అష్టమ స్కంధము : వామనుడు దాన మడుగుట
- ఉపకరణాలు:
అదియునుం గాక
టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:
అంతే కాకుండా.
- ఉపకరణాలు:
రాజ్యంబు గలిగె నేనిం
బూజ్యులకును యాచకులకు భూమిసురులకున్
భాజ్యముగ బ్రతుక డేనిం
ద్యాజ్యంబులు వాని జన్మ ధన గేహంబుల్.
టీకా:
రాజ్యంబున్ = రాజ్యాధికారము; కలిగెన్ = లభించిన; ఏనిన్ = ఎడల; పూజ్యుల = గౌరవింపదగినవారి; కునున్ = కి; యాచకుల = భిక్షుల; కున్ = కు; భూమిసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; భాజ్యముగన్ = పంచిపెట్టెడి విధముగ; బ్రతుకడేనిన్ = జీవించకపోయినచో; త్యాజ్యంబులున్ = త్యజింపదగినవి; వాని = అతని; జన్మ = పుట్టుక; ధన = సంపద; గేహంబుల్ = గృహములు.
భావము:
రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగినవారికీ, బ్రాహ్మణులకూ బిచ్చగాళ్ళకూ ధనాన్ని పంచిపెడుతూ బ్రతకాలి. అలా చేయనివాడి బ్రతుకూ, ధనమూ, గృహములు నిరర్థకమైనవి, పరిత్యజింప తగినవి.
- ఉపకరణాలు:
మున్నెన్నుదురు వదాన్యుల
నెన్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుం డనుచున్;
ఇన్ని దినంబుల నుండియు
నెన్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము జేయన్.
టీకా:
మున్ను = ముందుగ; ఎన్నుదురు = లెక్కించెదరు; వదాన్యులన్ = దాతలను; ఎన్నెడుచో = లెక్కించునప్పుడు; నిన్నున్ = నిన్ను; త్రిభువన = ముల్లోకములకు; ఈశుండు = ప్రభువు; అనుచున్ = అనుచు; ఇన్ని = ఇన్ని; దినంబుల = రోజుల; నుండియున్ = నుంచి; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; నినున్ = నిన్ను; పెట్టుము = ఇమ్ము; అనుచున్ = అనుచు; ఈండ్రము = పీడించుట; చేయన్ = చేయలేదు.
భావము:
దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నిన్నే ఎన్నిక చేస్తారు. ఇంతవాడవు అయినా ఇంతవరకూ నిన్ను ఇమ్మంటూ ఏనాడూ నేను పీడించలేదు.
- ఉపకరణాలు:
ఒంటివాఁడ నాకు నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "
టీకా:
ఒంటివాడన్ = ఒక్కడను; నా = నా; కున్ = కు; ఒకటిరెండు = మూడు (3); అడుగుల = అడుగుల; మేర = కొలత కల భూమి; ఇమ్ము = ఇమ్ము; సొమ్ము = సంపదలు; మేర = ఎల్లను; ఒల్ల = అంగీకరించను; కోర్కిన్ = కోరిక; తీరన్ = తీరినచో; బ్రహ్మకూకటిముట్టెదన్ = మిక్కిలి సంతోషించెదను {బ్రహ్మకూకటిముట్టెదను - బ్రహ్మయొక్క జుట్టును అందుకొనెదను, మహానందపడెదను}; దాన = దానముచేసెడి; కుతుక = కుతూహలము; సాంద్ర = అధికముగా కలవాడ; దానవేంద్ర = రాక్షసరాజా.
భావము:
ఓ దానవరాజా! దానం చేయాలనే గట్టి కుతూహలం కలవాడా! బలిచక్రవర్తీ! నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను.”
- ఉపకరణాలు:
అనిన బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె.
టీకా:
అనినన్ = అనగా; పరమ = మహా; యాచకున్ = భిక్షుని; కున్ = కి; ప్రదాత = గొప్పదాత; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా మూడు అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట భిక్షుకుడైన వామనుడితో, బహు దొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
"ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "
టీకా:
ఉన్నమాటలు = చెప్పినవి; ఎల్లన్ = అన్ని; ఒప్పును = తగును; విప్రుండ = బ్రాహ్మణుడా; సత్య = యదార్థమైన; గతులు = విధములు; వృద్ధ = పెద్దలచే; సమ్మతంబులు = అంగీకరింపబడునవి; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; కొంచెము = కొద్దిగానే; అడిగితివో = అడిగితివేమి; చెల్ల = అరె; దాత = దాతయొక్క; పెంపు = గొప్పదనమును; సొంపున్ = మంచితనమును; తలపన్ = భావించ; వలదె = వద్దా.
భావము:
“ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా!”
- ఉపకరణాలు:
అని మఱియు ని ట్లనియె.
టీకా:
అని = అని; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:
అని బలిచక్రవర్తి మరల ఇలా అన్నాడు.
- ఉపకరణాలు:
"వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?"
టీకా:
వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుటకాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుటకాని; వాజులన్ = గుఱ్ఱములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = అనుకొనుటకాని; కోరితో = కావాలనుటకాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరుటకాని; పసి = బాగాచిన్న; బాలుండవు = పిల్లవాడవు; నేరవు = తెలియనివాడవు; అడుగ = అడుగుట; నీ = నీయొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈమాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షసచక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగినని; ఈ = ఇంత; అల్పంబున్ = స్వల్పముగా, కొంచెమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయకలడా.
భావము:
“భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.”
అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.
- ఉపకరణాలు:
అనిన మొగంబునం జిఱునగవు మొలకలెత్త గృహమేథికి మేధావి యి ట్లనియె.
టీకా:
అనినన్ = అనగా; మొగంబునన్ = ముఖమునందు; చిఱునగవు = చిరునవ్వు; మొలకలెత్త = ఉదయించగా; గృహమేధి = గృహస్థున; కిన్ = కు; మేధావి = విజ్ఞాని; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.
భావము:
ఇలా ఇంత చిన్నదానమా అంటున్న యాగ యజమాని బలిచక్రవర్తితో మేధావి అయిన వామనుడు ఇలా అంటున్నాడు.
- ఉపకరణాలు:
"గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
టీకా:
గొడుగొ = గొడుగుకాని; జన్నిదమో = జంధ్యముకాని; కమండులువొ = కమండలముకాని; నా = నా; కున్ = కు; ముంజియో = మొలత్రాడుకాని; దండమో = యోగదండముకాని; వడుగున్ = బ్రహ్మచారిని; ఏన్ = నేను; ఎక్కడ = ఎక్కడ; భూములు = భూభాగములు; ఎక్కడ = ఎక్కడ; కరుల్ = ఏనుగులు; వామాక్షులు = జవరాండ్రు; అశ్వంబులున్ = గుఱ్ఱములు; ఎక్కడ = ఎక్కడ; నిత్యోచితకర్మము = నిత్యకృత్యములు; ఎక్కడ = ఎక్కడ; మత్ = నాచేత; ఆకాంక్షితంబు = కోరబడినది; ఐన = అయిన; మూడు = మూడు (3); అడుగుల్ = అడుగుల; మేరయ = పాటిది; త్రోవక = కాదనక; ఇచ్చుట = దానముచేయుట; అది = అదే; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; నా = నా; పాలికిన్ = పాలిటికి, మట్టుకు.
భావము:
“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.
- ఉపకరణాలు:
అదియునుంగాక.
టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ.
భావము:
అంతేకాకుండా. . .
- ఉపకరణాలు:
వ్యాప్తిం బొందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?
టీకా:
వ్యాప్తిన్ = ఉబ్బిపోవుట; పొందక = పొందకుండగ; వగవక = విచారించకుండ; ప్రాప్తంబు = దొరికినది; అగు = అయిన; లేశము = ఎంత అల్పము, కొంచెము; ఐనన్ = అయినప్పటికిని; పదివేలు = అధికమైనది; అనుచున్ = అనుకొని; తృప్తిన్ = తృప్తి; చెందని = పడని; మనుజుడు = మానవుడు; సప్తద్వీపములన్ = సప్తద్వీపముల సంపదతో {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మల 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర యనెడి 7 ద్వీపములు}; అయినన్ = అయినప్పటికిని; చక్కంబడునే = సరిగా అగునా కాడు.
భావము:
లభించినది ఎంత కొంచం అయినాసరే ఉబ్బితబ్బిబ్బు పడకుండా, అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తిపడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు.
- ఉపకరణాలు:
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
టీకా:
ఆశా = ఆశ యనెడి; పాశంబు = తాడు; తాన్ = అది; కడున్ = మిక్కిలి; నిడుపు = పొడవైనది; లేదు = లేదు; అంతంబు = అంతు; రాజేంద్రా = చక్రవర్తి; వారాశి = సముద్రముచే {వారాశి - నీటికికుప్ప, కడలి}; ప్రావృత = చుట్టబడిన; మేదినీ = భూ; వలయ = మండల; సామ్రాజ్యంబున్ = సామ్రాజ్యములు; చేకుడియున్ = సమకూరినప్పటికి; గాసిన్ = శ్రమను; పొందిరి = పడిరి; కాక = కావచ్చుకాని; వైన్య = పృథుడు; గయ = గయుడు యనెడి; భూకాంతులున్ = చక్రవర్తులుకూడ; అర్థ = సంపదలపైన; కామ = కామములపైన; ఆశన్ = ఆశను; పాయగన్ = వదలుట; నేర్చిరే = చేయగలిగిరా, లేదు; మును = ఇంతకుముందు; నిజ = తమ; ఆశ = ఆశలకు; అంతంబున్ = అంతును; చూచిరే = కనుగొనగలిగిరా, లేదు.
భావము:
బలి రాక్షస మహారాజా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృధుచక్రవర్తీ గయుడూ మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృథాగా కష్టపడినవారే కానీ అర్థంమీదా కామంమీదా ఆశలను వదలుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా.
- ఉపకరణాలు:
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు-
సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు-
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ-
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును-
జలధార ననలంబు సమయునట్లు
- ఉపకరణాలు:
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "
టీకా:
సంతుష్టుడు = తృప్తిపడువాడు; ఈ = ఈ; మూడుజగములన్ = ముల్లోకములందును; పూజ్యుండు = గౌరవింపదగినవాడు; సంతోషి = తృప్తిపడువాని; కిన్ = కి; ఎప్పుడున్ = ఎప్పటికిని; జరుగు = కలుగుతుండును; సుఖము = సౌఖ్యము; సంతోషి = సంతృప్తి; కాకుంటన్ = చెందకపోవుట; సంసార = సంసారబంధనములకు; హేతువు = కారణము; సంతసంబునన్ = సంతృప్తివలన; ముక్తి = మోక్షము యనెడి; సతియున్ = కాంతకూడ; దొరకున్ = లభించును; పూటపూట = ప్రతి దినమున; కు = కు; జగంబులన్ = లోకములందు; అదృచ్చా = తనకితానుగా; లాభ = దొరకినదానితో; తుష్టినిన్ = తృప్తివలన; తేజంబున్ = తేజస్సు; తోనన్ = తోపాటు; పెరుగున్ = అభివృద్ది కలుగును; పరితోష = సంతృప్తి; హీనతన్ = లేకపోవుటచేత; ప్రభ = తేజస్సు; చెడిపోవును = పాడైపోవును; జల = నీటి; దారన్ = దారలవలన; అనలంబు = అగ్ని; సమయున్ = ఆరిపోవు; అట్లు = విధముగా.
నీవున్ = నీవు; రాజవు = రాజువుకదా; అనుచున్ = అని; నిఖిలంబున్ = సమస్తమును; అడుగుట = కోరుట; తగవు = తగినది; కాదు = కాదు; నా = నా; కున్ = కు; తగిన = సరిపడిన; కొలది = అంత; ఏనున్ = నేను; వేడికొనిన = కోరుకొన్న; ఈ = ఈ; పద = అడుగులు; త్రయమును = మూడింటిని (3); చాలదు = వీలుకాదు; అనక = అనకుండగ; ఇమ్ము = ఇమ్ము; చాలుజాలు = ఇంకచాలు.
భావము:
తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు.”