పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పాండవుల మహాప్రస్థానంబు

  •  
  •  
  •  

1-386-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరక్తుండైన ధర్మనందనుండు ప్రాజాపత్యం బనియెడి యిష్టిఁ గావించి యగ్నుల నాత్మారోపణంబు సేసి నిరహంకారుండును నిర్దళితాశేష బంధనుండును నై సక లేంద్రియంబుల మానసంబున నడంచి ప్రాణాధీనవృత్తి యగు మానసంబునుఁ బ్రాణమందునుఁ, బ్రాణము నపానమందును, నుత్సర్గసహితం బయిన యపానము మృత్యువునందును, మృత్యువును పంచభూతంబులకు నైక్యంబైన దేహంబు నందును, దేహము గుణత్రయంబు నందును, గుణత్రయంబు నవిద్య యందును, సర్వారోపహేతువగు నవిద్యను జీవుని యందును, జీవుండయిన తన్ను నవ్యయం బయిన బ్రహ్మ మందును, లయింపంజేసి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరియించి, మౌనియు, నిరాహారుండును, ముక్తకేశుండునునై; యున్మత్త, పిశాచ, బధిర, జడుల చందంబున నిరపేక్షకత్వంబున.

టీకా:

విరక్తుండు = రక్తిని విసర్జించినవాడు; విరక్తుడు; ఐన = అయినట్టి; ధర్మనందనుండు = ధర్మరాజ; ప్రాజాపత్యంబు = పాజాపత్యము; అనియెడి = అనెడి; ఇష్టిన్ = యజ్ఞమును; కావించి = చేసి; అగ్నులన్ = అగ్నులను; ఆత్మ = తనలో; ఆరోపణంబున్ = ఆరోపించుకొనుటను; చేసి = చేసి; నిరహంకారుండును = అహంకారములేనివాడును; నిర్దళిత = చక్కగా భేధించబడిన; అశేష = సమస్తమైన; బంధనుండును = బంధములు కలవాడును; ఐ = అయి; సకల = సర్వమైన; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; మానసంబునన్ = మనసునందు; అడంచి = అణగకొట్టి; ప్రాణ = ప్రాణములకు; అధీన = లొంగి; వృత్తి = వ్యవహరించునది; అగు = అయినట్టి; మానసంబును = మనసును; ప్రాణము = ప్రాణము; అందునున్ = లోను; ప్రాణమున్ = ప్రాణమును; అపానము = అపానము; అందునున్ = లోను; ఉత్సర్గ = వెలువడుట అను లక్షణముతో; సహితంబు = కూడునది; అయిన = అయినట్టి; అపానమున్ = అపానమును; మృత్యువున్ = మృత్యువు; అందునున్ = లోను; మృత్యువును = మృత్యువును; పంచ = ఐదు; భూతంబులు = భూతములు {పంచభూతములు - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1-1-13]}; కున్ = కు; ఐక్యంబు = కూడిక; ఐన = అయినట్టి; దేహంబున్ = దేహము; అందున్ = లోను; దేహమున్ = దేహమును; గుణ = గుణములు; త్రయంబున్ = మూడింటి {గుణత్రయము - త్రిగుణములు - సత్త్వ రజస్ తమస్ అను మూడుగుణములు}; అందునున్ = లోను; గుణ = గుణములు; త్రయంబున్ = మూడింటిని; అవిద్య = అవిద్య; అందునున్ = లోను; సర్వ = సమస్తమైన; ఆరోప = మిథ్యాజ్ఞానమునకు; హేతువు = కారణము; అగు = అయినట్టి; అవిద్యను = అవిద్యను; జీవుని = జీవుని; అందునున్ = లోని; జీవుండు = జీవుడు; అయిన = అయినట్టి; తన్నున్ = తనను; అవ్యయంబు = తరుగనిది; అయిన = అయినట్టి; బ్రహ్మమున్ = బ్రహ్మము; అందునున్ = లోను; లయింపన్ = లీనము అగునట్లు; చేసి = చేసి; బహిర్ = బయటి; అంత = లోపలి; రంగ = విషయములయొక్క; వ్యాపారంబులు = వర్తనలు; విడిచి = విడిచిపెట్టి; నార = నారతో నేసిన; చీరలు = వస్త్రములను; ధరియించి = ధరించి; మౌనియున్ = మౌనమును వహించినవాడును; నిరాహారుండును = ఆహారమును వర్జించినవాడును; ముక్త = వదిలివేసిన; కేశుండును = కేశములు కలవాడును; ఐ = అయి; ఉన్మత్త = పిచ్చివాడు; పిశాచ = పిశాచము పట్టినవాడు; బధిర = చెవిటివాడు; జడుల = మందమైన మతి కలవార్ల; చందంబునన్ = వలె; నిరపేక్షకత్వంబునన్ = నిరపేక్షతో {నిరపేక్షణ - దేనియందును కుతూహలము లేకుండుట.}.

భావము:

విరక్తుడైన ధర్మరాజు ప్రాజాపత్యమనే యాగం చేసి గార్హపత్యం మొదలైన అగ్నులను ఆత్మయందు ఆరోపించుకొన్నాడు. నిరహంకారుడై సంసారబంధాలు తెగతెంపులు చేసి వాక్కు మొదలైన ఇంద్రియాలను మనస్సునందూ, మనస్సును ప్రాణమందూ, ప్రాణాన్ని అపానమందూ అపానాన్ని మృత్యువునందూ, మృత్యువును పాంచభౌతికమైన శరీరమందూ, శరీరాన్ని సత్త్వరజస్తమో గుణములందూ, ఆ గుణత్రయాన్ని అవిద్యయందూ, అరోపా లన్నిటికి హేతువైన అవిద్యను జీవాత్మయందూ, జీవాత్మను అవ్యయమైన పరమాత్మయందూ లయింపజేశాడు. సర్వసంగ పరిత్యాగియై నార చీరలు ధరించాడు. మౌనంతో నిరాహారుడై ముక్తకేశుడై, పిచ్చివాని వలె, పిశాచగ్రస్తుని వలె, బధిరుని వలె, జడుని వలె నిరపేక్షుడైనాడు.