పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : 13దేవసావర్ణిమనువు చరిత్ర

 •  
 •  
 •  

8-425-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుం దదేష్యత్కాలంబున నాత్మవంతుండగు దేవసావర్ణి పదుమూఁడవ మనువయ్యెడి; మనుకుమారులు చిత్రసేన విచిత్రాదులు జగతీనాయకులును; సుకర్మ సుత్రామ సంజ్ఞలు గలవారు బృందారకులును; దివస్పతి యను వా డింద్రుండును; నిర్మోహ తత్త్వదర్శా ద్యులు ఋషులును నయ్యెదరు; అందు.

టీకా:

మఱియున్ = ఇంకను; తత్ = ఆతరువాత; ఏష్యత్ = రాగల; కాలంబునన్ = కాలమునందు; ఆత్మవంతుండు = ఆత్మాభిమాని; అగు = అయిన; దేవసావర్ణి = దేవసావర్ణి; పదుమూడవ = పదమూడవ (13); మనువు = మనువు; అయ్యెడిన్ = అవుతాడు; మను = మనువు యొక్క; కుమారులు = పుత్రులు; చిత్రసేన = చిత్రసేనుడు; విచిత్ర = విచిత్రుడు; ఆదులున్ = మున్నగువారు; జగతీనాయకులును = రాజులు; సుకర్మ = సుకర్ముడు; సుత్రామ = సుత్రాముడు; సంజ్ఞులు = అనెడిపేర్లు; కలవారు = కలవారు; బృందారకులును = దేవతలు; దివస్పతి = దివస్పతి; అను = అనెడి; వాడున్ = వాడు; ఇంద్రుండును = ఇంద్రుడు; నిర్మోహ = నిర్మోహుడు; తత్త్వదర్శ = తత్త్వదర్శుడు; ఆద్యులు = మొదలగువారు; ఋషులునున్ = ఋషులు; అయ్యెదరు = అవుతారు; అందు = ఆ కాలమునందు.

భావము:

ఓ పరీక్షిత్తూ! ఆతరువాత కాలంలో దేవసావర్ణి పదమూడవ మనువు అవుతాడు. అతని కొడుకులైన చిత్రసేనుడూ విచిత్రుడూ మొదలైనవారు రాజులు అవుతారు. సుకర్ములూ, సుత్రాములూ దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడు అవుతాడు. నిర్మోహుడూ, తత్త్వదర్శుడూ మొదలైనవారు సప్తఋషులు అవుతారు.

8-426-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రణి దేవహోత్ర యితకు బృహతికి
యోగవిభుఁడు నాఁగ నుద్భవించి
నజనేత్రుఁ డా దిస్పతి కెంతయు
సౌఖ్య మాచరించు గతినాథ!

టీకా:

ధరణిన్ = భూమండలమున; దేవహోత్ర = దేవహోత్రుని యొక్క; దయిత = భార్య; కున్ = కు; బృహతి = బృహతి; కిన్ = కి; యోగవిభుడు = యోగవిభుడు; నాగన్ = అనగా; ఉద్భవించి = అవతరించి; వనజనేత్రుడు = విష్ణువు; దివస్పతి = దివస్పతి; కిన్ = కి; ఎంతయో = అధికముగ; సౌఖ్యము = సహాయము; ఆచరించున్ = చేయును; జగతినాథ = రాజా.

భావము:

ఆ కాలంలో విష్ణువు దేవహోతకూ బృహతికీ యోగవిభుడు అనే పేరుతో పుడతాడు. దివస్పతి కి మిక్కిలి సహాయం చేస్తాడు.