పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పాంచాలాదుల వంశము

  •  
  •  
  •  

9-659-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ కృపి ద్రోణునకు భార్య యయ్యె; దివోదాసునకు మిత్రాయువు, మిత్రాయువునకుఁ జ్యవనుఁడుఁ, జ్యవనునకు సుదాసుండు, సుదాసునకు సహదేవుండు, సహదేవునకు సోమకుండు, సోమకునకు సుజన్మకృత్తు సుజన్మకృత్తునకు నూర్వురు కొడుకులుం గలిగిరి; వారిలో జంతు వనువాఁడు జ్యేష్ఠుండు కడచూలు పృషతుండు పృషతునకు ద్రుపదుండు, ద్రుపదునకు ధృష్టద్యుమ్నాదులయిన కొడుకులును ద్రౌపది యను కూఁతురుం గలిగిరి; ధృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు పుట్టె; వీరలు పాంచాలరాజులని యెఱుంగుము; మఱియు నయ్యజమీఢుని కొడుకు ఋక్షుండు, ఋక్షునకు సంవరణుండా సంవరణుండు తపతి యనియెడి సూర్యకన్య యందుఁ గురువుం గనియె; నా కురువు పేరం గురుక్షేత్రంబయ్యె; నా కురువునకుఁ బరీక్షిత్తు సుధనువు జహ్నవు నిషధుండు ననువారు నలువురు పుట్టి; రందుఁ బరీక్షిత్తు కొడుకులులేక చనియె; సుధనువునకు సుహోత్రుం, డతనికిఁ జ్యవనుండు, చ్యవనునకుఁ గృతి, గృతికి ఉపరిచరవసువు, వసువునకు బృహద్రథ, కుసుంభ, మత్స్య, ప్రత్యగ్ర, చేదిషాదులు పుట్టి; రందు బృహద్రథునకుఁ గుశాగ్రుండు, గుశాగ్రునికి ఋషభుండు, ఋషభునికి సత్యహితుండు, సత్యహితునికిఁ పుష్పవంతుండు పుష్పవంతునకు జహ్ను వనువాఁడు మఱియును.

టీకా:

ఆ = ఆ; కృపి = కృపి; ద్రోణున్ = ద్రోణున; కున్ = కు; భార్య = భార్య; అయ్యెన్ = అయినది; దివోదాసున్ = దివోదాసున; కున్ = కు; మిత్రాయువు = మిత్రాయువు; మిత్రాయువున్ = మిత్రాయువున; కున్ = కు; చ్యవనుండు = చ్యవనుడు; చ్యవనున్ = చ్యవనున; కున్ = కు; సుదాసుండున్ = సుదాసుడు; సుదాసున్ = సుదాసున; కున్ = కు; సహదేవుండు = సహదేవుడు; సహదేవున్ = సహదేవున; కున్ = కు; సోమకుండు = సోమకుడు; సోమకున్ = సోమకున; కున్ = కు; సుజన్మకృత్తు = సుజన్మకృత్తు; సుజన్మకృత్తున్ = సుజన్మకృత్తున; కున్ = కు; నూర్వురున్ = వందమంది (100); కొడుకులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; వారి = వారి; అందున్ = లో; జంతువు = జంతువు; అను = అనెడి; వాడు = వాడు; జ్యేష్ఠుండు = జ్యేష్ఠుడు; కడచూలు = కనిష్ఠుడు; పృషతుండు = పృషతుడు; పృషతున్ = పృషతున; కున్ = కు; ద్రుపదుండు = ద్రుపదుడు; ద్రుపదున్ = ద్రుపదున; కున్ = కు; ధృష్టద్యుమ్న = ధృష్టద్యుమ్నుడు; ఆదులు = మున్నగువారు; అయిన = ఐనట్టి; కొడుకులును = పుత్రులును; ద్రౌపది = ద్రౌపది; అను = అనెడి; కూతురున్ = పుత్రిక; కలిగిరి = పుట్టిరి; దృష్టద్యుమ్నున్ = దృష్టద్యుమ్నున; కు = కు; ధృష్టకేతువు = ధృష్టకేతువు; పుట్టెన్ = జన్మించెను; వీరలు = వీరు; పాంచాలరాజులు = పాంచాలరాజులు; అని = అని; ఎఱుంగుము = తెలిసికొనుము; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; అజమీఢుని = అజమీఢుని; కొడుకు = పుత్రుడు; ఋక్షుండున్ = ఋక్షుడు; ఋక్షున్ = ఋక్షున; కున్ = కు; సంవరణుండు = సంవరణుండు; ఆ = ఆ; సంవరణుండు = సంవరణుడు; తపతి = తపతి; అనియెడి = అనెడి; సూర్య = సూర్యుని; కన్య = పుత్రిక; అందున్ = వలన; కురువున్ = కురువును; కనియెన్ = పొందెను; ఆ = ఆ; కురువు = కురువు; పేరన్ = పేరుమీద; కురుక్షేత్రంబు = కురుక్షేత్రము; అయ్యెన్ = ఏర్పడినది; ఆ = ఆ; కురువున్ = కురువున; కున్ = కు; పరీక్షిత్తు = పరీక్షిత్తు; సుధనువున్ = సుధనువు; జహ్నవు = జహ్నవు; నిషదుండు = నిషదుడు; అను = అనెడి; వారు = వారు; నలువురు = నలుగురు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; పరీక్షిత్తు = పరీక్షిత్తు; కొడుకులు = పుత్రులు; లేక = లేకుండ; చనియెన్ = మరణించెను; సుధనువున్ = సుధనువున; కున్ = కు; సుహోత్రుండున్ = సుహోత్రుడు; అతని = అతని; కిన్ = కి; చ్యవనుండు = చ్యవనుడు; చ్యవనున్ = చ్యవనున; కున్ = కు; ఉపరిచరవసువు = ఉపరిచరవసువు; వసువున్ = వసువున; కున్ = కు; బృహద్రథ = బృహద్రథుడు; కుసుంభ = కుసుంభుడు; మత్స్య = మత్స్యుడు; ప్రత్యగ్ర = ప్రత్యగ్రుడు; చేదిష = చేదిషుడు; ఆదులు = మున్నగువారు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో; బృహద్రథున్ = బృహద్రథున; కున్ = కు; కుశాగ్రుండు = కుశాగ్రుడు; కుశాగ్రుని = కుశాగ్రుని; కిన్ = కి; ఋషభుండు = ఋషభుడు; ఋషభుని = ఋషభుని; కిన్ = కి; సత్యహితుండు = సత్యహితుడు; సత్యహితుని = సత్యహితుని; కిన్ = కి; పుష్పవంతుండు = పుష్పవంతుడు; పుష్పవంతున్ = పుష్పవంతున; కున్ = కు; జహ్నువు = జహ్నవు; అను = అనెడి; వాడు = వాడు; మఱియునున్ = ఇంకను.

