పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-885-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక యాచరితంబైన కర్మంబు తత్క్షణంబ వినష్టం బగుటంజేసి జీవుండు దేహాంతరంబున లోకాంతరగామి యైన ఫలం బెట్లు సంభవించు;” ననిన ప్రాచీనబర్హికి నారదుం డిట్లనియె “నరేంద్రా! స్వప్నావస్థ యందు లింగశరీరాధిష్ఠాత యైన జీవుండు జాగ్రద్దేహాభిమానంబు విడచి తాదృశంబ కాని యతాదృశంబ కాని యైన శరీరాంతరంబు నొంది మనంబునందు సంస్కార రూపంబున నాహితంబైన కర్మంబు ననుభవించు చందంబునం బురుషుండే లింగ శరీరంబునం జేసి కర్మంబు నాచరించు నా లింగశరీరంబున లోకాంతరంబున దేహవిభేదంబు నొందక తత్ఫలం బనుభవించు; నదియునుం గాక దాన ప్రతిగ్రహాదుల యందు స్థూలదేహంబునకుం గర్తృత్వంబు గల దంటివేని నహంకార మమకార యుక్తుండయిన పురుషుండు మనంబునం జేసి యేయే దేహంబు పరిగ్రహించు, నాయా దేహంబున సిద్ధంబైన కర్మం బా జీవుం డనుభవించు; నట్లు గాకున్నఁ గర్మంబు పునరుద్భవ కారణం బగుట యుపపన్నంబు గాకుండుఁ; గావున మనఃప్రధానం బైన లింగశరీరంబునకే కర్తృత్వం బుపపన్నం బగు” నని వెండియు నిట్లనియె.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఆచరితంబునున్ = ఆచరింపబడినది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మము; తత్క్షణంబ = వెంటనే; వినష్టంబున్ = పూర్తిగాపోయినది; అగుటన్ = అగుట; చేసి = వలన; జీవుండు = పురుషుడు; దేహ = దేహము; అంతరంబునన్ = మరియొకదానితో; లోక = లోకము; అంతర = మరియెకదానికి; గామి = పోయిన; ఐన = ఎడల; ఫలంబున్ = ఫలితమును; ఎట్లు = ఏ విధముగ; సంభవించును = కలుగును; అనినన్ = అనగా; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; కిన్ = కి; నారదుండున్ = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నరేంద్ర = రాజా {నరేంద్రుడు - నరులకు ఇంద్రుని వంటివాడు, రాజు}; స్వప్న = కలగనెడి; అవస్థ = పరిస్థితి; అందున్ = లో; లింగశరీర = లింగశరీరమున {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; అధిష్ఠాత = అధిష్ఠించి ఉండువాడు; ఐన = అయిన; జీవుండు = పురుషుడు; జాగృత్ = మెలకువ యందున్న, భౌతిక; దేహ = శరీర మందలి; అభిమానంబున్ = ఆసక్తిని; విడిచి = వదలి; తాదృశంబ = అటువంటిది; కాని = కాని; అతాదృశంబ = వేరొక విధమైనది; కాని = కాని; ఐన = అయినట్టి; శరీర = దేహము; అంతరంబున్ = ఇంకొకటి; పొంది = పొంది; మనంబున్ = మనసు; అందున్ = లో; సంస్కార = వాసనా; రూపంబునన్ = రూపములో; ఆహితంబు = వచ్చినది; ఐన = అయిన; కర్మంబున్ = కర్మఫలితమును; అనుభవించు = అనుభవించెడి; చందంబునన్ = విధముగా; పురుషుండు = పురుషుడు; లింగశరీరంబునన్ = లింగశరీరము {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; చేసి = వలన; కర్మంబున్ = కర్మములను; ఆచరించున్ = ఆచరించును; ఆ = ఆ; లింగశరీరంబునన్ = లింగశరీరముతోనే; లోక = లోకము; అంతరంబునన్ = మరియొక దానిలో కూడ; దేహ = లింగశరీర; విభేదంబున్ = మార్పును; ఒందక = పొందకనే; తత్ = వాని; ఫలంబున్ = ఫలితమును; అనుభవించును = అనుభవించును; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దాన = దానము; ప్రతిగ్రహా = పుచ్చుకొనుట; ఆదుల = మొదలగువాని; అందున్ = అందు; స్థూల = భౌతిక; దేహంబున్ = దేహమున; కున్ = కు; కర్తృత్వంబున్ = చేయు నధికారము; కలదు = ఉన్నది; అంటివేని = అనినచో; అహంకార = నేనడి భావము; మమకారము = నాదనెడి భావము; యుక్తుండున్ = తో కూడినవాడు; అయిన = అయిన; పురుషుండు = పురుషుడు; మనంబునన్ = మనసు; చేసి = వలన; ఏయే = ఏయే; దేహంబున్ = దేహములను; పరిగ్రహించున్ = ధరించు; ఆయా = ఆయా; దేహంబునన్ = దేహములలో; సిద్ధంబున్ = ప్రాప్తించినవి; ఐన = అయిన; కర్మంబున్ = కర్మములను; ఆ = ఆ; జీవుండు = పురుషుడు; అనుభవించున్ = అనుభవించును; అట్లు = ఆ విధముగ; కాకున్నన్ = కాకపొయినచో; కర్మంబున్ = కర్మము; పునురుద్భవ = పునర్జన్మమునకు; కారణంబున్ = కారణము; అగుటన్ = అగుట; ఉపపన్నంబున్ = సాధ్యపడినది; కాకుండున్ = కాకపోవును; కావునన్ = అందుచేత; మనః = మనసు; ప్రధానంబున్ = ప్రధానమైనది; ఐన = అయిన; లింగశరీరంబునన్ = లింగశరీరమున {లింగశరీరము - సంస్కారశరీరము, తనను గుర్తించుకొను కర్మమయ భావమయ దేహము}; కే = కే; కర్తృత్వంబున్ = కర్తగా బాధ్యత; ఉపపన్నంబున్ = సాధ్యపడినది; అగును = అగును; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.