పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పురూరవుని కథ

  •  
  •  
  •  

9-387-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ బుధునకుఁ దొల్లి చెప్పిన యిళాకన్యకవలనఁ బురూరవుండు పుట్టె; నా పురూరవునకుం గల శౌర్యసౌందర్యగాంభీర్యాది గుణంబులు నారదునివలన నింద్రసభలోన నూర్వశి విని; మిత్రావరుణశాపంబున మనుష్యస్త్రీరూపంబు దాల్చి, భూలోకంబునకు వచ్చి, యప్పురూరవు ముందట నిలువంబడి.

టీకా:

ఆ = ఆ; బుధున్ = బుధున; కున్ = కు; తొల్లి = పూర్వము; చెప్పిన = తెలిపినట్టి; ఇళాకన్య = ఇళ యనెడి ఆమె; వలన = అందు; పురూరవుండు = పురూరవుడు; పుట్టెన్ = జన్మించెను; ఆ = ఆ; పురూరవున్ = పురూరవున; కున్ = కు; కల = ఉన్నట్టి; శౌర్య = శౌర్యము; సౌందర్యము = అందము; గాంభీర్య = గాంభీర్యము; ఆది = మున్నగు; గుణంబులు = లక్షణములు; నారదుని = నారదుని; వలనన్ = నుండి; ఇంద్రసభ = ఇంద్రుని సభ; లోనన్ = అందు; ఊర్వశి = ఊర్వశి; విని = విని; మిత్రావరుణ = మిత్రావరుణుల; శాపంబునన్ = శాపమువలన; మనుష్య = మానవ; స్త్రీ = కాంత; రూపంబున్ = ఆకారమును; తాల్చి = ధరించి; భూలోకంబున్ = భూలోకమున; కున్ = కు; వచ్చి = వచ్చి; ఆ = ఆ; పురూరవు = పురూరవుని; ముందటన్ = ఎదురుగా; నిలువంబడి = నిలబడి.

భావము:

ఆ బుధుడికి ఇంతకు ముందు చెప్పిన ఇళ అందు పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుని శౌర్యం అందం గాంభీర్యం మున్నగు లక్షణాలు నారదుని వలన ఇంద్రసభలో ఊర్వశి విన్నది. పిమ్మట మిత్రావరుణుల శాపంవలన మానవ రూపం పొంది భూలోకానికి వచ్చింది. ఆమెకు పురూరవుడు ఎదురయ్యాడు.

9-388-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిజాక్షు మృగేంద్రమధ్యు విశాలవక్షు మహాభుజున్
సురుచిరాననచంద్రమండలశోభితున్ సుకుమారు నా
పురుషవర్యుఁ బురూరవుం గని పువ్వుటంపఱజోదుచేఁ
దొరఁగు క్రొవ్విరితూపులన్ మది దూలిపోవఁగ భ్రాంతయై.

టీకా:

సరసిజాక్షున్ = పద్మనయనుని; మృగేంద్రమధ్యున్ = సింహము వంటి నడుము కలవాని; విశాలవక్షున్ = విశాలమైన వక్షము కలవాని; మహాభుజున్ = గొప్ప భుజబలము కలవాని; సు = మంచి; రుచిర = అందమైన; ఆనన = మోము యనెడి; చంద్రమండల = చంద్రమండలముతో; శోభితున్ = శోభిల్లుతున్నవాని; సుకుమారున్ = కోమలమైన వాని; ఆ = ఆ; పురుష = పురుషులలో; వర్యున్ = ఉత్తముని; పురూరవున్ = పురూరవుని; కని = కనుగొని; పువ్వుటంపఱజోదు = మన్మథుని {పువ్వు టంపఱ జోదు - పూల బాణముల వీరుడు, మన్మథుడు}; చేన్ = చేత; తొరగు = వేయబడిన; క్రొవిరి = తాజా పూల {క్రొ వ్విరులు - సరిక్రొత్త పూలు}; తూపులన్ = బాణములచే; మది = మనసు; తూలిపోవగన్ = తూలిపోవుటవలన; భ్రాంత = వివశురాలు; ఐ = అయ్యి.

భావము:

అలా వచ్చిన ఊర్వశి పద్మనయనుడు, సింహమధ్యముడు, విశాలవక్షుడు, మహా బలశాలి. చంద్రబింబంలాంటి అందమైన మోముతో శోభిల్లే వాడు. సుకుమారుడు. పురుషశ్రేష్ఠుడు అయిన పురూరవుడిని చూసింది. అలా చూసి మన్మథ పూల బాణాలకు మనసు తూలి వివశురాలు అయింది.

9-389-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఊర్వశి నిలిచి యున్నంత.

టీకా:

ఊర్వశి = ఊర్వశ్; నిలిచి = నిలబడి; ఉన్నంతన్ = ఉండగా.

భావము:

అలా భ్రాంతురాలై ఊర్వశి నిలబడిపోయి ఉండగా...

9-390-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భాజుదీమమో? మొగులుఁబాసి వెలుంగు మెఱుంగొ? మోహినీ
దేతయో? నభోరమయొ? దీనికరగ్రహణంబు లేనిచో
జీన మేటి" కంచు మరుచేఁ జిగురా కడిదమ్ము జిమ్ములం
దా డఁకెం బురూరవుఁడు దామరపాకు జలంబు కైవడిన్.

టీకా:

భావజున్ = మన్మథుని {భావజుడు - భావము (సంకల్పము)న పుట్టువాడు, మన్మథుడు}; దీమమో = ఎర ఏమో; మొగులు = మబ్బులు; బాసి = విడి; వెలుగు = ప్రకాశించెడి; మెఱుంగొ = మెరుపుతీగ ఏమో; మోహినీదేవతయో = మోహినీదేవి ఏమో; నభోరమయొ = ఆకాశలక్ష్మి ఏమో; దీనిన్ = ఈమెను; కరగ్రహణంబు = చేపట్ట; లేనిచోన్ = లేకపోతే; జీవనము = బతుకు; ఏటికి = ఎందుకు; అంచున్ = అనుచు; మరు = మన్మథుని; చేన్ = చేతిలోని; చిగురాకు = చిగురాకు యనెడి; అడిదమ్ము = కత్తి; చిమ్ములన్ = దెబ్బలకు; వడకెన్ = వణికిపోయెను; పురూరవుడు = పురూరవుడు; తామరాకు = తామర ఆకు మీది; జలంబున్ = నీటిబొట్టు; కైవడిన్ = వలె.

భావము:

“ఊర్వశిని అలా చూసిన పురూరవుడు తనను వశం చేసుకోడానికి వేసిన ఎరా; మబ్బులనుండి దిగివచ్చిన మెఱుపుతీగా; మోహినీదేవా; ఆకాశలక్ష్మా ఈమె. ఈమెను చేపట్ట లేని జీవితం ఎందుకు అనుకుంటూ” మన్మథుని చేతిలోని చిగురాకు బాకు దెబ్బల వల్ల, తామరాకుమీది నీటిబొట్టులా వణికిపోయాడు.

9-391-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లా రాచపట్టి చెఱుకువింటివాని దాడికి నోడి, యెట్టకేలకు సైరణ జేసి నిలుకడఁ దెచ్చికొని, యచ్చెలువ కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆ = ఆ; రాచపట్టి = రాకుమారుడు; చెఱకువింటివాని = మన్మథుని {చెఱకు వింటి వాడు - చెరుకుగడ వింటివాడు (విల్లుగగ లవాడు), మన్మథుడు}; దాడి = దండెత్తుట; కిన్ = కి; ఓడి = ఓడిపోయి; ఎట్టకేలకున్ = చిట్టచివరకు; సైరణజేసి = తట్టుకొని; నిలుకడన్ = స్థిమితము; తెచ్చికొని = తెచ్చుకొని; ఆ = ఆ; చెలువ = సుందరి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా ఆ రాకుమారుడు మరుని దాడికి ఓడి, చివరకి ఎలాగో తట్టుకొని స్థిమితపడి ఆ సుందరితో ఇలా అన్నాడు.

9-392-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్కడనుండి రాక? మన కిద్ధఱకుం దగు నీకు దక్కితిన్
మ్రుక్కడి వచ్చెనే యలరుముల్కులవాఁ డడిదంబుఁ ద్రిప్పుచే
దిక్కు నెఱుంగ జూడు నను దేహము దేహముఁ గేలుఁ గేల నీ
చెక్కునఁ జెక్కు మోపి తగుచెయ్వుల నన్ను విపన్నుఁ గావవే."

టీకా:

ఎక్కడ = ఏ ప్రదేశము; నుండి = నుండి; రాక = వచ్చితివి; మన = మనము; కిన్ = కి; ఇద్దఱ = ఉభయుల; కున్ = కి; తగు = సరిపడును; నీ = నీ; కున్ = కు; దక్కితిన్ = చిక్కితిని; మ్రుక్కడి = ముంచుకొని; వచ్చెన్ = వచ్చినాడు; నేన్ = నేను; అలరుముల్కులవాడు = మన్మథుడు; అడిదంబున్ = కత్తిని; త్రిప్పు = తిప్పుట; చేత = వలన; దిక్కునెఱుంగక = దిక్కుతోచకనుంటి; చూడు = చూడుము; ననున్ = నన్ను; దేహము = శరీరమునకు; దేహమున్ = శరీరమును; కేలున్ = చేతిలో; కేలన్ = చేతిని; నీ = నీ యొక్క; చెక్కునన్ = చెంపకు; చెక్కున్ = చెంపను; మోపి = చేర్చి; తగు = తగిన; చెయ్వులన్ = పనులతో; నన్నున్ = నన్ను; విపన్నున్ = విపత్తులనొందినవాని; కావవే = కాపాడుము.

భావము:

“ఓ సుందరీ! ఎక్కడ నుండి వచ్చావు. మనిద్దఱికి ఈడూ జోడు సరిపోయింది. నీ వలపుకు చిక్కాను, మన్మథుడు కత్తి తిప్పుతుంటే నాకు దిక్కుతోచటంలేదు. నన్ను దయచూడు. చేతిలో చెయ్యి వేసి పట్టుకో. చెంపకు చెంప చేర్చు, బిగికౌగిలి అందించు. విపన్నుడనైన నన్ను కాపాడు.”

9-393-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినం బ్రోడ చేడియ యిట్లనియె

టీకా:

అనినన్ = అనగా; ప్రోడ = ప్రౌఢురాలైన; చేడియ = యువతి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని పురూరవుడు అనగా ప్రౌఢురాలైన ఊర్వశి ఈ విధంగా పలికింది.

9-394-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వె నాకూర్చు తగళ్ళు రెండు దగ నీ వెల్లప్పుడుం గాచెదే
ని వివస్త్రుండవుగాక నాకడఁ దగన్ నీవుండుదేనిన్ విశే
విలాసాధిక! నీకు నా ఘృతము భక్ష్యంబయ్యెనేనిన్ మనో
వినోదంబుల నిన్నుఁ దేల్తు నగునే చంద్రాన్వయగ్రామణీ!"

టీకా:

ఇవె = ఇవిగో; నా = నా యొక్క; కూర్చు = ప్రియమైన; తగళ్ళు = పొట్టేళ్ళు {తగరు - తగళ్ళు(బహువచనం)}; రెండున్ = రెంటిని; తగన్ = చక్కగ; నీవున్ = నీవు; ఎల్లప్పుడున్ = ఎప్పుడు; కాచెదు = కాపాడెదవు; ఏని = అయినచో; వివస్త్రుండవు = దిగంబరుడవు; కాక = కాకుండగ; నా = నా; కడన్ = వద్ద; తగన్ = చక్కగ; నీవున్ = నీవు; ఉండెదు = ఉండెదవు; ఏనిన్ = అయినచో; విశేష = శ్రేష్ఠమైన; విలాస = విలాయములు; అధిక = ఎక్కువగాగలవాడ; నీ = నీ; కున్ = కు; నా = నాచే; ఘృతమున్ = నెయ్యి; భక్ష్యంబు = మింగుడుపడినది; అయ్యెన్ = అయనట్టిది; ఏనిన్ = అయినచో; మనోజవినోదంబుల = మన్మథక్రీడలలో; నిన్నున్ = నిన్ను; తేల్తున్ = ఓలలాడించెదను; అగునే = అంగీకారమేనా; చంద్రాన్వయ = చంద్రవంశపు; గ్రామణీ = ముఖ్యుడా.

భావము:

రసికశిరోమణి! పురూరవ! నావి రెండు నిబంధనలు ఉన్నాయి అవి నీవు అంగీకరించి అతిక్రమించ కుండా ఉంటేనే నీతో కలిసి ఉంటాను. నిన్ను మన్మథ సుఖాలలో ఓలలాడిస్తాను. అవి ఇవిగో నాకు ప్రాణసమానమైన ఈ రెండు పొట్టేళ్ళను, చక్కగ నీవు ఎప్పుడు కాపాడుతూ ఉండాలి, ఎప్పుడూ దిగంబరంగా నా ఎదుట తిరుగరాదు. నీకు అంగీకారమేనా.” 9

9-395-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన వేల్పులవెలయాలి ప్రతినమాటల కియ్యకొని తన మనంబున.

టీకా:

అని = అని; పలికిన = చెప్పిన; వేల్పులవెలయాలి = అప్సరస; ప్రతినమాటల = ప్రతిజ్ఞచేసిన పలుకుల; కిన్ = కు; ఇయ్యకొని = అంగీకరించి; తన = అతని యొక్క; మనంబున = మనసునందు.

భావము:

అని అప్సరస ఊర్వశి అనగా ఆ నియమ నిబంధనలకు అంగీకరించి తన మనసులో ఇలా అనుకున్నాడు.

9-396-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మంచిదఁట రూపు సంతతి
నంచిత యౌ దేవగణిక యఁట మరుచేతన్
సంలితచిత్త యై కా
మించిన దఁట యింతకంటె మేలుం గలదే."

టీకా:

మంచిది = మంచి ఆమె; అట = అట; రూపు = అందము; సంతతిన్ = పుట్టుక; అంచిత = కలిగినామె; ఔ = బాగున్నది; దేవగణిక = దేవవేశ్య, అప్సరస; అటన్ = అట; మరు = మన్మథుని; చేతన్ = వలన; సంచలితచిత్త = పరవశురాలు; ఐ = అయ్యి; కామించినది = వలచినది; అటన్ = అట; ఇంత = దీని; కంటెన్ = కంటె; మేలు = వలచదగినది; కలదే = ఉన్నదా, లేదు.

భావము:

ఇది అన్నివిధాలా బాగుంది. ఈమె మంచి అందం పుట్టుక కలిగినామె. దేవవేశ్య, పైగా వలచి వచ్చింది. ఇంత కంటె మేలైంది ఏమి ఉంటుంది. ఈమెను ఎలాగైనా చేపట్టవలసిందే.”

9-397-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని నిశ్చయించుకొని.

టీకా:

అని = అని; నిశ్చయించుకొని = నిర్ణయించుకొని. అని నిర్ణయించుకొని….

భావము:

అని నిర్ణయించుకొని….

9-398-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజు రాజముఖిని తిఁదేల్చె బంగారు
మేడలందుఁ దరుల నీడలందుఁ
దోఁటలందు రత్నకూటంబులందును
గొలఁకులందు గిరులకెలఁకులందు.

టీకా:

రాజు = రాజు; రాజముఖిని = అందగత్తెను {రాజముఖి - రాజ (చంద్రుని)వంటి ముఖి, వనిత}; రతిన్ = సురత సుఖములలో; తేల్చెన్ = ఓలలాడించెను; బంగారు = బంగారపు; మేడలు = భవనముల; అందున్ = లోను; తరుల = చెట్ల; నీడలు = ఛాయలు; అందున్ = లోను; తోటలు = ఉద్యానవనములు; అందున్ = లోను; రత్న = రత్నాల; కూటంబులు = చావళ్ళు; అందునున్ = లోను; కొలంకుల్ = సరోవరములు; అందున్ = లోను; గిరుల = కొండ; కెలకులు = పక్కలు; అందు = లోను.

భావము:

పురూరవుడు ఆ అందగత్తెను బంగారు భవనాలలో, చెట్లనీడలలో, ఉద్యానవనాలలో, రత్నాల చావళ్ళలో, గిరి శిఖరాలలో, సరస్సులలో; సరసాలతో సురతసుఖాలలో ముంచి తేల్చాడు.

9-399-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత న య్యిద్ధఱకుం దగులంబు నెలకొనిన.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; ఇద్దఱ = ఇద్దరి; కున్ = కి; తగులంబు = పొత్తు; నెలకొని = కుదిరి. అంతట ఆ ఇద్దరికి పొత్తు కుదిరింది.

భావము:

అంతట ఆ ఇద్దరికి పొత్తు కుదిరింది.

9-400-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిక్క కాని చనఁబో
రొచోటన కాని నిలిచి యుండరు దమలో
నొటియ కాని తలంపరు
నొనిమిషముఁ బాయలేరు నువిదయు ఱేఁడున్.

టీకా:

ఒక = ఒకే; దిక్క = వైపుకు; కాని = తప్పించి; చనబోరు = వెళ్ళరు; ఒక = ఒకే; చోటనన్ = ప్రదేశములో; కాని = తప్పించి; నిలిచి = ఆగి; ఉండరు = ఉండరు; తమలోన్ = వారిలోవారు; ఒకటియ = ఒకటే; కాని = తప్పించి; తలంపరు = అనుకొనరు; ఒక = ఒకటైనా; నిమిషమున్ = నిమిషముపాటు; పాయలేరు = విడిచివుండలేరు; ఉవిదయన్ = రమణి; ఱేడున్ = రాజు.

భావము:

రాజు పురూరవుడు రమణి ఊర్వశి ఇద్ధరూ ఒకే దిక్కుకు వెళ్ళేవారు. ఒకే చోట ఉండే వారు. వారిలోవారు ఒకేలా తలచేవారు. ఒక్క క్షణమైనా విడిచి ఉండేవారు కాదు.

9-401-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

య్య మెఱుంగున్ వారల
నెయ్యంబులు మక్కువలును నిజమరితనముల్
వియ్యములును నెడసందిని
య్యదకొం గడ్డమైనఁ బ్రాణము వెడలున్.

టీకా:

దయ్యము = దేముడికే; ఎఱుంగున్ = తెలియును; వారల = వారి యొక్క; నెయ్యంబులున్ = స్నేహములు; మక్కువలును = ప్రేమలు; నిజమరితనముల్ = అంగీకారములు; వియ్యములునున్ = వియ్యములు; ఎడసందినిన్ = నడుమ అందు; పయ్యద = పైట; కొంగు = కొంగు; అడ్డమైనన్ = అడ్డము వచ్చినను; ప్రాణము = ప్రాణాలు; వెడలున్ = పోవునట్లుగ.

భావము:

వారిద్దరి స్నేహాలు, ప్రేమలు, వియ్యాలు ఆ దేముడికే తెలుసు. ఇద్దరి మధ్యా పైట కొంగు అడ్డం వచ్చినా ప్రాణాలు పోతాయి అన్నట్లు ఉండేవారు.

9-402-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇ ట్లూర్వశియుం బురూరవుండు నొండొరులవలన మక్కువలు చెక్కులొత్త బగళ్ళు రేలు నెల్లడల విహరింప నొక్కనాఁడు దేవలోకంబున దేవేంద్రుండు గొలువుండుతఱిఁ గొలువున నూర్వశి లేకుండుటం జూచి.

టీకా:

ఇట్లు = ఇలా; ఊర్వశియున్ = ఊర్వశి; పురూరవుండున్ = పురూరవుడు; ఒండొరులన్ = వారిలోవారి; వలన = ఎడల; మక్కువలున్ = అనురాగములు; చెక్కులొత్తన్ = అతిశయించుతుండ; పగళ్ళున్ = దివసము లందు; రేలున్ = రాత్రు లందు; ఎల్లెడలన్ = అన్ని చోట్లను; విహరింపన్ = క్రీడించుచుండగా; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; దేవలోకంబునన్ = స్వర్గములో; దేవేంద్రుడున్ = ఇంద్రుడు; కొలువుండు = కొలువుతీరిన; తఱిన్ = సమయము నందు; కొలువునన్ = సభలో; ఊర్వశి = ఊర్వశి; లేకుండుటన్ = లేకపోవుటను; చూచి = కనుగొని;

భావము:

ఇలా ఊర్వశి పురూరవుడు పరస్పర అనురాగాలు అతిశయిస్తుండగా రాత్రింబవళ్ళు ఎల్లెడలా తామే అయి క్రీడిస్తున్నారు. ఇంతలో ఒకనాడు స్వర్గంలో ఇంద్రుడు కొలువులో ఊర్వశి లేకపోవుట కనుగొన్నాడు.

9-403-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నిదినంబులకును మన
మున్న సభామధ్యవేది యూర్వశి లేమిన్
విన్నఁదనంబున నున్నది
న్నె దఱిఁగియున్న బసిఁడిడువున ననుచున్.

టీకా:

ఇన్నిదినంబుల్ = ఇన్నాళ్ళ; కును = కు; మనము = మనము; ఉన్న = ఉన్నట్టి; సభా = సభకు; మధ్యన్ = మధ్యలోని; వేదిన్ = వేదికపైన; ఊర్వశి = ఊఱ్వశి; లేమిన్ = లేకపోవుటచేత; విన్నదనంబునన్ = చిన్నబోయినదై; ఉన్నది = ఉన్నది; వన్నె = మెరుపు; తఱగి = తగ్గిపోయి; ఉన్న = ఉన్నట్టి; పసిడి = బంగారము; వడువునన్ = వలె; అనుచున్ = అంటూ.

భావము:

ఎప్పుడూ సభావేదిక మీద ఊర్వశి లేకపోడంతో కాంతిహీనమైన బంగారంలా చిన్నబోయింది” అంటూ.

9-404-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంద్రుండు గంధర్వులం బనిచిన వారు నడురేయిం జని చీఁకటి నూర్వశి పెంచుచున్న యేడకంబులం బట్టిన నవి రెండును మొఱపెట్టిన; వాని మొఱ విని రతిఖిన్నుండై మేను మఱచి కూరుకుచున్న పురూరవు కౌఁగిటనుండి యూర్వశి యిట్లనియె.

టీకా:

ఇంద్రుండు = ఇంద్రుడు; గంధర్వులన్ = గంధర్వులను; పనిచినన్ = పంపించగా; వారున్ = వారు; నడురేయిన్ = అర్థరాత్రి; చని = వెళ్ళి; చీకటిన్ = చీకట్లో; ఊర్వశి = ఊర్వశి; పెంచుచున్న = పెంచుకుంటున్న; ఏడకంబులన్ = పొట్టేళ్ళను; పట్టినన్ = పట్టుకు పోతుండగ; అవి = అవి; రెండును = రెండు; మొఱపెట్టినన్ = ఆర్తనాదాలు చేయ; వానిన్ = వాటి యొక్క; మొఱ = అరుపులను; విని = విని; రతి = సురతమువలన; ఖిన్నుడు = అలసినవాడు; ఐ = అయ్యి; మేను = ఒళ్ళు; మఱచి = తెలియకుండ; కూరుకుచున్ = నిద్రపోవుచు; ఉన్న = ఉన్నట్టి; పురూరవు = పురూరవుని; కౌగిటన్ = ఆలింగనము; నుండి = నుండి; ఊర్వశి = ఊర్వశి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇంద్రుడు గంధర్వులను పంపించాడు. వారు అర్థరాత్రి వేళ చీకట్లో ఊర్వశి పెంచుకొంటున్న పొట్టేళ్ళను పట్టుకుపోసాగారు. అవి రెండు గట్టిగా అరవసాగాయి. వాటి అరుపులను వినిన ఊర్వశి, తన కౌగిలిలో రతి అనంతరం అలసిపోయి ఒళ్ళు తెలియకుండ నిద్రపోతున్న పురూరవుడితో ఇలా అన్నది.

9-405-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దె నా బిడ్డలఁ బట్టి దొంగలు మహాహంకారులై కొంచు ను
న్మదులై పోయెద; రడ్డపాటునకు సార్థ్యంబునన్ హీనుఁడై
లం డీ మగపంద కూరుకుగతిం న్మూసి గుర్వెట్టుచున్
లం జాలఁడు నాదుకౌఁగిలియు దా వంధ్యాత్ముఁడై చెల్లరే."

టీకా:

అదె = అదిగో; నా = నా యొక్క; బిడ్డలన్ = పిల్లలను; పట్టి = దొంగిలించుకొని; దొంగలు = దొంగలు; మహా = మిక్కిలి; అహంకారులు = కొవ్వెక్కినవారు; ఐ = అయ్యి; కొంచున్ = తీసుకుపోతూ; మదులు = మదించినవారు; ఐ = అయ్యి; పోయెదరు = పారిపోతున్నారు; అడ్డపాటున్ = అడ్డుపడుట; కున్ = కు; సామర్థ్యంబునన్ = చేవ; హీనుడు = లేనివాడు; ఐ = అయ్యి; కదలండు = కాలుకదపడు; ఈ = ఈ; మగపంద = పిరికిపంద మగడు; కూరుకున్ = నిద్రపోవుచున్నవాని; గతిన్ = వలె; కన్మూసి = కళ్లు మూసుకొని; గుర్వెట్టుచున్ = గుఱ్ఱెడుతు; వదలన్ = వదలిపెట్ట; చాలడు = లేడు; నాదు = నా యొక్క; కౌగిలియున్ = కౌగిలినైన; తాన్ = అతను; వంధ్యాత్ముడు = పనికిమాలినవాడు; ఐ = అయ్యి; చెల్లరే = అయ్యయ్యో.

భావము:

“అదిగో నా పిల్లలను దొంగలు కొవ్వెక్కి ఎత్తుకుపోతున్నారు. మదించి పారిపోతున్నారు. అడ్డుపడటానికి చేవలేక కాలుకదపటం లేదు. అయ్యయ్యో! ఈ పిరికిపంద మగడు నిద్రపోతున్నట్లు కళ్లుమూసుకొని గుఱ్ఱెడుతున్నాడు. పనికిమాలినవాడిలా నా కౌగిలైనా వదలటం లేదు.

9-406-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురు దొంగల రేఁపఁగ
గఁటిమి పాటింపలేక గతన మెల్లన్
గువల కౌఁగిటఁ జూపెడు
వాఁ డగుకంటె మగఁడు గువగు టొప్పున్.

టీకా:

పగతురు = శత్రువులు; దొంగలన్ = దొంగలను; రేపగన్ = రెచ్చగొట్టగా; మగటిమిన్ = పౌరుషము; పాటింపన్ = చూపెట్ట; లేక = లేక; మగతనము = తన పౌరుషము; ఎల్లన్ = అంతటిని; మగువల = పడతుల; కౌగిటన్ = ఆలింగనము లందే; చూపెడు = చూపెట్టెడి; మగవాడు = పురుషుడు; అగుట = ఐ యుండుట; కంటెన్ = కంటె; మగడు = భర్త; మగువ = ఇంతి; అగుట = ఔట; ఒప్పున్ = సరియైనది.

భావము:

శత్రువులు దొంగలను రెచ్చగొడుతుంటే పౌరుషం చూపెట్ట లేక పోతున్నాడు. తన ఇంతోటి పౌరుషం ఆలి ఆలింగనంలోనే చూపెట్టె మగడు మగవాడు కావడం కంటె మగువ కావడమే మేలు.

9-407-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధముఁడైనవాని కా లగుకంటె న
త్యధికునింట దాసి గుట మేలు;
హీనుఁ బొంది యోని హింసింపఁగా నేల?
యువతిజనుల కూరకుంట లెస్స.

టీకా:

అధముడు = అల్పుడు; ఐన = అయిన; వానిన్ = వాని; కిన్ = కి; ఆలు = భార్య; అగుట = ఐ యుండుట; కంటెన్ = కంటె; అత్యధికున్ = గొప్పవాని; ఇంటన్ = ఇంట్లో; దాసి = పనిమనిషి; అగుట = ఐ యుండుట; మేలు = ఉత్తమము; హీనున్ = పౌరుషము లేనివాని; పొంది = కలిసి; యోనిన్ = ఉపస్థును; హింసింపగన్ = బాధించుట; ఏలన్ = ఎందుకు; యువతి = మగువలైన; జనుల్ = వారి; కిన్ = కి; ఊరకుంటన్ = ఉత్తినే ఉండుట; లెస్స = సరియైనది.

భావము:

ఇంత అల్పుడికి భార్యగా ఉండడం కంటె, గొప్పవాళ్ళ ఇంట్లో పనిమనిషిగా ఉండడం ఉత్తమం కదా. పౌరుషంలేని వాడిని కలియడం ఎందుకు ఉపస్థును బాధించడం ఎందుకు. అంతకన్నా మగువ ఊరికే ఉండడం సరైన పని.

9-408-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టికి నీ రాచఱికం
బాఁది మొఱపెట్టఁ బశువులాతురపడ నో
యాఁదని లేచి దొంగల
గీఁవు వెడలంగ శవము క్రియనుండె దిదే.

టీకా:

దొంఏటికిన్ = ఎందుకొచ్చినది; నీ = నీ యొక్క; రాచఱికంపు = క్షాత్రము యొక్క; పాటు = గొప్పదనము; అది = అది; మొఱపెట్టన్ = అరచి గీపెడుతున్న; పశువులు = జంతువులు; ఆతురపడన్ = ఆర్తి చెందుతుండగ; ఓయాటది = ఓయ్ ఏమిటది; అని = అని; లేచి = పైకిలేచి; దొంగలన్ = దొంగలను; గీటవు = గెంటివేయవు; వెడలంగ = వదలి పారిపోవునట్లు; శవము = పీనుగు; క్రియన్ = లాగ; ఉండెడిది = పడున్నావు; ఇదే = ఇదిగో.

భావము:

ఏపాటిది నీ రాజరిక గొప్పదనం. అరచి గీపెడుతున్నా, నోరులేని జంతువులు ఆర్తితో అరుస్తున్నా పట్టించుకేవు. దొంగలను తరిమికొట్టవు. ఇలా పీనుగు లాగ పడున్నావు.

9-409-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వినియు వినవు రణభీరువు
నుజాధము నిదురపోతు మందుని నకటా!
నినుఁ జక్రవర్తిఁ జేసిన
జాసనుకంటె వెఱ్ఱివాఁడును గలఁడే."

టీకా:

వినియున్ = విన్నప్పటికిని; వినవు = వినిపించుకొనవు; రణ = యుద్ధ మంటే; భీరువు = భయపడువాడవు; మనుజ = మానవులలో; అధమున్ = అధముడవు; నిదురపోతు = నిద్రా లోలుడవు, బద్దకుడవు; మందునిన్ = చొరవ లేనివాడవు; అకటా = అయ్యో; నినున్ = నిన్ను; చక్రవర్తిన్ = రాజాధిరాజును; చేసిన = చేసినట్టి; వనజాసనున్ = బ్రహ్మదేవుడి; కంటెన్ = కంటె; వెఱ్ఱివాడు = తెలివితక్కువవాడు; కలడె = ఉన్నాడా, లేడు.

భావము:

విన్నా విననట్లే ఉన్నావు. యుద్ధమంటే భయపడేవాడవు, మానవాధముడవు, నిద్రాబోతువి, బద్దకస్తుడివి, మందుడివి. అయ్యో! నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మదేవుడి కంటె వెఱ్ఱివాడు ఉంటాడా?”

9-410-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పెక్కుభంగుల నయ్యింతి పరుషపుపలుకులను కఱకువాలమ్ములు చెవులఁజొనుప, నా రాజశేఖరుం డంకుశంబుపోట్లనడరు మదగజంబు చందంబునఁ జీర మఱచి దిగంబరుండై లేచి వాలు కేలనంకించి, యా నడురేయి దొంగల నఱికివైచి మేషంబుల విడిపించుకొని, తిరిగివచ్చు నెడ.

టీకా:

అని = అని; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగా; ఆ = ఆ; ఇంతి = వనిత; పరుషపు = నిష్ఠూరపు; పలుకులు = మాటలు; అను = అనెడి; కఱకు = కర్కశమైన; వాలమ్ములన్ = కత్తులను; చెవులన్ = చెవుల లోపలకి; చొనుపన్ = దూర్చగా; ఆ = ఆ; రాజ = రాజులలో; శేఖరుండు = గొప్పవాడు; అంకుశంబు = అంకుశముచేత; పోట్లన్ = పొడచుటచేత; అడరు = త్వరపడెడి; మద = మదించిన; గజంబున్ = ఏనుగు; చందంబునన్ = వలె; చీర = వస్త్రము; మఱచి = మరిచిపోయి; దిగంబరుండు = దిసమొలవాడు; ఐ = అయ్యి; లేచి = పైకిలేచి; వాలున్ = కత్తిని; కేలన్ = చేతిలో; అంకించి = అందుకొని; అ = ఆ; నడురేయిన్ = అర్థరాత్రి; దొంగలన్ = దొంగలను; నఱకివైచి = తెగనరికి; మేషంబులన్ = పొట్టేళ్ళను; విడిపించుకొని = విడిపించికొని; తిరిగి = వెనుకకు; వచ్చున్ = వచ్చెడి; ఎడన్ = సమయమునందు.

భావము:

అని రకరకాలుగా ఆ ఊర్వశి కత్తులు చెవుల్లో దూర్చినట్లుగా నిష్ఠూరాలు ఆడుతోంది. ఆ రాజోత్తముడు అంకుశం పోటు తిని కలవరపడే ఏనుగులా, దిగంబరుడిగానే లేచి కత్తి అందుకొన్నాడు. అంత అర్థరాత్రిలోనూ దొంగలను తెగనరికి పొట్టేళ్ళను విడిపించుకుని తిరిగి వచ్చేసరికి..

9-411-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చీరలేనిమగని జెలువ దా నీక్షించి
న్నుమొఱఁగిపోయెఁ డక నతఁడు
వెఱ్ఱివానిభంగి వివశుఁడై పడిలేచి
పొరలి తెరలి స్రుక్కి పొక్కిపడియె.

టీకా:

చీర = బట్టలు; లేని = లేనట్టి; మగనిన్ = భర్తను; చెలువ = మగువ; తాన్ = ఆమె; వీక్షించి = కనుగొని; కన్నుమొఱగిపోయెన్ = మాయమైపోయెను; కడకన్ = వెంటనే; అతడు = అతను; వెఱ్ఱివాని = తెలివిహీనుని; భంగిన్ = వలె; వివశుడు = కలతచెందినవాడు; ఐ = అయ్యి; పడిలేచి = పడుతూలేస్తూ; పొరలి = పొర్లిపొర్లి; తెరలి = తెరలుతెరలుగా; స్రుక్కి = చింతించి; పొక్కి = దుఃఖపడెను.

భావము:

బట్టలు లేని భర్తను చూసిన ఊర్వశి మాయమైపోయింది. పురూరవుడు తెలివిహీనుడిలా కలతచెంది పడుతూ లేస్తూ పొర్లి పొర్లి తెరలు తెరలుగా చింతిస్తూ దుఃఖించాడు.

9-412-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ బురూరవుండు మదనాతురుండై, వెదకుచు, సరస్వతీ నదీతీరంబునం జెలికత్తెలతోఁ గూడియున్న యూర్వశింగని, వికసిత ముఖకమలుండై యిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; పురూరవుండు = పురూరవుడు; మదనాతురుడు = మదనవేదన కలవాడు; ఐ = అయ్యి; వెదకుచున్ = వెతుక్కుంటూ; సరస్వతీ = సరస్వతి యనెడి; నదీ = నది యొక్క; తీరంబునన్ = గట్టుమీద; చెలికత్తెలు = చెలుల; తోన్ = తోటి; కూడి = కలసి; ఉన్న = ఉన్నట్టి; ఊర్వశిన్ = ఊర్వశిని; కని = కనుగొని; వికసిత = వికసించిన; ముఖ = మోము యనెడి; కమలుండు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అంతేకాక, పురూరవుడు మదనవేదనతో వెతుక్కుంటూ సరస్వతి నది గట్టుమీద చెలులతో ఉన్న ఊర్వశిని చూసి విప్పారిన మోముతో ఇలా అన్నాడు.

9-413-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుమధ్యా! యిది యేల వచ్చి తకటా! ర్మంబె శర్మంబె మున్
లో నుంకుగనాడికొన్న పలుకుల్ ర్యాదలుం దప్పెనే
నిను నేఁ బాసిన యంతనుండి తనువున్నేలం బడంబాఱె మే
దినిపై వ్రాలకమున్న నన్నుఁ గరుణాదృష్టిన్ విలోకింపవే.

టీకా:

తనుమధ్య = సుందరి {తనుమధ్య - తను (సన్నని) మధ్య (నడుముగలామె), అందగత్తె}; ఇది = ఇలా; ఏలన్ = ఎందుకు; వచ్చితి = వచ్చావు; అకటా = అయ్యో; ధర్మంబె = న్యాయమా, కాదు; శర్మంబె = సంతోషకరమైనదేనా; మున్ = ఇంతకుముందు; మనలోన్ = మనలో మనము; ఉంకుగన్ = సమ్మతింపుగ; ఆడికొన్న = అనుకొన్న; పలుకుల్ = సుద్దులు; మర్యాదలున్ = హద్దులు; తప్పెనే = మరచితివా; నినున్ = నిన్ను; నేన్ = నేను; పాసిన = దూరమైన; అంత = అప్పటి; నుండి = నుంచి; తనువున్ = శరీరము; నేలంబడ = కుంగి; పాఱెన్ = పోతున్నది; మేదిని = నేల; పై = మీద; వ్రాలక = పడిపోక; మున్న = ముందుగాన్; నన్నున్ = నన్ను; కరుణా = దయా; దృష్టిన్ = దృష్టితో; విలోకింపవే = చూడుము.

భావము:

“ఓ సుందరీ! నన్ను విడిచి ఇలా ఎందుకు వచ్చేశావు. అయ్యో! ఇది నీకు న్యాయం కాదు. నీకు ఈ పని సంతోషకరంగా ఉందా. ఇంతకు ముందు మనం మనసువిప్పి మాట్లాడుకున్న సుద్దులు హద్దులు మరచిపోయావా? నీవు దూరమైనప్పటి నుంచి శరీరం కుంగిపోతోంది. ఈ నా దేహం నేల పడక ముందే వచ్చి దయ చూడుము.”

9-414-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నూర్వశి యిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; ఊర్వశి = ఊర్వశి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అన్న పురూరవునితో ఊర్వశి ఈ విధంగ పలికింది.

9-415-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మగువలకు నింత లొంగెదు
వాఁడవె నీవు పశువుమాడ్కిన్ వగవం
వే మానుషపశువును
మృములుఁ గని రోయుఁగాక మేలని తినునే.

టీకా:

మగువలు = స్త్రీల; కున్ = కి; ఇంతన్ = ఇంతలాగ; లొంగెదు = లొంగిపోయెదవు; మగవాడవె = పురుషుడవేనా; నీవు = నీవు; పశువు = జంతువు; మాడ్కిన్ = వలె; వగవన్ = శోకించుట; తగవే = పద్దతేనా, కాదు; మానుష = ఇలాంటి మానవ; పశువున్ = మృగమును; మృగములున్ = క్రూరజంతువులైన; కని = చూసి; రోయున్ = అసహ్యించుకొనును; కాక = తప్పించి; మేలు = మంచిది; అని = అని; తినునే = తింటాయా, తినవు.

భావము:

“ఇంతులకి ఇంతలా లొంగిపోయే నువ్వేం మొగాడివి, జంతువులా శోకించకు. ఇలాంటి మానవ మృగాన్ని చూసి క్రూరజంతువులు కూడ అసహ్యించుకొని తినవు.

9-416-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతేకాకుండగ.

9-417-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లఁపుల్ చిచ్చులు మాట లుజ్వలసుధాధారల్ విభుండైన పు
వ్విలితున్ మెచ్చర యన్యులన్ వలఁతురే విశ్వాసముంలేదు క్రూ
లు తోడుంబతినైనఁ జంపుదు రధర్మల్ నిర్దయల్ చంచలల్
వెయాండ్రెక్కడ వారి వేడబము లా వేదాంతసూక్తంబులే.

టీకా:

తలపుల్ = ఆలోచనలు; చిచ్చులు = మంటలు; మాటలు = పలుకులు; ఉజ్వల = కాంతివంతమైన; సుధా = అమృతపు; ధారల్ = ధారలు; విభుండు = భర్త; ఐనన్ = అయినచో; పువ్విలితున్ = మన్మథుని {పువ్విలుతుడు - పుష్పములు బాణములుగాఁగల ధనుస్సు కలవాడు, మన్మథుడు}; మెచ్చరు = మెచ్చుకొనరు; అన్యులన్ = ఇతరులను; వలతురే = కామించెదరా, లేదు; విశ్వాసమున్ = విశ్వాసము; లేదు = ఉండదు; క్రూరలు = క్రూరస్వభావులు; తోడున్ = తోడబుట్టినవానిన్; పతిన్ = మగని; ఐనన్ = అయినప్పటికి; చంపుదురు = చంపివేయుదరు; అధర్మల్ = అధర్మవర్తనలు; నిర్దయల్ = దయలేనివారు; చంచలల్ = చంచలమనస్కులు; వెలయాండ్రు = వేశ్యలు; ఎక్కడ = ఎక్కడ; వారి = వారి యొక్క; వేడబములా = మాయలేమైనా; వేదాంతసూక్తంబులే = నమ్మదగినవా, కాదు .

భావము:

చపల చిత్తులైన చెలువల తలపులు చిచ్చులు వంటివి. పలుకులేమో అమృతధారలు. మన్మథుడే మగడైనా మగువలు మెచ్చరు. ఇతరులను లెక్కచేస్తారా? వేశ్యలకు విశ్వాసం అన్నది ఉండదు. దయాధర్మం లేకుండా తోడబుట్టినవాడినైనా, మగనినైనా చంపడానికి వెనుదీయరు. క్రూరస్వభావులు, చపలచిత్తులు. వేశ్యలు ఎక్కడ? ప్రేమలు ఎక్కడ? వేదాంత సూక్తులేనా అర్థం అవుతాయి కాని, వేశ్యల మాయలు అంతుచిక్కవు.

9-418-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంకొక యేఁడు పోయిన నరేశ్వర! యాతలిరేయి నీవు నా
లంకెకు వచ్చి యాత్మజుల క్షణవంతులఁ గాంచె దేమియుం
గొంక పొమ్ము నీ" వనుడుఁ గొమ్మను గర్భిణిఁగాఁ దలంచుచున్
శం యొకింతలేక నృపత్తముఁ డల్లన పోయె వీటికిన్.

టీకా:

ఇంకొక = మరొక; ఏడు = సంవత్సరము; పోయిన = జరిగిన; నరేశ్వర = రాజ {నరేశ్వరుడు - నరులకు ప్రభువు, రాజు}; ఆతలి = తరువాతి; రేయి = రాత్రి; నీవున్ = నీవు; నా = నా యొక్క; లంకె = సంగమమునకు; కున్ = కు; వచ్చి = వచ్చి; ఆత్మజుల = పుత్రులను {ఆత్మజులు – తనకు పుట్టిన వారు, పుత్రులు}; లక్షణవంతులన్ = గుణవంతులను; కాంచెదు = చూచెదవు; ఏమియున్ = ఏమాత్రము; కొంకక = సంకోచించకుండా; పొమ్ము = వెళ్లిపో; నీవు = నీవు; అనుడున్ = అనగా; కొమ్మనున్ = ఇంతిని; గర్భిణి = గర్భము ధరించినామె; కాన్ = అగునట్లు; తలంచుచున్ = ఊహించుకొని; శంక = అనుమానము; ఒకింతయున్ = కొంచము కూడ; లేక = లేకుండ; నృప = రాజులలో; సత్తముడు = శ్రేష్ఠుడు; అల్లన్ = మెల్లగ; పోయెన్ = వెళ్ళిపోయెను; వీటి = పురమున; కిన్ = కు.

భావము:

ఓ రాజ! ఇంకొక్క ఏడు పోయాక రాత్రి పూట నన్ను కలవడానికి రా. నీ కొడుకులను చూద్దువు గాని. ఇప్పటికి సందేహించకుండా వెళ్లిపో.” అని ఊర్వశి అనగా. ఇంతి గర్భం ధరించి ఉంటుంది అని ఊహించుకొని వెంటనే రాజశ్రేష్ఠుడు మెల్లగ తన పురానికి వెళ్ళిపోయాడు.

9-419-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మరలి, తన పురంబున నొక్క యేఁడుండి, పిదప నూర్వశి కడ కేఁగి యొక్క రేయి పురూరవుం డ య్యింతికడ నున్న నా వెలందియు "గంధర్వవరుల వేఁడికొనుము నన్నిచ్చెద"; రనవుడు నతండు గంధర్వవరులం బ్రార్థించిన వార లతండు పొగడుటకు మెచ్చి యగ్నిస్థాలి నిచ్చిన, నయ్యగ్నిస్థాలి నూర్వశింగా దలంచుచు దానితో నడవిం దిరుగుచుండి యొక్కనాఁ డది యూర్వశిగాదగ్నిస్థాలి యని యెఱింగి; వనంబున దిగవిడిచి, యింటికిఁ జనుదెంచి, నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండఁ ద్రేతాయుగంబు చొచ్చిన నా రాజు చిత్తంబునఁ గర్మబోధంబులయి వేదంబులు మూఁడు మార్గంబులం దోఁచిన, నా భూవరుండు స్థాలికడకుం జని యందు శమీగర్భజాతం బైన యశ్వత్థంబుఁ జూచి, యా యశ్వత్థంబుచేత నరణులు రెండు గావించి, ముందటి యరణి దానును, వెనుకటి యరణి యూర్వశియును, రెంటినడుమ నున్న కాష్ఠంబు పుత్రుండు నని, మంత్రంబు చెప్పుచుం ద్రచ్చుచుండ, జాతవేదుండను నగ్ని సంభవించి విహితారాధన సంస్కారంబునం జేసి యాహవనీయాది రూపియై నెగడి, పురూరవుని పుత్రుండని కల్పింపం బడియె; నా యగ్ని పురూరవునిఁ బుణ్యలోకంబునకుఁ బనుపం గారణం బగుటం జేసి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మరలి = వెనుదిరిగి; తన = తన యొక్క; పురంబునన్ = నగరము నందు; ఒక్క = ఒక; ఏడు = సంవత్సరం పాటు; ఉండి = ఉండి; పిదపన్ = తరువాత; ఊర్వశి = ఊర్వశి; కడ = వద్ద; ఏగి = వెళ్లి; ఒక్క = ఒకానొక; రేయి = రాత్రి; పురూరవుండు = పురూరవుడు; ఆ = ఆ; ఇంతి = పడతి; కడన్ = వద్ద; ఉన్నన్ = ఉండగా; ఆ = ఆ; వెలందియున్ = వేశ్య; గంధర్వ = గంధర్వులలో; వరులన్ = శ్రేష్ఠులను; వేడికొనుము = అడుగుము; నన్నున్ = నన్ను; ఇచ్చెదరు = ఇస్తారు; అనవుడున్ = అనగా; అతండు = అతను; గంధర్వులన్ = గంధర్వులను; ప్రార్థించినన్ = కోరగా; వారలు = వారు; అతండు = అతను; పొగడుటకు = స్తుతించుటకు; మెచ్చి = మెచ్చుకొని; అగ్నిస్థాలిన్ = కుంపటిని; ఇచ్చినన్ = ఇవ్వగా; ఆ = ఆ; అగ్నిస్థాలిన్ = కుంపటినే; ఊర్వశి = ఊర్వశి; కాన్ = ఐనట్లు; తలంచుచున్ = భావించుచు; దాని = దాని; తోనన్ = తోపాటు; అడవిన్ = అడవిలో; తిరుగుచుండి = తిరుగుతూ; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అది = అది; ఊర్వశి = ఊర్వశి; కాదు = కాదు; అగ్నిస్థాలి = కుంపటి; అని = అని; ఎఱింగి = తెలిసికొని; వనంబునన్ = అడవిలో; దిగవిడిచి = వదిలేసి; ఇల్లు = ఇంటి; కిన్ = కి; చనుదెంచి = వచ్చి; నిత్యంబున్ = ప్రతిరోజు; రాత్రి = రాత్రి; దానినన్ = దానినే; చింతించుచుండన్ = తలచుకొనుచుండగ; త్రేతాయుగంబున్ = త్రేతాయుగము; చొచ్చినన్ = ప్రవేశించగా; ఆ = ఆ; రాజు = రాజు; చిత్తంబునన్ = మనసు నందు; కర్మ = కర్మకాండ; బోధంబులు = తెలిసినవి; అయి = అయ్యి; వేదంబులున్ = వేదములు; మూడు = మూడు (3); మార్గంబులన్ = భాగములుగా; తోచినన్ = సాక్షాత్కరించగా; ఆ = ఆ; భూవరుండు = రాజు; స్థాలి = కుంపటి; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; అందున్ = దానిలో; శమీ = జమ్మిచెట్టు; గర్భ = లోంచి (కాండము); జాతంబు = పుట్టినది; ఐన = అయిన; అశ్వత్థంబున్ = రావిచెట్టును; చూచి = చూసి; ఆ = ఆ; అశ్వత్థంబున్ = రావిచెట్టు; చేతన్ = నుండి; అరణులు = అరణి కొయ్యలను {అరణి - ద్రచ్చినిప్పు పుట్టించెడు కొయ్యల జత, అరణి కొయ్యలు}; రెండు = రెంటిని (2); కావించి = తయారుచేసి; ముందటి = మొదటి; అరణి = అరణికొయ్య; తానును = అతనుగను; వెనుకటి = కింది; అరణి = అరణి కొయ్య; ఊర్వశి = ఊర్వశిగాను; రెంటి = రెండింటి; నడుమ = మధ్యన; ఉన్నట్టి = ఉన్నటువంటి; కాష్ఠంబు = పుల్ల; పుత్రుండు = కొడుకు; అని = అని; మంత్రంబు = మంత్రములను; చెప్పుచున్ = చదువుతూ; ద్రచ్చుచుండగా = మథించుచుండగ; జాతవేదుండు = జాతవేదుడు; అను = అనెడి; అగ్ని = నిప్పు; సంభవించి = పుట్టి; విహిత = నియమబద్దమైన; ఆరాధన = కొలుచుట; సంస్కారంబునన్ = క్రియల; చేసి = వలన; ఆహవనీయాది = త్రేతాగ్నులు {త్రేతాగ్నులు - 1ఆహవనీయము 2దక్షిణాగ్ని 3గార్హపత్యము, మూడగ్నులు, శ్రౌతాగ్నులు}; ఆది = మున్నగు; రూపి = రూపములు కలది; ఐ = అయ్యి; నెగడి = బయటికి ప్రకాశించి; పురూరవుని = పురూరవుని; పుత్రుండు = కొడుకు; అని = అని; కల్పింపంబడియె = ఏర్పరచబడినది; ఆ = ఆ; అగ్ని = అగ్ని; పురూరవున్ = పురూరవుని; పుణ్యలోకంబులకు = సుగతులకు; పనుపన్ = పంపుటకు; కారణంబు = కారణము; అగుటన్ = అగుట; చేసి = వలన;

భావము:

ఈ విధంగా తిరిగి వెళ్ళి పురూరవుడు తన నగరంలో ఒక సంవత్సరంపాటు ఉండి, తరువాత ఊర్వశి వద్దకు వెళ్లాడు. ఒక రాత్రి ఆమె వద్ద గడిపాడు. ఆమె గంధర్వులను అడుగు నన్ను ఇస్తారు అనగా అతను గంధర్వులను కోరాడు. వారు అతని స్తుతికి మెచ్చి కుంపటిని ఇచ్చారు. ఆ కుంపటినే ఊర్వశి అని భావిస్తూ దానితోపాటు అడవిలో తిరుగుతుండగా, ఒకనాడు అది ఊర్వశి కాదు కుంపటి అని పురూరవునికి తెలిసింది. కుంపటిని అడవిలో వదిలేసి ఇంటికి వచ్చి రాత్రింపగళ్ళు ఆమె ధ్యాసతోనే గడపసాగాడు. ఇంతలో త్రేతాయుగం ప్రవేశించింది. ఆ రాజుకి చిత్తంలో కర్మభోద అయింది. వేదములు మూడు సాక్షాత్కరించాయి. అతను కుంపటి పారేసిన చోటుకి వెళ్ళాడు. అక్కడ జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టును చూసి, ఆ రావిచెట్టు నుండి రెండు అరణి కఱ్ఱలను తయారుచేసాడు. పై అరణిని తను అని, కింది అరణి ఊర్వశి అని, రెండింటి మధ్యన ఉన్న పుల్ల కొడుకు అని, మంత్రాలు చదువుతూ మథిస్తుంటే జాతవేదుడు అనె నిప్పు పుట్టింది. పురూరవుడు త్రయీవిద్యతో దాన్ని మూడగ్నులుగా సంస్కరించాడు. ఆ త్రేతాగ్ని ఆహవనీయాది రూపి అయి పురూరవుని కొడుకుగా కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుని సుగతులకు పంపుటకు సమర్థం అయింది.

9-420-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్నిచేఁ బురూరవుఁ
డా జ్ఞేశ్వరు ననంతు రి వేదమయున్
శ్రీయుతుఁ గూర్చి యజించె గు
ణాయుతుఁ డూర్వశిఁ గనంగ రిగెడు కొఱకై.

టీకా:

ఆ = ఆ; అగ్ని = అగ్ని; చేన్ = వలన; పురూరవుడు = పురూరవుడు; ఆ = ఆ; యజ్ఞేశ్వరున్ = నారాయణుని {యజ్ఞేశ్వరుడు - యజ్ఞములకు ప్రభువు, విష్ణువు}; అనంతున్ = నారాయణుని {అనంతుడు - తుదలేని వాడు, విష్ణువు}; హరిన్ = నారాయణుని {హరి - భక్తుల హృదయములను ఆకర్షించెడి వాడు, విష్ణువు}; వేదమయున్ = నారాయణుని {వేదమయుడు - వేదములు స్వరూపముగా కలవాడు, విష్ణువు}; శ్రీయుతున్ = నారాయణుని {శ్రీయుతుడు - శ్రీ (లక్ష్మీదేవి, సంపదల)తో యుతుడు (కూడి యుండువాడు), విష్ణువు}; గూర్చి = గురించి; యజించెన్ = యాగములు చేసెను; గుణాయుతుండు = గుణశాలి; ఊర్వశిన్ = ఊర్వశి; కనంగన్ = దర్శనమునకు; అరిగెడు = వెళ్ళుట; కొఱకై = కోసము;

భావము:

ఊర్వశి ఉన్న లోకానికి వెళ్ళడానికి, పురూరవుడు ఆ అగ్నితో యజ్ఞేశ్వరుడు, అనంతుడు, వేదమయుడు, శ్రీపతి అయిన శ్రీహరిని గురించి యాగాలు చేసాడు.

9-421-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కఁడవహ్ని వేల్పు పురుషోత్తముఁ డొక్కఁడ సర్వవాఙ్మయం
బొక్కఁడ వేద మా ప్రణవ మొక్కఁడ వర్ణము దొల్లి త్రేతయం
దెక్కటిమాన్చి మూఁడుగను నేర్పఱిచెం దనబుద్ధిపెంపుచేఁ
క్కఁగ నా పురూరవుఁ డక్తులకున్ సులభంబులౌ గతిన్.

టీకా:

ఒక్కడ = ఒకడే; వహ్నివేల్పు = అగ్నిదేవుడు; పురుషోత్తముడు = భగవంతుడు; ఒక్కడ = ఒకడే; సర్వ = సమస్తమైన; వాఙ్మయంబు = సాహిత్యము, జ్ఞానము; ఒక్కడ = ఒకటే; వేదము = వేదము; ఆ = ఆ; ప్రణవము = ఓంకారము; ఒక్కడ = ఒకటే; వర్ణము = అక్షరము; త్రేత = తేతాయుగము; అదున్ = లో; ఎక్కటి = ఏకమైనదానిని; మాన్చి = విడదీసి; మూడుగన్ = మూడింటిగా; ఏర్పఱించెన్ = విభాగించెను; తన = తన యొక్క; బుద్ధి = తెలివితేటల; పెంపు = అధిక్యము; చేన్ = చేత; చక్కగన్ = చక్కగా; ఆ = ఆ; పురూరవుడు = పురూరవుడు; అశక్తుల్ = శక్తిహీనుల; కున్ = కు కూడ; సులభంబులు = సకరములు; ఔ = అయ్యెడి; గతిన్ = విధముగ.

భావము:

త్రేతాయుగానికి పూర్వం అగ్ని అఖండం అయి ఉండేది. నారాయణుడు ఒకడే దేవత, ప్రణవం ఒక్కటే వేదంగా ఉండేది. సమస్త సాహిత్యం అందులోనే ఉండేది. పురూరవుడు శక్తిహీనులకు కూడ కర్మమార్గం సుళువు అయ్యేలా ఒకటిని మూడుగా చేసాడు.

9-422-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వేదవిభాగంబు గల్పించి, యాగంబుచేసి, పురూరవుం డూర్వశి యున్న గంధర్వలోకంబునకుం జనియె నతనికి నూర్వశి గర్భంబున నాయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుండు, జయుండు, విజయుం డన నార్గురు పుత్రులు గలిగి; రందు శ్రుతాయువునకు వసుమంతుండును, సత్యాయువునకు శ్రుతంజయుండును, రయునకు శ్రుతుండు నేకుం డన నిరువును, జయునకు నమితుండును, విజయునకు భీముండును జనించి రా భీమునకుఁ గాంచనుండు, కాంచనునకు హోత్రకుండు, హోత్రకునకు గంగాప్రవాహంబు పుక్కిటం బెట్టిన జహ్నుండు, జహ్నునకుఁ బూరుండు పూరునకు బాలకుండు, బాలకునకు నజకుం, డజకునకుఁ గుశుండు, కుశునకుఁ గుశాంబుండు ధూర్తయుండు వసువు కుశనాభుం డన నలువురును సంభవించి; రందు గుశాంబునకు గాధి యను వాఁడు గలిగె నా గాధి రాజ్యంబు చేయుచుండ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; వేద = వేదములను; విభాగంబున్ = విడి భాగములుగ; కల్పించి = తయారుచేసి; యాగంబున్ = యజ్ఞములు; చేసి = చేసి; పురూరవుండు = పురూరవుడు; ఊర్వశి = ఊర్వశి; ఉన్న = ఉన్నట్టి; గంధర్వలోకంబున్ = గంధర్వలోకమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; అతని = అతని; కిన = కి; ఊర్వశి = ఊర్వశి యొక్క; గర్భంబునన్ = కడుపులో; ఆయువు = ఆయువు; శ్రుతాయువు = శ్రుతాయువు; సత్యాయువు = సత్యాయువు; రయుండు = రయుడు; జయుండు = జయుడు; విజయుండు = విజయుడు; అనన్ = అనెడి; ఆర్గురు = ఆరుగురు (6); పుత్రులు = కొడుకులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; శ్రుతాయువున్ = శ్రుతాయువున; కున్ = కు; వసుమంతుండును = వసుమంతుడు; సత్యాయువున్ = సత్యాయువున; కున్ = కు; శ్రుతంజయుండును = శ్రుతంజయుడు; రయున్ = రయున; కున్ = కు; శ్రుతుండున్ = శ్రుతుడు; అనేకుండు = అనేకుడు; అనన్ = అనెడి; ఇరువురును = ఇద్దరు; జయున్ = జయున; కున్ = కు; అమితుండును = అమితుడు; విజయున్ = విజయున; కున్ = కు; భీముండును = భీముడు; జనించిరి = పుట్టిరి; ఆ = ఆ; భీమున్ = భీముని; కున్ = కు; కాంచనుండున్ = కాంచనుడు; కాంచనున్ = కాంచనున; కున్ = కు; హోత్రకుండున్ = హోత్రకుడు; హోత్రకున్ = హోత్రకున; కున్ = కు; గంగా = గంగ యొక్క; ప్రవాహంబున్ = ప్రవాహమును; పుక్కిటన్ = పుగ్గలలో; పెట్టిన = ధరించినట్టి; జహ్నుండు = జహ్నుడు; జహ్నున్ = జహ్నున; కున్ = కు; పూరుండు = పూరుడు; పూరున్ = పూరున; కున్ = కు; బాలకుండు = బాలకుడు; బాలకున్ = బాలకున; కున్ = కు; అజకుండు = అజకుడు; అజకున్ = అజకున; కున్ = కు; కుశుండు = కుశుడు; కుశున్ = కుశున; కున్ = కు; కుశాంబుండు = కుశాంబుడు; ధూర్తయుండు = ధూర్తయుడు; వసువు = వసువు; కుశనాభుండు = కుశనాభుడు; అనన్ = అనెడి; నలువురును = నలుగురు (4); సంభవించిరి = పుట్టరి; అందున్ = వారిలో; కుశాంబున్ = కుశాంబుని; కున్ = కి; గాధి = గాధి; అను = అనెడి; వాడున్ = వాడు; కలిగెన్ = పుట్టెను; ఆ = ఆ; గాధి = గాధి; రాజ్యంబున్ = రాజ్యము; చేయుచుండన్ = చేస్తుండగా.

భావము:

ఈ విధంగా వేదవిభాగాలు కల్పించుకుని యాగాలు చేసి, పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వలోకానికి వెళ్ళాడు. అతనికి ఊర్వశి యందు ఆయువు, శ్రుతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు, అని ఆరుగురు (6) కొడుకులు పుట్టారు. వారిలో శ్రుతాయువునకు వసుమంతుడు; సత్యాయువునకు శ్రుతంజయుడు; రయునకు శ్రుతుడు, అనేకుడు అని ఇద్దరు; జయునకు అమితుడు; విజయునకు భీముడు పుట్టారు. ఆ భీమునికి కాంచనుడు; కాంచనునకు హోత్రకుడు; హోత్రకునకు గంగని పుక్కిట పట్టిన జహ్నుడు; జహ్నునకు పూరుడు; పూరునకు బాలకుడు; బాలకునకు అజకుడు; అజకునకు కుశుడు; కుశునకు కుశాంబువు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని నలుగురు పుట్టారు. వారిలో కుశాంబునికి గాధి పుట్టాడు. ఆ గాధి రాజ్యం చేస్తుండగా.