పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : గంగాప్రవాహ వర్ణన

 •  
 •  
 •  

9-230-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లమ్మహానదీప్రవాహంబు, పురారాతిజటాజూటరంధ్రంబుల వలన వెలువడి, నిరర్గళాయమానంబై, నేలకుఁ జల్లించి, నెఱసి నిండి పెల్లు వెల్లిగొని, పెచ్చు పెరిగి విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱక ప్రాయంపుఁ గామధేనువు చందంబున ముందఱికి నిగుడు ముద్దుఁ జందురు తోడి నెయ్యంబునఁ గ్రయ్య నడరి చొప్పుదప్పక సాఁగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిఁ బెంపుఁ గలిగి మహేశ్వరు వదనగహ్వరంబు వలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబై య మ్మహీపాల తిలకంబు తెరువు వెంటనంటి వచ్చు వెలియేనుఁగు తొండంబుల ననుకరించి పఱచు వఱదమొగంబులును, వఱదమొగంబుల పిఱుందనందంద క్రందుకొని పొడచూపి తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలం బైన బుగ్గలును, బుగ్గలసంగడంబునం బారిజాతకుసుమ స్తబకంబుల చెలువంబులం దెగడు వెలినురువులును, వెలినురువుల చెంగట నర్థోన్మీలిత కర్పూరతరుకిసలయంబులఁ చక్కందనముఁ గేలిగొను సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవళజలధరరేఖాకారంబుల బాగు మెచ్చని నిడుద యేఱులును, నేఱులం గలసి వాయువశంబున నొండొంటిం దాఁకి బిట్టు మిట్టించి, మీఁది కెగయు దురితభంగంబులైన భంగంబులును, భంగంబులకొనల ఛిన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం బెగసి, ముత్తియంపు సరుల వడుపున, మల్లికాదామంబుల తెఱంగునఁ గర్పూరఖండకదంబంబుల చెలువంబున నిందుశకలంబుల తేజంబునఁ, దారకానికరంబుల పొలుపున మెఱయుచు, ముక్తి కన్యా వశీకరంబులైన శీకరంబులునుం గలిగి, మధ్యమలోక శ్రీకరంబై, శ్రీకరంబు తెఱంగున విష్ణుపదంబు ముట్టి, విష్ణుపదంబు భాతి నుల్లసితహంసరుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభితకువలయంబై, కువలయంబు చెన్నున బహుజీవనంబై, జీవనంబులాగున సుమనోవికాసప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రారామంబై, రామచిత్తంబు మెలఁపువం దనవారిలోఁజొచ్చిన దోషాచరుల కభయప్రదాన చణంబై, ప్రదానచణ వర్తనంబు భాతి సముపాసిత మృత్యుంజయంబై, మృత్యంజయురూపంబుపోలిక విభూతి సుకుమారంబై, కుమారచరిత్రంబుఠేవను గ్రౌంచప్రముఖవిజయంబై, విజయ రథంబుభాతి హరిహయామంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామగిరివనప్రవేశకామంబై, కామకేతనంబు పెల్లున నుద్దీపిత మకరంబై మకరకేతను బాణంబు కైవడి విలీనపరవాహినీకలిత శంబరంబై, శంబరారాతి చిగురు గొంతంబుసూటి నధ్వగవేదనాశమనంబై, శమనదండంబు జాడ నిమ్నోన్నత సమవృత్తంబై, వృత్తశాస్త్రంబు విధంబున వడిగలిగి సదా గురులఘువాక్యచ్ఛటా పరిగణితంబై, గణితశాస్త్రంబు కొలఁదిని ఘనఘనమూల వర్గమూల సంకలిత భిన్నమిశ్ర ప్రకీర్ణఖాతభీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవద్గీతంబై, గీతశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానాశబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువడి హల్లు గలిగి, మహాభాష్యరూపావతారవృత్తి వృద్ధిగుణసమర్థంబై, యర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంబై, దృష్టాంతంబు తెఱంగున సర్వసామాన్య గుణవిశేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణతత్పరంబై, పరబ్రహ్మంబుగరిమ నతిక్రాంతానేక నిగమంబై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణపదక్రమసంగ్రహంబై, గ్రహశాస్త్రంబు పరిపాటిని గర్కట మీన మిథున మకరరాశి సుందరంబై, సుందరి ముఖంబు పోఁడిమిని నిర్మల చంద్రకాంతంబై, కాంతాధరంబు రుచిని శోణచ్ఛాయావిలాసంబై, విలాసవతి కొప్పునొప్పునఁ గృష్ణనాగాధికంబై, యధికమతిశాస్త్రసంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయ విభ్రమంబై, విభ్రమవతిచనుదోయి పగిది నిరంతర పయో వ్యాప్తాఖిలలోక జీవనప్రద తుంగభద్రాతిరేఖా సలలితంబై, లలితవతి నగవు మించున నపహసిత చంద్రభాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖలకన్యకావిస్తారంబై, తారకెంగేలి యొడికంబున నాక్రాంత సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోపవారణంబై, వారణంబు పరుసునం బుష్కరోన్నత సంరంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయ దశం బై, దశరథ తనయు బొమముడి చాడ్పున సింధుగర్వ ప్రభంజనం బై, ప్రభంజతనయు గదపెట్టు మాడ్కిని సమీపగత దుశ్సాసన దుర్మద నివారకరంబై, వారకన్యక ముంజేతి గతిని ముహుర్ముహరుచ్చలిత కంకణాలంకృతంబై, కృతయుగంబు నోజ నపంకంబై, పంకజాసనుముఖంబు నొఱపునఁ బ్రభూతముఖ్యవర్ణంబై, వర్ణగుణితంబు తెఱకువను బహుదీర్ఘబిందు విసర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావమధురంబై, మథురాపురంబు సొబగున మహానందనందనంబై, నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై, కౌశికహయంబు రీతి సుదశధ్రువంబై, ధ్రువు తలంపు క్రియం గ్రియాబరిశీలిత విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునఁ బ్రముదిత నరంబై, నరసింహు నఖరంబుల భాతి నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్రదానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభివనంబై, నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనికను సంభృత మకర పద్మ మహాపద్మ కచ్ఛపంబై, కచ్ఛప కర్పరంబు బలిమిని బతితశైలసముద్ధరణంబై, ధరణీధరంబు సాటి నుత్తుంగ తటముఖ్యంబై, ముఖ్యవరాహంబు గరిమ నున్నత క్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనోరామం బై, రామచంద్రుని బాణంబుకడింది నభాగ్యత ఖరదూషణ మదాపహరణ ముఖరంబై, ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూలచ్ఛే దన ప్రబలంబై, బలరామహలంబుభాతిని బ్రతికూలసన్నికర్షణ ప్రబుద్ధంబై, బుద్ధదేవునిమేని యొఱపున నభియాతి రక్షోదార మనోహరం బై, హరతాండవంబు మేర నుల్లసితానిమిషంబై, యనిమిషావతారంబు కీర్తిని శ్రుతి మంగళప్రదంబై, ప్రదాత యీగి సూటినర్థ పరంపరా వామనంబై, వామనచరణరేఖను బలివంశవ్యపనయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామభేదమాయోపాయ చతురంబై, చతురాన నాండంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్యమానం బై, మానినియన లోఁతు చూపక, గరితయన చడిచప్పుడు చేయక, ముగుద యన బయలు పడక, ప్రమద యన గ్రయ్యంబాఱుచుఁ, బతివ్రత యన నిట్టట్టుఁ జనక, తల్లియన నెవ్వియైన లోఁగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, నంతకంతకు విస్తరించి గుఱిగడచి, యవాఙ్మానస గోచరంబై ప్రవహించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ఆ = ఆ; మహా = గొప్ప; నదీ = నదియొక్క; ప్రవాహంబున్ = ప్రవాహము; పురారాతి = పరమశివుని {పురారాతి - త్రిపురములకి రాతి (శత్రువు), శంకరుడు}; జటా = జడల; జూట = ముడి; రంధ్రముల = ఖాళీల; వలన = నుండి; వెలువడి = బయటకువచ్చి; నిరర్గళ = అడ్డులేకుండ; ఆయమానంబు = వచ్చెడిది; ఐ = అయ్యి; నేల = భూమి; కున్ = మీదకి; జల్లించి = కారి, ఉరికి; నెఱసి = వ్యాపించి; నిండి = నిండి; పెల్లు = మిక్కిలి వడిగా; వెల్లిగొని = ప్రవహించి; పెచ్చుపెరిగి = పొంగిపొరలి; విచ్చలవిడిన్ = ఇష్టంవచ్చినట్టు; క్రేపు = దూడ; వెంబడిన్ = కూడ; ఉఱక = దూకెడి; క్రేళ్ళుఱుకు = గంతులిడెడి; మఱకప్రాయంపు = నవయౌవనములోనున్న; కామధేనువు = కామధేనువు {కామధేనువు - కోరినవస్తువులిచ్చెడి దేవతా గోవు}; చందంబునన్ = వలె; ముందఱికిన్ = ముందుకు; నిగుడుచు = సాగుతూ; ముద్దు = ముద్దులొలుకు; చందురు = చంద్రుని; తోడి = తోటి; నెయ్యంబునన్ = స్నేహముతో; క్రయ్యనడరి = ఉప్పొంగి; చొప్పు = దారి; తప్పక = తప్పకుండగ; సాగి = కాలువలుగట్టి; చనుదెంచున్ = వచ్చు; సుధార్ణవంబు = పాలసముద్రము; కైవడిన్ = వలె; పెంపు = అతిశయము; కలిగి = కలిగి; మహాశ్వరు = పరమశివుని; వదనగహ్వరంబు = నోటి; వలన = నుండి; ఓంకారంబు = ఓంకారము; పిఱుందన్ = అనుసరించి; వెలువడు = బయటకొచ్చెడి; శబ్దబ్రహ్మంబు = శబ్దబ్రహ్మము; భంగిన్ = వలె; అదభ్ర = అతివిస్తారమైన; విభ్రమంబు = విలాసముకలది; ఐ = అయ్యి; ఆ = ఆ; మహీపాల = రాజులలో {మహీపాలుడు - మహి (భూమి)ని పాలించువాడు, రాజు}; తిలకంబు = శ్రేష్ఠుని; తెరువు = దారిని; వెంటనంటి = అనుసరించి; వచ్చు = వస్తున్న; వెలి = తెల్లని; ఏనుగు = ఏనుగు; తొండంబులన్ = తొండములను; అనుకరించి = వలె; పఱచు = పరుగెట్టెడి; వఱద = ప్రవాహపువెల్లువల; మొగంబులునున్ = ముందుభాగములును; వఱదమొగంబుల = వరదపోటుల; పిఱుందన్ = వెంట; అందంద = అక్కడక్కడ; క్రందుకొని = కమ్ముకొని; పొడచూపి = కనిపించి; తొలంగు = తొలగిపోయెడి; బాలశారదా = చిన్నపిల్లకి; శారదా = కొత్తగా పుట్టిన; కుచ = స్తనములనెడి; కుంభంబుల్ = కలశముల; కున్ = కి; అగ్గలంబ = మించినవి; ఐన = అయిన; బుగ్గలును = నీటిపొంగులును; బుగ్గల = నీటిపొంగులతో; సంగడంబునన్ = చేరికవలన; పారిజాత = పారిజాత; కుసుమ = పూల; స్తబకంబుల = గుత్తులయొక్క; చెలువంబులన్ = చక్కదనములను; తెగడు = పరిహసించెడి; వెలి = తెల్లని; నురువులును = నురగలు; వెలి = తెల్లని; నురువుల = నురగల; చెంగటన్ = పక్కన; అర్థ = అర; ఉన్మూలిత = విరిసిన; కర్పూర = కర్పూర; తరు = చెట్ల; కిసలయంబులన్ = చిగుళ్ళ; చక్కందనము = సోయగములను; గేలిగొను = పరిహసించెడి; సుళ్ళును = సుడిగుండములును; సుళ్ళ = సుడుల; కెలంకులన్ = పక్కలందలి; ధవళ = తెల్లని; జలధర = మేఘముల; రేఖ = అందమైన; ఆకారంబుల = రూపుల; బాగు = చక్కదనమును; మెచ్చని = అంగీకరించని; నిడుద = పొడవైన; ఏఱులును = ప్రవాహములు; ఏఱులన్ = ప్రవాహములో; కలసి = కలిసిపోయి; వాయు = గాలివేగము; వశంబునన్ = వలన; ఒండొంటి = ఒకదానినొకటి; తాకి = తగిలి; బిట్టు = మిక్కిలి; మిట్టించి = నిక్కి; మీద = పై; కిన్ = కి; ఎగయు = లేచెడి; దురిత = పాపముల; భంగంబులున్ = నాశకరములు; ఐన = అయినట్టి; భంగంబులును = అలలు; భంగంబుల = అలల; కొనలన్ = చివర్లయందు; ఛిన్నభిన్నంబులు = విరిగిపోయినవి; ఐ = అయ్యి; కుప్పించి = గెంతి; ఉప్పరంబున్ = పైకి; ఎగసి = ఎగిరిపడి; ముత్తియంపు = ముత్యాల; సరుల = దండల; వడుపున = వలె; మల్లికా = మల్లిపూల; దామంబుల = మాల; తెఱంగున = వలె; కర్పూర = కర్పూపు; ఖండ = బిళ్ళల; కదంబంబుల = పేర్లు; చెలువంబునన్ = చక్కదనములతో; ఇందు = చంద్రుని; శకలంబుల = కళల; తేజంబునన్ = ప్రకాశముతో; తారకా = చుక్కల; నికరంబు = గుంపుల; పొలుపునన్ = వలె; మెఱయుచు = మెరుస్తూ; ముక్తి = మోక్షము అనెడి; కన్యా = కన్యను; వశీకరంబులు = స్వాధీనముచేయగలవి; ఐన = అయిన; శీకరంబులును = తుంపరలు; కలిగి = ఉండి; మధ్యమలోక = భూలోకమున {మధ్యమలోక - పైలోకములు స్వర్గాది కిందివి పాతాళాది మధ్యది భూలోకము}; శ్రీకరంబు = మంగళప్రదముచేసెడిది; ఐ = అయ్యి; శ్రీ = లక్ష్మీదేవి; కరంబు = చేయి; తెఱంగునన్ = వలె; విష్ణుపదంబున్ = విష్ణుమూర్తి పాదములను; ముట్టి = తాకి; విష్ణుపదంబున్ = వైకుంఠము; భాతిన్ = వలె; ఉల్లసిత = విలసిల్లెడి; హంస = పరమహంసలతో, హంసలతో; రుచిరంబు = ప్రకాశించెడిది; ఐ = అయ్యి; రుచిరపక్షంబు = శుక్లపక్షము; రీతిన్ = వలె; అతి = మిక్కిలి; శోభిత = శోభిల్లుతున్న; కువలయంబు = కలువలుగలది; ఐ = అయ్యి; కువలయంబు = భూమండలము; చెన్నునన్ = వలె; బహు = అనేకమైన; జీవనంబు = జీవికలుగలది, నీరుకలది; ఐ = అయ్యి; జీనంబు = జీవితముల; లాగునన్ = వలె; సుమనస్ = మంటిమనసులను, పూల; వికాస = వికసింపజేసెడిది, వికసించుటలు; ప్రధానంబు = కూడినది; ఐ = అయ్యి; ప్రధాన = ముఖ్య; పర్వంబు = ఘట్టము; పొలుపునన్ = వలె; అనేక = అనేకమైన, పెక్కు; చక్ర = సేనలు, చక్రవాకములు; బక = బకుడు, కొంగలు; భీమ = భీముని, భయంకరమైన; మహా = గొప్ప, పెద్ద; భంగ = ఘాతములు, అలలు; సుభద్రా = సుభద్ర, మంచికాటుకపిట్ట; అర్జున = అర్జునుడు, తెల్లదనము; చరిత్ర = కథలతో, వర్తనలతో; రామంబు = మనోజ్ఞమైనది; ఐ = అయ్యి; రామ = శ్రీరాముని; చిత్తంబున్ = మనసు; మెలపువన్ = మెత్తదనముతో; తన = తనను; వారి = ఆశ్రయించినవారి, నీటి; లోన్ = అందు; చొచ్చిన = ప్రవేశించిన, మునిగిన; దోషాచారుల్ = రాక్షసుల, పాపుల; కున్ = కు; అభయ = శరణమును; ప్రదాన = ఇచ్చుటలో; చణంబు = సమర్థమైనది; ఐ = అయ్యి; ప్రదానచణ = గొప్పదాతయొక్క; వర్తనంబున్ = ప్రవర్తన, నడవడిక; భాతిన్ = వలె; సమ = మిక్కిలి; ఉపాసిత = సేవించిన, పూజించిన; మత్యుంజయంబు = అమరత్వంగలది, శివుడు కలది; ఐ = అయ్యి; మృత్యుంజయ = శివుని; రూపంబున్ = స్వరూపము; పోలిక = వలె; విభూతి = భస్మముతో, సంపదతో; సుకుమారంబు = అందమైనది, మృదువైనది; ఐ = అయ్యి; కుమార = కుమారస్వామి; చరిత్రంబు = కథలు; ఠేవను = వలె; క్రౌంచ = క్రౌంచపర్వతాదుల, కొంగల; ప్రముఖ = ముఖ్యులపై, మున్నగువానితో; విజయంబు = జయముగలది, జయకరమైనది; ఐ = అయ్యి; విజయ = అర్జునుని; రథంబున్ = రథము; భాతిన్ = వలె; హరి = సూర్యుని; హయ = గుఱ్ఱముల; అమంథరంబు = వేగముగలది; ఐ = అయ్యి; మంథర = మంథరయొక్క; విచారంబున్ = ఆలోచనవలె; గ్రద్దన = శ్రీఘ్రముగ; మహారామ = గొప్పరాముని, గొప్పతోటలు; గిరి = కొండలు; వన = అడవులలో; ప్రవేశ = చేరుటను; కామంబున్ = కోరెడిది; ఐ = అయ్యి; కామ = మన్మథుని; కేతనంబు = జండా; పెల్లున = వలె; ఉద్దీపిత = విలసిల్లెడి; మకరంబు = మొసళ్లుకలది; ఐ = అయ్యి; మకరకేతను = మన్మథుని {మకరకేతనుడు - జండాపై మొసలి కలవాడు, మన్మథుడు}; బాణంబు = బాణము; కైవడి = వలె; విలీన = ప్రవేశించిన, లీనమైన; పరవాహినీ = శత్రు, ఇతర; వాహినీ = సైన్యముతో, ప్రవాహములు; కలిత = కూడిన, కలిగినది; శంబరంబు = శంబరాసురుడుగలది, ఎఱ్ఱని చిన్న జింకలుగలది; ఐ = అయ్యి; శంబరారాతి = మన్మథుని {శంబరారాతి - శంబరుని శత్రువు, మన్మథుడు}; చిగురు = చిగురుటాకు; కొంతంబున్ = బాకు; సూటిన్ = వలె; అధ్వగ = బాటసారుల; వేదనా = తాపాన్ని; శమనంబు = తొలగించెడిది; ఐ = అయ్యి; శమన = యముని; దండంబున్ = దండము; జాడన్ = వలె; నిమ్నోన్నత = అల్పుల అధికులపట్ల, ఎత్తుపల్లాలురేకుండ; సమవృత్తంబు = సమానంగా మెలిగెడిది; ఐ = అయ్యి; వృత్తశాస్త్రంబు = ఛందోశాస్త్రము; విధంబునన్ = వలె; వడి = బిగువు, వేగము; కలిగి = ఉండి; సదా = ఎల్లప్పుడు; గురు = గురువులు, పెద్దవైన; లఘు = లఘువులు, చిన్నవైన; వాక్యత్ = మాటల, పలికెడి; చటన్ = మెరుపులతో, శబ్దములతో; పరిగణితంబు = గణములుగలది, ఎంచదగ్గది; ఐ = అయ్యి; గణితశాస్త్రంబున్ = గణితశాస్త్రము; కొలదిని = వలె; ఘన = ఘనములు, గొప్ప {ఘనములు - పోడవు, వెడల్పు, ఎత్తుగలవి}; ఘనమూల = ఘనమూలములు, దట్టమైన వేర్లు {ఘనమూలము - ఏ సంఖ్యనైతే దానిని దానితోనే 2 సార్లు గుణించినప్పుడు వచ్చెడి రెండవ సంఖ్య యొక్క ఘనమూలము ఆ సంఖ్య}; వర్గమూల = వర్గమూలములు, సజాతి వేర్లు {వర్గమూలము - ఏ సంఖ్యనైతే దానిని దానితోనే గుణించగా వచ్చెడి సంఖ్య యొక్క వర్గమూలము ఆ సంఖ్య}; సంకలిత = కలిగినది, కలిసిపోయినవి; భిన్న = భిన్నములు, వేరుజాతులు; మిశ్ర = కలగలిసి, కలిసిపోయి; ప్రకీర్ణ = చిక్కులుకలిగి, చిక్కుపడిపోయినవిగల; ఖాత = కష్టాలతో, లోయలుతో; భీష్మంబు = భీతికొలిపెడిది; ఐ = అయ్యి; భీష్మపర్వంబు = భీష్మపర్వము; పెంపునన్ = వలె; అనేక = అనేకమైన; భగవత్ = భగవంతుని, సుఖకరమైన; గీతంబు = స్తుతులుగలది, శబ్దములుకలది; ఐ = అయ్యి; గీతాశాస్త్రంబు = భగవద్గీత; నిలుకడను = వలె; మహా = గొప్ప, పెద్ద; సుషిరతను = లయతో, గువ్వగుత్తికచెట్లతో; ఘన = అధికమైన; నానా = రకరకముల; శబ్దంబు = శబ్దములుగలది; ఐ = అయ్యి; శబ్దశాస్త్రము = వ్యాకరణము; మర్యాదన్ = వలె; అచ్చు = అచ్చులు, అచ్చమైన; వడి = బిగువు, వేగము; హల్లు = హల్లులు, తొట్రుపాటు; కలిగి = ఉండి; మహాభాష్య = పాణినిసూత్రములకు వ్యాఖ్యానము; రూపావతార = ఆవిష్కరణ; వృత్తిన్ = వలె; వృద్ధి = వృద్ధినికలిగించెడి; గుణ = లక్షణములు; సమర్థంబు = శక్తిగలది; ఐ = అయ్యి; అర్థశాస్త్రంబు = అర్థశాస్త్రము; మహిమను = వలె; బహు = అనేక; ప్రయోజన = యోజనములకొలది; ప్రమాణ = కొలతలు, పొడవులతో; దృష్టాంతంబు = ఉదహరింపబడినది, కనబడునది; ఐ = అయ్యి; దృష్టాంతంబు = ఉదాహరణలు; తెఱంగునన్ = వలె; సర్వసామాన్య = పోలికల, అందరికి అందుబాటులోనుండెడి; గుణ = గుణములతో; విశేషంబు = ప్రత్యేకతలుగలది, శ్రేష్ఠమైనది; ఐ = అయ్యి; శేష = ఆదిశేషుని; వ్యాపారంబు = కార్యము; కరణిని = వలె; సుస్థిర = స్థిరత్వమును, స్థిరమైన; ఉద్ధరణ = నిలబెట్టుటందు, వృద్ధిని కలిగించుటందు; తత్పరంబు = లగ్నమైనది; ఐ = అయ్యి; పరబ్రహ్మంబు = పరబ్రహ్మ; గరిమన్ = వలె; అతిక్రాంత = మించిపోబడిన, దాటిన; అనేక = అనేకమైన, పెక్కు; నిగమంబు = వేదజ్ఞానముకలది, దార్లుగలది; ఐ = అయ్యి; నిగమంబు = వేదముల; నడవడిని = వలె; బ్రహ్మ = పరబ్రహ్మ, అధికమైన; వర్ణ = వర్ణమాల, రకముల; పద = పలుకుల, శబ్దముల; క్రమ = పద్ధతుల, వరుసలతో; సంగ్రహంబు = సమగ్రము, కూడిక; ఐ = అయ్యి; గ్రహశాస్త్రంబు = ఖగోళశాస్త్రము; పరపాటిన్ = వలె; కర్కాటక = పీతలు; మీన = చేపల; మిథున = జంటలు; మకర = మొసళ్ళ; రాశి = నక్షత్రరాశులతో, గుంపులతో; సుందరంబు = అందమైనది; ఐ = అయ్యి; సుందరి = అందగత్తె; ముఖంబున్ = మోము; పోడిమిన్ = వలె; నిర్మల = స్వచ్చమైన; చంద్రకాంతంబు = చంద్రుని కాంతిగలది; ఐ = అయ్యి; కాంతా = సుందరియొక్క; అధరంబు = పెదవి; రుచిని = వలె; శోణ = ఎరుపు, దుండిగపుమొక్కల; ఛాయన్ = రంగుతో, పల్చటివ్యాప్తితో; విలాసంబు = విలసిల్లుతున్నది; ఐ = అయ్యి; విలాసవతి = శృగారవతి; కొప్పు = జుట్టుముడి; ఒప్పునన్ = వలె; కృష్ణ = నల్లదనము, నల్లటి; నాగ = నాగరము (ఆభరణము), పాములతో; అధికంబు = అతిశయిల్లునది; ఐ = అయ్యి; అధికమతి = బుద్ధిమంతుని; శాస్త్రసంవాదంబు = శాస్త్రీయ చర్చ; సొంపునన్ = వలె; అపార = అంతులేని, విస్తారమైన; సరస్వతీ = శారదాదేవి, సరస్వతీనది; విజయ = గెలుపుతో, సంగమముతో; విభ్రమంబు = విల్లసిల్లునది, సుడిగలది; ఐ = అయ్యి; విభ్రమవతి = సుందరాంగి; చను = స్తనముల; దోయి = జంట; పగిదిన్ = వలె; నిరంతర = ఎడతెగని; పయస్ = పాలచే, నీటి; వ్యాప్త = నిండి, ప్రవాహముచే; అఖిల = అందరు, సమస్తమైన; లోక = పిల్లలకు, లోకులకు; జీవనప్రద = జీవనాధారమైన; తుంగ = దీర్ఘమైన {తుంగము - పొడవైనది, తురంగ అని పాఠాంతరము ఉంది, తురంగము, త్వరితముగలది}; భద్ర = క్షేమకరమైన; అతిరేఖ = అతిశయముతో; సలలితంబు = మృదువైనది, మంచినీరు కలది; ఐ = అయ్యి; లలితవతి = ముగ్దయొక్క; నగవు = మందహాసము; మించునన్ = వలె; అపహసిత = వెక్కిరించబడిన; చంద్ర = చంద్రుని; భాగధేయంబు = తునకవంటిది; ఐ = అయ్యి; భాగధేయవంతుని = భాగ్యవంతుని; వివాహంబు = పెండ్లి; లీలన్ = వలె; మహా = గొప్ప; మేఖలకన్యకా = ఒడ్డాణములుగలస్త్రీలు, నర్మదానదికంటె; విస్తారంబు = అధికముగాగలది, విస్తారమైనది; ఐ = అయ్యి; తార = తార; కెంగేలి = కెంపులచేతి; ఒడికంబునన్ = వలె; సూర్యతనయంబు = సుగ్రీవుడుకలది, యమునానదికలది {సూర్యతనయ - 1. సూర్యుని పుత్రిక, యమున, 2. సూర్యుని పుత్రుడు, 1సుగ్రీవుడు 2కర్ణుడు}; ఆక్రాంత = స్పర్శించినది, కలిపేసుకొన్నది; ఐ = అయ్యి; సూర్యతనయ = కర్ణుని; శర = బాణముల; వర్షంబు = వర్షము; పోలికన్ = వలె; భీమరథ్య = భీమునిరథపు, భీమరథీనది; ఆటోప = విజృంభణమును; వారణంబు = అడ్డుకొన్నది; ఐ = అయ్యి; వారణంబు = ఏనుగు; పరుసున్ = వలె; అంబు = నీరుగల, నీటి; పుష్కర = ఏనుగుతొండముచివర, తామరతో; ఉన్నత = పైకెత్తబడిన, అతిశయించిన; సంరంభంబు = విజృంభణము కలది; ఐ = అయ్యి; రంభ = రంభయొక్క; నెమ్మోము = నిండు ముఖము; డాలునన్ = వలె; సు = మంచి; రస = సరసము, నీటితో; అతిశయదశంబు = అతిశయించినది; ఐ = అయ్యి; దశరథతనయు = రామచంద్రుని {దశరథతనయుడు - దశరథుని పుత్రుడు, రాముడు}; బొమముడి = కోపపు భ్రుకుటి; చాడ్పునన్ = వలె; సింధు = సముద్రుని; గర్వ = గర్వమును; ప్రభంజనంబు = విరగగొట్టినది; ఐ = అయ్యి; ప్రభంజనతనయు = భీముని {ప్రభంజనతనయుడు - వాయుపుత్రుడు, భీముడు}; గద = గదాయుధము; పెట్టు = దెబ్బ; మాడ్కిని = వలె; సమీపగత = దరిచేరిన, సమీపించినవారి; దుశ్శాసనదుర్మద = దుశ్శాసనునిగర్వమును, మహాపాపములను {దుశ్శాసన - దు (చెడుగ) శాసన (ఆజ్ఞాపించుట)}; నివారకంబు = తొలగించెడిది; ఐ = అయ్యి; వారకన్యక = వేశ్య; ముంజేతి = మణికట్టు; గతిని = వలె; ముహుర్ముహుర్ = మాటిమాటికి; ఉచ్చలిత = కదలెడి, పారెడి; కంకణ = కంకణములతో, నీటిబిందువులతో; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐ = అయ్యి; కృతయుగంబు = కృతయుగము; ఓజన్ = వలె; అపంకంబు = పాపములేనిది, బురదలేనిది; ఐ = అయ్యి; పంకజాసను = బ్రహ్మదేవుని {పంకజాసనుడు - పంకజము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మ}; ముఖంబున్ = మోముల; ఒఱపునన్ = వలె; ప్రభూత = అధికమైన, ఉన్నతమైన; ముఖ్యవర్ణంబు = తెలుపురంగుకలది, బ్రాహ్మణజాతిచే ఆశ్రయింపబడినది; ఐ = అయ్యి; వర్ణ = అక్షరముల; గుణితంబు = గుణింతముల; తెఱకువను = వలె; బహు = అనేకమైన, పెక్కు; దీర్ఘ = దీర్ఘములు, పెద్ద; బిందు = సున్న, బిందువులతో; విసర్గంబు = రెండుసున్నలు కలది, వెదజల్లుతున్నది; ఐ = అయ్యి; సర్గ = అధ్యయములతో; బంధ = కూర్చబడిన; కావ్యంబు = రచన; విన్ననువునన్ = వలె; గంభీర = గంభీమైన, లోతైన; భావ = భావములతో, స్వభావముతో; మధురంబు = మధురమైనది, తియ్యనినీరు కలది; ఐ = అయ్యి; మథురాపురంబు = మథురానగరము; సొబగునన్ = వలె; మహానంద = గొప్పనందుని, గొప్పఆనందానికి; నందనంబు = పుత్రుడుగాగలది, నందనవనమైనది; ఐ = అయ్యి; నందనవనంబు = నందనవనము; పొందునన్ = వలె; విహరమాణ = విహరిస్తున్న; కౌశికంబు = ఇంద్రుడు కలది, కౌశకీనది కలది; కౌశికహయంబు = ఉచ్ఛైశ్రవము; రీతిన్ = వలె; సు = మంచి; దశ = దశ; ధ్రువంబు = గుఱ్ఱపుసుడి కలది, ఎడతెగనిది; ఐ = అయ్యి; ధ్రువు = ధ్రువుని; తలంపు = భావములు; క్రియన్ = వలె; క్రియాపరిశీలిత = ఉపాయముగా పరిశీలింపబడిన; విశ్వంభరంబు = విష్ణుమూర్తి కలది, లోకపాలన కలది {విశ్వంభరుడు - జగత్తును భరించువాడు, విష్ణువు}; ఐ = అయ్యి; విశ్వంభరున్ = విష్ణుమూర్తి; శంఖంబు = శంఖము; రూపునన్ = వలె; దక్షిణావర్తోత్తరంబు = కుడివైపుకి ఆవృతము కలది, దక్షిణమునకు ఉత్తరమునకు మరలునది; ఐ = అయ్యి; ఉత్తరా = ఉత్తరయొక్క; వివాహంబు = పెండ్లి; చందంబునన్ = వలె; ప్రముదిత = మిక్కిలి సంతోషించిన; నరంబు = అర్జునుడు కలది, మానవులు కలది; ఐ = అయ్యి; నరసింహు = నరసింహుని; నఖరంబుల = గోళ్ళ; భాతిన్ = వలె; ఆశ్రిత = ఆశ్రయించిన, ఆశ్రయులకు; ప్రహ్లాద = ప్రహ్లాదుని, మిక్కిలి ఆనందము; గురు = అధికమైన, గొప్ప; విభవ = వైభవములను, సంపదను; ప్రదానంబు = కలిగించినది, ఇచ్చునది; ఐ = అయ్యి; దాన = దానములను చేయు; కాండంబు = సమూహముల; సిరిన్ = వలె; కామధేనువు = కామధేనువు; కల్పలతా = కల్పవృక్షము; ఆది = మున్నగువానితో; అభివనంబు = కూడినది; ఐ = అయ్యి; నవసూతికా = బాలింతరాలి; కుచంబున్ = స్తనము; పేర్మిని = వలె; నిరంతర = ఎల్లప్పుడు; పయస్ = పాలు, నీటితో; వర్ధనంబు = పొంగెడిది; ఐ = అయ్యి; ధనదు = కుబేరుని; నిలయంబున్ = నివాసము; తూనికను = వలె; సంభృత = నిండిన; మకర = మకరము, మొసలి; పద్మ = పద్మము, తామరలు; మహాపద్మ = మహాపద్మము, మెట్టతామరలు; కచ్ఛపంబు = కచ్ఛపము అనెడి నిధులు కలది, తాబేళ్ళు ఉన్నది; ఐ = అయ్యి; కచ్ఛప = ఆదివరాము యొక్క; కర్పరంబు = పై డిప్ప, చిప్ప; బలిమిని = వలె; పతిత = పడుతున్న, భర్తవలె అదుపుచేయు; శైల = మంథరపర్వతమును, కొండలవంటిగట్లుతో; సముద్ధరణంబు = ఎత్తబడినది, కాపాడబడునది; ఐ = అయ్యి; ధరణీధరంబు = కొండల; సాటిన్ = వలె; ఉత్తుంగ = ఎత్తైన; తట = చరియలు, గట్లు; ముఖ్యంబు = కలది; ఐ = అయ్యి; ముఖ్యవరాహంబు = ఆదివరాహము; గరిమన్ = వలె; ఉన్నత = గొప్ప; క్షమంబు = ఓర్పు కలది; ఐ = అయ్యి; క్షమాసుర = బ్రాహ్మణుని {క్షమాసురుడు - క్షమ (భూమికి) సురుడు (దేవత), బ్రాహ్మణుడు}; హస్తంబు = చేతి; కరగరికను = వలె; సత్ = మంచి; పవిత్రంబు = పుణ్యకరమైన; మనోరామంబు = ఇంపుకలది; ఐ = అయ్యి; రామచంద్రుని = శ్రీరాముని; బాణంబు = బాణము; కడింది = వలె; అభ్యాగత = ఎదిరించివచ్చెడి, చేరవచ్చెడి; ఖర = ఖరుని, కఠినుల; దూషణ = దూషణుని, పాపుల; మద = గర్వమును, అహంకారమును; అపహరణ = నాశనము యందు; ముఖరంబు = ముఖ్యంబైనది; ఐ = అయ్యి; ముఖరరామ = పరశురాముని; కుఠారంబు = గొడ్డలి; రీతిని = వలె; భూభృత్ = రాజుల, పర్వతరాజముల; మూలత్ = సమూలంగా; ఛేదన = సంహరించుటందు, పెల్లగించుటందు; ప్రబలంబు = మిక్కలి శక్తి కలది; ఐ = అయ్యి; బలరామ = బలరాముని; హలంబున్ = నాగలి; భాతిన్ = వలె; ప్రతికూల = శత్రువుల, ఇరుపక్కలగట్లను; సన్నికర్షణ = ఉన్మీలించు, ఒరసుకొనెడి; ప్రబుద్ధంబు = లక్షణము కలది; ఐ = అయ్యి; బుద్దదేవుని = బుద్దుని; మేని = దేహపు; ఎఱుపునన్ = ఎఱ్ఱదనమువలో; అభియాతిన్ = శత్రువుల, చేరవచ్చిన; రక్షోదార = రాక్షసుల భార్యలకు, రక్షించుఉదారతతో; మనోహరంబు = మనోహరమైనది, చక్కటిది; ఆ = అయ్యి; హర = శివుని; తాండవంబు = తాండవము; మేరను = వలె; ఉల్లసిత = సంతోషముగల, ఉత్సాహవంతమైన; అనిమిషంబు = దేవతలుగలది, చేపలు కలది; ఐ = అయ్యి; అనిమిషావతారంబు = మత్యావతారము; కీర్తిని = వలె; శ్రుతి = వేదములకు, చెవులకు; మంగళ = శుభములను, ఇంపును; ప్రదంబు = ఇచ్చునది, కలిగించునది; ఐ = అయ్యి; ప్రదాత = గొప్పదాత; ఈగిన్ = దానము; సూటిన్ = వలె; అర్థ = ధన, వస్తువుల; పరంపర = సమూహముతో; ఆవామానంబు = సుముఖమైనది, విస్తారమైనది; వామన = వామనుని; చరణ = పాదము; రేఖను = వలె; బలి = బలియొక్క, బలమైన; వంశ = కులమును, వెదురుపొదలను; వ్యపనయంబు = నిర్మూలించునది, కదల్చివేయునది; ఐ = అయ్యి; నయశాస్త్రంబు = నీతిశాస్త్రము; మార్గంబునన్ = వలె; సామ = సామ; భేద = భేద; మాయ = మాయ; ఉపాయ = ఉపాయములు; చతురంబు = నాలుగుకలది, చాతుర్యముకలది; ఐ = అయ్యి; చతురాననాండంబు = బ్రహ్మాండము {చతురాననాండము - చతురానన (బ్రహ్మ) అండము}; భావంబునన్ = వలె; అపరిమిత = అపరిమితమైన, లెక్కలేనన్ని; భువన = లోకములు, భూజలచర; జంతుజాల = ప్రాణులుచే, జంతువులతో; సేవ్యమానంబు = కొలవబడునది, అనుభవింపబడెడిది; ఐ = అయ్యి; మానిని = మానవతి; అనన్ = లాగ; లోతు = గుట్టు, లోతు; చూపక = తెలియనీయక; గరిత = ఇల్లాలి; అన = లాగ; చడిచప్పుడు = హడావిడిపడక, ప్రశాంతమై; ముగుద = ముద్దరాలి; అనన్ = లాగ; బయలుపడక = బయటికిపోక, చెలియలిగట్టుదాటక; ప్రమద = జవరాలు; అనన్ = లాగ; క్రయ్యంబాఱుచు = శీఘ్రగమనము కలిగి; పతివ్రత = పతివ్రత; అనన్ = లాగ; ఇట్టట్టున్ = అటునిటు; చనక = పోక; తల్లి = అమ్మ; అనన్ = లాగ; ఎవ్వియైనన్ = అన్నిటిని; లోగొనుచు = కడుపులోదాచుకొనుచు; దైవంబు = దేవత; అనన్ = లాగ; భక్త = భక్తుల; మనోరథంబులు = కోరికలు; ఇచ్చుచున్ = తీర్చుచు; అంతకంతకు = క్రమక్రమంగా; గుఱి = లక్ష్యములను; గడచి = దాటుతు; అవాఙ్మానసగోచరంబు = మాటకు మనసుకు అందనిది; అవాఙ్మానసగోచరంబు = అయ్యి; ప్రవహించి = పారి.

భావము:

ఆ ప్రకారం అవతరించిన ఆ మహానది పరమశివుని జటాజూటాల రంధ్రాలనుండి దూకి, నేలపైచేరింది. అడ్డూ ఆపు లేకుండ ఉరికి, వ్యాపించి, మిక్కిలి వడిగా ప్రవహించసాగింది. ఇష్టం వచ్చినట్టు గంతులేసే దూడ వెంట పరుగులు తీసే ప్రాయంలో ఉన్న కామధేనువులా, చంద్రుడి స్నేహముతో ఉప్పొంగినా దారి తప్పకుండగ ఉప్పొంగే పాలసముద్రంలా, పరమశివుడు పలికే ఓంకారాన్ని అనుసరించి వెలువడే శబ్దబ్రహ్మములా ఆ గంగాదేవి పొంగిపొరలుతూ ముందుకు ప్రవహిస్తూ అతివిస్తార విలాసాలతో ఆ రాజశ్రేష్ఠుని అనుసరించి రాసాగింది. అలా తెల్లని ఐరావతం తొండాల వలె కనబడుతూ పరుగెట్టె ప్రవాహాల ముందు భాగపు వరదపోటుల వెంట అక్కడక్కడ కన్నెపిల్లలకి కొత్తగా పుట్టే స్తనాల వలె నీటిపొంగులు కమ్ముకుంటున్నాయి. ఆ నీటిపొంగులతో పారిజాత పూల గుత్తుల చక్కదనాన్ని మించిన తెల్లని నురగలు. ఆ తెల్లని నురగల పక్కన అరవిరిసిన కర్పూర చిగుళ్ళ సోయగాలను మించే సుడిగుండాలు. ఆ సుడుల పక్కల తెల్లని మేఘాల కన్నా అందమైన పొడవైన ప్రవాహాలు. ఆ ప్రవాహలలో కలిసిపోయి గాలివేగానికి పైకి లేచే పాపనాశకరాలైన అలలు. ఆ అలల చివర్లు విరిగి పైకి ఎగిరిపడే తుంపరలు. మోక్ష ప్రదాయాలు అయిన ఆ తుంపరలు ముత్యాల దండల వలె, మల్లెమాలల వలె. కర్పూబిళ్ళల పేర్లు వలె చంద్రకళలో ప్రకాశించే చుక్కల వలె మెరుస్తూ ఉన్నాయి. ఆ తుంపరలతో భూలోకానికి మంగళప్రదం అయిన లక్ష్మీదేవి చేయి వలె ప్రకాశిస్తోంది. పరమహంసలతో, హంసలతో ప్రకాశించే వైకుంఠంలా శుక్లపక్షములో శోభిల్లే కలువలు కలిగి విలసిల్లుతోంది. భూమండలం వలె అనేకమైన జీవికలు, నీరు కలగి, జీవితాల వలె మంచి మనసులు కలిగి వికసిస్తోంది.
అనేక సేనలు, బకుడు, భీముడు, సుభద్ర, అర్జునుడు, కథలతో శోభించే భారతపర్వంలా, పెక్కు చక్రవాకాలు, కొంగలు, మంచికాటుకపిట్టలు, భయంకరమైన అఘాతాలు, అలలుతో మనోఙ్ఞంగా ప్రవహిస్తోంది. శ్రీరాముని హృదయంలా, తన నీటిలో మునిగిన పాపులకు మెత్తగా శరణం ఇస్తూ భగీరథుని అనుసరిస్తోంది. మృత్యువును జయించిన మహాదాత ప్రవర్తనలా, శివుడిని పూజిస్తూ, విభూతితో కూడిన అందమైన శివుడిలా గొప్ప నడకలతో సుకుమారంగా ప్రవహిస్తోంది. క్రౌంచపర్వతాదులను గెలిచిన కుమారస్వామి చరిత్రలలాగ, కొంగలు మున్నగువానితో జయకరమై వెళ్తోంది. అర్జునుని రథంలా, సూర్యుని గుఱ్రాల వేగంతో, శ్రీరామునికి వనవాసం కలిగించిన మంథర ఆలోచనలలా గొప్ప వడిగా పెద్ద పెద్ద తోటలు, కొండలు, అడవులలో ప్రవహిస్తోంది. మన్మథుని జండా వంటి మొసళ్లతో విలసిల్లుతోంది. మన్మథబాణం వలె తనలో కలిసిన ఇతర ప్రవాహాలతో పోటీపడి సాగుతోంది. మన్మథుని చిగురుటాకు బాకు వలె, బాటసారుల తాపాన్ని తొలగిస్తోంది. అల్పుల అధికుల పట్ల సమత్వం కల యమదండంవలె, ఎత్తుపల్లాలు లేకుండ సమానంగా ప్రవహిస్తోంది. ఛందోశాస్త్రంలా ఎల్లప్పుడు పెద్ద అలల శబ్దాలు అనే గురువులు, చిన్న అలల శబ్దాలనె లఘువులుతో, మంచి బిగువు, వేగములతో నడుస్తోంది. గణితశాస్త్రంలా ఘనములకు ఉన్నట్లు పొడవు, వెడల్పు, ఎత్తు కలిగి, ఘనమూలంతో దట్టమైన వేర్లు కలిగి, వర్గమూలాలుతో సజాతి వేర్లు కలిగి. మిశ్రమ భిన్నాల వలె, వేరు జాతులు కలగలిసి విరాజిల్లుతోంది. పరస్పరం రాసుకునే పొదరిండ్లతో, విడిపడ్డ లోయలుతో భయంకరంగా ప్రవహిస్తోంది. చక్కటి స్తుతులు కల భగవద్గీతా సహితమైన భీష్మపర్వంలా సుఖకరమైన శబ్దాలతో సాగుతోంది. గువ్వగుత్తికచెట్ల శబ్దం మున్నగు అనేక రవములు రకరకాల వాయిద్యాల శబ్దాలవలె శోభిల్లగా గొప్ప లయతో ప్రవాహాలు కట్టి నడుస్తోంది, అచ్చులు, హల్లులు కలిగిన వ్యాకరణం వలె అచ్చమైన బిగువు, వడి కలిగి నడుస్తోంది. మహాభాష్య వృత్తిలా వృద్ధిగుణాల సామర్థ్యంతో ప్రవహిస్తోంది. పెక్కు ప్రయోజనాలు, ప్రమాణాలతో, ఉదాహరణలతో కూడిన అర్థశాస్త్రంలా అనేక యోజనాల నిడివిగా ప్రవహిస్తోంది. సామాన్య గుణాల విశేషంతో విలసిల్లే ఉదాహరణలువలె, అందరికి అందుబాటులో ఉండే గుణాల ప్రత్యేకతలతో నడుస్తోంది. భూమిని భరించడంలో నిమగ్నమైన ఆదిశేషుని కార్యంలాగ సుస్థిరమైన గొప్ప యత్నంతో భగీరథుని వెంట ముందుకు సాగుతోంది. వేదాలకు సైతం అతీతమైన పరబ్రహ్మను మించి, అనేకమైన దారులను అతిక్రమిస్తోంది. పెక్కు వర్ణపదక్రమాలతో అతిశయించే వేదాల వలె అనేక రకాల ధ్వనులుతో సాగుతోంది. కర్కాట, మీన, మిథున, మకరాలతో ఒప్పి ఉండే ఖగోళ నియతి వలె పీతలు, చేపల జంటలు, మొసళ్ళ గుంపులతో ఉరకలేస్తోంది. నిర్మలమైన చంద్ర కాంతితో వెలిగిపోయే అందగత్తె మోము వలె స్వచ్ఛమైన చంద్రకాంతిలో మెరుస్తోంది. ఇంపైన పల్చటి సుందరి పెదవి వలె కెంపు రంగుతో విలసిల్లుతోంది. నాగరం ధరించిన శృంగారవతి జుట్టులాగ నల్లదనంతో, పాములతో అతిశయిల్లుతోంది. శారదాదేవి గెలుపుతో కూడిన బుద్ధిమంతుని విస్తారమైన శాస్త్రీయ చర్చ వలె విస్తారమైన సరస్వతీనది సంగమముతో విల్లసిల్లుతోంది. అఖిల సంతానానికి బ్రతుకుతెరువై, శుభకరమైన ఆకారంతో కూడిన సుందరాంగి చనుదోయి సొగసుతో ప్రవహిస్తోంది. సుందరాంగి మందహాసంలా చంద్రభాగ సౌభాగ్యాన్ని అతిశయించి నడుస్తోంది. గొప్ప ఒడ్ఢాణాలు ధరించిన కన్యలతో విహరించే అదృష్టవంతుని వివాహంలా భూమినిండా విస్తరించిన ప్రవాహంతో పరుగెడుతోంది. తార తన చేతితో సుగ్రీవుని తాకినట్లు, యమునానదిని సుందరంగా ఆప్యాయంగా స్పర్శించి భగీరథుని కూడా కొనసాగుతోంది. భీమునిరథం విజృంభణాన్ని అడ్డుకుంటున్న కర్ణుని బాణవర్షం వలె, భీమరథీనది వడిని అడ్డుకొంటూ సాగుతోంది. నీటిని చిమ్మే ఏనుగుతొండము చివర వలె, పైకెత్తబడిన తామరతో అతిశయించి విజృంభిస్తోంది. మంచి సరసం తెలిసిన రంభ నిండు ముఖం