పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

వ్యాసములు : పోతన రూపచిత్రణం - కుప్పించి

ఆచార్య. ఎల్చూరి మురళీధర రావు
పోతన గారి మహాకవిత్వంలో రసధర్మి అనే ప్రాణశక్తికి ప్రథమోదాహరణీయమైన పద్యాన్ని ఎన్నుకొని భీష్ముని భక్తి స్వరూపాన్ని అమోఘంగా ఆవిష్కరించారు. ఒక చిత్రకారుడు, ఒక శిల్పి, ఒక సాంగీతికుడు ఏకత్ర సమావేశమైన కవీశ్వరుడు అయితే గాని ఇంతటి నాటకీయమైన దృశ్యీకరణకౌశలంతో విలసిల్లే రచనను చేయలేడు. ఏమి చిత్రణకౌశలం! ఏమి కల్పన! ధన్యవాదాలు మీకు ఆచార్యా!!!

ఆచార్య. చొప్పకట్ల సత్యన్నారాయణ
08 - నవంబరు, 2017
పోతన గారి రూపచిత్రణం!

"కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి,
గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న
జగముల వ్రేఁగున జగతి గదలఁ ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
బైనున్న పచ్చని పటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటుసేయక,
మన్నింపుమని క్రీడి మఱలఁ దిగువ;
గరికి లఘించు సింహంబుకరణి మెఱసి,
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు;
విడువు మర్జున! యంచు మద్విశిఖవృష్ఠిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు;

తె: భాగవతం-పోతనమహాకవి;
సుప్రసిధ్ధమైన యీపద్యరత్నం పోతనగారిలేఖినినుండి ఆంధ్రసాహిత్యమును తరింపజేయ నవతరించినది. స్వఛ్ఛందమరణమునకై నిరీక్షించు భీష్మపితామహుని నోట బలికించిన యీపద్యం అనవద్యం హృద్యం.భీష్మస్తుతిలోని యీపద్యంలో పోతనగారు తన రూపచిత్రణా సామర్ధ్యమును మనకు పరిచయ మొనరించినారు. యుద్ధరంగమున విజృభించి యుధ్ధ మొనరించు భీష్మపితామహునిపై చక్రధారియై యురుకు శ్రీకృష్ణుని మనోజ్ఙరూపమును కళ్ళకు గట్టించినారు.
చక్రధారియై కన్నయ్య కరికి లఘించు సిహమువలె పితామహునిపై కురుకుచున్నాడట!
రథము నొగలిపై నుండి హుమ్మని యెగిరి క్రిందకు దూకు వేగమునకు భూమి గడగడలాడినదట! ఆడదామరి. ఆదూకుతాకునకు కృష్ణుని బొజ్జ కదిలినది. అందున్నపదునాల్గు భువనముల భారము ధరిత్రిపై బడినది. ఆభారము మోయజాలక భూమి గడగడ లాడినది.
కర్ణాభరణములకాంతి ఆకాశవీధిని యలముకొన్నది. చక్రధారియై పరుగిడునప్పుడు పచ్చని శ్రీకృష్ణుని యుత్తరీయము క్రిందికి జారుచున్నదట!.బావా! నాపరాక్రముపై నాకు నమ్మకము గలదు. భీష్ముని జంపి నన్ను పరాభవింప వలదు. వెనుదిరుగుము/ రమ్మని అర్జనుడు వేడుచుండ, "అర్జునా! నన్ను విడువుము నేడీ భీష్ముని జంపి నిన్నురక్షింతును." యని పల్కుకుచు, నా నిశితబాణపాతమునకు వెఱచి కరిపై లఘించు సింహమువలె నాపయి కురుక జూచు, ఆ శ్రీకృష్ణపరమాత్మయే నాకు రక్షకుఁ డగుగాక! యని భీష్ముని ప్రార్ధన!
1కృష్ణుని కర్ణాభరణకాంతితో గగనము దివ్యదీప్తులతో నిండుట,
2 శ్రీకృష్ణుని బరువును మోయలేక భూమి గజగజలాడుట, కన్నయ్య బొజ్జ కదలాడుట,
3 చక్రధారియై పరువిడ ఉత్తరీయము జారుట,
4 భీష్ముని పై చక్రమును ప్రయోగింపక వెనుదిరుగుమని యొక వంక క్రీడి బ్రతిమిలాడుట,
5 కరిపై నురుకు సింగమును బోలి సక్రోధియై కృష్ణు డొనర్చుప్రయత్నములు సచిత్రముగా నిందు రూపొందినవి గదా! ఆహా!
ఏమాపోతన పనితనము! రూపచిత్రణమున నెంతటి ఘనుడు? అందుచేతనే గాబోలును ప్రస్తుత పద్యము చక్కని రూపచిత్రమై ఆంధ్ర కవితాకాశమున నేటికినీ మెఱపువోని తారకవలె తళతళలాడుచున్నది!
స్వస్తి!