పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తుని ప్రాయోపవేశంబు

  •  
  •  
  •  

1-515-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రాప్తానందులు, బ్రహ్మబోధన కళాపారీణు, లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు, మీర, లార్యులు, దయాళుత్వాభిరాముల్, మనో
గుప్తంబుల్ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా!
ప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం ర్చించి భాషింపరే.""

టీకా:

ప్రాప్త = పొందిన; ఆనందులు = ఆనందం గల వారు; బ్రహ్మ = పరబ్రహ్మమును; బోధన = బోధించు; కళా = కళ యందు; పారీణులు = పరిపక్వము చెందినవారు; పారము ముట్టినవారు; ఆత్మ = తమ; ప్రభా = ప్రభావముచేత; లుప్త = లోపింప జేయబడిన; అజ్ఞానులు = అజ్ఞానము కల వారు; మీరలు = మీరు; ఆర్యులు = గౌరవింప దగినవారు; దయాళుత్వ = దయాస్వభావముతో; అభిరాముల్ = సొంపైనవారు; మనస్ = మనసు నందు; గుప్తంబుల్ = దాచబడినవి; సకల = సమస్త మైన; అర్థ = ప్రయోజనముల; జాలములు = సమన్వయములు; మీకున్ = మీకు; కానన్ = తెలిసి; వచ్చున్ = వచ్చును; కదా = కదా; సప్త = ఏడు (7); అహంబులన్ = దినములలో; ముక్తి = ముక్తి; కిన్ = కి; ఏఁగెడు = వెళ్ళుటకు; గతిన్ = దారిని; విధమును; చర్చించి = విమర్శించి; భాషింపరే = చెప్పండి.

భావము:

మీరు ఆనంద స్వరూపులు, బ్రహ్మజ్ఞాన బోధనా పారీణులు, ఆత్మతత్వ మెరిగి అవిద్య తొలగిన వారు, సకలము తెలిసిన విజ్ఞులు, దయార్థ్ర హృదయులు, లోకంలోని సమస్త విషయాలను మనోనేత్రాలతో దర్శించగలవారు. మీరు విచారించి ఏడురోజులలో మోక్షంపొందే మార్గం నాకు చెప్పండి. అని గంగానది వద్ద ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తు వచ్చిన ఋషులు సంయమీంద్రులు అందరిని అడుగుతున్నాడు.