పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : ద్వాదశాదిత్య ప్రకారంబు

  •  
  •  
  •  

12-41-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది యెయ్యది యనిన లోకచక్షువు చైత్రమాసంబు మొదలుగా నేయే మాసంబున నేయే నామంబునం బ్రవర్తించుం; జెప్పవే” యని యడిగినఁ “జైత్రంబుననుండి చైత్రాది ద్వాదశమాసంబుల సౌరగణ సప్తకం బీశ్వర నియుక్తంబై నానాప్రకారంబుల సంచరించు; నా క్రమంబు దొల్లి శుకుండు విష్ణురాతునికిఁ దెలిపిన చందంబునం జెప్పెద” నని సూతుం డిట్లనియె “శ్రీమన్నారాయణ స్వరూపుం డగు మార్తాండుం డేకస్వరూపుం డైన, నతనిం గాల దేశ క్రియాది గుణములం బట్టి ఋషు లనేక క్రమంబులఁ నభివర్ణించి భావించుచున్నవా; రా ప్రకారం బెట్లనినఁ జైత్రంబున సూర్యుండు ధాత యను నామంబు దాల్చి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్త్యుండు, తుంబురుండు ననెడు పరిజనులతోఁ జేరికొని సంచరించు; వైశాఖంబున నర్యముండను పేరు వహించి పులహుం, డోజుండు, ప్రహేతి, పుంజికస్థలి, నారదుండు, కంజనీరుం డను ననుచరసహితుండై కాలంబు గడుపుచుండు; జ్యేష్ఠంబున మిత్రాభిదానంబున నత్రి, పౌరుషేయుండు, తక్షకుండు, మేనక, హాహా, రథస్వనుండను పరిజనులతోడం జేరి వర్తించుచుండు; నాషాఢంబున వరుణుండను నాహ్వయంబు నొంది వసిష్టుండు, రంభ, సహజన్యుండు, హూహువు, శుక్రుండు, చిత్రస్వనుండను సహచర సహితుండై కాలక్షేపంబు సేయుచుండు; శ్రావణంబున నింద్రుండను నామంబుచే వ్యవహృతుండై విశ్వవసువు, శ్రోత, యేలాపుత్రుం, డంగిరసుండు, ప్రమ్లోచ, చర్యుండను సభ్యులతోఁ జేరి కాలంబు గడుపుచుండు; భాద్రపదంబున వివస్వంతుండను నామంబు దాల్చి యుగ్రసేనుండు, వ్యాఘ్రుం, డాసారుణుండు, భృగు, వనుమ్లోచ, శంఖపాలుండు లోనుగాఁ గల పరిజనులతో నావృతుండై కాలయాపనంబు సేయుచు నుండు.
^^ ద్వాదశాదిత్యులు పరిచారకులు.

టీకా:

అది = అది; ఎయ్యది = ఏమిటి; అనినన్ = అన్నచో; లోకచక్షువు = సూర్యుడు {లోకచక్షువు - లోకమునకు నేత్రమువంటివాడు, సూర్యుడు}; చైత్రమాసంబు = చైత్రమాసము; మొదలుగాన్ = మొదలు పెట్టి; ఏయే = ఏయే; మాసంబులన్ = నెలలో; ఏయే = ఏయే; నామంబులన్ = నామములతో, పేర్లతో; ప్రవర్తించున్ = సంచరిస్తాడు; చెప్పవే = తెలుపుము; అని = అని; అడిగినన్ = కోరగా; చైత్రంబున = చైత్రము; నుండి = నుండి; చైత్ర = చైత్రమాసము; ఆది = మొదలగు; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులన్ = నెలలో; సౌర = సూర్యుని; గణ = గణములు; సప్తకంబున్ = ఏడుమూర్తులు; ఈశ్వర = భగవంతునిచే; నియుక్తంబు = నియమింపబడినవి; ఐ = అయ్యి; నానా = వివిధ; ప్రకారంబులన్ = విధములుగ; సంచరించును = సంచరిస్తాడు; ఆ = ఆ యొక్క; క్రమంబు = విధానము; తొల్లి = పూర్వము; శుకుండు = శుకుడు; విష్ణురాతుని = విష్ణురాతుడైన పరీక్షిత్తు; కిన్ = కి; తెలిపిన = చెప్పిన; చందంబునన్ = విధముగనే; చెప్పెదను = తెలిపెదను; అని = అని; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; శ్రీమన్నారాయణ = విష్ణుదేవుని; స్వరూపుండు = స్వరూపము ఐనవాడు; అగు = అయిన; మార్తాండుండు = సూర్యుడు {మార్తాండుడు - మృతండు అనువాని కొడుకు, బ్రహ్మాండము మృతి (రెండు చెక్కలగుట)నొందినపుడు పుట్టినవాడు, సూర్యుడు}; ఏక = ఒకటే; స్వరూపుండు = రూపము కలవాడు; ఐనన్ = అయినప్పటికి; అతనిన్ = అతనిని; కాల = కాలము; దేశ = ప్రదేశము; క్రియ = క్రియలు; ఆది = మున్నగు; గుణములన్ = భేదముల; పట్టి = ప్రకారము; ఋషులు = మహర్షులు; అనేక = బహు; క్రమంబులన్ = విధములుగ; అభివర్ణించి = మిక్కిలికీర్తించి; భావించుచున్నవారు = ధ్యానించుచున్నారు; ఆ = ఆ యొక్క; ప్రకారంబు = విధము; ఎట్లు = ఎలా; అనినన్ = అనగా; చైత్రంబునన్ = చైత్రమాసమునందు; సూర్యుండు = సూర్యుడు; ధాత = ధాత {ధాత - సమస్తమును ధరించువాడు, సూర్యుడు}; అను = అనెడి; నామంబున్ = పేరు; తాల్చి = ధరించి; కృతస్థలి = కృతస్థలి; హేతి = హేతి; వాసుకి = వాసుకి; రథకృత్తు = రథకృత్తు; పులస్త్యుండు = పులస్త్యుడు; తుంబురుండు = తుంబురుడు; అనెడి = అను; పరిజనుల = సేవకుల; తోన్ = తోటి; చేరుకొని = కూడి; సంచరించున్ = సంచరించును; వైశాఖంబునన్ = వైశాఖమాసమునందు; అర్యముండు = అర్యముడు; అను = అనెడి; పేరు = నామము; వహించి = ధరించి; పులహుండు = పులహుడు; ఓజుండు = ఓజుడు; ప్రహేతి = ప్రహేతి; పుంజికస్థలి = పుంజికస్థలి; నారదుండు = నారదుండు; కంజనీరుండును = కంజనీరుండు; అను = అనెడి; అనుచర = సేవకులతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాలంబున్ = కాలమును; గడుపుచుండు = గమనముచేస్తుండును; జ్యేష్ఠంబునన్ = జ్యేష్ఠమాసమున; మిత్రా = మిత్రుడు {మిత్రుడు - సర్వ భూతముల యందు స్నేహయుక్తుడు, సూర్యుడు}; అభిదానంబునన్ = అనునామముతో; అత్రి = అత్రి; పౌరుషేయుండు = పౌరుషేయుడు; తక్షకుండు = తక్షకుడు; మేనక = మేనక; హాహా = హాహ; రథస్వనుండు = రథస్వనుడు; అను = అనెడి; పరిజనుల = సేవకుల; తోడన్ = తోటి; చేరి = కూడి; వర్తించుచుండున్ = సంచరిస్తుంటాడు; ఆషాఢంబునన్ = ఆషాఢమాసమునందు; వరుణుండు = వరుణుడు {వరుణుడు - జనులచే వరములు కోరబడువాడు, పడమటిదొర}; అను = అనెడి; ఆహ్వయంబున్ = నామమును; ఒంది = పొంది; వసిష్టుండు = వసిష్టుడు; రంభ = రంభ; సహజన్యుడు = సహజన్యుడు; హూహువు = హూహువు; శుక్రుండు = శుక్రుడు; చిత్రస్వనుండు = చిత్రస్వనుడు; అను = అనెడి; సహచర = సేవకులతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాల = కాలమును; క్షేపంబు = గడుపుట; చేయుచుండున్ = చేస్తుంటాడు; శ్రావణంబునన్ = శ్రావణమాసమునందు; ఇంద్రుండు = ఇంద్రుడు; అను = అనెడి; నామంబు = పేరు; చేన్ = తోటి; వ్యవహృతుండు = పిలువబడువాడు; ఐ = అయ్యి; విశ్వవసువు = విశ్వవసువు; శ్రోత = శ్రోతుడు; ఏలాపుత్రుండు = ఏలాపుత్రుడు; అంగిరసుండు = అంగిరసుడు; ప్లమోచ = ప్లమోచ; చర్యుండు = చర్యుడు; అను = అనెడి; సభ్యుల = సేవకుల; తోన్ = తోటి; చేరి = కూడి; కాలంబున్ = కాలమును; గడుపుచుండున్ = నడుపుతుంటాడు; భాద్రపదంబునన్ = భాద్రపదమాసమునందు; వివస్వంతుండు = వివస్వంతుడు {వివస్వంతుడు - కాంతిచేనన్నిటిని కప్పెడువాడు, సూర్యుడు}; అను = అనెడి; నామంబున్ = పేరు; తాల్చి = ధరించి; ఉగ్రసేనుడు = ఉగ్రసేనుడు; వ్యాఘ్రుండు = వ్యాఘ్రుడు; ఆసారణుండు = ఆసారణుడు; భృగువు = భృగువు; అనుమ్లోచ = అనుమ్లోచ; శంఖపాలుండు = శంఖపాలుడు; లోనుగాగల = మున్నగు; పరిజనుల = సేవకుల; తోన్ = తోటి; ఆవృతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కాల = కాలమును; యాపనంబు = గడుపుట; చేయుచునుండున్ = చేయుచుండును.

