పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : జరాసంధుని వధింపఁ బోవుట

  •  
  •  
  •  

10.2-718-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు కృష్ణభీమార్జునులు బ్రాహ్మణ వేషంబులు దాల్చి త్రేతాగ్నులుం బోలెఁ దమ శరీరతేజోవిశేషంబులు వెలుంగ, నతిత్వరితగతిం జని గిరివ్రజంబు సొచ్చి యందు యతిథిపూజలు శ్రద్ధాగరిష్ఠ చిత్తుండై కావించుచున్న జరాసంధునిం గనుంగొని యిట్లనిరి.

టీకా:

ఇట్లు = ఈ విధముగా; కృష్ణ = కృష్ణుడు; భీమ = భీముడు; అర్జునులు = అర్జునులు; బ్రాహ్మణ = బ్రాహ్మణులవలె; వేషంబులున్ = వేషములను; తాల్చి = ధరించి; త్రేతాగ్నులున్ = త్రేతాగ్నులు {త్రేతాగ్నులు - 1గార్హపత్యము (గృహస్థునికి సంబంధించినది) 2దక్షిణాగ్ని (పితృదేవతలకి ఉద్దేశించినది) 3ఆహవనీయము (యజ్ఞమున బలి ఇవ్వ యోగ్యమైనది) అను శ్రౌతాగ్నులు మూడు}; పోలెన్ = సరిపోలుతు; తమ = వారి యొక్క; శరీర = దేహ; తేజః = తేజస్సు యొక్క; విశేషంబులున్ = అతిశయములు; వెలుంగన్ = ప్రకాశించుచుండగా; అతి = మిక్కిలి; త్వరిత = వేగము గల; గతిన్ = గమనములతో; చని = వెళ్ళి; గిరివ్రజంబున్ = గిరివ్రజము అను పట్టణము నందు {గిరివ్రజము - జరాసంధుని పట్టణము}; చొచ్చి = ప్రవేశించి; అందున్ = దానిలో; అతిథి = అతిథులకు చేయు; పూజలు = మర్యాదలు; శ్రద్ధా = శ్రద్ధచేత, మిక్కిలి ఆసక్తిచేత; గరిష్ఠ = శ్రేష్ఠమైన; చిత్తుండు = మనస్సు కలవాడు; ఐ = అయ్యి; కావించుచున్న = చేస్తున్న; జరాసంధునిన్ = జరాసంధుడిని; కనుంగొని = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

భావము:

అలా బ్రాహ్మణ వేషాలు ధరించిన శ్రీకృష్ణ భీమ అర్జునులు ఆహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే త్రేతాగ్నుల్లాగా ప్రకాశిస్తూ అతి శీఘ్రంగా గిరివ్రజానికి వెళ్ళారు. మిక్కిలి శ్రద్ధాభక్తులతో తమకు అతిథి సపర్యలు చేస్తున్న జరాసంధుడితో ఇలా అన్నారు.