పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : పయోభక్షణ వ్రతము

  •  
  •  
  •  

8-476-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అగు నయిననుం గాలోచిత కార్యంబు చెప్పెద.

టీకా:

అగునయిననున్ = అలా అయినప్పటికిని; కాల = కాలముకు; ఉచిత = తగినట్టి; కార్యంబున్ = పనిని; చెప్పెద = తెలిపెదను.

భావము:

సరే, ప్రస్తుతానికి తగిన కార్యాన్ని చెబుతాను విను.

8-477-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్
దీశున్ హరి సేవజేయు మతఁడున్ సంతుష్టినిం బొంది నీ
గు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి చేకూరెడిన్
వత్సేవలఁ బొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ!"

టీకా:

భగవంతున్ = భగవంతుని; పరమున్ = హరిని {పరముడు - సర్వాతీతమైవాడు, విష్ణువు}; జనార్దనున్ = హరిని {జనార్దనుడు - జనులను రక్షించువాడు, విష్ణువు}; కృపాపారీణున్ = దయాసముద్రుని; సర్వాత్మకున్ = హరిని {సర్వాత్మకుడు - సర్వులయందు వ్యాపించి యుండువాడు, విష్ణువు}; జగదీశున్ = హరిని {జగదీశుడు - లోకములకు ప్రభువు, విష్ణువు}; హరిన్ = హరిని {హరి – భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; సేవ = ఆరాధన; చేయుము = చేయుము; అతడున్ = అతడు; సంతుష్టినిన్ = సంతోషమును; పొంది = పొంది; నీవు = నీ; కున్ = కు; అగు = ఉన్న; ఇష్టార్థముల్ = కోరికలు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చున్ = ప్రసాదించును; నిఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల; అవాప్తి = పొందుట; చేకూరెడిన్ = సమకూరును; భగవవత్ = భగవంతుని; సేవలన్ = కొలచుటవలన; పొందరాదె = పొందవలసినది; బహు = అనేకమైన; సౌభాగ్యంబులన్ = శుభములను; ప్రేయసీ = ప్రియురాలా.

భావము:

ప్రియురాలా! అదితీ! విష్ణుమూర్తి భగవంతుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయాసముద్రుడూ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ. కనుక అయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు. నీ కోరికలు అన్నీ తీరుస్తాడు. అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందు.”

8-478-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన గృహస్థునకు గృహిణి యిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; గృహస్థున్ = భర్త; కున్ = కు; గృహిణి = ఇల్లాలు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

ఇలా హరిని పూజించమని చెప్పిన భర్త కశ్యపుని మాటలు విని భార్య అదితి ఇలా అంది.

8-479-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నారాయణుఁ బరమేశ్వరు
నేరీతిఁ దలంతు? మంత్ర మెయ్యది? విహితా
చారంబు లే ప్రకారము?
లారాధన కాల మెద్ది? యానతి యీవే. "

టీకా:

నారాయణున్ = శ్రీమహావిష్ణువును {నారాయణుడు - అవతారములందు నరసంబంధమయిన శరీరమును పొందువాడు, విష్ణువు}; పరమేశ్వరున్ = శ్రీమహావిష్ణువును {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నతమైన) ఈశ్వరుడు (దేముడు), విష్ణువు}; ఏ = ఏ; రీతిన్ = విధముగ; తలంతున్ = ధ్యానించవలెను; మంత్రమున్ = పఠించవలసిన మంత్రము; ఎయ్యది = ఏది; విహిత = విధింపబడిన; ఆచారములు = నియమములు; ఏ = ఎట్టి; ప్రకారాములు = విధమైనవి; ఆరాధన = కొలచెడి; కాలము = సమయము; ఎద్ది = ఏది; ఆనతి = సెలవు; ఈవే = ఇమ్ము.

భావము:

“స్వామీ! పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ఏవిధంగా ధ్యానించాలి. అందుకు తగిన మంత్రమేది. దాని నియమాలు ఏవి. పూజింప వలసిన కాలమేది. అన్నీ నాకు ఉపదేశించు.”.

8-480-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినఁ గశ్యప ప్రజాపతి సతికిఁ బయోభక్షణంబను వ్రతంబుపదేశించి తాత్కాలంబునుఁ, దన్మంత్రంబును, దద్విధానంబును, దదుపవాస దాన భోజన ప్రకారంబులును నెఱింగించెను. అదితియును ఫాల్గుణ మాసంబున శుక్లపక్షంబునఁ బ్రథమదివసంబునన్ దొరకొని పండ్రెండు దినంబులు హరి సమర్పణంబుగా వ్రతంబు జేసి వ్రతాంతంబున నియత యై యున్న యెడఁ జతుర్బాహుండునుఁ బీతవాసుండును శంఖ చక్ర గదాధరుండునునై, నేత్రంబుల కగోచరుండైన నారాయణదేవుండు ప్రత్యక్షంబైనం గనుంగొని.

టీకా:

అనినన్ = అనగా; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = బ్రహ్మ {ప్రజాపతి - ప్రజలను (సంతానమును) సృష్టించుటకు పతి (అధికారము గలవాడు)}; సతి = భార్య; కిన్ = కి; పయోభక్షణము = పయోభక్షణము యనెడి {పయోభక్షణము - పయస్ (నీరు) భక్షణము (ఆహారముగా తీసుకొనెడి వ్రతము)}; వ్రతంబున్ = వ్రతమును; ఉపదేశించి = తెలియజెప్పి; తత్ = దాని యొక్క; కాలంబును = సమయపాలనను; తత్ = దాని యొక్క; మంత్రంబునున్ = మంత్రములను; తత్ = దాని యొక్క; విధానంబును = పద్ధతులను; తత్ = దాని యొక్క; ఉపవాస = చేయవలసిన ఉపాసనలు; దాన = దానములు; భోజన = ఆహరనియమాలు; ప్రకారములు = విధానములు; ఎఱింగించెను = తెలియజేసెను; అదితియును = అదితి; ఫాల్గుణ = ఫాల్గుణ; మాసంబునన్ = నెలలో; శుక్ల = శుక్ల; పక్షంబునన్ = పక్షమునందు; ప్రథమదివసంబునన్ = పాడ్యమినాడు; దొరకొని = ప్రారంభించి; పండ్రెండు = పన్నెండు (12); దినంబులు = రోజులు; హరి = విష్ణుమూర్తికి; సమర్పణంబు = సమర్పించినదిగా; వ్రతంబున్ = వ్రతమును; చేసి = చేసి; వ్రత = వ్రతము; అంతంబునన్ = పూర్తి యగునప్పుడు; నియత = నిష్ఠగా యున్నది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు; చతుః+బాహుండును = నాలుగుచేతులు గలవాడు; పీతవాసుడును = పట్టుబట్టలు కట్టినవాడు; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గదలను; ధరుండును = ధరించినవాడు; ఐ = అయ్యి; నేత్రంబుల = కన్నుల; కున్ = కు; అగోచరుండు = కనబడనివాడు; ఐన = అయినట్టి; నారాయణదేవుండు = విష్ణుమూర్తి; ప్రత్యక్షంబు = సాక్షాత్కారించినవాడు; ఐననన్ = కాగా; కనుంగొని = చూసి.

భావము:

ఇలా భగవంతుని పూజించే విధానం చెప్పమని అడిగిన భార్య అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని; వ్రతకాలంలో పాటించవలసిన ఉపాస, దాన, భోజనాది విధివిధానాలను బోధించాడు. అదితి ఫాల్గుణ మాస శుక్ల పక్ష మొదటి దినము అయిన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది. పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుడు విష్ణుమూర్తికి సమర్పిస్తూ వ్రతం పూజించింది. వ్రతం ముగించి నియమవంతురాలు అయి ఉన్న ఆమెకు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చతుర్భాహుడు. శంఖాన్ని చక్రాన్ని ధరించి, పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు.

8-481-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నుల సంతోషాశ్రులు
న్నులపైఁ బఱవఁ బులక జాలము లెసగన్
న్నతులును సన్నుతులును
నున్నత రుచిఁ జేసి నిటల యుక్తాంజలియై.

టీకా:

కన్నులన్ = కళ్ళనుండి; సంతోష = సంతోషపు; అశ్రులున్ = కన్నీరు; చన్నుల్ = స్తనముల; పైన్ = మీద; పఱవన్ = ప్రవహించగా; పులకజాలములు = పులకరింతలు; ఎసగన్ = అతిశయించగా; సత్ = చక్కటి; నతులును = నమస్కారములు; సన్నుతులును = స్తోత్రములు; ఉన్నత = ఉత్తమమైన; రుచిన్ = ఇచ్ఛతో; చేసి = చేసి; నిటల = నుదుట; ఉక్త = ఉంచబడిన; అంజలి = జోడించినచేతులు గలది; ఐ = అయ్యి.

భావము:

సంతోషంవల్ల అదితి కన్నులనుండి కురిసిన కన్నీళ్ళు ఆమె వక్షస్థలంపై జాలువారాయి. ఆమె శరీరము అంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదిటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది.

