పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనుని సమాధానము

  •  
  •  
  •  

8-555-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; నప్పుడు.

టీకా:

తొల్లి = పూర్వము; మీ = మీ యొక్క; మూడవతాత = ముత్తాత; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; విశ్వ = జగత్తంతటిని; జయంబుచేసి = జయించి; గదాయుధుండు = గదాయుధమువాడు; భూతలంబునన్ = భూమండలముమీద; ప్రతివీరులన్ = ఎదిరించగల శూరులను; కానక = కనపడనివిధముగ; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుండు = నారాయణుడు; వరాహ = వరాహ; రూపంబునన్ = అవతారముతో; అతనిన్ = అతడిని; సమయించె = సంహరించెను; తత్ = అతని; భ్రాత = సహోదరుడు; అగు = అయిన; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; అది = ఆ విషయమును; విని = విని; హరి = నారాయణుని; పరాక్రమంబున్ = పరాక్రమమునకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తన = అతని; జయంబును = జయశీలమును; బలంబునున్ = శక్తిని; పరిహరించి = తూలనాడి; గ్రద్దనన్ = వెంటనే; ఉద్దవిడిన్ = దండెత్తి; ఆ = ఆ; దనుజమర్దను = వైకుంఠుని; మందిరమున్ = వైకుంఠమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అప్పుడు = ఆ సమయమునందు.

భావము:

పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహరూపంలో పరిమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు.