పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : కార్తవీర్యుని చరిత్ర

 •  
 •  
 •  

9-702-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రికళాసంజాతుఁడైన దత్తాత్రేయు-
సేవించి సద్యోగసిద్ధిఁ బొంది
హు యజ్ఞ దాన తపంబులు గావించి-
కలదిక్కులు గెల్చి యముతోడ
తతంబు హరినామ సంకీర్తనము చేసి-
నముల నొంది యుదారవృత్తి
యెనుబదియైదువే లేండ్లు భూచక్రంబు-
నకీర్తిఁ దనపేరుగాఁగ నేలె;

9-702.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముదిమిలేక తరుణమూర్తి యై యురుకీర్తి
మరెఁ గార్తవీర్యుఁ నఁగ విభుఁడు
నిజము వానిభంగి నేల యేలినయట్టి
రాజు నెఱుఁగ మెందు రాజముఖ్య!

టీకా:

హరి = విష్ణుమూర్తి; కళా = అంశతో; సంజాతుండున్ = చక్కగాపుట్టినవాడు; ఐన = అయిన; దత్తాత్రేయున్ = దత్తాత్రేయుని; సేవించి = కొలిచి; సత్ = మంచి; యోగసిధ్దిన్ = యోగసిద్దిని; పొంది = పొంది; బహు = అనేకమైన; యజ్ఞ = యాగములు; దాన = దానములు; తపంబులున్ = తపస్సులు; కావించి = ఆచరించి; సకల = అన్ని; దిక్కులున్ = దిక్కులను; గెల్చి = జయించి; జయము = విజయము; తోడన్ = తోటి; సతతంబున్ = ఎల్లప్పుడును; హరి = విష్ణుమూర్తి; నామ = నామములను; సంకీర్తనము = భజనలు; చేసి = చేసి; ధనములన్ = సంపదలను; ఒంది = పొంది; ఉదారవృత్తిన్ = గొప్పగా; ఎనుబదియైదువేల = ఎనభై ఐదువేల (85,000); ఏండ్లున్ = సంవత్సరములు; భూచక్రంబున్ = భూచక్రమును; ఘన = గొప్ప; కీర్తిన్ = యశస్సుతో; తనపేరు = పేరుప్రసిద్దము; కాగన్ = అగునట్లుగ; ఏలెన్ = పరిపాలించెను.
ముదిమి = ముసలితనము; లేక = లేకుండ; తరుణమూర్తి = యౌవనరూపముకలవాడు; ఐ = అయ్యి; ఉరు = గొప్ప; కీర్తిన్ = కీర్తితో; అమరెన్ = జీవించెను; కార్తవీర్యుడు = కార్తవీర్యుడు; అనగన్ = అనబడుచు; విభుడు = రాజు; నిజమున్ = నిజముగ; వాని = అతని; భంగిన్ = వలె; ఏలిన = పరిపాలించిన; అట్టి = అటువంటి; రాజున్ = పరిపాలకుని; ఎఱుగము = తెలియలేము; ఎందున్ = ఎక్కడకూడ; రాజముఖ్య = మహారాజా.

భావము:

ఓ మహారాజ! ఆ అర్జునుడు విష్ణుమూర్తి అవతారుడైన దత్తాత్రేయుని కొలిచి గొప్ప యోగసిద్దిని, అణిమాదిసిద్ధులను పొందాడు. అనేక యాగాలు, దానాలు చేసాడు. గొప్ప తపస్సు చేసాడు. సకల దిక్కులను జయించి, ఎప్పుడు హరినామ సంకీర్తనలు చేస్తూ ఉండేవాడు. గొప్ప సంపదలను పొందాడు. అతను భూమండలాన్ని ఎనభై ఐదువేల ఏళ్ళు గొప్పగా పరిపాలించాడు. ముసలితనం లేకుండ యౌవన వంతునిగా గొప్ప కీర్తితో కార్తవీర్యుడు అని పిలవబడుతూ జీవించాడు. నిజం చెప్పాలంటే అతనిలా పరిపాలించిన వాడిని ఎక్కడా వినలేము; కనలేము.

9-703-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యర్జునునకుం గల పుత్రసహస్రంబునం బరశురామునిబారికిం దప్పి జయధ్వజుండు, శూరసేనుండు, వృషణుండు, మధువు, నూర్జితుండు నను వారేవురు బ్రతికిరి; జయధ్వజునకుఁ దాళజంఘుండును, దాళజంఘునకు నౌర్వముని తేజంబున నూర్వురు గొడుకులును గలిగి; రందుఁ బ్రథముండు వీతిహోత్రుండు మధువునకు వృక్ణుండు, వృక్ణునకుఁ బుత్రశతంబు పుట్టె; నందుఁ బ్రథముఁడు వృష్ణి; మఱియు మధు వృష్ణి యదువుల యా వంశంబులవారు మాధవులు వృష్ణులు యాదవులు ననం బరఁగిరి; యదుపుత్రుం డైన క్రోష్ణువునకు వృజినవంతుండు, వృజినవంతునకు శ్వాహితుండు, శ్వాహితునకు భేరుశేకుండు, భేరుశేకునకుఁ జిత్రరథుండు, చిత్రరథునకు శశిబిందుండుం బుట్టిరి.

టీకా:

ఆ = ఆ; అర్జునున్ = అర్జున; కున్ = కు; కల = ఉన్నట్టి; పుత్ర = కుమారులు; సహస్రంబునన్ = వేయిమందిలో (1,000); పరశురాముని = పరశురాముని; బారి = దెబ్బకు; కిన్ = కి; తప్పి = తప్పించుకొని; జయద్వజుండున్ = జయద్వజుడు; శూరసేనుండున్ = శూరసేనుడు; వృషణుండున్ = వృషణుడు; మధువున్ = మధువు; ఊర్జితుండున్ = ఊర్జితుడు; అను = అనెడి; వారున్ = వారు; ఏవురు = ఐదుగురు; బ్రతికిరి = బతికిపోయిరి; జయద్వజున్ = జయద్వజున; కున్ = కు; తాళజంఘుడును = తాళజంఘుడు; తాళజంఘున్ = తాళజంఘున; కున్ = కు; ఔర్వముని = ఔర్వముని; తేజంబునన్ = తేజస్సువలన; నూర్వురు = వందమంది (100); కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టరి; అందున్ = వారిలో; ప్రథముండు = మొదటివాడు; వీతిహోత్రుండు = వీతిహోత్రుడు; మధువున్ = మధువున; కున్ = కు; వృక్ణుండున్ = వృక్ణుడు; వృక్ణున్ = వృక్ణున; కున్ = కు; పుత్ర = కొడుకులు; శతంబున్ = నూరుమంది (100); పుట్టెన్ = జన్మించెను; అందున్ = వారిలో; ప్రథముడు = మొదటివాడు; వృష్టి = వృష్టి; మఱియున్ = ఇంకను; మధు = మధుడు; వృష్ణి = వృష్ణి; యదువుల = యదువులయొక్క; ఆ = ఆయా; వంశంబుల = వంశముల; వారున్ = వారు; మాధవులు = మాధవులు; వృష్ణులు = వృష్ణులు; యాదవులు = యాదవులు; అనన్ = అనగా; పరగిరి = ప్రసిద్ధులైరి; యద = యదువు యొక్క; పుత్రుండు = కొడుకు; ఐన = అయిన; క్రోష్టువున్ = క్రోష్టువున; కున్ = కు; వృజినవంతుండున్ = వృజినవంతుడు; వృజినవంతున = వృజినవంతున; కున్ = కు; శ్వాహితుండు = శ్వాహితుడు; శ్వాహితున్ = శ్వాహితున; కున్ = కు; భేరుశేకుండున్ = భేరుశేకుడు; భేరుశేకున్ = భేరుశేకున్; కున్ = కు; చిత్రరథుండున్ = చిత్రరథుడు; చిత్రరథున్ = చిత్రరథున; కున్ = కు; శశిబిందుండు = శశిబిందుడు; పుట్టిరి = జన్మించిరి.

భావము:

ఆ కార్తవీర్యార్జునకు వెయ్యిమంది కుమారులు. ఆ వెయ్యిమందిలో పరశురాముని దెబ్బ తప్పించుకొని జయద్వజుడు, శూరసేనుడు, వృషణుడు, మధువు, ఊర్జితుడు అనెడి ఐదుగురు మాత్రమే బతికిబట్టకట్టారు. జయద్వజునకు తాళజంఘుడు; తాళజంఘునకు ఔర్వముని తేజస్సు వలన వందమంది పుత్రులు పుట్టారు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు; మధువునకు వృక్ణుడు; వృక్ణునకు నూరుమంది కొడుకులు పుట్టారు. వారిలో మొదటివాడు వృష్ణి; ఇంకా విను. మధువు వంశంవారు మాధవులు; వృష్ణి వంశంవారు వృష్ణులు; యదువు వంశంవారు యాదవులు; అనగా ప్రసిద్ధులు అయ్యారు. యదువు కొడుకు క్రోష్టువు; అతనికి వృజినవంతుడు; వృజినవంతునకు శ్వాహితుడు; శ్వాహితునకు భేరుశేకుడు; భేరుశేకునకు చిత్రరథుడు; చిత్రరథునకు శశిబిందుడు పుట్టాడు.