8-482-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చూపుల శ్రీపతి రూపము
నాపోవక త్రావి త్రావి ర్షోద్ధతయై
వాపుచ్చి మంద మధురా
లాపంబులఁ బొగడె నదితి క్ష్మీనాథున్.

టీకా:

చూపులన్ = చూపులతో; శ్రీపతి = విష్ణుని; రూపమున్ = స్వరూపమును; ఆపోవకన్ = తృప్తితీరక; త్రావిత్రావి = మిక్కిలిగ ఆస్వాదించి; హర్ష = సంతోషముతో; ఉద్దత = అతిశయించినది; ఐ = అయ్యి; వాపుచ్చి = నోరుతెరచి; మంద = మృదువైన; మధుర = తీయని; ఆలాపంబులన్ = వాక్కులతో; పొగడెన్ = స్తుతించెను; అదితి = అదితి; లక్ష్మీనాథున్ = విష్ణుమూర్తిని.

భావము:

అదితి ఆ దేవదేవుని రూపాన్ని ఎంత చూసినా తనినితీరక చూపులతో మిక్కిలిగా త్రాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ లక్ష్మీపతిని మృదుమధుర వాక్కులతో ఇలా స్తుతించింది.

8-483-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం-
ళనామధేయ! లోస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన!-
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత!-
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు నుపమ లక్ష్మియు-
సుధయు దివముఁ ద్రిర్గములును

8-483.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! రమపురుష!

టీకా:

యజ్ఞేశ = హరి {యజ్ఞేశుడు - యజ్ఞములపై ఈశ (దేవుడు), విష్ణువు}; విశ్వంభర = హరి {విశ్వంభరుడు - విశ్వన్ (జగత్తును) భరుడు (భరించెడివాడు), విష్ణువు}; అచ్యుత = హరి {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; శ్రవణమంగళనామధేయ = హరి {శ్రవణమంగళనామధేయుడు - శ్రవణ (వినినంతనే) మంగళ (శుభములను కలిగించెడి) నామధేయుడు (పేరు గలవాడు), విష్ణువు}; లోకస్వరూప = హరి {లోకస్వరూపుడు - లోక (జగత్తే) స్వరూపుడు (తన రూపమైనవాడు), విష్ణువు}; ఆపన్నభక్తజనార్తివిఖండన = హరి {ఆపన్నభక్తజనార్తివిఖండనుడు - ఆపన్న (శరణువేడిన) భక్త (భక్తులైన) జన (వారి) ఆర్తిన్ (దుఃఖములను) విఖండనుడు (పూర్తిగా తొలగించెడివాడు), విష్ణువు}; దీనలోకాధార = హరి {దీనలోకాధారుడు - దీనులైనవారికి ఆధారుడు (ఆధారముగా నుండువాడు), విష్ణువు}; తీర్థపాద = హరి {తీర్థపాదుడు - తీర్థ (పవిత్ర గంగానది జనించిన) పాదుడు (పాదములు కలవాడు), విష్ణువు}; విశ్వోద్భవస్థితివిలయకారణభూత = హరి {విశ్వోద్భవస్థితివిలయకారణభూతుడు - విశ్వ (జగత్తునకు) ఉద్భవ (సృష్టికి) స్థితికి విలయ (నాశమునకు) కారణభూతుడైనవాడు, విష్ణువు}; సంతతానంద = హరి {సంతతానందుడు - సంతత (ఎడతెగని) ఆనందుడు (ఆనందము గలవాడు), విష్ణువు}; శశ్వద్విలాస = హరి {శశ్వద్విలాసుడు - శశ్వత్ (శాశ్వతముగా) విలాసుడు (విరాజిల్లువాడు), విష్ణువు}; ఆయువు = ఆయుష్షు; దేహంబున్ = జన్మము; అనుపమ = సాటిలెని; లక్ష్మియున్ = సంపదలు; వసుధయు = రాజ్యము; దివము = స్వర్గలోకప్రాప్తి; త్రివర్గము = 1) ధర్మార్థకాములు, 2) సత్త్వరజస్తమములు, 3) క్షయస్థానవృద్ధులు;
వైదిక = వేదసంబంధమైన; జ్ఞాన = విజ్ఞానమునందు; యుక్తియున్ = ప్రావీణ్యత; వైరి = శత్రువులపై; జయమున్ = విజయము; నిన్నున్ = నిన్ను; కొలువని = సేవించని; నరుల్ = మానవుల; కున్ = కు; నెఱయన్ = నిండుగా; కలదె = దొరకునా; వినుతమందార = హరి {వినుతమందారుడు - వినుత (స్తుతించువారికి) మందారుడు (కోరికలువర్షించువాడు), విష్ణువు}; గుణహార = హరి {గుణహారుడు - గుణ (సుగుణములు) హారుడు (అలంకారముగా కలవాడు), విష్ణువు}; వేదసార = హరి {వేదసారుడు - వేదముల యొక్క సారమైనవాడు, విష్ణువు}; ప్రణతవత్సల = హరి {ప్రణతవత్సలుడు - ప్రణత (కొలిచెడివారికి) వత్సలుడు (వాత్సల్యము చూపువాడు), విష్ణువు}; పద్మాక్ష = హరి {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పరమపురుష = హరి {పరమపురుష - సర్వాతీతమైన పురుషయత్నము కలవాడు, విష్ణువు}.

భావము:

“యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలూ ఒనగూడుతాయి; లోకమే రూప మైనవాడవు; పూజించేవారిని ఆపదలనుండి ఆర్తినుండి బ్రోచేవాడవు; దీనులందరికి దిక్కైనవాడవు; పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు; లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైనవాడవు; ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు; శాశ్వత మైన లీలావిలాసాలు కలవాడవు; అంతటా నిండిన వాడవు; నీవు భక్తులపాలిటి కల్పవృక్షానివి; సుగుణనిధివి; పరమాత్ముడవు; వేదాలకు ఆధారమైనవాడవు; సేవించేవారి యందు వాత్సల్యము కలవాడవు; కమలాల వంటి కన్నులు కలవాడవు; పరమపురుషుడవు; ఈలోకంలో మంచి మనుగడ, కలిమి, ఇహము, పరమూ, ధర్మార్ధ కామాలూ, వేదవిజ్ఞానమూ, శత్రు జయమూ నిన్ను పూజించని వారికి లభించవు కదా!

8-484-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురవరులు సురల దలించి బెదరించి
నాక మేలుచున్న నాఁట నుండి
న్న కడుపుఁ గాన కంటఁ గూరుకు రాదు
డుపుఁబొక్కు మాన్పి కావవయ్య."

టీకా:

అసుర = రాక్షస; వరులు = ఉత్తములు; సురలన్ = దేవతలను; అదలించి = హడలగొట్టి; బెదరించి = భయపెట్టి; నాకమున్ = స్వర్గమును; ఏలుచున్న = పరిపాలించుచున్న; నాటి = దినము; నుండి = నుండి; కన్న = జన్మనిచ్చిన; కడుపు = తల్లి; కాన = కావున; కంటన్ = కంటికి; కూరుకు = నిద్ర; రాదు = రావటములేదు; కడుపుబొక్కు = గర్భశోకము {కడుపుబొక్కు – కడుపు (గర్భపు), పొక్కు (శోకము), గర్భశోకము}; మాన్పి = పోగొట్టి; కావవు = కావుము; అయ్య = తండ్రి.

భావము:

తండ్రీ! బలవంతులైన రాక్షసులు నా బిడ్డలైన దేవతలను అదలించి బెదరించి స్వర్గ లోకాన్ని పాలిస్తున్నారు. కన్నకడుపు కదా. ఆ బెంగతో దేవతల కన్నతల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. ఈ నా గర్భశోకాన్ని పోగొట్టి కాపాడు.”

8-485-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని దరహసితవదనుండయి యాశ్రితకామధేనువైన యప్పరమేశ్వరుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; దరహసిత = చిరునవ్వుగల; వదనుండు = ముఖము కలవాడు; అయి = ఐ; ఆశ్రిత = ఆశ్రయించినవారికి; కామధేనువు = కోరినవి యిచ్చువాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; పరమేశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని పలికిన అదితి మాటలు విని శ్రీ మహా విష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువు అయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.

8-486-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ కోడండ్రును, నీ కుమారవరులున్, నీ నాథుఁడున్, నీవు సం
శ్లోకింపన్ సతులుం బతుల్ మిగుల సమ్మోదింప రాత్రించరుల్
శోకింపన్, భవదీయ గర్భమునఁ దేజోమూర్తి జన్మించెదన్
నాకున్ వేడుక పుట్టు నీ సుతుఁడనై ర్తించి వర్తింపఁగాన్.

