పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చిత్రకేతోపాఖ్యానము

  •  
  •  
  •  

6-444-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పరీక్షన్నరేంద్రుండు శుకయోగీంద్రు నడిగె" నని సూతుండు శౌనకాది మునులకుం జెప్పి, మఱియు "నిట్లనియె నట్టు గజపుర వల్ల భుండు సంప్రశ్నంబు చేసిన, బాదరాయణి హరిస్మరణ శ్రద్ధాపరుం డయి "తొల్లి కృష్ణద్వైపాయన నారద దేవల మహర్షులు నా కెఱింగించిన యితిహాసంబు గలదు; దాని నెఱింగించెద సావధానుండవై యాకర్ణింపు" మని యిట్లనియె.

టీకా:

అని = అని; పరీక్షత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; శుక = శుకుడు యనెడి; యోగి = యోగులలో; ఇంద్రున్ = శ్రేష్ఠుని; అడిగెన్ = అడిగెను; అని = అని; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆది = మొదలగు; మునుల్ = మునుల; కున్ = కు; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; గజపురవల్లభుండు = పరీక్షిత్తు {గజపుర వల్లభుడు - గజపురము (హస్తినా పురము)నకు వల్లభుడు (రాజు), పరీక్షిత్}; సంప్రశ్నంబు = చక్కగా యడుగుట; చేసినన్ = చేయగా; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని కొడుకు, శుకుడు}; హరి = నారాయణుని; స్మరణ = స్మరించుకొనుట యందు; శ్రద్ధాపరుండు = శ్రద్ధ గలవాడు; అయి = అయ్యి; తొల్లి = పూర్వము; కృష్ణద్వైపాయన = వ్యాసుడు; నారద = నారదుడు; దేవల = దేవలుడు యనెడి; మహర్షులు = మహా ఋషులు; నా = నా; కున్ = కు; ఎఱింగించిన = తెలిపిన; ఇతిహాసంబు = జరిగిన కథ; కలదు = ఉన్నది; దానిన్ = దానిని; ఎఱింగించెద = తెలిపెదను; సావధానుండవు = శ్రద్ధ గలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని పరీక్షిత్తు శుకమహర్షిని ప్రశ్నించాడు” అని చెప్పి సూతమహర్షి శౌనకాదులతో ఇంకా ఇలా అన్నాడు. “ఆ విధంగా హస్తినాపుర ప్రభువైన పరీక్షిత్తు ప్రశ్నించగా శుకమహర్షి శ్రద్ధాపూర్వకంగా శ్రీమన్నారాయణుని స్మరించి ఈ విధంగా చెప్పసాగాడు. “పూర్వం వేదవ్యాసుడు, నారదుడు దేవల మహర్షి నాకు చెప్పిన వృత్తాంతం ఒకటున్నది. దానిని నీకు వినిపిస్తాను. సావధానంగా విను” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.

6-445-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిత విభూతిఁ జాల నమరాధిపుఁ బోలుచు శూరసేన దే
ములకు భర్తయై ప్రజలు సంతస మందఁగ సార్వభౌముఁడై
క్ష దమ కెల్ల కాలమును గామ దుహంబుగఁ జిత్రకేతు నా
మునఁ బ్రసిద్ధి కెక్కె గుణమండనుఁ డంచిత కీర్తికాముఁడై.

టీకా:

అమిత = మిక్కిలి; విభూతిన్ = వైభవముతో; చాలన్ = అనేక రకములుగ; అమరాధిపున్ = ఇంద్రుని {అమరాధిపుడు - అమర (దేవతల)కు అధిపుడు (రాజు), ఇంద్రుడు}; పోలుచు = సరితూగుతు; శూరసేన = శూరసేన యనెడి; దేశముల్ = దేశముల; కున్ = కు; భర్త = రాజు; ఐ = అయ్యి; ప్రజలు = పౌరులు; సంతసమున్ = సంతోషమును; అందగన్ = పొందగా; సార్వభౌముడు = చక్రవర్తి; ఐ = అయ్యి; క్షమన్ = భూమి; తమ = తమ; కున్ = కు; ఎల్లకాలమును = ఎల్లప్పుడును; కామదుహంబుగన్ = కామధానువు కాగ; చిత్రకేతు = చిత్రకేతుడు యనెడి; నామమునన్ = పేరుతో; ప్రసిద్ధుడు = ప్రసిద్ధుడు; అయ్యెన్ = అయ్యెను; గుణ = సుగుణములు; మండనుడు = అలంకారముగా గలవాడు; అంచిత = పూజనీయమైన; కీర్తి = యశస్సు; కాముడు = కోరినవాడు; ఐ = అయ్యి.

భావము:

పూర్వం చిత్రకేతువనే మహారాజు అమితమైన ఐశ్వర్యంతో దేవేంద్రునితో సమానుడై, శూరసేన దేశాలకు అధిపతియై, సుగుణ భూషణుడై, యశోవిశాలుడై, ఎల్లవేళలా భూమి తన కోరిన కోరికలను తీరుస్తూ ఉండగా ప్రజారంజకంగా పరిపాలించేవాడు.

6-446-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిత తారుణ్య దనతురంగులు-
కందర్ప విజయైక డ్గలతలు
దన సమ్మోహన మంత్రాధి దేవతల్-
పంచశిలీముఖు బందెకత్తె
సమాస్త్రుఁ డఖిలంబు డకించు బొమ్మలు-
నాత్మసంభవుని కట్టాయితములు
పుండ్రేక్షుకోదండు భూరితేజంబులు-
శంబర విద్వేషి సాయకములు

6-446.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాగఁ బొలుపారు నొకకోటి లినముఖులు
నకుఁ బత్నులు గాఁగ నత్యంత విమల
కీర్తి వైభవ సన్మార్గర్తి యగుచు
గతిఁ బాలించుచుండె నా నవిభుండు.

టీకా:

మానిత = గౌరవింపబడిన; తారుణ్య = తరుణవయసు గల; మదన = మన్మథుని; తురంగులు = గుఱ్ఱములు; కందర్ప = మన్మథుని; విజయ = విజయమునకు; ఏక = ముఖ్యమైన; ఖడ్గ = కత్తుల; లతలు = వరుసలు; మదన = మన్మథుని; సంమోహన = మిక్కిలి మోహపరచెడి; మంత్ర = మంత్రములకు; అధిదేవతలు = అధిదేవతలు; పంచశిలీముఖు = మన్మథుని {పంచ శిలీముఖుడు - పంచ (ఐదు, 5) శిలీముఖములు (బాణములు) గలవాడు, మన్మథుడు}; బందెకత్తెలు = చెరసాలలోని స్త్రీలు; అసమాస్త్రుడు = మన్మథుడు; అఖిలంబు = సమస్తమును; అడకించు = అణచివేయుటకైన; బొమ్మలు = బొమ్మలు; ఆత్మసంభవుని = మన్మథుని {ఆత్మ సంభవుడు - ఆత్మలలో సంభవుడు (పుట్టువాడు), మన్మథుడు}; కట్టాయితములు = గట్టి సాధనములు; పుండ్రేక్షుకోదండు = మన్మథుడు {పుండ్రేక్షు కోదండుడు - పుండ్ర (నలుపు కలసిన ఎఱ్ఱ చెఱకు) ఇక్షు (చరకుగడ)ను కోదండుడు (విల్లుగా ధరించినవాడు, మన్మథుడు}; భూరి = అత్యధికమైన; తేజంబులున్ = తేజస్సులు; శంబరవిద్వేషి = మన్మథుని {శంబర విద్వేషి - శంబరాసురుని విద్వేషి (శత్రువు), మన్మథుడు}; సాయకములు = బాణములు;
నాగ = మిక్కిలి; పొలుపారున్ = చక్కనైన; ఒకకోటి = చాలా మంది, కోటి మంది (1,00,00,000); నలినముఖులు = అందగత్తెలు {నలిన ముఖులు - నలిన (పద్మములవంటి) ముఖులు (ముఖములు గలవారు), స్త్రీలు}; తన = తన; కున్ = కు; పత్నులు = భార్యలు; కాగన్ = అగునట్లు; అత్యంత = బహు మిక్కిల; విమల = స్వచ్ఛమైన; కీర్తి = యశస్సు; వైభవ = వైభవములతో; సత్ = మంచి; మార్గ = విధమైన; వర్తి = నడవడిక గలవాడు; అగుచున్ = అగుచు; జగతిన్ = లోకమును; పాలించుచుండెన్ = పరిపాలించు చుండెను; ఆ = ఆ; జనవిభుండు = రాజు చిత్రకేతు {జన విభుడు - జన (ప్రజలకు) విభుడు(ప్రభువు), రాజు}.

భావము:

మన్మథుని పందెపు గుఱ్ఱాలో, చిగురాకు బాకులో, విజయ పతాకలో, సమ్మోహన మంత్రాలో, ఎక్కుపెట్టిన పుష్పబాణాలో, అందాల ఆటబొమ్మలో అన్నట్లున్న చక్కని చుక్కలైన ఎంతోమంది భార్యలతో, అఖండ కీర్తివైభవంతో ఆ చిత్రకేతు మహారాజు రాజ్యం చేస్తున్నాడు.

6-447-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిమి వేవేలు భార్యలు లిగియుండఁ
రఁగ సంతతి యొక్కండుఁ డయ లేక
చిత్తమునఁ జాల బాయని చింత పొడమి
డలఁ జొచ్చెను వేసవి డువుఁ బోలె.

టీకా:

కలిమి = సంపదలు; వేవేలు = వేలకొలది; భార్యలున్ = భార్యలు; కలిగి = ఉండి; ఉండన్ = ఉండగా; పరగన్ = వర్తిల్లెడి; సంతతి = సంతానము; ఒక్కండున్ = ఒకడు కూడ; పడయన్ = పొందగా; లేక = లేకపోవుటచే; చిత్తమునన్ = మనసులో; చాలన్ = అధికమైన; పాయని = వదలని; చింత = బాధ; పొడమి = పొంది; బడలజొచ్చెన్ = చిక్కిపోచుండెను; వేసవి = వేసవికాలపు; మడువున్ = చెరువు; పోలెన్ = వలె.

భావము:

సిరిసంపదలు, వేలకొలది భార్యలున్నా ఆ చిత్రకేతు మహారాజుకు సంతానం లేదనే చింత తప్పలేదు. ఆ దిగులుతో అతడు ఎండాకాలపు చెరువు వలె క్షీణించిపోసాగాడు.

6-448-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూము సత్ప్రతాపము మరుత్పతిభోగము యౌవనంబు సం
దీపిత చారువర్తనము దిగ్విజయంబును సత్యమున్ జగ
ద్వ్యాపిత కీర్తియున్ సతులు వైభవముఖ్యములెల్ల మాన్పగా
నోక యుండె నా నృపతి నొందిన సంతతిలేని దుఃఖమున్.

టీకా:

రూపము = మంచి రూపము; సత్ = సత్యమైన; ప్రతాపము = పరాక్రమము; మరుత్పత్తి = ఇంద్రుని యొక్క {మరుత్పతి - మరుత్తుల(మరుద్గణముల) పతి(ప్రభువు), ఇంద్రుడు}; భోగము = భోగము; యౌవనంబు = యౌవనము; సందీపిత = ప్రకాశమానమైన; చారు = అందమైన; వర్తనము = ప్రవర్తన; దిగ్విజయంబునున్ = దిగ్విజయము; సత్యమున్ = నిజాయితీ; జగత్ = లోకమంతటను; వ్యాపిత = వ్యాపించిన; కీర్తియున్ = యశస్సు; సతులు = భార్యలు; వైభవ = వైభవములు; ముఖ్యములు = మొదలైనవి; ఎల్లన్ = అన్నియును; మాన్పగన్ = తగ్గించుటకు; ఓపక = సమర్థతలేక; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; నృపతి = రాజు; ఒందిన = పొందిన; సంతతి = సంతానము; లేని = లేనట్టి; దుఃఖమున్ = దుఃఖమును.

భావము:

చక్కని రూపం, సాటిలేని ప్రతాపం, దేవేంద్ర భోగం, నిండు యౌవనం, మంచి నడవడి, దిగ్విజయాలు, సత్యహృదయం, సువిశాల యశస్సు, ఎంతోమంది రాణులు, లెక్కలేనన్ని సంపదలు ఉన్నా ఇవేవీ ఆ మహారాజుకు సంతతి లేని లోటును తీర్చలేకపోయాయి.

6-449-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు, సంతతి లేక అతి దుఃఖమానసుండయిన యా నరేంద్రుని మందిరంబున కంగిరస మహాముని వచ్చి, యతనిచేత నతిధి సత్కారంబులు బడసి, కుశలం బడిగి "రాజ్యంబు భవద ధీనంబ కదా! పృథి వ్యప్తేజో వాయ్వాకాశ మహదహంకారంబు లనియెడి యేడింటిచేత రక్షింపంబడ్డ జీవుండునుం బోలె నమాత్య జనపద దుర్గ ద్రవిణ సంచయ దండ మిత్రంబు లనెడి సప్తప్రకృతులచేత రక్షితుండ వై, ప్రకృతి పురుషుల యందు భారంబు పెట్టి, రాజ్యసుఖంబు లనుభవింతువు గదా? మఱియు దార ప్రజా మాత్య భృత్య మంత్రి పౌర జానపద భూపాలురు నీకు వశవర్తులుగదా? సర్వంబునుం గలిఁగి సార్వభౌముండ వైన నీ వదనంబున విన్నఁదనంబు గలిగి యున్నయది; కతంబేమి?"యనిన నా మునిప్రవరునకు నతం డిట్లనియె; “మీ తపోబలంబున మీకు నెఱుంగరాని యదియుం గలదే?” యని తలవంచి యూరకున్న, నతని యభిప్రాయం బెఱింగి యా భగవంతుం డైన యంగిరసుండు దయాళుండై, పుత్రకామేష్టి వ్రేల్చి యజ్ఞశేషం బతని యగ్ర మహిషి యయిన కృతద్యుతి కిచ్చి "నీకుం బుత్రుండు గలిగెడి, నతని వలన సుఖదుఃఖంబు లనుభవింపగల"వని చెప్పి యమ్మహాత్ముండు చనియె; నా కృతద్యుతి యనుదేవి గర్భంబు ధరియించి, నవమాసంబులు నిండినం గుమారునిం గనియె; నా కాలంబున రాజును, సమస్త భృత్యామాత్య జనంబులుఁ బరమానందంబుఁ బొంది; రపుడు చిత్రకేతుండు కృతస్నానుండై, సకల భూషణ భూషితుండై, సుతునకు జాతకర్మంబు నిర్వర్తించి, బ్రాహ్మణులకు నపరిమిత హిరణ్య రజత దానంబులును, వస్త్రాభరణంబులును, గ్రామంబులును, గజంబులును, వాహనంబులును, ధేనువులును నాఱేసి యర్బుదంబుల ద్రవ్యంబును దానంబు చేసి, ప్రాణిసముదాయంబునకుం బర్జన్యుండునుం బోలెఁ దక్కిన వారలకు నిష్ఠకామంబులు వర్షించి, పరమానంద హృదయుండై యుండెఁ; గుమారుండును మాతృపితృ జనంబులకు సంతోషము చేయుచు, దినదినప్రవర్ధమానుండై పెరుగుచుండె; నంతం బుత్రమోహంబునం గృతద్యుతి యందు బద్ధానురాగుండై మహీధవుండు వర్తించుచుండం; దక్కిన భార్యలు సంతాన సంతోష వికలలై, యీ మోహంబునకుం గారణంబు పుత్రుండ యని యీర్ష్యం జేసి, దారుణ చిత్తలై, కుమారునకు విషం బిడిన సుఖనిద్రితుండునుం బోలె బాలుండు మృతి బొందె; నప్పుడు వేగుటయు దాది బోధింపం జని యా కుమారుని వికృతాకారంబుఁ జూచి, విస్మయ శోకభయార్త యై పుడమింబడి యాక్రందించె; నప్పుడు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సంతతి = సంతానము; లేక = లేకపోవుటచే; అతి = మిక్కిలి; దుఃఖ = దుఃఖమును చెందిన; మానసుండు = మనసు గలవాడు; అయిన = ఐనట్టి; ఆ = ఆ; నరేంద్రుని = రాజు చిత్రకేతుని {నరేంద్రుడు - నరులకు ఇంద్రుడు (ప్రభువు), రాడు}; మందిరంబున్ = నివాసమున; కున్ = కు; అంగిరస = అంగిరసుడు యనెడి; మహా = గొప్ప; ముని = ముని; వచ్చి = వచ్చి; అతని = అతని; చేతన్ = వలన; అతిథి = అతిథికి చేసెడి; సత్కారములు = గౌరవ మర్యాదలు; పడసి = పొంది; కుశలంబున్ = క్షేమసమాచారములు; అడిగి = అడిగి; రాజ్యంబున్ = రాజ్యాధికారము; భవత్ = నీ యొక్క; అధీనంబు = ఆధీనములో నున్నది; కదా = కదా; పృథ్వి = భూమి; అప్ = నీరు; తేజస్ = కాంతి; వాయుః = గాలి; ఆకాశ = ఆకాశము; మహత్ = మహతత్త్వము; అహంకారంబులు = అహంకారములు; అనియెడి = అనెడి; ఏడింటి = ఏడింటి (7) {సప్తప్రకృతులు - 1పృథివి 2అప్పు 3తేజస్ 4వాయుః 5ఆకాశః 6మహత్ 7అహంకారములు}; చేతన్ = వలన; రక్షింపంబడ్డ = పాలింపబడెడి; జీవుండునున్ = మానవుని; పోలెన్ = వలె; అమాత్య = అమాత్యులు; జనపద = ఊళ్ళు; దుర్గ = కోటలు; ద్రవిణ = ధనము; సంచయ = వస్తు సంపదలు; దండ = దండనము; మిత్రంబులు = స్నేహములు; అనెడి = అనెడి; సప్త = ఏడు (7) {సప్తప్రకృతులు - 1అమాత్యులు 2జనపద 3దుర్గ 4ద్రవిణ 5సంచయ 6దండ 7మిత్రములు}; ప్రకృతుల్ = ప్రకృతుల; చేతన్ = వలన; రక్షితుండవు = కాపాడబడెడి వాడవు; ఐ = అయ్యి; ప్రకృతి = ప్రకృతి; పురుషుల = పురుషుల; అందున్ = అందు; భారంబున్ = బాధ్యతలను; పెట్టి = అప్పగించి; రాజ్య = రాజ్యాధికారమువలన కలిగెడి; సుఖంబులన్ = సౌఖ్యములను; అనుభవింతువు = అనుభవించు తుంటివి; కదా = కదా; మఱియున్ = ఇంకను; దార = భార్యలు; ప్రజ = ప్రజలు; అమాత్య = పురోహితులు; భృత్య = సేవకులు; మంత్రి = మంత్రులు; పౌర = పౌరులు; జానపద = ఊళ్ళు; భూపాలురు = సామంతులు; నీ = నీ; కున్ = కు; వశవర్తులు = వశములో తిరిగెడివారు; కదా = కదా; సర్వంబు = సమస్తమును; కలిగి = ఉన్నను; సార్వభౌముండవు = చక్రవర్తివి; ఐన = అయినట్టి; నీ = నీ యొక్క; వదనంబునన్ = ముఖమున; విన్నదనంబు = చిన్నబోవుట; కలిగి = కలిగి; ఉన్నయది = ఉన్నది; కతంబు = కారణము; ఏమి = ఎందులకు; అనినన్ = అనగా; ముని = మునులలో; ప్రవరున్ = ఉత్తమున; కున్ = కు; అతండు = అతడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మీ = మీ యొక్క; తపస్ = తపస్సు యొక్క; బలంబునన్ = బలమున; మీ = మీ; కున్ = మీకు; ఎఱుంగరాని = తెలియని; అదియున్ = అట్టిది; కలదే = ఉన్నదా ఏమి; అని = అని; తలవంచి = తలవంచుకొని; ఊరకున్న = ఊరకుండగా; అతని = అతని; అభిప్రాయంబున్ = ఉద్దేశ్యము; ఎఱింగి = తెలిసి; ఆ = ఆ; భగవంతుండు = మహిమాన్వితుండు; ఐన = అయినట్టి; అంగిరసుండు = అంగిరసుడు; దయాళుండు = కృపామయుడు; ఐ = అయ్యి; పుత్రకామేష్టి = పుత్రకామేష్టి అనెడి యాగము; వ్రేల్చి = నిర్వహించి; యజ్ఞశేషంబు = యజ్ఞప్రసాదము; అతని = అతని యొక్క; అగ్ర = పెద్ద; మహిషి = భార్య; అయిన = ఐనట్టి; కృతద్యుతి = కృతద్యుతి; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; నీ = నీ; కున్ = కు; పుత్రుండు = కుమారుడు; కలిగెడిన్ = కలుగును; అతని = అతని; వలన = మూలమున; సుఖ = సుఖములు; దుఃఖంబులన్ = దుఃఖములను; అనుభవింపగలవు = అనుభవించెదవు; అని = అని; చెప్పి = చెప్పి; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; చనియె = వెళ్ళను; ఆ = ఆ; కృతద్యుతి = కృతద్యుతి; అను = అనెడి; దేవి = స్త్రీ; గర్భంబున్ = గర్భమును; ధరియించి = ధరించి; నవ = తొమ్మిది (9); మాసంబులున్ = నెలలు; నిండినన్ = నిండగా; కుమారునిన్ = పుత్రునికి; కనియెన్ = జన్మనిచ్చెను; ఆ = ఆ; కాలంబునన్ = సమయములో; రాజునున్ = రాజు; సమస్త = సమస్తమైన; భృత్య = సేవకులు; అమాత్య = పురోహితులు; జనంబులున్ = ప్రజలు; పరమానందంబున్ = మిక్కిలి ఆనందమును; పొందిరి = పొందిరి; అపుడు = అప్పుడు; చిత్రకేతుండు = చిత్రకేతుడు; కృతస్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; సకల = సర్వ; భూషణ = అలంకారములతోను; భూషితుండు = అలంకరింపబడినవాడు; ఐ = అయ్యి; సుతున్ = పుత్రున; కున్ = కు; జాతకర్మంబు = పుట్టినప్పుడు చేసెడి క్రియ {షోడశకర్మలు - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాసనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తనము 15వివాహము 16అంత్యకర్మము}; నిర్వర్తించి = చేయించి; బ్రాహ్మణుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; అపరిమిత = లెక్కలేనంత; హిరణ్య = బంగారము; రజత = వెండి; దానంబులునున్ = దానములు; వస్త్ర = బట్టలు; ఆభరణంబులును = భూషణములు; గ్రామంబులునున్ = ఊళ్లు; గజంబులునున్ = ఏనుగులు; వాహనంబులునున్ = వాహనములు; ధేనువులునున్ = గోవులు; ఆఱేసి = ఆరేసి (6) చొప్పున; అర్బుదంబులు = వేయికోట్ల (1 తరువాత 10 సున్నాలు); ద్రవ్యంబును = ధనమును; దానంబుచేసి = దానముగా ఇచ్చి; ప్రాణి = జీవ; సముదాయంబున్ = జాలమున; కున్ = కు; పర్జన్యుండును = వర్షాధిదేవత, మేఘుడు; పోలెన్ = వలె; తక్కిన = మిగిలిన; వారల్ = వారి; కున్ = కిని; ఇష్ట = కోరిన; కామంబులున్ = కోరికలను; వర్షించి = ఎక్కువగా యిచ్చి; పరమానందంబున్ = మిక్కిలి ఆనందమును చెందిన; హృదయుండు = హృదయము గలవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; కుమారుండును = పుత్రుడు కూడ; మాతృ = తల్లి; పితృ = తండ్రి; జనంబుల్ = ప్రజల; కున్ = కు; సంతోషము = సంతోషమును; చేయుచున్ = కలుగజేయుచు; దినదిన = దినమువారి; ప్రవర్థమానుండు = వృద్ధి పొందుతున్నవాడు; ఐ = అయ్యి; పెరుగుచుండెన్ = పెరుగుచుండెను; అంతన్ = అంతట; పుత్ర = కొడుకు నందలి; మోహంబునన్ = మోహమువలన; కృతద్యుతి = కృతద్యుతి; అందున్ = ఎడల; బద్ధానురాగుండు = మిక్కిలి ప్రేమ గలవాడు; ఐ = అయ్యి; మహీధవుండు = రాజు చిత్రకేతువు {మహీధవుడు - మహి (భూమికి) ధవుడు (ప్రభువు), రాజు}; వర్తించుచుండన్ = తిరుగుతుండగా; తక్కిన = మిగిలిన; భార్యలున్ = భార్యలు; సంతాన = సంతాన ముండుట వలని; సంతోష = సంతోషము; వికలలు = విచ్ఛేదము చెందినవారు; ఐ = అయ్యి; ఈ = ఈ; మోహంబున్ = మోహము; కున్ = కు; కారణంబున్ = మూలము; పుత్రుండ = కుమారుడే; అని = అని; ఈర్ష్యన్ = ఈర్ష్య; చేసి = వలన; దారుణ = భయంకరమైన; చిత్తలు = మనసులు గలవారు; ఐ = అయ్యి; కుమారున్ = పుత్రుని; కున్ = కి; విషంబున్ = విషమునప; ఇడినన్ = ఇవ్వగా; సుఖ = సుఖముగ; నిద్రితుండునున్ = నిద్రించెడివాని; పోలెన్ = వలె; బాలుండు = పిల్లవాడు; మృతిన్ = మరణమును; పొందెన్ = పొందెను; అప్పుడు = అప్పుడు; వేగుటయున్ = తెల్లవారుతుండగా; దాది = సేవకురాలు; బోధింపన్ = నిద్రలేపుటకు; చని = వెళ్ళి; ఆ = ఆ; కుమారునిన్ = పుత్రుని; వికృత = వికృతమైన; ఆకారంబున్ = స్వరూపమును; చూచి = చూసి; విస్మయ = ఆశ్చర్యము; శోక = దుఃఖము; భయ = భయము; ఆర్త = బాధలు కలది; ఐ = అయ్యి; పుడమిన్ = నేలపై; పడి = పడిపోయి; ఆక్రందించెన్ = ఏడ్చెను; అప్పుడు = అప్పుడు.

భావము:

ఈ విధంగా సంతానం లేక మిక్కిలి చింతాక్రాంతుడై ఉన్న ఆ రాజు చిత్రకేతుడు మందిరానికి ఒకనాడు అంగిరసుడనే మహాముని వచ్చాడు. చిత్రకేతుడు అతనికి అర్ఘ్య పాద్యాదులతో అతిథి సత్కార్యాలు చేసాడు. ఆ మునీంద్రుడు రాజును కుశలం అడుగుతూ ఇలా అన్నాడు “రాజా! నీ రాజ్యమంతా నీ అధీనంలో ఉన్నది కదా! పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, మహత్తు, అహంకారం అనే ఏడింటి చేత జీవుడు రక్షింపబడుతున్నట్లు ప్రభువైన నీవు అమాత్యులు, జానపదులు, దుర్గం, కోశం, వస్తుసంపద, దండనం, మిత్రులు అనే సప్తాంగాల చేత సురక్షితంగా ఉన్నావు కదా! నీ రాజ్యభారాన్ని నీ మంత్రులపై ఉంచి నీవు రాజభోగాలను అనుభవిస్తున్నావు కదా! నీ భార్యాపుత్రులు, సామంతరాజులు అందరూ నీకు వశవర్తులై నీవు చెప్పినట్లు నడచుకొంటున్నారు కదా! సర్వ సంపదలతో తులతూగే సార్వభౌముడవైన నీ ముఖం ఈ విధంగా చింతాక్రాంతమై ఉండటానికి కారణమేమిటి?” అని ప్రశ్నించగా చిత్రకేతుడు “మహానుభావా! మీరు తపస్సంపన్నులు. మీకు తెలియరానిది ఏముంటుంది?” అని తలవంచి మౌనం వహించాడు. సర్వజ్ఞుడైన అంగిరసుడు మహారాజు అభిప్రాయాన్ని గ్రహించి దయతో అతని చేత పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించాడు. ఆ యజ్ఞశేషాన్ని రాజుగారి పెద్ద భార్య అయిన కృతద్యుతికి అనుగ్రహించి “నీకు కుమారుడు జన్మిస్తాడు. అతని వల్ల నీవు సుఖదుఃఖాలను అనుభవిస్తావు” అని చెప్పి వెళ్ళిపోయాడు. కృతద్యుతి గర్భం ధరించి నవమాసాలు నిండిన తరువాత కుమారుణ్ణి కన్నది. మహారాజు, మంత్రులు, సేవకులు, ప్రజలు అందరూ ఎంతో ఆనందించారు. చిత్రకేతుడు స్నానం చేసి సకలాభరణాలు అలంకరించుకొని పుత్రునికి జాతకర్మ మహోత్సవం నిర్వర్తించాడు. బ్రాహ్మణులకు అపరిమితంగా బంగారం, వెండి, నూతన వస్త్రాలు, ఆభరణాలు, గ్రామాలు, ఏనుగులు, వాహనాలు, గోవులను పంచిపెట్టాడు. అంతేకాక ఒక్కొక్కరికి ఆరేసి అర్బుదాల చొప్పున ద్రవ్యాన్ని దానం చేసాడు. ప్రాణి సముదాయానికి వర్షాధినేత అయిన పర్జన్యుడు వలె ఆ మహారాజు తన రాజ్యంలోని ప్రజలకు కోరిన కోరికలు తీర్చి పరమానంద భరితుడయ్యాడు. రాజకుమారుడు తల్లిదండ్రులకు, బంధువులకు సంతోషాన్ని సమకూరుస్తూ దినదిన ప్రవర్ధమాను డౌతున్నాడు. చిత్రకేతు మహారాజు తన కుమారుని మీది వ్యామోహంతో పట్టపురాణి అయిన కృతద్యుతి పట్ల బద్ధానురాగుడై ఉండటం మిగిలిన భార్యలు సహించలేక పోయారు. మహారాజు తమకు దూరం కావటానికి కారణం ఈ కుమారుడే కదా అని భావించి ఈర్ష్యతో నిండిన కర్కశ హృదయాలతో వారు అతనికి విషప్రయోగం చేశారు. పిల్లవాడు నిద్రించినవాడు నిద్రించినట్లే మరణించాడు. ఉదయాన నిద్ర లేపుదామని వెళ్ళిన దాసికి మంచంమీద రాజకుమారుని శవం కనిపించింది. ఆ వికృత దృశ్యాన్ని చూచి దాసి ఆశ్చర్యంతో. దుఃఖంతో, భయంతో క్రిందపడి దొర్లుతూ పెద్దగా ఏడ్చింది. అప్పుడు...

6-450-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుమి నిట్టక నిల్వునం బడి పొక్కుచుం గడు దీన యై
డఁకు వేమియు లేని వాక్కుల నావు రంచు విలాపమం
దెరు దోఁప భృశాతురోన్నతి నేడ్చినన్ విని భీతితోఁ
డుపు బిట్టవియంగ భూపతి కాంత గ్రక్కున నేగుచున్.

టీకా:

పుడమిన్ = నేలపై; నిట్టకనిల్వునన్ = నిట్టనిలువుగా; పడి = పడిపోయి; పొక్కుచున్ = దుఃఖించుచు; కడు = మిక్కిలి; దీన = దీనమైనది; ఐ = అయ్యి; అడకువ = అణకువ; ఏమియున్ = ఏమియును; లేని = లేనట్టి; వాక్కులన్ = పలుకులతో; ఆవురంచున్ = ఆవురుమని బొబ్బలపెడుతూ; విలాపము = ఏడ్చుట; అందున్ = లో; ఎడరు = ఆపద; తోపన్ = తోచగా; భృశ = మిక్కిలి; ఆతుర = ఆతృత యొక్క; ఉన్నతిన్ = అధిక్యముతో; ఏడ్చినన్ = ఏడువగా; విని = విని; భీతి = భయము; తోన్ = తోటి; కడుపు = కడుపు; బిట్టు = మిక్కిలి; అవియంగన్ = అవిసిపోవునట్లు; భూపతికాంత = రాణి {భూపతి కాంత - భూ (భూమికి) పతి (ప్రభువు యొక్క) కాంత (భార్య), రాణి}; క్రక్కునన్ = శ్రీఘ్రముగా; ఏగుచున్ = వెళుతూ;

భావము:

నిట్ట నిలువుగా నేలమీద పడి దీనురాలి వలె నోట మాట రాక గొంతెత్తి బావురు మంటూ ఏడుస్తున్న ఆ దాది కేకలు విని భయవిహ్వలయై చిత్రకేతుని పట్టపు రాణి కృతద్యుతి పరుగెత్తుకొని అక్కడికి వచ్చింది.

6-451-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాలుఁ డొక్కరుండు రిణామశీలుండు
వంశకర్త తపసి రము వలనఁ
బుట్టి మిన్న కట్లు పొలిసి యున్నట్టి యా
కొడుకుఁ జూచి తల్లి లఁ జొచ్చె

టీకా:

బాలుడు = పిల్లవాడు; ఒక్కరుండు = ఒకడు; పరిణామశీలుండు = పెరుగుతున్నవాడు; వంశకర్త = వంశమును నిలబెట్టువాడు; తపసి = ముని యొక్క; వరము = వరము; వలనన్ = వలన; పుట్టి = పుట్టి; మిన్నక = మాట్లాడక; అట్లు = ఆ విధముగ; పొలిసి = చనిపోయి; ఉన్నట్టి = ఉన్నట్టి; ఆ = ఆ; కొడుకున్ = పుత్రుని; చూచి = చూసి; తల్లి = తల్లి; అడలన్ = తల్లడిల్ల; చొచ్చెన్ = తొడగెను.

భావము:

ఒక్కగానొక్క కుమారుడు, పెరిగి పెద్దవుతున్నవాడు, వంశోద్ధారకుడు, మహర్షి వరంవల్ల జన్మించినవాడు ఈ విధంగా మరణించి ఉండడం చూచి తల్లి గుండె తల్లడిల్లగా పెద్దగా శోకించసాగింది.

6-452-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుంకుమరాగ రమ్య కుచకుంభములం గడుఁ గజ్జలంబుతోఁ
బంకిలమైన బాష్పముల పాల్పడ మజ్జన మాచరించుచుం
గంణపాణి పల్లవయుగంబున వక్షము మోఁదికొంచు నా
పంరుహాక్షి యేడ్చెఁ బరిభావిత పంచమ సుస్వరంబునన్.

టీకా:

కుంకుమ = కుంకుమ యొక్క; రాగ = రంగుచే; రమ్య = అందముచెందినట్టి; కుచ = స్తనములు యనెడి; కుంభములన్ = కుంభములు; కడు = మిక్కిలి; కజ్జలంబు = కాటుక; తోన్ = తోటి; పంకిలము = బురద; ఐన = అయినట్టి; బాష్పములన్ = కన్నీటికి; పాల్పడన్ = పాల్పడినట్లు; మజ్జనము = స్నానము; ఆచరించుచున్ = చేయుచుండగ; కంకణ = కంకణములు ధరించిన; పాణి = చేతులు యనెడి; పల్లవ = చిగురుల; యుగంబునన్ = జంటతో; వక్షమున్ = వక్షస్థలమును; మోదికొంచున్ = బాదుకొనుచూ; ఆ = ఆ; పంకరుహాక్షి = స్త్రీ {పంకరుహాక్షి - పంకరుహము(పద్మము) వంటి అక్షి(కన్నులు గలామె), స్త్రీ}; ఏడ్చెన్ = ఆక్రందించెను; పరిభావిత = భంగపాటుతో; సు = చక్కటి; స్వరంబునన్ = గొంతుతో.

భావము:

కుంకుమ పూతతో ఎఱ్ఱనై మిక్కిలి చక్కని వక్షోజాలు కాటుక కన్నీళ్ళతో తడిసి పంకిలం కాగా కృతద్యుతి కంకణాలు ఘల్లుఘల్లుమని మ్రోగగా చిగురాకులవంటి చేతులతో రొమ్ము బాదుకుంటూ కోకిల కంఠస్వరంతో గొంతెత్తి గోడుగోడున ఏడ్చింది.

6-453-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యార్తరవమునకు భూ
నాకుఁడు భయంబు నొంది య ముడిగి సుతున్
డాయఁగ వేగంబునఁ జని
పాని మోహంబు తోడ బాలుని మీఁదన్.

టీకా:

ఆ = ఆ; ఆర్తా = దుఃఖపూరిత, బాధాపూరిత; రావమున్ = శబ్దమున; కున్ = కు; భూనాయకుడు = రాజు {భూనాయకుడు - భూమి (రాజ్యమువ)కు నాయకుడు, రాజు}; భయంబునున్ = భయమును; ఒంది = పొంది; నయము = వశము; ఉడిగి = తప్పి; సుతున్ = పుత్రుని; డాయగన్ = చేర; వేగంబునన్ = తొందరగా; చని = వెళ్లి; పాయని = విడువని; మోహంబు = మోహము; తోడన్ = తోటి; బాలుని = పిల్లవాని; మీదన్ = పైన.

భావము:

ఆమె ఆర్తనాదాన్ని విని మహారాజు భయపడి, వశం తప్పినవాడై కొడుకు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చి మోహంతో ఆ శవం మీద....

6-454-స్రగ్వి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వ్రాలి యో పుత్ర! నీ వార్త దంభోళియై
కూలఁగా వ్రేయ కీ కొల్ది నన్నేటికిన్
జాలి నొందించె? నా జాడ యింకెట్టిదో?
తూలు మీ తల్లికిన్ దుఃఖ మెట్లాఱునో?"

టీకా:

వ్రాలి = పడిపోయి; ఓ = ఓ; పుత్రా = కొడుకా; నీ = నీ యొక్క; వార్త = సమాచారము; దంభోళి = పిడుగుపాటు; ఐ = అయ్యి; కూలగావ్రేయక = కూలదోయకుండగ; ఈ = ఇంత; కొల్ది = మాత్రమునకు; నన్నున్ = నన్ను; ఏటికిన్ = ఎందులకు; జాలిన్ = విచారమును; ఒందించెన్ = చెందించెను; నా = నా యొక్క; జాడ = దారి; ఇంక = ఇంకను; ఎట్టిదో = ఎలాగ యున్నదో; తూలు = చలించిపోవుచున్న; మీ = మీ యొక్క; తల్లి = తల్లి; కిన్ = కి; దుఃఖమున్ = శోకము; ఎట్లు = ఏ విధముగ; ఆఱునో = తగ్గునో.

భావము:

(చిత్రకేతుడు కొడుకు శవం మీద) పడి “నాయనా! పిడుగువంటి నీ మరణవార్త ఒక్కసారిగా నన్ను కూల్చి వేయకుండా ఎందుకు బ్రతికించింది? నా గతి ఏమిటి? నీ కన్నతల్లి దుఃఖం ఎట్లా చల్లారుతుంది?”

6-455-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని తలమొల యెఱుంగక పలవించుచు, భృత్యామాత్య బంధుజనంబులం గూడి యడలుచు నున్న యా రాజు దుఃఖం బెఱింగి, యంగిరసుండు నారదునితోడం గూడి చనుదెంచి, మృతుండైన పుత్రుని పదతలంబున మృతుండునుం బోలెఁ బడియున్న యా రాజుం గనుంగొని, యిట్లనియె

టీకా:

అని = అంటూ; తలమొలయెఱుంగక = తుది మొదలు తెలియకుండా, అంతులేకుండా; పలవించుచు = దుఃఖిస్తూ; భృత్య = సేవకులు; అమాత్య = మంత్రులు; బంధుజనంబులన్ = బంధువు లందరితో; కూడి = కలిసి; అడలుచున్ = రోదిస్తూ; ఉన్న = ఉన్నట్టి; ఆ = ఈ; రాజు = ఏలిక; దుఃఖంబు = దుఃఖమును; ఎఱింగి = తెలిసి; అంగిరసుండు = ముని అంగిరసుడు; నారదుని = నారదమునీశ్వరుని; తోడన్+కూడి = తోసహా; చనుదెంచి = వచ్చి; మృతుండు = మరణించినవాడు; ఐన = అయిన; పుత్రుని = కొడుకు; పద = కాళ్ళ; తలంబున = ప్రాంతమున; మృతుండునున్ = మరణించినవాని; పోలెన్ = వలె; పడియున్న = కూలబడి ఉన్నట్టి; యా; రాజున్ = నరేంద్రుని; కనుంగొని = చూసి; యిట్లు = ఇలా; అనియె = చెప్పెను.

భావము:

అని అంతూపొంతూ లేకుండా దుఃఖిస్తూ సేవకులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ఆక్రోశిస్తున్న మహారాజు శోకవృత్తాంతాన్ని తెలుసుకొని అంగిరసుడు నారదునితో పాటు వచ్చి మరణించిన కుమారుని కాళ్ళ దగ్గర నిశ్చేష్టుడై కూలబడి ఉన్న చిత్రకేతును చూచి ఇలా అన్నాడు.

6-456-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీకు వీఁ డెవ్వడు? నీ వెవ్వనికి శోక-
సంతాప మందెదు? సార్వభౌమ!
పుత్ర మిత్రాదులు పూర్వజన్మంబున-
నెవ్వని వారలో యెఱుఁగఁ గలవె?
మొదల నదీవేగమున నాడ కాడకు-
సికతంబు గూడుచుఁ జెదరుచుండు;
నారీతిఁ బ్రాణుల తికాల గతిచేతఁ-
బుట్టుట చచ్చుట పొసగుచుండుఁ;

6-456.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గాన భూతములకుఁ లుగు భూతంబులు
మత తోడ విష్ణుమాయఁ జేసి
దీని కడల నేల? ధృతిఁ దూలఁగా నేల?
బుద్ధిఁ దలఁప వలదె? భూత సృష్టి.

టీకా:

నీ = నీ; కున్ = కు; వీడు = ఇతడు; ఎవ్వడు = ఎవడు; నీవున్ = నీవు; ఎవ్వని = ఎవని; కిన్ = కై; శోక = దుఃఖము; సంతాపమున్ = మిక్కిలి బాధను; అందెదు = చెందెదవు; సార్వభౌమ = చక్రవర్తి {సార్వభౌముడు - సర్వ భూములకు ప్రభువు, చక్రవర్తి}; పుత్ర = కొడుకులు; మిత్ర = స్నేహితులు; ఆదులు = మొదలగువారు; పూర్వ = ఇంతకు ముందటి; జన్మంబునన్ = జన్మలలో; ఎవ్వని = ఎవనికి; వారలో = చెందినవారో; ఎఱుంగన్ = తెలియ; కలవె = సమర్థుడవా ఏమి; మొదలన్ = ముందర; నదీ = నది యొక్క; వేగమునన్ = వడివలన; ఆడకాడకు = అక్కడికక్కడ; సికతంబున్ = ఇసుక; కూడుచుండున్ = మేటవేయును; చెదురుచుండున్ = చెదిరిపోవుచుండును; ఆ = ఆ; రీతిన్ = విధముగ; ప్రాణుల్ = జీవుల; కున్ = కి; అతి = తీవ్రమైన; కాల = కాలము యొక్క; గతి = వేగమువలన; పుట్టుట = జన్మించుట; చచ్చుట = మరణించుట; పొసగుచున్ = సంభవించుచు; ఉండున్ = ఉండును; కాన = కావున;
భూతముల్ = జీవుల; కున్ = కు; కలుగు = పుట్టును; భూతంబులున్ = జీవులు; మమత = ఆపేక్ష; తోడన్ = తోటి; విష్ణు = నారాయణుని; మాయన్ = మాయ; చేసి = వలన; దీని = ఇంతోటిదాని; కిన్ = కోసము; అడలన్ = దుఃఖించుట; ఏల = ఎందులకు; ధృతిన్ = ధైర్యమును; తూలగాన్ = తొలగించుకొనుట; ఏలన్ = ఎందులకు; బుద్ధిన్ = బుద్ధితో; తలపన్ = ఆలోచించుకొన; వలదే = వద్దా ఏమి; భూత = జీవ; సృష్టిన్ = సృష్టిని;

భావము:

“సార్వభౌమా! నీకు వీనికి సంబంధమేమిటి? ఇతడు నీకు ఏమౌతాడని ఇతనికోసం నీవు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు, మిత్రులు మొదలైన మొదలైన వారంతా పూర్వజన్మలో ఎవరికి మిత్రులో నీకు తెలుసా? నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకొని పోతూ అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా కలుస్తూ మళ్ళీ చెదరిపోతుంటాయి. అదే విధంగా ప్రాణులు కాలప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారు. పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ ఉంటారు. దేహధారులకు జనన మరణాలు తప్పవు. ఇదంతా భగవంతుని మాయా విలాసం. ఆ మాయవల్లనే జీవులకు జీవులు జన్మిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విషయంలో దైన్యం పొందడం కాని, ధైర్యం కోల్పోవడం కాని సముచితం కాదు. ఈ సృష్టి రహస్యాన్ని గుర్తించు.

6-457-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నేము, నీవును దక్కినవారలును బ్రవర్తమాన కాలంబునం గలిగిన జన్మంబు నొంది, మృత్యువువలన విరామంబు నొందంగల వారమై యిపుడ లేకపోవుదము; చావు పుట్టువులకు నిక్కువంబు లేదు; ఈశ్వరుండు దన మాయచేత భూతజాలంబుల వలన భూతంబులం బుట్టించు, వాని నా భూతంబులచేతన రక్షించు; వాని నా భూతంబులచేతన హరించు; స్వతంత్రంబు లేని తన సృష్టిచేత బాలుండునుం బోలె నపేక్షలేక యుండు; దేహి యైన పితృదేహంబు చేత దేహి యైన పుత్రదేహంబు మాతృదేహంబు వలనం గలుగుచుండు నా ప్రకారంబున బీజంబు వలన బీజంబు పుట్టుచుండు; దేహికి నివి శాశ్వతంబై జరుగుచు నుండు; పూర్వకాలంబున సామాన్య విశేషంబులు సన్మాత్రంబైన వస్తువులం దే విధంబునం గల్పింపంబడియె నా ప్రకారాంబున దేహంబునకు జీవునకు నన్యోన్య విభాగంబు పూర్వకాలంబున నజ్ఞాన కల్పితం బయ్యె; జన్మఫలంబులను జూచుచున్నవారికి దహనక్రియల నగ్ని పెక్కురూపంబులం గానంబడు భంగి, నొక్కండైన జీవుండు పెక్కు భంగుల వెలుంగుచుండు; నివి యన్నియు నాత్మజ్ఞానంబు చాలక దేహిదేహ సంయోగంబున స్వప్నంబునందు భయావహం బైన ప్రయోజనంబు నడుపుచుండి, మేల్కాంచి, యా స్వప్నార్థంబైన ప్రయోజనంబు తనదిగాదని యెఱుంగు భంగి, జీవుండే తానని జ్ఞానగోచరుండైన వాఁడెఱుంగుం గావున; నన్నియును మనోమాత్రం బని తెలిసి, మోహతమంబు వాసి, భగవంతుండైన వాసుదేవుని యందుఁ జిత్తంబు పెట్టి, నిర్మలాత్మకుండ వగు" మని బోధించినఁ జిత్రకేతుండు లేచి వారల కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; ఏము = మేము; నీవునున్ = నీవు; తక్కిన = మిగిలిన; వారలును = వారుకూడ; ప్రవర్తమాన = వర్తమానపు; కాలంబునన్ = కాలములో; కలిగినన్ = సంభవించిన; జన్మంబునన్ = పుట్టుకలను; ఒంది = పొంది; మృత్యువు = మరణము; వలనన్ = వలన; విరామంబు = ఎడబాటును; ఒందంగల = పొందబోవు; వారము = వారిమే; ఐ = అయ్యి; ఇపుడ = ఇప్పుడే; లేక = లేకుండగా; పోవుదము = పోయెదము; చావు = మరణము; పుట్టువుల్ = జన్మముల; కున్ = కు; నిక్కువంబు = సత్యము; లేదు = లేదు; ఈశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; భూత = జీవ; జాలంబుల = సమూహముల; వలనన్ = వలన; భూతంబులన్ = జీవులను; పుట్టించున్ = పుట్టించును; వానిన్ = వాటిని; ఆ = ఆ; భూతంబుల్ = జీవుల; చేతన = వలననే; రక్షించున్ = కాపాడును; వానిన్ = వాటిని; ఆ = ఆ; భూతంబుల = జీవుల; చేతన = వలననే; హరించున్ = సంహరించును; స్వతంత్రంబు = స్వాతంత్ర్యము; లేని = లేనట్టి; తన = తన యొక్క; సృష్టి = సృష్టి; చేత = వలన; బాలుండున్ = పిల్లవాని; పోలెన్ = వలె; ఆపేక్ష = ఆసక్తి; లేక = లేకుండగా; ఉండున్ = ఉండును; దేహి = దేహధారి; ఐన = అయినట్టి; పితృ = తండ్రి యొక్క; దేహంబు = శరీరము; చేత = వలన; దేహి = శరీరము గలవాడు, జీవుడు; ఐన = అయినట్టి; పుత్ర = కొడుకు; దేహంబున్ = శరీరమును; మాతృ = తల్లి యొక్క; దేహంబు = శరీరము; వలనన్ = వలన; కలుగుచుండు = పుట్టుచుండును; ఆ = ఆ; ప్రకారంబునన్ = విధముగ; బీజంబు = విత్తు; వలనన్ = వలన; బీజంబు = విత్తు; పుట్టుచుండు = పుట్టుచుండును; దేహి = దేహము ధరించువాని; కిన్ = కి; ఇవి = ఇట్టివి; శాశ్వతంబు = ఎల్లప్పుడును నుండునవి; ఐ = అయ్యి; జరుగుచున్ = జరుగుచు; ఉండున్ = ఉండును; పూర్వ = ఇంతకు ముందటి; కాలంబునన్ = కాలములో; సామాన్య = సామాన్యమైన; విశేషంబులు = విశిష్టతలు; సత్ = అస్థిత్వ; మాత్రంబు = మాత్రమే; ఐన = అయినట్టి; వస్తువులన్ = వస్తువుల; అందున్ = అందు; ఏ = ఏ; విధంబునన్ = విధముగానైతే; కల్పింపబడియెన్ = ఏర్పరుపబడెనో; ఆ = ఆ; ప్రాకారంబునన్ = విధముగ; దేహంబున్ = శరీరమున; కున్ = కు; జీవున్ = జీవుని; కున్ = కి; అన్యోన్య = ఒకదానికొకటి; విభాగంబున్ = పంపకమును; పూర్వ = పూర్వపు; కాలంబునన్ = కాలమునందే; అజ్ఞాన = అజ్ఞానముచేత; కల్పితంబు = ఏర్పరుపబడినవి; అయ్యెన్ = అయ్యెను; జన్మ = పుట్టుకలలోని; ఫలంబులన్ = ఫలితములను; చూచుచున్న = చూచుచున్నట్టి; వారి = వారి; కిన్ = కి; దహన = మందెడి; క్రియలన్ = విధానములను బట్టి; అగ్ని = అగ్ని; పెక్కు = అనేకమైన; రూపంబులన్ = రూపములలో; కానంబడు = కనబడెడి; భంగిన్ = విధముగ; ఒక్కండు = ఒకడే; ఐన = అయినట్టి; జీవుండు = ప్రాణి; పెక్కు = అనేకమైన; భంగులన్ = విధములుగా; వెలుంగుచుండున్ = ప్రకాశించుచుండును; ఇవి = ఇది; అన్నియున్ = అంతయు; ఆత్మ = ఆత్మ యొక్త; జ్ఞానంబు = విజ్ఞానము; చాలక = తెలియక; దేహి = జీవుని; దేహ = దేహపు; సంయోగంబునన్ = కలిసిపోవుటవలన; స్వప్నంబున్ = కల; అందున్ = లో; భయ = భయము; ఆవహంబు = కలిగించెడిది; ఐన = అయినట్టి; ప్రయోజనంబున్ = వ్యవహారమును; నడపుచుండి = నిర్వహించుచు; మేల్కాంచి = మెలుకువలోకి వచ్చి; ఆ = ఆ; స్వప్న = కలలోని; అర్థంబు = విషయము; ఐన = అయినట్టి; ప్రయోజనంబున్ = వ్యవహారమును; తనది = తనకు చెందినది; కాదు = కాదు; అని = అని; ఎఱుంగు = తెలియు; భంగిన్ = విధముగ; జీవుండే = జీవుడు మాత్రమే; తాను = తాను; అని = అని; జ్ఞాన = విజ్ఞానమువలన; గోచరుండు = తెలిసుకొన్నవాడు; ఎఱుగున్ = తెలియును; కావునన్ = అందుచేత; అన్నియున్ = సర్వము; మనస్ = మనసుచే కల్పితంబులు; మాత్రంబు = మాత్రమే; అని = అని; తెలిసి = తెలిసికొని; మోహ = మోహము యనెడి; తమంబు = చీకటిని; వాసి = విడిచిపెట్టి; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయినట్టి; వాసుదేవుని = నారాయణుని; అందున్ = అందు; చిత్తంబున్ = మనసును; పెట్టి = పెట్టి; నిర్మల = స్వచ్ఛమైన; ఆత్మకుండవు = మనసు గలవాడవు; అగుము = అగుము; అని = అని; బోధించిన = తెలియజెప్పగా; చిత్రకేతుండు = చిత్రకేతుడు; లేచి = లేచి; వారల్ = వారి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

