.
వందనీయ చరిత్రుడైన వైకుంఠనిలయుని కంఠంలో వనమాలికలుగా వెలసి విలసిల్లడానికి ఈ తులసి ఎంతటి తపస్సు చేసిందో అని ఆనందంతో అభినందిస్తున్నట్లు మంచి గంధపుచెట్లు, మందారాలు, మల్లెలు, కమలాలు, సురపొన్నలు, పొన్నలు, పొగడలు, అశోకాలు, గోరంటలు, కలువలు, పారిజాతాలు గుత్తులు గుత్తులుగా పూచి తులసీవనాలపై సుగంధాలు విరజిమ్ముతూ ఉంటాయి.
అక్కడ ఒత్తుగా పూచిన పూలగుత్తులతో గుబాళించే పొదరిండ్లున్నాయి. ఆ పొదరిండ్లలో ఎత్తైన స్తనకుంభాల బరువుకు నకనకలాడే సన్నని నడుములు కల కొందరు సుందరీమణులు విహరిస్తుంటారు. ఆ లతాంగులు నీలిరంగు పట్టుచీరలు కట్టుకొని, బంగారు గజ్జెల ఒడ్డాణాలు సింగారించుకొని ఉంటారు. వారి వయ్యారపు నడకల సొగసులు హంసలనూ, నెమళ్ళనూ ఎగతాళి చేస్తున్నట్లుంటాయి. వారి వాలుకన్నులు మన్మథుని పూలబాణాలను పరిహసిస్తుంటాయి. వారి సౌందర్యానికి లొంగక, వారితో శృంగారక్రీడలను కోరుకోకుండా, అక్కడి విష్ణుభక్తులు గోవిందుని చరణారవిందాలను సేవించడం వల్ల లభించిన నవరత్నాలు పొదిగిన బంగారు విమానాలను ఎక్కి అక్కడి పుణ్యప్రదేశాలలో విహరిస్తూ ఉంటారు.
అందాలదేవి అయిన లక్ష్మీదేవి ముల్లోకాల సౌందర్యం మూర్తీభవించినట్లుగా మణులు చెక్కిన కాలి అందెలు ఘల్లుఘల్లున మ్రోగుతుండగా తన మనోనాథుడయిన వైకుంఠనాథుని మందిరంలో తన చంచలత్వాన్ని మాని సంచరిస్తూ ఉంటుంది. ఆమె తన చేతిలోని లీలాకమలాన్ని త్రిప్పుతూ ఉండగా ఆమె నీడ ఆ మేడలోని బంగారు పాలరాతి గోడలపై ప్రతిఫలిస్తుంది. అప్పుడది విష్ణుమందిర సమ్మార్జనమే పరమధర్మమని ప్రకటిస్తున్న ట్లుంటుంది. వనంలోని పరిమళాలను వెదజల్లే తులసీదళాలను దండలు కట్టి లక్ష్మీదేవి తన హృదయేశ్వరుని పదకమలాలపై అర్పిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రమవల్ల కలిగిన స్వేద బిందువులవల్ల నుదుటనున్న కస్తూరీ తిలకం కరిగి అంటుకొని కదలుతున్న ముంగురులతో, నువ్వుపువ్వువంటి చక్కదనాల ముక్కుతో ముద్దులు మూటగట్టే ఆమె ముఖపద్మం అక్కడి కోనేటినీటిలో ప్రతిబింబిస్తుంది. అప్పుడు ఆమె నీల మేఘశ్యాముడైన విష్ణువు తన ముఖాన్ని ముద్దాడుతున్నట్లు భ్రమించి సిగ్గుతో తల వంచుకొంటుంది. అటువంటి దిగుడు బావుల చుట్టూ గట్టులపైన పగడాలతీగలు అల్లుకొని ఉంటాయి. ఈ విధంగా ఎంతో హృద్యమైన ఆ ఉద్యానవనం పుణ్యానికి ఆస్థానమై, ధర్మానికి సంస్థానమై, సుకృతాలకు మూలస్థానమై వెలుగొందుతూ ఉంటుంది.