పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : మాంధాత కథ

 •  
 •  
 •  

9-166-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

భూమీశు భార్యకుఁ బుత్రలాభమునకై-
పోయు తలంపున భూమిసురులు
లములు మంత్రించి లకలశము దాఁచి-
నియమంబుతోఁ గూడి నిద్రపోవ
రణీశ్వరుఁడు పేరుప్పితోఁ నా రాత్రి-
ధృతి లేక యజ్ఞమందిరముఁ జొచ్చి
యానీరు ద్రావిన నంత మేల్కని వార-
లెవ్వఁడు ద్రావె నీరెందుఁ బోయె;

9-166.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుచు రాజు ద్రావు టంతయు భావించి
యెఱిఁగి చోద్య మంది యీశ్వరాజ్ఞ
యెవ్వఁ డోపుఁ గడవ; నీశ్వరునకు నమ
స్కార మనుచు నేది కార్య మనుచు.

టీకా:

భూమీశు = రాజుయొక్క; భార్య = రాణి; కున్ = కి; పుత్ర = పుత్రులు; లాభమున్ = కలుగుట; కై = కోసము; పోయు = ప్రసాదించెడి; తలంపునన్ = ఉద్దేశముతో; భూమిసురులు = బ్రాహ్మణులు; జలములున్ = నీటిని; మంత్రించి = మంత్రబద్దముజేసి; జల = నీటి; కలశమున్ = పాత్రను; దాచి = భద్రపరచి; నియమంబున్ = పద్దతిప్రకారము; తోన్ = తో; కూడి = అనుసరించి; నిద్రపోవన్ = నిద్రించగా; ధరణీశ్వరుండు = రాజు {ధరణీశ్వరుడు - భూమికి ప్రభువు, రాజు}; పేరు = అత్యధికమైన; దప్పి = దాహము; తోన్ = తోటి; ఆ = ఆనాటి; రాత్రిన్ = రాత్రిసమయమునందు; ధృతి = వశము; లేక = తప్పుటచే; యజ్ఞమందిరమున్ = యాగశాలను; చొచ్చి = ప్రవేశించి; ఆ = ఆ; నీరు = నీటిని; త్రావినన్ = తాగగా; అంతన్ = అప్పుడు; మేల్కని = నిద్రలేచి; వారలు = వారు; ఎవ్వడు = ఎవరు; త్రావెన్ = తాగిరి; నీరు = జలము; ఎందున్ = ఎక్కడకు; పోయెన్ = పోయినది; అనుచున్ = అంటు.
రాజు = రాజు; త్రావుటన్ = తాగుట; అంతయున్ = అంతా; భావించి = ఊహించి; ఎఱిగి = తెలిసి; చోద్యము = ఆశ్చర్య; అంది = పోయి; ఈశ్వర = భగవంతుని; ఆజ్ఞ = నిర్ణయము; ఎవ్వడు = ఎవరు యైతేమాత్రం; ఓపున్ = చేయగలడు; కడవన్ = దాటివేయుటను; ఈశ్వరున్ = భగవంతుని; కున్ = కి; నమస్కారము = నమస్కారము; అనుచున్ = అంటు; ఏది = ఏముంది; కార్యము = చేయగలది; అనుచున్ = అంటు.

భావము:

రాజుకి రాణి యందు పుత్రులు కలుగుట కోసం, బ్రాహ్మణులు మంత్రజలం పోసిన నీటి పాత్రను పద్దతిప్రకారం భద్రపరచారు. ఆనాటి రాత్రి నిద్రలో ఉండగా ఆ రాజునకు విపరీతమైన దాహం వేసింది. వశం తప్పి యాగశాల ప్రవేశించి ఆ మంత్రజలం తాగేసాడు. ఉదయం నిద్రలేచిన ఋషులు మంత్రజలం ఎవరు తాగారు. ఏమైంది అనుకున్నారు. చివరికి రాజు తాగుట తెలిసి ఆశ్చర్య పోయి విధి నిర్ణయం ఎవరు దాటగలరు. ఏమి చేయాలి. అంటు భగవంతునికి నమస్కారాలు చేయసాగారు.

9-167-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వారలు దుఃఖించుచుండు నంతఁ గొంత తడవునకు యువనాశ్వుని కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిహ్నంబులు గల కుమారుండు జన్మించి తల్లి లేని కతంబునఁ గడుపునకు లేక యేడ్చుచుండ, నింద్రుండు వచ్చి, శిశువునకు నాకఁలి దీఱుకొఱకు వాని నోటం దన వ్రేలిడినం, ద్రావిన కతంబున వాని పేరు మాంధాత యని నిర్దేశించి చనియె; నివ్విధంబున.
^ షోడశ మహారాజులు

టీకా:

వారలు = వారు; దుఃఖించుచున్ = బాధపడుతు; ఉండన్ = ఉండగా; అంతన్ = అప్పుడు; కొంత = కొంచము; తడవున్ = సేపటి; కున్ = కి; యువనాశ్వుని = యువనాశ్వునియొక్క; కడుపున్ = గర్భమును; వ్రక్కలించుకొని = పగులగొట్టికొని; చక్రవర్తి = రాజాధిరాజ; చిహ్నంబులు = గుర్తులు; కల = కలిగిన; కుమారుండు = పుత్రుడు; జన్మించి = పుట్టి; తల్లి = అమ్మ; లేని = లేకపోయిన; కతంబునన్ = కారణముచేత; కడుపున్ = ఆకలితీరుట; కు = కు; లేక = దారిలేక; ఏడ్చుచుండన్ = ఏడుస్తుండగా; ఇంద్రుండు = ఇంద్రుడు; వచ్చి = వచ్చి; శిశువున్ = చంటిపిల్లవాని; కున్ = కి; ఆకలి = ఆకలి; తీఱు = తీరుట; కొఱకున్ = కోసము; వాని = అతని; నోటన్ = నోటిలో; తన = తనయొక్క; వ్రేలున్ = వేలును; ఇడినన్ = పెట్టగా; త్రావినన్ = తాగిన; కతంబునన్ = కారణముచేత; వాని = అతని; పేరు = నామము; మాంధాత = మాంధాత {మాంథాత – సూర్యవంశ రాజు, షోడశమహారాజులలో ఒకడు, సం. విణ. గొప్పవాడు, వ్యు. (మామ్ ధే తృచ్) కృ. ప్ర., నన్ను ఈతడు తొలగించగలడు అని దేవేంద్రుడు వెఱపొందినందున ఈతనికి ఈ వ్యవహార నామము}; అని = అని; నిర్దేశించి = పెట్టి; చనియెన్ = వెళ్లెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

వారు అలా బాధపడుతూ ఉండగా, యువనాశ్వుని గర్భాన్ని పగులగొట్టికొని రాజాధిరాజ గుర్తులు కలిగిన పుత్రుడు పుట్టాడు. తల్లి లేకపోడంతో ఆకలితీరక ఏడవ సాగాడు. ఇంద్రుడు వచ్చి చంటిపిల్లవాడికి ఆకలి తీరుట కోసం అతని నోటిలో తన వేలు పెట్టాడు. అందుచేత అతని నామము మాంధాత అని పెట్టి వెళ్లాడు. ఈ విధముగ....

9-168-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డుపు పగుల ముద్దుకొడుకు జన్మించినఁ
దీఱఁ డయ్యెఁ దండ్రి దేవ విప్ర
రుణ యట్లకాదె? డిఁది దైవములావు
లుగువాఁడు బ్రతుకుఁ గాక చెడునె?

టీకా:

కడుపున్ = కడుపు; పగులన్ = చీల్చి; ముద్దుల = గారాల; కొడుకు = పుత్రుడు; జన్మించినన్ = పుట్టినను; తీఱఁడు = చనిపోవని వాడు; అయ్యెన్ = అయ్యెను; తండ్రి = తండ్రి; దేవ = భగవంతుని; విప్ర = బ్రాహ్మణుల; కరుణన్ = కృపవలన; అట్ల = అలాంటిది; కాదె = కదా; కడింది = అశక్యమైనట్టి; దైవము = దేవునియొక్క; లావు = బలము; కలుగువాడు = కలవాడు; బ్రతుకున్ = ఎలాయైనా జీవించును; కాక = కాకపోతే; చెడునె = చనిపోవునా, చనిపోడు.

భావము:

తండ్రి యవనాశ్వుడు భగవంతుడి దయవలన, బ్రాహ్మణుల కృపవలన, కడుపు చీల్చుకుని గారాల పుత్రుడు పుట్టినా చనిపోలేదు. దైవబలం కలవాడు ఎలాగైనా జీవిస్తాడు, అదే లేకపోతే చనిపోతాడు.

9-169-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు బ్రతికి యున్న యువనాశ్వుండు గొంతకాలంబునకుఁ దపంబుచేసి సిద్ధిం బొందె; నంత.

టీకా:

ఇట్లు = ఇలా; బ్రతికి = జీవించి; ఉన్న = ఉన్నట్టి; యువనాశ్వుండును = యువనాశ్వుడు; కొంత = కొంచము; కాలంబున్ = సమయమున; కున్ = కు; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; సిద్ధిన్ = సిద్ధించుటను; పొందెన్ = పొందెను; అంత = అంతట.

భావము:

ఇలా జీవించిన యువనాశ్వుడు కొద్దికాలం తపస్సు చేసి సిద్ధి పొందాడు. అంతట....

9-170-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డమటఁ బొడమెడు బాలచంద్రుని మాడ్కిఁ-
బూటపూటకు వృద్ధిఁబొందె బాలుఁ;
ల్లన పరిపూర్ణ యౌవనారూఢుఁడై-
రావణాది రిపుల రాజవరుల
దండించి తనుఁ ద్రసస్యుఁ డంచు సురేంద్రుఁ-
డంకింప శూరుఁడై ఖిలదేవ
యు నతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్ము-
జుని యజ్ఞాధీశు నాత్ముఁ గూర్చి

9-170.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చేసెఁ గ్రతువులు భూరిదక్షిణల నిచ్చి
ద్రవ్య యజమాన విధి మంత్ర ర్మ యజ్ఞ
కాల ఋత్వి క్ప్రదేశ ముఖ్యంబు లెల్ల
విష్ణురూపంబు లనుచు భావించి యతఁడు.

టీకా:

పడమటన్ = పశ్చిమదిక్కునందు; పొడమెడు = కనబడెడి; బాలచంద్రుని = లేతకళలచంద్రుని; మాడ్కిన్ = వలె; పూటపూట = ప్రతిదినమున; కున్ = కు; వృద్ధిన్ = పెరుగుటను; పొందెన్ = పొందెను; బాలుడు = పిల్లవాడు; అల్లనన్ = మెల్లగా; పరిపూర్ణ = నిండు; యౌవన = యౌవనమును; ఆరూఢుడు = వికసించినవాడు; ఐ = అయ్యి; రావణ = రావణుడు; ఆది = మున్నగు; రిపులన్ = శత్రువులను; రాజ = రాజులలో; వరులన్ = శ్రేష్ఠులను; దండించి = శిక్షించి; తనున్ = అతనిని; త్రసదస్యుడు = త్రసదస్యుడు; అంచున్ = అనుచు; సురేంద్రుడు = దేవేంద్రుడు; అంకింపన్ = కీర్తించుచుండగ; శూరుడు = గొప్పవీరుడు; ఐ = అయ్యి; అఖిల = సర్వ; దేవ = దేవతలు; మయున్ = తానైనవానిని; అతీంద్రియున్ = ఇంద్రయాతీతుని; విష్ణున్ = విష్ణుమూర్తిని {విష్ణువు - సర్వ వ్యాపకుడు, హరి}; మాధవున్ = విష్ణుమూర్తిని {మాధవుడు - మాధవి భర్త, విష్ణువు}; ధర్మాత్మున్ = విష్ణుమూర్తిని {ధర్మాత్ముడు - ధర్మస్వరూపుడు, విష్ణువు}; యజ్ఞాధీశున్ = విష్ణుమూర్తిని {యజ్ఞాధీశుడు - యజ్ఞాధికారి, విష్ణివి}; ఆత్మున్ = విష్ణుమూర్తిని {ఆత్ముడు - ఆత్మస్వరూపుడు, విష్ణువు}; గూర్చి = గురించి.
చేసెన్ = ఆతరించెను; క్రతువులు = యజ్ఞములు; భూరి = అత్యధికమైన; దక్షిణలన్ = దక్షిణలను; ఇచ్చి = ఇచ్చి; ద్రవ్య = యజ్ఞ సంబారాలు; యజమాన = యజ్ఞ కర్త; విధి = యజ్ఞ ఏర్పాటు; మంత్ర = యజ్ఞ మంత్రములు {మంత్రము - గాయత్రి వంటివి}; ధర్మ = ఆచారము; యజ్ఞ = యజ్ఞము; కాల = యజ్ఞ కాలము; ఋత్విక్ = ఋత్విక్కులు {ఋత్విక్కు - యజమానినుండి ధనము తీసుకొని యజ్ఞము చేయించువాడు, వీరు 1బ్రహ్మ 2ఉద్గాత 3హోత 4అధ్వర్యుడు 5బ్రహ్మణాచ్ఛంసి 6ప్రస్తోత 7మైత్రావరుణుడు 8ప్రతిప్రస్థాత 9పోత 10ప్రతిహర్త 11అచ్చావాకుడు 12నేష్ట 13అగ్నీధ్రుడు 14సుబ్రహ్మణ్యుడు 15గ్రావస్తుతుడు 16ఉన్నేత}; ప్రదేశము = యజ్ఞశాల; ముఖ్యంబులు = మున్నగునవి; ఎల్లన్ = సర్వము; విష్ణు = విష్ణుమూర్తి; రూపంబులున్ = స్వరూపములే; అనుచున్ = అనుకొని; భావించి = తలచి; అతడు = అతడు.

భావము:

పశ్చిమదిక్కున కనబడె లేత కళల శుక్ల పక్ష చంద్రుడిలా పిల్లవాడు దినదిన ప్రవర్థమానుడు అయి, నిండు యౌవనం సంతరించుకున్నాడు. రావణుడు మున్నగు శత్రురాజులను శిక్షించాడు. అతనిని దేవేంద్రుడు “త్రసదస్యుడు” అని కీర్తించాడు. ఆ గొప్పవీరుడు విష్ణుమూర్తిని గురించి అనేక యజ్ఞాలు చేసాడు. ఋత్వికాదులకు గొప్ప దక్షిణలను ఇచ్చాడు. చేసిన యజ్ఞాలలో యజ్ఞ సామగ్రి, యజ్ఞము, యజ్ఞకాలము, యాగశాల, యజమాని, మంత్రాలు, ఋత్విక్కులు, సర్వమూ, విష్ణు రూపాలే అని భావించి చేసిన మహానుభావుడు ఆ మాంధాత.

9-171-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లిమి నడంచుచు నరులం
లి వెలుఁగున్ వేఁడివెలుగుఁ నుచో ట్లెల్లన్
రుహనయనుని కరుణను
జెలువుగ మాంధాత యేలె సిరి నిండారన్.

టీకా:

బలిమిన్ = శక్తి సామర్థ్యములుతో; అడంచుచున్ = అణచివేయుచు; అరులన్ = శత్రువులను; చలివెలుగున్ = చంద్రుడు; వేడివెలుగున్ = సూర్యుడు; చను = వెళ్ళెడి; చోట్లు = ప్రదేశములు; ఎల్లన్ = సర్వము; జలరుహనయనుని = నారాయణుని; కరుణను = కృపవలన; చెలువుగ = చక్కగా; మాంధాత = మాంధాత; ఏలెన్ = పరిపాలించెను; సిరి = సిరిసంపదలు; నిండారన్ = పరిపూర్ణమగునట్లు.

భావము:

ఆ మాంధాత నారాయణుని కృపవలన, గొప్ప శక్తి సామర్థ్యాలతో శత్రువులను అణచివేస్తూ, సూర్యచంద్రులు తిరిగే ప్రదేశాలు సర్వం సిరిసంపదలతో పరిపూర్ణమయ్యేలా చక్కగా పరిపాలించాడు.

9-172-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతనా రాజునకు శతబిందుని కూఁతురగు బిందుమతి యందుఁ బురుక్సుతుండును, నంబరీషుండును, ముచుకుందుండును, ననువారు ముగ్గురు గొడుకులు నేబండ్రు గూఁతులును జనియించి పెరుఁగుచున్న యెడ.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; రాజున్ = రాజున; కున్ = కు; శతబిందుని = శతబిందునియొక్క; కూతురు = పుత్రిక; అగు = అయిన; బిందుమతి = బిందుమతి; అందున్ = తో; పురుక్సుతుండును = పురుక్సుతుడు; అంబరీషుడును = అంబరీషుడు; ముచుకుందుడును = ముచుకుందుడు; అను = అనెడి; వారు = వారు; ముగ్గురు = ముగ్గురు (3); కొడుకులున్ = పుత్రులు; ఏబండ్రు = ఏభైమంది (50); కూతులును = పుత్రికలు; జనియించి = పుట్టి; పెరుగుచున్న = పెరుగుతున్నట్టి; ఎడన్ = సమయమునందు.

భావము:

పిమ్మట మాంధాత రాజు శతబిందుని పుత్రిక బిందుమతిని వివాహమాడాడు. అతనికి పురుక్సుతుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని ముగ్గురు (3) పుత్రులు, ఏభైమంది (50) పుత్రికలు పుట్టారు. వారు పెరుగుతున్న సమయంలో.

9-173-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునాజలములోన ధికుఁడు సౌభరి-
పము చేయుచు జలస్థలమునందుఁ
బిల్లలుఁ దన ప్రాణల్లభయును గూడి-
మెలఁగ నానందించు మీనరాజుఁ
నుఁగొని సంసారకాంక్షియై మాంధాత-
నొక కన్య నడుగ నృపోత్తముండు
రుణి నిత్తును స్వయంరమునఁ జేకొను-
నవుడు "ననుఁ జూచి యౌవనాంగి

9-173.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యేల ముసలిఁ గోరు నిట్టట్టు వడఁకెడి
వాఁడఁ జాల నరసినాఁడ నొడల
జిగియు బిగియు లేని శిథిలుండఁ గరఁగింప
బాలఁ దిగిచికొను నుపాయ మెట్లు?

