పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యదువంశ చరిత్రము

 •  
 •  
 •  

9-700-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘ! యయాతి పెద్దకొడుకైన యదుక్షితిపాలు వంశమున్
వినినఁ బఠించినన్ నరుఁడు వెండియుఁ బుట్టఁడు ముక్తిఁ బొందు న
య్యనుపమమూర్తి విష్ణుఁడు నరాకృతిఁ బొంది జనించెఁ గావునన్
వినుము; నరేంద్ర! నా పలుకు వీనుల పండువుగాఁగఁ జెప్పెదన్.

టీకా:

అనఘ = పుణ్యుడా; యయాతి = యయాతి యొక్క; పెద్దకొడుకు = పెద్దకొడుకు; ఐన = అయిన; యదు = యదువు అనెడి; క్షితిపాలున్ = రాజు యొక్క; వంశమున్ = వంశమును; వినినన్ = వినినను; పఠించినన్ = చదివినను; నరుడు = మానవుడు; వెండియున్ = మఱియు; పుట్టడు = పుట్టడు; ముక్తిన్ = మోక్షమును; పొందున్ = పొందును; ఆ = ఆ; అనుపమ = సాటిలేని; మూర్తి = వ్యక్తి; విష్ణుడు = విష్ణుమూర్తి; నర = మానవుని; ఆకృతిన్ = స్వరూపమును; పొంది = పొంది; జనించెన్ = పుట్టెను; కావునన్ = కనుక; వినుము = వినుము; నరేంద్రా = రాజా; నా = నా యొక్క; పలుకు = మాట; వీనులన్ = చెవులకు; పండువు = ఆనందకరమైనది; కాగన్ = అగునట్లుగ; చెప్పెదన్ = తెలిపెదను.

భావము:

పుణ్యు పరీక్షిత్తూ! యయాతి పెద్దకొడుకు యదుమహారాజు. ఆ యదు వంశంలో విష్ణుమూర్తి మానవునిగా అవతరించాడు. కనుక, ఆ యదువు గురించి వినినవాడు, చదివినవాడు పునర్జన్మ అన్నది లేక, మోక్షాన్ని పొందుతాడు. నా మాట శ్రద్దగా వినుము రాజా! ఆ యదు వంశం గురించి వీనులకు విందు అయ్యేలా వర్ణించి చెప్తాను.

9-701-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యదువునకు సహస్రజిత్తుఁ గ్రోష్టువు నలుండు రిపుండు ననువారు నలువురు సంభవించి; రందుఁ బెద్దకొడుకయిన సహస్రజిత్తునకు శతజిత్తు గలిగె; నా శతజిత్తునకు మహాహయ వేణుహయ హేహయు లనువారు మువ్వురు జనించి;రందు హేహయునకు ధర్ముండు ధర్మునకు నేత్రుండు నేత్రునకుఁ గుంతి గుంతికి మహిష్మంతుండు మహిష్మంతునికి భద్రసేనుండు, భద్రసేనునకు దుర్మదుండు, దుర్మదునికి ధనికుండు, ధనికునికిఁ గృతవీర్య కృతాగ్ని కృతవర్మ కృతౌజులను నలువురు సంభవించి; రందు గృతవీర్యునికి నర్జునుండు జనియించె; అతండు మహాబుద్ధిబలంబున.

టీకా:

యదువున్ = యదువున; కున్ = కు; సహస్రజిత్తు = సహస్రజిత్తు; క్రోష్టువున్ = క్రోష్టువు; నలుండున్ = నలుడు; రిపుండున్ = రిపుడు; అను = అనెడి; వారున్ = వారు; నలువురు = నలుగుర (4); సంభవించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; పెద్దకొడుకు = పెద్దకొడుకు; అయిన = ఐన; సహస్రజిత్తున్ = సహస్రజిత్తున; కున్ = కు; శతజిత్తున్ = శతజిత్తు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; శతజిత్తున్ = శతజిత్తున; కున్ = కు; మహాహయ = మహాహయుడు; వేణుహయ = వేణుహయుడు; హేహయులు = హేహయుడులు; అను = అనెడి; వారున్ = వారు; మువ్వురు = ముగ్గురు (3); జనించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; హేహయున్ = హేహయున; కున్ = కు; ధర్ముండున్ = ధర్ముడు; ధర్మున్ = ధర్మున; కున్ = కు; నేత్రుండున్ = నేత్రుడు; నేత్రున్ = నేత్రున; కున్ = కు; కుంతి = కుంతి; కుంతి = కుంతి; కిన్ = కి; మహిష్మంతుండు = మహిష్మంతుడు; మహిష్మంతుని = మహిష్మంతుని; కిన్ = కి; భద్రసేనుండు = భద్రసేనుడు; భద్రసేనున్ = భద్రసేనున; కున్ = కు; దుర్మదుండున్ = దుర్మదుడు; దుర్మదుని = దుర్మదుని; కిన్ = కి; ధనికుండున్ = ధనికుడు; ధనికుని = ధనికుని; కిన్ = కి; కృతవీర్య = కృతవీర్యుడు; కృతాగ్ని = కృతాగ్ని; కృతవర్మ = కృతవర్మ; కృతౌజులు = కృతౌజుడులు; అను = అనెడి; నలువురు = నలుగురు (4); సంభవించిరి = పుట్టిరి; అందున్ = వారిలో; కృతవీర్యున్ = కృతవీర్యుని; కిన్ = కి; అర్జునుండు = అర్జునుడు; జనియించె = పుట్టెను; అతండు = అతను; మహా = గొప్ప; బుద్ధి = జ్ఞానమువలని; బలంబునన్ = శక్తితో.

భావము:

యదువునకు సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రిపుడు, అని నలుగురు కుమారులు పుట్టారు. వారిలో పెద్దకొడుకు సహస్రజిత్తుకు శతజిత్తు పుట్టాడు; శతజిత్తుకు మహాహయుడు, వేణుహయుడు, హేహయుడు అని ముగ్గురు కొడుకులు పుట్టారు; వారిలో హేహయునకు ధర్ముడు; ధర్మునకు నేత్రుడు; నేత్రునకు కుంతి; కుంతికి మహిష్మంతుడు; మహిష్మంతునికి భద్రసేనుడు; భద్రసేనునకు దుర్మదుడు; దుర్మదునికి ధనికుడు; ధనికునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని నలుగురు పుట్టారు. వారిలో కృతవీర్యునికి అర్జునుడు పుట్టాడు. అతను గొప్ప జ్ఞానశక్తితో....