పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

  •  
  •  
  •  

9-572-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి విడిచి చనిన నయ్యజవల్లభుండు సురతపరతంత్రుండై, మిసిమిసి యను శబ్దంబుచేయుచుఁ, దచ్ఛాగి వెంటంజని, యొడంబఱుపంజాలకుండె; నంత దానికిఁ గర్త యైన బ్రాహ్మణుండు రోషంబున రతిసమర్థంబు గాకుండ నల్లాడుచుండ ఛాగవృషణంబులు ద్రెంచివేసిన, నచ్ఛాగంబు గ్రిందఁబడి వేడుకొనినఁ, బ్రయోజనంబు పొడగని యోగవిదుండు గావున బ్రాహ్మణోత్తముండు గ్రమ్మఱ నయ్యజవృషణంబులు సంధించిన.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; విడిచి = వదలిపెట్టి; చనినన్ = వెళ్ళిపోగా; ఆ = ఆ; అజవల్లభుండు = మేకపోతు; సురత = రతిసుఖమునకై; పరతంత్రుడు = వివశుడు; ఐ = అయ్యి; మిసిమిసి = మే మే; అను = అనెడి; శబ్దంబున్ = అరుపులు; చేయుచున్ = చేస్తూ; తత్ = ఆ; ఛాగి = పెంటిమేక; వెంటన్ = కూడ; చని = వెళ్ళి; ఒడంబఱపన్ = ఒప్పించుటకు; చాలకుండెన్ = సమర్థుడుకాకుండెను; అంతన్ = అంతట; దాని = ఆపెంటి; కిన్ = కి; కర్త = ఉనికికారణమైనవాడు; ఐన = అయిన; బ్రాహ్మణుండు = బ్రాహ్మణుడు; రోషంబునన్ = కోపముతో; రతి = సురతక్రియకు; సమర్థంబుకాకుండన్ = పనికిరాకుండ; అల్లాడుచుండన్ = అల్లాడిపోవునట్లు; ఛాగ = పోతుమేక; వృషణంబులున్ = అండకోశమును; త్రెంచివేసినన్ = కోసేయగా; ఆ = ఆ; ఛాగంబున్ = మేకపోతు; క్రిందపడి = నేలపైపడి; వేడుకొనినన్ = ప్రార్థించగా; ప్రయోజనంబు = పర్యవసానములు; పొడగని = ఊహించి; యోగ = యోగము; విదుండు = తెలిసినవాడు; కావునన్ = కనుక; బ్రాహ్మణ = విప్రులలో; ఉత్తముడు = శ్రేష్ఠుడు; క్రమ్మఱన్ = తిరిగి; ఆ = ఆ; అజ = మేకపోతు; వృషణంబులున్ = అండకోశమును; సంధించిన = తగిలించెను.

భావము:

అలా అనుకుని వదలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మేకపోతు రతివివశత్వంతో, మే మే అని అరుస్తూ, ఆ పెంటిమేక వెంట పరుగెత్తింది. ఎంత ప్రయత్నించినా పెంటిని ఒప్పించ లేకపోయింది. అంతట ఆపెంటి యజమాని అయిన బ్రాహ్మణుడు కోపంతో రతిక్రియకు పనికిరాకుండ అల్లాడేలా పోతుమేక వృషణాలు కోసేసాడు. ఆ మేకపోతు క్రిందపడి ప్రార్థించగా పర్యవసానం గ్రహించి యోగము తెలిసిన ఆ విప్రశ్రేష్ఠుడు ఆ మేకపోతుకు వృషణాలు తిరిగి తగిలించాడు.