మేము, నీవు, ఇక్కడ ఉన్నవారు అందరం ప్రస్తుత కాలంలో జన్మించి కలిసి ఉన్నాము. భవిష్యత్తులో మృత్యువు అందరినీ కబళిస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళం అప్పుడు కలిసి ఉండము. కావున జనన మరణాలు అనేవి యథార్థాలు కావు. భగవంతుడు తన మాయా ప్రభావంతో జీవులనుండి జీవులను పుట్టిస్తూ ఉంటాడు. జీవుల చేతనే జీవులను రక్షింప జేస్తుంటాడు. చివరకు ఆ జీవుల చేతనే జీవులను సంహరింప జేస్తుంటాడు. ఈశ్వరుడు స్వతంత్రుడు. సృష్టిలోని జీవులు అస్వతంత్రులు. బాలుడు బొమ్మలతో ఆడుకొన్నంత సేపు ఆడుకొని మరుక్షణంలో వాటిమీద అపేక్ష మాని మరొక ఆట ఆడుకుంటాడు. అలాగే భగవంతుడు కూడా జీవుల విషయంలో క్రీడిస్తూ ఉంటాడు. దేహధారి అయిన తండ్రి దేహం వల్ల తల్లి దేహంనుండి పుత్ర దేహం పుడుతుంది. ఒక విత్తనం వల్ల మరొక విత్తనం పుట్టటం ప్రకృతి ధర్మం. అదే విధంగా దేహధారులైనవారి విషయంలో ఈ ధర్మం శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలో సద్వస్తువుల యందు సామాన్య విశేష భావాలు కల్పితా లైనట్లుగానే దేహానికి, జీవునికి పరస్పర భేదం కల్పింపబడింది. మండుతున్న అగ్ని ఆయా స్థానాలను బట్టి మనకు వేరువేరు రూపాలతో కనిపిస్తుంది. అలాగే ఒకే జీవుడు అనేక రీతులుగా మనకు గోచరిస్తూ ఉంటాడు. దేహికి, దేహానికి ఉన్న భేదం అజ్ఞాన కల్పితం. మనం కలలు కంటూ ఉంటాము. ఆ కలలో ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూస్తాము. భయకంపితుల మౌతాము. మెలకువ రాగానే అది పీడకల అని తెలుసుకుంటాము. ఆ భయంకర దృశ్యాలు మనకు సంబంధించినవి కావని గుర్తిస్తాము. అదే విధంగా జ్ఞానవంతుడు చుట్టరికాలు, సంబంధాలు నిజం కావని తెలుసుకుంటాడు. కనుక ఈ జనన మరణాలన్నీ మనోభావాలే కాని వాస్తవాలు కావని గుర్తించి అజ్ఞానాంధకారం నుండి బయటపడి నిర్మలాత్ముడవై నీ మనస్సును శ్రీహరిపై లగ్నం చెయ్యి” అని ప్రబోధించిన అంగిరసుని మాటలను విని చిత్రకేతుడు ఊరడిల్లి లేచి వారిని చూచి ఇలా అన్నాడు.

6-458-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తివేషములు పూని తి గూఢగతి నిందు-
నేతెంచినట్టి మీ రెవ్వరయ్య?
డఁగి నన్ బోలిన గ్రామ్యబుద్ధుల నెల్ల-
బోధింప వచ్చిన పుణ్యమతులొ?
మణఁ గుమార నాద ఋషభాదులొ?-
దేవ లాసితు లను ధీరమతులొ?
వ్యాస వసిష్ఠ దూర్వాస మార్కండేయ-
గౌతమ శుక రామ పిల మునులొ?

6-458.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యాజ్ఞవల్క్యుండుఁ దరణియు నారుణియును
చ్యవన రోమశు లాసురి జాతుకర్ణ
త్త మైత్రేయ వర భరద్వాజ బోధ్య
పంచశిఖులొ? పరాశర ప్రభృతి మునులొ?

టీకా:

యతి = యతుల యొక్క; వేషములున్ = వేషములను; పూని = ధరించి; అతి = మిక్కిలి; గూఢ = రహస్యమైన; గతిన్ = విధముగ; ఏతెంచిన = వచ్చిన; అట్టి = అటువంటి; మీరు = మీరు; ఎవ్వరు = ఎవరు; అయ్య = తండ్రి; కడగి = పూని; నన్ = నా; పోలిన = వంటి; గ్రామ్య = మూర్ఖపు; బుద్ధుల = బుద్ధులు గలవారకు; ఎల్లన్ = అందరకును; బోధింపన్ = తెలియపరచుటకొరకు; వచ్చిన = వచ్చినట్టి; పుణ్యమతులో = పుణ్యాత్ములో; రమణన్ = చక్కటి; కుమార = కుమార చతుష్కయము {కుమార చతుష్కయము - సనకాదులు, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; నారద = నారదుడు; ఋషభ = ఋషభుడు; ఆదులో = మొదలగవారో; దేవల = దేవలుడు; అసితులు = అసితుడు; అను = అనెడి; ధీరమతులో = విజ్ఞానులో; వ్యాస = వ్యాసుడు; వసిష్ఠ = వసిష్ఠుడు; దూర్వాస = దూర్వాసుడు; మార్కండేయ = మార్కండేయుడు; గౌతమ = గౌతముడు; శుక = శుకుడు; రామ = పరశురాముడు; కపిల = కపిలుడు; మునులో = మునులో;
యాజ్ఞవల్కుండు = యాజ్ఞవల్కుడు; తరణియున్ = తరణి; ఆరుణియును = ఆరుణి, ఉద్దాలకుడు; చ్యవన = చ్యవనుడు; రోమశులు = రోమశుడు; ఆసురి = ఆసురి; జాతకర్ణ = జాతకర్ణుడు; దత్త = దత్తుడు; మైత్రేయ = మైత్రేయుడు; వర = శ్రేష్ఠులైన; భరద్వాజ = భరద్వాజుడు; బోధ్య = బోధింపబడిన; పంచశిఖులో = పంచశిఖులో; పరాశర = పరాశరుడు; ప్రభృతి = మొదలైన; మునులో = మునులో.

భావము:

“అయ్యలారా! ముని వేషాలు ధరించి రహస్యంగా ఇక్కడికి వచ్చిన మీరెవ్వరు? నావంటి మందబుద్ధులైన పామరులకు జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిన పుణ్యమూర్తులా? సనత్కుమారాదులా? నారద ఋషభులా? అసిత దేవలులా? వ్యాస వసిష్ఠులా? దుర్వాస మార్కండేయులా? శుక గౌతములా? కపిల పరశురాములా? లేక యాజ్ఞవల్క్యుడు, తరణి, అరుణి, చ్యవనుడు, రోమశుడు, ఆసురి, జాతుకర్ణుడు, దత్తాత్రేయుడు, మైత్రేయుడు, భరద్వాజుడు, పంచశిఖుడు, పరాశరుడు మొదలైన మహర్షుల లోనివారా?

6-459-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వీలలో నెవ్వరు? సుర
చాణ గంధర్వ సిద్ధ సంఘంబులలో
వాలొ? యీ సుజ్ఞానము
కాణమై యెవరి యందు లదు తలంపన్?

టీకా:

వీరలలోనన్ = వీరిలో; ఎవ్వరు = ఎవరు; సుర = దేవతలు; చారణ = చారణులు; గంధర్వ = గంధర్వులు; సిద్ధ = సిద్ధుల; సంఘంబుల = సమూహముల; లో = లోని; వారలొ = వారో; ఈ = ఇట్టి; సుజ్ఞానము = మంచి విజ్ఞానపు; కారణము = విధానము; ఐ = అయ్యి; ఎవరి = ఎవరి; అందున్ = అందు; కలదు = ఉండగలుగును; తలంపన్ = ఆలోచించినచో.

భావము:

సుర సిద్ధ చారణ గంధర్వ సముదాయాలకు చెందినవారా? అటువంటి వారు కాకపోతే ఇంతటి గొప్పజ్ఞానం మరెవ్వరికి ఉంటుంది?

6-460-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొందుగ గ్రామ్య పశుత్వముఁ
బొంది మహాశోకతమముఁ బొందిన నాకున్
ముంఱ దివ్యజ్ఞానముఁ
జెందించినవారి మిమ్ముఁ జెప్పుడు తెలియన్. "

టీకా:

పొందుగన్ = చక్కగా; గ్రామ్య = మూర్ఖపు; పశుత్వమున్ = జంతు లక్షణములను; పొంది = పొంది; మహా = గొప్ప; శోక = దుఃఖము యనెడి; తమమున్ = చీకటిని; పొందిన = పొందినట్టి; నా = నా; కున్ = కు; ముందఱ = ఎదుట; దివ్య = దివ్యమైన; జ్ఞానమున్ = జ్ఞానమును; చెందించిన = కలిగించిన; వారిన్ = వారైనట్టి; మిమ్మున్ = మీరెవరో; చెప్పుడు = చెప్పండి; తెలియన్ = తెలియునట్లు.

భావము:

పశుత్వంతో కూడిన మొరటువాడినై పెనుశోకపు చీకటిలో చీకాకు పడుతున్న నాకు దివ్యజ్ఞానాన్ని బోధింప వచ్చిన మీ రెవ్వరో తెలియజెప్పండి”

6-461-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన నంగిరసుం డిట్లనియె "నేను బుత్రకాంక్షివైన నీకుఁ బుత్రుం బ్రసాదించిన యంగిరసుండ; నితండు బ్రహ్మపుత్రుం డైన నారదభగవంతుండు; దుస్తరంబైన పుత్రశోకంబున మగ్నుండ వైన నిను ననుగ్రహించి, పరమజ్ఞానం బుపదేశింప వచ్చితిమి; నీ దుఃఖం బెఱింగి, పుత్రు నిచ్చితిమేనిఁ బుత్రవంతులైన వారి తాపంబు నీ చేత ననుభవింపం బడు; నీ ప్రకారంబున లోకంబున సతులును, గృహంబులును, సంపదలును, శబ్దాదులైన విషయంబులును, రాజ్యవైభవంబును జంచలంబులు; మఱియు రాజ్యంబును, భూమియును, బలంబును ధనంబును, భృత్యామాత్య సుహృజ్జనంబులును మొదలైనవి శోక మోహ భయ పీడలం జేయుచుండుఁ; గాని సుఖంబుల నీ నేరవు గంధర్వ నగరంబునుం బోలె స్వప్నలబ్ధ మనోరథంబునుం బోని యర్థంబుఁ బాసి కానంబడుచు, మనోభవంబులయిన యర్థంబులం గూడి, స్వార్థంబులై కానంబడ నేరవు; కర్మంబులచేత ధ్యానంబులు చేయుచుండు మనంబులు నానాకర్మంబు లగుచు నుండు నీ దేహి దేహంబు ద్రవ్యజ్ఞానక్రియాత్మకంబై దేహికి వివిధ క్లేశసంతాపంబులం జేయుచుండు; గావున నీవు నిర్మలంబైన మనంబు చేత నాత్మగతి వెదకి ధ్రువం బయిన పదవి నొందు" మనియె; అప్పుడు నారదుం డిట్లనియె "ఉపనిషద్గోప్యంబగు నే నిచ్చుమంత్రం బెవ్వడేని సప్తరాత్రంబులు పఠియించు, నతండు సంకర్షణుండైన భగవంతునిం జూచును; ఎవ్వని పాదమూలంబు సర్వాశ్రయంబై యుండు నట్టి శ్రీమన్నారాయణుని పాదంబులు సేవించి, యీ మోహంబు వదలి యతి శ్రీఘ్రంబున నుత్తమ పదంబు నొందు; మిప్పు డిక్కుమారునకు నీకును బ్రయోజనంబు గలదేనిం జూడు" మని నారదుండు మృతబాలకుని కళేబరంబుఁ జూచి "యో జీవుండ! నీకు శుభం బయ్యెడు; నిందుఁ బ్రవేశించి మీ తల్లిదండ్రుల బంధుజనులం జూచి వీరల దుఃఖంబు లార్చి యీ కళేబరంబునందుఁ బ్రవేశించి యాయుశ్శేషంబు ననుభవించి పిత్రధీనం బైన రాజ్యాసనంబునఁ గూర్చుండు" మనిన నబ్బాలుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనగా; అంగిరసుండు = అంగిరసుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నేను = నేను; పుత్ర = కొడుకులు; కాంక్షివి = కావలెనని కోరినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; పుత్రున్ = కొడుకును; ప్రసాదించిన = దయచేసిన; అంగిరసుండన్ = అంగిరసుడను; ఇతండు = ఇతడు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రుండు = కుమారుడు; ఐన = అయిన; వారద = నారదుడు యనెడి; భగవంతుండు = మహిమాన్వితుడు; దుస్తరంబు = దాటరానిది; ఐన = అయిన; పుత్రశోకంబునన్ = పుత్రశోకమునందు; మగ్నుండవు = ములిగినవాడవు; ఐన = అయిన; నినున్ = నిన్ను; అనుగ్రహించి = అనుగ్రహించి; పరమ = అతిపవిత్రమైన; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఉపదేశింపన్ = ఉపదేశించుటకై; వచ్చితిమి = వచ్చితిమి; నీ = నీ యొక్క; దుఃఖంబున్ = దుఃఖమును; ఎఱింగి = తెలిసికొని; పుత్రున్ = కుమారుని; ఇచ్చితిమేని = ఇచ్చినచో; పుత్రవంతులు = పుత్రులుగలవారు; ఐన = అయిన; వారి = వారి యొక్క; తాపంబున్ = బాధలను; నీ = నీ; చేతన్ = వలన; అనుభవింపంబడున్ = అనుభవింపవలసి యుండును; ఈ = ఈ; ప్రకారంబునన్ = విధముగ; లోకంబునన్ = లోకములో; సతులును = భార్యలు; గృహంబులునున్ = ఇళ్ళు వాకిళ్లు; సంపదలును = సంపదలు; శబ్దాదులు = శబ్దాదులు {శబ్దాదులు - పంచతన్మాత్రలు, 1శబ్దము 2స్పర్శ 3రూప 4రుచి 5వాసనలు}; ఐన = అయినట్టి; విషయంబులును = ఇంద్రియార్థములును; రాజ్య = రాజ్యమువలని; వైభవంబును = వైభవములును; చంచలంబులు = అశాశ్వతములు; మఱియున్ = ఇంకను; రాజ్యంబును = రాజ్యము; భూమియును = పొలములు; బలంబును = సైన్యములు; ధనంబును = ధనము; భృత్య = సేవకులు; అమాత్య = పురోహితాదులు; సుహృత్ = స్నేహితులు; జనంబులును = ప్రజలు; మొదలైనవి = మొదలైనవి; శోక = దుఃఖము; మోహ = మోహము; భయ = భయము; పీడలన్ = పీడలను; చేయుచుండున్ = కలిగించుచుండును; కాని = అంతేకాని; సుఖంబులన్ = సుఖములను; ఈనేరవు = ఇవ్వలేవు; గంధర్వనగరంబునున్ = ఆకాశములోని మేడలు (మేఘములు); పోలెన్ = వలె; స్వప్న = కలలో; లబ్ధ = ఈడేరిన; మనోరథంబునున్ = కోరికలను; పోని = పోలిన; అర్థంబున్ = ప్రయోజనములను; పాసి = విడిచిపెట్టి; కానంబడుచు = కనపడుతూ; మనః = మనసున; భవంబులు = పుట్టినవి; అయిన = ఐనట్టి; అర్థంబులన్ = ప్రయోజనములతో; కూడి = కలిసి; స్వార్థంబులు = తనకు మేలుచేసెడివి; ఐ = అయ్యి; కానంబడనేరవు = కనబడలేవు; కర్మంబుల్ = వేదకర్మములచేత; ధ్యానంబులు = ధ్యానములు; చేయుచుండు = చేసెడి; మనంబులు = మనసులు; నానా = వివిధములైన; కర్మంబుల్ = కర్మలు; కర్మంబులన్ = కర్మలలోను; అగుచుండున్ = కలుగుచుండును; ఈ = ఇట్టి; దేహి = జీవుని; దేహంబు = శరీరము; ద్రవ్య = వస్తువులు; జ్ఞాన = జ్ఞానము; క్రియ = క్రియలుతో; ఆత్మకంబు = కూడినది; ఐ = అయ్యి; దేహి = జీవుని; కిన్ = కి; వివిధ = అనేక రకములైన; క్లేశ = చిక్కులు, సంతాపములు; సంతాపంబులన్ = మనస్తాపములను; చేయుచుండున్ = కలిగించును; కావునన్ = అందుచేత; నీవు = నీవు; నిర్మలంబు = స్వచ్ఛము; ఐన = అయిన; మనంబు = మనసు; చేతన్ = తోటి; ఆత్మగతిన్ = ఆత్మ జ్ఞాన మార్గమును; వెదికి = సోధించి; ధ్రువంబు = స్థిరమైనది; అయిన = ఐనట్టి; పదవిన్ = స్థితిని; ఒందుము = పొందుము; అనియె = అనెను; అప్పుడు = అప్పుడు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఉపనిషత్ = ఉపనిషత్తులందు; గోప్యంబున్ = దాచబడినది; అగు = అయిన; నేను = నేను; ఇచ్చు = ఇచ్చెడి; మంత్రంబున్ = మంత్రమును; ఎవ్వడేని = ఎవడు అయినను; సప్త = ఏడు (7); రాత్రంబులున్ = రాత్రులు, దినములు; పఠియించున్ = చదువునో; అతండు = అతడు; సంకర్షణుండు = సంకర్షణుడు; ఐన = అయిన; భగవంతునిన్ = భగవంతుని; చూచును = దర్శించును; ఎవ్వని = ఎవని యొక్క; పాదమూలంబు = పాదములు; సర్వ = సర్వ విధముల; ఆశ్రయంబున్ = ఆశ్రయింపదగినవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; శ్రీమన్నారాయణుని = విష్ణుమూర్తి యొక్క; పాదంబులున్ = పాదములను; సేవించి = కొలిచి; ఈ = ఈ; మోహంబున్ = మోహమును; వదలి = విడిచిపెట్టి; అతి = మిక్కిలి; శ్రీఘ్రంబునన్ = వేగముగా; ఉత్తమ = ఉత్తమమైన; పదంబున్ = స్థితిని; ఒందుము = పొందుము; ఇప్పుడు = ఇప్పుడు; ఈ = ఈ; కుమారున్ = బాలుని; కున్ = కి; నీ = నీ; కునున్ = కు; కలదేని = ఉన్నదేమో; చూడుము = పరిశీలింపుము; అని = అని; నారదుండు = నారదుడు; మృత = మరణించిన; బాలకుని = పిల్లవాని; కళేబరంబున్ = కళేబరమును; చూచి = చూసి; ఓ = ఓ; జీవుండ = జీవుడా; నీ = నీ; కున్ = కు; శుభంబున్ = శుభములు; అయ్యెడున్ = అగును; ఇందున్ = దీనిలో; ప్రవేశించి = చేరి; మీ = మీ యొక్క; తల్లిదండ్రులన్ = తల్లిదండ్రులను; బంధు = బంధువులైన; జనులన్ = వారిని; చూచి = చూసి; వీరల = వీరి యొక్క; దుఃఖంబున్ = శోకమును; ఆర్చి = తీర్చి; ఈ = ఈ యొక్క; కళేబరంబున్ = కళేబరము; అందున్ = లో; ప్రవేశించి = చేరి; అయుస్ = జీవితకాలములో; శేషంబునున్ = మిగిలినదానిని; అనుభవించి = అనుభవించి; పితృ = తండ్రి యొక్క; అధీనంబు = ఆధీనములో యున్నది; ఐన = అయిన; రాజ్యాసనంబునన్ = రాజ్యాధికారమున; కూర్చుండుము = వసింపుము; అనినన్ = అనగా; ఆ = ఆ; బాలుండున్ = పిల్లవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని అడిగిన చిత్రకేతుతో అంగిరసుడు ఇలా అన్నాడు. “నీవు పుత్రసంతానం కావాలని కోరినపుడు నీకు పుత్రుణ్ణి ప్రసాదించిన అంగిరసుణ్ణి నేను. ఈయన బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి. తరింప శక్యం కాని పుత్రశోకంలో మునిగి ఉన్న నిన్ను అనుగ్రహించి నీకు పరమ జ్ఞానాన్ని ఉపదేశించడానికి వచ్చాము. నీ దుఃఖాన్ని తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ నీకు కుమారుణ్ణి ప్రసాదించినా బిడ్డలు గలవారికి కలిగే దుఃఖం నీకు మళ్ళీ కలుగుతుంది. ఈ లోకంలో భార్యలు, గృహాలు, సంపదలు, శబ్ద స్పర్శ రూపాలైన విషయ సుఖాలు, రాజ్య వైభవాలు అన్నీ అశాశ్వతాలు. చివరకు దుఃఖాన్నే కలిగిస్తాయి. ఇంతేకాదు, భోగ భాగ్యాలు, పొలం, బలం, ధనం, సేవకులు, మంత్రులు, మిత్రులు మొదలైన సంబంధాలన్నీ శోకాన్నీ మోహాన్నీ భయాన్నీ బాధనూ కలిగిస్తాయే కాని సుఖాన్ని చేకూర్చలేవు. ఆకాశంలో కనిపించే గంధర్వ నగరం వలె, కలలో కనిపించే వస్తువుల వలె ఈ సంబంధాలన్నీ మాయమౌతూ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. మన మనస్సులలో ధ్యానించే భావాలే మనకు స్వప్నంలో కనిపించి మాయమౌతూ ఉంటాయి. జీవి యొక్క దేహం ద్రవ్యం, జ్ఞానం, క్రియ అనే మూడు విధాలైన సంబంధాలతో కూడి ఉంటుంది. అటువంటి దేహం దేహధారి అయినవానికి నానావిధాలైన క్లేశాలను కలిస్తుంది. ఎన్నెన్నో చిక్కులను తెచ్చి పెడుతుంది. అందువల్ల రాజా! నీవు నీ మనస్సును ఈ బంధాలలో చిక్కుకోకుండా నిశ్చలం చేసుకో. అటువంటి నిర్మలమైన మనస్సుతో ఆత్మజ్ఞానాన్ని అలవరుచుకో. శాశ్వతమైన పదవిని అందుకో” అని అంగిరసుడు పలికిన తరువాత నారదుడు చిత్రుకేతుతో ఇలా అన్నాడు. “రాజా! ఉపనిషత్తులలో రహస్యంగా నిక్షిప్తమై ఉన్న ఒక మంత్రాన్ని నేను నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని ఏడు రాత్రులు జపించిన వానికి భగవంతుడైన సంకర్షణుని దర్శనం లభిస్తుంది. సమస్త విశ్వానికి ఆశ్రయమైన శ్రీమన్నారాయణుని పాదాలను సేవించి అతడు మోహబంధాలను ఛేదించి అతి శీఘ్రంగా ఉత్తమ గతిని పొందుతాడు. ఈ కుమారునికి, నీకు ఎటువంటి సంబంధమూ లేదు. ఒకవేళ ఏదైనా ప్రయోజనం ఉన్నదనుకుంటావేమో? అయితే ఇప్పుడే పరీక్షించుకో” అని నారదుడు చనిపోయిన బాలుని కళేబరం వైపు చూచి “ఓ జీవుడా! నీకు శుభం కలుగుగాక! నీవు మళ్ళీ ఈ దేహంలో ప్రవేశించు. మీ తల్లిదండ్రులను, బంధు మిత్రులను ఒక్కసారి చూడు. వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టు. మిగిలిన ఆయుర్దాయమంతా ఈ శరీరంలోనే ఉండి నీ తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించు” అన్నాడు. అప్పుడా బాలుడు ఇలా అన్నాడు.

6-462-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ర్మవశమున నెందు సుఖంబు లేక
దేవతిర్యఙ్నృ యోనులఁ దిరుగు నాకు
వెలయ నే జన్మమందునొ వీరు తల్లి
దండ్రు లయినారు చెప్పవే తాపసేంద్ర!