భావము:

ఆ కృపి ద్రోణునకు భార్య అయింది. దివోదాసునకు మిత్రాయువు; మిత్రాయువునకు చ్యవనుడు; చ్యవనునకు సుదాసుడు; సుదాసునకు సహదేవుడు; సహదేవునకు సోమకుడు; సోమకునకు సుజన్మకృత్తు; సుజన్మకృత్తునకు వందమంది పుత్రులు పుట్టారు. వారిలో జంతువు జ్యేష్ఠుడు, పృషతుడు కనిష్ఠుడు; పృషతునకు ద్రుపదుడు; ద్రుపదునకు ధృష్టద్యుమ్నుడు మున్నగు పుత్రులు, ద్రౌపది అను పుత్రిక పుట్టారు. దృష్టద్యుమ్నునకు ధృష్టకేతువు జన్మించాడు. వీరిని పాంచాల రాజులు అంటారు. ఇంకను ఆ అజమీఢుని పుత్రుడు ఋక్షుడు; ఋక్షునకు సంవరణుడు పుట్టాడు; ఆ సంవరణుడు సూర్యపుత్రి తపతి వలన కురువును పొందాడు. ఆ కురువు పేరుమీద కురుక్షేత్రం ఏర్పడింది. ఆ కురువునకు పరీక్షిత్తు (ఇతను శుక శిష్యుడైన పరీక్షిత్తు కాదు), సుధనువు, జహ్నవు, నిషదుడు, అని నలుగురు కొడుకులు జన్మించారు. వారిలో పరీక్షిత్తు పుత్రులు లేకుండ మరణించాడు. సుధనువునకు సుహోత్రుడు; అతనికి చ్యవనుడు; చ్యవనునకు ఉపరిచరవసువు; వసువునకు బృహద్రథుడు, కుసుంభుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిషుడు మున్నగు కుమారులు జన్మించారు. వారిలో బృహద్రథునకు కుశాగ్రుడు; కుశాగ్రునికి ఋషభుడు; ఋషభునికి సత్యహితుడు; సత్యహితునికి పుష్పవంతుడు; పుష్పవంతునకు జహ్నవు పుట్టారు.