పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : శుక్ర బలి సంవాదంబును

  •  
  •  
  •  

8-585-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
కిత గోకులాగ్ర న్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!

టీకా:

వారిజాక్షుల = ఆడవారి విషయము {వారిజాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికి సంబంధించిన వాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడి సందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంకవచ్చు = అబద్ధమాడవచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.

భావము:

ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.