వలె, మంచినీటితో అతిశయించి ప్రవహిస్తోంది. సముద్రుని గర్వం సర్వం భంగపరచిన శ్రీరామచంద్రుని బొమముడి వలె సింధునది గర్వాన్ని భంగపరస్తూ ప్రవహిస్తోంది. దరిచేరిన దుశ్శాసనుని దుర్మదాన్ని విరగగొట్టే భీముని గదాఘాతంలా, తనలో మునిగినవారి మహాపాపాలను తొలగిస్తూ పారుతోంది. మాటిమాటికి కదలాడె కంకణాలు అలంకరించిన వేశ్య మణికట్టు వలె, మళ్ళీమళ్ళీ పారె నీటి బిందువులతో నిండి ప్రవహిస్తోంది. కల్మషరహితమైన కృతయుగంలా, కల్మషాలు లేని నిర్మల జలాలతో ప్రవహిస్తోంది. గొప్ప తెలుపుతో ప్రకాశించే బ్రహ్మదేవుని మోముల వలె గొప్ప బ్రాహ్మణజాతిచే ఆశ్రయింపబడుతూ కొనసాగుతోంది. అనేక దీర్ఘాలతో బిందువులతో, విసర్గలతో విలసిల్లే అక్షరాల గుణింతాలలాగ, అధికమైన నీటిబిందువులు వెదజల్లుతు ప్రయాణిస్తోంది. గంభీరమైన భావాలతో మధురమైన అధ్యాయాలతో కూర్చబడిన కావ్యంలా, లోతైన స్వభావంతో, తియ్యని నీటితో విరాజిల్లుతోంది. నందనందనుడు కల మధురానగరంల గొప్ప ఆనందానికి నందనవనంగా అలరారుతోంది. ఇంద్రుడు విహరించే నందనవనం వలె, కౌశకీనదితో విహరిస్తూ ఉంది. ఇంద్రుడి గుఱ్ఱం ఉచ్ఛైశ్రవం వలె, ధ్రువమైన మంచి దశతో ఎడతెగని ప్రవాహాలతో ప్రవహిస్తోంది. విష్ణుచింత కల ధ్రువుని భావాల వలె, లోకపరిశీలన కలిగి నడుస్తోంది, ప్రశస్తమైన విష్ణుమూర్తి దక్షిణావర్త శంఖం వలె, కుడివైపుకి మరలుటలు కలిగి సాగుతోంది. ఉత్తర వివాహం వలె మిక్కిలి నరానందం కలిగి పాఱుతోంది. ఆశ్రయించిన భక్తుడు ప్రహ్లాదునికి గొప్ప వైభవాలను ప్రసాదించిన నరసింహుని గోళ్ళ వలె, ఆశ్రయులకు మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగిస్తూ సాగుతోంది. కామధేనువు కల్పవృక్షాలలాగ, దానాల సమూహంతో కూడి కదుల్తూ ఉంటుంది. పాలు పొంగుతుండే బాలింతరాలి స్తనం వలె, ఎల్లప్పుడు పాఱే నీటితో పొంగుతూ ఉంటుంది. మకరం, పద్యం, మహాపద్మం, కచ్ఛపం అనే నిధులతో తులతూగే కుబేరుని నివాసము వలె, మొసళ్ళతో, తామరలతో, మెట్టతామరలతో, తాబేళ్ళతో నిండుగా ప్రవహిస్తూ ఉంటుంది. కూలిన మంథర పర్వతాన్ని పైకెత్తే ఆదికూర్మం యొక్క బలమైన డిప్ప వలె, కొండ గట్లను కదిలించే వడితో ప్రవహిస్తోంది. ఎత్తైన చరియలతో నిండిన కొండల వంటి, ఎత్తైన గట్లతో కాపాడబడుతూ అతిశయిస్తుంటుంది. భూమిని పైకెత్తే ఆదివరాహం వలె గొప్ప ఓర్పు కలిగి పాఱుతుంటుంది, పుణ్యకరమైన దర్భలు కల బ్రాహ్మణుని చేతి వలె, మంచి పవిత్రమైన ఇంపుతో పెంపారుతూ ఉంటుంది. ఎదిరించి వచ్చే ఖరదూషణాదుల గర్వం సర్వం హరించే రామబాణం వలె, చేరవచ్చు పాపుల అహంకారాన్ని అపహరిస్తూ ప్రవహిస్తోంది. రాజ సమూహాన్ని సమూలంగా సంహరించే పరశురాముని గొడ్డలి వలె, పర్వతాలను పెల్లగించేంత బలంగా ప్రవహిస్తోంది. శత్రువులను ఉన్మీలించు బలరాముని నాగలి వలె, ఇరుపక్కల గట్లను ఒరసుకుంటూ ప్రవహిస్తోంది. చేరవచ్చు రాక్షస కాంతలకు మనోహరమైన బుద్దుని నెమ్మేను వలె, ఆశ్రయించిన సర్వులను రక్షించు ఉదారతతో మనోహరంగా పాఱుతోంది. దేవతలను సంతోషింపజేసే శివతాండవం వలె, ఉత్సాహవంతమైన తుళ్ళిపడే చేపలకు అలవాలమైంది. వేదాలకు శుభాలను సమకూర్చే మత్స్యావతారంలా, చెవులకు ఇంపు కలిగిస్తూ ప్రవహిస్తోంది. ధన, వస్తు సమదాయాలతో సుముఖంగా ఉన్న గొప్పదాత వలె, విస్తారమై పాఱుతోంది. బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుడి పాదంలాగ, బలమైన వెదురుపొదలను సైతం కదిలించే టంత వడిగా ప్రవహిస్తోంది. సామభేదమాయోపాయలతో కూడిన నీతిశాస్త్రం వలె, చాతుర్యంతో ఒప్పుతోంది. అపరిమితమైన లోకాలతో జంతుకోటితో నిండి ఉండే బ్రహ్మాండం వలె, లెక్కలేనన్ని జలచరాలతో కొలవబడుతూ ఉంది. గుట్టు తెలియనీని మానవతి లాగ, తెలియలేనంత లోతు కలిగి ప్రవహిస్తోంది. ఎన్ని పనులున్నా హడావిడిపడని ఇల్లాలి లాగ, ప్రశాంతంగా పాఱుతోంది. బయటికిపోని ముద్దరాలి లాగ, గట్లు దాటకుండా పోతోంది. శీఘ్రగమనంగల జవరాలు లాగ, వడిగా ప్రవహిస్తోంది. అటునిటు పోని పతివ్రత లాగ, భగీరథుడు చూపిన దారినే ప్రవహిస్తోంది. అన్నిటిని కడుపులో దాచుకొనే కన్నతల్లిలా, అన్నిటిని తన కడుపులో దాచుకుంటూ పోతోంది. భక్తుల కోరికలు తీర్చు దేవత లాగ, తనను ఆశ్రయించిన వారి కోరికలు తీర్చుచు ప్రవహిస్తోంది. అలా క్రమక్రమంగా పరిమితులను దాటి మాటకు, మనసుకు అందకుండా భగీరథుని వెంట భాగీరథి ప్రవహిస్తోంది.
విశేషము: - పరమేశ్వరుని జటాజూట నిర్గతమైన ఆ ముత్తోవలద్రిమ్మరి భూలోకము నందు అవతరించిన గంగానదిగా రెండువేల ఐదు వందల కిలోమీటర్ల (2,500 కి.మీ.) దూరం ప్రవహించి సముద్రాన్ని చేరుతుంది. ఆ బృహత్తర ప్రయాణ అవతరణ వర్ణనకు కవీశ్వరుడు వచనం ఎంచుకున్నారు బావుంది. ఆ అద్భుతాన్ని, ఆ గంగానది నడకల పోకడలను మన పోతన్న గారు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. లేదు అక్షర చిత్రంగా, గాత్ర చిత్రంగా ఎంత చిత్రంగా ఆవిష్కరించారో. సందర్భోచితంగా సృష్టిలోని వర్ణనీయ వస్తువులను గ్రహించి నీటి తుంపురులు, చినుకులు, బిందువులు, బుడగలు, కాలువలు, సెలయేళ్ళు వంటి అవస్థా భేదాలతో ఆయా వర్ణనీయాలతో ఒక అనుబంధాన్ని తన కవితావైచిత్రితో ఏర్పరచాడా అన్నట్లు ముక్తపదగ్రస్త అలంకారము మమేకమైపోయింది. శ్లేష అలంకారము సాభిప్రాయంగా మనోజ్ఞతను వెల్లివిరిసింది. దశావతారలతో గంగావతరణాన్ని అనుసంధించి ఒక విశిష్టతను మహాకవి ఆపాదించారు. గంగ విష్ణు పాదాల వద్ద ఉద్భవించినదని ప్రసిద్ధి కదా. ఇట్టి వచనములను నరసింహావతారము మున్నగు ఘట్టములలో కూడ మన పోతనామాత్యుల వారు వాడారు. అవి అన్నియును చక్కటి సందర్భోచితముతో విలసిల్లినవే. పోతన వచనాలకు ప్రసిద్ది కదా.

9-231-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ వడిన్ దాఁటి త
త్సరక్ష్మాపకుమార భస్మముల మీఁదన్ ముంచి పాఱన్ మరు
న్నరావాసము వారు పొందిరి నవీశ్రీలతో గంగ నీ
రుతిం గాక మహాదురంత సుజనద్రోహానలం బాఱునే.

టీకా:

జగతీనాథు = రాజుయొక్క; రథంబు = రథము; పజ్జన్ = వెనుక; బహు = అనేకమైన; దేశంబుల్ = ప్రదేశములను; వడిన్ = వేగముగా; దాటి = గడచి; తత్ = ఆ; సగర = సగరుడు అనెడి; క్ష్మాపకుమార = రాకుమారుల {క్ష్మాపకుమారులు - క్షమ ప (భూమినేలేడివాని) కుమారులు, రాకుమారులు}; భస్మముల = బూడిదల; మీదన్ = పైన; ముంచి = మీంచి; పాఱన్ = ప్రవహించగా; మరున్నగర = స్వర్గమునందు {మరున్నగరము - మరుత్ (దేవతల) నగరము, స్వర్గము}; ఆవాసము = నివసించుటను; వారు = వారు; పొందిరి = పొందిరి; నవీన = సరికొత్త; శ్రీలు = శుభములు; తోన్ = తోటి; గంగ = గంగాజలము; గతిన్ = వలన; కాక = తప్పించి; మహా = గొప్ప; దురంత = దాటరాని; సుజన = పుణ్యాత్ములపట్ల; ద్రోహ = చేసినతప్పు అనెడి; అనలంబు = నిప్పు; ఆఱునే = చల్లారుతుందా, చల్లారదు.

భావము:

ఆ విధంగా భగీరథ మహారాజు రథం వెంట ఎంతో వేగంగా సాగుతూ, అనేక ప్రదేశాలను దాటి ఆ సగరచక్రవర్తి కుమారుల బూడిద రాసుల మీంచి ప్రవహించింది. వారు అభినవ శోభలతో స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ములపట్ల చేసిన దోషాగ్ని గంగాజలం వలన తప్పించి మరే విధంగాను చల్లారదు కదా.

9-232-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రు మెప్పించి మహా తపో నియతుఁడై యాకాశగంగానదిన్
కుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తంభంబుగా నవ్య సు
స్థి లీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు
స్త వంశవ్యధుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే?

టీకా:

హరు = పరమశివుని; మెప్పించి = మెప్పుపొంది; మహా = గొప్ప; తపస్ = తపస్సునందలి; నియతుడు = నిష్ఠకలవాడు; ఐ = అయ్యి; ఆకాశగంగానదిని = ఆకాశగంగను; ధర = భూమి; కున్ = కి; తెచ్చి = తీసుకొని వచ్చి; నితాంత = అఖండమైన; కీర్తి = యశస్సు అనెడి; లతికా = లతకు; స్తంభంబుగాన్ = ఆధారభూతస్తంభములాగ; నవ్య = అభినవ; సుస్థిర = మంచినిలకడైన; లీలన్ = విధముగ; పితృకార్యము = తాతలసేవించుటను; అంతయున్ = పూర్తిగా; ఒనర్చెన్ = నెరవేర్చెను; వారిత = తోలగింపబడిన; అనేక = పలు; దుస్తర = దాటరాని; వంశ = వంశమునకువాటిల్లిన; వ్యధుడు = బాధ కలవాడు; ఆ = గొప్ప; భగీరథుడు = భగీరథుడు; నిత్య = శాశ్వతమైన; శ్రీకరుండు = మంగళప్రదుడు; అల్పుడే = తక్కువవాడా, కాదు.

భావము:

గొప్ప తపస్సు పరమ నిష్ఠగా చేసి భగీరథుడు పరమశివుని మెప్పుపొంది, ఆకాశగంగను భూమికి తీసుకొచ్చాడు. అఖండమైన తన కీర్తి లతకు ఆధారంగా ఉండే స్తంభంగా పితృకార్యం తీర్చాడు. తన వంశానికి వాటిల్లిన దాటరాని కష్టాలను సర్వం తొలగించాడు. ఆ నిత్య మంగళప్రదుడు భగీరథుడు సామాన్యమైన వాడా?

9-233-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిఁ దమ మనముల లోనిడి
రి పాదాంభోజ జనితమైన నదిన్ సు
స్థిరులై క్రుంకి మునీంద్రులు
రిఁ గలిసిరి త్రిగుణరహితులై యవ్వేళన్.

టీకా:

హరిన్ = విష్ణుని; తమ = తమయొక్క; మనముల = మనసులు; లోన్ = అందు; ఇడి = నిలుపుకుని; హరి = విష్ణుమూర్తి; పాద = పాదములనెడి; అంభోజ = పద్మములందు; జనితము = పుట్టినది; ఐన = అయిన; నదిన్ = నదిని; సుస్థిరులు = నిశ్చలమానసులు; ఐ = అయ్యి; క్రుంకి = స్నానములుచేసి; ముని = మునులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు; హరిన్ = విష్ణునియందు; కలిసిరి = ఐక్యమయ్యారు; త్రిగుణరహితులు = త్రిగుణాతీతులు, ముక్తులు; ఐ = అయ్యి; అవ్వేళన్ = అప్పుడు.

భావము:

అప్పుడు విష్ణుమూర్తిన ధ్యానిస్తూ నిశ్చలమానసులై అయ్యి, త్రిగుణాతీతులై, విష్ణుపాదపద్మాల పుట్టిన ఆ గంగానదిలో స్నానాలు చేసి, మునివరులు ముక్తులై శ్రీహరిలో ఐక్యమయ్యారు.

9-234-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నా భగీరథునకు శ్రుతుండును, శ్రుతునకు నాభావరుండును, నాభావరునకు సింధుద్వీపుండును, సింధుద్వీపునికి నయుతాయువును, నయుతాయువునకు ఋతుపర్ణుండును జనియించె; నతండు.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; భగీరథున్ = భగీరథుని; కున్ = కి; శ్రుతుండును = శ్రుతుడు; శ్రుతున్ = శ్రుతుని; కున్ = కి; నాభావరుండును = నాభావరుడు; నాభావరున్ = నాభావరుని; కున్ = కి; సింధుద్వీపుండును = సింధుద్వీపుడు; సింధుద్వీపున్ = సింధుద్వీపుని; కిన్ = కి; అయుతాయువు = అయుతాయువు; అయుతాయువున్ = అయుతాయువుని; కున్ = కి; ఋతుపర్ణుండును = ఋతుపర్ణుడు; జనియించెను = పుట్టెను; అతండు = అతడు.

భావము:

అంతట ఆ భగీరథునికి శ్రుతుడు. శ్రుతునికి నాభావరుడు. నాభావరునికి సింధుద్వీపుడు. సింధుద్వీపునికి అయుతాయువు. అయుతాయువుకి ఋతుపర్ణుడు, పుట్టారు. అతడు...

9-235-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

య విశాలబుద్ధి లచక్రవర్తితో
సంగడీనితనము చాలఁ జేసి
క్షహృదయ మతని వ్యస్తముగ నిచ్చి
శ్వవిద్య నేర్చె తనివలన.

టీకా:

నయ = చక్కటి; విశాల = గొప్ప; బుద్ధిన్ = బుద్ధితో; నల = నలుడు అనెడి; చక్రవర్తి = మహారాజు; తోన్ = తోటి; సంగడీతనము = స్నేహము; చాల = బాగా; చేసి = చేసి; అక్షహృదయము = అక్షహృదయమనువిద్యని {అక్షహృదయము - 1 అధికసంఖ్యలలో కల వస్తువులనైనను చూచినంతమాత్రముననే లెక్కింపకయే మొత్తము చెప్పగల శక్తి, 2 జూదమునందలి పాచికలనడకలోని రహస్యము తెలియు విద్య}; అతను = అతని; కిన్ = కి; అవ్యస్తముగ = సంపూర్ణముగ; ఇచ్చి = నేర్పి; అశ్వవిద్యన్ = అశ్వవిద్యను {అశ్వహృదయము - గుఱ్ఱముయొక్క మనోగత భావములు తెలిసికొనగల విద్య}; నేర్చెను = నేర్చుకొనెను; అతని = అతని; వలనన్ = వలన.

భావము:

ఋతుపర్ణుడు నలమహారాజుతో స్నేహం చేసాడు. అక్షహృదయం అనే విద్యను నలమహారాజుకి చక్కగా నేర్పాడు. ఆ నలుని నుండి ఋతుపర్ణుడు అశ్వవిద్య నేర్చుకున్నాడు.