టీకా:

కర్మ = భౌతిక కర్మలకు; వశమునన్ = వశమగుటలో; ఎందున్ = ఎక్కడను; సుఖంబున్ = సుఖము; లేక = లేకుండగ; దేవ = దేవతల; తిర్యక్ = జంతువుల; నృ = మానవ; యోనులన్ = గర్భములలో; తిరుగు = తిరుగుచుండెడి; నా = నా; కున్ = కు; వెలయన్ = ప్రసిద్ధముగా; ఏ = ఏ యొక్క; జన్మము = పుట్టువు; అందునో = లోనో; వీరు = వీరు; తల్లిదండ్రులున్ = తల్లిదండ్రులు; అయినారు = అయితిరి; చెప్పవే = చెప్పుము; తాపస = ఋషి; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

“ఓ మునీంద్రా! నేను పూర్వకర్మవశం చేత ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో కష్టాలు పడి దేవతల, మానవుల, పశుపక్ష్యాదుల గర్భాలలో జన్మించాను. ఆయా జన్మాలలో నా తల్లిదండ్రులు ఎందరెందరో ఉన్నారు కదా! మరి ఈ తల్లిదండ్రుల దుఃఖం తీరిస్తే ఆ తల్లిదండ్రుల సంగతి ఏమిటి? వీరు ఏనాటి తల్లిదండ్రులు?

6-463-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాంధవజ్ఞాతిసుతులును గతు రాత్మ
రు లుదాసీన మధ్యస్థ ర్గములును
రవిఁ గనుచుందు రొక్కక్క న్మమునను
నెఱయఁ బ్రాణికి నొక వావి నిజము గలదె?

టీకా:

బాంధవ = బంధువులు; జ్ఞాతి = జ్ఞాతులు; సుతులున్ = పుత్రులును; పగతురు = తనకు చెడుచేసెడివారు; ఆత్మవరులు = తనకు మేలుచేసెడివారు; ఉదాసీన = మేలుకాని కీడకాని చేయక నుండెడి వారు; మధ్యస్థ = మధ్యస్థముగా నుండెడి; వర్గములును = సమూహములును; సరవిన్ = వరుసగా; కనుచుందురు = పొందెదరు; ఒక్కొక్క = వేరువేరు; జన్మమునను = జన్మల యందును; నెఱయన్ = విశేషించి; ప్రాణి = జీవుని; కిన్ = కి; ఒక = ఒక; వావి = బంధుత్వము; నిజముగన్ = నిజమునకు; కలదె = ఉన్నదా ఏమి.

భావము:

జీవునికి ప్రతిజన్మలోను బంధువులుగా, దాయాదులుగా, కుమారులుగా, శత్రువులుగా, మిత్రులుగా, నిర్లిప్తులుగా, తటస్థులుగా అనేకులు అనేక సంబంధాలను కలిగినవారు ఉంటారు. వాస్తవానికి జీవునికి వీరెవ్వరితోను ఎటువంటి సంబంధమూ లేదు.

6-464-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్నములు హేమములు ననురాగలీల
మ్మకంబుల నీవల నావల నగు
భంగి నరులందు జీవుండు ప్రాప్తుఁ డగుచు
నెలమిఁ దిరుగుచు నుండుఁ; దా నెందుఁ జెడఁడు.

టీకా:

రత్నములున్ = మణులు; హేమములున్ = బంగారు ఆభరణములు; అనురాగ = ఆసక్తుల; లీలన్ = ప్రకారమును; అమ్మకంబులన్ = అమ్మకములతో; ఈవలన = ఇటుపక్క; ఆవలనన్ = అటుపక్క; అగు = అయ్యెడి భంగిన్ = విధముగనే; నరులు = మానవుల; అందు = అందు; జీవుండు = జీవుడు; ప్రాప్తుండు = పొందినవాడు; అగుచున్ = అగుచు; ఎలమిన్ = పొందుతూ; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండును; తాన్ = తను; ఎందున్ = ఏవిధముగను; చెడడు = పాడైపోడు.

భావము:

రత్నాలు, బంగారు నగలు, మన ఆసక్తివల్ల క్రయవిక్రయాలలో ఏ విధంగా అటూ ఇటూ చేరుతూ ఉంటాయో అదే విధంగా జీవుడు తన కర్మానుసారంగా సంచరిస్తూ ఉంటాడే కాని అతనికి ఏ బంధమూ అంటదు. అతనిలో ఎటువంటి మార్పు ఉండదు.

6-465-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కఁడై నిత్యుఁడై యెక్కడఁ గడలేక-
సొరిది జన్మాదుల శూన్యుఁ డగుచు
ర్వంబు నందుండి ర్వంబుఁ దనయందు-
నుండంగ సర్వాశ్రయుం డనంగ
సూక్ష్మమై స్థూలమై సూక్ష్మాధికములకు-
సామ్యమై స్వప్రకామున వెలిగి
ఖిలంబుఁ జూచుచు ఖిల ప్రభావుఁడై-
ఖిలంబుఁ దనయందు డఁచి కొనుచు

6-465.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాత్మమాయాగుణంబుల నాత్మమయము
గాఁగ విశ్వంబుఁ దనసృష్టి నతఁ జెందఁ
జేయుచుండును సర్వసంజీవనుండు
మణ విశ్వాత్ముఁ డయిన నారాయణుండు.

టీకా:

ఒక్కడు = అనితరుడు; ఐ = అయ్యి; నిత్యుడు = శాశ్వతుడు; ఐ = అయ్యి; ఎక్కడన్ = ఎక్కడను; కడ = అంతము; లేక = లేకుండగ; సొరిదిన్ = వరుసగా; జన్మాదులన్ = జన్మించుటాది; శూన్యుడు = లేనివాడు; అగుచున్ = అగుచు; సర్వంబున్ = సమస్తము; అందున్ = అందును; ఉండి = ఉండి; సర్వంబున్ = సమస్తము; తన = తన; అందున్ = అందును; ఉండగన్ = ఉండగా; సర్వాశ్రయుండు = సర్వమునకు ఆశ్రయమైనవాడు; అనంగ = అనగా; సూక్ష్మము = అతి సూక్ష్మము; ఐ = అయ్యి; స్థూలము = స్థూలము; అయ్యి = ఐ; సూక్ష్మ = సూక్ష్మము; అధికములు = మొదలగువాని; కున్ = కి; సామ్యము = సమత్వము కలది; ఐ = అయ్యి; స్వ = తన యొక్క; ప్రకాశమునన్ = ప్రకాశముచేతనే; వెలిగి = ప్రకాశించుచు; అఖిలంబున్ = సమస్తమును; చూచుచున్ = చూచుచు; అఖిల = సర్వ; ప్రభావుడు = ప్రభావములు గలవాడు; ఐ = అయ్యి; అఖిలంబున్ = సమస్తమును; తన = తన; అందున్ = అందే; అడచికొనుచున్ = అణచికొనుచు; ఆత్మ = తన;
మాయా = మాయ యొక్క; గుణంబులన్ = గుణములను; ఆత్మ = ఆత్మలచే; మయము = నిండినది; కాగన్ = అగునట్లు; విశ్వంబున్ = జగత్తును; తన = తన; సృష్టి = సృష్టి యొక్క; ఘనతన్ = గొప్పదనముతో; చెందజేయుచుండును = కలుగ జేయుచుండును; సర్వ = సమస్తమునకు; సంజీవనుండు = జీవింప జేయువాడు; రమణన్ = చక్కగా; విశ్వాత్ముడు = విశ్వమే తానైన వాడు; అయిన = అయినట్టి; నారాయణుండు = విష్ణుమూర్తి.

భావము:

సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అయిన శ్రీమన్నారాయణుడు తన మాయా గుణాలతో ప్రపంచమంతటా తానే నిండి ఉన్నాడు. ఆయన శాశ్వతుడు, అనన్యుడు, అనంతుడు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఈ జగత్తుకే ఆత్మ అయినవాడు. ఎన్ని జన్మలెత్తినా అవి ఆయనకు అంటవు. ఆ పరాత్పరుడు అన్నిటిలోను ఉన్నాడు. ఆన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన సమస్తానికి ఆశ్రయమైనవాడు. స్థూల సూక్ష్మ భేదాలకు అతీతుడు. స్వయం ప్రకాశుడు. ఆయన తన సృష్టిని దీప్తిమంతం చేస్తూ ఉంటాడు.సమస్తాన్నీ తనలో దాచుకుంటాడు.

6-466-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తు లెవ్వరు? సుతు లెవ్వరు?
తు లెవ్వరు? మిత్రశత్రు బంధుప్రియ సం
తు లెవ్వరు? సర్వాత్మక
తుఁడై గుణసాక్షి యైన నుఁ డొక్కనికిన్.

టీకా:

సతులు = భార్యలు; ఎవ్వరు = ఎవరు; సుతులు = పుత్రులు; ఎవ్వరు = ఎవరు; పతులు = భర్తలు; ఎవ్వరు = ఎవరు; మిత్ర = మిత్రులు; శత్రు = శత్రువులు; బంధు = బంధువులు; ప్రియసంగతులు = స్నేహితులు; ఎవ్వరు = ఎవరు; సర్వ = అఖిలమైన; ఆత్మక = ఆత్మల యందు; గతుడు = తిరిగెడివాడు; ఐ = అయ్యి; గుణ = సర్వగుణములు; సాక్షి = సాక్షీభూతుండు; ఐన = అయినట్టి; ఘనుడు = గొప్పవాడు; ఒక్కని = ఒకని; కిన్ = కి.

భావము:

సర్వాత్ముడు, సర్వసాక్షి అయిన ఆ మహనీయునకు సతులు, సుతులు, అధిపతులు, మిత్రులు, శత్రువులు, ప్రియులు, అప్రియులు అంటూ ఎవరూ లేరు.

6-467-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు సుఖదుఃఖంబులం బొందక సర్వోదాసీనుండై పరమాత్మ యై యుండు న ప్పరమేశ్వర రూపుండు నయిన, నాకును మీకు నెక్కడి సంబంధంబు? మీకు దుఃఖంబునకుం బని లే"దని పలికి యా జీవుండు పోయినం జిత్రకేతుండును బంధువులు నతి విస్మిత చిత్తులై శోకంబులు విడిచి మోహంబులం బాసి యమునా నది యందు న క్కుమారునకు నుత్తరకర్మంబులు నిర్వర్తించిరి చిత్రకేతుండు గాఢ పంకంబునంబడిన యెనుంగునుం బోలె గృహాంధకూపంబు నం దుండి వెడలి కాళిందీనదికిం బోయి యందు విధిపూర్వకంబుగఁ గృతస్నానుండై, మౌనంబుతోడ నారదునకు నమస్కరించిన, నతండు ప్రసన్నుండై భగవన్మంత్రంబు విధిపూర్వకంబుగా నతనికిం నుపదేశించి యంగిరసుతోడం గూడి బ్రహ్మలోకంబునకుం జనియె; చిత్రకేతుండును నార దోపదేశ మార్గంబున నిరాహారుండై సమాధినియతుండై నారాయణ రూపంబయిన యా విద్య నారాధించి సప్తరాత్రంబున నప్రతిహతం బయిన విద్యాధరాధిపత్యంబును భాస్వద్రత్న దివ్య విమానంబునుం బడసి, నారాయణానుగ్రహంబునుం బొంది, మనోగమనంబునం ద్రిజగంబులం జరియించుచుండఁ గొన్ని దినంబులకు నొక్కచోట.

టీకా:

మఱియున్ = ఇంకను; సుఖ = సుఖములను; దుఃఖంబులన్ = దుఃఖములను; పొందక = పొందకుండగ; సర్వ = అఖిల మందును; ఉదాసీనుండు = నిర్లిప్తత చెందినవాడు; ఐ = అయ్యి; పరమాత్మ = పరమాత్మ; ఐ = అయ్యి; ఉండున్ = ఉండెడి; ఆ = ఆ; పరమేశ్వర = పరమేశ్వరుని; రూపుండు = స్వరూప మైనవాడు; అయిన = అయినట్టి; నా = నా; కునున్ = కు; మీ = మీ; కున్ = కు; ఎక్కడి = ఎక్కడ గలదు; సంబంధంబు = సంబంధము; మీ = మీ; కున్ = కు; దుఃఖంబున్ = దుఃఖమున; కున్ = కు; పనిలేదు = అవుసరములేదు; అని = అని; పలికి = పలికి; ఆ = ఆ; జీవుండు = జీవుడు; పోయినన్ = వెళ్ళిపోగా; చిత్రకేతుండును = చిత్రకేతుడు; బంధువులును = బంధువులు; అతి = మిక్కిలి; విస్మిత = ఆశ్చర్యము చెందిన; చిత్తులు = మనసులు గలవారు; ఐ = అయ్యి; శోకంబులు = దుఃఖములను; విడిచి = వదలివేసి; మోహంబులన్ = మోహములను; పాసి = విడిచిపెట్టి; యమునా = యమున యనెడి; నదిన్ = నది; అందున్ = లో; ఆ = ఆ; కుమారున్ = పుత్రున; కున్ = కు; ఉత్తరకర్మంబులు = ఉత్తరక్రియలు {ఉత్తరకర్మలు - మరణము తరువాత చేసెడి క్రియలు}; నిర్వర్తించిరి = కావించిరి; చిత్రకేతుండు = చిత్రకేతుడు; గాఢ = తీవ్రమైన; పంకంబునన్ = బురదలో; పడిన = పడినట్టి; ఏనుగునున్ = ఏనుగు; పోలెన్ = వలె; గృహ = ఇల్లు యనెడి; అంధ = చిమ్మచీకటి; కూపంబున్ = బావిలో; అందుండి = నుండి; వెడలి = బయలుదేరి; కాళిందీ = యమునా; నది = నది; కిన్ = కి; పోయి = వెళ్ళి; అందున్ = దానలో; విధిపూర్వకంబుగన్ = పద్ధతి ప్రకారముగ; కృతస్నానుండు = స్నానము చేసినవాడు; ఐ = అయ్యి; మౌనంబున్ = మౌనము; తోడన్ = తోటి; నారదున్ = నారదుని; కున్ = కి; నమస్కరించినన్ = నమస్కరించగా; అతండు = అతడు; ప్రసన్నుండు = ప్రసన్నమైనవాడు; ఐ = అయ్యి; భగవత్ = భగవంతుని; మంత్రంబున్ = మంత్రమును; విధిపూర్వకంబుగాన్ = విధివిధానములతో కలిపి; అతని = అతని; కిన్ = కి; ఉపదేశించి = ఉపదేశించి; అంగిరసు = అంగిరసుని; తోడన్ = తో; కూడి = కలిసి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మలోకమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; చిత్రకేతుండును = చిత్రకేతుడు; నారద = నారదుడు; ఉపదేశ = ఉపదేశించినట్టి; మార్గంబునన్ = దారిలో; నిరాహారుండు = ఆహారములను విసర్జించినవాడు; ఐ = అయ్యి; సమాధి = సమాధిస్థితి యందు; నియతుండు = నిష్ఠ గలవాడు; ఐ = అయ్యి; నారాయణ = విష్ణుమూర్తి యొక్క; రూపంబున్ = రూపము; అయిన = అయిన; ఆ = ఆ; విద్యన్ = మంత్రమును; ఆరాధించి = సేవించి; సప్త = ఏడు (7); రాత్రంబునన్ = రాత్రులలో; అప్రతిహతంబు = ఎదురులేనిది; అయిన = ఐన; విద్యాధర = విద్యాధరు లందు; అధిపత్యంబును = ఏలుబడిని, ప్రభుత్వమును; భాస్వత్ = మెరుస్తున్న; రత్న = రత్నములు పొదిగిన; దివ్య = దివ్యమైన; విమానంబునున్ = విమానమును; పడసి = పొంది; నారాయణ = విష్ణుని; అనుగ్రహంబునున్ = అనుగ్రహమును; పొంది = పొంది; మనః = సంకల్పమాత్ర; గమనంబున్ = చరించుటలను; త్రిజగంబులన్ = ముల్లోకములు {త్రిజగంబు - 1స్వర్గ 2మానవ 3పాతాళలోకములు}; చరియించుచుండన్ = తిరుగుతుండగ; కొన్ని = కొన్ని; దినంబుల్ = దినముల; కున్ = కు; ఒక్క = ఒక; చోటన్ = స్థలమున.

భావము:

ఇంకా సుఖదుఃఖాలను పొందకుండా అన్నిటియందు నిర్లిప్తుడనై, పరమాత్మ స్వరూపుడనైన నాకు, మీకు సంబంధమెక్కడిది? మీరు నాకోసం దుఃఖింపవలసిన అవసరం లేదు” అని పలికి ఆ బాలునిలోని జీవుడు వెళ్ళిపోయాడు. చిత్రకేతుడు, అతని బంధువులు ఆశ్చర్య చకితులై దుఃఖాన్నీ వ్యామోహాన్నీ విడిచిపెట్టి, యమునానది వద్ద ఆ బాలుని అంత్యక్రియలు చేశారు. చిత్రకేతుడు దట్టమైన బురదలోనుండి బయటపడిన ఏనుగు వలె సంసారమనే చీకటి బావినుండి బయటపడ్డాడు. యమునానదిలో శాస్త్రోక్తంగా స్నానం చేసాడు. మౌనంగా నారదునికి నమస్కరించాడు. నారదుడు ప్రసన్నుడై చిత్రకేతునకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి అంగిరసునితో పాటు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. చిత్రకేతుడు నారద మహర్షి బోధించిన విధంగా నారాయణ రూపమైన విద్యను నిరాహారుడై, సమాధి నిష్ఠుడై ఏడు రాత్రులు అత్యంత దీక్షతో ఆరాధించి చివరకు అనన్య సామాన్యమైన విద్యాధర చక్రవర్తిత్వాన్ని, రత్నఖచితమైన దివ్య విమానాన్ని పొందాడు. శ్రీమన్నారాయణుని అనుగ్రహం చేత మనోవేగం కలిగిన విమానంలో ముల్లోకాలలో సంచరిస్తూ కొన్ని రోజుల తర్వాత ఒకచోట...

6-468-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తార హార పటీర వళ దేహమువాని-
మణీయ నీలాంబరంబువాని;
ణికిరీటస్ఫురన్మస్తకంబులవానిఁ-
గంకణ కేయూర రమువానిఁ;
ర్బురమయదీప్త టిసూత్రములవానిఁ-
రళ యజ్ఞోపవీములవాని;
తి సుప్రసన్న వక్త్రాంబుజంబులవానిఁ-
రుణవివృత్త నేత్రములవాని;

6-468.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధమండలంబు సేవింపఁ బుణ్యప్ర
సిద్ధి వెలసినట్టి యిద్ధచరితుఁ;
ద్మలోచనునకుఁ బాదపీఠంబైన
నునిఁ, బన్నగేంద్రుఁ గాంచె నతఁడు.

టీకా:

తార = తారకల; హార = ముత్యాలహారపు; పటీర = మంచిగంధములవలె; ధవళ = తెల్లని; దేహమువాని = శరీరము గలవాని; రమణీయ = మనోజ్ఞమైన; నీలాంబరంబువాని = నీలపురంగు వస్త్రము గలవాని; మణి = మణులు పొదిగిన; కిరీట = కిరీటములతో; స్ఫురత్ = తళుక్కు మంటున్న; మస్తకంబుల = శిరస్సులు కలవాని; కంకణ = చేతి కంకణములు; కేయూర = భుజకీర్తులు కల; కరమువాని = చేతులవాని; కర్బుర = బంగారముతో; మయ = చేయబడిన; దీప్త = ప్రకాశవంతమైన; కటిసూత్రముల = మొలనూలులు గలవాని; తరళ = ప్రకాశవంతమైన; యజ్ఞోపవీతములవాని = జంధ్యములు గలవాని; అతి = మిక్కిలి; ప్రసన్న = ప్రసన్నమైన; వక్త్ర = ముఖము యనెడి; అంబుజంబులవాని = పద్మములవాని; తరుణ = కుబ్జపుష్పములు; వివృత్త = వికసించి నట్లు గల; నేత్రములవాని = కన్నులు గలవాని;
సిద్ధ = సిద్ధుల; మండలంబు = సమూహములు; సేవింప = కొలచుతుండగ; పుణ్య = పవిత్రమైన; ప్రసిద్ధిన్ = ప్రసిద్ధితో; వెలసినట్టి = విలసిల్లినట్టి; ఇద్ధ = ప్రశస్తమైన; చరితున్ = వర్తనలు గలవాని; పద్మలోచనున్ = నారాయణుని; కున్ = కి; పాదపీఠంబు = కాలూనుపీట; ఐన = అయిన ఘనునిన్ = గొప్పవానిని; పన్నగేంద్రున్ = ఆదిశేషుని; కాంచెన్ = దర్శించెను; అతడు = అతడు.

భావము:

చిత్రకేతుడు పరమపావనుడు, సచ్చరిత్రుడు, మహావిష్ణువునకు పాదపీఠం అయిన ఆదిశేషుణ్ణి కన్నులవిందుగా చూశాడు. ఆ ఆదిశేషుడు నక్షత్రాల వలె, ముత్యాలహారాల వలె, చందనం వలె తెల్లనైన దేహం కలిగి ఉన్నాడు. సుందరమైన నల్లని వస్త్రాలు ధరించాడు. రత్న కిరీటాలతో అతని శిరస్సులు విరాజిల్లుతున్నవి. చేతులకు కంకణాలు, కేయూరాలు అలంకరించుకొని ఉన్నాడు. తళతళ ప్రకాశించే మొలనూలు ధరించి ఉన్నాడు. నిగనిగ మెరిసే యజ్ఞోపవీతంతో అలరారుతున్నాడు. ఆయన ముఖకమలాలు ఎంతో ప్రసన్నంగా ఉన్నాయి. ఆయన నేత్రాలు గుండ్రంగా దీప్తివంతాలై మెరుస్తున్నాయి.

6-469-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నమాత్ర నతఁడు ల్మషంబులఁ బాసి
విమలచిత్తుఁ డగుచు విశదభక్తి
నిట్టరోమములకుఁ ట్టగు చానంద
బాష్పనేత్రుఁ డగుచుఁ బ్రణుతి చేసె

టీకా:

కన్న = దర్శించిన; మాత్రనన్ = మాత్రముచేతనే; అతడు = అతడు; కల్మషంబులన్ = పాపములను; పాసి = విడిచి; విమల = నిర్మలమైన; చిత్తుడు = మనసు గలవాడు; అగుచు = అగుచు; విశద = స్వచ్ఛమైన; భక్తిన్ = భక్తితో నిట్ట = గగుర్పాటు చెందిన; రోమముల్ = వెంట్రుకల; కున్ = కు; పట్టు = నివాసము; అగుచున్ = అగుచు; ఆనంద = ఆనందముతో; బాష్ప = కన్నీటి; నేత్రుడు = కన్నులు గలవాడు; అగుచున్ = అగుచు; ప్రణుతి = నమస్కారములు; చేసె = చేసెను.

భావము:

ఆదిశేషుణ్ణి చూడగానే చిత్రకేతుని పాపాలన్నీ తొలగిపోయాయి. అతని మనస్సు నిర్మలమై భక్తితో నిండిపోయింది. ఒడలు పులకించింది. కన్నులలో ఆనందబాష్పాలు పొంగి పొరలాయి. ఆ విధమైన తన్మయత్వంతో చిత్రకేతుడు ఆదిశేషునకు నమస్కరించాడు.

6-470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంతోషాశ్రులచేత న
నంతునిఁ బరిషిక్తుఁ జేసి తఁడు ప్రమోదం
బెంయు నరికట్టిన నొక
కొంయుఁ బలుకంగలేక కొండొక వడికిన్.

టీకా:

సంతోష = సంతోషము వలన కలిగెడి; అశ్రుల = కన్నీటి; చేతన్ = వలన; అనంతుని = అదిశేషుని; పరిషిక్తున్ = తడసినవాని, అభిషిక్తుని; చేసి = చేసి; అతడు = అతడు; ప్రమోదంబున్ = సంతోషమును; ఎంతయున్ = మిక్కిలి; అరికట్టినన్ = ఆపుకొనినను; ఒకకొంతయున్ = కొంచము కూడ; పలుకంగలేక = పలుక లేకుండి కొండొక = మరికొంత; వడి = సమయమున; కిన్ = కు.

భావము:

చిత్రకేతుడు ఆనంద బాష్ప ధారలతో ఆదిశేషుని అభిషేకించాడు. పట్టరాని ఆనందంతో గద్గద కంఠుడై ఒక్క మాటకూడా పలుకలేక కొంత సేపటికి...

6-471-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దినొక యింతమాత్రన సమంబుగఁ జేయుచు బాహ్యవర్తనం
దిసిన యింద్రియంబుల నొకంతకుఁ దెచ్చి మనంబు వాక్కునుం
గుదురుగఁ ద్రోచి తత్వమునఁ గూర్చుచు శాశ్వత విగ్రహంబు నా
యుఁ బ్రశాంతు లోకగురు న్నుతి చేయఁ దొడంగె నిమ్ములన్.

టీకా:

మదిన్ = మనసున; ఒకయింత = కొంత; మాత్రన = వరకు; సమంబుగన్ = స్థిరపడినదిగ; చేయుచున్ = చేయుచు; బాహ్య = బయటకు; వర్తనన్ = తిరుగుటకు; కదిసిన = పూనుకొన్న; ఇంద్రియంబులన్ = ఇంద్రియములను; ఒకంత = కూడుకొనుట; కున్ = కు; తెచ్చి = తెచ్చుకొని; మనంబున్ = మనసును; వాక్కునున్ = వాక్కును; కుదురుగద్రోచి = కుదుటపడునట్లు చేసి; తత్వమునన్ = ఆత్మజ్ఞానమున; కూర్చుచున్ = చేర్చుచు; శాశ్వతవిగ్రహంబున్ = శాశ్వత స్వరూపుని, శేషుని; ఆ = ఆ; సదయున్ = దయామయుని; ప్రశాంతున్ = ప్రశాంతమైనవాని; లోకగురు = జగద్గురుని; సన్నుతి = స్తుతించుట; చేయన్ = చేయ; తొడంగెన్ = సాగెను; ఇమ్ములన్ = కుతూహలముతో.

భావము:

అతడు తన హృదయాన్ని కొంత కుదుట పరచుకొని, ఇంద్రియాలను వశపరచుకొని, మనస్సునూ మాటనూ సరి చేసుకొని శాశ్వతుడు, దయామయుడు, శాంతమూర్తి, జగద్గురువు అయిన ఆదిశేషుణ్ణి ఇలా స్తుతించసాగాడు.

6-472-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అజితుఁడవై భక్తులచే
విజితుం డైనాఁడ విపుడు వేడుక వారున్
విజితులు నీచేఁ గోర్కులు
జియింపనివారు నిన్నుఁ డయుదురె? హరీ!

టీకా:

అజితుడవు = జయింపరానివాడవు; ఐ = అయ్యి; భక్తుల్ = భక్తుల; చేన్ = చేత; విజితుడు = జయింపబడినవాడు; ఐనవాడవు = అయితివి; ఇపుడు = ఇప్పుడు; వేడుకన్ = వేడుకగా; వారున్ = వారుకూడ; విజితులు = జయింపబడిరి; నీ = నీ; చేన్ = వలన; కోర్కులు = కోరి; భజియింపని = కొలువని; వారున్ = వారు; నిన్నున్ = నిన్ను; పడయుదురే = పొందగలరా ఏమి; హరీ = ఆదిశేషుడా.

భావము:

“ఓ ఆదిశేషా! పరులచేత జయింప శక్యం కాని వాడవైన నీవు భక్తులచేత ఇప్పుడు జయింప బడినావు. ఆ భక్తులు కూడా నీచేత జయింపబడిన వారై నీకు వశులై వర్తిస్తున్నారు. కోరికలను జయింపలేనివాడు నీ కరుణకు పాత్రుడు కాలేడు.

6-473-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ విభవంబు లీ జగము నిండుట యుండుట నాశ మొందుటల్
నీ విమలాంశజాతములు నెమ్మి జగంబు సృజించువార, లో
దే! భవద్గుణాంబుధుల తీరముఁ గానక యీశ! బుద్ధితో
వావిరిఁ జర్చ చేయుదురు వారికి వారలు దొడ్డవారలై.

టీకా:

నీ = నీ యొక్క; విభవంబులు = వైభవములే; ఈ = ఈ; జగము = జగత్తు; నిండుట = సృష్టిచేత నిండుట; యుండుట = స్థితి; నాశమున్ = లయము; ఒందుటల్ = పొందుటలు; నీ = నీ యొక్క; విమల = నిర్మలమైన; అంశ = అంశచేత; జాతములు = పుట్టినవి; నెమ్మి = కుతూహలముతో; జగంబు = జగత్తు; సృజించు = సృష్టించెడి; వారలు = వారు; ఓ = ఓ; దేవ = భగవంతుడ; భవత్ = నీ యొక్క; గుణ = సుగుణముల; అంబుధుల = సముద్రముల; తీరమున్ = హద్దును; కానక = చూడలేక; ఈశ = భగవంతుడ; బుద్ధి = బుద్ధి; తోన్ = తోటి; వావిరిన్ = అత్యధికముగ; చర్చన్ = చర్చించుట; చేయుదురు = చేసెదరు; వారి = వారి; కిన్ = కి; వారలు = వారు; దొడ్డవారలు = గొప్పవారు; ఐ = అయ్యి.

భావము:

దేవా! ఈ లోకాలు పుట్టడం, పెరగడం, నశించడం అనేవి నీ లీలా విలాసాలు మాత్రమే. లోక కర్తలైనవారు నిర్మలమైన నీ అంశంవల్ల జనించినవారే. వీరందరూ నీ గుణ సముద్రంలో మునిగి తేలుతూ తీరాలు చేరలేక తమకు తామే ప్రభువులమనే భావంతో వాదులాడుకుంటూ ఉంటారు.

6-474-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాణువు మొదలుగఁ గొని
మము దుదిగాఁగ మధ్యరికీర్తనచే
స్థిరుఁడవు త్రయీవిదుఁడవై
రి సత్వాద్యంత మధ్య దృశగతుఁడవై.

టీకా:

పరమాణువు = పరమాణువు (అతి చిన్నది); మొదలుగగొని = మొదలు పెట్టి; పరమమున్ = పరము (అతి పెద్దది); తుది = వరకు; కాగన్ = కలిగిన; మధ్య = అంతర్భాగము నందు; పరికీర్తన = మిక్కిలి విస్తరించుట; చేన్ = వలన; స్థిరుడవు = శాశ్వతుడవు; త్రయీ = వేదములు; విదుడవు = తెలిసినవాడు; ఐ = అయ్యి; సరి = సమానముగ; సత్వ = జీవజాలమునకు; ఆది = పుట్టుక; అంత = మరణము; మధ్య = మనుగడల యందు; సదృశ = అంతర్యామిగ; గతుడవు = చరించెడి వాడవు; ఐ = అయ్యి.

భావము:

నీవు పరమాణువు మొదలుకొని పరమోత్కృష్టమైన పదార్థం వరకు వ్యాపించి ఉన్న శాశ్వతుడవు. ఆది మధ్యాంతాలను నీ వశంలో ఉంచుకున్న వేదవేత్తవు.

6-475-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వి మొదలైన యేడు నొండొకటికంటె
శగుణాధికమై యుండు; దాని నండ
కోశమందురు; నా యండకోటి యెవ్వఁ
డందు నణుమాత్రమగు ననంతాఖ్యుఁ డతఁడు.
^ సప్తావరణలు.

టీకా:

ఉర్విమొదలైన = భూమి మొదలగు పంచభూతాలు, మహత్తు, అహంకారం అని ఆవరణలు; ఏడున్ = ఏడు (7); ఒండొంటికంటె = ఒకటికంటె నొకటి; దశ = పది; గుణ = రెట్లు; అధికము = ఎక్కువది; ఐ = అయ్యి; ఉండు = ఉండును; దానిన్ = దానిని; అండకోశము = అండకోశము; అందురు = అనెదరు; ఆ = ఆ; అండ = అండకోశములు; కోటిన్ = అనేకమును; ఎవ్వడి = ఎవని; అందున్ = అందు; అణు = అణువు; మాత్రము = అంత; అగున్ = అగునో; అనంత = అనంతుడు; ఆఖ్యుడు = పేర ప్రసిద్ధుడు; అతడు = అతడు.

భావము:

భూమి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు మహత్తు, అహంకారం అనే ఏడు (సప్తావరణలు) ఒకదాని కంటే మరొకటి పదిరెట్టు పెద్దవిగా కూర్చబడి ఉన్నాయి. దీనినే అండకోశం అంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు నీలో లెక్కలేనన్ని అణువులుగా ఏర్పడి ఉన్నాయి. ఈ విధంగా అంతు తెలియరాని అనంతుడవు నీవు.

6-476-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు, నొక్కచోట విషయతృష్ణాపరులైన నరపశువులు పరతత్త్వంబవైన నిన్ను మాని యైశ్వర్యకాములై తక్కిన దేవతల భజియింపుదురు; వారిచ్చు సంపదలు రాజకులంబునుంబోలె వారలంగూడి నాశంబునం బొందుచుండు; విషయకామములేని నిన్ను సేవించినవారు వేఁచిన విత్తనంబునుంబోలె దేహాంతరోత్పత్తి నొందకుండుదురు; నిర్గుణుండవై జ్ఞానవిజ్ఞాన రూపంబు నొందియున్న నిన్ను గుణసమేతునింగా జ్ఞానులు భావింపుదురు; నీ భజనం బే రూపున నయిన మోక్షంబు ప్రసాదించు; జితమతివైన నీవు భాగవత ధర్మం బే ప్రకారంబున నిర్ణయించితి; వా ప్రకారంబున సర్వోత్కృష్టుండ వైన నిన్ను సనత్కుమారాదులు మోక్షంబు కొఱకు సేవించుచున్నా; రీ భాగవత ధర్మంబునందు జ్ఞానహీనుం డొక్కండును లేఁ; డన్య కామ్యధర్మంబులందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు నని వచియించుచున్నవాఁ డధర్మనిరతుండై క్షయించుచుండు; స్థావర జంగమ ప్రాణిసమూహంబునందు సమంబైన భాగవతధర్మంబుల వర్తించుచున్న మనుజునికి భవద్దర్శనంబువలనఁ బాపంబు క్షయించుట యేమి చిత్రం; బిపుడు భవత్పాదావలోకనంబున నిరస్తాశుండ నైతి; మూఢుండ నయిన నాకుఁ బూర్వ కాలంబున నారదుం డనుగ్రహించి, భగవద్ధర్మంబు దయచేసె; నది నేఁడు నాకు వరదుండ వయిన నీ కతంబున దృష్టంబయ్యె; ఖద్యోతంబులచేత సూర్యుండు గోచరుండు గానిమాడ్కి జగదాత్మకుండవయిన నీ మహత్త్వంబు మనుజులచేత నాచరింపబడి ప్రసిద్ధంబైనది గాదు; అం దుత్పత్తి స్థితి లయ కారణుండవై భగవంతుండ వైన నీకు నమస్కరించెద; నని మఱియును.

టీకా:

మఱియున్ = ఇంకను; ఒక్కచోటన్ = ఒక్కొక్కచోట; విషయ = విషయము లందలి; తృష్ణ = లాలస యందు; పరులు = లగ్నమైనవారు; ఐన = అయిన; నరపశువులు = నరరూప జంతువులు; పరతత్త్వంబవు = పరతత్త్వ మైనవాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; మాని = వదలి; ఐశ్వర్య = ఐశ్వర్యములను; కాములు = కోరువారు; ఐ = అయ్యి; తక్కిన = ఇతర; దేవతలన్ = దేవతలను; భజియింపుదురు = పూజించెదరు; వారు = వారు; ఇచ్చు = ఇచ్చెడి; సంపదలు = సంపదలు; రాజకులంబునున్ = రాజవంశముల; పోలెన్ = వలె; వారలన్ = వారితో; కూడి = కూడి; నాశంబునన్ = నాశనమును; పొందుచుండు = పొందుచుండును; విషయ = విషయము లందు; కామము = ఆపేక్ష; లేని = లేనట్టి; నిన్ను = నిన్ను; సేవించినవారు = కొలిచెడివారు; వేచిన = వేయించిన; విత్తనంబునున్ = విత్తనము; పోలెన్ = వలె; దేహాంతరోత్పత్తిన్ = పునర్జన్మను {దేహాంతరోత్పత్తి - దేహము (శరీరము) అంతర (మరియొక దానిలో) ఉత్పత్తి(పుట్టుట), పునర్జన్మ}; ఒందకుండుదురు = పొందరు; నిర్గుణుండవు = త్రిగుణరహితుడవు; ఐ = అయ్యి; జ్ఞాన = ఆత్మజ్ఞానము యొక్క; విజ్ఞాన = విజ్ఞానమే; రూపంబున్ = స్వరూపము; ఒందియున్న = పొంది యున్నట్టి; నిన్ను = నిన్ను; గుణ = సుగుణములతో; సమేతునింగా = కూడినవానిగా; జ్ఞానులు = బుధులు; భావింపుదురు = భావించెదరు; నీ = నీ యొక్క; భజనంబున్ = సేవ; ఏ = ఏ; రూపునన్ = రూపములోను; అయినన్ = ఐనప్పటికి; మోక్షంబున్ = ముక్తిని; ప్రసాదించు = ఇచ్చును; జితమతివి = మనసును జయించినవాడవు; ఐన = అయిన; నీవు = నీవు; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబున్ = సిద్ధాంతములను; ఏ = ఏ; ప్రకారంబునన్ = విధముగ; నిర్ణయించితివి = నిర్ణయించినావో; ఆ = ఆ; ప్రకారంబునన్ = విధముగ; సర్వ = అందరికంటెను; ఉత్కృష్టుండవు = మేలుచేసెడి వాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; సనత్కుమారాదులు = సనకాదులు {సనత్కుమారాదులు - సనకాదులు, 1సనకుడు 2సనందనుడు 3సనత్కుమారుడు 4సనత్సుజాతుడు}; మోక్షంబున్ = ముక్తి నొందుట; కొఱకున్ = కోసము; సేవించుచున్నారు = కొలచుచున్నారు; ఈ = ఈ; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబున్ = మార్గము; అందున్ = అందు; జ్ఞాన = ఆత్మజ్ఞానము; హీనుండు = లేనివాడు; ఒక్కండును = ఒకడు కూడ; లేడు = లేడు; అన్య = ఇతరమైన; కామ్యధర్మంబుల్ = కోరికలకైన ధర్మముల; అందున్ = లో; విషమ = సమముగా ప్రసరించని; బుద్ధి = బుద్ధి; చేత = వలన; నేను = నేను; నీవు = నీవు; నా = నా; కున్ = కు; నీ = నీ; కున్ = కు; అని = అని; వచియించుచున్న = పలికెడి; వాడు = వాడు; అధర్మ = అధర్మము నందు; నిరతుండు = నిష్ఠగలవాడు; ఐ = అయ్యి; క్షయించుచుండున్ = నశించుచుండును; స్థావర = చరించలేని; జంగమ = చరించగలిగిన; ప్రాణి = జీవుల; సమూహంబున్ = సమూహముల; అందున్ = ఎడలను; సమంబున్ = సమత్వము గలది; ఐన = అయిన; భాగవత = భాగవతుల యొక్క; ధర్మంబులన్ = మార్గములో; వర్తించుచున్న = నడచెడి; మనుజున్ = మానవున; కిన్ = కి; భవత్ = నీ యొక్క; దర్శనంబు = దర్శించుట; వలనన్ = వలన; పాపంబు = పాపములు; క్షయించుట = నశించుట; ఏమి = ఏమి; చిత్రంబు = విచిత్రము; ఇపుడు = ఇప్పుడు; భవత్ = నీ యొక్క; పాద = పాదములను; అవలోకనంబునన్ = దర్శనమువలన; నిరస్త = తిరస్కరింపబడిన; ఆశుండను = ఆపేక్షలు గలవాడను; ఐతి = అయితిని; మూఢుండను = మూర్ఖుడను; అయిన = ఐన; నా = నా; కున్ = కు; పూర్వకాలంబున = ఇంతకు పూర్వము; నారదుండు = నారదుడు; అనుగ్రహించి = కరుణించి; భగవత్ = భాగవత; ధర్మంబున్ = ధర్మమును; దయచేసెన్ = దయతో ఇచ్చెను; అది = దానిని; నేడు = ఇప్పుడు; నా = నా; కున్ = కు; వరదుండవు = వరముల నిచ్చెడివాడవు; అయిన = అయిన; నీ = నీ; కతంబునన్ = వలన; దృష్టంబు = నిరూపింపబడినది; అయ్యె = అయినది; ఖద్యోతంబులు = మిణుగురుల; చేతన్ = చేత; సూర్యుండు = సూర్యుడు; గోచరుండు = తెలియబడనివాడు; కాని = కానట్టి; మాడ్కిన్ = విధముగనే; జగత్ = భువనమే; ఆత్మకుండవు = తానైనవాడవు; అయిన = ఐన; నీ = నీ యొక్క; మహత్వంబు = గొప్పదనము; మనుజుల = మానవులచేత; ఆచరింపబడి = అనుసరింపబడి; ప్రసిద్ధంబు = ప్రసిద్ధమైనది; కాదు = కాదు; అందున్ = అట్టి; ఉత్పత్తి = సృష్టి; స్థితి = స్థితి; లయ = లయములకు; కారణుండవు = కారణమైనవాడవు; ఐ = అయ్యి; భగవంతుండవు = భగవంతుడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; నమస్కరించెదన్ = నమస్కరించెదను; అని = అని పలికి; మఱియును = ఇంకను.

భావము:

విషయసుఖాలకు మరిగిన నర పశువులు పరమేశ్వరుడవైన నిన్ను విడిచి ఐశ్వర్య వాంఛతో ఇతర దైవాలను ఆరాధిస్తారు. ఆ దేవతలిచ్చే సంపదలు రాజులిచ్చే మడి మాన్యాల వంటివి. మడిమాన్యాలు ఆ రాజులతోపాటు నశించిపోయే విధంగా ఆ చిల్లర దేవతలిచ్చే సంపదలు వారితో పాటు నష్టమై పోతాయి. విషయ వాంఛలను విడనాడి నిన్ను ఆరాధించేవారు వేయించిన విత్తనాల వంటివారు. వారికి దేహాంతాలలో మొలకెత్తే ప్రసక్తి ఉండనే ఉండదు. నిర్గుణుడవై కూడా జ్ఞాన విజ్ఞాన రూపాలతో విరాజిల్లే నిన్ను జ్ఞానవంతులైనవారు గుణవంతునిగానే భావిస్తారు. ఏ విధంగా ఆచరించినప్పటికీ నీ సేవ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నీవు నిర్ణయించిన భాగవత ధర్మానుసారంగా సనత్కుమారుడు మొదలైన మహానుభావులు మోక్షాన్ని కాంక్షించి సర్వేశ్వరుడవైన నిన్ను సంసేవిస్తారు. భాగవత ధర్మాన్ని అవలంబించిన మహానుభావు లందరూ జ్ఞానవంతులే. వారిలో జ్ఞానహీనుడంటూ ఉండడు. మనసులోని కోరికలను తీర్చుకోవాలనే తహతహతో కామ్యకర్మల వెంట పరుగెత్తుతూ ‘నేను నీవు నాకు నీకు’ అనే విషమ బుద్ధి కలవాడు అధర్మపరుడై అధోగతి పాలవుతాడు. చరాచరాలైన సమస్త జీవులయందు సమదృష్టి కలిగి భాగవత ధర్మానుసారం సర్వత్ర భగవంతుణ్ణి సందర్శించే వానికి పాపం పరిహారం కావటంలో ఆశ్చర్య మేముంది? ఇప్పుడు భగవంతుడవైన నీ పాద సందర్శనం వల్ల నాలోని దోషాలన్నీ పూర్తిగా నశించాయి. మందబుద్ధినైన నన్ను నారద మహర్షి అనుగ్రహించి భాగవత ధర్మాన్ని నాకు ఉపదేశించాడు. అందువల్ల ఇప్పుడు భగవంతుణ్ణి దర్శింపగలిగాను. మిణుగురు పురుగులకు సూర్యుడు గోచరించనట్లు సామాన్య మానవులకు జగదంతర్యామివైన నీ మహత్త్వం గోచరించదు. సృష్టిస్థితిలయాలకు హేతుభూతుడవై భగవంతుడవైన నీకు నమస్కరిస్తున్నాను” అని చెప్పి ఇంకా (ఇలా అన్నాడు).

6-477-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ బ్రహ్మాదు లెవ్వని నునయించి
క్తియుక్తుల మనమునఁ బ్రస్తుతింతు?
వని యెవ్వని తలమీఁద నావగింజఁ
బోలు? నా వేయుశిరముల భోగిఁ గొల్తు."

టీకా:

అరయ = కోరి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మొదలగువారు; ఎవ్వని = ఎవనిని; అనునయించి = స్తుతించి; భక్తి = భక్తి యనెడి; యుక్తులన్ = ఉపాయములచేత; మనమునన్ = మనసులో; ప్రస్తుతింతురు = కీర్తించెదరు; అవనిన్ = భూమిపైన; ఎవ్వని = ఎవని యొక్క; తల = శిరస్సు; మీద = పైన; ఆవగింజన్ = ఆవగింజ; పోలున్ = వలెనుండునో; ఆ = ఆ; వేయుశిరములభోగిన్ = ఆదిశేషుని {వేయు శిరముల భోగి - వేయు (వెయ్యి (1,000)) శిరముల (తలల) భోగి (పడగల వాడు, దేహము కల వాజు, భోగించువాడు), ఆదిశేషుడు}; కొల్తు = కొలచెదను.

భావము:

బ్రహ్మాది దేవతలు వినయ వినమ్రులై ఎవరిని ఆశ్రయించి భక్తితో స్తోత్రం చేస్తారో, ఈ సమస్త భూమండలం ఎవరి శిరస్సు మీద ఆవగింజ వలె ఉంటుందో అటువంటి వేయిపడగల మహా భోగివైన నిన్ను సేవిస్తాను”

6-478-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విధమున వినుతింపఁగ
నా విద్యాధరుల భర్త నియె ననంతుం
"డో! విమలబుద్ధి! నీ దగు
ధీవిభవంబునకు మెచ్చితిం బ్రియమారన్.

టీకా:

ఈ = ఈ; విధమున = విధముగ; వినుతింపగన్ = స్తుతించగా; ఆ = ఆ; విద్యాధరుల = విద్యాధరుల; భర్త = నాయకుని; కిన్ = కి; అనియెన్ = పలికెను; అనంతుండు = ఆదిశేషుడు; ఓ = ఓ; విమల = నిర్మలమైన; బుద్ధి = బుద్ధిగలవాడ; నీది = నీది; అగున్ = అయిన; ధీ = బుద్ధి; విభవంబున్ = గొప్పదనమున; కున్ = కు; మెచ్చితిన్ = మెచ్చుకొనుచున్నాను; ప్రియము = ఇష్ట; ఆరన్ = పూర్వకముగా.

భావము:

అని ఈ విధంగా విద్యాధర చక్రవర్తి అయిన చిత్రకేతుడు సంస్తుతించగా ఆదిశేషుడు అతనితో ఇలా అన్నాడు “ఓ బుద్ధిమంతుడా! నిర్మలమైన నీ బుద్ధి వైభవానికి మెచ్చుకున్నాను.

6-479-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయ నారదుండు నంగిరసుండును
త్త్వ మొసఁగినారు; దాని కతన
న్నుఁ జూడఁగల్గె నా భక్తి మదిఁ గల్గె
నా పథంబు నీకు మ్మఁ గలిగె.

టీకా:

అరయ = కోరి; నారదుండున్ = నారదుడు; అంగిరసుండునున్ = అంగిరసుడు; తత్త్వమున్ = తత్త్వజ్ఞానమును; ఒసగినారు = ప్రసాదించిరి; దాని = దాని; కతన = కారణముచేత; నన్నున్ = నన్ను; చూడన్ = దర్శించ; కల్గె = సాధ్యమైనది; నా = నా యెడల; భక్తి = భక్తి; మదిన్ = మనసులో; కల్గె = పుట్టెను; నా = నా యొక్క; పథంబున్ = మార్గము; నీ = నీ; కున్ = కు; నమ్మన్ = నమ్మిక; కలిగి = కలిగినది.

భావము:

నారదుడు, అంగిరసుడు నా యథార్థ స్వరూపాన్ని నీకు తెలియజేశారు. అందువల్ల నీవు నన్ను దర్శింపగలిగావు. నీ హృదయంలో నా భక్తి భావాన్ని పదిలపరచుకున్నావు. నా మార్గం మీద నీకు నమ్మకం కలిగింది.

6-480-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూని నా రూపంబు భూతజాలంబులు-
భూతభావనుఁడ నేఁ బొందుపడఁగ;
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వ-
తంబైన తనువులు గిలె నాకు;
ఖిలలోకంబులు నుగతంబై యుండు-
లోకంబు నాయందు జోకఁ జెందు;
నుయంబు నా యందు భిగతంబై యుండు-
భిలీనమయ్యె న య్యుయమందు;

6-480.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెలయ నిద్రించువాఁ డాత్మ విశ్వమెల్ల
జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ
గా వివేకించు మాడ్కినీ జీవితేశ
మాయ దిగనాడి పరమధర్మంబుఁదెలియు.

టీకా:

పూని = ధరించి; నా = నా యొక్క; రూపంబున్ = స్వరూపము; భూత = జీవుల; జాలంబులున్ = సమూహములు; భూత = జీవులను; భావనుడన్ = నిర్దేశించెడివాడను; ఏన్ = నేను; పొందుపడగ = అనుకూలముగ; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమును; మఱియున్ = ఇంకను; శబ్దబ్రహ్మమునున్ = శబ్దబ్రహ్మమును; శాశ్వతంబు = శాశ్వతము; ఐన = అయిన; తనువులున్ = దేహములు; తగిలెను = కలిగినవి; నా = నా; కున్ = కు; అఖిల = సర్వ; లోకంబులున్ = లోకములు; అనుగతంబు = అనుసరించునవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; లోకంబు = లోకములు; నా = నా; అందున్ = లోన; జోకజెందు = అందగించును; ఉభయంబున్ = రెండును (2) (బ్రహ్మశబ్దబ్రహ్మలు); నా = నా; అందున్ = లో; అభిగతంబున్ = పొందబడినవి; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అభిలీనంబు = మిక్కిలి లీనమైపోయినవి; ఆ = ఆ; ఉభయము = రెంటి (2); అందున్ = లోను;
వెలయన్ = ప్రసిద్ధముగా; నిద్రించువాడు = నిద్రించెడివాడు; ఆత్మన్ = తనలో; విశ్వము = జగత్తు; ఎల్లన్ = అంతటి యందు; చూచి = చూసి; మేల్కాంచి = నిద్రనుండి లేచి; తాను = తను; ఒక్క = ప్రస్తుత; చోటిన్ = ప్రదేశములో యున్న; వానిగా = వాడినిగా; వివేకించున్ = తెలిసుకొను; మాడ్కిన్ = విధముగ; జీవితేశ = భగవంతుని {జీవితేశుడు - జీవితమునకు ఈశుడు (ప్రభువు), భగవంతుడు}; మాయన్ = మాయను; దిగనాడి = విడిచిపెట్టి; పరమధర్మంబున్ = పరమధర్మమును; తెలియు = తెలియును.

