పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-992-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులు గలిగి నాలవ మాసంబున సప్తధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి షష్ట మాసంబున మావిచేతం బొదువం బడి తల్లి కుక్షిని దక్షిణభాగంబునం దిరుగుచు మాతృభుక్తాన్న పానంబులవలనఁ దృప్తి బొందుచు నేధమానధాతువులు గల్గి జంతు సంకీర్ణంబగు విణ్మూత్రగర్తం బందుఁ దిరుగుచుఁ క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబు లైన రసంబులచేత బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిప్రదేశంబు నందు నాత్రంబులచేత బద్ధుండై కుక్షి యందు శిరంబు మోపికొని భుగ్నం బైన పృష్టగ్రీవోదరుండై స్వాంగ చలనంబు నందు నసమర్దుం డగుచుఁ బంజరంబందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వజన్మ దుష్కృతంబుల దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించు; నంత నేడవ నెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతి వేపితుం డగుచు యోచమానుండు దేహాత్మదర్శియుఁ బునర్గర్భ వాసంబునకు భీతుండు నగుచు బంధనభూతం బగు సప్తధాతువులచే బద్ధుం డై కృతాంజలి పుటుండు దీనవదనుండు నై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింపఁబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు.

టీకా:

మఱియున్ = ఇంకనూ; మాస = నెలలు; త్రయంబునన్ = మూటికి; నఖ = గోర్లు; రోమ = వెంట్రుకలు; అస్థి = ఎముకలు; చర్మంబులున్ = చర్మములును; లింగ = కామావయవ; ఛిద్రంబులున్ = రంధ్రములును; కలిగి = కలిగి; నాలవ = నాల్గవ; మాసంబునన్ = నెలలో; సప్తధాతువులును = సప్తధాతువులును {సప్తధాతువులు - వసాదులు (వస, అసృక్కు, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్లములు) - రోమాది (రోమ, త్వక్, మాంస, అస్థి, స్నాయువు, మజ్జ, ప్రాణములు)}; పంచమ = అయిదవ (5); మాసంబునన్ = నెలలో; క్షుత్ = ఆకలి; తృష్ణలను = దప్పులను; కలిగి = కలిగి; షష్ట = ఆరవ; మాసంబునన్ = నెలలో; మావి = గర్భంలోని మావి; చేతన్ = చేత; పొదువంబడి = చుట్టబడి; తల్లి = తల్లి యొక్క; కుక్షిని = పొట్టలో; దక్షిణ = కుడి; భాగంబునన్ = పక్క; తిరుగుచున్ = తిరుగుతూ; మాతృ = తల్లి; భుక్త = తిన్నట్టి; అన్న = అన్నము, ఆహారము; పానంబుల్ = తాగినవాని; వలనన్ = వలన; తృప్తిన్ = తృప్తిని; పొందుచున్ = పొందుతూ; ఏధమాన = వృద్ధిచెందుతున్న; ధాతువులున్ = ధాతువులు; కల్గి = కలిగి; జంతు = జంతువులతో; సంకీర్ణంబు = కలిసిపోయినది; అగు = అయిన; విట్ = మలము; మూత్ర = మూత్రములు కల; గర్తంబున్ = గుంట; అందున్ = లో; తిరుగుచున్ = తిరుగుతూ; క్రిమి = క్రిములచే; భక్షిత = తినబడుతున్న; శరీరుండు = దేహము కలవాడు; ఐ = అయ్యి; మూర్ఛలన్ = మూర్ఛలను; పొందుతూ = చెందుతూ; తల్లి = తల్లి; భక్షించిన = తిన్నట్టి; కటు = కారపు; తిక్త = చేదు; ఉష్ణ = వేడి; లవణ = ఉప్పని; క్షార = ఘాటు; ఆమ్ల = పులుపు; ఆది = మొదలగు; ఉల్బణంబులు = తీక్షములు; ఐన = అయినట్టి; రసంబులున్ = రుచుల; చేతన్ = చేత; పరి = మిక్కిలి; తప్త = తాపము చెందిన; అంగుడు = దేహము కలవాడు; అగుచున్ = అవుతూ; జరాయువునన్ = మావిచే; కప్పంబడి = కప్పబడి; బహిః = బయటి; ప్రదేశంబున్ = ప్రదేశము; అందున్ = లో; ఆత్రంబులన్ = పేగుల; చేతన్ = చేత; బద్ధుండు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; కుక్షి = కడుపు; అందున్ = మీద; శిరంబున్ = శిరస్సును; మోపికొని = ఆన్చుకొని; భుగ్నంబున్ = వంగినట్టిది; ఐన = అయిన; పృష్ట = వీపు; గ్రీవ = మెడ; ఉదరుండు = కడుపు కలవాడు; ఐ = అయ్యి; స్వా = తన యొక్క, స్వంత; అంగ = అవయవముల; చలనంబున్ = కదిలించుట; అందున్ = అందు; అసమర్థుడు = చేతకానివాడు; అగుచున్ = అవుతూ; పంజరంబున్ = పంజరములో; అందున్ = లోపల; ఉండు = ఉండెడి; శకుంతంబున్ = శకుంతపక్షి; చందంబునన్ = వలె; ఉండి = ఉండి; దైవ = దేవునిచే; కృతంబు = చేయబడినది; ఐన = అయినట్టి; జ్ఞానంబున్ = జ్ఞానముతో; పూర్వ = కిందటి; జన్మ = జన్మములందలి; దుష్కృతంబులున్ = చెడ్డపనులు; తలంచుచున్ = స్మరించుకొనుచు; దీర్ఘ = పెద్దగా; ఉచ్ఛ్వాసంబున్ = ఊపిర్లు; చేయుచున్ = తీస్తూ; సుఖ = సుఖము; లేశంబునున్ = కొంచము కూడ; పొందక = కలుగక; వర్తించున్ = తిరుగును; అంతన్ = అంతట; ఏడవ = ఏడవ (7); నెల = మాసము; అందున్ = లో; లబ్ధ = పొందిన; జ్ఞానుండు = జ్ఞానము కలవాడు; ఐ = అయ్యి; చేష్టలు = కదలికలు; కలిగి = పొంది; విట్ = మలము; క్రిమి = క్రిములతో; సోదరుండు = సహ గర్భవాసము కలవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒక; దిక్కున = పక్క; ఉండకన్ = ఉండకుండగ; సంచరించుచున్ = తిరుగుతూ; ప్రసూతి = పురిటి; మారుతంబులు = నెప్పులు; చేతన్ = చేత; అతి = అధికముగ; వేపితుండు = వేగుచున్నవాడు; అగుచున్ = అవతూ; యోచమానుండు = యోచించుచున్న వాడును; దేహ = దేహమును; ఆత్మ = ఆత్మలను; దర్శియున్ = వేరుగా చూడ కలవాడును; పునర్ = మరల; గర్భ = గర్భమున; వాసంబున్ = నివసించుట; కున్ = కు; భీతుండున్ = భయపడుతు ఉన్నవాడును; అగుచున్ = అవుతూ; బంధన = కట్లు; భూతంబులున్ = వంటివి; అగు = అయిన; సప్తధాతువులున్ = సప్తధాతువులును; చేన్ = చేత; బద్ధుండు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; కృత = ఒగ్గిన; అంజలి = దోసిలి; పుటుండు = పట్టినవాడు; దీన = దీనమైన; వదనుండును = ముఖము కలవాడును; ఐ = అయ్యి; జీవుండు = జీవుడు; తాన్ = తను; ఎవ్వరి = ఎవరి; చేన్ = చేత; ఉదరంబునన్ = గర్భములో; వసియింపబడెన్ = నివసింపజేయబడెనో; అట్టి = అటువంటి; సర్వేశ్వరుని = భగవంతుని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించున్ = స్తోత్రము చేయును.

భావము:

మూడు నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు ఏర్పడుతాయి. నాలుగవ నెలకు సప్తధాతువులు కలుగుతాయి. ఐదవనెలకు ఆకలి దప్పులు సంభవిస్తాయి. ఆరవ నెలలో మావిచేత కప్పబడి, తల్లి కడుపులో కుడివైపున తిరుగుతూ ఉంటాడు. తల్లి తిన్న అన్నంతో త్రాగిన నీటితో తృప్తి పొందుతుంటాడు. వాత పిత్త శ్లేశ్మలానే ధాతువులు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. మల మూత్రాల గుంటలలో పొర్లుతూ, అందలి క్రిములు శరీరమంతా ప్రాకి బాధపెట్టగా మూర్ఛపోతూ ఉంటాడు. తల్లి తిన్న కారం, చేదు, ఉప్పు, పులుపు మొదలైన తీవ్రరసాలు అవయవాలను తపింపచేస్తాయి. మావిచే కప్పబడి, బయట ప్రేగులచే కట్టివేయబడి తల్లిపొట్టలో తలదూర్చి, వంగి, ముడుచుకొని, పండుకొని ఉంటాడు. తన అవయవాలు కదలించటానికి శక్తిలేక పంజరంలో చిక్కిన పక్షివలె బంధితుడై ఉంటాడు. దైవదత్తమైన తెలివితో వెనుకటి జన్మలలోని పాపాలను తలచుకొని నిట్టూర్పులు విడుస్తాడు. కించిత్తుకూడా సుఖాన్ని పొందలేకుండా ఉంటాడు. ఏడవనెలలో జ్ఞానం కలుగుతుంది. కదలికలు కలుగుతాయి. మలంలోని క్రిములతో కలసి మెలసి ఒకచోట ఉండలేక కడుపులో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. గర్భవాయువులకు కంపించిపోతూ దేహాత్మ దర్శనం కలిగి, విమోచనాన్ని యాచిస్తూ, మళ్ళీ గర్భవాసం కలిగినందుకు భయపడుతూ బంధనరూపాలైన సప్తధాతువులతో బంధితుడై, చేతులు జోడించి దీనముఖుడైన జీవుడు ఏ దేవుడు తనకు ఈ గర్భవాసం కలిగించాడో ఆ సర్వేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తాడు.