టీకా:

యమునా = యమునానదియొక్క; జలముల = నీటి; లోనన్ = అందు; అధికుడు = గొప్పవాడు; సౌభరి = సౌభరి; తపము = తపస్సు; చేయుచున్ = చేస్తూ; జలస్థలమున్ = నీటిలోపల; అందున్ = అందు; పిల్లలు = సంతానము; తన = తనయొక్క; ప్రాణవల్లభయును = భార్య {ప్రాణవల్లభ - ప్రాణముతో సమానమైన ప్రియురాలు, భార్య}; కూడి = కలిసి; మెలగన్ = విహరించుచు; ఆనందించు = సుఖించెడి; మీన = చేపల; రాజున్ = శ్రేష్ఠుని; కనుగొని = చూసి; సంసార = సంసారసుఖమును; ఆకాంక్షి = కోరెడివాడు; ఐ = అయ్యి; మాంధాతన్ = మాంధాతని; ఒక = ఒక; కన్యన్ = పడతిన్; అడుగన్ = పెండ్లికి అడుగగా; నృప = రాజులలో; ఉత్తముండున్ = శ్రేష్ఠుడు; తరుణిన్ = కన్యను; ఇత్తును = ఇచ్చిపెండ్లిచేసెదను; స్వయంవరమునన్ = కన్యాంగీకారపూర్వకముగ; చేకొనుము = చేపట్టుము; అనవుడు = అనగా; ననున్ = నన్ను; చూచి = చూసి; యౌవనాంగి = యౌవనవతి.
ఏలన్ = ఎందులకు; ముసలిన్ = ముసలివానిని; కోరున్ = వరించును; ఇట్టట్టు = ఇటూ అటూ; వడికెడి = వణికెడి; వాడన్ = వాడిని; చాలన్ = మిక్కిలిగ; నరసినాడ = జుట్టు తెల్లబడినవాడను; ఒడలన్ = దేహమునందు; జిగియున్ = కాంతి; బిగియున్ = గట్టిదనము; లేని = లేనట్టి; శిథులుండన్ = శుష్కించినవాడను; కరగింపన్ = లోబరుచుకొనుటకు; బాలన్ = యువతిని; తిగిచికొను = ఆకర్షించెడి; ఉపాయము = ఉపాయము; ఎట్లు = ఏది.

భావము:

మహానుభావుడు సౌభరి అనే ముని యమునానది తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒక నాడు యమునా జలంలో భార్యా పుత్రులతో సుఖంగా విహరిస్తున్న చేపలరాజుని సౌభరి చూసాడు. అతనిలో సంసారసుఖం పై వాంఛ కలిగింది. అందుకని పెండ్లి చేసుకుంటా ఒక కూతురుని ఇమ్మని మాంధాతని అడిగాడు. మాంధాత కూతురు ఒప్పుకుంటే ఇస్తాను అన్నాడు. “ముసలివాడిని నన్ను చూసి ఏ యౌవనవతి అయినా ఎందుకు వరిస్తుంది. నేనా వడ వడ వణికే వాడిని, పైగా జుట్టు తెల్లబడిన పోయింది. దేహకాంతి పటుత్వం శుష్కించాయి. యువతిని ఆకర్షించే ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు.

9-174-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతే కాకుండ.....

9-175-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బాల పువ్వుఁబోడి ప్రాయంపు వానిని
జెన్నువాని ధనము జేర్చువాని
రిగెనేనిఁ గొంత రుగుఁగా కెదిరిఁ ద
న్నెఱిఁగి ముసలితపసి నేల మరుగు?"

టీకా:

బాల = కన్య; పువ్వుబోడి = సుందరి {పువ్వుబోడి - పూల వంటి సుకుమారమైన స్త్రీ, అందగత్తె}; ప్రాయంపు = వయసులో ఉన్న; వానిని = పురుషుని; చెన్నువాని = అందగాడిని; ధనమున్ = సంపదలను; చేర్చువాని = కూడబెట్టువానిని; మరిగెను = మోహపడెను; ఏని = ఐనచో; కొంత = కొంతవరకు; మరుగున్ = మోహపడును; కాక = అలాకాకుండ; ఎదిరి = విరుద్ధముగ; తనున్ = తనని; ఎఱిగి = తెలిసి; ముసలి = ముదివగ్గయిన; తపసిన్ = మునిని; ఏల = ఎందుకు; మరుగున్ = ఆశించును.

భావము:

ఏ సుందరి అయినా వయసులో ఉన్న అందగాడిని, ధనవంతుడిని ఇష్టపడితో పడవచ్చు. తప్ప తెలిసి తెలిసి ముదివగ్గయిన మునిని ఎందుకు ఆశిస్తుంది.

9-176-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని విచారించి సౌభరి దన తపోబలంబునం జేసి ముసలితనంబు విడిచి యెల ప్రాయంపుఁ గొమరుం డయి యలంకరించుకొని ముందట నిలువంబడిన మాంధాతయుఁ గన్నియల నగరు గాచికొని యున్నవారికి సెలవు జేసిన వా రమ్మునీంద్రుని నా రాజపుత్రిక లున్న యెడకుఁ గొనిపోయి చూపిన.

టీకా:

అని = అని; విచారించి = ఆలోచించి; సౌభరి = సౌభరి; తన = తన; తపస్ = తపస్సుయొక్క; బలంబునన్ = శక్తి; చేసి = వలన; ముసలితనంబున్ = ముదిమిని; విడిచి = వదలివేసి; ఎలప్రాయపు = లేత వయసు; కొమరుండు = పడచువాడు; అయి = ఐ; అలంకరించుకొని = శృంగారించుకొని; ముందటన్ = ఎదురుగ; నిలువబడినన్ = నిలబడగా; మాంధాతయున్ = మాంధాత; కన్నియల = యువతుల; నగరున్ = అంతపురమును; కాచికొని = కాపలాకాచుతు; ఉన్న = ఉండెడి; వారి = వారి; కిన్ = కి; సెలవుజేసినన్ = ఆజ్ఞాపించగా; వారు = వారు; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; ఆ = ఆ; రాజపుత్రికలు = రాకుమార్తెలు; ఉన్న = ఉన్నట్టి; ఎడ = చోటున; కున్ = కు; కొనిపోయి = తీసుకెళ్ళి; చూపినన్ = చూపించగా.

భావము:

అని ఆలోచించి సౌభరి తన తపశ్శక్తితో లేత వయసు పడచువాని రూపు ధరించి శృంగారించుకొని వచ్చాడు. మాంధాత ఆజ్ఞ ప్రకారం కాపలావాళ్ళు ఆ రాకుమార్తెల అంతపురమునకు ఆ ముని పుంగవుని తీసుకెళ్ళి చూపించారు.

9-177-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కోలులార! వీఁడు నలకూబరుఁడో; మరుఁడో; జయంతుఁడో;
యేఱి వచ్చె; వీనిఁ దడవేల వరింతుము నేమ యేమ" యం
చా మునినాథుఁ జూచి చలితాత్మికలై సొరదిన్ వరించి రా
భామిను లందఱుం గుసుమబాణుఁడు గీ యని ఘంట వ్రేయఁగన్.

టీకా:

కోమలులార = చెలులు; వీడు = ఇతడు; నలకూబరుడొ = నలకూబరుడొ; మరుడొ = మన్మథుడొ; జయంతుడొ = జయంతుడొ; ఏమరి = పొరపాటున; వచ్చెన్ = వచ్చెను; వీనిన్ = ఇతనిని; తడవున్ = ఆలస్యముచేయుట; ఎల = ఎందుకు; వరింతము = వరించెదము; నేమ = మేము; యేమ = మేము; అంచున్ = అనుచు; ఆ = ఆ; ముని = మునులలో; నాథున్ = గొప్పవానిని; చూచి = చూసి; చలిత = చలించిపోయిన; ఆత్మికలు = మనసులుగలవారు; ఐ = అయ్యి; సొరదిన్ = క్రమముగా; వరించిరి = కోరుకొనిరి; భామినులు = సుందరులు; అందఱున్ = అందరు; కుసుమబాణుడు = మన్మథుడు {కుసుమబాణుడు - పూలబాణముల వాడు, మన్మథుడు}; గీయని = తీవ్రమగ; ఘంటవ్రేయగన్ = మోహము రెచ్చగొట్టగా.

భావము:

ఆ సుందరీమణులు అందరూ ఇతడు నలకూబరుడొ, మన్మథుడొ, జయంతుడొ పొరపాటున వచ్చాడు అనుకున్నారు. వెంటనే ఆ మునిని చూసి చలించిపోయిన వారందరు మేము ఇతనిని వరిస్తున్నాము, వివాహం చేసుకుంటాము అన్నారు.

9-178-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు రాజకన్యకల నందఱం జేకొని సౌభరి నిజతపఃప్రభావంబున ననేక లీలావినోదంబులఁ గల్పించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; రాజకన్యకలన్ = రాకుమారికలను; అందఱన్ = అందరిని; చేకొని = చేపట్టి; సౌభరి = సౌభరి; నిజ = తన; తపస్ = తపస్సుయొక్క; ప్రభావంబునన్ = ప్రభావమువలన; అనేక = అనేకమైన; లీలా = క్రీడా; వినోదంబులన్ = వినోదములు; కల్పించి = ఏర్పరచి.

భావము:

ఈ విధంగా రాకుమారికలను అందరిని చేపట్టి సౌభరి తన తపోప్రభావంతో అనేక క్రీడా వినోదాలు కల్పించాడు.

9-179-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గృహరాజముల యందుఁ గృతకాచలములందుఁ-
లువలు విలసిల్లు కొలఁకులందుఁ
లకంఠ శుక మధుర నినాదములచే-
ర్ణనీయములైన నములందు
ణివేదికలయందు హనీయ పర్యంక-
పీఠ లీలాశైల బిలములందు
శృంగారవతులగు చెలువలు పలువురు-
నపంపు చేయ సుస్థలములందు

9-179.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

స్త్ర మాల్యానులేప సుర్ణహార
భూరి సంపద నిష్ఠాన్న భోజి యగుచుఁ
బూఁటపూఁటకు నొక వింత పొలుపుఁ దాల్చి
రాజకన్యల నందఱ తులఁ దేల్చె.

టీకా:

గృహ = నివాసములు; రాజములన్ = పెద్దవాటి; అందున్ = లోను; కృతక = కృత్రిమ; అచలములు = పర్వతముల; అందున్ = మీద; కలువలు = పద్మములు; విలసిల్లు = వికసించుచున్న; కొలకులు = చెరువులు; అందున్ = లోను; కలకంఠ = కోకిల; శుక = చిలుకల; మధుకర = తుమ్మెదల; నినాదములు = రవములు; చేన్ = చేత; వర్ణనీయములు = పొగడదగినట్టివి; ఐన = అయిన; వనములు = తోటల; అందున్ = లోను; మణి = రత్నాల; వేదికలు = అరుగులు; అందున్ = మీద; మహనీయ = గొప్ప; పర్యంక = శయ్యలు; పీఠ = బల్లలు; లీలా = కృత్రిమ; శైలబిలములు = గుహలు; అందున్ = లోను; శృంగారవతులు = సౌందర్యవతులు; అగు = ఐన; చెలువలు = అందగత్తెలు; పలువురు = అనేకమంది; తన = తన; పంపుచేయన్ = చెప్పినట్లు చేస్తుండగ; సుస్థలములు = మంచిప్రదేశములు; అందున్ = అందు.
వస్త్ర = మంచిబట్టలు; మాల్య = దండలు; అనులేప = మైపూతలు; సువర్ణ = బంగారు; హార = నగలు; భూరి = గొప్ప; సంపదన్ = ఐశ్వర్యములు; ఇష్ట = నచ్చిన; అన్న = ఆహారములను; భోజి = తినువాడు; అగుచున్ = ఔతూ; పూటపూటకున్ = ఏరోజుకారోజు; ఒక = ప్రత్యేకమైన; వింత = విచిత్రమైన; పొలుపు = చక్కదనాలు; తాల్చి = ధరించి; రాజకన్యలన్ = రాకుమారికలను; అందఱన్ = అందరిని; రతులన్ = కామకేళిలందు; తేల్చెన్ = తృప్తిచెందించెను.

