పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : రాజుల యుత్పత్తి

  •  
  •  
  •  

12-4-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు రాజులప్రకారం బెఱింగించెద; బృహద్రథునకుఁ బురంజయుండు పుట్టు; వానికి శునకుం డనెడివాఁడు మంత్రి యై పురంజయునిం జంపి తా రాజ్యం బేలుచుండు; నంతఁ గొంతకాలంబున కతనికిం గుమారుండు దయించిన వానికిఁ బ్రద్యోతననామం బిడి పట్టంబుగట్టు; నా భూభుజునకు విశాఖరూపుం డుదయింపంగలం; డాతనికి నందివర్ధనుండు జన్మించు; నీ యేవురు నూటముప్పది యెనిమిది సంవత్సరములు వసుంధరా పరిపాలనంబునం బెంపు వడయుదురు; తదనంతరంబ శిశునాగుం డను పార్థివుం డుదయించు; నా మూర్ధాభిషిక్తునకుఁ గాకవర్ణుండు, నా రాజన్యునకు క్షేమవర్ముఁ డుదయింపఁగలం; డా పృథ్వీపతికి క్షేత్రజ్ఞుం, డతనికి విధిసారుఁడును, విధిసారున కజాతశత్రుండు, నా భూపాలునకు దర్భకుండును, దర్భకునికి నజయుండు, నతనికి నందివర్ధనుండు, నతనికి మహానందియు ననంగల శైశునాగులు పదుండ్రు నరపాలకు లుద్భవించి షష్ట్యుత్తరత్రిశతి హాయనంబులు గలికాలంబున ధరాతలం బేలుదు; రంతట మహానందికి శూద్రస్త్రీ గర్బంబున నతి బలశాలి యయిన మహాపద్మవతి యను నందనుం డుదయించు; నతనితో క్షత్రియవంశం బడంగిపోఁ గల దా సమయంబున నరపతులు శూద్రప్రాయులై ధర్మవిరహితులై తిరుగుచుండ మహాపద్మునకు సుమాల్యుం డాదిగాఁ గల యెనమండ్రు కుమారు లుదయించెదరు; వారు నూఱు సంవత్సరంబులు క్షోణితలం బేలెద; రంతటఁ గార్ముకుండు మొదలుగా రాజనవకంబు నందాఖ్యలం జనియించు; నా నవనందులనొక భూసురోత్తముం డున్మూలనంబు సేయు; నప్పుడు వారు లేమిని మౌర్యులు గొంతకాలం బీ జగతీతలంబు నేలుదు; రత్తఱి నా భూదేవుండు చంద్రగుప్తుండనువానిం దన రాజ్యం బందు నభిషిక్తుంగాఁ జేయంగలం; డంత నా చంద్రగుప్తునకు వారిసారుండును, వానికి నశోకవర్ధనుండు, నతనికి సుయశస్సును, వానికి సంయుతుఁ డమ్మహనీయునకు శాలిశూకుం, డతనికి సోమశర్ముండు, వానికి శతధన్వుండు, నవ్వీరునకు బృహద్రథుండు నుదయించెదరు; మౌర్యులతోఁజేరిన యీ పదుగురును సప్తత్రింశదుత్తర శతాబ్దంబులు నిష్కంటకంబుగా భూపరిపాలనంబు సేసెద; రా సమయంబున బృహద్రథుని సేనాపతి యగు పుష్యమిత్రుఁడు, శుంగాన్వయుఁ డతని వధించి రాజ్యంబు గైకొను; నతనికి నగ్నిమిత్రుండను నరపతి బుట్టఁగలవాఁ; డాతనికి సుజ్యేష్ఠుండు, సుజ్యేష్ఠునకు వసుమిత్రుండు, నతనికి భద్రకుండును, భద్రకునకుఁ బుళిందుండు, నా శూరునకు ఘోషుండును, వాని కి వజ్రమిత్రుండును, నతనికి భాగవతుండును, వానికి దేవభూతియు నుద్భవించెద; రీ శుంగులు పదుండ్రును ద్వాదశోత్తరశత హాయనంబు లుర్వీపతు లయ్యెద; రంతమీదఁట శుంగకుల సంజాతుండైన దేవభూతిని గణ్వామాత్యుండగు వసుదేవుండనువాఁడు వధియించి, రాజ్యం బేలు; వానికి భూమిత్రుండు, నమ్మహానుభావునకు నారాయణుండునుఁ గలిగెదరు; కణ్వవంశజులైన వీరలు మున్నూటనలువదేను సంవత్సరంబులు మేదినీతలం బేలుదురు; మఱియును.

టీకా:

అందు = ఆ కాలమునందు; రాజుల = రాజుల; ప్రకారంబున్ = విషయములను; ఎఱింగించెదన్ = తెలిపెదను; బృహద్రథున్ = బృహద్రథుని; కున్ = కి; పురంజయుండు = పురంజయుడు; పుట్టున్ = పుడతాడు; వాని = అతని; కిన్ = కి; శునకుండు = శునకుడు; అనెడివాడు = అనెడి; మంత్రి = అమాత్యునిగా; ఐ = ఉండి; పురంజయునిన్ = పురంజయుని; చంపి = సంహరించి; తాన్ = తానే; రాజ్యంబున్ = రాజ్యమును; ఏలుచుండున్ = పాలించుచుచుండును; అంత = అప్పుడు; కొంతకాలంబున్ = కొన్నాళ్ళ; కున్ = కి; కుమారుండు = కొడుకు; ఉదయించిన = పుట్టగా; వాని = అతని; కిన్ = కి; ప్రద్యోతన్ = ప్రద్యోతుడు; అనన్ = అనెడి; నామంబు = పేరు; ఇడి = పెట్టి; పట్టంబుగట్టున్ = పట్టాభిషేకము చేయును; ఆ = ఆ యొక్క; భూభుజున్ = రాజున; కున్ = కు; విశాఖరూపుండు = విశాఖరూపుడు; ఉదయింపంగలండు = పుడతాడు; ఆతని = అతని; కిన్ = కి; నందివర్ధనుండు = నందివర్ధనుడు; జన్మించున్ = పుట్టును; ఈ = ఈ; ఏవురున్ = ఐదుగురు; నూటముప్పదియెనిమిది = నూటముప్పైయెనిమిది (138); సంవత్సరములు = ఏళ్ళు; వసుంధరా = రాజ్యమును; పరిపాలనంబునన్ = పాలించుటలో; పెంపున్ = వృద్ధిని; బడయుదురు = చెందెదరు; తదనంతరంబ = పిమ్మట; శిశునాగుండు = శిశినాగుడు; అను = అనెడి; పార్థివుండు = రాజు; ఉదయించును = జన్మించును; ఆ = ఆ యొక్క; మూర్ధాభిషిక్తున్ = పట్టపురాజు; కున్ = కి; కాకవర్ణుండు = కాకవర్ణుడు; ఆ = ఆ యొక్క; రాజన్యున్ = రాజు; కున్ = కి; క్షేమవర్ముండు = క్షేమవర్ముడు; ఉదయింపగలండు = పుడతాడు; ఆ = ఆ యొక్క; పృథ్వీపతి = రాజు; కిన్ = కి; క్షేత్రఙ్ఞుండు = క్షేత్రఙ్ఞుడు; అతను = అతని; కిన్ = కి; విధిసారుడును = విధసారుడు; విధిసారున్ = విధిసారున; కున్ = కు; అజాతశత్రుండున్ = అజాతశత్రుడు; ఆ = ఆ; భూపాలున్ = రాజు; కున్ = కి; దర్భకుండును = దర్భకుడు; దర్భకున్ = దర్భకుని; కిన్ = కి; అజయుండును = అజయుడు; అతను = అతని; కిన్ = కి; నందివర్ధనుండున్ = నందివర్ధనుడు; అతను = అతని; కిన్ = కి; మహానందియున్ = మహానంది; అనంగల = అనబడెడువారైన; శైశునాగులు = శైశునాగులు; పదుండ్రున్ = పదిమంది; నరపాలకులు = రాజులు; ఉద్భవించి = పుట్టి; షష్ట్యుత్తరత్రిశతి = మూడువందలరవై (360); హాయనంబులున్ = సంవత్సరములు; కలికాలంబునన్ = కలికాలమునందు; ధరాతలంబున్ = భూమండలమును; ఏలుదురు = పాలించెదరు; అంతట = అప్పుడు; మహానంది = మహానంది; కిన్ = కి; శూద్ర = శూద్రజాతి; స్త్రీ = యువతి; గర్భంబునన్ = కడుపులో; అతి = మహా; బలశాలి = బలవంతుడు; అయిన = ఐన; మహాపద్మవతి = మహాపద్ముడు; అను = అనెడి; నందనుండున్ = కొడుకు; ఉదయించున్ = పుట్టును; అతని = అతని; తోన్ = తోటి; క్షత్రియవంశంబు = క్షత్రియవంశము; అడంగిపోగలదు = నశించిపోవును; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = కాలమునందు; నరపతులు = రాజులు; శూద్ర = శూద్రులతో; ప్రాయులు = సమానమైనవారు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మముగానడచుట; విరహితులు = లేనివారు; ఐ = అయ్యి; తిరుగుచుండన్ = మెలగుచుండగా; మహాపద్మున్ = మహాపద్ముని; కున్ = కి; సుమాల్యుండు = సుమాల్యుడు; ఆదిగాగల = మున్నగు; ఎనమండ్రు = ఎనిమిదిమంది; కుమారులు = కొడుకులు; ఉదయించెదరు = పుట్టెదరు; వారు = వారు; నూఱు = వంద (100); సంవత్సరంబులు = సంవత్సరములు; క్షోణితలంబున్ = భూమండలమును; ఏలెదరు = పాలించెదరు; అంతటన్ = పిమ్మట; కార్ముకుండు = కార్ముకుడు; మొదలగు = మున్నగు; రాజ = రాజుల; నవకంబున్ = తొమ్మిదిమంది (9); నంద = నందులు అని; ఆఖ్యలన్ = పిలవబడువారు; జనియించున్ = పుట్టెదరు; ఆ = ఆ యొక్క; నవ = తొమ్మిదిమంది (9); నందులన్ = నందులను; ఒక = ఒకానొక; భూసుర = విప్ర; ఉత్తముండు = శ్రేష్ఠుడు; ఉన్మూలనంబు = అంతరింపగా; చేయున్ = చేస్తాడు; అప్పుడు = అప్పుడు; వారు = వాళ్ళు; లేమిని = లేకపోవుటచేత; మౌర్యులు = మౌర్యులు {మౌర్యులు - ముర అనునామె వంశము వారు}; కొంతకాలంబున్ = కొన్నాళ్ళు; ఈ = ఈ; జగతీతలంబున్ = భూమండలమును; ఏలుదురు = పాలించెదరు; ఆ = ఆ యొక్క; తఱిన్ = సమయమునందు; ఆ = ఆ; భూదేవుండు = బ్రాహ్మణుడు; చంద్రగుప్తుండు = (మౌర్య)చంద్రగుప్తుడు; అను = అనెడి; వానిన్ = అతనిని; తన = అతని యొక్క; రాజ్యంబున్ = రాజ్యమున; అందున్ = కు; అభిషిక్తున్ = పట్టముకట్టబడిన వానిగా; చేయంగలండు = చేస్తాడు; అంతన్ = పిమ్మట; ఆ = ఆ యొక్క; చంద్రగుప్తున్ = చంద్రగుప్తుని; కున్ = కి; వారిసారుండును = వారిసారుండు; వాని = అతని; కిన్ = కి; అశోకవర్ధనుండున్ = అశోకవర్ధనుడు; అతని = వాని; కిన్ = కి; సుయశస్సును = సుయశస్సుడు; వాని = అతని; కిన్ = కి; సంయుతుడు = సంయుతుడు; ఆ = ఆ యొక్క; మహనీయున్ = గొప్పవాని; కున్ = కి; శాలిశూకుండున్ = శాలిశూకుండు; అతని = వాని; కిన్ = కి; సోమశర్ముండు = సోమశర్మ; వాని = అతని; కిన్ = కి; శతధన్వుండు = శతధన్వుడు; ఆ = ఆ; వీరున్ = శూరుని; కున్ = కి; బృహద్రథుండున్ = బృహద్రథుడు; ఉదయించెదరు = పుడతారు; మౌర్యులు = మౌర్యులు; తోన్ = తోటి; చేరిన = కలిసి; ఈ = ఈ; పదుగురును = పదిమంది; సప్తత్రింశదుత్తరశతాబ్దంబులు = నూటముప్పైయేడేళ్ళు (137); నిష్కంటకంబుగాన్ = తిరుగులేకుండా; భూ = రాజ్యమును; పరిపాలనంబున్ = ఏలుట; చేసెదరు = చేస్తారు; ఆ = ఆ యొక్క; సమయంబునన్ = కాలమునందు; బృహద్రథుని = బృహద్రథుని; సేనాపతి = సేనానాయకుడు; అగు = ఐన; పుష్యమిత్రుడు = పుష్యమిత్రుడు; శుంగ = శుంగ; అన్వయుండు = వంశమువాడు; అతనిన్ = వానిని; వధించి = చంపి; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; కైకొనున్ = చేపట్టును; అతని = వాని; కిన్ = కి; అగ్నిమిత్రుండు = అగ్నిమిత్రుడు; అను = అనెడి; నరపతి = రాజు; పుట్టగలవాడు = పుడతాడు; అతని = వాని; కిన్ = కి; సుజేష్ఠుండున్ = సుజేష్ఠుడు; సుజేష్ఠున్ = సుజేష్ఠుని; కున్ = కి; వసుమిత్రుండున్ = వసుమిత్రుడు; అతని = వాని; కిన్ = కి; భద్రకుండును = భద్రకుడు; భద్రకున్ = భద్రకుని; కున్ = కి; పుళిందుండు = పుళిందుడు; ఆ = ఆ; శూరున్ = శూరుని; కున్ = కి; ఘోషుండునున్ = ఘోషుడు; వాని = ఆతని; కిన్ = కి; వజ్రమిత్రుండును = వజ్రమిత్రుడు; అతని = వాని; కిన్ = కి; భాగవతుండును = భాగవతుడు; వాని = అతని; కిన్ = కి; దేవభూతియున్ = దేవభూతి; ఉద్భవించెదరు = పుడతారు; ఈ = ఈ; శుంగులు = శుంగవంశస్థులు; పదుండ్రును = పదిమంది; ద్వాదశోత్తరశత = నూటపన్నెండు (112); హాయనంబులున్ = సంవత్సరములు; ఉర్వీపతులున్ = రాజులుగా; అయ్యెదరు = ఉంటారు; అంతమీదట = ఆ తరువాత; శుంగ = శుంగ; కుల = వంశమున; జాతుండు = పుట్టినవాడు; ఐన = అగు; దేవభూతినిన్ = దేవభూతిని; కణ్వామాత్యుండు = కణ్వుడు మంత్రిగా కలవాడు; అగు = ఐన; వసుదేవుండు = వసుదేవుడు; అను = అనెడి; వాడు = అతను; వధియించి = చంపి; రాజ్యంబున్ = రాజ్యమును; ఏలున్ = పాలించును; వాని = అతని; కిన్ = కి; భూమిత్రుండున్ = భూమిత్రుడు; ఆ = ఆ; మహానుభావున్ = గొప్పవాని; కున్ = కి; నారాయణుండునున్ = నారాయణుడు; కలిగెదరు = పుడతారు; కణ్వ = కణ్వ; వంశజులు = వంశస్థులు; ఐన = అగు; వీరలు = వీరు; మున్నూటనలువదేను = మూడొందలనలభైయైదు (345); సంవత్సరంబులు = సంవత్సరాలు; మేదినీతలంబున్ = రాజ్యమును; ఏలుదురు = పాలిస్తారు; మఱియును = పిమ్మట.

భావము:

వీటిలో ముందుగా రాజుల గురించి చెప్తాను, రాజు బృహద్రథుడికి పురంజయుడు పుడతాడు. అతనికి శునకుడు మంత్రిగా ఉంటాడు. అతడు పురంజయుని సంహరించి తానే గద్దె నెక్కి, రాజ్యం పరిపాలిస్తాడు. అతనికి ప్రద్యోతుడు అని కొడుకు పుడతాడు. అతనికి పట్టాభిషేకం చేసి రాజ్యం అప్పజెప్తాడు. ప్రద్యోతునికి విశాఖరూపుడు, అతనికి నందివర్ధనుడు పుడతారు. ఈ రాజులు అయిదుగురు వృద్ధిచెందుతూ నూటముప్పైయ్యెనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు. అటుపిమ్మట శిశునాగుడు అనే రాజు పుడతాడు. అతనికి కాకవర్ణుడు, కాకవర్ణునికి క్షేమవర్ణుడు, క్షేమవర్ణమహారాజుకు క్షేత్రజ్ఞుడు, అతనికి విధిసారుడు, అతనికి అజాతశత్రువు, అతనికి దర్భకుడు, అతనికి అజయుడు, అతనికి నందివర్థనుడు, అతనికి మహానంది పుడతారు. ఈ పదిమంది రాజులు శైశునాగులు అన్న పేరుతో ప్రసిద్ధులై కలికాలంలో మూడువందలఅరవై ఏళ్ళు అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేస్తారు.
ఆ తరువాత, మహానందికి శూద్రస్త్రీ కడుపున మహాపద్ముడు పుడతాడు. అతడు మహా బలవంతుడు అవుతాడు. కానీ అతనితో క్షత్రియ వంశం అంతరించి పోతుంది. అప్పుడు రాజులు శూద్రప్రాయులు ధర్మహీనులు అయిపోతారు. పోతారు మహాపద్మునికి సుమాల్యుడు మున్నగు తనయులు ఎనమండుగురు పుడతారు. వారి పాలన వందసంవత్సరాలపాటు సాగుతుంది. అటుపిమ్మట కార్ముకుడు మొదలయిన రాజులు తొమ్మండుగురు పుడతారు. వారిని నవనందులు అని అంటారు. ఆ నవనందులను ఒక విప్రశ్రేష్ఠుడు అంతరింప జేస్తాడు. నందులు లేకపోవడంచేత కొంతకాలం మౌర్యులు పరిపాలన చేస్తారు.
నందులను తొలగించిన ఆ విప్రోత్తముడు చంద్రగుప్తుని అభిషేక్తుని చేసి రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఆ చంద్రగుప్తునికి వారిసారుడు పుడతాడు. క్రమంగా వారిసారుని కొడుకు అశోకవర్థనుడు, అతని తనయుడు సుయశస్సు, వాని సుతుడు సంయుతుడు, అతని పుత్రుడు శాలిశూకుడు, వాని నందనుడు సోమశర్ముడు, వాని తనూభవుడు శతధన్వుడు, వాని కొమరుడు బృహద్రథుడు వరుసగా రాజులు అవుతారు. మౌర్యునితో కలసి ఆ పదిమందిరాజులు మొత్తంమీద నూటముప్ఫయేడు సంవత్సరములు నిరాటంకంగా రాజ్య పాలన చేస్తారు. అప్పుడు, బృహద్రథుని సైన్యాధినేత శుంగవంశపు పుష్యమిత్రుడు అతనిని చంపి రాజ్యాన్ని అపహరిస్తాడు. అతనికి అగ్నిమిత్రుడు పుట్టి రాజు అవుతాడు. అతని తరువాత సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, భద్రకుడు, పుళిందుడు, ఘోషుడు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి వరుసగా వంశపారంపర్యంగా రాజ్యాన్ని గ్రహించి పరిపాలిస్తారు. పైన చెప్పిన పదిమంది శుంగులు నూటపన్నెండు ఏళ్ళు రాచరికం నిలుపుకుంటారు. శుంగవంశం వారిలో చివరివాడు అయిన దేవభూతిని, వసుదేవుడు కణ్వుడు అను తన మంత్రితో కలిసి వధించి తానే రాజ్యాధిపతి అవుతాడు. అతనికి భూమిపుత్రుడు కలుగుతాడు. ఆ మహానుభవుడికి నారాయణుడనే కొడుకు పుడతాడు. కణ్వవంశస్థులు మొత్తం మీద మూడువందలనలభైఅయిదు ఏళ్ళు ప్రభవులై పరిపాలన చేస్తారు.