పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-23-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

టీకా:

మద = గర్వము; ఉద్రేకులు = రెచ్చినవారు; ఐన = అయిన; యాదవు = యదు; బాలకులు = యువకులు; ముని = మునుల; శాప = శాపముచే; భీతులు = భయపడినవారు; ఐ = అయ్యి; వడవడ = వడవడమని; వడంకుచున్ = వణకిపోతూ; సాంబ = సాంబుని యొక్క; కుక్షిన్ = కడుపునకు; నిబద్ద = కట్టబడిన; చేల = బట్ట; గ్రంథిన్ = ముడి; విమోచనంబు = విప్పుట; చేయు = చేసెడి; సమయంబునన్ = సమయమునందు; ముసలంబు = రోకలి; ఒక్కటి = ఒకటి; భూతల = నేలపైన; పతితంబు = పడినది; అయిన = కాగా; విస్మయంబు = ఆశ్చర్యము; ఒంది = పొంది; దానినన్ = దానిని; కొనిచని = తీసుకుపోయి; దేవకీనందను = కృష్ణుని; సన్నిధానంబునన్ = దగ్గర; పెట్టి = పెట్టి; ఎఱిగించినన్ = తెలుపగా; అతండు = అతను; ఆత్మ = తనచేతనే; కల్పితంబు = ఏర్పరచిన; మాయా = మాయ చేత; రూపంబు = రూపుదిద్దుకొన్నది; అగుటన్ = ఐ ఉండుట; ఎఱింగియున్ = తెలిసి ఉన్నప్పటికి; ఎఱుంగని = తెలియనివాని; తెఱంగునన్ = విధముగ; వారలన్ = వారిని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు.