పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నృసింహరూప ఆవిర్భావము

  •  
  •  
  •  

7-285-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.
^సప్త వాయువులు

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దానవ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; పరిగృహ్యమాణ = చేపట్టినట్టి; వైరుండును = విరోధముగలవాడును; వైర = విరోధము యొక్క; అనుబంధ = సంబంధముచేత; జాజ్వల్యమాన = మండుచున్న; రోషా = కోపము యనెడి; అనలుండును = అగ్నిగలవాడు; రోషా = కోపము యనెడి; అనల = అగ్నిచే; జంఘన్యమాన = నశింపజేయబడుతున్న; విజ్ఞాన = వివేకము; వినయుండును = అణకువగలవాడును; వినయ = అణకువ; గాంభీర్య = గాంభీర్యము; ధైర్య = ధైర్యములచే; జేగీయమాన = పొగడబడుచున్న; హృదయుండును = హృదయముగలవాడు; హృదయ = హృదయము యొక్క; చాంచల్యమాన = రేగుచున్న; తామసుండును = తమోగుణముగలవాడును; తామసగుణ = తమోగుణములచేత; చంక్రమ్యమాణ = క్రమ్ముకొనబడిన; స్థైర్యుండున్ = దిట్టదనముగలవాడు; ఐ = అయ్యి; విస్రంభంబునన్ = నమ్మకముతో; హుంకరించి = హుమ్మనియరచి; బాలుని = ప్రహ్లాదుని; ధిక్కరించి = తిరస్కరించి; హరిన్ = విష్ణుని; ఇందున్ = దీనిలో; చూపుము = చూపించుము; అని = అని; కనత్ = మెరుస్తున్న; కనక = బంగారపు; మణి = మణుల; మయ = ఖచితమైన; కంకణ = కంకణముల; క్రేంకార = క్రేంయనెడి; శబ్ద = శబ్దముతో; పూర్వకంబుగా = నిండినదిగా; దిగ్దంతి = దిగ్గజముల; దంత = దంతములను; భేదన = బద్దలుచేయ; పాటవ = సమర్థతగల; ప్రశస్తంబు = ప్రసిద్ధికెక్కినది; అగు = అయిన; హస్తంబునన్ = చేతితో; సభామండప = కొలువుకూటము యొక్క; స్తంభంబున్ = స్తంభమును; వ్రేసినన్ = కొట్టగా; వ్రేటు = దెబ్బ; తోడనన్ = తోటే; దశదిశలనున్ = పదిదిక్కులందును {దశదిశలు - (4) దిక్కులు (4) విదిక్కులు (2) ఊర్ధ్వధోదిక్కులు}; మిడుంగురులు = నిప్పుకణములు; చెదరన్ = చెదురుచు; చిటిలి = చిట్లిపోయి; పెటిలిపడి = పగిలిపోయి; బంభజ్యమానంబు = బ్రద్ధలుకొట్టబడినది; అగు = అయిన; ఆ = ఆ; మహా = పెద్ద; స్తంభంబు = స్తంభము; వలన = వలన; ప్రళయ = ప్రళయ; వేళా = కాలమున; సంభూత = సంభవించెడి; సప్త = ఏడు (7) విధములైన {సప్తస్కంధములు - 1ఆవహము 2ప్రవహము 3సంవహము 4ఉద్వహము 5నివహము 6పరివహము 7పరావహము యనెడి సప్తవిధవాయువులు}; స్కంధ = వాయువులు; బంధుర = నిబిడ, దట్టమైన; సమీరణ = వాయువులచే; సంఘటిత = కూర్చబడిన; ఘోర = భయంకరమైన; జోఘుష్యమాణ = గర్జిల్లుతున్న; మహా = గొప్ప; వలాహక = మేఘముల; వర్గ = సమూహములనుండి; నిర్గత = వెలువడెడి; నిబిడ = దట్టమైన; నిష్ఠుర = కఠినములై; దుస్సహ = సహింపరాని; నిర్ఘాత = పిడుగుల; సంఘ = సమూహములనుండి; నిర్ఘోష = మోతలతో; నికాశంబులు = సమానమైనవి; అయిన = ఐన; ఛటఛట = ఛటఛటమనియెడి; స్ఫటస్ఫట = ఫటఫటమనియెడి; ధ్వని = శబ్దములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; భయంకర = భయంకరమైన; ఆరావ = శబ్దముల; పుంజంబులు = సమూహములు; జంజన్యమానంబులు = ఒకటి వెంట నొకటి పుట్టెడివి; ఐ = అయ్యి; ఎగసి = చెలరేగి; ఆకాశ = ఆకాశముయొక్క; కుహర = గుహ; అంతరాళంబు = లోపలంతయును; నిరవకాశంబు = ఖాళీలే కుండగ; చేసి = చేసి; నిండినన్ = నిండిపోగా; పట్టు = ఊతము; చాలక = సరిపోక; దోధూయమాన = మిక్కిలి చెదరగొట్టబడిన; హృదయంబులు = హదయములు కలవారు; అయి = అయ్యి; పరవశంబులు = స్వాధీనము తప్పినవారు; ఐన = అయిన; పితామహ = బ్రహ్మదేవుడు; మహేంద్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; శిఖి = అగ్ని; ముఖర = ముఖ్యులతోమొదలైన; చరాచర = జంగమ స్థావరములైన; జంతు = జంతువుల; జాలంబుల్ = సమూహముల; తోడన్ = తోటి; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = డిప్ప; పగిలి = పగిలి; పరిస్పోటితంబు = బద్దలు; కాన్ = అగునట్లు; ప్రఫుల్ల = వికసించిన; పద్మ = పద్మముల; యుగళ = జంటకు; సంకాశ = సమానముగా; భాస్వర = ప్రకాశించుచున్నట్టి; చక్ర = చక్రము; చాప = విల్లు; హల = నాగలి; కులిశ = వజ్రము; అంకుశ = అంకుశము; జలచర = చేప వంటి; రేఖ = రేఖల; అంకిత = గుర్తులుకలిగిన; చారు = అందమైన; చరణతలుండును = అరిపాదములుగలవాడు; చరణ = పాదములను; చంక్రమాణ = కదల్చుటమాత్రముననే; ఘన = మిక్కిలి; వినమిత = వంగెడి; విశంభర = విశ్వముయొక్క; భార = బరువు; ధౌరేయ = మోయుచున్న; దిక్కుంభి = దిగ్గజముల; కుంభీనస = ఆదిశేషుడు {కుంభీనసము - విషజ్వాలలుగ్రక్కెడి పాము, ఆదిశేషుడు}; కుంభినీధర = కులపర్వతములు {కుంభినీధరములు - కుంభిని (భూమిని) ధరములు (మోసెడివి), కులపర్వతములు}; కూర్మ = ఆదికూర్మము; కుల = సమూహముచే; శేఖరుండును = విలసిల్లెడివాడును; దుగ్ధజలధిజాతశుండాల = ఐరావతము యొక్క {దుగ్ధజలధిజాతశుండాలము - దుగ్ధజలధిన్ (పాలసముద్రమునందు) జాత (పుట్టిన) శుండాలము (ఏనుగు), ఐరావతము}; శుండాదండ = తొండమువలె; మండిత = మెరయుచున్న; ప్రకాండ = మధ్యభాగముల; ప్రచండ = ఉగ్రములైన; మహా = గొప్ప; ఊరు = తొడలు యనెడి; స్తంభ = స్తంభముల; యుగళుండును = జంటగలవాడును; ఘణఘణాయమాన = ఘణఘణ యనుచున్న; మణి = రత్నపు; కింకిణీ = గజ్జెల; గణ = సమూహములు; ముఖరిత = మొదలగువానితోను; మేఖలా = మొలతాళ్ళ, వడ్డాణముల; వలయ = చుట్టలతో; వలయిత = కట్టబడిన; పీతాంబర = పట్టుబట్టలతో; శోభిత = శోభిల్లుతున్న; కటిప్రదేశుండును = మొలభాగముగలవాడు; నిర్ఝర = ఆకాశగంగనదియందలి; నిమ్నక = లోతైన; ఆవర్త = సుడిగుండమువలె; వర్తుల = గుండ్రటి; కమలాకర = సరోవరమువలె; గంభీర = గంభీరమైనట్టి; నాభివివరుండును = బొడ్డురంధ్రముగలవాడును; ముష్టి = పిడికిట; పరిమేయ = ఇమడ్చదగినదని; వినుత = పొగడదగిన; తనుతర = మిక్కిలి సన్నని {తను - తనుతర - తనుతమ}; స్నిగ్ద = నున్నని; మధ్యుండును = నడుముగలవాడును; కులాచల = కులగిరుల; సానుభాగ = చరియలప్రదశములతో; సదృశ = సమానమైన; కర్కశ = కఠినమైన; విశాల = వెడల్పుగల; వక్షుండును = వక్షస్థలముగలవాడు; దుర్జన = చెడ్డవారైన; దనుజ = రాక్షస; భట = భటులయొక్క; ధైర్య = ధైర్యములు పాలిటి; లవిత్రాయమాణ = కొడవళ్ళవంటివి; రక్షోరాజ = హిరణ్యకశిపుని; వక్షోభాగ = వక్షస్థలము యనెడి; విశంకట = విస్తారమైన; క్షేత్ర = భూమిని; విలేఖన = పగులదున్నుటయందు; చాంగ = మిక్కిలినేర్పుగల; లాంగలాయమాన = నాగళ్ళవంటివి; ప్రతాప = శౌర్యము యనెడి; జ్వల = అగ్ని; జ్వాలాయమాన = మంటలవలెనున్నవి; శరణు = శరణముకోరి; ఆగత = వచ్చిన; నయన = చూపులనెడి; చకోర = చకోరపక్షులకు; చంద్ర = చంద్రుని; రేఖాయమాణ = వెన్నెలవంటివి; వజ్రాయుధ = వజ్రాయుధమునకు; ప్రతిమాన = ఎదరించగల; భాసమాన = ప్రకాశవంతమైన; నిశాతన = మిక్కిలిపదునైన; ఖరతర = మిక్కిలగట్టివియైన {ఖరము - ఖరతరము - ఖరతమము}; ముఖ = కొనలుగల; నఖరుండును = గోళ్ళుగలవాడును; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; ఖడ్గ = కత్తి; కుంత = కుంతము, ఈటె; తోమర = తోమరము, చర్నాకోల; ప్రముఖ = మొదలైన; నానా = పలువిధములై; ఆయుధ = ఆయుధములచేత; మహిత = ఒప్పుచున్న; మహా = గొప్ప; ఉత్తుంగ = ఎత్తైన; మహీధర = కొండ; శృంగ = శిఖరముల; సన్నిభ = సరిపోలెడివి; వీర = వీరరసపు; సాగర = సముద్రము; వేలాయమాన = చెలియలికట్టలవంటివైన; మాలికా = పూదండలతో; విరాజమాన = విలసిల్లుతున్నవి; నిరర్గళ = అడ్డులేని; అనేకశత = వందలకొలది; భుజార్గళుండును = బాహుదండములుగలవాడును; మంజు = సొగసైన; మంజీర = అందెలు; మణి = మణుల; పుంజ = సమూహముచే; రంజిత = అలంకరింపబడిన; మంజుల = చక్కనైన; హార = హారములు; కేయూర = భుజకీర్తులు; కంకణ = కంకణములు; కిరీట = కిరీటములు; మకరకుండలు = చెవికుండలములు {మకరకుండలములు - మొసలినోరు వలె జేయబడిన చెవియాభరణములు}; ఆది = మొదలగు; భూషణ = ఆభరణములచే; భూషితుండును = అలంకరింపబడినవాడు; త్రివళీ = మూడురేఖలతో; యుత = కూడి; శిఖరి = కొండ; శిఖర = శిఖరముల; అభ = వంటి; పరిణద్ధ = కట్టుబడితో; బంధుర = చక్కటి; కంధరుండును = మెడకలవాడు; ప్రకంపన = హోరు గాలికి; కంపిత = కదలెడి; పారిజాత = పారిజాత; పాదప = వృక్షముయొక్క; పల్లవ = చిగురుటాకుల; ప్రతీకాశ = పోలిన; కోప = క్రోధము యొక్క; ఆవేశ = ఆవేశమువలన; సంచలిత = వణకుచున్న; అధరుండును = క్రిందిపెదవిగలవాడును; శరత్కాల = శరదృతువునందలి; మేఘ = మబ్బుల; జాల = గుంపు; మధ్య = నడుమ; ధగధగాయమాన = ధగధగలాడుతున్న; తటిల్లతా = మెరపులతో; సమాన = సమానముగా; దేదీప్యమాన = ప్రకాశించుతున్న; దంష్ట్రా = దంతముల; అంకురుండును = మొలకలుగలవాడును; కల్పాంతకాల = ప్రళయసమయపు; సకల = సమస్తమైన; భువన = లోకములను; గ్రసన = మింగెడు; విజృంభమాణ = వేడుకతోరేగుతున్న; సప్తజిహ్వ = ఏడు (7)నాలుకల కాలాగ్ని {అగ్నియొక్క సప్తజిహ్వలు - 1కాళి 2కరాళి 3విస్ఫులింగిని 4ధూమ్రవర్ణ 5విశ్వరుచి 6లోహిత 7మనోజవ}; జిహ్వా = నాలుకలతో; తులిత = తులతూగెడి; తరళతరాయమాణ = మిక్కిలితెల్లనైన {తరళము - తరళతరము - తరళతమము}; విభ్రాజమాన = మెరయుచున్న; జిహ్వుండును = నాలుకగలవాడు; మేరుమందర = మేరుపర్వతముయొక్క; మహా = గొప్ప; గుహా = గుహల; అంతరాళ = లోనుండెడి; విస్తార = విశాలమైన; విపుల = పెద్ద; వక్త్ర = నోరు; నాసికా = ముక్కు; రంధ్రుండును = రంధ్రములుగలవాడు; నాసికా = ముక్కు; రంధ్ర = రంధ్రములనుండి; నిస్సరన్ = వెడలుచున్న; నిబిడ = దట్టమైన; నిశ్వాస = ప్రాణవాయువుల; నికర = సమూహముల; సంఘట్టన = తాకుడుచే; సంక్షోభిత = కలచబడి; సంతప్యమాన = కాచబడుతున్న; సప్తసాగరుండును = సప్తసాగరములుగలవాడు; పూర్వ = తూరపు; పర్వత = కొండమీద; విద్యోతమాన = వెలుగుచున్న; ఖద్యోత = సూర్య; మండల = మండల; సదృక్ష = సమానమైన; సమంచిత = అందమైన; లోచనుండును = కన్నులుగలవాడును; లోచనా = కన్నుల; అంచల = కొనలనుండి; సముత్కీర్యమాణ = మిక్కిలిరాల్చబడుతున్న; విలోల = చలించుచున్న; కీలా = మంటలచే; ఆభీల = భయంకరమైన; విస్ఫులింగ = అగ్నికణముల; వితాన = సమూహములచేత; రుధ్యమాన = అడ్డుపెట్టబడిన; తారకా = నక్షత్రములు; గ్రహమండలుండును = గ్రహమండలములుగలవాడును; శక్రచాప = ఇంద్రధనుస్సు వలె; సురుచిర = మనోజ్ఞమైన; అదభ్ర = విస్తారమైన; మహా = పెద్ద; భ్రూ = భ్రుకుటి యనెడి; లతా = తీగలు; బంధబంధుర = ముడిపడిన; భయంకర = భయంకరమైన; వదనుండును = మోముగలవాడును; ఘనతర = మిక్కిలిపెద్ద; గండశైల = కొండరాళ్ళ; తుల్య = సమానమైన; కమనీయ = అందమైన; గండభాగుండును = చెక్కిళ్ళుగలవాడును; సంధ్యా = సంధ్యకాలమందలి; రాగ = రంగుగల; రక్త = రక్తపు; ధారా = ధారలను; ధర = కలిగిన; మాలికా = మాలల; ప్రతిమ = సాటియైన; మహా = గొప్ప; అభ్రంకష = మేఘములనొరుయుచున్న; తంతన్యమాన = వెల్లివిరుస్తున్న; పటుతర = స్ఫుటమైన; సటా = జటల, జూలు; జాలుండును = సమూహములుగలవాడు; సటాజాల = జూలు; సంచాల = జాడించుటచే; సంజాత = పుట్టిన; వాత = గాడ్పులచే; డోలాయమాన = ఊగిపోతున్న; వైమానిక = విమానములలోతిరిగెడివారి; విమానుండును = విమానములుగలవాడు; నిష్కంపిత = చలించని; శంఖ = శంఖముల; వర్ణ = వంటి; మహా = పెద్ద; ఊర్ధ్వ = పొడుగుగానున్న; కర్ణుండును = చెవులుగలవాడును; మంథదండాయమాన = కవ్వపుకఱ్ఱగానైన; మందర = మందర యనెడి; వసుంధరాధర = పర్వతము {వసుంధరాదరము - వసుంధర (భూ మిని) ధర (ధరించెడిది),పర్వతము}; పరిభ్రమణ = తిరిగెడి; వేగ = వేగమువలన, వడివలన; సముత్పద్యమాన = ఎక్కువగాపుట్టుచున్న; వియన్మండల = ఆకాశమున; మండిత = అలంకరింపబడిన; సుధారాశి = పాలసముద్రపు; కల్లోల = తరంగములయొక్క; శీకార = తుంపురుల; ఆకార = వలె; భాసుర = ప్రకాశించుచున్న; కేసరుండును = వెంట్రుకలుగలవాడు; పర్వా = పున్నమినాటి; అఖర్వ = విస్తారమైన; శిశిరకిరణ = చంద్రుని {శిశిరకిరణుడు - శిశిర(చల్లని) కిరణుడు (కిరణములుగలవాడు), చంద్రుడు}; మయూఖ = కిరణములవలె; గౌర = తెల్లని; తనూరుహుండును = జూలుగలవాడును; నిజ = తన; గర్జా = గర్జన; నినద = ధ్వనులచే; నిర్దళిత = చీల్చివేయబడిన; కుముద = కుముద; సుప్రతీక = సుప్రతీక; వామన = వామన; ఐరావణ = ఐరావణ; సార్వభౌమ = సార్వభౌమ; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; దిగిభ = దిగ్గజ {దిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము}; రాజ = శ్రేష్ఠముల; కర్ణ = చెవి; కోటరుండును = రంధ్రములుగలవాడు; ధవళధరాధర = కైలాసపర్వతమంత {ధవళధరాధరము - ధవళ (తెల్లని) ధరాధరము (పర్వతము), కైలాసపర్వతము}; దీర్ఘ = పొడవైన; దురవలోకనీయ = చూడనలవిగాని; దేహుండును = దేహముగలవాడు; దేహ = శరీరముయొక్క; ప్రభా = తేజస్సు; పటల = తిలకము, శ్రేష్ఠముచే; నిర్మధ్యమాన = కలచబడిన; పరిపంథి = శత్రువులైన; యాతుధాన = రాక్షస భేదము; నికురంబ = సమూహముల; గర్వ = గర్వమనెడి; అంధకారుండును = చీకటిగలవాడు; ప్రహ్లాద = ప్రహ్లాదుని; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; రంజన = సంతోషింపజేయుట; భంజన = సంహరించుట; నిమిత్త = కొరకైన; అంతరంగ = లోపల; బహిరంగ = వెలుపల; జేగీయమాన = మిక్కిలి స్తుతింపబడు; కరుణా = కరుణారసము; వీరరస = వీరరసములతో; సంయుతుండును = కూడినవాడును; మహా = గొప్ప; ప్రభావుండును = మహిమాన్వితుండు; అయిన = ఐన; శ్రీ = శుభకరుడైన; నృసింహ = నరసింహ; దేవుండు = దేవుడు; ఆవిర్భవించినన్ = అవతరించగా, పుట్టగా; కనుంగొని = చూసి;

భావము:

హిరణ్యకశిపుడు అలా శ్రీమహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగభగమండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము, అణుకువలను కాల్చివేశాయి. ధైర్యగాంభీర్యాల వలన అతని హృదయం ధగ ధగ మెరిసింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతట పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి “దీనిలో హరిని చూపించరా” అనంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పది దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడివలన ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ ఛటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. మనోజ్ఞమైన విస్తారమైన ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం ఇంద్రుని ధనుస్సు వలె భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి.శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీర తేజోశ్రేష్ఠము శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నది. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ, హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.