పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతార విసర్జనంబు

  •  
  •  
  •  

3-715-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని చెప్పి; వెండియు సూతుండు మహర్షుల కిట్లనియె "నట్లు పరీక్షిన్నరేంద్రుఁడు శుకయోగీంద్రుం గనుంగొని "మునీంద్రా! హిరణ్యాక్ష వధానంతరంబున వసుంధర సమస్థితిం బొందిన విధంబును; స్వాయంభువమనువుఁ బుట్టించిన యనంతరంబున విరించి దిర్యగ్జాతి జంతుసృష్టి నిమిత్తంబు లైన మార్గంబు లెన్ని సృజించె; మహాభాగవతోత్తముం డయిన విదురుండు గృష్ణున కపకారంబులు దలంచిన పాపవర్తను లగు ధృతరాష్ట్రపుత్రులం బాసి జనకుం డగు కృష్ణద్వైపాయనునకు సముం డగుచుఁ దన మనోవాక్కాయకర్మంబులు గృష్ణునంద చేర్చి భాగవతజనోపాసకుండై పుణ్యతీర్థసేవాసమాలబ్ధ యశో విగతకల్మషుం డగుచు మైత్రేయ మహాముని నేమి ప్రశ్నంబు లడిగె; నవి యెల్లం దెలియ నానతి" మ్మనిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = ఇంకనూ; సూతుండు = సూతుడు; మహా = గొప్ప; ఋషుల్ = ఋషుల; కున్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నర = నరులకు; ఇంద్రుడు = ప్రభువు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కనుంగొని = చూసి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; హిరణ్యాక్షు = హిరణ్యాక్షుని; వధ = సంహారము; అనంతరంబునన్ = తరువాత; వసుంధర = భూమి; సమ = సమమగు; స్థితిన్ = పరిస్థితిని; పొందిన = పొందినట్టి; విధంబునున్ = విధమును; స్వాయంభువ = స్వాయంభువుడు అను; మనువున్ = మనువును; పుట్టించిన = సృష్టించిన; అనంతరంబునన్ = తరవాత; విరించి = బ్రహ్మదేవుడు; తిర్యక్ = జంతు {తిర్యక్కులు - స్వయంచాలన కల జీవులు, జంతువులు}; జాతి = సమూహములను; జంతు = ప్రాణులను; సృష్టి = సృష్టించుటకు; నిమిత్తంబులు = కారణములు; ఐన = అయిన; మార్గంబులున్ = విధానములు; ఎన్ని = ఎన్ని; సృజించెన్ = సృష్టించెను; మహా = గొప్ప; భాగవత = బాగవతులలో {భాగవతుడు - భాగవతము యొక్క మార్గమున నడచువాడు}; ఉత్తముండు = ఉత్తముడు; అయిన = అయినట్టి; విదురుండు = విదురుడు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; అపకారంబున్ = అపకారమును; తలంచినన్ = తలపెట్టినట్టి; పాప = పాపపు; వర్తనులు = మార్గమున వర్తించువారు; అగు = అయిన; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుని; పుత్రులన్ = కొడుకులను; పాసి = వదలి; జనకుండు = తండ్రి; అగు = అయిన; కృష్ణద్వైపాయనున్ = వేదవ్యాసుని; కున్ = కి; సముండు = సమానమైనవాడు; అగుచున్ = అవుతూ; తన = తన యొక్త; మనోవాక్కాయకర్మంబులు = త్రికరణసుద్దిగల కర్మములు; కృష్ణున్ = కృష్ణుని; అంద = అందే; చేర్చి = నిమగ్నముచేసి; భాగవత = భాగవతులగు; జన = జనుల; ఉపాసకుండు = సేవించువాడు; ఐ = అయ్యి; పుణ్య = పుణ్యవంతములగు; తీర్థ = తీర్థములందు; సేవా = సేవించుటచేత; సమా = చక్కగా; లబ్ధ = లభించిన; యశో = కీర్తిచే; విగత = పోగొట్టుకొనిన; కల్మషుండు = పాపములు కలవాడు; అగుచున్ = అవుతూ; మైత్రేయ = మైత్రేయుడు అను; మహా = గొప్ప; మునిన్ = మునిని; ఏమి = ఏమి; ప్రశ్నంబులున్ = ప్రశ్నలను; అడిగెన్ = అడిగెను; అవి = అవి; ఎల్లన్ = సమస్తమును; తెలియన్ = తెలియునట్లు; ఆనతిమ్ము = చెప్పుము; అనిన = అనగా; రాజ = రాజులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; కున్ = కి; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

అని చెప్పి మళ్ళీ సూతుడు మహర్షులతో ఇట్లా అన్నాడు. “ఆ విధంగా హిరణ్యాక్షుని కథ విన్న పరీక్షిత్తు శుకమహర్షిని చూచి “మునీంద్రా! హిరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతిని చెప్పు. స్వాయంభువ మనువును సృష్టించిన తర్వాత బ్రహ్మ పశుపక్ష్యాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు? భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణునకు అపకారం చేయ దలచిన దుష్టులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి, తన తండ్రియైన వేదవ్యాసునితో సమానుడై, వాక్కూ కర్మా సమస్తమూ శ్రీకృష్ణునిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది, పాపాలను పోగొట్టుకొని మైత్రేయ మహామునిని ఏమని ప్రశ్నించాడు? అవి అన్నీ తెలియజేయండి” అని అడిగిన రాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు.