అష్టమ స్కంధము : గర్భస్థ వామనుని స్తుతించుట
- ఉపకరణాలు:
తదనంతరంబునం జతురాననుం డరుగుదెంచి యదితిగర్భపరిభ్రమ విభ్రముం డగు నప్పరమేశ్వరు నుద్దేశించి యిట్లని స్తుతియించె.
టీకా:
తదనంతరంబునన్ = ఆ తరువాత; చతురాననుండు = బ్రహ్మదేవుడు {చతురాననుడు - చతుః (నాలుగు) ఆననుడు (ముఖములవాడు), బ్రహ్మ}; అరుగుదెంచి = వచ్చి; అదితి = అదితి; గర్భ = గర్భమునందు; పరిభ్రమ = తిరుగుచు; విభ్రముండు = విలాసముగనున్నవాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరున్ = భగవంతుని; ఉద్దేశించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; స్తుతియించె = కీర్తించెను.
భావము:
ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి, అదితి గర్భంలో అందంగా కలియ తిరుగుతూ కదలాడుతున్న భగవంతుని ఉద్దేశించి ఈవిధంగా స్తోత్రం చేసాడు.
- ఉపకరణాలు:
"త్రిభువన జయరూఢ! దేవ! త్రివిక్రమ!-
పృథులాత్మ! శిపివిష్ట! పృశ్నిగర్భ!;
ప్రీత! త్రినాభ! త్రిపృష్ఠ! జగంబుల-
కాద్యంత మధ్యంబు లరయ నీవ;
జంగమ స్థావర జననాది హేతువు-
నీవ; కాలంబవై నిఖిల మాత్మ
లోపల ధరియింతు లోని జంతుల నెల్ల-
స్రోతంబులోఁ గొను చొప్పు దోఁప;
- ఉపకరణాలు:
బ్రహ్మలకు నెల్ల సంభవ భవన మీవ;
దివమునకుఁ బాసి దుర్దశ దిక్కులేక
శోకవార్ధి మునింగిన సురలకెల్లఁ
దేల నాధార మగుచున్న తెప్ప నీవ.
టీకా:
త్రిభువనజయరూఢ = విష్ణువు {త్రిభువనజయరూఢుడు - త్రిభువన (ముల్లోకములను) జయ (జయించుట) రూఢుడు (నిశ్చయముగాగలవాడు), విష్ణువు}; దేవ = విష్ణువు {దేవ - భగవంతుడు, విష్ణువు}; త్రివిక్రమ = విష్ణువు {త్రివిక్రమ - ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు}; పృథులాత్మ = విష్ణువు {పృథులాత్ముడు - పృథుల (మహా) ఆత్ముడు, విష్ణువు}; శిపివిష్ట = విష్ణువు {శిపివిష్టః - వ్యు. శిపి + విశ + క్త – కృ.ప్ర., వెలుగై వ్యాపించువాడు, కిరణముల స్వరూపమున అంతటను వ్యాపించి యున్నవాడు, యజ్ఞపశువునందు వ్యాపించి యున్నవాడు, విష్ణువు (తెవికె), సూర్యకిరణ ప్రతాపము తానైనవాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 273వ నామం}; పృశ్నిగర్భ = విష్ణువు {పృశ్నిగర్భ - పృశ్ని (కిరణములకు) గర్భ (జన్మస్థానమైనవాడు) (మిక్కిలిగ ప్రకాశించువాడు), పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) గర్భముననున్న వాడు, విష్ణువు}; ప్రీత = విష్ణువు {ప్రీత - సర్వులకు ప్రీతి యైనవాడు, విష్ణువు}; త్రినాభ = విష్ణువు {త్రినాభ - మూడు (లోకములు) నాభి యందు కలవాడు, విష్ణువు}; త్రిపృష్ఠ = విష్ణువు {త్రిపృష్ట - త్రి (మూడు -అడుగులు) పృష్ట (అడుగబడినవి కలవాడ), వామనుడు, విష్ణువు}; జగంబుల = లోకములకు; ఆది = మొదలు; అంత = చివర; మధ్యంబులు = మధ్యభాగములు; అరయన్ = తరచిచూసిన; నీవ = నీవే; జంగమ = చర; స్థావర = అచరములకు; జనన = పుట్టుకలకు; ఆది = ముఖ్య; హేతువు = కారణభూతుడవు; నీవ = నీవే; కాలంబవు = కాలస్వరూపుడవు; ఐ = అయ్యి; నిఖిల = సమస్తమైన; ఆత్మన్ = జీవకోటిని; లోపలన్ = నీ యందే; ధరియింతు = ధరించెదవు; లోని = లోపలయున్న; జంతులన్ = ప్రాణులను; ఎల్లన్ = అన్నిటిని; స్రోతంబు = ప్రవాహము; లోన్ = లోనికి; కొను = తీసుకొనెడి; చొప్పు = విధముగ; తోపన్ = అనిపించునట్లు.
బ్రహ్మల = సృష్టికర్తల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; సంభవ = పుట్టుకలకు; భవనము = స్థానము; ఈవ = నీవే; దివమున్ = స్వర్గమునకు; పాసి = దూరమై; దుర్దశన్ = కష్టములలో; దిక్కు = శరణమిచ్చువారు; లేక = లేకపోవుటచేత; శోక = శోకము యనెడి; వార్ధిన్ = సముద్రమున; మునింగిన = ములిగిపోయిన; సురల = దేవతల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; తేలన్ = బయటపడుటకు; ఆధారము = ఆధారభూతము; అగుచున్న = అగుచున్న; తెప్ప = నావ; నీవ = నీవే.
భావము:
“అదితి గర్భంలో వర్ధిల్లుతున్న ఓ స్వామీ! నీవు ముల్లోకాలనూ జయింపగల వాడవు: దేవాధిదేవుడవు: ముల్లోకములనూ ఆక్రమించు వాడవు: మహాత్ముడవు: కిరణముల రూపమున సర్వస్వమునందు వ్యాపించి ఉండువాడవు: కిరణములకు మూలము అయిన వాడవు: పృశ్ని అను నామాంతరం గల అదితి గర్భంలో పుట్టిన వాడవు: సర్వులకు ఇష్టుడవైన విష్ణువు నీవు: సమస్త భువనాలనూ సంతోషంగా నీ కడుపులో దాచుకుంటావు: ఈలోకాలకు మొదలూ నడుమ తుదా నీవే: చరాచర ప్రపంచం పుట్టడానికి కారణం నీవే: కాలమై సమస్తమూ నీ లోపలే ధరిస్తావు: ప్రవాహం ప్రాణికోటిని ధరించినట్లు సమస్త జీవులనూ నీలోనే నిలుపు కొంటావు: సృష్టికర్తలకు సృష్టికర్తవు నీవు: స్వర్గ లోకాన్ని పోగొట్టుకొని దేవతలు కష్టసముద్రంలో మునిగారు. వారిని కాపాడి గట్టు చేర్చే తెప్పవు నీవు.
- ఉపకరణాలు:
విచ్చేయు మదితి గర్భము
చెచ్చెర వెలువడి మహాత్మ! చిరకాలంబున్
విచ్చలవిడి లే కమరులు
ముచ్చటపడి యున్నవారు ముద మందింపన్. "
టీకా:
విచ్చేయుము = రమ్ము; అదితి = అదితియొక్క; గర్భమున్ = కడుపులొనుండి; చెచ్చెరన్ = శ్రీఘ్రమే; వెలువడి = బయటకు వచ్చి; మహాత్మా = గొప్పవాడ; చిరకాలంబున్ = చాలాకాలమునుండి; విచ్చలవిడిన్ = స్వేచ్ఛ; లేక = లేకపోవుటచేత; అమరులు = దేవతలు; ముచ్చటపడి = కోరుతు; ఉన్నవారు = ఉన్నారు; ముదము = సంతోషమును; అందింపన్ = సమకూర్చుటానికై.
భావము:
మహానుభావా! చాలాకాలంగా దేవతలు స్వేచ్ఛకోసం ఆరాటపడుతున్నారు. వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అదితి గర్భం నుండి వెలువడి వేంచేయవయ్యా."
- ఉపకరణాలు:
అని యిట్లు కమలసంభవుండు వినుతిచేయు నయ్యవసరంబున.
టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - కమలమునందు సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ}; వినుతి = స్తోత్రములు; చేయన్ = చేయగా; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
కమలంలో పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విధంగా స్తుతిస్తూ ఉన్న ఆ సమయములో. . .