నవమ స్కంధము : శ్రీరామాదుల వంశము
- ఉపకరణాలు:
వసుధపైఁ బుట్టెడు వార్త లాకర్ణించు-
కొఱకునై రాముండు గూఢవృత్తి
నడురేయి దిరుగుచో నాగరజనులలో-
నొక్కఁడు దన సతి యొప్పకున్న
"నొరునింటఁ గాపురంబున్న చంచలురాలిఁ-
బాయంగలేక చేపట్ట నేమి
తా వెఱ్ఱి యగు రామధరణీశ్వరుండనే-
బేల! పొ"మ్మను మాట బిట్టు పలుక
- ఉపకరణాలు:
నాలకించి మఱియు నా మాట చారుల
వలన జగములోనఁ గలుగఁ దెలిసి
సీత నిద్రపోవఁ జెప్పక వాల్మీకి
పర్ణశాలఁ బెట్టఁ బనిచె రాత్రి.
టీకా:
వసుధ = లోకము; పైన్ = మీద; పుట్టెడు = కలిగెడు; వార్తలున్ = విశేషములు; ఆకర్ణించు = వినుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; రాముండు = రాముడు; గూఢ = రహస్య; వృత్తిన్ = సంచారమున; నడురేయి = అర్థరాత్రి; తిరుగుచోన్ = తిరుగుతుండగ; నాగరజనుల = పౌరుల {నాగరజనులు - నగరములోనుండెడి జనులు, పౌరులు}; లోన్ = అందు; ఒక్కడు = ఒకానొకడు; తన = తనయొక్క; సతి = భార్య; ఒప్పక = సరిగలేక; ఉన్నన్ = ఉండగ; ఒరున్ = ఇతరుని; ఇంటన్ = నివాసములో; కాపురంబున్న = నివాసించిన; చంచలురాలిన్ = చంచలస్వభావిని; పాయంగన్ = విడువ; లేక = లేకపోవుటచేత; చేపట్టన్ = ఏలుకొనుటకు; ఏమి = ఏమైనా; తాన్ = తను; వెఱ్ఱి = వెఱ్ఱివాడు; అగు = అయిన; రామ = రాముడు అనెడి; ధరణీశ్వరుండనే = రాజునా ఏమి, కాదు {ధరణీశ్వరుడు - ధరణి (భూమికి) ప్రభువు, రాజు}; బేల = పడతి; పొమ్ము = వెళ్ళిపో; అను = అనెడి; మాటన్ = మాటలతో; బిట్టుపలుక = కేకలేస్తుండగ; ఆలించి = విని.
మఱియున్ = అంతేకాక; ఆ = ఆ; మాట = విషయము; చారుల = వేగుల; వలన = వలన; జగము = లోకము; లోన్ = అందు; కలుగన్ = వ్యాపించి ఉండుట; తెలిసి = తెలిసికొని; సీత = సీతాదేవి; నిద్రపోవన్ = నిద్రించుచుండగ; చెప్పక = చెప్పకుండగ; వాల్మీకి = వాల్మీకియొక్క; పర్ణశాలన్ = ఆశ్రమములో; పెట్టన్ = విడిచిపెట్టిరమ్మని; పనిచెన్ = ఆజ్ఞాపించెను; రాత్రి = రాత్రిసమయమునందు.
భావము:
రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్థరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి, “పరాయి ఇంటిలో కొన్నాళ్ళు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెఱ్ఱిరాముడను అనుకున్నావా? పోపో.” అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక, చారుల ద్వారా ఈ విషయం లోకంలో వ్యాపించి ఉందని తెలిసికొన్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండ రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు.
- ఉపకరణాలు:
అంత; సీతయు గర్భిణి గావునఁ గుశలవు లనియెడి కొడుకులం గనియె; వారికి వాల్మీకి జాతకర్మంబు లొనరించె; లక్ష్మణునకు నంగదుండును, జంద్రకేతుండును భరతునకుఁ దక్షుండును, బుష్కలుండును శత్రుఘ్నునకు సుబాహుండును, శ్రుతసేనుండును సంభవించి; రయ్యెడ.
టీకా:
అంతన్ = అంతట; సీతయున్ = సీతాదేవి; గర్భిణి = కడుపుతో ఉన్నామె; కావునన్ = కనుక; కుశలవులు = కుశలవులు; అనెడి = అను; కొడుకులన్ = పుత్రులను; కనియెన్ = జన్మమిచ్చెను; వారి = వారల; కిన్ = కు; వాల్మీకి = వాల్మీకి; జాతకర్మంబులున్ = జాతకర్మములు {జాతకర్మములు - పుట్టినప్పుడు చేసెడి క్రియలు}; ఒనరించెన్ = చేసెను; లక్ష్మణున్ = లక్ష్మణున; కున్ = కు; అంగదుండును = అంగదుడు; చంద్రకేతుండును = చంద్రకేతుడు; భరతున్ = భరతున; కున్ = కు; దక్షుండును = దక్షుడు; పుష్కలుండును = పుష్కలుడు; శత్రుఘ్నున్ = శత్రుఘ్నుని; కున్ = కి; సుబాహుండును = సుబాహువు; శ్రుతసేనుండును = శ్రుతసేనుడు; సంభవించిరి = పుట్టిరి; ఆ = ఆ; ఎడన్ = సమయమునందు.
భావము:
అంతట, అప్పటికే కడుపుతో ఉన్న సీతాదేవి కుశలవులను అను పుత్రులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మలు చేసాడు. లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు; భరతునకు దక్షుడు, పుష్కలుడు; శత్రుఘ్నునికి సుబాహువు, శ్రుతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. అప్పుడు.
- ఉపకరణాలు:
బంధురబలుఁడగు భరతుఁడు
గంధర్వచయంబుఁ ద్రుంచి కనకాదుల స
ద్బంధుఁ డగు నన్న కిచ్చెను
బంధువులును మాతృజనులుఁ బ్రజలున్ మెచ్చన్.
టీకా:
బంధుర = చక్కటి; బలుడు = బలశాలి; అగు = ఐన; భరతుడు = భరతుడు; గంధర్వ = గంధర్వుల; చయంబున్ = సమూహమును; త్రుంచి = సంహరించి; కనక = బంగారము; ఆదులన్ = మున్నగునవి; సద్బంధుడు = సజ్జనులబంధువైనవాడు; అగు = అయిన; అన్న = సోదరుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; బంధువులును = బంధువులు; మాతృజనులున్ = తల్లులు {తల్లులు - 1కౌసల్య, సుమిత్ర, కైకేయి}; ప్రజలున్ = లోకులు; మెచ్చన్ = మెచ్చుకొనగా.
భావము:
బలశాలి అయిన భరతుడు బంధువులు, కౌసల్యాది తల్లులు, లోకులు మెచ్చేలా, గంధర్వులను సంహరించి ధనాన్ని, బంగారాన్ని తీసుకువచ్చి సజ్జనబంధువైన సోదరుడు శ్రీరాముడికి ఇచ్చాడు.
- ఉపకరణాలు:
మధువనంబులోన మధునందనుం డగు
లవణుఁ జంపి భుజబలంబు మెఱసి
మధుపురంబు చేసె మధుభాషి శత్రుఘ్నుఁ
డన్న రామచంద్రుఁ డౌ ననంగ.
టీకా:
మధువనంబులోనన్ = మధువనమునందు; మధు = మధువు అనెడి రాక్షసుని; నందనుండు = పుత్రుడు; అగు = ఐన; లవణున్ = లవణుని; చంపి = సంహరించి; భుజబలంబున్ = బాహుబలము; మెఱసి = ప్రకాశింపజేసి; మధుపురంబున్ = మధుపురమును; చేసె = నిర్మించెను; మధు = మధురముగ; భాషి = మాట్లాడువాడు; శత్రుఘ్నుడు = శత్రుఘ్నుడు; అన్న = సోదరుడు; రామచంద్రుడు = శ్రీరాముడు; ఔననగన్ = మెచ్చుకొనగా.
భావము:
మథురభాషి శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చేలా, మధురాసురుని కొడుకు లవణుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు.
- ఉపకరణాలు:
అంతఁ గొంతకాలంబునకు రామచంద్రుని కొమారులయిన కుశ లవులిద్దఱను వాల్మీకివలన వేదాదివిద్యల యందు నేర్పరులై పెక్కు సభల సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు నొక్కనాఁడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుం జని.
టీకా:
అంతన్ = అంతట; కొంత = కొన్ని; కాలంబున్ = దినముల; కున్ = కు; రామచంద్రుని = శ్రీరాముని; కొమరులు = పుత్రులు; అయిన = ఐన; కుశలవులు = కుశుడు లవుడు అను; ఇద్దఱును = ఇద్దరు; వాల్మీకి = వాల్మీకి; వలన = వల్ల; వేద = వేదము; ఆది = మున్నగు; విద్యల = విద్యల; అందున్ = లో; నేర్పరులు = ఆరితేరినవారు; ఐ = అయ్యి; పెక్కు = అనేక; సభలన్ = సభలయందు; సతానంబుగా = స్వరసహితముగా {తానము - సంగీతమున స్వరముల ప్రస్తార విశేషము}; రామ = శ్రీరాముని; కథా = కథా; శ్లోకంబులున్ = శ్లోకములను; పాడుచున్ = గానముచేయుచు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; రాఘవేంద్రుని = శ్రీరాముని; యజ్ఞశాల = యాగశాల; కున్ = కు; చని = వెళ్ళి.
భావము:
అంతట కొన్నాళ్ళకు శ్రీరాముని పుత్రులు ఐన కుశుడు లవుడు ఇద్దరు వాల్మీకి వలన వేదాది విద్యలలో ఆరితేరారు. అనేక సభలలో స్వరసహితముగా శ్రీరామకథా శ్లోకాలు పాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక దినం శ్రీరాముని యాగశాలకు వెళ్ళి...
- ఉపకరణాలు:
వట్టి మ్రాకులు పల్లవింప నవారియై మధుధార దా
నుట్టఁబాడిన వారిపాటకు నుర్వరాధిపుఁడుం బ్రజల్
బిట్టు సంతస మంది; రయ్యెడఁ బ్రీతిఁ గన్నుల బాష్పముల్
దొట్ట నౌఁదల లూఁచి వారలతోడి మక్కువ పుట్టఁగాన్.
టీకా:
వట్టి = పసిమిచెడిన, ఎండిపోయిన; మ్రాకులు = మోళ్ళు; పల్లవింపన్ = చిగురించగా; అవారి = అపరిమితమైనది; ఐ = అయ్యి; మధు = అమృత; ధార = ధారలు; తాను = తమంత తాము; ఉట్టన్ = ఒలికేటట్టులుగా; పాడినన్ = పాడగా; వారి = వారియొక్క; పాట = పాట; కున్ = కు; ఉర్వరాధిపుడున్ = మహారాజు {ఉర్వరాధిపుడు - ఉర్వర (భూమికి) వర (శ్రేష్ఠమైన) అధిపుడు (ప్రభువు), రాజు}; ప్రజలున్ = ప్రజలు; బిట్టు = మిక్కిలి, గట్టిగా; సంతసమున్ = సంతోషమును; అందిరి = పొందిరి; అయ్యెడ = అప్పుడు; ప్రీతిన్ = ప్రేమతో; కన్నులన = కన్నులమ్మట; భాష్పముల్ = కన్నీరు; తొట్టన్ = తొణికిసలాడగ; ఔదలల్ = తలలను; ఊచి = ఊపి; వారల = వారి; తోడి = తోటి; మక్కువలు = కూరిమి; పుట్టగాన్ = కలుగగా.
భావము:
ఆ విధంగా శ్రీరాముని యాగసాలలో ఎండిన మోళ్ళు చిగురించేలా, అమృత ధారలు జాలువారేలా పాడారు. వారి పాటను మహారాజు, ప్రజలు అందరూ తలలూపుతూ, ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు, వారిపై ఎక్కువ మక్కువ కలిగింది.
- ఉపకరణాలు:
అంతనా రామచంద్రుండు కుమారుల కిట్లనియె.
టీకా:
అంతన్ = అంతట; ఆ = ఆ; రామచంద్రుండు = శ్రీరాముడు; కుమారుల = పిల్లల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
అప్పుడు శ్రీరాముడు పిల్లలతో ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
"చిన్నయన్నలార! శీతాంశుముఖులార!
నళినదళవిశాలనయనులార!
మధురభాషులార! మహిమీఁద నెవ్వరు
దల్లిదండ్రి మీకు ధన్యులార? "
టీకా:
చిన్ని = చిన్న; అన్నలారా = చక్కటి, పిల్లలు; శీతాంశు = చంద్రుని వంటి; ముఖులారా = మోములు కలవారు; నళిన = కలువ; దళ = రేకులవంటి; విశాల = పెద్ద; నయనులారా = కన్నులుకలవారు; మధుర = తియ్యని; భాషులార = మాట్లాడువారు; మహి = భూమి; మీదన్ = పైన; ఎవ్వరు = ఎవరు; తల్లిదండ్రి = తల్లదండ్రులు; మీ = మీ; కున్ = కు; ధన్యులార = పుణ్యవంతులు.
భావము:
ఓ చిన్ని బాబులు! మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరేకులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు; మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా?
– అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య, సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మృదు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి.
- ఉపకరణాలు:
అనిన వార “లేము వాల్మీకి పౌత్రులము; రాఘవేశ్వరుని యాగంబు చూడ వచ్చితి” మనవుడు; మెల్లన నగి “యెల్లి ప్రొద్దున మీ తండ్రి నెఱింగెద; రుండుం” డని యొక్క నివాసంబునకు సత్కరించి పనిచె; మఱునాఁడు సీతం దోడ్కొని కుశలవుల ముందట నిడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునిం గని యనేక ప్రకారంబుల వినుతించి; యిట్లనియె.
టీకా:
అనినన్ = అనగా; వారలు = వారు; ఏము = మేము; వాల్మీకి = వాల్మీకి; పౌత్రులము = మనుమలము; రాఘవేశ్వరుని = శ్రీరాముని; యాగంబున్ = యజ్ఞమును; చూడన్ = చూచుటకు; వచ్చితిమి = వచ్చాము; అనవుడు = అనగా; మెల్లన = మెల్లిగా; నగి = నవ్వి; యెల్లి = రేపు; ప్రొద్దున = ఉదయము; మీ = మీయొక్క; తండ్రిన్ = తండ్రిని; ఎఱింగెదరు = తెలిసికొనెదరు; రండు = రండి; అని = అని; ఒక్క = ఒకానొక; నివాసంబున్ = గృహమున; కున్ = కు; సత్కరించి = గౌరవించి; పనిచెన్ = పంపించెను; మఱు = తరువాత; నాడు = దినమున; సీతన్ = సీతను; తోడ్కొని = వెంటబెట్టుకొని; కుశలవులన్ = కుశలవులను; ముందటన్ = ముందు; ఇడుకొని = ఉంచుకొని; వాల్మీకి = వాల్మీకి; వచ్చి = వచ్చి; రఘుపుంగవునిన్ = శ్రీరాముని {రఘుపుంగవుడు - రఘువంశములో శ్రేష్ఠుడు, రాముడు}; కని = చూసి; అనేక = పెక్కు; ప్రకారంబులన్ = విధములుగ; వినుతించి = స్తుతించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. “మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం.” వారి పలుకులు విని మెల్లిగా నవ్వి, “రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురు గాని, రండి.” అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీకిమహర్షి సీతను, కుశలవులను వెంటబెట్టుకొని వచ్చి శ్రీరాముని పెక్కువిధములుగా స్తుతించి ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
"సీత సుద్దరాలు, చిత్తవాక్కర్మంబు
లందు సత్యమూర్తి యమలచరిత
పుణ్యసాధ్వి విడువఁ బోలదు చేకొను
రవికులాబ్ధిచంద్ర! రామచంద్ర!"
టీకా:
సీత = సీతాదేవి; సుద్దరాలు = స్వచ్ఛమైనామె; చిత్త = మనసు; వాక్ = మాట; కర్మంబులు = చేతలు; అందున్ = లోను; సత్య = సత్యనిష్ఠగల; మూర్తి = స్వరూపి; అమల = పరిశుద్ధమైన; చరిత = వర్తనకలామె; పుణ్య = పుణ్యాత్మురాలు; సాధ్వి = పతివ్రత; విడువన్ = విడుచుట; పోలదు = తగినపనికాదు; చేకొను = స్వీకరించుము; రవికులాబ్ధిచంద్ర = శ్రీరామ {రవికులాబ్ధిచంద్రుడు - సూర్య వంశము అనెడి సముద్రమునకు చంద్రుని వంటివాడు, రాముడు}; రామచంద్ర = శ్రీరామ.
భావము:
“రామా! రవికులాబ్ధిసోమా! సీతాదేవి పవిత్రురాలు త్రికరణ శుద్ధిగా (మనోవాక్కాయకర్మలలోను) సత్యనిష్ఠగల సాధ్వి, పరిశుద్ధ వర్తనురాలు, మహాపుణ్యాత్మురాలు, పతివ్రత. ఈమెను విడుచుట తగినపని కాదు. స్వీకరించు.”
- ఉపకరణాలు:
అని వాల్మీకి పలుక, రామచంద్రుండు పుత్రార్థి యై విచారింపఁ, గుశ లవులను వాల్మీకికి నొప్పగించి, రామచంద్రచరణధ్యానంబు చేయుచు నిరాశ యై సీత భూవివరంబు జొచ్చె; నయ్యెడ.
టీకా:
అని = అని; వాల్మీకి = వాల్మీకి; పలుకన్ = చెప్పగా; రామచంద్రుండు = శ్రీరాముడు; పుత్ర = కొడుకుల; అర్థి = కోసము; ఐ = అయ్యి; విచారింపన్ = విచారించగా; కుసెలవులను = కుసెలవులను; వాల్మీకి = వాల్మీకి; కిన్ = కి; అప్పగించి = అప్పచెప్పి; రామచంద్ర = శ్రీరాముని; చరణ = పాదములను; ధ్యానంబు = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; నిరాశ = నిరాశచెందినామె; ఐ = అయ్యి; సీత = సీతాదేవి; భూవివరంబున్ = భూగర్భములోనికి; చొచ్చెన్ = ప్రవేశించెను; అయ్యెడ = అప్పుడు.
భావము:
అని వాల్మీకి చెప్పగా, శ్రీరాముడు కొడుకుల గురించి విచారించాడు. నిరాశచెందిన సీతాదేవి, వాల్మీకికి కుశలవులను అప్పచెప్పి, భర్త పాదాలు ధ్యానిస్తూ భూగర్భములోకి ప్రవేశించింది. అప్పుడు...
- ఉపకరణాలు:
"ముదితా! యేటికిఁ గ్రుంకి తీవు మనలో మోహంబు చింతింపవే
వదనాంభోజము చూపవే మృదువు నీ వాక్యంబు విన్పింపవే
తుది చేయం దగ" దంచు నీశ్వరుఁడునై దుఃఖించె భూపాలుఁ డా
పదగాదే ప్రియురాలిఁ బాసిన తఱిన్ భావింప నెవ్వారికిన్?
టీకా:
ముదితా = ఓ కాంతా; ఏటికిన్ = ఎందుకు; క్రుంకితి = కుంగిపోయితివి; ఈవు = నీవు; మన = మనమధ్య; లోన్ = అందు; మోహంబున్ = ప్రీతి; చింతింపవే = ఆలోచింపుము; వదన = మోము అనెడి; అంభోజమున్ = పద్మమును; చూపవే = చూపుము; మృదువు = మృదువైనవి; నీ = నీయొక్క; వాక్యంబున్ = మాటలు; విన్పింపవే = వినిపించుము; తుదిన్ = విడిపోవుట; చేయన్ = చేయుటకు; తగదు = తగినది; అంచున్ = అనుచు; ఈశ్వరుండును = భగవంతుడును; ఐ = అయ్యి; దుఃఖించె = శోకించెను; భూపాలుడు = మహారాజు; ఆపద = ఆపదే; కాదే = కాదా, అవును; ప్రియురాలిన్ = ప్రియురాలిని; పాసిన = దూరమైన; తఱిన్ = వేళ; భావింపన్ = తరచిచూసినచో; ఎవ్వారికిన్ = ఎలాంటివారికైనను.
భావము:
తాను భగవంతుడే అయినా రాముడు సీత కోసం దుఃఖిస్తూ, ఇలా అన్నాడు. “ఓ కాంతా! అయ్యో నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు. మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు. నీ మృదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు.” అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలగుతుంది కదా..
- ఉపకరణాలు:
అని వగచి, రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరియించి, పదుమూఁడువేల యేం డ్లెడతెగకుండ నగ్నిహోత్రంబు చెల్లించి తా నీశ్వరుండు గావునఁ దన మొదలినెలవుకుం జనియె నివ్విధంబున.
టీకా:
అని = అని; వగచి = బాధపడి; రామచంద్రుండు = శ్రీరాముడు; బ్రహ్మచర్యంబు = బ్రహ్మచర్యమును; ధరియించి = చేపట్టి; పదుమూడువేల = పదమూడువేల(13,000); ఏండ్లు = సంవత్సరములు; ఎడతెగకుండన్ = ఎడతెగకుండ; అగ్నిహోత్రంబున్ = హోమమును; చెల్లించి = నడిపించి; తాన్ = అతను; ఈశ్వరుండు = భగవంతుడు; కావునన్ = కనుక; తన = తనయొక్క; మొదలినెలవు = మూలస్థానము; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:
ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి పదమూడువేల (13,000) సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా....
- ఉపకరణాలు:
ఆదిదేవుఁడైన యా రామచంద్రుని
కబ్ధి గట్టు టెంత యసురకోటి
జంపు టెంత కపుల సాహాయ్య మది యెంత
సురల కొఱకుఁ గ్రీడ జూపెఁగాక.
టీకా:
ఆదిదేవుడు = మూలాధారదేవుడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; రామచంద్రుని = రామచంద్రుని; కిన్ = కి; అబ్ధి = సముద్రమునకు; కట్టుట = సేతువుకట్టుట; ఎంత = ఎంతపాటిపని; అసుర = రాక్షస; కోటి = సమూహమును; చంపుట = సంహరించుట; ఎంత = అది ఎంతపని; కపుల = వానరుల; సాహాయ్యము = తోడు; అది = అది; ఎంత = ఏపాటిది; సురల = దేవతల; కొఱకున్ = కోసము; క్రీడ = లీలలు; చూపెన్ = చూపించెను; కాక = తప్పించి.
భావము:
దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి, ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంతపని? రాక్షససంహారం అనగా ఎంతపని? ఆయనకు వానరులు తోడా అది ఏపాటిదనవచ్చు?
- ఉపకరణాలు:
వశుఁడుగ మ్రొక్కెదన్ లవణవార్ధి విజృంభణతా నివర్తికిన్
దశదిగధీశమౌళిమణి దర్పణమండిత దివ్యకీర్తికిన్
దశశతభానుమూర్తికి సుధారుచిభాషికి సాధుపోషికిన్
దశరథరాజుపట్టికిని దైత్యపతిం బొరిగొన్న జెట్టికిన్.
టీకా:
వశుడుగన్ = వినమ్రుడనుగా; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; లవణవార్ధి = ఉప్పుసముద్రముయొక్క; విజృంభణా = అహంకారమును; నివర్తి = అణచినవాని; కిన్ = కి; దశ = పది {దశదిశలు - దిక్కులు 4 (తూర్పు దక్షణము పడమర ఉత్తరము) మూలలు 4 (ఆగ్నేయము నైరృతి వాయవ్యము ఈశాన్యము) పైన 1 మరియు కింద 1 మొత్తం 10}; దిక్ = దిక్కుల; అధీశ = ప్రభువుల; మౌళి = కిరీటములందలి; మణి = మణులు అనెడి; దర్పణ = దర్పణములలో; మండిత = ప్రకాశించుతున్న; దివ్య = గొప్ప; కీర్తి = యశస్సుగలవాని; కిన్ = కి; దశశత = వెయ్యి (1000); బాను = సూర్యులతో సమానమైన; మూర్తి = ప్రకాశముగల స్వరూపి; కిన్ = కి; సుధా = అమృతమువలె; రుచి = తియ్యగా; భాషి = మాట్లాడెడివాని; కిన్ = కి; సాధు = సాధుపురుషులను; పోషి = పోషించువాని; కిన్ = కి; దశరథ = దశరథుడు అనెడి; రాజు = రాజుయొక్క; పట్టి = కుమారుని; కిని = కి; దైత్యపతిన్ = రావణాసురుని {దైత్యపతి - రాక్షసరాజు, రావణాసురుడు}; పొరిగొన్న = సంహరించిన; జెట్టి = వీరుని; కిన్ = కి.
భావము:
సాగరుని అహంకారం సర్వం అణచినవానికి; సకల దిక్పాలకుల కిరీటాలలోని మణులు అనె దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి; వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి; అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి; సాధులను పాలించువానికి; దశరథరాజు కుమారునికి; రావణాసురుని సంహరించిన వీరునికి; వినమ్రుడనై మ్రొక్కుతాను.
- ఉపకరణాలు:
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్
విల్లును దాల్చువాఁడు గడు విప్పగు వక్షమువాఁడు మేలు పైఁ
జల్లెడువాఁడు నిక్కిన భుజంబులవాఁడు యశంబు దిక్కులం
జల్లెడువాఁడు నైన రఘుసత్తముఁ డిచ్చుత మా కభీష్టముల్.
టీకా:
నల్లనివాడు = నల్లగా ఉండువాడు; పద్మ = పద్మములవంటి; నయనంబులవాడు = కన్నులుగలవాడు; మహా = గొప్ప; ఆశుగంబులున్ = బాణములు; విల్లునున్ = బాణాసనమును; తాల్చువాడు = ధరించెడివాడు; కడు = మిక్కిలి; విప్పు = విశాలమైనది; అగు = అయిన; వక్షమువాడు = రొమ్ము గలవాడు; మేలున్ = శుభములు; పైన్ = మీద; జల్లెడువాడు = కురిపించువాడు; నిక్కిన = ఉన్నతమైన; భుజంబులవాడు = భుజములు కల వాడు; యశంబున్ = కీర్తిని; దిక్కులన్ = దిక్కుల కడవరకు; జల్లెడువాడు = వ్యాపించినవాడు; ఐన = అయినట్టి; రఘుసత్తముడు = రఘువంశపు తిలకుడు; ఇచ్చుత = తీర్చుగాక; మా = మా; కున్ = కు; అభీష్టముల్ = కోరికలు.
భావము:
నల్లటివాడు, పద్మాలవంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించు వాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్ళు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసిన వాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక.
- ఉపకరణాలు:
రామచంద్రుఁ గూడి రాకలఁ పోకలఁ
గదిసి తిరుగువారుఁ గన్నవారు
నంటికొన్నవారు నా కోసలప్రజ
లరిగి రాదియోగు లరుగు గతికి.
టీకా:
రామచంద్రున్ = శ్రీరాముని; కూడి = కలిసి; రాకలపోకలన్ = మెలయుటయందు; కదిసి = చేరి; తిరుగు = నడచెడి; వారున్ = వారు; కన్న = చూచిన; వారున్ = వారు; అంటికొన్న = తాకిన; వారున్ = వారు; ఆ = ఆ; కోసల = కోసలదేశపు; ప్రజలున్ = ప్రజలు; అరిగిరి = వెళ్ళిరి; ఆదియోగులు = ఆదియోగులు; అరుగు = వెళ్ళెడి; గతి = సద్గతి; కి = కి.
