పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : మార్కండేయోపాఖ్యానంబు

  •  
  •  
  •  

12-37-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వినుతించి, “దేవా! నీ మాయం జేసి జగంబు భ్రాంతం బై యున్నయది; యిది దెలియ నానతీవలయు” నని యడిగిన నతండు నెఱింగించి చనియె, మునియును శివపూజ సేయుచు హరిస్మరణంబు సేయ మఱచి శతవర్షంబులు ధారాధరంబులు ధారావర్షంబుచే ధరాతలంబు నింప, జలమయంబై యంధకారబంధురబైన, నంత నా తిమిరంబునం గన్నుగానక భయంపడి యున్నయెడ నా జలమధ్యంబున నొక వటపత్రంబునం బద్మరాగ కిరణపుంజంబుల, రంజిల్లు పాదపద్మంబులుగల బాలునిం గని, మ్రొక్కి యతని శరీరంబు ప్రవేశించి, యనేక కాలం బనంతం బగు జఠరాంతరంబునం దిరిగి; యతని చరణారావింద సంస్మరణంబు సేసి; వెలువడి కౌఁగలింపంబోయిన మాయఁ గైకొని యంతర్ధానంబునొంద; మునియు నెప్పటియట్ల స్వాశ్రమంబు సేరి తపంబు సేయుచున్న సమయంబున.

టీకా:

అని = అని; వినుతించి = స్తుతించి; దేవా = భగవంతుడా; నీ = నీ యొక్క; మాయన్ = మాయ; చేసి = వలన; జగంబు = భువనము; భ్రాంతంబు = భ్రాంతిలోపడినది; ఐ = అయ్యి; ఉన్నయది = ఉన్నది; ఇది = దీనిని గురించి; తెలియన్ = స్పష్టముగా తెలియునట్లు; ఆనతీయవలయున్ = చెప్పుము; అని = అని; అడిగినన్ = కోరగా; అతండు = అతడు; ఎఱింగించి = తెలియజేసి; చనియెన్ = వెళ్ళిపోయెను; మునియును = ముని; శివ = శివునిగురించి; పూజ = పూజలు; చేయుచు = చేస్తూ; హరి = శ్రీహరిని; స్మరణంబున్ = స్మరించుట; చేయ = చేయుట; మఱచి = మరచిపోయెను; శత = వంద (100); వర్షంబులు = సంవత్సరములు పాటు; ధారాధరంబులు = మేఘములు {ధారాధరములు - నీటిధారలను ధరించునవి, మేఘములు}; ధారా = ధారాపాతముగా; వర్షంబు = వర్షించుట; చేన్ = చేత; ధరాతలంబున్ = భూమండలమును; నింపన్ = నింపివేయగా; జలమయంబు = నీటితోనిండినది; ఐ = అయిపోయి; అంధకార = కారుచీకట్లతో; బంధురంబు = నిండినది; ఐనన్ = కాగా; అంతన్ = అంతట; ఆ = ఆ యొక్క; తిమిరంబునన్ = చిమ్మచీకటిలో; కన్నుకానక = కళ్ళుకనిపించక; భయంపడి = బెదిరిపోయి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయమునందు; ఆ = ఆ యొక్క; జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; ఒక = ఒకానొక; వట = రావి; పత్రంబునన్ = ఆకుపైన; పద్మరాగ = పద్మరాగమణుల; కిరణ = ప్రభల; పుంజంబులన్ = సమూహములవలె; రంజిల్లు = ప్రకాశించెడి; పాద = పాదములు అనెడి; పద్మంబులు = పద్మములు; కల = కలిగిన; బాలునిన్ = బాలకుని; కని = చూసి, కనుగొని; మ్రొక్కి = నమస్కరించి; అతని = అతని; శరీరంబున్ = శరీరములో; ప్రవేశించి = దూరి; అనేక = చాలా; కాలంబు = కాలము; అనంతంబు = అనంతమైనది; అగు = ఐన; జఠర = కడుపు, ఉదరము; అంతరంబునన్ = లోపల; తిరిగి = సంచరించి; అతని = అతని; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మములను; సంస్మరణంబు = స్మరించుట; చేసి = చేసి; వెలువడి = బయటకి వచ్చి; కౌగలింపంబోయినన్ = కౌగలించుకోబోగా; మాయన్ = మాయను; కైకొని = చేపట్టి; అంతర్దానంబున్ = అదృశ్యగుట; ఒందన్ = చెందగా; మునియును = ముని; ఎప్పటియట్ల = ఎప్పట్లాగ; స్వా = తన యొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమును; చేరి = చేరి; తపంబున్ = తపస్సును; చేయుచున్న = చేస్తున్న; సమయంబునన్ = సమయమునందు.

భావము:

అని మార్కండేయుడు స్తోత్రం చేసాడు. ఆ పిమ్మట, “నీ మాయ వలన ప్రపంచం భ్రాంతి పొంది ఉంది. దీనిని గూర్చి స్పష్టంగా నాకు తెలియజెప్పు” అని అడిగాడు. విష్ణువు తెలియజేసి వెళ్ళిపోయాడు. మార్కండేయుడు శివపూజ చేస్తూ, హరినామస్మరణ మరచిపోయాడు. నూరుసంవత్సరాల పాటు మేఘాలు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి ధాత్రిని నింపివేశాయి. దానితో ధాత్రి జలమయం అవడమేకాక కారుచీకటిలో ములిగిపోయింది. ఆ చీకటిలో కళ్ళు కనిపించక భయపడి ఉన్న సమయంలో, ఆ నీటి మధ్య వటపత్రం మీద పద్మరాగమణి ప్రభలతో ప్రకాశించే పాదపద్మాలు కల ఒక బాలకుని చూసి నమస్కరించి ఆ బాలుని శరీరంలో దూరి చాలా కాలం అతని ఉదరంలోనే సంచరించాడు. అతని పాదపద్మాలను స్మరించుతూ బయటికి వచ్చి కౌగలించుకోబోగా అతను మాయాధారియై అదృశ్యుడయ్యాడు. ముని అంతకుముందు వలననే తన ఆశ్రమంలో ప్రవేశించి తపస్సు చేసుకుంటున్నాడు.