పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-855-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“మఱియు నరదం బన దేహంబు; దురంగంబు లన నింద్రియంబు; లీషాద్వయం బన సంవత్సరంబునుం దత్కృత వయస్సును; చక్రద్వయం బనం బుణ్యపాప కర్మద్వయంబు; వేణుత్రయం బన గుణత్రయంబు; పంచబంధనం బనం బంచప్రాణంబులు; రశ్మి యన మనంబు; సారథి యన బుద్ధి; రథికోపవేశస్థానం బన హృదయంబు; కూబరంబు లన శోకమోహంబులు; పంచప్రహరణంబు లనం బంచేంద్రి యార్థప్రక్షేపంబు; పంచవిక్రమం బనం గర్మేంద్రియంబులు; సప్తవరూధంబు లన ధాతువులు; హైమోపస్కరం బన రజోగుణంబు; అక్షయతూణీరం బన ననంతవాసనాహంకారోపాధి; యేకాదశ చమూపతి యన నేకాదశేంద్రియంబైన మనం; బాసురీవృత్తి యనం బాహ్యవిక్రమంబు; పంచేంద్రియంబులచేత మృగయా వినోదంబు చందంబున హింసాదులం జేసి విషయంబు లనుభవించుటయ మృగయాచరణం; బీ విధంబున నుండ జీవుండు దేహంబున స్వప్న సుషుప్తి జాగ్రదవస్థల యందు నాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులైన బహువిధ దుఃఖంబులం జేసి క్లేశంబు లననుభవించుచు నజ్ఞానావృతుండయి వర్షశతంబు నిర్గుణుం డయ్యును బ్రాణేంద్రియ మనోధర్మంబులం దనయందు నధ్యవసించి కామలవంబుల ధ్యానంబు చేయుచు నహంకార మమకార సహితంబుగాఁ గర్మాచరణంబు చేయుచుండు.
సంకేత పదాలు జాబితా

టీకా:

మఱియున్ = ఇంకను; అరదంబున్ = రథము; అనన్ = అనగా; దేహంబున్ = శరీరము; తురంగంబులున్ = గుఱ్ఱములు; అనన్ = అనగా; ఇంద్రియంబులున్ = ఇంద్రియములు; ఈషా = కాడులు; ద్వయంబున్ = రెండు (2); అనన్ = అనగా; సంవత్సరంబున్ = సంవత్సరమును; తత్ = వానితో; కృత = జరుగు; వయస్సునున్ = వయస్సు; చక్ర = చక్రములు; ద్వయంబున్ = రెండు (2); అనన్ = అనగా; పుణ్య = పుణ్యవంతమైన; పాప = పాపపు; కర్మ = కర్మముల; ద్వయంబున్ = రెండు (2); వేణు = వేణు, వెదురు కఱ్ఱలు; త్రయంబున్ = మూడు; అనన్ = అనగా; గుణత్రయంబున్ = త్రిగుణములు {గుణత్రయము - సత్త్వరస్తమోగుణములు మూడు}; పంచ = ఐదు (5); బంధనంబు = కట్లు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); ప్రాణంబులున్ = ప్రాణములు {పంచప్రాణములు - 1 ప్రాణము 2 అపానము 3 న్యాసము 4 ఉదానము 5 సాన వాయువులు}; రశ్మి = పగ్గము; అనన్ = అనగా; మనంబున్ = మనసు; సారథి = సారథి; అనన్ = అనగా; బుద్ధి = బుద్ధి; రథిక = రథమునెక్కినవాడు; ఉపవేశ = కూర్చుండు; స్థానంబున్ = స్థానము; అనన్ = అనగా; హృదయంబున్ = హృదయము; కూబరంబుల్ = కూబరము, నొగలు, సారథి ఉండు స్థానము; అనన్ = అనగా; శోక = దుఃఖము; మోహంబులున్ = మోహముచెందుటలు; పంచ = ఐదు (5); ప్రహరణంబులు = ప్రహరణములు, గంటలు; అనన్ = అనగా; పంచ = ఐదు (5); ఇంద్రియార్థ = విషయముల; ప్రక్షేపము = ప్రయోగించుట; పంచ = ఐదు (5); విక్రమంబున్ = విక్రమములు, శౌర్యములు; పంచ = ఐదు (5); కర్మేంద్రియంబులున్ = కర్మేంద్రియములు; సప్త = ఏడు (7); వరూధంబులు = కవచములు; అనన్ = అనగా; ధాతువులు = సప్తధాతువులు; హైమ = బంగారపు; ఉపస్కరంబున్ = అలంకారములు; అనన్ = అనగా; రజోగుణంబున్ = రజోగుణము; అక్షయతూణీరంబున్ = అక్షయతూణీరము; అనన్ = అనగా; అనంత = అంతులేని; వాసనా = పూర్వజన్మవాసనలు, సంస్కారములకు; అహంకార = అహంకారము అనెడి; ఉపాధి = ఆధారమైనది; ఏకాదశ = పదకొండు (11); చమూ = సైన్యమునకు; పతి = అధిపతి; అనన్ = అనగా; ఏకాదశ = పదకొండు (11); ఇంద్రియంబున్ = ఇంద్రియములు {ఏకాదశేంద్రియములు - మనసు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు}; ఐన = అయిన; మనంబున్ = మనసు; ఆసురీవృత్తి = రాక్షసవర్తన; అనన్ = అనగా; బాహ్య = బయటి ప్రపంచము లోనికి; విక్రమంబున్ = విజృంభించుట; పంచేంద్రియంబుల్ = పంచేంద్రియముల; చేతన్ = చేత; మృగయా = వేట; వినోదంబున్ = క్రీడ; చందంబునన్ = వలె; హింస = హింసించుట; ఆదులన్ = మొదలగువాని; చేసి = వలన; విషయంబులన్ = ఇంద్రియగోచరంబులను; అనుభవించుటయ = అనుభవించుటే; మృగయాచరణంబున్ = వేటాడుట; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఉండన్ = ఉండగా; జీవుండు = జీవుడు; దేహంబునన్ = శరీరమునందు; స్వప్న = స్వప్నావస్థ; సుషుప్తి = సుషుప్తి అవస్థ; జాగ్రదావస్తల్ = జాగ్రదావస్థల; అందున్ = అందు; ఆధ్యాత్మిక = ఆధ్యాత్మికము; ఆధిదైవిక = ఆధిదైవికము; ఆధిభౌతికంబులు = ఆధిభౌతికములు; ఐన = అయిన; బహు = అనేక; విధ = రకముల; దుఃఖంబులన్ = దుఃఖములు; చేసి = వలన; క్లేశంబులన్ = చింతలను, తిప్పలను; అనుభవించుచున్ = అనుభవించుతూ; అజ్ఞాన = అజ్ఞానముచేత; ఆవృతుండు = కప్పబడినవాడు; అయి = అయ్యి; వర్ష = సంవత్సరములు; శతంబున్ = నూటిని; నిర్గుంణుండున్ = గుణరహితుండున్; అయ్యున్ = అయినప్పటికిని; ప్రాణ = ప్రాణములు; ఇంద్రియ = ఇంద్రియములు; మనః = మనస్సు; ధర్మంబులన్ = ధర్మముల; అందున్ = అందు; అధ్యవసించి = నివసించి; = కామ = కోరికలు; లవంబున్ = చిన్నచిన్నవాటిని; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేయుచూ; అహంకార = నేననెడి వృత్తి; మమకార = నాది యనెడి వృత్తి; సహితంబుగాన్ = కూడినదిగా; కర్మ = కర్మములను; ఆచరణంబున్ = చేయుట; చేయుచున్ = చేయుచూ; ఉండు = ఉండును.

భావము:

ఇంకా రథం అంటే శరీరం. గుఱ్ఱాలు అంటే ఇంద్రియాలు. రెండు యుగాలు అంటే సంవత్సరం, దాని చేత ఏర్పడిన వయస్సు. రెండు చక్రాలు అంటే పుణ్యపాప కర్మలు. మూడు జెండాలు అంటే త్రిగుణాలు. పంచబంధనాలు అంటే పంచప్రాణాలు. పగ్గం అంటే మనస్సు. సారథి అంటే బుద్ధి. గూడు అంటే హృదయం. రెండు నొగలు అంటే శోకమోహాలు. పంచప్రహరణాలు అంటే ఐదు ఇంద్రియార్థాలు. పంచవిక్రమాలు అంటే కర్మేంద్రియాలు. సప్త వరూధాలు అంటే రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు ధాతువులు. స్వర్ణాభరణం అంటే రజోగుణం. అక్షయ తూణీరం అంటే అనంత వాసనాహంకార ఉపాధి. ఏకాదశ సేనాపతి అంటే పది ఇంద్రియాలు, మనస్సు. ఆసురీవృత్తి అంటే బాహ్య విక్రమం. పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే వేట. పురుషుడు దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలతో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాలచేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు ఐనా ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ, అహంకార మమకారాలతో కూడ వందయేండ్లు కర్మలను ఆచరిస్తాడు.