టీకా:

నీ = నీ యొక్క; కోడండ్రునున్ = కోడళ్ళు; నీ = నీ యొక్క; కుమార = పుత్ర; వరులున్ = రత్నములు; నీ = నీ యొక్క; నాథుడున్ = భర్త; నీవున్ = నీవు; సంశ్లోకింపన్ = స్తుతించునట్లు; సతులు = స్త్రీలు; పతులున్ = పురుషులు; మిగులన్ = ఎక్కువగా; సమ్మోదింపన్ = సంతోషించునట్లు; రాత్రించరుల్ = రాక్షసులు; శోకింపన్ = దుఃఖించగా; భవదీయ = నీ యొక్క; గర్భమునన్ = కడుపులో; తేజస్ = నా తేజస్సుకల; మూర్తిన్ = స్వరూపముతో; జన్మించెదన్ = పుట్టెదను; నా = నా; కున్ = కు; వేడుక = కుతూహలము; పుట్టున్ = కలుగుచున్నది; నీ = నీ యొక్క; సుతుడను = పుత్రుడను; ఐ = అయ్యి; నర్తించి = ఆడిపాడి; వర్తింపన్ = తిరుగవలెనని.

భావము:

“అమ్మా! తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున జన్మిస్తాను. నీ కోడళ్ళూ, కొడుకులూ, నీ మగడూ. నీవు మెచ్చుకొనేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళ పడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది.

8-487-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిమిన్ దైత్యులఁ జంపరాదు వినయోపాయంబునం గాని; సం
నం బొందకు; నేను నీ నియతికిన్ ద్భక్తికిన్ మెచ్చితిన్;
లి విద్వేషియు నా నిలింపగణముం బౌలోమియున్ మెచ్చ దై
త్యు రాజ్యంబు హరింతు; నింద్రునికి నిత్తున్; దుఃఖమింకేటికిన్?

టీకా:

బలిమిన్ = బలముచూపి; దైత్యులన్ = రాక్షసులను; చంపన్ = సంహరించుట; రాదు = వీలుకాదు; వినయ = సహనంతోకూడిన; ఉపాయంబునన్ = ఉపాయముతో; కాని = తప్పించి; సంచలనంబున్ = కంగారు; పొందకు = పడవద్దు; నేను = నేను; నీ = నీ యొక్క; నియతి = నిష్ఠ; కిన్ = కు; సత్ = మంచి; భక్తి = భక్తి; కిన్ = కి; మెచ్చితిన్ = మెచ్చుకొనుచున్నాను; బలివిద్వేషియున్ = ఇంద్రుడు {బలివిద్వేషి - బలికి శత్రువు, ఇంద్రుడు}; ఆ = ఆ; నిలింప = దేవతా; గణమున్ = సమూహము; పౌలోమియున్ = శచీదేవి {పౌలోమి - పులోముని పుత్రిక, శచీదేవి}; మెచ్చ = మెచ్చుకొనునట్లు; దైత్యుల = రాక్షసుల యొక్క; రాజ్యంబున్ = రాజ్యాధికారమును; హరింతున్ = అపహరించెదను; ఇంద్రుని = ఇంద్రుని; కిన్ = కి; ఇత్తున్ = ఇచ్చెదను; దుఃఖము = శోకము; ఇంక = ఇంకా; ఏమిటికిన్ = ఎందుకు.

భావము:

నువ్వు బాధపడకు. సహనంతోకూడిన ఉపాయంతో తప్ప బలం చూపెట్టి రాక్షసులను మట్టుపెట్టడానికి వీలు లేదు. నీ నియమానికి భక్తికి నేను సంతోషించాను. ఇంద్రుడూ, శచీదేవి, దేవతలూ సంతోషించే విధంగా రాక్షసుల రాజ్యాన్ని అపహరించి దేవతలకు ఇస్తాను. ఇంక నువ్వు దుఃఖించేపని లేదు.

8-488-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ మణుని సేవింపుము
నా రూపము మానసించి ళినీ! గర్భా
గారంబు వచ్చి చొచ్చెద
గారామునఁ బెంపవమ్మ రుణన్ నన్నున్.

టీకా:

నీ = నీ యొక్క; రమణుని = భర్తను; సేవింపుము = కొలువుము; నా = నా యొక్క; రూపమున్ = రూపమును; మానసించి = మనసులో నిలుపుకొని; నళినీ = సుందరి; గర్భాగారంబున్ = గర్భాశయమును; వచ్చి = వచ్చి; చొచ్చెదన్ = ప్రవేశించెదను; గారమునన్ = గారముగా, ప్రేమతో; పెంపవు = పెంచుము; అమ్మ = తల్లి; కరుణన్ = దయతో; నన్నున్ = నన్ను.

భావము:

నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు నేను. నీగర్భంలో చేరుతాను మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లీ!