పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-368-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సుశీలసంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవని పాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నిరువదియాఱువే లేండ్లు భోగంబుల చేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచేత నశుభ క్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గ సాధనంబుగా రాజ్యంబుచేసి కొడుకునకుఁ బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికం బగు విశ్వంబు భగవన్మాయారచితం బని, యాత్మం దలంచుచు వెండియు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సు = మంచి; శీల = నడవడిక; సంపన్నుండును = మిక్కిలిగ కలవాడు; బ్రహ్మణ్యుండును = వేద మనెడి బ్రహ్మ మందు నిష్ఠ కలవాడు; ధర్మసేతు = ధర్మసేతువును; రక్షకుండును = రక్షించువాడు; దీన = దీనుల ఎడల; వత్సలుండును = వాత్సల్యము కలవాడు; అయి = అయ్యి; అవనిన్ = భూమిని; పాలించు = పాలించెడి; ధ్రువుండు = ధ్రువుడు; తన్ను = తనను; ప్రజలు = జనులు; తండ్రి = తండ్రి; అని = అని; తలంపన్ = అనుకొనునట్లు; ఇరువదియాఱువేల = ఇరవైయారువేలు (26000); ఏండ్లు = సంవత్సరములు; భోగంబులన్ = అనుభవింప దగినవాటి; చేతన్ = వలన; పుణ్య = చేసిన పుణ్య ఫలము యొక్క; క్షయంబును = వ్యయ మగుటను; అభోగంబులు = అశుభ శాంతి కరములు; ఐన = అయిన; యాగ = యజ్ఞము; ఆదులు = మొదలగువాని; చేతన్ = వలన; అశుభ = పాప; క్షయంబునున్ = వ్యయ మగుటను; చేయుచున్ = చేస్తూ; బహు = చాలా; కాలంబున్ = కాలము; దనుకన్ = పర్యంతము; త్రివర్గ = ధర్మము అర్థము కామము {త్రివర్గ - ధర్మము అర్థము కామము అనెడి మూడు (3) వర్గములు}; సాధనంబున్ = సాధించునది; కాన్ = అగునట్లు; రాజ్యంబున్ = రాజ్యమును; చేసి = చేసి; కొడుకున్ = పుత్రుని; కున్ = కి; పట్టంబుగట్టి = పట్టాభిషేకము చేసి; అచలిత = నిశ్చలమైన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; అవిద్య = అజ్ఞానము చేత; రచిత = నిర్మింపబడిన; స్వప్న = కలలో చూసిన; గంధర్వ = గంధర్వుల; నగర = నగరమును; ఉపమంబున్ = పోల్చదగినది; అయిన = అయినట్టి; దేహ = శరీరము; ఆదికంబున్ = మొదలైనవి; అగు = అయన; విశ్వంబు = జగత్తు; భగవత్ = భగవంతుని; మాయా = మాయచేత; రచితంబున్ = నిర్మిపబడినది; అని = అని; ఆత్మన్ = మనసులో; తలంచుచున్ = అనుకొనుచు; వెండియున్ = మరల.

భావము:

ఈ విధంగా శీలసంపన్నుడు, వేదబ్రహ్మనిష్ఠుడు, ధర్మసేతు రక్షకుడు, దీనవత్సలుడు అయి రాజ్యాన్ని పాలించే ధ్రువుడు ప్రజలు తనను తండ్రిగా భావించగా, భోగాలచేత పుణ్యం వ్యయం కాగా అభోగాలైన యజ్ఞయాగాలచేత పాపాలను నాశనం చేసుకొంటూ ధర్మార్థకామాలనే త్రివర్గాలను సాధింపజేసే రాజ్యాన్ని 26 వేల సంవత్సరాలు పాలించి, కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి ఇంద్రియ నిగ్రహం కలవాడై అవిద్య వల్ల సృష్టించబడిన స్వప్నంలోని గంధర్వనగరంతో సమానమైన దేహము మొదలైన ప్రపంచం భగవంతుని మాయచేత కల్పింపబడిందని తన మనస్సులో భావిస్తూ…