భావము:

అది ఏమిటంటే ప్రపంచానికి నేత్రం వంటివాడైన సూర్యుడు చైత్రమాసం మొదలుకుని పన్నెండు నెలలలో ఏ నెలలో, ఏ పేరుతో, ఎలా సంచరిస్తాడో చెప్పుము.” అని అడిగిన శౌనకునితో సూతుడు ఇలా అన్నాడు. “చైత్రం నుంచి పన్నెండు మాసాలలోనూ సౌరగణాలు ఏడు (ఆదిత్యుడు, ఆరుగురు పరిచారకులు) భగవంతుని నిర్ణయం ప్రకారం ఎన్నోవిధాలుగా సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతకు ముందు శుకమహర్షి విష్ణురాతునికి చెప్పాడు. అది చెప్తాను.” అని చెప్పి సూతుడు మరల ఇలా అన్నాడు, “శ్రీమన్నారాయణ స్వరూపుడైన సూర్యుడు ఒకడే. అయినా మహర్షులు కాల, దేశ, క్రియా బేధాలను బట్టి అనేక విధాలుగా వర్ణిస్తారు. ఆ వివరాలు చెప్తాను, శ్రద్ధగా విను.
1) చైత్రమాసంలో సూర్యుడు ధాత అని పేరు ధరిస్తాడు. అతనికి కృతస్థలి, హేతి, వాసుకి, రథకృత్తు, పులస్య్తుడు, తుంబురుడు అనేవారు పరిజనులుగా చేరి సంచరిస్తుంటారు.
2) వైశాఖమాసంలో సూర్యుడు అర్యముడు అనే పేరు వహిస్తాడు. పులహుడు ఓజుడు ప్రహేతి పుంజికస్థలి నారదుడు కంజనీరుడు అనే వారు అనుచరులుగా చేరి సంచరిస్తుంటారు.
3) జ్యేష్ఠమాసంలో సూర్యుడు మిత్రుడు అనేపేరు దాల్చుతాడు. అత్రి, పౌరుషేయుడు, తక్షకుడు, మేనక, హాహా, రథస్వనుడు అనే వారు పరిచరులగా చేరి సంచరిస్తుంటారు.
4) ఆషాడమాసంలో సూర్యుడు వరుణుడు అనే పేరు పొందుతాడు. వశిష్టుడు, రంభ, సహజన్యుడు, హుహువు, శుక్రుడు, చిత్రస్వనుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.
5) శ్రావణమాసంలో సూర్యుడు ఇంద్రుడు అనే పేరు స్వీకరిస్తాడు. అతనికి విశ్వావసువు, శ్రోత, ఏలాపుత్రుడు, అంగిరసుడు, ప్రమ్లోచ, చర్యుడు అనే వారు సహచరులుగా చేరి సంచరిస్తుంటారు.
6) భాద్రపదమాసంలో సూర్యుడు వివస్వంతుడు అనే పేరుతో విరాజిల్లుతాడు. అతనికి ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, ఆసారణుడు, భృగువు, అనుమ్లోచ, శంఖపాలుడు అనే వారు పరివారంగా చేరి సంచరిస్తుంటారు.