సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట
- ఉపకరణాలు:
"అంగవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంగశ్రేణికి రక్ష చేయు క్రియ నీ యజ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంగఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.
టీకా:
అంగ = అవయవముల; వ్రాతము = సముదాయము; లోన్ = అందు; చికిత్సకుడు = వైద్యుడు; దుష్ట = పాడైన; అంగంబున్ = అవయమును; ఖండించి = కత్తిరించివేసి; శేష = మిగిలిన; అంగ = అవయవముల; శ్రేణి = సముదాయమున; కిన్ = కు; రక్ష = శుభమును; చేయు = చేసెడి; క్రియన్ = విధముగ; ఈ = ఈ; అజ్ఞున్ = తెలివితక్కువ వానిని; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయు వానిని; దుస్సంగున్ = చెడుసావాసము చేయువానిని; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశి యను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; పక్షపాతిన్ = పక్షము వహించు వాని; అధమున్ = నీచుని; చంపించి = సంహరింపజేసి; వీర = శౌర్యవంతమైన; వ్రత = కార్యములను చేసెడి నిష్ఠచే; ఉత్తుంగ = అత్యధికమైన; ఖ్యాతిన్ = కీర్తితో; చరించెదన్ = తిరిగెదను; కులము = వంశము; నిర్దోషము = కళంకము లేనిదిగా; కావించెదన్ = చేసెదను.
భావము:
“ఈ చెడు త్రోవ పట్టిన కుల ద్రోహీ, శత్రు పక్షపాతీ, మూర్ఖుడూ అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన దుష్టాంగం. వ్యాధి బారిన పడిన దుష్ట అవయవాన్ని ఖండించి, శస్త్రవైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు ఆరోగ్యం కలిగించి రక్షిస్తాడు. అలాగే, ఇతనిని చంపించి కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసిన గొప్ప మహా వీరుడు అనే కీర్తిని పొందుతాను.