సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట
- ఉపకరణాలు:
"బాలకులార రండు మన ప్రాయపు బాలురు కొంద ఱుర్విపైఁ
గూలుట గంటిరే? గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీలత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రమున్
మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడిన్.
టీకా:
బాలకులారా = పిల్లలూ; రండు = రండి; మన = మన; ప్రాయపు = వయసు కలిగిన, ఈడు; బాలురు = పిల్లలు; కొందఱు = కొంతమంది; ఉర్వి = భూమి; పైన్ = మీద; కూలుటన్ = మరణించుటను; కంటిరే = చూసితిరా; గురుడు = గురువు; క్రూరుడు = క్రూరమైనవాడు; అనర్థ = నివృత్తిశూన్యముల; చయంబున్ = సముదాయము; అందు = లో; దుశ్శీలతన్ = దుర్బుద్ధితో; అర్థ = ప్రయోజనముల; కల్పనమున్ = భ్రాంతిని; చేసెడిన్ = కలిగించుచున్నాడు; గ్రాహ్యములు = గ్రహింపదగినవి; కాదు = కాదు; శాస్త్రమున్ = విద్యను; మేలు = క్షేమమైనదానిని; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినిన = విన్నచో; మీ = మీ; కున్ = కు; నిరంతర = ఎడతెగని; భద్రము = శ్రేయము; అయ్యెడిన్ = కలుగును.
భావము:
“ఓ పిల్లలూ! ఇలా రండి. పనికిమాలిన విషయాలన్నీ దుర్భుద్ధితో దయమాలిన మన గురువులు వాటికి ప్రయోజనాలు ఉన్నట్లు కల్పించి శాస్త్రాలు అంటూ గొప్పగా మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగ్గవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించటం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి మీకు ఎడతెగని క్షేమ స్థైర్యాలు కలుగుతాయి.