అష్టమ స్కంధము : వామనుడు గర్భస్తు డగుట
- ఉపకరణాలు:
నిలిపెన్ ఱెప్పల బృందిమన్, విశదిమన్ నేత్రంబులం, జూచుకం
బుల నాకాళిమ, మేఖలం ద్రఢిమ, నెమ్మోమారఁగాఁ బాండిమన్
బలిమిం జన్నుల, శ్రోణిపాళిగరిమన్, మధ్యంబునన్ బృంహిమ
న్లలితాత్మన్ లఘిమన్, మహామహిమ మేనన్ గర్భదుర్వారమై.
టీకా:
నిలిపెన్ = స్థిరపరచెను; ఱెప్పల = కనురెప్పల; బృందిమన్ = మనోజ్ఞతను; విశదిమన్ = పెద్దవిగా ఉండుటయందు; నేత్రంబులన్ = కన్నులను; చూచుకంబులన్ = చనుమొనలను; ఆ = ఆ ; కాళిమన్ = నల్లదనమును; మేఖలన్ = ఒడ్డాణము; ద్రఢిమన్ = బిగువుకావడమును; నెఱ = నిండు; మోము = ముఖము; ఆరగాన్ = ఒప్పుగా; పాండిమన్ = తెల్లదనమును; బలిమిన్ = బలిష్ఠము; చన్నులన్ = స్తనములందు; శ్రోణి = పిరుదుల; పాళి = ప్రదేశము; గరిమన్ = గొప్పదనమును; మధ్యంబునన్ = నడుమునందు; బృంహిమ = లావగుట; లలిత = మనోజ్ఞమైన; ఆత్మన్ = మనసునందు; లఘిమన్ = తేలికపడుట; మహా = మిక్కిలి; మహిమ = మహత్వము; మేనన్ = దేహమునందు; గర్భ = గర్భము; దుర్వారము = ఆపలేనిది; ఐ = అయ్యి.
భావము:
ఆమె రెప్పలు అందంగా ఒప్పాయి: కన్నులు నిర్మలమయ్యాయి: స్తనాగ్రాలు నల్లపడ్డాయి: ఒడ్డాణం బిగువైంది; ముఖం తెల్లబడింది: పిరుదులు బరువెక్కాయి: నడుము విస్తరించింది: మనస్సు తేలికపడింది. దేహం మహత్వాన్ని పొందింది. గ్రర్భం అతిశయించింది.