పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-449-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు, సంతతి లేక అతి దుఃఖమానసుండయిన యా నరేంద్రుని మందిరంబున కంగిరస మహాముని వచ్చి, యతనిచేత నతిధి సత్కారంబులు బడసి, కుశలం బడిగి "రాజ్యంబు భవద ధీనంబ కదా! పృథి వ్యప్తేజో వాయ్వాకాశ మహదహంకారంబు లనియెడి యేడింటిచేత రక్షింపంబడ్డ జీవుండునుం బోలె నమాత్య జనపద దుర్గ ద్రవిణ సంచయ దండ మిత్రంబు లనెడి సప్తప్రకృతులచేత రక్షితుండ వై, ప్రకృతి పురుషుల యందు భారంబు పెట్టి, రాజ్యసుఖంబు లనుభవింతువు గదా? మఱియు దార ప్రజా మాత్య భృత్య మంత్రి పౌర జానపద భూపాలురు నీకు వశవర్తులుగదా? సర్వంబునుం గలిఁగి సార్వభౌముండ వైన నీ వదనంబున విన్నఁదనంబు గలిగి యున్నయది; కతంబేమి?"యనిన నా మునిప్రవరునకు నతం డిట్లనియె; “మీ తపోబలంబున మీకు నెఱుంగరాని యదియుం గలదే?” యని తలవంచి యూరకున్న, నతని యభిప్రాయం బెఱింగి యా భగవంతుం డైన యంగిరసుండు దయాళుండై, పుత్రకామేష్టి వ్రేల్చి యజ్ఞశేషం బతని యగ్ర మహిషి యయిన కృతద్యుతి కిచ్చి "నీకుం బుత్రుండు గలిగెడి, నతని వలన సుఖదుఃఖంబు లనుభవింపగల"వని చెప్పి యమ్మహాత్ముండు చనియె; నా కృతద్యుతి యనుదేవి గర్భంబు ధరియించి, నవమాసంబులు నిండినం గుమారునిం గనియె; నా కాలంబున రాజును, సమస్త భృత్యామాత్య జనంబులుఁ బరమానందంబుఁ బొంది; రపుడు చిత్రకేతుండు కృతస్నానుండై, సకల భూషణ భూషితుండై, సుతునకు జాతకర్మంబు నిర్వర్తించి, బ్రాహ్మణులకు నపరిమిత హిరణ్య రజత దానంబులును, వస్త్రాభరణంబులును, గ్రామంబులును, గజంబులును, వాహనంబులును, ధేనువులును నాఱేసి యర్బుదంబుల ద్రవ్యంబును దానంబు చేసి, ప్రాణిసముదాయంబునకుం బర్జన్యుండునుం బోలెఁ దక్కిన వారలకు నిష్ఠకామంబులు వర్షించి, పరమానంద హృదయుండై యుండెఁ; గుమారుండును మాతృపితృ జనంబులకు సంతోషము చేయుచు, దినదినప్రవర్ధమానుండై పెరుగుచుండె; నంతం బుత్రమోహంబునం గృతద్యుతి యందు బద్ధానురాగుండై మహీధవుండు వర్తించుచుండం; దక్కిన భార్యలు సంతాన సంతోష వికలలై, యీ మోహంబునకుం గారణంబు పుత్రుండ యని యీర్ష్యం జేసి, దారుణ చిత్తలై, కుమారునకు విషం బిడిన సుఖనిద్రితుండునుం బోలె బాలుండు మృతి బొందె; నప్పుడు వేగుటయు దాది బోధింపం జని యా కుమారుని వికృతాకారంబుఁ జూచి, విస్మయ శోకభయార్త యై పుడమింబడి యాక్రందించె; నప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సంతతి = సంతానము; లేక = లేకపోవుటచే; అతి = మిక్కిలి; దుఃఖ = దుఃఖమును చెందిన; మానసుండు = మనసు గలవాడు; అయిన = ఐనట్టి; ఆ = ఆ; నరేంద్రుని = రాజు చిత్రకేతుని {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు (ప్రభువు), రాడు}; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; అంగిరస = అంగిరసుడు యనెడి; మహా = గొప్ప; ముని = ముని; వచ్చి = వచ్చి; అతని = అతని; చేతన్ = వలన; అతిథి = అతిథికి చేసెడి; సత్కారములు = గౌరవ మర్యాదలు; పడసి = పొంది; కుశలంబున్ = క్షేమసమాచారములు; అడిగి = అడిగి; రాజ్యంబున్ = రాజ్యాధికారము; భవత్ = నీ యొక్క; అధీనంబు = ఆధీనములో నున్నది; కదా = కదా; పృథ్వి = భూమి; అప్ = నీరు; తేజస్ = కాంతి; వాయుః = గాలి; ఆకాశ = ఆకాశము; మహత్ = మహతత్త్వము; అహంకారంబులు = అహంకారములు; అనియెడి = అనెడి; ఏడింటి = ఏడింటి (7) {సప్తప్రకృతులు - 1పృథివి 2అప్పు 3తేజస్ 4వాయుః 5ఆకాశః 6మహత్ 7అహంకారములు}; చేతన్ = వలన; రక్షింపంబడ్డ = పాలింపబడెడి; జీవుండునున్ = మానవుని; పోలెన్ = వలె; అమాత్య = అమాత్యులు; జనపద = ఊళ్ళు; దుర్గ = కోటలు; ద్రవిణ = ధనము; సంచయ = వస్తు సంపదలు; దండ = దండనము; మిత్రంబులు = స్నేహములు; అనెడి = అనెడి; సప్త = ఏడు (7) {సప్తప్రకృతులు - 1అమాత్యులు 2జనపద 3దుర్గ 4ద్రవిణ 5సంచయ 6దండ 7మిత్రములు}; ప్రకృతుల్ = ప్రకృతుల; చేతన్ = వలన; రక్షితుండవు = కాపాడబడెడి వాడవు; ఐ = అయ్యి; ప్రకృతి = ప్రకృతి; పురుషుల = పురుషుల; అందున్ = అందు; భారంబున్ = బాధ్యతలను; పెట్టి = అప్పగించి; రాజ్య = రాజ్యాధికారమువలన కలిగెడి; సుఖంబులన్ = సౌఖ్యములను; అనుభవింతువు = అనుభవించు తుంటివి; కదా = కదా; మఱియున్ = ఇంకను; దార = భార్యలు; ప్రజ = ప్రజలు; అమాత్య = పురోహితులు; భృత్య = సేవకులు; మంత్రి = మంత్రులు; పౌర = పౌరులు; జానపద = ఊళ్ళు; భూపాలురు = సామంతులు; నీ = నీ; కున్ = కు; వశవర్తులు = వశములో తిరిగెడివారు; కదా = కదా; సర్వంబు = సమస్తమును; కలిగి = ఉన్నను; సార్వభౌముండవు = చక్రవర్తివి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; వదనంబునన్ = ముఖమున; విన్నదనంబు = చిన్నబోవుట; కలిగి = కలిగి; ఉన్నయది = ఉన్నది; కతంబు = కారణము; ఏమి = ఎందులకు; అనినన్ = అనగా; ముని = మునులలో; ప్రవరున్ = ఉత్తమున; కున్ = కు; అతండు = అతడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మీ = మీ యొక్క; తపస్ = తపస్సు యొక్క; బలంబునన్ = బలమున; మీ = మీ; కున్ = మీకు; ఎఱుంగరాని = తెలియని; అదియున్ = అట్టిది; కలదే = ఉన్నదా ఏమి; అని = అని; తలవంచి = తలవంచుకొని; ఊరకున్న = ఊరకుండగా; అతని = అతని; అభిప్రాయంబున్ = ఉద్దేశ్యము; ఎఱింగి = తెలిసి; ఆ = ఆ; భగవంతుండు = మహిమాన్వితుండు; ఐన = అయినట్టి; అంగిరసుండు = అంగిరసుడు; దయాళుండు = కృపామయుడు; ఐ = అయ్యి; పుత్రకామేష్టి = పుత్రకామేష్టి అనెడి యాగము; వ్రేల్చి = నిర్వహించి; యజ్ఞశేషంబు = యజ్ఞప్రసాదము; అతని = అతని యొక్క; అగ్ర = పెద్ద; మహిషి = భార్య; అయిన = ఐనట్టి; కృతద్యుతి = కృతద్యుతి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; నీ = నీ; కున్ = కు; పుత్రుండు = కుమారుడు; కలిగెడిన్ = కలుగును; అతని = అతని; వలన = మూలమున; సుఖ = సుఖములు; దుఃఖంబులన్ = దుఃఖములను; అనుభవింపగలవు = అనుభవించెదవు; అని = అని; చెప్పి = చెప్పి; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; చనియె = వెళ్ళను; ఆ = ఆ; కృతద్యుతి = కృతద్యుతి; అను = అనెడి; దేవి = స్త్రీ; గర్భంబున్ = గర్భమును; ధరియించి = ధరించి; నవ = తొమ్మిది (9); మాసంబులున్ = నెలలు; నిండినన్ = నిండగా; కుమారునిన్ = పుత్రునికి; కనియెన్ = జన్మనిచ్చెను; ఆ = ఆ; కాలంబునన్ = సమయములో; రాజునున్ = రాజు; సమస్త = సమస్తమైన; భృత్య = సేవకులు; అమాత్య = పురోహితులు; జనంబులున్ = ప్రజలు; పరమానందంబున్ = మిక్కిలి ఆనందమును; పొందిరి = పొందిరి; అపుడు = అప్పుడు; చిత్రకేతుండు = చిత్రకేతుడు; కృతస్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; భూషణ = అలంకారములతోను; భూషితుండు = అలంకరింపబడినవాడు; ఐ = అయ్యి; సుతున్ = పుత్రున; కున్ = కు; జాతకర్మంబు = పుట్టినప్పుడు చేసెడి క్రియ {షోడశకర్మలు - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాసనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తనము 15వివాహము 16అంత్యకర్మము}; నిర్వర్తించి = చేయించి; బ్రాహ్మణుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; అపరిమిత = లెక్కలేనంత; హిరణ్య = బంగారము; రజత = వెండి; దానంబులునున్ = దానములు; వస్త్ర = బట్టలు; ఆభరణంబులును = భూషణములు; గ్రామంబులునున్ = ఊళ్లు; గజంబులునున్ = ఏనుగులు; వాహనంబులునున్ = వాహనములు; ధేనువులునున్ = గోవులు; ఆఱేసి = ఆరేసి (6) చొప్పున; అర్బుదంబులు = వేయికోట్ల (1 తరువాత 10 సున్నాలు); ద్రవ్యంబును = ధనమును; దానంబుచేసి = దానముగా ఇచ్చి; ప్రాణి = జీవ; సముదాయంబున్ = జాలమున; కున్ = కు; పర్జన్యుండును = వర్షాధిదేవత, మేఘుడు; పోలెన్ = వలె; తక్కిన = మిగిలిన; వారల్ = వారి; కున్ = కిని; ఇష్ట = కోరిన; కామంబులున్ = కోరికలను; వర్షించి = ఎక్కువగా యిచ్చి; పరమానందంబున్ = మిక్కిలి ఆనందమును చెందిన; హృదయుండు = హృదయము గలవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; కుమారుండును = పుత్రుడు కూడ; మాతృ = తల్లి; పితృ = తండ్రి; జనంబుల్ = ప్రజల; కున్ = కు; సంతోషము = సంతోషమును; చేయుచున్ = కలుగజేయుచు; దినదిన = దినమువారి; ప్రవర్థమానుండు = వృద్ధి పొందుతున్నవాడు; ఐ = అయ్యి; పెరుగుచుండెన్ = పెరుగుచుండెను; అంతన్ = అంతట; పుత్ర = కొడుకు నందలి; మోహంబునన్ = మోహమువలన; కృతద్యుతి = కృతద్యుతి; అందున్ = ఎడల; బద్ధానురాగుండు = మిక్కిలి ప్రేమ గలవాడు; ఐ = అయ్యి; మహీధవుండు = రాజు చిత్రకేతువు {మహీధవుడు - మహి (భూమికి) ధవుడు (ప్రభువు), రాజు}; వర్తించుచుండన్ = తిరుగుతుండగా; తక్కిన = మిగిలిన; భార్యలున్ = భార్యలు; సంతాన = సంతాన ముండుట వలని; సంతోష = సంతోషము; వికలలు = విచ్ఛేదము చెందినవారు; ఐ = అయ్యి; ఈ = ఈ; మోహంబున్ = మోహము; కున్ = కు; కారణంబున్ = మూలము; పుత్రుండ = కుమారుడే; అని = అని; ఈర్ష్యన్ = ఈర్ష్య; చేసి = వలన; దారుణ = భయంకరమైన; చిత్తలు = మనసులు గలవారు; ఐ = అయ్యి; కుమారున్ = పుత్రుని; కున్ = కి; విషంబున్ = విషమునప; ఇడినన్ = ఇవ్వగా; సుఖ = సుఖముగ; నిద్రితుండునున్ = నిద్రించెడివాని; పోలెన్ = వలె; బాలుండు = పిల్లవాడు; మృతిన్ = మరణమును; పొందెన్ = పొందెను; అప్పుడు = అప్పుడు; వేగుటయున్ = తెల్లవారుతుండగా; దాది = సేవకురాలు; బోధింపన్ = నిద్రలేపుటకు; చని = వెళ్ళి; ఆ = ఆ; కుమారునిన్ = పుత్రుని; వికృత = వికృతమైన; ఆకారంబున్ = స్వరూపమును; చూచి = చూసి; విస్మయ = ఆశ్చర్యము; శోక = దుఃఖము; భయ = భయము; ఆర్త = బాధలు కలది; ఐ = అయ్యి; పుడమిన్ = నేలపై; పడి = పడిపోయి; ఆక్రందించెన్ = ఏడ్చెను; అప్పుడు = అప్పుడు.

భావము:

ఈ విధంగా సంతానం లేక మిక్కిలి చింతాక్రాంతుడై ఉన్న ఆ రాజు చిత్రకేతుడు మందిరానికి ఒకనాడు అంగిరసుడనే మహాముని వచ్చాడు. చిత్రకేతుడు అతనికి అర్ఘ్య పాద్యాదులతో అతిథి సత్కార్యాలు చేసాడు. ఆ మునీంద్రుడు రాజును కుశలం అడుగుతూ ఇలా అన్నాడు “రాజా! నీ రాజ్యమంతా నీ అధీనంలో ఉన్నది కదా! పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం అనే ఏడింటి చేత జీవుడు రక్షింపబడుతున్నట్లు ప్రభువైన నీవు అమాత్యులు, జానపదులు, దుర్గం, కోశం, వస్తుసంపద, దండనం, మిత్రులు అనే సప్తాంగాల చేత సురక్షితంగా ఉన్నావు కదా! నీ రాజ్యభారాన్ని నీ మంత్రులపై ఉంచి నీవు రాజభోగాలను అనుభవిస్తున్నావు కదా! నీ భార్యాపుత్రులు, సామంతరాజులు అందరూ నీకు వశవర్తులై నీవు చెప్పినట్లు నడచుకొంటున్నారు కదా! సర్వ సంపదలతో తులతూగే సార్వభౌముడవైన నీ ముఖం ఈ విధంగా చింతాక్రాంతమై ఉండటానికి కారణమేమిటి?” అని ప్రశ్నించగా చిత్రకేతుడు “మహానుభావా! మీరు తపస్సంపన్నులు. మీకు తెలియరానిది ఏముంటుంది?” అని తలవంచి మౌనం వహించాడు. సర్వజ్ఞుడైన అంగిరసుడు మహారాజు అభిప్రాయాన్ని గ్రహించి దయతో అతని చేత పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞశేషాన్ని రాజుగారి పెద్ద భార్య అయిన కృతద్యుతికి అనుగ్రహించి “నీకు కుమారుడు జన్మిస్తాడు. అతని వల్ల నీవు సుఖదుఃఖాలను అనుభవిస్తావు” అని చెప్పి వెళ్ళిపోయాడు. కృతద్యుతి గర్భం ధరించి నవమాసాలు నిండిన తరువాత కుమారుణ్ణి కన్నది. మహారాజు, మంత్రులు, సేవకులు, ప్రజలు అందరూ ఎంతో ఆనందించారు. చిత్రకేతుడు స్నానం చేసి సకలాభరణాలు అలంకరించుకొని పుత్రునికి జాతకర్మ మహోత్సవం నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు అపరిమితంగా బంగారం, వెండి, నూతన వస్త్రాలు, ఆభరణాలు, గ్రామాలు, ఏనుగులు, వాహనాలు, గోవులను పంచిపెట్టాడు. అంతేకాక ఒక్కొక్కరికి ఆరేసి అర్బుదాల చొప్పున ద్రవ్యాన్ని దానం చేసాడు. ప్రాణి సముదాయానికి వర్షాధినేత అయిన పర్జన్యుడు వలె ఆ మహారాజు తన రాజ్యంలోని ప్రజలకు కోరిన కోరికలు తీర్చి పరమానంద భరితుడయ్యాడు. రాజకుమారుడు తల్లిదండ్రులకు, బంధువులకు సంతోషాన్ని సమకూరుస్తూ దినదిన ప్రవర్ధమాను డౌతున్నాడు. చిత్రకేతు మహారాజు తన కుమారుని మీది వ్యామోహంతో పట్టపురాణి అయిన కృతద్యుతి పట్ల బద్ధానురాగుడై ఉండటం మిగిలిన భార్యలు సహించలేక పోయారు. మహారాజు తమకు దూరం కావటానికి కారణం ఈ కుమారుడే కదా అని భావించి ఈర్ష్యతో నిండిన కర్కశ హృదయాలతో వారు అతనికి విషప్రయోగం చేశారు. పిల్లవాడు నిద్రించినవాడు నిద్రించినట్లే మరణించాడు. ఉదయాన నిద్ర లేపుదామని వెళ్ళిన దాసికి మంచంమీద రాజకుమారుని శవం కనిపించింది. ఆ వికృత దృశ్యాన్ని చూచి దాసి ఆశ్చర్యంతో. దుఃఖంతో, భయంతో క్రిందపడి దొర్లుతూ పెద్దగా ఏడ్చింది. అప్పుడు...