సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము
- ఉపకరణాలు:
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే?-
పవన గుంఫిత చర్మభస్త్రి గాక;
వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే?-
ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే?-
తరుశాఖ నిర్మిత దర్వి గాక?
కమలేశుఁ జూడని కన్నులు కన్నులే?-
తనుకుడ్యజాల రంధ్రములు గాక;
- ఉపకరణాలు:
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక.
టీకా:
కంజాక్షున్ = నారాయణుని {కంజాక్షుడు - కంజము (కమలము)ల బోలు అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; కున్ = కి; కాని = ఉపయోగించని; కాయంబు = దేహము; కాయమే = దేహమా ఏమి; పవన = గాలిచే; గుంఫిత = కూర్చ బడి నట్టి; చర్మభస్త్రి = తోలుతిత్తి; కాక = కాకుండగ; వైకుంఠున్ = నారాయణుని {వైకుంఠుడు - వైకుంఠముననుండు వాడు, విష్ణువు}; పొగడని = కీర్తించని; వక్త్రంబున్ = నోరు; వక్త్రమే = నోరా ఏమి; ఢమఢమ = ఢమఢమ యనెడి; ధ్వని = శబ్దముల; తోడి = తోకూడిన; ఢక్క = ఢంకా; కాక = కాకుండగ; హరి = నారాయణుని; పూజనమున్ = పూజలను చేయుట; లేని = లేని; హస్తంబు = చేయి; హస్తమే = చేయేనా ఏమి; తరు = చెట్టు; శాఖ = కొమ్మచే; నిర్మిత = చేయబడిన; దర్వి = తెడ్డు, గరిటె; కాక = కాకుండగ; కమలేశున్ = నారాయణుని {కమలేశుడు - కమల (లక్ష్మీదేవి) యొక్క ఈశుడు (భర్త), విష్ణువు}; చూడని = చూడనట్టి; కన్నులు = కళ్లు; కన్నులే = కళ్లేనా ఏమి; తను = దేహము యనెడి; కుడ్య = గోడయందలి; జాలరంధ్రములు = కిటికీలు; కాక = కాకుండగ.
చక్రి = నారాయణుని {చక్రి - చక్రాయుధముగలవాడు, విష్ణువు}; చింత = తలపు, ధ్యానము; లేని = లేనట్టి; జన్మంబు = పుట్టుకకూడ; జన్మమే = పుట్టుకయేనా ఏమి; తరళ = కదలుచున్న; సలిల = నీటి; బుద్భుదంబు = బుడగ; కాక = కాకుండగ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; లేని = లేనట్టి; విబుధుండు = విద్వాంసుడు; విబుధుండే = విద్వాంసుడా ఏమి; పాద = కాళ్ళు; యుగము = రెంటి; తోడి = తోటి; పశువు = పశువు; కాక = కాకుండగ.
భావము:
పద్మాలవంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు. అది గాలితో నిండిన, కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు, ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన ఆ హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు ఢమ ఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు అది ఒక కొయ్య తెడ్డు (చెక్క గరిటె). శ్రీపతిని చూడని కన్నులు కన్నులా? అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు రెండు కాళ్ళ జంతువు తప్ప వాడు పండితుడు కానేకాదు.
(ఈ పద్య రత్నాలు అమూలకం పోతన స్వకీయం. “మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అమూలకం; పోతన స్వంత కృతి కనుక స్వకీయం; అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు, సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా” అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని, ఇక్కడ “అంధేదూదయముల్”, “కమలాక్షు నర్చించు”, “కంజాక్షునకు గాని”, “సంసార జీమూత” అనే నాలుగు పద్యాలలో వరసగా ప్రహ్లాదుని నోట పలికించా రనుకుంటాను.)