భావము:
శ్రీరామునితో కలిసిమెలసి మెలగిన వారు; తనివితీరా చూసిన వారు; ప్రేమతో తాకిన వారు అయిన ఆ కోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు.
- ఉపకరణాలు:
మంతనములు సద్గతులకుఁ
బొంతనములు ఘనములైన పుణ్యముల కిదా
నీంతనపూర్వమహాఘ ని
కృంతనములు రామనామ కృతి చింతనముల్.
టీకా:
మంతనములున్ = ఏకాంతమార్గములు; సద్గతుల్ = మోక్షముల; కున్ = కు; పొంతనములు = పొందిపజేయునవి {పొంతనము - మైత్రి కలిగించునది, గ్రహమైత్రి}; ఘనములు = గొప్పవి; ఐన = అయినట్టి; పుణ్యముల్ = పుణ్యఫలముల; కిన్ = కి; తాన్ = తను; ఇంతన = ఇప్పుడు; పూర్వ = పూర్వముచేసిన; మహా = గొప్ప; అఘ = పాపములను; నికృంతనములు = త్రెంచునవి; రామ = శ్రీరాముని; నామ = పేరుతో; కృత = చేసెడి; చింతనముల్ = సంస్మరణలు.
భావము:
శ్రీరామచంద్రమూర్తిని గుఱించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంతమార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి. పూర్వజన్మలలోను , యీ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు.
- ఉపకరణాలు:
ఆ రామచంద్రునకుఁ గుశుండును, గుశునకు నతిథియు, నతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికిఁ బుండరీకుండును బుండరీకునకు క్షేమధన్వుండును, క్షేమధన్వునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకుఁ బారియాత్రుండును, బారియాత్రునకు బలుండును, బలునకుఁ జలుండును, జలునకు నర్కసంభవుం డగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖణుండును, శంఖణునకు విధృతియు, విధృతికి హిరణ్యనాభుండును జనియించి; రతండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్కముని వలన నధ్యాత్మయోగంబు నేర్చి, హృదయకలుషంబులం బాసి యోగచర్యుండయ్యె నా హిరణ్యనాభునకుఁ బుష్యుండును, బుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు నగ్నివర్ణుండును, నగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును బుట్టి: రా రాజయోగి సిద్ధుండయి కలాపగ్రామంబున నున్నవాఁడు కలియుగాంతంబున నష్టంబయ్యెడు సూర్యవంశంబుఁ గ్రమ్మఱఁ బుట్టింపంగలవాఁ; డా మరువునకుఁ బ్రశుశ్రుకుండును, నా ప్రశుశ్రుకునకు సంధియు, నతనికి నమర్షణుండును, నా యమర్షణునికి మహస్వంతుండును, నా మహస్వంతునకు విశ్వసాహ్యుండును, నా విశ్వసాహ్యునకు బృహద్బలుండును, జనియించి; రా బృహద్బలుఁడు భారతయుద్ధంబున మీ తండ్రి యగు నభిమన్యు చేత హతుండయ్యె; వినుము.
టీకా:
ఆ = ఆ; రామచంద్రున్ = శ్రీరాముని; కున్ = కి; కుశుండున్ = కుశుడు; కుశున్ = కుశుని; కున్ = కి; అతిథియున్ = అతిథి; అతిథి = అతిథి; కిన్ = కి; నిషధుండును = నిషధుడు; నిషధున్ = నిషధుని; కున్ = కి; నభుండును = నభుడు; నభున్ = నభుని; కిన్ = కి; పుండరీకుండును = పుండరీకుడు; పుండరీకున్ = పుండరీకున్; కున్ = కి; క్షేమధన్వుండును = క్షేమధన్వుడును; క్షేమధన్వున్ = క్షేమధన్వుని; కున్ = కి; దేవానీకుండును = దేవనీకుడును; దేవానీకున్ = దేవానీకుని; కున్ = కి; అహీనుండును = అహీనుడు; అహీనున్ = అహీనుని; కున్ = కి; పారియాత్రుండును = పారియాత్రుడు; పారియాత్రున్ = పారియాత్రుని; కున్ = కి; బలుడును = బలుడు; బలున్ = బలుని; కున్ = కి; చలుండును = చలుడు; చలున్ = చలుని; కున్ = కి; అర్కసంభవుండు = సూర్యాంశతో పుట్టినవాడు; అగు = ఐన; వజ్రనాభుండును = వజ్రనాభుడు; వజ్రనాభున్ = వజ్రనాభుని; కున్ = కి; శంఖణుండును = శంఖణుడు; శంఖణున్ = శంఖణుని; కున్ = కి; విధృతియున్ = విధృతి; విధృతి = విధృతి; కిన్ = కి; హిరణ్యనాభుండును = హిరణ్యనాభుడు; జనియించిరి = పుట్టిరి; అతండు = అతడు; జైమిని = జైమినియొక్క; శిష్యుండు = శిష్యుడు; ఐన = అయినట్టి; యజ్ఞవల్క = యజ్ఞవల్కుడు అనెడి; ముని = ఋషి; వలనన్ = నుండి; అధ్యాత్మయోగంబున్ = అధ్యాత్మయోగమును; నేర్చి = నేర్చుకొని; హృదయ = చిత్తములోని; కలుషంబులన్ = పాపములను; పాసి = విడిచిపెట్టి; యోగచర్యుండు = యోగము ఆచరించువాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; హిరణ్యనాభున్ = హిరణ్యనాభుని; కున్ = కి; పుష్యుండును = పుష్యుడు; పుష్యున్ = పుష్యుని; కున్ = కి; ధ్రువసంధియున్ = ధ్రువసంధి; ధ్రువసంధి = ధ్రువసంధి; కిన్ = కి; సుదర్శనుండును = సుదర్శనుడు; సుదర్శనున్ = సుదర్శనుని; కున్ = కి; అగ్నివర్ణుండును = అగ్నివర్ణుడు; అగ్నివర్ణున్ = అగ్నివర్ణుని; కున్ = కి; శీఘ్రుండును = శీఘ్రుండు; శీఘ్రున్ = శీఘ్రుని; కున్ = కి; మరువు = మరువు; అను = అనెడి; రాజ = రాజులలో; శ్రేష్ఠుండును = శ్రేష్ఠుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; రాజయోగి = రాజర్షి; సిద్ధుండు = సిద్ధిపొందినవాడు; అయి = ఐ; కలాప = కలాప అనెడి; గ్రామంబునన్ = ఊరిలో; ఉన్నవాడు = ఉన్నాడు; కలియుగ = కలియుగపు; అంతంబునన్ = చివరలో; నష్టంబయ్యెడు = నాశనమైపోయెడి; సూర్యవంశంబున్ = సూర్యవంశము; క్రమ్మఱన్ = మరల; పుట్టింపగలవాడు = ప్రతిష్టించబోవుచున్నాడు; ఆ = ఆ; మరువున్ = మరువున; కున్ = కు; ప్రశుశ్రుకుండును = ప్రశుశ్రుకుడు; ఆ = ఆ; ప్రశుశ్రుకున్ = ప్రశుశ్రుకుని; కున్ = కి; సంధియున్ = సంధి; అతని = అతని; కిన్ = కి; అమర్షణుండును = అమర్షణుడు; ఆ = ఆ; అమర్షణుండును = అమర్షణుని; కిన్ = కి; మహస్వంతుండును = మహస్వంతుడు; ఆ = ఆ; మహస్వంతున్ = మహస్వంతుని; కున్ = కి; విశ్వసాహ్యుండును = విశ్వసాహ్యుడు; ఆ = ఆ; విశ్వసాహ్యున్ = విశ్వసాహ్యుని; కున్ = కి; బృహద్బలుండును = బృహద్బలుడు; జనియించిరి = పుట్టిరి; ఆ = ఆ; బృహద్బలుడు = బృహద్బలుడు; భారతయుద్ధంబునన్ = భారతయుద్ధమునందు; మీ = మీయొక్క; తండ్రి = తండ్రి; అగు = ఐన; అభిమన్యు = అభిమన్యుని; చేతన్ = చేతిలో; హతుండు = మరణించినవాడు; అయ్యెన్ = అయ్యెను; వినుము = వినుము.
భావము:
శ్రీరామునికి కుశుడు; కుశునికి అతిథి; అతిథికి నిషధుడు; నిషధునికి నభుడు; నభునికి పుండరీకుడు; పుండరీకునికి క్షేమధన్వుడును; క్షేమధన్వునికి దేవనీకుడును; దేవానీకునికి అహీనుడు; అహీనునికి పారియాత్రుడు; పారియాత్రునికి బలుడు; బలునికి చలుడు; చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు; వజ్రనాభునికి శంఖణుడు; శంఖణునికి విధృతి; విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు; పుష్యునికి ధ్రువసంధి; ధ్రువసంధికి సుదర్శనుడు; సుదర్శనునికి అగ్నివర్ణుడు; అగ్నివర్ణునికి శీఘ్రుడు; శీఘ్రునికి మరువు అనె రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్టిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు; ఆ ప్రశుశ్రుకునికి సంధి; అతనికి అమర్షణుడు; ఆ అమర్షణునికి మహస్వంతుడు; ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు; ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారతయుద్ధంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు. వినుము.