భావము:

సమస్త జీవరాసులు నా స్వరూపాలు. నేను భూతభావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపాలను నిర్దేశించేవాడను నేను. బ్రహ్మమూ శబ్దబ్రహ్మమూ రెండూ శాశ్వతమైన నా దేహాలు. ఆత్మస్వరూపుడ నైన నేను అఖిల లోకాలలో నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులు నాకు అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెండింటిలో అంతర్లీనంగా ఉంటాను. నిద్రించేవాడు స్వప్నావస్థలో సమస్త విశ్వాన్ని సందర్శించి మేలుకొన్న తరువాత తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధంగా జీవుడు ఈ విశాల సృష్టి యందు విహరించి విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయనుండి విడివడి పరమార్థాన్ని తెలుసుకుంటాడు.

6-481-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిద్రపోవు వేళ నిరతుఁడై దేహిదా
నెట్టి గుణముచేత నింద్రియములఁ
డచినట్టి సుఖముఁ ను నట్టి బ్రహ్మంబుఁ
డిమి మెఱయ నన్నుఁగా నెఱుంగు.

టీకా:

నిద్రపోవు = నిద్రించెడి; వేళన్ = సమయములో; నిరతుడు = మిక్కిలి ఆపేక్ష గలవాడు; ఐ = అయ్యి; దేహి = జీవుడు; తాన్ = తను; ఎట్టి = ఎటువంటి; గుణము = గుణముల; చేత = వలన; ఇంద్రియములన్ = ఇంద్రియములను; కడచిన = దాటిన; అట్టి = అటువంటి; సుఖమున్ = సుఖమును; కనున్ = చూచునో; అట్టి = అటువంటి; బ్రహ్మంబున్ = బ్రహ్మమును; కడిమిన్ = చివరకు; మెఱయన్ = ప్రకాశముగా; నన్నున్ = నన్ను; కాన్ = అగునట్లు; ఎఱుంగున్ = తెలియుము.

భావము:

జీవుడు నిద్రించే సమయంలో ఇంద్రియాలకు అతీతుడై ఉంటాడు. అతనిని ఏ గుణాలూ స్పృశింపవు. అటువంటి ఇంద్రియాతీతమైన ఆనందస్థితినే బ్రహ్మంగా గుర్తించు. ఆ బ్రహ్మ స్వరూపమే నేనుగా తెలుసుకో.

6-482-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్వప్న మందు నెట్లు సంచార మొనరించు
మేలుకాంచి దృష్ట మోలి నెఱఁగు
నుభయ మెఱుఁగునట్టి యుత్తమ జ్ఞానంబు
త్త్వ; మట్టిదైన లఁపు నేను

టీకా:

స్వప్నము = కల; అందున్ = లో; ఎట్లు = ఏ విధముగ; సంచారము = సంచరించుటను; ఒనరించున్ = చేయునో; మేలుకాంచి = నిద్రలోంచి లేచి; దృష్టమున్ = చూడబడినదానిని; ఓలిన్ = క్రమముగ; ఎఱుగున్ = తెలియును; ఉభయమున్ = రెండును (2) (కలలోనిది మెలుకవలోనిది); ఎఱుగున్ = తెలియు; అట్టి = అట్టి; ఉత్తమ = ఉత్తమమైన; జ్ఞానంబున్ = జ్ఞానము; తత్త్వమున్ = తత్త్వజ్ఞానము; అట్టిది = అటువంటిది; ఐన = అయినట్టి; తలపు = భావము; నేను = నేను.

భావము:

జీవుడు స్వప్నంలో ఎక్కడెక్కడో ఎట్లెట్లో సంచరిస్తాడు. మేలుకొన్న తరువాత తాను చూచిన వాటిని అవగతం చేసుకుంటాడు. ఈ రెండు స్థితులనూ చక్కగా సమన్వయించుకొని ఒకటిగా గ్రహించడమే ఉత్తమ జ్ఞానం. అటువంటి జ్ఞానమే నేనుగా గుర్తించు.

6-483-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయంగ నెవ్వని లవిగానట్టి యీ-
లలిత మానుషజాతిఁ బుట్టి
యాత్మతత్త్వజ్ఞాన తుఁడైన వానికిఁ-
లుగునె యెందు సుఖం బొకింత?
వెలయఁ బ్రవృత్తి నివృత్తి మార్గంబుల-
సుఖదుఃఖచయముల సొరిదిఁ దెలిసి
నిచెడి సంకల్పలమూలమునఁ బాఱు-
డు సుఖదుఃఖ మోక్షములకొఱకు

6-483.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దంపతిక్రియామతంబు వర్తింతురు
దాన మోక్ష మేల క్కి యుండు?
ఖిల దుఃఖహేతు యిన యీ కర్మంబు
నెఱిఁగి నన్నుఁ దలఁప రిచ్చలోన.

టీకా:

అరయగన్ = తరచి చూసిన; ఎవ్వని = ఎవని; కిన్ = కిని; అలవి = సాధ్యము; కానట్టి = కానిది; ఈ = ఈ; సలలిత = చక్కదనము గలది; మానుష = మానవ; జాతిన్ = జాతిలో; పుట్టి = జన్మించి; ఆత్మ = పరమాత్మ యొక్క; తత్త్వజ్ఞాన = తత్త్వజ్ఞానము; హతుడు = నశించినవాడు; ఐన = అయినట్టి; వాని = వాని; కిన్ = కి; కలుగునె = పొందునా ఏమి; ఎందున్ = ఎక్కడైనా; సుఖంబున్ = సుఖము; ఒకింత = కొంచమైనను; వెలయన్ = ప్రసిద్ధముగ; ప్రవృత్తి = కర్మమార్గము; నివృత్తి = ముక్తి; మార్గంబులన్ = మార్గములలో; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖముల; చయములన్ = సమూహములను; సొరిదిని = క్రమముగ; తెలిసి = తెలిసికొని; పనిచెడి = నియోగించిన; సంకల్ప = సంకల్పముల; ఫల = ఫలితముల; మూలమునన్ = కొరకు; పాఱు = పరుగులుతీయును; కడు = మిక్కిలి; సుఖ = సుఖములు; దుఃఖ = దుఃఖములు; మోక్షముల = మోక్షముల; కొఱకున్ = కోసము;
దంపతిక్రియ = దాంపత్యజీవన; మతంబున్ = విధానమును; వర్తింతురు = ప్రవర్తించెదరు; దానన్ = దానివలన; మోక్షము = ముక్తిపథము; ఏల = ఎందులకు; దక్కి = లభించి; ఉండున్ = ఉండును; అఖిల = సర్వ; దుఃఖ = దుఃఖములకు; హేతువు = కారణభూతము; అయిన = అయిన; ఈ = ఈ; కర్మంబున్ = కర్మమార్గము; ఎఱిగి = తెలిసి; నన్నున్ = నన్ను; తలపరు = స్మరించరు; ఇచ్చ = కోరికల; లోనన్ = అందు.

భావము:

పరమ దుర్లభమూ ఉత్తమమూ అయిన నరజన్మనెత్తి కూడా ఆత్మస్వరూపం తెలుసుకోకుండా తప్పు మార్గంలో పడినవానికి సుఖమెలా లభిస్తుంది? మానవులు సుఖప్రాప్తి కోసం, దుఃఖ నివృత్తి కోసం ప్రయత్నిస్తుంటారు. ప్రవృత్తి మార్గాన్నీ నివృత్తి మార్గాన్నీ అవలంబిస్తారు. కాని వారి సంకల్పం కోరికతో కూడినందువల్ల వారికి సుఖం లభించరు. దుఃఖం తొలగిపోదు. కొందరు సుఖంకోసం దాంపత్య ధర్మాన్ని ఆశ్రయిస్తారు. దానిలో కూడా పరస్పరం వియోగం కలిగినప్పుడు విషాదం తప్పదు. అందువల్ల సంసార సంబంధంలో కూడా సుఖదుఃఖాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. నన్ను విస్మరించి దుఃఖకారణమైన ఈ బంధాలలో చిక్కుకున్నవారికి మోక్షం ఎలా దక్కుతుంది?

6-484-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు విజ్ఞానాభిమాను లైన మనుష్యులకు నతిసూక్ష్మం బైన యాత్మగతి నిజస్థానత్రయలక్షణంబునఁ జతుర్థాంశంబు నెఱింగి యైహికాముష్మిక విషయంబులచేతను వివేకబలంబులచేతను నియుక్తుండై జ్ఞానవిజ్ఞాన సంతృప్తుండైన పురుషుండు నాకు భక్తుం డగు; నీ విధంబులు గలవారలు యోగనైపుణ్యబుద్ధిగలవారలునై స్వార్థంబయిన యాత్మచేతం బరమాత్మను దెలియుచుందురు; నీవు నీ క్రమంబున మద్భక్తిశ్రద్ధాపరుండవై విజ్ఞాన సంపన్నంబులైన వాక్కులచేత నన్ను స్తోత్రంబు చేసి ముక్తుండ వైతి" వని యా శేషభగవంతుండు విద్యాధరపతి యైన చిత్రకేతుం బలికి యతని కదృశ్యుం డైపోయె; నే దిక్కున సర్వాత్మకుండైన యనంతుం డంతర్ధానంబు నొందె. నా దిక్కునకు విద్యాధర భర్త నమస్కరించి గగనచరుండై చని లక్షలసంఖ్య లైన దివ్యవర్షంబు లవ్యాహత బలేంద్రియుండై పరమయోగిపురుషులును, దివ్యమునీంద్రులును, సిద్ధ చారణ గంధర్వులును, వినుతి చేయం గులద్రోణాదిశైలంబులను రమ్యప్రదేశంబులను సంకల్పసిద్ధ ప్రదేశంబులను వినోదించుచు, శ్రీనారాయణదత్తంబగు దివ్యవిమానంబునందుఁ జరియించుచునుండి.

టీకా:

మఱియున్ = ఇంకను; విజ్ఞాన = విజ్ఞానము నందు; అభిమానులు = ఆపేక్ష గలవారు; ఐన = అయిన; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; అతి = మిక్కిలి; సూక్ష్మంబు = సూక్ష్మమైనది; ఐన = అయిన; ఆత్మగతి = తత్త్వమార్గము; నిజ = తన యొక్క; స్థానత్రయ = అవస్థాత్రయము యొక్క {అవస్థాత్రయము - 1జాగ్రత్ 2స్వప్న 3సుషుప్తి}; లక్షణంబునన్ = తత్త్వములను; చతుర్థాంశంబు = పరమపదము, తురీయమును; ఎఱింగి = తెలిసికొని; ఐహిక = ఇహలోకపు; ఆముష్మిక = పరలోకపు; విషయంబుల = విషయముల; చేతను = వలన; వివేక = యుక్తాయుక్తజ్ఞానము యొక్క; బలంబుల = శక్తుల; చేతను = వలన; నియుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; జ్ఞాన = పరతత్త్వము; విజ్ఞాన = విజ్ఞానములచే; సంతృప్తుండు = సంతుష్టుండు; ఐన = అయిన; పురుషుండు = పురుషుడు; నా = నా; కున్ = కు; భక్తుండు = భక్తుడు; అగున్ = అగును; ఈ = ఈ; విధంబులు = విధములు; కల = ఉన్నట్టి; వారు = వారు; యోగ = యోగము యొక్క; నైపుణ్య = నిపుణతగల; బుద్ధి = బుద్ధి; కల = కలిగిన; వారలున్ = వారు; ఐ = అయ్యి; స్వార్థంబు = ఆత్మజ్ఞానమే ప్రయోజనముగా గలది; అయిన = అయిన; ఆత్మ = ఆత్మ; చేతన్ = వలన; పరమాత్మను = పరమాత్మను; తెలియుచుందురు = తెలిసికొనుచుందురు; నీవున్ = నీవుకూడ; ఈ = ఈ; క్రమంబునన్ = విధముగనే; మత్ = నా యొక్క; భక్తి = భక్తి యందు; శ్రద్ధా = శ్రద్ధతో; పరుండవు = నిష్ఠగలవాడవు; ఐ = అయ్యి; విజ్ఞాన = విజ్ఞానముచే; సంపన్నంబులు = అతిశయించినవి; ఐన = అయిన; వాక్కుల = పలుకుల; చేత = వలన; నన్నున్ = నన్ను; స్తోత్రంబున్ = స్తుతించుట; చేసి = చేసి; ముక్తుండవు = ముక్తిచెందినవాడవు; ఐతివి = అయినావు; అని = అని; ఆ = ఆ; శేష = ఆదిశేషుడు యైన; భగవంతుడు = భగవంతుడు; విద్యాధర = విద్యాధర; పతి = నాయకుడు; ఐన = అయిన; చిత్రకేతున్ = చిత్రకేతునికి; పలికి = చెప్పి; అతని = అతని; కిన్ = కి; అదృశ్యుండు = అంతర్ధానుండు; ఐపోయె = ఐపోయెను; ఏ = ఏ; దిక్కునన్ = దిక్కునందైతే; సర్వాత్మకుండు = సర్వ ఆత్మలలోను యుండెడివాడు; ఐన = అయిన; అనంతుండు = శేషుడు; అంతర్ధానంబు = అదృశ్యము; ఒందెన్ = ఆయెనో; ఆ = ఆ; దిక్కున్ = వైపున; కున్ = కు; విద్యాధర = విద్యాధరుల; భర్త = నాయకుడు; నమస్కరించి = నమస్కరించి; గగనచరుండు = ఆకాశమార్గమున వెళ్ళువాడు; ఐ = అయ్యి; చని = వెళ్ళి; లక్షల = లక్షలకొలది; సంఖ్యలు = సంఖ్యలు; ఐన = అయిన; దివ్యవర్షంబులు = దివ్యసంవత్సరములు {దివ్య సంవత్సరము - 360 మానవ సంవత్సరములుకు సమానము}; అవ్యాహత = అడ్డులేని; బల = బలము; ఇంద్రియుండు = ఇంద్రియ పటుత్వములు గలవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యుత్తమమైన; యోగి = యోగి; పురుషులును = పుంగవులు; దివ్య = దేవతా; ముని = మునులలో; ఇంద్రులును = శ్రేష్ఠులును; సిద్ధ = సిద్ధులు; చారణ = చారణులు; గంధర్వులును = గంధర్వులు; వినుతి = స్తోత్రము; చేయన్ = చేయుచుండగా; కుల = కులపర్వతము; ద్రోణ = ద్రోణాచలము; ఆది = మొదలైన; శైలంబులను = పర్వతములను; రమ్య = మనోహరమైన; ప్రదేశంబులను = ప్రదేశములను; సంకల్ప = సంకల్పములు; సిద్ధ = సిద్ధించెడి; ప్రదేశంబులను = ప్రదేశములను; వినోదించుచు = విహరించుచు; శ్రీ = శుభకరుడైన; నారాయణ = విష్ణుమూర్తిచే; దత్తంబున్ = ఇవ్వబడినది; అగు = అయిన; దివ్య = దివ్యమైన; విమానంబున్ = విమానము; అందున్ = అందు; చరియించుచునుండి = తిరుగుతుండి.

భావము:

విజ్ఞానాన్ని అభిమానించే మానవులు జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలకు అతీతమూ నాలుగవదీ అయిన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న పురుషుడు ఇహపరాలను చక్కగా గుర్తించినవాడై, యుక్తాయుక్త వివేకంతో కూడినవాడై, జ్ఞాన విజ్ఞానాలతో సంతుష్టుడై నాకు భక్తుడౌతాడు. ఇటువంటి వారే యోగవిద్యలో నైపుణ్యం సంపాదించి ఆత్మను దర్శిస్తారు. ఆ ఆత్మానుభూతితో పరమాత్మను సందర్శిస్తారు. నీవు అదే విధంగా నాయందు శ్రద్ధాభక్తులు కలవాడవై విజ్ఞాన సంపన్నాలైన వాక్కులతో నన్ను స్తుతించి ముక్తుడవైనావు” అని ఆ ఆదిశేషుడు విద్యాధర చక్రవర్తి అయిన చిత్రకేతునితో పలికి అంతర్థానం చెందాడు. చిత్రకేతుడు ఆదిశేషుడు అదృశ్యమైన దిక్కుకు నమస్కరించి ఆకాశమార్గాన పయనించి అవ్యాహతమైన బలమూ, ఇంద్రియ పటుత్వమూ కలవాడై పరమయోగి పుంగవులూ, దివ్య మునీంద్రులూ, సిద్ధ చారణ గంధర్వులూ కొనియాడుతుండగా లక్షల కొలది దివ్య సంవత్సరాలు రమణీయ ప్రదేశాలలో సంచరిస్తూ, సంకల్ప సిద్ధులైన మహానుభావులు నివసించే స్థలాలలో వినోదిస్తూ, శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన దివ్య విమానంలో విహరిస్తూ...

6-485-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డించున్ హరి దివ్యనాటక గుణవ్యాపార నృత్యంబులం;
బాడించున్ జలజాతనేత్ర బిరుదప్రఖ్యాత గీతంబులం;
గూడించున్ సతతంబు జిహ్వలతుదిన్ గోవిందనామావళుల్
క్రీడం గిన్నర యక్ష కామినులచేఁ గృష్ణార్పితస్వాంతుఁడై.

టీకా:

ఆడించున్ = ఆడించును; హరి = నారాయణుని; దివ్య = దివ్యమైన; నాటక = నాటకములు; గుణ = గుణములు; వ్యాపార = వర్తనల గురించిన; నృత్యంబులన్ = నృత్యములను; పాడించున్ = పాడించును; జలజాతనేత్ర = నారాయణుని {జలజాతనేత్రుడు - జలజాతము (పద్మముల)వంటి నేత్రములు గలవాడు, విష్ణువు}; బిరుద = వైభవములను తెలిపెడి; ప్రఖ్యాత = ప్రసిద్ధమైన; గీతంబులన్ = పాటలను; కూడించున్ = కలిగించును; సతతంబున్ = ఎల్లప్పుడు; జిహ్వల = నాలుకల; తుదిన్ = చివరల యందు; గోవింద = గోవిందుని; నామ = నామముల; ఆవళున్ = సమూహములను; క్రీడన్ = లీలలుగా; కిన్నర = కిన్నరలు; యక్ష = యక్షులు; కామినుల్ = స్త్రీల; చేన్ = చేత; కృష్ణ = కృష్ణునికి; అర్పిత = సమర్పింపబడిన; స్వాంతుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి.

భావము:

చిత్రకేతుడు కిన్నరకాంతల చేత, యక్షకాంతల చేత జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి దివ్య లీలలను గానం చేయించాడు. నాట్యం చేయించాడు. ఆ పుండరీకాక్షుని నామాలను నిరంతరం నాలుకలపై పలికించాడు. ఈ విధంగా కృష్ణుని యందే లగ్నమైన మనస్సుతో చిత్రకేతుడు ప్రవర్తించాడు.

6-486-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వాసించు నాత్మఁ బో వైష్ణవజ్ఞానంబు-
నాశించు భాగవతార్చనంబు;
భూషించు నే ప్రొద్దుఁ బుండరీకాక్షుని-
భాషించు హరికథాప్రౌఢి మెఱసి;
ఘోషించు హరినామగుణనికాయంబులు-
పోషించుఁ బరతత్త్వ బోధ మరసి;
సేవించు శ్రీకృష్ణ సేవక నికరంబు-
సుఖమునఁ జేయు నీశునకు బలులు;

6-486.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పాడుఁ బాడించు వైకుంఠర్త నటన
రూ వర్తన గుణ నామ దీపి తోరు
గీతజాత ప్రబంధ సంగీత విధుల
గేశవప్రీతిగాఁ జిత్రకేతుఁ డపుడు.

టీకా:

వాసించున్ = వసించును; ఆత్మన్ = తనలో; పో = అవశ్యము; వైష్ణవ = వైష్ణవధర్మమునకు చెందిన; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఆశించున్ = కోరుకొనును; భాగవత = భగవంతుని యొక్క; అర్చనంబున్ = పూజలను; భూషించున్ = కొనియాడుచుండును; ఏ = ఏ; ప్రొద్దున్ = వేళనైనను; పుండరీకాక్షుని = నారాయణుని {పుండరీకాక్షుడు - పుండరీకములు (తెల్లకలువలు) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు}; భాషించున్ = చెప్పుచుండును; హరి = నారాయణుని; కథా = కథలను; ప్రౌఢి = నేర్పరితనము; మెఱసి = అతిశయించి; ఘోషించున్ = చాటించుచుండును; హరి = నారాయణుని; నామ = నామములు; గుణ = సుగుణముల; నికాయంబులున్ = సమూహములను; పోషించున్ = పెంచుకొనుచుండును; పరతత్త్వ = పరమాత్మనుగూర్చిన; బోధము = జ్ఞానమును; అరసి = తెలిసికొనుచు; సేవించున్ = కొలుచును; శ్రీకృష్ణ = శ్రీకృష్ణుని; సేవక = భక్తుల; నికరంబున్ = సమూహములను; సుఖమునన్ = చక్కగా; చేయున్ = చేయును; ఈశున్ = భగవంతుని; కున్ = కి; బలులు = ప్రసాదములు;
పాడున్ = పాడును; పాడించున్ = పాడించును; వైకుంఠభర్త = నారాయణుని {వైకుంఠ భర్త - వైకుంఠమునకు భర్త (ప్రభువు), విష్ణువు}; నటన = లీలలు; రూప = స్వరూపములు; వర్తన = నడవడికలు; గుణ = సుగుణముల; నామ = నామములుతో; దీపిత = ప్రకాశించెడి; ఉరు = గొప్ప; గీత = గీతముల; జాత = సమూహములను; ప్రబంధ = ప్రబంధములను; సంగీత = పాటల; విధులన్ = విధానములందు; కేశవ = నారాయణుని; ప్రీతిగా = ఇష్టమగునట్లుగా; అపుడు = అప్పుడు.

భావము:

చిత్రకేతుడు తన మనస్సులో ఎల్లప్పుడు వైష్ణవ జ్ఞానాన్ని నిలుపుకొంటాడు. భగవత్సంబంధమైన అర్చనలను కోరుకుంటాడు. ఎల్లప్పుడు పుండరీకాక్షుడైన విష్ణువును కొనియాడుతుంటాడు. శ్రీహరి కథలను చక్కగా వక్కాణిస్తుంటాడు. విష్ణువు సుగుణాలను ఎలుగెత్తి చాటుతూ ఉంటాడు. పరతత్త్వ జ్ఞానాన్ని పెంచుకొంటాడు. శ్రీకృష్ణుని సేవకులను సేవిస్తుంటాడు. నారాయణునకు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాడు. గోవిందుని లీలలను, రూపాన్ని, విలాసాలను, సుగుణాలను, నామాలను వెల్లడి చేసే గొప్ప పాటలను పాడుతూ పాడిస్తూ ఉంటాడు. అప్పుడు...

6-487-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిఁ గీర్తించుచు నల్లనల్ల మదిలో బ్జాక్షు సేవించుచుం
మానందము నొందుచున్ జగములం బ్రఖ్యాతి వర్తించుచున్
సురాజోపమమూర్తి యక్షగణముల్ సొంపార విద్యాధరా
ప్ససల్ గొల్వఁగఁ బాడఁగా సితగిరిప్రాంతంబునన్నేగుచున్.

టీకా:

హరిన్ = నారాయణుని; కీర్తించుచున్ = శ్లాఘించుచు; అల్లనల్లన్ = మెల్లిమెల్లిగా; మదిలోన్ = మనసులో; అబ్జాక్షున్ = నారాయణుని; సేవించున్ = కొలుచుచు; పరమానందమున్ = పరమానందమును; ఒందుచున్ = పొందుచు; జగములన్ = లోకములలో; ప్రఖ్యాతిన్ = ప్రసిద్ధిని; వర్తించుచున్ = తిరుగుతుండి; సురరాజ = దేవేంద్రునితో; ఉపమ = పోల్చదగిన; మూర్తిన్ = స్వరూపముతో; యక్ష = యక్షుల; గణముల్ = సమూహములు; సొంపార = చక్కగా; విద్యాధర = విద్యాధరులు; అప్సరసల్ = అప్సరసలు; కొల్వగాన్ = సేవించుచుండగా; పాడగా = కీర్తించుచుండగా; సితగిరి = కైలాసపర్వతపు {సితగిరి - సిత (తెల్లని) గిరి (పర్వతము), కైలాసపర్వతము}; ప్రాంతంబునన్ = ప్రదేశము నందు; ఏగుచున్ = వెళ్తూ.

భావము:

చిత్రకేతుడు విష్ణుదేవుని వినుతిస్తూ, సేవిస్తూ పరమానందాన్ని పొందుతూ లోకంలో పేరెన్నిక గన్నాడు. ఇంద్రునితో సమానుడై యక్షులు, విద్యాధరులు, అప్సరసలు సేవిస్తూ ఉండగా హిమాలయ ప్రాంతంలో సంచరిస్తూ...

6-488-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విద్యాధరభర్త గాంచె హరనీహా రామృతాహాసమున్
శ్రీవిభ్రాజితమున్ నిరస్త గిరిజా సేవాగతాయాసమున్
దేవానీక వికాసమున్ శుభమహాదేవాంఘ్రి సంవాసమున్
భూవిఖ్యాత విలాసముం ద్రిభువనీ పూతంబుఁ గైలాసమున్.

టీకా:

ఆ = ఆ; విద్యాధర = విద్యాధరుల; భర్త = నాయకుడు; కాంచెన్ = చూచెను; హర = పరమశివుని; నీహార = మంచువంటి; అమృతా = అమృతమువంటి; హాసమున్ = చిరునవ్వులు గలది; శ్రీ = శుభకరమైన; విభ్రాజితమున్ = మిక్కిలి ప్రకాశించుతున్నది; నిరస్త = పోగొట్టబడిన; గిరిజా = పార్వతీదేవి; సేవా = సేవ చేయుట వలన; ఆగత = వచ్చిన; ఆయాసమున్ = ప్రయాసలు గలది; దేవ = దేవతలు; అనీక = సర్వులకు; వికాసమున్ = వికాసము నిచ్చునది; శుభ = శుభమైన; మహాదేవ = పరమశివుని; అంఘ్రి = పాదముల; సంవాసమున్ = చక్కటి నివాసము; భూ = భూలోక మంతను వ్యాపించిన; విఖ్యాత = యశస్సు యొక్క; విలాసమున్ = శోభ గలది; త్రిభువనీ = ముల్లోకములను; పూతంబున్ = పవిత్రము చేసెడిది అగు; కైలాసమున్ = కైలాసపర్వతమును.

