పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కర్దముని విమానయానంబు

  •  
  •  
  •  

3-803-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం గర్దమునికి వివాహంబుసేసి మరలిచనినం దదనంతరంబ; దేవహూతియుఁ బతిభక్తి గలిగి భవునికి భవాని పరిచర్యసేయు తెఱంగునఁ బతియ తనకు నేఁడుగడయుంగా నెఱింగి; యమ్మునీంద్రుని చిత్తవృత్తికొలఁది దినదినంబునకు భక్తితాత్పర్యస్నేహంబులు రెట్టింపం; బ్రియశుశ్రూషణంబులు గావించుచు ననూనతేజోవిరాజిత యగుచుఁ గామక్రోధ దంభలోభాది గుణవిరహిత యై; శరీరశుద్ధి వహించి మృదుమధుర వచనరచన యై; పతిభక్తి యేమఱక వర్తింప దైవయోగంబు నైననుం దప్పింప సమర్థుం డైన కర్దముండు నిజ సేవాయాసకృశీభూతదేహ యై యున్న దేవహూతిం గరుణా తరంగితాపాంగుం డై కనుంగొని మంజుభాషణంబుల నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; స్వాయంభువుండు = స్వాయంభువుడు; దేవహూతిన్ = దేవహూతిని; కర్ధమున్ = కర్దముని; కిన్ = కి; వివాహంబున్ = వివాహమును; చేసి = చేసి; మరలి = వెనుకకు; చనిన్ = వెళ్ళిన; తదనంతరంబ = తరువాత; దేవహూతియున్ = దేవహూతియును; పతి = పతి ఎడల; భక్తిన్ = భక్తి; కలిగి = కలిగి; భవునిన్ = శంకరుని; కిన్ = కి; భవాని = పార్వతీదేవి; పరిచర్య = సేవ; చేయున్ = చేసెడి; తెఱంగునన్ = విధముగ; పతియ = పతియే; తన = తన; కున్ = కు; ఏడుగడయున్ = సమస్తము (ఆంధ్రశబ్దరత్నాకరము), సర్వస్వము; కాన్ = అయి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; చిత్త = మానసిక; వృత్తిన్ = వర్తనను; కొలది = అనుసరించి; దినదినంబున్ = నానాటి; కున్ = కి; భక్తిన్ = భక్తియును; తాత్పర్య = శ్రద్ధయును; స్నేహంబుల్ = ప్రేమయును; రెట్టింపన్ = ద్విగుణీకృతముకాగా; ప్రియ = ప్రేమపూర్వక; శుశ్రూషణంబులున్ = పరిచర్యలు; కావించుచున్ = చేయుచూ; అనూన = వెలితిలేని; తేజస్ = తేజస్సుతో; విరాజిత = విరాజిల్లునది; అగుచున్ = అవుతూ; కామ = కామమును; క్రోధ = కోపమును; దంభ = మోసము; లోభ = పిసినారితనమును; ఆది = మొదలగు; గుణ = గుణములు {అరిషడ్వర్గము - 1కామ 2క్రోధ 3దంభ 4లోభ 5మద 6మాత్సర్యములు}; విరహిత = అసలులే నామె; ఐ = అయ్యి; శరీర = దేహ; శుద్ధి = శుభ్రత; వహించి = కలిగి; మృదు = మెత్తని; మధుర = తీయని; వచన = మాటల; రచన = కూర్పు కలది; ఐ = అయ్యి; పతిభక్తిన్ = పతిభక్తిని; ఏమఱక = మరువక; వర్తింపన్ = నడచుచుండగ; దైవ = దేవుని; యోగంబునన్ = సంకల్పమును; ఐనన్ = అయినను; తప్పింపన్ = తప్పించుటకు; సమర్థుండు = చాలినవాడు; ఐనన్ = అయినట్టి; కర్దముండు = కర్దముడు; నిజ = తన; సేవా = సేవించుటచేత; ఆయాస = శ్రమ వలన; కృశీభూత = చిక్కిపోయినది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; దేవహూతిన్ = దేవహూతిని; కరుణా = దయతో; తరంగిత = తొణకిసలాడుతున్న; అపాంగుడు = కటాక్షములు కలవాడు; ఐ = అయ్యి; కనుంగొని = చూసి; మంజు = ఇంపైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా స్వాయంభువుడు దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోగా, ఆ తర్వాత దేవహూతి పతిభక్తి కలిగి శివునికి పార్వతి సేవ చేసిన విధంగా భర్తయే సర్వస్వముగా భావించి, ఆ మునీశ్వరుని మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా దినదినం భక్తి, ప్రేమ రెట్టింపుకాగా సేవలు చేస్తూ, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ, కామం, క్రోధం, కపటం, లోభం మొదలైన దుర్గుణములకు దూరంగా ఉండి, తన సౌందర్యాన్ని పోషించుకుంటూ, చాతుర్యంతో, చనువుతో, ప్రేమతో పతినే దైవంగా భావించి మృదుమధురంగా అతనితో మాట్లాడుతూ పతివ్రతయై ప్రకాశించింది. దైవయోగాన్ని సైతం తప్పింప సమర్థుడైన కర్దమ ప్రజాపతి తన సేవలో మిక్కిలి కృశించిన దేవహూతిని దయతో చూసి ముద్దుగా ఇలా అన్నాడు.