పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నరకాసుర వధ కేగుట

  •  
  •  
  •  

10.2-156-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు తనకు మ్రొక్కిన సత్యభామను గరకమలంబులఁగ్రుచ్చి యెత్తి తోడ్కొని గరుడారూఢుండై హరి గగన మార్గంబునం జని, గిరి శస్త్ర సలిల దహన పవన దుర్గమంబై మురాసురపాశ పరివృతం బయిన ప్రాగ్జ్యోతిషపురంబు డగ్గఱి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = అతని; కున్ = కి; మ్రొక్కిన = నమస్కరించిన; సత్యభామనున్ = సత్యభామను; కర = చేతులు అనెడి; కమలంబులన్ = పద్మములతో; గుచ్చి = పొదిగిపట్టి; ఎత్తి = పైకిలేపి; తోడు = కూడా; కొని = తీసుకొని; గరుడ = గరుడవాహనముపై; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుడు; గగన = ఆకాశ; మార్గంబునన్ = మార్గమువెంట; చని = వెళ్ళి; గిరి = కొండల మయమును; శస్త్ర = ఆయుధముల మయము; సలిల = నీటి మయము; దహన = అగ్ని మయము; పవన = గాలి మయము; దుర్గమంబు = కోటలు కలది; ఐ = అయ్యి; ముర = ముర అను {మురాసురుడు - ము (ఆనందము) ర (నశింపజేయు) అసురుడు (అఙ్ఞానాహంకారుడు)}; అసుర = రాక్షసునిచే కల్పింపబడిన; పాశ = బంధనములచేత {అష్టపాశములు - 1పశుపాశము 2భవపాశము 3బంధపాశము 4మోహపాశము 5ఆశాపాశము 6కర్మపాశము 7దుఃఖపాశము 8కేశపాశము, పాఠ్యంతరము, 1దయ 2శంక 3భయము 4లజ్జ 5జుగుప్స 6కులము 7శీలము 8జాతి}; పరివృతంబు = చుట్టబడినది; అయిన = ఐన; ప్రాగ్జోతిష = ప్రాగ్జోతిషము అను {ప్రాగ్జోతిషపురము - నరకాసురుని పట్టణము}; పురంబు = పట్టణము; డగ్గఱి = సమీపించి.

భావము:

ఈలాగున తనను బ్రతిమాలిన సత్యభామను తన కలువల వంటి చేతులతో గరుత్ముంతునిపై ఎక్కించుకుని, ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణం ప్రాగ్జ్యోతిషాన్ని చేరాడు. ఆ పట్టణం పర్వతదుర్గాలతో, శస్త్రదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోటలతో జయింపరానిదై ఉంది. అది అనేకమైన మురాసురుని మాయా పాశాలుచే పరిరక్షింపబడి దుర్భేధ్యమై ఉంది.