భావము:

పెద్దవాటికలు, నివాసాలు, కృత్రిమ పర్వతాలు, కృత్రిమ గుహలు, పద్మాలు వికసిస్తున్న చెరువులు, కోకిల చిలుకల తుమ్మెదల రవములతో కలకలలాడుతున్న తోటలు, రత్నాల అరుగులు, అందమైన శయ్యలు బల్లలు, అనేకమంది సౌందర్యవతులు ఐన చెలికత్తెలు కల్పించాడు. మనోఙ్ఞమైన ప్రదేశాలు, మంచిబట్టలు, దండలు, మైపూతలు, బంగారు నగలు, గొప్ప ఐశ్వర్యాలు, విందు భోడనాలు కల్పిస్తూ ఏరోజు కారోజు ప్రత్యేకమైన విచిత్రమైన చక్కదనాలు ధరించి రాకుమారికలను అందరిని కామకేళిలో తృప్తిచెందించాడు.

9-180-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పెక్కండ్రు రాజముఖులకు
నొక్కఁడు మగఁ డయ్యుఁ దనియకుండె మునీంద్రుం
డెక్కుడు ఘృతధారలచే
క్కజమై తృప్తి లేని నలుని భంగిన్.

టీకా:

పెక్కండ్రు = అనేకమంది; రాజముఖులు = అందగత్తెలు {రాజముఖి - రాజ (చంద్రునివంటి) ముఖి (మోములుగలస్త్రీ), సుందరి}; కున్ = కు; ఒక్కడు = ఒకడే; మగడు = భర్త; అయ్యున్ = అయినప్పటికి; తనియకుండెన్ = తృప్తిచెందకుండెను; ముని = మునులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; ఎక్కుడు = అధికమైన; ఘృత = నేతి; ధారలన్ = ధారగాపోయుటలు; చేన్ = వలన; అక్కజము = అధికమైనది; ఐ = అయ్యి; తృప్తి = సంతృప్తి; లేని = పొందనట్టి; అనలుని = అగ్ని; భంగిన్ = వలె.

భావము:

కాని, ఎంత నేతి ధార పోసనా తృప్తి పొందని అగ్ని వలె, అనేకమంది సుందరీమణులకు ఒకడే భర్త అయి ఉన్నా సౌభరి ముని ఇంద్రియ వాంఛలు తృప్తి చెందటం లేదు.

9-181-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగ.

భావము:

ఈ విధముగా....

9-182-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రామంబున మునివరుఁ
డా రామలతోడ బహువిహారమయుండై
గారాములఁ దన కిట్టటు
పోరాములు చేసి కొన్ని ప్రొద్దుల్ పుచ్చెన్.

టీకా:

ఆరామంబునన్ = ఉద్యానవనములందు; ముని = మునులలో; వరుడు = ఉత్తముడు; ఆ = ఆ; రామల = పడతుల {రామ - రమింపజేయునట్టిస్త్రీ, సుందరి}; తోడన్ = తోటి; బహు = అనేకవిధములైన; విహార = మెలగుటలు; మయుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; గారాములన్ = మిక్కిలి అనురాగములతో; తనకి = ప్రకటించి; ఇట్టట్టు = ఇటునటు; పోరాములున్ = ఆత్మీయతలను; చేసి = కనబరుచుచు; కొన్ని = కొన్ని; ప్రొద్దుల్ = దినములు; పుచ్చెన్ = గడపెను.

భావము:

ఉద్యానవనములందు ఆ మునీశ్వరుడు అనురాగ ఆత్మీయతలతో అంతమంది రమణీమణులతో అనేకవిధాల రమిస్తూ కొంత కాలం గడపాడు.

9-183-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంత నొక్కనాఁడు మాంధాతృమేదినీవల్లభుండు “మునీశ్వరుం డెందుఁ బోయెఁ గూఁతు లెక్కడ నలజడి పడుచున్నవారలో” యని తలంచి వెదకవచ్చి, యొక్క మహాగహనంబున మణిమయ సౌధంబులం జక్రవర్తియుంబోలెఁ గ్రీడించుచున్న తాపస రాజుం గని, సంతసించి, వెఱఁగుపడి, మన్ననలం బొంది మెల్లన కూఁతులం బొడగని సత్కరించి యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; మాంధాతృ = మాంధాతయనెడి; మేదినీవల్లభుండు = రాజు {మేదినీవల్లభుడు - భూమికి భర్త, రాజు}; ముని = మునులలో; ఈశ్వరుండు = గొప్పవాడు; ఎందున్ = ఎక్కడికి; పోయెన్ = వెళ్లపోయెనో; కూతులున్ = కుమార్తెలు; ఎక్కడన్ = ఎక్కడ; అలజడిపడుచున్ = ఖంగారుపడుతు; ఉన్నవారలో = ఉన్నారో; అని = అని; తలంచి = విచారించి; వెదకన్ = అన్వేషించుటకు; వచ్చి = వచ్చి; ఒక్క = ఒకానొక; మహాగహనంబునన్ = మహాటవిలో; మణి = మణులు; మయ = పొదగిన; సౌధంబులన్ = భవనములందు; చక్రవర్తి = సార్వభౌముని {చక్రవర్తి - భూమండలమంతా అధికారము వర్తించువాడు, సార్వభౌముడు}; పోలెన్ = వలె; క్రీడించుచున్న = విహరించుచున్న; తాపస = ముని; రాజున్ = శ్రేష్ఠుని; కని = చూసి; సంతసించి = సంతోషించి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; మన్ననలన్ = మర్యాదలు; పొంది = పొంది; మెల్లన = మెల్లిగా; కూతులన్ = కుమార్తెలను; పొడగని = చూసి; సత్కరించి = గౌరవించి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అంతట ఒకానొక దినమున మాంధాత తన కుమార్తెలతో ముని ఎక్కడికి వెళ్లాడో, ఎలా ఉన్నారో అనే ఆందోళనతో, వెతక సాగాడు. ఒక మహాటవిలో మణులు పొదగిన భవనాలలో సార్వభౌముడి వలె విహరిస్తున్న మునిని చూసి అచ్చెరువొంది, సంతోషించాడు. మర్యాదలు పొంది మెల్లిగా కుమార్తెలను ఇలా అడిగాడు.

