పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : విశ్వామిత్రుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-497-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికె; నట్లు శునశ్శేఫుండు దేవతలచేత విడివడుటం జేసి దేవరాతుండయ్యె; మధుచ్ఛందుండు మొదలయిన యేఁబండ్రు నా దేవరాతునకుఁ దమ్ములైరి పెద్దలయిన యష్టక, హారీత, జయంత సుమదాదు లేఁబండ్రును వేఱై చనిరి; ఈ క్రమంబున విశ్వామిత్రు కొడుకులు రెండు విధంబులయినం, బ్రవరాంతంబు గలిగె” నని చెప్పి శుకుం డిట్లనియె “నా పురూరవు కొడుకగు నాయువునకు నహుషుండును, క్షత్త్రవృద్దుండును, రజియును, రంభుండును, ననేనసుండును ననువారు పుట్టి; రందు క్షత్త్రవృద్ధునకుఁ గుమారుండగు సుహోత్రునకుఁ గాశ్యుండుఁ గుశుఁడు గృత్స్నమదుండు నన ముగ్గురు గలిగి; రా కృత్స్నమదునకు శునకుండును, శునకునకు శౌనకుండును, నమ్మహాత్మునికి బహ్వృచప్రవరుండును జన్మించి; రా బహ్వృచప్రవరుండు దపోనియతుండై చనియె; కాశ్యునకుఁ గాశియుఁ గాశికి రాష్ట్రుండును, రాష్ట్రునకు దీర్ఘతపుండును జనించిరి.

టీకా:

అని = అని; పలికెన్ = చెప్పెను; అట్లు = ఆ విధముగ; శునశ్సేపుండు = శునశ్సేపుడు; దేవతలు = దేవతలు; చేతన్ = చేత; విడివడుటన్ = విడిపింపబడుట; చేసి = వలన; దేవరాతుండు = దేవరాతుడు; అయ్యెన్ = అయ్యెను; మధుచ్ఛదుండు = మధుచ్ఛదుడు; మొదలయిన = మున్నగు; ఏబండ్రున్ = ఏభైమంది (5); ఆ = ఆ; దేవరాతున్ = దేవరాతుని; కున్ = కి; తమ్ములున్ = తమ్ముళ్ళు; ఐరి = అయ్యిరి; పెద్దలు = పెద్దవాళ్ళు; ఐన = అయినట్టి; అష్టక = అష్టకుడు; హారిత = హారితుడు; జయంత = జయంతుడు; సుమద = సుమదుడు; ఆదులు = మున్నగువారు; ఏబండ్రును = ఏభైమంది (5); వేఱై = విడిపోయి; చనిరి = వెళ్ళిపోయిరి; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగ; విశ్వామిత్రు = విశ్వామిత్రుని; కొడుకులున్ = పుత్రులు; రెండు = రెండు (2); విధంబులు = తెగలుగ; అయినన్ = కాగా; ప్రవర = గోత్రమునందు; భేదంబున్ = రకములు; కలిగెను = ఏర్పడినవి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ఆ = ఆ; పురూరవు = పురూరవుని; కొడుకు = పుత్రుడు; అగున్ = అయిన; ఆయువున్ = ఆయువున; కున్ = కు; నహుషుండునున్ = నహుషుడు; క్షత్రవృద్ధుండునున్ = క్షత్రవృద్దుడు; రజియునున్ = రజి; రంభుండునున్ = రంభుడు; అనేనసుండు = అనేనసుడు; అను = అనెడి; వారున్ = వారు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; క్షత్రవృద్దున్ = క్షత్రవృద్దున; కున్ = కు; కుమారుండు = పుత్రుడు; అగు = ఐన; సుహోత్రున్ = సుహోత్రున; కున్ = కు; కాశ్యుండును = కాశ్యుడు; కుశుడు = కుశుడు; కృత్స్నమదుండున్ = కృత్స్నమదుడు; అనన్ = అనెడి; ముగ్గురు = ముగ్గురు (3); కలిగిరి = పుట్టరి; ఆ = ఆ; కృత్స్నమదున్ = కృత్స్నమదున; కున్ = కు; శునకుండును = శునకుడు; శునకున్ = శునకున్; కున్ = కు; శౌనకుండును = శౌనకుడు; ఆ = ఆ; మహాత్ముని = మహాత్ముని; కిన్ = కి; బహ్వృచప్రవరుండును = బహ్వృచప్రవరుడు; జన్మించిరి = పుట్టిరి; ఆ = ఆ; బహ్వృచప్రవరుండు = బహ్వృచప్రవరుడు; తపస్ = తపస్సు చేయుటందు; నియతుండు = కట్టుబడినవాడు; ఐ = అయ్యి; చనియె = వెళ్ళిపోయెను; కాశ్యున్ = కాశ్యున; కున్ = కు; కాశియున్ = కాశి; కాశి = కాశి; కిన్ = కి; రాష్ట్రుండును = రాష్ట్రుడు; రాష్ట్రున్ = రాష్ట్రున; కున్ = కు; దీర్ఘతపుండును = దీర్ఘతపుడు; జనించిరి = పుట్టిరి.

భావము:

అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ విధంగ శునశ్సేపుడు దేవతలు చేత విడిపింపబడుట వలన దేవరాతుడు అని పేరు పొందాడు. మధుచ్ఛదుడు మున్నగు ఏభైమంది ఆ దేవరాతునికి తమ్ముళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అయిన అష్టకుడు, హారితుడు, జయంతుడు, సుమదుడు మున్నగువారు ఏభైమంది విడిపోయి వెళ్ళిపోయారు. అలా విశ్వామిత్రుని పుత్రులు రెండు తెగలుగా కాగా గోత్రభేదం కలిగింది.” అని చెప్పి శుకుడు మరల ఇలా చెప్పాడు. “ఆ పురూరవుని పుత్రుడైన ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్దుడు, రజి, రంభుడు, అనేనసుడు జన్మించారు. వారిలో క్షత్రవృద్దునకు సుహోత్రుడు; సుహోత్రునకు కాశ్యుడు, కుశుడు, కృత్స్నమదుడు అని ముగ్గురు పుట్టారు. ఆ కృత్స్నమదునకు శునకుడు; శునకునకు శౌనకుడు; ఆ మహాత్మునికి బహ్వృచప్రవరుడు పుట్టారు. ఆ బహ్వృచప్రవరుడు తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయాడు. కాశ్యునకు కాశి; కాశికి రాష్ట్రుడు; రాష్ట్రునకు దీర్ఘతపుడు పుట్టారు.