భావము:

ఆ విద్యాధర చక్తవర్తి అక్కడ కైలాస పర్వతాన్ని చూశాడు. అది శివుని వలె, మంచు వలె, అమృతం వలె తెల్లగా శోభిస్తున్నది. సిరి సంపదలతో విరాజిల్లుతున్నది. పార్వతీ దేవిని సేవించడానికి వచ్చిన భక్తుల శ్రమను తొలగిస్తున్నది. దేవతలకు వికాసాన్ని సమకూరుస్తున్నది. మహాశివుని పాద స్పర్శచే పునీతమైనది. విశ్వవిఖ్యాతి గన్నది. లోకాలను పవిత్రం చేస్తున్నది.

6-489-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జత భూధరంబున
నీరేజభవామరాది నికరము గొల్వం
బేరోలగమున నుండిన
గౌరీయుతుఁ డయిన హరునిఁ నియె నరేంద్రా!

టీకా:

ఆ = ఆ; రజతభూధరంబునన్ = కైలాసపర్వతము నందు {రజత భూధరము - రజత (వెండి, తెల్లని) భూధరము (కొండ), కైలాసపర్వతము}; నీరేజభవ = బ్రహ్మదేవుడు {నీరేజ భవుడు - నీరేజము (పద్మము) నందు భవ (పుట్టినవాడు), బ్రహ్మ}; అమర = దేవతలు; ఆది = మొదలగువారి; నికరము = సమూహములు; కొల్వన్ = సేవించుచుండగా; పేరు = పెద్ద, గొప్ప; ఓలగమునన్ = సభలో; ఉండిన = కొలువుతీరిన గౌరీ = పార్వతీదేవితో; యుతుడు = కలిసి యున్నవాడు; అయిన = ఐన; హరునిన్ = శంకరుని; కనియెన్ = దర్శించెను; నరేంద్రా = రాజా.

భావము:

రాజా! ఆ వెండికొండపై బ్రహ్మాది దేవతలు సేవిస్తుండగా పార్వతీ సమేతుడై కొలువు తీర్చి ఉన్న పరమేశ్వరుని చిత్రకేతుడు చూశాడు.

6-490-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న దగు రూప మింయు నేని దెలియక-
వాదంబు చేసెడు వేరవముఁ
రుణావలోకనాకాంక్షితులై యున్న-
బ్రహ్మాది సనకసంప్రణుతిరవము
సారశివానందల్లాపముల నొప్పు-
ప్రమథగణాళి యార్భటరవంబు
మరుమృదంగాది మఢమధ్వనితోడి-
టుభృంగి నాట్య విస్ఫారరవము

6-490.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానుగాఁ జామరులు వీచు మాతృకాది
కామినీజన మహిత కంణరవంబు
మెండుఁ జెలఁగంగఁ గన్నుల పండు వయ్యెఁ
గొండరాచూలి పెనిమిటి నిండుకొల్వు.

టీకా:

తనది = తనది; అగు = అయిన; రూపము = స్వరూపము; ఇంతయునేని = కొంచము కూడ; తెలియక = తెలియకుండగనే; వాదంబున్ = వాదములను; చేసెడున్ = చేయుచున్నవి; వేద = వేదముల; రవమున్ = శబ్దము; కరుణ = దయతో కూడిన; అవలోకన = చూపుల; ఆకాంక్షితులు = అపేక్షించెడివారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలు; సనక = సనకాదుల యొక్క; సంప్రణుతి = చక్కటి స్తోత్రముల; రవమున్ = శబ్దములు; సార = సారవంతములైన; శివ = పరమశివుని గూర్చిన, శుభమైన; ఆనంద = ఆనందపు; సల్లాపములన్ = సంభాషణములతో; ఒప్పు = ఒప్పుచుండెడి; ప్రమథగణ = ప్రమథగణముల; ఆళి = సమూహముల యొక్క; ఆర్భట = ఆర్భాటముల; రవమున్ = శబ్దములు; డమరు = డమరుకలు; మృదంగ = మృదంగములు; ఆది = మొదలగువాని; ఢమఢమ = ఢమఢమ మనియెడి; ధ్వని = శబ్దము; తోడి = తోటి; పటు = బహుచక్కని; భృంగి = భృంగి యొక్క {భృంగి - శివుని ప్రమథగణములలో ఒకడు}; నాట్య = నాట్యముల; విస్ఫార = మిక్కిలి అధికమైన; రవమున్ = శబ్దములు;
మానుగా = మనోజ్ఞముగా; చామరులు = చామరములను; వీచు = వీచెడి; మాతృక = మాతృకలు; ఆది = మొదలగు; కామినీజన = స్త్రీల; మహిత = గొప్ప; కంకణ = చేతి కంకణముల; రవంబున్ = శబ్దములు; మెండున్ = మిక్కిలిగా; చెలగంగన్ = చెలరేగుచుండగ; కన్నుల = కన్నులకు; పండువ = పండుగ; అయ్యెన్ = అయ్యెను; కొండరాచూలిపెనిమిటి = పరమశివుని {కొండ రాచూలి పెనిమిటి - కొండ (పర్వత) రా(రాజు) చూలి(పుత్రిక యైన పార్వతి) యొక్క పెనిమిటి(భర్త)}; నిండుకొల్వు = నిండైన కొలువు.

భావము:

అక్కడ భగవంతుని యథార్థ స్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదించుకుంటున్నాయి. పరమశివుని దయావీక్షణం కోసం నిరీక్షిస్తూ బ్రహ్మాది దేవతలు, సనకుడు మొదలైన దేవర్షులూ స్తోత్రాలు చేస్తున్నారు. సదాశివుని సల్లాపాలను చెప్పుకుంటూ ప్రమథగణాలు ఆనందంతో కేకలు వేస్తున్నారు. డమరుకం, మృదంగం మొదలైన వాద్యాల ఢమఢమ ధ్వనులకు అనుగుణంగా భృంగి నాట్యం చేస్తున్నాడు. వింజామరలు వీస్తున్న సప్తమాతృకల చేతి మణికంకణ నిక్వాణాలు వినిపిస్తున్నాయి. ఆ విధంగా పరమేశ్వరుని నిండు కొలువు కన్నుల పండుగ చేసింది.

6-491-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బ్రహ్మాది సురనికర సేవితుండై యూరుపీఠంబుననున్న భవానిం గౌగిటం జేర్చుకొని యొడ్డోలగంబున నున్న పరమేశ్వరుం జూచి చిత్రకేతుండు పకపక నగి యద్దేవి వినుచుండ నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగు; సుర = దేవతల; నికర = సమూహములచే; సేవితుండు = కొలిచెడివాడు; ఐ = అయ్యి; ఊరు = తొడలు యనెడి; పీఠంబునన్ = పీఠముపైన; ఉన్న = ఉన్నట్టి; భవానిన్ = పార్వతీదేవితో; కౌగిటన్ = కౌగిట్లో; చేర్చుకొని = చేర్చుకొని; ఒడ్డోలగంబునన్ = నిండుసభలో {ఒడ్డోలగము - ఒడ్డు (నిండైన) ఓలగము (సభ)}; ఉన్న = ఉన్నట్టి; పరమేశ్వరున్ = శంకరుని; చూచి = చూసి; చిత్రకేతుండు = చిత్రకేతుడు; పకపక = పకపక యని; నగి = పరిహసించి; ఆ = ఆ; దేవి = పార్వతీదేవి; వినుచుండన్ = వినుచుండగ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా బ్రహ్మాది దేవతా సమూహం సేవిస్తుండగా, తొడమీద కూర్చున్న పార్వతీదేవిని ఆదరంతో ఆలింగనం చేసుకొని నిండు కొలువున్న పరమేశ్వరుణ్ణి చూచి చిత్రకేతుడు పకపక నవ్వాడు. పార్వతి వినేటట్లు ఈ విధంగా అన్నాడు.

6-492-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కొమరొప్పఁగా లోకగురుఁడును గడలేని-
ర్మస్వరూపంబుఁ దాన యగుచు
డలు ధరించియు రిలేని తపమునఁ-
బొడవైన యీ యోగిపుంగవులును
బ్రహ్మవాదులుఁ గొల్వ భాసిల్లు కొల్వులో-
మిథునరూపంబున మెలఁతతోడఁ
బ్రాకృతుండునుబోలె ద్ధానురాగుఁడై -
లాలితుం డయ్యె నిర్లజ్జత నిట;

6-492.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కట! ప్రకృతిపురుషుఁ డైనఁ దా నేకాంత
మందు సతులతోడ లరుఁగాని
యిట్లు ధర్మసభల నింతులతోఁగూడి
రిఢవింపలేఁడు భ్రాంతి నొంది. "

టీకా:

కొమరు = మనోజ్ఞము; ఒప్పగా = ఒప్పుతుండగ; లోక = లోకములకు; గురుడునున్ = పెద్దవాడు; కడలేని = అనంతమైన; ధర్మ = ధర్మము యొక్క; స్వరూపంబున్ = స్వరూపమును; తాన = తను; అగుచున్ = అగుచు; జడలు = జటలు; ధరించియున్ = ధరించి; సరిలేని = సాటిలేని; తపమునన్ = తపస్సుచేత; పొడవు = గొప్పవారు; ఐన = అయిన; ఈ = ఈ; యోగి = యోగులలో; పుంగవులును = శ్రేష్ఠులు; బ్రహ్మవాదులున్ = వేదవిజ్ఞానులు; కొల్వ = సేవించుతుండగ; భాసిల్లు = ప్రకాశించెడి; కొల్వు = సభ; లోన్ = అందు; మిథున = దంపతుల; రూపంబునన్ = వలె; మెలత = భార్య; తోడన్ = తోటి; ప్రాకృతుండునున్ = సామాన్యుని; పోలెన్ = వలె; బద్ధానురాగుండు = ప్రేమతో వివశుండు; ఐ = అయ్యి; లాలితుండు = లాలించుచున్నవాడు; ఐ = అయ్యి; నిర్లజ్జతన్ = సిగ్గు లేకుండగా; ఇటన్ = ఇక్కడ;
ప్రకృతి = ప్రకృతి; పురుషుడున్ = పురుషుడును; ఐనన్ = అయినను; తాను = తను; ఏకాంతము = ఏకాంతము; అందున్ = లో; సతుల = భార్యల; తోడన్ = తోటి; అలరు = సంతోషించును; కాని = కాని; ఇట్లు = ఈ విధముగ; ధర్మసభలన్ = ధర్మసభ లందు; ఇంతుల = స్త్రీల; తోన్ = తోటి; కూడి = కలిసి యుండి; పరిఢవింపన్ = అతిశయించ; లేడు = లేడు; భ్రాంతిన్ = భ్రమలో; ఒంది = పడిపోతూ.

భావము:

“అయ్యో! సకలలోక జనకుడు, సర్వధర్మ స్వరూపుడు అయిన పరమేశ్వరుడు జటాధారులు, మహా తపస్సంపన్నులు, యోగిపుంగవులు, బ్రహ్మవేత్తలు పరివేష్టించి సేవిస్తున్న ఈ మహాసభలో మామూలు మానవునిలాగా ప్రేమకు వివశుడై సిగ్గు లేకుండా భార్యను కౌగిలించుకొని కూర్చున్నాడు. పామరుడు సైతం కాంతలతో ఏకాంతంగా విహరిస్తాడు. కాని ఈ విధంగా ధర్మసభలలో నెచ్చెలులతో కూడి విచ్చలవిడిగా ప్రవర్తించడు”.

6-493-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని సర్వేశ్వరుఁ డా
ని నేమియు ననక నవ్వెఁ త్సభవారుం
నుగొని యూరక యుండిరి
నుజేశ్వర! యీశుధైర్య ది యెట్టిదియో?

టీకా:

అనన్ = అనగా; విని = విని; సర్వేశ్వరుడు = పరమేశ్వరుడు; ఆతనిన్ = అతనిని; ఏమియున్ = ఏమి; అనక = అనకుండగ; నవ్వెన్ = నవ్వెను; తత్ = ఆ; సభ = సభలోని; వారున్ = వారు; కనుంగొని = చూసి; యూరకయుండిరి = ఊరుకొంటిరి; మనుజేశ్వర = రాజా; ఈశున్ = శంకరుని; ధైర్యము = ధైర్యము; అది = అది; ఎట్టిదియో = ఎంతగట్టిదో కదా.

భావము:

అని పలుకగా విని శివుడు అతన్ని ఏమీ అనకుండా చిరునవ్వు నవ్వాడు. ఆ సభలోని వారంతా మౌనంగా ఉండిపోయారు. రాజా! శంకరుని ధైర్యం ఎంతటిదో కదా!

6-494-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దన పూర్వకర్మశేషంబున నింద్రియ జయుండ నని పుట్టిన యహంకారంబున, జగద్గురువుం బెక్కు ప్రల్లదంబు లాడుచున్న చిత్రకేతుం జూచి భవాని యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తన = తన; పూర్వ = ఇంతకు పూర్వము చేసిన; కర్మశేషంబునన్ = మిగిలిన కర్మల ఫలితము వలన; ఇంద్రియ = ఇంద్రియములను; జయుండను = జయించినవాడను; అని = అనుకొనుటవలన; పుట్టిన = పుట్టిన; అహంకారంబునన్ = అహంకారమువలన; జగద్గురువున్ = శంకరుని {జగద్గురువు - జగత్తునకే గురువు యైనవాడు, శివుడు}; పెక్కు = అనేకమైన; ప్రల్లదంబులు = పౌరుషపు మాటలు; ఆడుచున్న = పలుకుతున్న; చిత్రకేతున్ = చిత్రకేతుని; చూచి = చూసి; భవాని = పార్వతీదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా పూర్వజన్మలో చేసిన కర్మల ప్రభావం వల్లనో, జితేంద్రియుడనన్న అహంకారం వల్లనో జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి పరిహసిస్తున్న చిత్రకేతును చూచి పార్వతి ఇలా అన్నది.

6-495-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మముబోఁటి లజ్జ లుడిగిన
కుతులకుం గర్త యగుచుఁ గోపింపంగా
మితాజ్ఞానిపుణుం డగు
నుండా నేఁడు వీఁడు గముల కెల్లన్?

టీకా:

మమున్ = మమ్ములను; పోటి = వంటి; లజ్జలు = సిగ్గులు; ఉడిగిన = వదలిన; కుమతుల్ = దుర్బుద్ధుల; కున్ = కు; కర్త = కల్పించుకొన్నవాడు; అగుచున్ = అగుచు; కోపింపగాన్ = దండించుటకు; అమిత = మిక్కిలి; ఆజ్ఞా = ఆజ్ఞాపించుటలో; నిపుణుండు = నేర్పరి; అగు = అయిన; శమనుండా = యమధర్మరాజా ఏమి; నేడు = ఇప్పుడు; వీడు = ఇతడు; జగముల్ = లోకముల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికిని.

భావము:

“మావంటి వారిని సిగ్గుమాలిన వారనీ, మతిమాలిన వారనీ ఆక్షేపించడానికి, ఆజ్ఞాపించడానికి తెగించిన మొనగాడా వీడు? లోకాలకు నియంతనా వీడు?

6-496-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భృగు నారద కపిలాదులు
నిమాంతజ్ఞులును యోగనిర్ణయ నిపుణుల్
త్రిగుణాతీతు మహేశ్వరు
రెన్నఁడు వారు ధర్మయ మెఱుఁగరొకో?

టీకా:

భృగు = భృగువు; నారద = నారదుడు; కపిల = కపిలుడు; ఆదులు = మొదలగువారు; నిగమాంత = వేదాంతము నందు; జ్ఞులు = మిక్కిలి జ్ఞానులు; యోగ = యోగవిద్యా లక్షణములను; నిర్ణయ = నియమించెడి; నిపుణుల్ = నిపుణులు; త్రిగుణ = గుణత్రయమునకు; అతీతున్ = అతీతమైనవాడైన; మహేశ్వరున్ = శంకరుని; నగరు = పరిహసింపరు; ఎన్నడున్ = ఎప్పుడును; వారున్ = వారు; ధర్మ = ధర్మము యొక్క; నయమున్ = పద్ధతి; ఎఱుగరొకో = తెలియరేమో.

భావము:

భృగువు, నారదుడు, కపిలుడు మొదలైన వేదాంత వేత్తలు, యోగవిద్యా విశారదులు సైతం త్రిగుణాతీతుడైన త్రినేత్రుని ఎప్పుడూ పరిహసించి ఎరుగరే! వారు ఉచితానుచితాలు తెలియనివారా?

6-497-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్వని పదపద్మ మింద్రాది విబుధుల-
చూడాగ్రపంక్తుల నీడఁ జూచు,
నెవ్వని తత్త్వంబ దెనయంగ బ్రహ్మాది-
యోగిమానసపంక్తి నోలలాడు,
నెవ్వని రూపంబు నేర్పాటు గానక-
వేదంబు లందంద వా మడఁచు,
నెవ్వని కారుణ్య మీ లోకముల నెల్లఁ-
నిపి యెంతయు ధన్యములఁ జేయు,

6-497.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి సర్వేశుఁ బాపసంహారు ధీరు
శాశ్వతైశ్వర్యు నాత్మసంసారు నీశు
నెగ్గు పల్కిన పాపాత్ముఁ డెల్ల భంగి
దండనార్హుండు గాకెట్లు లఁగఁ గలడు?

టీకా:

ఎవ్వని = ఎవని; పద = పాదములు యనెడి; పద్మమున్ = పద్మమును; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; విబుధుల = దేవతల యొక్క; చూడాగ్ర = కిరీటముల; పంక్తుల = వరుసల; నీడన్ = నీడలను; చూచున్ = చూచునో; ఎవ్వని = ఎవని యొక్క; తత్త్వంబున్ = తత్త్వమంటే; అది = అది; ఎనయంగన్ = అతిశయించగ; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారు; యోగి = యోగుల; మానస = మనసుల; పంక్తిన్ = సమూహము లందు; ఓలలాడన్ = తేలియాడుతుండగా; ఎవ్వని = ఎవని యొక్క; రూపంబున్ = స్వరూపమును; ఏర్పాటున్ = సమగ్రముగా; కానక = అంతుపట్టలేక; వేదంబుల్ = వేదములు; అందందన్ = ఆయా; వాదమున్ = వాదములను; అడంచున్ = తమలోనే అణచుకొనును; ఎవ్వని = ఎవని యొక్క; కారుణ్యము = దయ; ఈ = ఈ; లోకములన్ = లోకములను; ఎల్లన్ = సమస్తమును; తనిపి = సంతృప్తిపరచి; ఎంతయున్ = మిక్కిలి అధికమైన; ధన్యతములన్ = అత్యంత ధన్యమైన వారిగా {ధన్యులు - ధన్యతరులు - ధన్యతములు}; చేయున్ = చేయునో; అట్టి = అటువంటి;
సర్వేశున్ = సర్వులకును ఈశ్వరుని {సర్వేశుడు - సర్వులకును ఈశుడు (ఫ్రభువు), శంకరుడు}; పాపసంహారున్ = పాపములను నశింపజేయువాని; ధీరున్ = విజ్ఞానిని; శాశ్వతైశ్వర్యున్ = శాశ్వతమైన ఐశ్వర్యములు గలవాని; ఆత్మసంసారున్ = ఆత్మ యందే నివసించు వానిని; ఈశున్ = శంకరుని; ఎగ్గుపల్కిన = పరిహసించినట్టి; పాపాత్ముడు = పాపి; ఎల్లన్ = అన్ని; భంగిన్ = విధములుగ; దండన = దండించుటకు; అర్హుడు = తగినవాడు; కాక = కాకుండగ; ఎట్లు = ఏ విధముగ; తలగగలడు = తప్పించుకొనగలడు.

భావము:

ఎవని పాదపద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులతో శోభిల్లుతుంటాయో, ఎవని సత్యస్వరూపాన్ని తెలుసుకోడానికి బ్రహ్మాది మహాయోగుల మనస్సులు తహతహలాడుతుంటాయో, ఎవని స్వరూపాన్ని నిరూపించలేక వేదాలు వాదులాడుతుంటాయో, ఎవని కరుణా కటాక్ష వీక్షణం ఈ లోకాలన్నింటికీ రక్షణ కల్పిస్తూ ఉంటుందో అటువంటి సర్వేశ్వరుడు, పాపసంహారకుడు, ధీరుడు, నిత్యకళ్యాణుడు, జగత్కుటుంబి అయిన జగదీశ్వరుణ్ణి పరిహసించిన ఈ పాపాత్ముడు అన్నివిధాల శిక్షార్హుడు కాకుండా ఎలా ఉంటాడు?

6-498-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిఖిలలోకాశ్రయంబు సన్నిహితసుఖము
కలభద్రైక మూలంబు సాధుసేవ్య
మైన కంజాక్షుపాదపద్మార్చనంబు
నుసరింపంగ ఖలుఁడు వీఁ ర్హుఁ డగునె?

టీకా:

నిఖిల = సమస్తమైన; లోక = లోకములకు; ఆశ్రయంబున్ = ఆశ్రయించ దగినది; సన్నిహిత = దగ్గరైన; సుఖము = సుఖము గలది; సకల = సర్వ; భద్ర = క్షేమములకును; ఏక = ముఖ్యమైన; మూలంబున్ = మూలాధారమైనది; సాధు = సాధుజనులచే; సేవ్యము = కొలువబడునది; ఐన = అయిన; కంజాక్షున్ = నారాయణుని {కంజాక్షుడు - కంజము (పద్మము) వంటి అక్షుడు(కన్నులు గలవాడు), విష్ణువు}; పాద = పాదములను; అర్చనంబున్ = అర్చించుటను; అనుసరింపంగ = పాటించుటకు; ఖలుడు = దుష్టుడు; వీడు = ఇతడు; అర్హుడు = తగినవాడు; అగునె = అగునా ఏమి.

భావము:

సకల లోకాలకు ఆధారమైనది, సుఖాలను కలిగించేది, సర్వ శుభాలకు మూలకారణమైనది, సజ్జనులకు సేవింపదగినది అయిన విష్ణుదేవుని పాదపద్మపూజ చేయటానికి దుష్టుడైన వీడు అర్హుడెలా అవుతాడు?

6-499-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున, నోరి! దురాత్మక! యీ పాపంబునం బాపస్వరూపంబైన రాక్షసయోనిం బుట్టు"మని శపియించి "యింతనుండి మహాత్ములకు నవజ్ఞ చేయకుండు"మని పలికినఁ జిత్రకేతుండు విమానంబు డిగ్గి వచ్చి, యద్దేవికి దండప్రణామంబు లాచరించి కరకమలంబులు దోయిలించి యిట్లనియె "నో జగన్మాతా! భవచ్ఛాప వాక్యంబు లట్ల కైకొంటి ప్రాచీన కర్మంబులం బ్రాప్తం బైన సంసార చక్రంబు చేత నజ్ఞాన మోహితులై తిరుగుచున్న జంతువులకు సుఖదుఃఖంబులు నైజంబులై ప్రవర్తిల్లుచుండు; నిందులకుఁ బరతంత్రులైనట్టి వా రాత్మ సుఖదుఃఖంబులకు నెవ్వరు కర్త; లీ గుణంబుల నిమిత్తమై శాపానుగ్రహంబులును స్వర్గ నరకంబులును, సుఖదుఃఖంబులును సమంబులు; భగవంతుం డొక్కండ తన మాయ చేత జగంబులు సృజియించుచు వారి వారికి బద్ధానురాగంబులు గలుగం జేయుచుఁ దాను వానికి లోను గాక నిష్కళుండై యుండు; నీ విధంబునం బుట్టుచున్న నరునకుం బత్ని బంధు శత్రు మిత్రోదాసీనత్వంబు లెక్కడివి? వారివారి కర్మ వశంబునం బరమేశ్వరుండు కల్పించుచు సర్వసముండై యుండు; నప్పరమేశ్వరునకు సుఖదుఃఖంబుల చేత రాగంబు లేదు రాగానుబంధంబైన రోషంబును లే; దతని మాయా గుణవిసర్గంబు జంతువులకు సుఖదుఃఖంబులను, బంధమోక్షంబులను గల్పించుచుండును; కావున, నీకు నమస్కరించుచున్న నన్ను ననుగ్రహింపుము; శాపభయశంకితుండంగాను; జగన్మాతవైన నిన్నుఁ బలికిన దోషంబునకు శంకించుచున్నవాఁడ"నని దండప్రణామంబు లాచరించి పార్వతీ పరమేశ్వరులం బ్రసన్నులం జేసి తన విమానం బెక్కి చనియె; నప్పుడు పరమేశ్వరుండు బ్రహ్మాది దేవర్షి దైత్య దానవ ప్రమథ గణంబులు వినుచుండఁ బార్వతికి నిట్లనియె "నీకు నిప్పుడు దృష్టం బయ్యెఁ గదా నారాయణదాసానుచరుల నిస్పృహభావంబు; హరి తుల్యార్థదర్శనులై నిస్పృహులైన భాగవతులకు స్వర్గాపవర్గ నరక భేదభావంబులు లేవు; ప్రాణులకు దేహసంయోగంబు వలన నారాయణలీలం జేసి యుండి ద్వంద్వాది సుఖదుఃఖంబు లాత్మ యందు నజ్ఞానంబున భేదంబు చేయం బడియె; నట్టి విపర్యయంబులు భగవంతుండైన వాసుదేవునిభక్తి గలవారిం జెందవు; మఱియును.

టీకా:

కావునన్ = అందుచేత; ఓరి = ఓరి; దురాత్మక = దుష్ట ఆత్మ గలవాడ; ఈ = ఈ; పాపంబునన్ = పాపమువలన; పాప = పాపము యొక్క; స్వరూపంబున్ = స్వరూపము; ఐన = అయిన; రాక్షస = రాక్షసుల; యోనిన్ = గర్భమున; పుట్టుము = జన్మించుము; అని = అని; శపియించి = శపించి; ఇంతనుండి = ఇటుపైన; మహాత్ముల్ = గొప్పవారి; కున్ = కి; అవజ్ఞ = అవమానము; చేయకుండుము = చేయవలదు; అని = అని; పలికినన్ = పలుకగా; చిత్రకేతుండు = చిత్రకేతుడు; విమానంబున్ = విమానమును; డిగ్గివచ్చి = దిగివచ్చి; ఆ = ఆ; దేవి = దేవి; కిన్ = కి; దండప్రణామంబులు = దండప్రణామములు {దండప్రణామము - దండము (కఱ్ఱవలె పడి) చేసెడి ప్రణామము }; ఆచరించి = చేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములను; దోయిలించి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఓ = ఓ; జగన్మాతా = పార్వతీదేవి {జగన్మాత - జగత్తు (లోకముల)కు మాత (తల్లి), పార్వతి}; భవత్ = నీ యొక్క; శాప = శాప మిచ్చెడి; వాక్యంబులన్ = పలుకులను; అట్ల = అటులనే; కైకొంటి = స్వీకరించితిని; ప్రాచీన = పూర్వకాలమున; కర్మంబులన్ = చేసిన కర్మల వలన; ప్రాప్తంబున్ = లభించెడివి; ఐన = అయిన; సంసార = సంసారము యనెడి; చక్రంబున్ = చక్రము; చేతన్ = వలన; అజ్ఞాన = అజ్ఞానముచే; మోహితులు = మోహింపబడినవారు; ఐ = అయ్యి; తిరుగుచున్న = ప్రవర్తిస్తున్న; జంతువుల్ = జీవుల; కున్ = కు; సుఖ = సుఖములు; దుఃఖంబులున్ = దుఃఖములు; నైజంబులు = సహజమైనవి; ఐ = అయ్యి; ప్రవర్తిల్లుచుండున్ = జరుగుచుండును; ఇందుల = దాని; కున్ = కి; పరతంత్రులు = స్వతంత్రత లేనివారు; ఐన = అయిన; అట్టివారి = అటువంటివారి యొక్క; ఆత్మ = ఆత్మల; సుఖ = సుఖములు; దుఃఖంబుల్ = దుఃఖములు; కున్ = కు; ఎవ్వరు = ఎవరు; కర్తలు = బాధ్యులు; ఈ = ఈ; గుణముల = గుణముల; నిమిత్తము = వలన; ఐన్ = ఐన; శాప = శాపములు; అనుగ్రహంబులు = అనుగ్రహములు; స్వర్గ = స్వర్గలోకప్రాప్తి; నరకంబులు = నరకలోకప్రాప్తి; సుఖ = సుఖములు; దుఃఖంబులును = దుఃఖములు; సమంబులు = సమానమైనవి; భగవంతుడు = భగవంతుడు; ఒక్కండ = ఒక్కడే; తన = తన యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; జగంబులున్ = లోకములను; సృజియించుచున్ = సృష్టించుచు; వారివారి = వారిలో వారి; కిన్ = కి; బద్దానురాగంబులు = గట్టి అనురాగములను; కలుగన్ = కలుగునట్లు; చేయుచున్ = చేయుచు; తాను = తను; వాని = వాని; కిన్ = కి; లోను = వశము; కాక = కాకుండగ; నిష్కళుండు = కళలులేనివాడు, వికారరహితుడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; పుట్టుచున్న = జన్మించుచున్న; నరున్ = మానవున; కున్ = కు; పత్ని = భార్య; బంధు = బంధువులు; శత్రు = శత్రువులు; మిత్ర = మిత్రులు; ఉదాసీనత్వంబులు = తటస్థతలు; ఎక్కడివి = ఎక్కడ యున్నవి; వారివారి = వారివారి; కర్మ = చేసుకొన్న కర్మల; వశంబునన్ = అనుసరించి; పరమేశ్వరుండు = భగవంతుడు; కల్పించుచు = ఏర్పరచుచు; సర్వసముండు = అందరి యెడల సమత్వ భావము గలవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండెడి; ఆ = ఆ; పరమేశ్వరున్ = భగవంతుని; కున్ = కి; సుఖ = సుఖములు; దుఃఖంబుల = దుఃఖముల; చేతన్ = వలన; రాగంబున్ = అనురక్తి; లేదు = లేదు; రాగ = అనురక్తికి; అనుబంధంబు = అనువర్తించెడిది; ఐన = అయిన; రోషంబును = రోషము కూడ; లేదు = లేదు; అతని = అతని; మాయా = మాయ యొక్క; గుణ = గుణముల; విసర్గంబు = విశిష్టసృష్టి; జంతువుల్ = జీవుల; కున్ = కు; సుఖ = సుఖములను; దుఃఖంబులను = దుఃఖములను; బంధ = బంధములను; మోక్షంబులను = మోక్షములను; కల్పించుచుండును = కలిగించుచుండును; కావునన్ = అందుచేత; నీ = నీ; కున్ = కు; నమస్కరించుచున్న = నమస్కారము చేయుచున్న; నన్నున్ = నన్ను; అనుగ్రహింపుము = అనుగ్రహింపుము; శాప = శాపమునకు; భయ = భయముచెంది; శంకితుండన్ = చిన్నబోయినవాడను; కాను = కాను; జగన్మాతవు = లోకములకు తల్లివి; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; పలికిన = పరిహసించినట్టి; దోషంబున్ = పాపమున; కున్ = కు; శంకించుచున్నవాడన్ = భయపడుతున్నాను; అని = అని; దండప్రణామంబులు = దండప్రణామములు; ఆచరించి = చేసి; పార్వతీ = పార్వతీదేవి; పరమేశ్వరులన్ = శంకరులను; ప్రసన్నులన్ = ప్రసన్నమైనవారిగా; చేసి = చేసి; తన = తన యొక్క; విమానంబున్ = విమానమును; ఎక్కి = ఎక్కి; చనియెన్ = వెళ్ళిపోయెను; అప్పుడు = అప్పుడు; పరమేశ్వరుండు = శంకరుడు; బ్రహ్మాది = బ్రహ్మదేవుడు మొదలగువారు; దేవర్షి = దేవ ఋషులు; దైత్య = రాక్షసులు; దానవ = దానవులు; ప్రమథగణంబులు = ప్రమథగణములు; వినుచుండన్ = వినుచుండగా; పార్వతి = పార్వతీదేవి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; నీ = నీ; కున్ = కు; ఇప్పుడు = ఇప్పుడు; దృష్టంబు = నిరూపితము; అయ్యన్ = అయినది; కదా = కదా; నారాయణ = విష్ణు; దాస = సేవకులు; అనుచరులు = భక్తుల యొక్క; నిస్పృహ = నిర్లిప్త; భావంబున్ = స్వభావము; హరి = నారాయణుని; తుల్య = సమానమైన; అర్థ = భావముననే; దర్శనులు = చూచెడివారు; నిస్పృహులు = నిస్సంగులు; ఐన = అయినట్టి; భాగవతుల్ = భాగవతుల; కున్ = కు; స్వర్గ = స్వర్గము; అపవర్గ = మోక్షము; నరక = నరకము; భేదభావంబులు = వేరు యనెడి భావములు; లేవు = లేవు; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; దేహ = శరీరముతో; సంయోగంబునన్ = సంబంధము; వలన = వలన; నారాయణ = విష్ణు; లీలన్ = లీల; చేసి = వలన; ఉండి = కలిగి; ద్వంద్వాది = ద్వంద్వభావము మొదలగు; సుఖ = సుఖములు; దుఃఖంబులు = దుఃఖములు; ఆత్మ = మనసు; అందున్ = లో; అజ్ఞానంబునన్ = అజ్ఞానమువలన; భేదంబున్ = వ్యత్యాసములుగ; చేయంబడియెన్ = చేయబడినవి; ఇట్టి = ఇటువంటి; విపర్యయంబులు = వ్యత్యాసములు; భగవంతుండు = భగవంతుడు; ఐన = అయిన; వాసుదేవుని = నారాయణుని; భక్తి = భక్తి; కల = ఉన్న; వారిన్ = వారిని; చెందవు = చెందవు; మఱియును = ఇంకను.

భావము:

ఓరీ దురాత్ముడా! నీవు చేసిన ఈ పాపకార్యానికి ఫలంగా పాపాలకు నెలవైన రాక్షసజాతిలో జన్మించు” అని శపించి “ఇకముందైనా మహానుభావులైన వారిని అవమానించకు” అని చెప్పింది. అప్పుడు చిత్రకేతుడు విమానం దిగి పార్వతీదేవికి సాష్టాంగనమస్కారం చేసి చేతులు జోడించి ఇలా అన్నాడు “ఓ జగజ్జననీ! నీ శాపాన్ని స్వీకరించాను. పూర్వజన్మంలో చేసిన కర్మల వల్ల సంప్రాప్తించే సంసారచక్రంలో పడి అజ్ఞానంతో ప్రవర్తించే జీవులకు సుఖదుఃఖాలు సహజంగానే సంక్రమిస్తుంటాయి. ఈ విషయంలో అస్వతంత్రులైనవారు తమ సుఖ దుఃఖాలకు కర్తలు కారు. అందువల్ల ఆగ్రహం కాని, అనుగ్రహం కాని, స్వర్గం కాని, నరకం కాని, సుఖం కాని, దుఃఖం కాని సమానమైనవే. భగవంతుడు మాత్రమే తమ మాయతో లోకాలను సృష్టించి జీవులకు రాగద్వేషాలు కల్పిస్తూ ఉంటాడు. ఆయన సర్వ సముడు. ఆ పరాత్పరునకు సుఖదుఃఖాల వల్ల కలిగే రాగద్వేషాలు అంటవు. ఆయన తన మాయావిలాసంతో ఈ లోకంలోని ప్రాణులకు సుఖదుఃఖాలు, బంధమోక్షాలు కల్పిస్తూ ఉంటాడు. నీకు నమస్కరిస్తున్నాను. నన్ను అనుగ్రహించు. నీ విచ్చిన శాపానికి నేను భయపడటం లేదు. జగజ్జననివైన నిన్ను నిందించిన పాపానికి భయపడుతున్నాను” అని పలికి చిత్రకేతుడు పార్వతీ పరమేశ్వరులకు దండప్రణామం చేసి, వారిని ప్రసన్నులను చేసికొని, తన విమానాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు, దేవర్షులు, దైత్య దానవులు, ప్రమథగణాలు వింటూ ఉండగా పరమేశ్వరుడు పార్వతితో ఇలా అన్నాడు “దేవీ! విష్ణుభక్తులైన వారి దాసానుదాసుల నిర్లిప్త స్వభావం నీకు అర్థమయింది కదా! విష్ణుభక్తులు సర్వత్రా నారాయణ స్వరూపాన్నే దర్శిస్తారు. నిస్సంగులైన భగవద్భక్తులకు స్వర్గం, నరకం, మోక్షం అనే భేదభావాలు ఉండవు. జీవులకు దేహ సంయోగం వల్ల, విష్ణుమాయా విలాసం వల్ల ద్వంద్వాది భావాలు కలుగుతుంటాయి. అజ్ఞానం వల్ల సుఖ దుఃఖాలు విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఎగుడు దిగుడులు, హెచ్చుతగ్గులు భగవంతుడైన వాసుదేవుని భక్తులకు అంటవు. ఇంకా...

6-500-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నేనుఁ, గుమారనారదులు, నీరజగర్భుఁడు, దేవసంఘమున్,
మానిత యోగివర్య ముని మండల, మిట్లగు వార మందఱున్
దావవిద్విడంశ జనితంబులమయ్యుఁ దదీయ తత్త్వముం
గానఁగ నేర; మీశు ఘనర్వమునం దలపోసి చూచుచున్.

టీకా:

నేనున్ = నేను; కుమార = కుమారస్వామి; నారద = నారదుడు; ఆదులు = మొదలైనవారు; నీరజగర్భుడు = బ్రహ్మదేవుడు; దేవ = దేవతల యొక్క; సంఘమున్ = సమూహము; మానిత = గౌరవనీయమైన; యోగి = యోగులలో; వర్య = శ్రేష్ఠులు; ముని = మునుల; మండలము = సమూహము; ఇట్లగు = ఇలాంటి; వారము = వారులము; అందఱున్ = అందరు; దానవవిద్విట్ = దైవ {దానవవిద్విట్ - దానవులు(రాక్షసులు) విద్విట్ (ద్వేషించువాడు), విష్ణుమూర్తి}; అంశ = అంశ; జనితంబులము = సంభూతులము; అయ్యున్ = అయినప్పటికిని; తదీయ = అతని యొక్క; తత్త్వమున్ = తత్త్వమును; కననేరము = తెలియలేము; ఈశు = భగవంతుని; ఘన = అత్యధికమైన; గర్వమునన్ = గర్వముతో; తలపోసి = భావించి; చూచుచున్ = చూచుచును.

భావము:

నేను, కుమారస్వామి, నారదుడు, బ్రహ్మదేవుడు, సమస్త దేవతలు, యోగివరేణ్యులు, మునీశ్వరులు అందరమూ శ్రీమన్నారాయణుని అంశ వల్ల జన్మించిన వాళ్ళమే. అయినా ఆ విష్ణుతత్త్వాన్ని తెలుసుకోలేక పోతున్నాము. ఇందుకు కారణం అధికమైన ఆత్మాభిమానమే.

6-501-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నికింబ్రియుఁ డప్రియుఁ
డే తెఱఁగున లేడు నిఖిల మెల్లను దానై
భూముల కాత్మ యగుటయు
భూప్రియుఁ డొక్కఁ డాదిపురుషుఁడు తన్వీ!

టీకా:

అతని = అతని; కిన్ = కి; ప్రియుండు = ఇష్టుడు; అప్రియుడు = అయిష్టుడు; ఏ = ఏ; తెఱగునన్ = విధముగను; లేడు = లేడు; నిఖిలము = సమస్తమైనది; ఎల్లను = అంతయు; తాను = తానే; ఐ = అయ్యి; భూతముల్ = జీవుల; కున్ = కు; ఆత్మ = ఆత్మ; అగుటయున్ = అగుటవలన; భూత = జీవులకు; ప్రియుడు = కోరదగినవాడు; ఒక్కడు = ఒకడే; ఆదిపురుషుడు = మూలపురుషుడు, విష్ణువు; తన్వీ = పార్వతీదేవీ, స్త్రీ {తన్వి - మంచి తనువు గలామె, స్త్రీ, (తన్వి - తనివి, తృప్తి)}.

భావము:

పార్వతీ! ఆ నారాయణునకు ఇష్టమైనవాడు, ఇష్టం కానివాడు అంటూ ఎవడూ ఉండడు. ఆయన సర్వాంతర్యామి. సమస్తమూ తానే అయినవాడు. సర్వజీవులకు ఆత్మ అయినవాడు. సకల జీవులకు ప్రియమైన ఆదిపురుషుడు ఆయన ఒక్కడే.

6-502-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రయఁ జిత్రకేతుఁ తిశాంతుఁ డతిలోక
ముఁడు విష్ణుభక్తి సంగతుండు
నితని నేమిచెప్ప? నీశుండ నగు నేను
నువిద! యచ్యుతప్రియుండఁ జుమ్మి.

టీకా:

అరయ = తరచి చూసినచో; చిత్రకేతుడు = చిత్రకేతుడు; అతి = మిక్కిలి; శాంతుడు = శాంతస్వభావుడు; అతిలోకా = లోకాతీతులకు; సముడు = సమానమైన వాడు; విష్ణు = నారాయణుని; భక్తి = భక్తి యందు; సంగతుండు = కూడినవాడు; ఇతనిన్ = ఇతనినిగూర్చి; ఏమిచెప్ప = చెప్పుట యెందుకు; ఈశుండను = ఈశ్వరుడను; అగు = అయిన; నేనున్ = నేను కూడ; ఉవిద = సతీదేవీ, స్త్రీ; అచ్యుత = నారాయణుని; ప్రియుండన్ = ఇష్టపడువాడను; చుమ్మీ = సుమా;

భావము:

పార్వతీ! చిత్రకేతుడు శాంతస్వభావం కలవాడు. లోకాతీతులైన మహానుభావులతో సమానుడు. విష్ణుభక్తుడు. ఇతని గురించి ఏమని చెప్పను? ఈశ్వరుడనైన నేను కూడా అచ్యుతుడైన శ్రీహరిని ఇష్టపడుతుంటాను సుమా!

6-503-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున భగవద్భక్తుల
భామునకు విస్మయంబు నిలేదు మహా
ధీ విభవశాంత చిత్తులు
పాన పరతత్త్వనిపుణ వ్యులు వారల్."

టీకా:

కావునన్ = అందుచేత; భగవత్ = నారాయణుని; భక్తుల = భక్తుల యొక్క; భావమున్ = వైభవమున; కున్ = కు; విస్మయంబు = ఆశ్చర్యపోవలసిన; పనిలేదు = పనిలేదు; మహా = గొప్ప; ధీ = బుద్ధి; విభవ = వైభవము; శాంత = శాంతమైన; చిత్తులు = మనసు గలవారు; పావన = పవిత్రమైన; పరతత్త్వ = ఆత్మజ్ఞానమున; నిపుణ = నైపుణ్యము గల; భవ్యులు = యోగ్యులు; వారల్ = వారు;

భావము:

కావున భగవద్భక్తులైన వారి స్వభావానికి ఆశ్చర్యపడ వలసిన పనిలేదు. వారు ఎంతో బుద్ధిమంతులు, ప్రశాంత చిత్తులు. పరమ పవిత్రమైన భగవత్తత్త్వాన్ని బాగా అవగతం చేసుకొన్న పావన చరిత్రులు వారు”.

6-504-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనిన విని యద్రితనయ విస్మయంబు మాని శాంతచిత్త యయ్యె; నట్లు పరమభాగవతుండయిన చిత్రకేతుం డద్దేవికిం బ్రతిశాపం బియ్య సమర్థుం డయ్యును, మరల శపింపక యతి శాంతరూపంబున శాపంబు శిరంబున ధరియించె; నిట్టి సాధులక్షణంబులు నారాయణ పరాయణులైన వారలకుం గాక యొరులకుం గలుగ నేర్చునే? యట్లు శాపహతుండైన చిత్రకేతుండు త్వష్ట చేయు యజ్ఞంబున దక్షిణాగ్ని యందు దానవ యోనిం బుట్టి వృత్రాసురుం డన విఖ్యాతుం డయి భగవద్జ్ఞాన పరిణతుం డయ్యెం; గావున.

టీకా:

అనినన్ = అనగా; విని = విని; అద్రితనయ = పార్వతీదేవి {అద్రితనయ - అద్రి (పర్వతరాజు యొక్క) తనయ (పుత్రిక), పార్వతి}; విస్మయంబున్ = ఆశ్చర్యపోవుటను; మాని = వదలి; శాంత = శాంతించిన; చిత్త = మనసు గలామె; అయ్యెన్ = అయినది; అట్లు = ఆ విధముగ; పరమ = అత్యుత్తమమైన; భాగవతుండు = భాగవతుడు; అయిన = ఐన; చిత్రకేతుండు = చిత్రకేతుడు; ఆ = ఆ; దేవి = దేవి; కిన్ = కి; ప్రతి = తిరిగి; శాపంబున్ = శాపమును; ఇయ్యన్ = ఇచ్చుటకు; సమర్థుండు = శక్తి గలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; మరల = తిరిగి; శపింపక = శపించకుండగ; అతి = మిక్కిలి; శాంత = శాంతమైవ; రూపంబునన్ = విధముగ; శాపంబున్ = శాపమును; శిరంబునన్ = తలపై; ధరియించెన్ = తాల్చెను; ఇట్టి = ఇటువంటి; సాధు = సాధు; లక్షణంబులు = స్వభావములు; నారాయణ = విష్ణుమూర్తి యందు; పరాయణులు = భక్తి నిష్ఠలు గలవారు; ఐన = అయిన; వారల్ = వారి; కిన్ = కి; కాక = కాకుండగ; ఒరుల్ = ఇతరుల; కున్ = కు; కలుగ = కలుగుట; నేర్చునే = సాధ్యమా ఏమి; అట్లు = ఆ విధముగ; శాపహతుండు = శపింపబడినవాడు; ఐన = అయిన; చిత్రకేతుండు = చిత్రకేతుడు; త్వష్ట = త్వష్ట; చేయు = చేసెడి; యజ్ఞంబునన్ = యజ్ఞములో; దక్షిణాగ్ని = దక్షిణాగ్ని; అందున్ = అందు; దానవ = రాక్షస; యోనిన్ = గర్భమున, జన్మమున; పుట్టి = జనించి; వృత్రాసురుండు = వృత్రాసురుడు; అనన్ = అనగా; విఖ్యాతుండు = ప్రసిద్ధుడు; అయి = అయ్యి; భగవత్ = భగవంతునికి చెందిన; జ్ఞాన = జ్ఞానము నందు; పరిణితుండు = పరిపక్వము చెందిన వాడు; అయ్యెన్ = అయ్యెను; కావునన్ = అందుచేత;

భావము:

అని శివుడు చెప్పగా విని పార్వతి ప్రసన్నురాలయింది. పరమ భాగవతుడైన చిత్రకేతుడు శపించడానికి సమర్థుడైనా తిరిగి శపించక శాంతచిత్తంతో ఆ దేవి శాపాన్ని శిరసా వహించాడు. ఇటువంటి ఉత్తమ లక్షణాలు నారాయణ సేవా పరాయణులైన మహాత్ములకు తప్ప ఇతరులకు సంభవిస్తాయా? ఈ విధంగా శాపోపహతుడైన చిత్రకేతుడు త్వష్ట అనే ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో దక్షిణాగ్ని నుండి దానవుడుగా జన్మించి, వృత్రాసురుడనే పేరుతో ప్రసిద్ధి గాంచి, పరిణతమైన భగవత్తత్త్వంతో ప్రకాశించాడు. కనుక...

6-505-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రనాథ! యీ వృత్రుకు రాక్షసాకృతి-
లిగిన యీ పూర్వకారణంబు
చిరపుణ్యుఁ డయినట్టి చిత్రకేతు మహాను-
భావంబు భక్తితోఁ రఁగ విన్న
దివినవారికి కల దుష్కర్మముల్-
శిథిలంబులై కడుఁ జెదరిపోవు
కలవైభవములు మకూరుఁ దనయంతఁ-
దొల్కాడు కోర్కులతోడఁ గూడి

6-505.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిర్మలాత్ము లగుచు నిత్యసత్యజ్ఞాన
నితు లగుచు విగత దురితు లగుచు
బంధు మిత్ర పుత్ర పౌత్రాదులను గూడి
నుభవించుచుందు ధిక సుఖము.

టీకా:

నరనాథ = రాజా; ఈ = ఈ; వృత్రున్ = వృత్రాసురుని; కున్ = కి; రాక్షస = రాక్షస; ఆకృతి = స్వరూపము; కలిగిన = పొందిన; ఈ = ఈ; పూర్వ = మూల; కారణంబు = కారణమైనట్టి; చిర = మిక్కిలి; పుణ్యుడు = పుణ్యాత్ముడు; అయినట్టి = అయిన; చిత్రకేతు = చిత్రకేతుడు యనెడి; మహానుభావంబున్ = మహానుభావుని చరితంబు; భక్తి = శ్రద్ద; తోన్ = తో; పరగన్ = ప్రవర్తిల్లగా; విన్న = వినిన; చదివిన = చదివిన; వారి = వారల; కిన్ = కు; సకల = సర్వ; దుష్కర్మముల్ = పాపములు; శిథిలంబులు = నాశనమైనవి; ఐ = అయ్యి; కడున్ = మిక్కిలి; చెదరిపోవు = చెదిరిపోవును; సకల = సమస్తమైన; వైభవములున్ = వైభవములు; సమకూరున్ = సిద్ధించును; తనయంత = వాటంతట అవే; తొల్కాడు = నెరవేరిన; కోర్కుల = కోరికల; తోడన్ = తోటి; కూడి = కలిగి;
నిర్మల = స్వచ్ఛమైన; ఆత్ములు = మనసులు గలవారు; అగుచున్ = అగుచు; నిత్య = శాశ్వతమైన; సత్య = సత్యమైన; జ్ఞాన = జ్ఞానమునందు; నిరతులు = నిష్ఠ గలవారు; అగుచున్ = అగుచు; విగత = పోయిన; దురితులు = పాపములు; అగుచున్ = అగుచు; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; పుత్ర = కుమారులు; పౌత్ర = మనుమలు; ఆదులన్ = మొదలగువారిని; కూడి = కలిసి; అనుభవించుచుందురు = అనుభవించుచుందురు; అధిక = ఎక్కువ; సుఖమున్ = సుఖమును.

భావము:

రాజా! వృత్రాసురునికి రాక్షసాకారం కలిగిన పూర్వజన్మ వృత్తాంతాన్ని, చిత్రకేతుని పవిత్ర చరిత్రను భక్తితో విన్నవారికి, చదివిన వారికి పాపాలన్నీ నాశనమై చెదరిపోతాయి. సమస్త వైభవాలు సమకూరుతాయి. కోరిన కోరికలు తమంత తామే తీరుతాయి. వారు నిర్మల హృదయులై, నిత్య సత్య వ్రతులై, తొలగిన పాపాలు కలవారై బంధువులతోనూ మిత్రులతోనూ పుత్రులతోనూ, పౌత్రులతోనూ కూడి ఉండి అధిక సుఖాలను అనుభవిస్తారు.