పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బుధుని వృత్తాంతము

 •  
 •  
 •  

9-379-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని కోపించుచుండ నా చెలువకుఁ బసిండిచాయమేనుగల కుఱ్ఱండు పుట్టె. వానింజూచి మోహంబు చేసి, బృహస్పతిదన కొడుకనియునుం, జంద్రుండు దనకన్నవాఁడనియునుం జగడించి రప్పుడు.

టీకా:

అని = అని; కోపించుచుండన్ = కోపపడుతుండగా; ఆ = ఆ; చెలువ = సుందరి; కున్ = కి; పసిండి = బంగారు; ఛాయ = రంగు; మేను = దేహము; కల = కలిగిన; కుఱ్ఱండు = పిల్లవాడు; పుట్టెన్ = జన్మించెను; వానిన్ = అతనిని; చూచి = చూసి; మోహంబున్ = మోహమును; చేసి = పొంది; బృహస్పతి = బహస్పతి; తన = తనయొక్క; కొడుకు = పుత్రుడు; అనియునున్ = అని; చంద్రుండు = చంద్రుడు; తన = అతను; కన్నవాడు = పుట్టించినవాడు; అనియునున్ = అని; జగడించిరి = దెబ్బలాడుకొనిరి; అప్పుడు = అప్పుడు.

భావము:

ఇలా బృహస్పతి కోప్పడుతుండగా, ఆ సుందరికి బంగారం లాంటి దేహకాంతితో పిల్లవాడు పుట్టాడు. అతడిని చూసి మోహం పొంది బహస్పతి తన కొడుకు అని, చంద్రుడు తన కొడుకు అని దెబ్బలాడుకొన్నారు. అప్పుడు.

9-380-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారివాదు చూచి వారింపఁగా వచ్చి
యేర్పరింప లేక యెల్ల మునులు
మరవరుల నడుగ "నా వేడుకలకత్తె
యెఱుఁగుఁ గాని యితరు లెఱుఁగ" రనిరి.

టీకా:

వారి = వారి యొక్క; వాదున్ = వాదించుకొనుట; చూచి = చూసి; వారింపగన్ = తగవు తీర్చుటకు; వచ్చి = వచ్చి; ఏర్పరింపలేక = నిర్ణయించ లేక; ఎల్ల = అందరు; మునులు = మునులు; అమర = దేవతా; వరలన్ = శ్రేష్ఠులను; అడుగన్ = విచారించగా; ఆ = ఆ; వేడుకలకత్తె = వగలాడికే; ఎఱుగున్ = తెలియును; కాని = తప్పించి; ఇతరులు = ఇంకెవరును; ఎఱుగరు = తెలియలేరు; అనిరి = అని చెప్పిరి.

భావము:

దేవతలు ఎందరో వచ్చినా వారి తగవు తీర్చలేక పోయారు. ఎవరి బిడ్డో తేల్చలేకపోయారు. చివరికి “నిజం ఏమిటో ఆ వగలాడికే తెలియాలి తప్పించి ఇంకెవరికి తెలియదు.” అని అన్నారు.

9-381-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఆ పలుకులు విని సిగ్గుపడియున్న తారం జూచి చిన్ని కొమరుం డిట్లనియె.

టీకా:

ఆ = ఆ; పలుకులు = మాటలు; విని = విని; సిగ్గుపడి = సిగ్గుచెంది; ఉన్న = ఉన్నట్టి; తారన్ = తారను; చూచి = చూసి; చిన్న = చంటి; కొమరుండు = పిల్లవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

ఆ మాటలు విని సిగ్గుపడుతున్న తారను చూసి ఆ చంటి పిల్లవాడు ఇలా అన్నాడు.

9-382-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ఇలువరుస చెడఁగ బంధులు
వంపఁగ మగఁడు రోయఁ ల్లీ! కట్టా!
వెలినేల నన్నుఁ గంటివి
లిగించినవాఁడు శీతరుఁడో? గురుఁడో?"