9-184-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నాతోడులార! మీ పతి
మీ తోడే? పనుల యెడల మే లే" యనుడున్
"నాతోడిదె నాతోడిదె
తాతా! మే" లనుచు ననిరి రుణులు వరుసన్.

టీకా:

నా = నాయొక్క; తోడులారా = బిడ్డలారా; మీ = మీ; పతి = భర్త; మీ = మీ; తోడే = అనుకూలుడేనా; పనులు = సంబంధించినవాని; ఎడల = అందు; మేలే = మంచిగా చూసుకొనునా; అనుడున్ = అనగా; నా = నా; తోడిదె = తోటే ఉండును; నా = నా; తోడిదె = తోటే ఉండును; తాత = అయ్యా; మేలు = బాగాచూసుకొంటున్నాడు; అనుచున్ = అంటు; అనిరి = పలికిరి; తరణులు = పడతులందరు; వరుసన్ = వరసగా.

భావము:

“ఓ నా బిడ్డలారా! మీ భర్త అనుకూలంగా ఉన్నాడా. మిమ్మల్ని మంచిగా చూసుకొంటున్నాడా.” ఇలా అడిగిన తండ్రికి “అయ్యా! నా తోటే ఉంటాడు, నా తోటే ఉంటాడు. బాగా చూసుకొంటున్నాడు” అని వరసగా అందరు కూతుళ్ళు పలికారు.

9-185-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అంతఁ గొంతకాలమునకు బహుభార్యాచర్యుండగు సౌభరి యేకాంతంబునఁ దన్నుఁ దాన చింతించుకొని, మీనమిథున సంగదోషంబునం గాఁపురంబు దనకు నగపడుట యెఱింగి, పశ్చాత్తాపంబున నిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; కొంత = కొన్ని; కాలమున్ = దినముల; కున్ = కు; బహు = అనేకమంది; భార్యా = భార్యలతో; చర్యుండు = మెలగెడివాడు; అగు = ఐన; సౌభరి = సౌభరి; ఏకాంతంబునన్ = ఏకాంతమునందు; తన్నుదాన = తనలోతానే; చింతించుకొని = విచారించుకొని; మీన = చేప; మిథున = దంపతులయొక్క; సంగ = సాంగత్యపు; దోషంబునన్ = దోషమువలన; కాపురంబున్ = సంసారము; తన = తన; కున్ = కు; అగపడుట = ఏర్పడుట; ఎఱింగి = తెలిసి; పశ్చాత్తాపంబునన్ = జరిగినదానికివగపుతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

సౌభరి అందరు భార్యలతో అలా కొన్నాళ్ళు గడిపాడు. పిమ్మట ఒకనాడు ఏకాంతంగా తనలోతాను విచారించుకొని, చేప దంపతుల సాంగత్యదోషం వలన ఇలా సంసారం ఏర్పడిందని గ్రహించాడు. విచారంగా ఇలా అనుకొన్నాడు...

9-186-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"వాసంబుల డయ్యుటో? విషయసంయోగంబు వర్జించుటో?
ముం బూని చరించుటో? హరిపదధ్యానంబునన్ నిల్చుటో?
లాపంబున నేల పొందితి? హతంయ్యెం దపంబెల్ల నీ
టస్త్రీపరిరంభముల్ మునులకుం గైవల్య సంసిద్ధులే?

టీకా:

ఉపవాసంబులన్ = ఉపవాసములతో; డయ్యుటో = కృశించుటకాని; విషయ = ఇంద్రియార్థములతో; సంయోగంబు = పొత్తను; వర్జించుటో = విడుచుటకాని; తపమున్ = తపస్సును; పూని = ధరించి; చరించుటో = ఆచరించుటకాని; హరి = నారాయణుని; పద = పాదములను; ధ్యానంబునన్ = ధారణలో; నిల్పుటో = ఉంచుకొనుటకాని; ఉపలాలనంబున్ = ప్రేమలందుచిక్కుకొనుట; ఏలన్ = ఎందువలన; పొందితిన్ = పొందితిని; హతంబున్ = నాశనము; అయ్యెన్ = అయినది; తపంబున్ = తపస్సు; ఎల్లన్ = సమస్తము; ఈ = ఇట్టి; కపట = వ్యామోహపూరిత; స్త్రీ = స్త్రీల; పరిరంభముల్ = కౌగలింతలు; మునుల్ = ఋషుల; కున్ = కు; కైవల్య = మోక్షమును; సంసిద్ధులే = సమకూర్చెడివా, కాదు.

భావము:

“ఋషినైన నేను చేసిన తపస్సు అంతా వ్యర్థం అయింది కదా. కఠిన ఉపవాసాలు చేయడం కాని, విషయ పరిత్యాగం చేయడం కాని, గట్టి తపస్సు ఆచరించుట కాని, శ్రీహరి పాదాలను మనసున ధరించడం కాని చేయాలి తప్ప. అయ్యో! ఇలా ప్రేమలో ఎందుకు చిక్కుకున్నాను. ఇట్టి స్త్రీ సాంగత్య వ్యామోహం ఋషులకు మోక్షాన్ని సమకూర్చుతుందా?

9-187-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునినఁట; తత్త్వవేదినఁట; మోక్షమకాని సుఖంబులెవ్వియుం
వఁట; కాంత లేఁబదట; సౌధచయంబఁట; వాసదేశముం,
యులు నైదువేలఁట; నిదానము మీనకుటుంబి సౌఖ్యముం
నుటఁట; చెల్లరే! నగవుగాక మహాత్ములు చూచి మెత్తురే?

టీకా:

మునిని = నేనొక మునిని; అటన్ = అట; తత్వవేదిని = వేదాంతిని; అటన్ = అట; మోక్షమున్ = ముక్తిని; కాని = తప్పించి; సుఖంబులు = ఇతరవాంఛలు; ఎవ్వియున్ = ఏవీకూడ; జనవు = నడవవు; అటన్ = అట; కాంతలు = భార్యలు; ఏబది = ఏభైమంది (50); అటన్ = అట; సౌధ = భవనముల; చయంబున్ = అనేకము; అటన్ = అట; వాసదేశమున్ = నివసించుటకుదేశము; తనయులు = పుత్రులు; ఐదువేలు = ఐదువేలు (5000); అటన్ = అట; నిదానము = మూల కారణము; మీన = చేప; కుటుంబి = గృహస్తుని; సౌఖ్యమున్ = సౌఖ్యమును; కనుట = చూచుట; అటన్ = అట; చెల్లరే = అయ్యయ్యో; నగవు = అపహాస్యము; కాక = తప్పించి; మహాత్ములు = గొప్పవారు; చూచి = చూసి; మెత్తురే = మెచ్చుకొంటారా, లేదు.

భావము:

అయ్యయ్యో! నేనొక మునిని అట. వేదాంతినిట. ముక్తిని తప్ప ఇతర వాంఛలు లేని వాడనట. భార్యలు ఏభైమందిట (50). భవనముల అనేకము అట. పుత్రులు ఐదువేలట (5000). ఇంత అనర్థానికి మూల కారణము చేప సంసారాన్ని చూడ్డ మట. ఎవరైనా చూసి అపహాస్యము చేస్తారు తప్పించి ఎక్కడైనా మెచ్చుకుంటారా?

9-188-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పము జేయువాఁడు త్త్వజ్ఞుడగువాఁడు
నెలమి మోక్ష మిచ్ఛయించువాఁడు
నేకతంబు విడిచి యేర్పడనేరఁడు
కాఁపురంబు జేయుఁ ఱటి తపసి."

టీకా:

తపమున్ = తపస్సు; చేయువాడు = చేసెడివాడు; తత్వజ్ఞుడు = తత్త్వజ్ఞానముగలవాడు; ఎలమిన్ = వికాసముతో; మోక్షమున్ = ముక్తిని; ఇచ్చయించువాడు = కోరువాడు; ఏకతంబున్ = ఏకాంతమును; విడిచి = వదలిపెట్టి; ఏర్పడన్ = దూరమగుటను; నేరడు = అభిలషింపడు; కాపురంబు = సంసారము; చేయు = చేసెడి; కఱటి = (నావంటి) మూర్ఖపు; తపసి = తపసి తప్పించి.

భావము:

తత్త్వం తెలిసిన వాడు, తపస్సు చేసే వాడు. వికాసముతో ముక్తిని కోరేవాడు ఏకాంతాన్ని అభిలషిస్తాడు. లేకపోతే పరమాత్మను తెలియలేడు. నావంటి మూర్ఖపు తపసి మాత్రమే ఇలా సంసార లంపటంలో చిక్కుకుంటాడు.”

9-189-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని దుఃఖించి, తన్నుం దాన నిందించుకొని, తన వేడబంబు వివేకించుచు, నిహపరసాధకుండై, కాపురంబువిడిచి, సతులుం దానును వానప్రస్థధర్మంబున నడవికిం జని, ఘోరతపంబు జేసి, శరీరంబు గుదియించి, యగ్నిసహితుండై, పరబ్రహ్మంబు జొచ్చె; నంత.

టీకా:

అని = అని; దుఃఖించి = బాధపడి; తన్నున్ = తనను; తాన = తనే; నిందించుకొని = తిట్టుకొని; తన = తనయొక్క; వేడబంబున్ = మోసపోవుటలు; వివేకించుచున్ = తెలిసికొనుచు; ఇహన్ = ఇంక; పర = పరబ్రహ్మపదమునకు; సాధకుండు = సాధనచేయువాడు; ఐ = అయ్యి; కాపురంబు = సంసారము; విడిచి = వదలివేసి; సతులున్ = భార్యలు; తానునున్ = అతను; వానప్రస్థ = వానప్రస్థాశ్రమ; ధర్మంబున్ = ధర్మమునందు; అడవికిన్ = అడవికి; చని = వెళ్లి; ఘోర = భయంకరమైన; తపంబున్ = తపస్సును; చేసి = ఆచరించి; శరీరంబున్ = దేహమును; కుదియించి = కృశింపజేసికొని; అగ్ని = అగ్నులతో; సహితుండు = కలిసినవాడు; ఐ = అయ్యి; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మపదమును; చొచ్చెన్ = ప్రవేశించెను; అంతన్ = అప్పుడు.

భావము:

అని బాధపడి తనను తనే తిట్టుకొని తను మోసపోవుట తెలిసికున్నాడు. ఇంక సంసారము వదలివేసి భార్యలతో పాటు వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవికి వెళ్లాడు. పరబ్రహ్మపద సాధన మొదలెట్టాడు. భయంకర తపస్సు ఆచరించి, దేహాన్ని కృశింపజేసికొని అగ్ని సహితుడై పరబ్రహ్మాన్ని పొందాడు. అప్పుడు.

9-190-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మునిపతి వనమున కరిగిన
నితలుఁ తోనరిగి ప్రాణల్లభు గతికిం
నిరి వెనుతవిలి విడువక
లము చన శిఖలు నిలువ రిగిన భంగిన్.

టీకా:

ముని = ఋషియైన; పతి = భర్త; వనమున్ = అడవి; కిన్ = కి; అరిగినన్ = వెళ్ళగా; వనితలు = పడతులు; తోన్ = కూడా; అరిగి = వెళ్ళి; ప్రాణవల్లబున్ = భర్తయొక్క; గతి = దారి; కిన్ = వెంట; చనిరి = వెళ్ళిరి; వెనుతగిలి = వెనువెంటను; విడువక = వదలకుండగ; అనలమున్ = అగ్నులు; చనన్ = ఆరిపోయినతరువాత; శిఖలు = మంటలు; నిలువకన = ఉండకుండా; అరిగినన్ = ఆరిపోయిన; భంగిన్ = విధముగ.

భావము:

అగ్నిదేవుడిని అనుసరించే జ్వాలల వలె, ఋషి పత్నులు కూడ భర్తను అనుసరించారు. అతడు పొందినగతిని పొందారు.