పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరాహావతారంబు

  •  
  •  
  •  

3-412-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత మాయామయ వరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండ కోటరపరి స్ఫోటనంబుఁ గావింప విని జనస్తప సత్యలోక నివాసు లయిన మునులు ఋగ్యజుస్సామ మంత్రంబుల వినుతించిరి; యజ్ఞవరాహ రూపధరుండ యిన సర్వేశ్వరుండు సత్పురుషపాలనదయాపరుఁడు గావున దిగ్గజేంద్ర లీలావిలోలుండై.

టీకా:

అంత = అంతట; మాయా = మాయతో; మయ = కూడిన; వరాహ = వరాహము యొక్క; ఘుర్ఘురా = ఘుర్ ఘుర్ అను; రావంబున్ = ధ్వని; బ్రహ్మాండ = బ్రహ్మాండము యైక్క; కోటర = సరిహద్దులు; పరిస్ఫోటనము = చీల్చునట్లు; కావింపన్ = చేయగా; విని = విని; జనః = జనలోకము; తప = తపోలోకము; సత్య = సత్యలోకము లందు; నివాసులు = వసించువారు; అయిన = అయిన; మునులున్ = మునులును; ఋక్ = ఋగ్వేద; యజుర్ = యజుర్వేద; సామ = సామవేదముల; మంత్రంబులన్ = మంత్రములతో; వినుతించిరి = కీర్తించిరి; యజ్ఞవరాహ = యజ్ఞవరాహము; రూప = రూపమును; ధరుండున్ = ధరించినవాడు; అయిన = అయిన; సర్వేశ్వరుండు = భగవంతుడు {సర్వేశ్వరుడు - సర్వమునకును ఈశ్వరుడు, విష్ణువు}; సత్ = మంచి; పురుష = మానవులను; పాలన = పాలించు; దయా = దయ యందు; పరుడు = నిమగ్నుడు; కావున = కనుక; దిగ్గజేంద్ర = దిగ్గజముల; లీలా = వలె; విలోలుండు = విలసిల్లువాడు; ఐ = అయి.

భావము:

అప్పుడు, ఆ కపట వరాహమూర్తి కావించిన ఘుర్ఝురావానికి, బ్రహ్మాండభాండం అంతా దధ్దరిల్లిపోయింది. ఆ శబ్దం విని జనలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలలోని మంత్రాలతో, ఆ యజ్ఞవరాహమూర్తిని కీర్తించారు. యజ్ఞవరాహరూపాన్ని ధరించిన పరాత్పరుడు, సజ్జనులను చక్కగా పరిపాలించే, పరమ దయామయుడు కాబట్టి ఒక మహా దిగ్గజంలా క్రీడించాలని వేడుకపడ్డాడు.