టీకా:

ఇలువరుస = ఇంటి మర్యాద, వంశ పరువు; చెడగన్ = పోవునట్లుగ; బంధులు = బంధువులు; తలవంపగన్ = అవమానపడునట్లు; మగడు = భర్త; రోయన్ = అసహ్యించుకొన్నట్లు; తల్లీ = అమ్మా; కట్టా = అయ్యో; వెలిన్ = బయట తిరిగి; ఏలన్ = ఎందుకు; నన్నున్ = నన్ను; కంటివి = కన్నావు; కలిగించినవాడు = పుట్టించినవాడు; శీతకరుడో = చంద్రుడా {శీతకరుడు - చల్లని కిరణములవాడు, చంద్రుడ}; గురుడో = బృహస్పతా.

భావము:

అమ్మా! ఇంటి మర్యాద, వంశ పరువు పోయేలా, బంధువులంతా అవమానపడేలా, భర్త అసహ్యించుకొనేలా, అయ్యో! నన్ను ఇతరులకు ఎందుకు కన్నావు. నన్ను పుట్టించినవాడు చంద్రుడా? బృహస్పతా? చెప్పు.”

9-383-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలుకుచున్న కొడుకునకు మఱుమాటలాడనేరకూరక యున్న తార నేకాంతంబునకుంజీరి మంతనంబున బ్రహ్మ యిట్లనియె.

టీకా:

అని = అని; పలుకుచున్ = అనుచున్న; కొడుకున్ = పుత్రున; కున్ = కు; మాఱుమాటలాడన్ = సమాధానం చెప్పుట; నేరక = చేయ లేక; ఉరక = మాట్లాడకుండగ; ఉన్న = ఉన్నట్టి; తారన్ = తారను; ఏకాంతంబున్ = నిర్జనప్రదేశమున; కున్ = కు; చీరి = పిలిచి; మంతనంబునన్ = రహస్యముగా; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

అలా అడుగుతున్న కొడుక్కు సమాధానం చెప్పలేక తార మౌనంగా ఉంది. ఆమెను బ్రహ్మదేవుడు నిర్జనప్రదేశానికి తీసుకెళ్ళి రహస్యంగా ఇలా అడిగాడు.

9-384-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"చెలువా! నీ యెలసిగ్గు వాసి, గురుఁడో శీతాంశుఁడో యెవ్వడీ
లితాకారుఁ గుమారుఁ గన్న యతఁ? డేలా దాఁప? నీపాటు నీ
నేపుట్టెనె? వెచ్చనూర్పకుము? కాంతల్ గాముకల్ గారె? మా
నిందేమియుఁ బోదు పో యొరులతోడంజెప్ప; విన్పింపవే."

టీకా:

చెలువా = సుందరి; నీ = నీయొక్క; ఎలసిగ్గు = చిరుసిగ్గును; వాసి = వదలివేసి; గురుడో = బృహస్పతా; శీతకరుడో = చంద్రుడా; ఎవ్వడు = ఎవరు; ఈ = ఈ; లలిత = సుందరమైన; ఆకారున్ = ఆకారము గలిగిన; కుమారున్ = పుత్రుని; కన్న = పుట్టించిన; అతడు = వాడు; ఏలన్ = ఎందుకు; దాపన్ = దాచుకొనుట; నీ = నీయొక్క; పాటు = దుస్తితి; నీ = నీ; తలనేపుట్టెనె = మొదలైందా, కాదు; వెచ్చనూర్చకుము = నిట్టూర్చకు; కాంతల్ = వనితలు; కాముకుల్ = కాముకులు; కారె = కారా, అవును; మాటలన్ = నోటితోచెబితే; ఇందు = ఇక్కడ; ఏమియుబోదుపో = ఏమవదులే; ఒరుల్ = ఇతరుల; తోడన్ = తోటి; చెప్పన్ = చెప్పను; విన్పింపవే = చెప్పుము.

భావము:

“సుందరీ! ఈ ముద్దొస్తున్న కొడుకును కన్నావు. నీవు సిగ్గుపడడం మానేసి కన్నతండ్రి బృహస్పతా చంద్రుడా ఎవరు చెప్పు. ఎందుకు దాస్తావు. ఈ బుద్ధి నీతోనే మొదలు కాలేదు కదా. కాంతలు కాముకులు కారా ఏమిటి. ఇంక నిట్టూర్చకు, నోరు విప్పి చెప్తే ఏమవదులే. ఎవరికి చెప్పనులే. చెప్పు చెప్పు.”

9-385-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని పలికిన బ్రహ్మకు నెదురుమాటాడ వెఱచి, మంతనంబున నయ్యింతి “చంద్రునికిం గన్నదాన” ననవుడు నా బాలకునకు "బుధుం' డని పేరు పెట్టి; చంద్రున కిచ్చి బ్రహ్మ చనియె; నంత.

టీకా:

అని = అని; పలికిన్ = అనగా; బ్రహ్మ = బ్రహ్మదేవున; కున్ = కి; ఎదురు = కాదని; మాటాడ = చెప్పుటకు; వెఱచి = బెదిరి; మంతనంబునన్ = రహస్యముగా; ఆ = ఆ; ఇంతి = కాంత; చంద్రున్ = చంద్రుని; కిన్ = కి; కన్నదానన్ = కంటిని; అనవుడు = చెప్పగా; ఆ = ఆ; బాలకున్ = పిల్లవాని; కున్ = కి; బుధుండు = బుధుడు; అని = అనెడి; పేరుపెట్టి = పేరును పెట్టి; చంద్రున్ = చంద్రుని; కిన్ = కి; ఇచ్చి = అప్పజెప్పి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అప్పుడు.

భావము:

ఇలా బ్రహ్మదేవుడు బతిమాలగా, ఆయనకి ఎదురు చెప్పడానికి బెదిరి, మెల్లగా చంద్రుడికే కన్నాను అని చెప్పింది. బ్రహ్మదేవుడు పిల్లవానికి బుధుడు అని పేరు పెట్టి చంద్రునికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు.

9-386-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బుద్ధిమంతుఁడయిన బుధుఁడు పుత్రుండైన
మేను పెంచి రాజు మిన్నుముట్టె;
బుద్ధిగల సుతుండు పుట్టినచోఁ దండ్రి
మిన్నుముట్టకేల మిన్నకుండు?

టీకా:

బుద్ధిమంతుడు = బుద్ధిమంతుడు; అయిన = ఐనట్టి; బుధుడు = బుధుడు; పుత్రుండు = కొడుకు; ఐనన్ = కాగా; మేను = శరీరము; పెంచి = పెంచుకొని; రాజు = చంద్రుడు; మిన్నుముట్టెన్ = ఆకాశాన్నందుకొన్నాడు; బుద్ధి = వివేకము; కల = కలిగిన; సుతుండు = పుత్రుడు; పుట్టినచోన్ = కలిగిన ఎడల; తండ్రి = తండ్రి; మిన్నుముట్టక = గర్వించకుండ; ఏలన్ = ఎందుకు; మిన్నకుండు = ఊరకుండును.

భావము:

అన్ని విధాల బుద్ధిమంతుడైన బుధుడు తన కొడుకని వృద్ధిచెంది చంద్రుడు ఆకాశాన్ని అందుకున్నాడు; అవును బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు కదా!
తారకి చంద్రుని వలన పుట్టిన వాడు బుధుడు. కవి మిన్నుముట్టు అనే జాతీయాన్ని, సంతోషంతో ఉప్పొంగుట అని, మిన్ను అంటే ఆకాశం ముట్టు అంటే అందుకోడం అనే అర్థాలని, బుధుడు అంటే బుద్ధిమంతుడు అనే అర్థాన్ని చమత్కారంగా ప్రయోగించిన చక్కటి నడక గల పద్యం ఇది. రెండు లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తు అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఇక్కడ ఉన్నది మిన్నుముట్ట యమకం అందం.