పంచమ స్కంధము - ఉత్తర : నరక లోక విషయములు
- ఉపకరణాలు:
ఎడతెగక ముజ్జగంబుల
కడపల నయ్యామ్యదిశను గదలక నిలుచుం
గడు ఘోరములుగ నరకము
లడరంగా నంతరాళమందుల నధిపా!
టీకా:
ఎడతెగక = విడివడకుండగ, సందు లేకుండగ; ముజ్జగంబుల = ముల్లోకములకు; కడపలన్ = చివరల యందు; ఆ = ఆ; యామ్య = దక్షిణపు; దిశను = దిక్కు నందు; కదలక = స్థిరముగ; నిలుచున్ = ఉండును; కడు = మిక్కిలి; ఘోరములుగ = ఘోరములైనవిగా; నరకములు = నరకములు; అడరంగ = భయంకరముగ; అంతరాళము = లోకముల నడిమి; అందులన్ = లో; అధిప = రాజా;
భావము:
“రాజా! ముల్లోకాలకు ఆవల దక్షిణ దిక్కులో భూమ్యాకాశాల మధ్య మహా భయంకరమైన నరకాలు ఉన్నయి.
- ఉపకరణాలు:
మఱియును; దక్షిణంబున నగ్నిష్వాత్తాది పితృగణంబులు దమ గోత్రజులకు మేలుగలుగుట కొఱకు సత్యంబులగు నాశీర్వాదంబుల నొసంగుచుండుదు; రచ్చటి పితృపతి యగు శమనుండు దన లోకంబునకుం జనుదెంచు జంతువుల కర్మంబులకుం దగిన ఫలంబుల నిచ్చి శిక్షించుచు నుండు; నందుఁ దామిస్రంబును నంధతామిస్రంబును రౌరవంబును మహారౌరవంబును గుంభీపాకంబును కాలసూత్రంబును నసిపత్రవనంబును సూకర ముఖంబును నంధకూపంబును గ్రిమిభోజనంబును సందంశంబును దప్తోర్మియు వజ్రకంటకశాల్మలియు వైతరణియుఁ బూయోదంబును బ్రాణరోధంబును విశసనంబును లాలాభక్షంబును సారమేయాదనంబును నవీచిరయంబును రేతఃపానంబును నను నేకవిశంతి మహానరకంబులును; మఱియును క్షారకర్దమంబును రక్షోగణభోజనంబును శూలప్రోతంబును దందశూకంబును నవటనిరోధనంబును నపర్యావర్తనంబును సూచీముఖంబును నన సప్తవిధ నరకంబుల తోడం గూడి యష్టావింశతి నరకంబులు గల వని కొందఱు నొడువుదు; రందు.
టీకా:
మఱియునున్ = ఇంకను; దక్షిణంబునన్ = దక్షిణపు దిక్కు నందు; అగ్నిష్వాత్ = అగ్నిష్వాత్తులు; ఆది = మొదలగు; పితృగణంబులున్ = పితృగణములు; తమ = తమ యొక్క; గోత్రజుల్ = గోత్రములలో పుట్టినవారి; కున్ = కి; మేలు = మంచి; కలుగుట = కలుగుట; కొఱకు = కోసము; సత్యంబులు = నిజమైన; ఆశీర్వాదంబులన్ = ఆశీర్వాదములను; ఒసంగుచుండుదురు = ఇస్తుంటారు; అచటి = అక్కడి; పితృపతి = పితృదేవతలకు అధిపతి; అగు = అయిన; శమనుండు = యముడు {శమనుండు - జీవవ్యాపారమును శమింప (అణగ) చేయువాడు, యముడు}; తన = తన యొక్క; లోకంబున్ = లోకమున; కున్ = కు; చనుదెంచు = వచ్చెడి; జంతువులన్ = జీవులను; కర్మంబుల్ = వారు చేసిన కర్మముల; కున్ = కు; తగిన = సరియగు; ఫలంబులన్ = ఫలితములను; ఇచ్చి = ఇచ్చి; శిక్షించుచుండున్ = శిక్షిస్తుండును; అందు = దానిలో (ఆ నరకములో); తామిస్రంబును = తామిస్రమము {తామిస్రమము - చీకటిలోకము, నరక విశేషము}; అంధతామిస్రంబును = అంధతామిస్రము {అంధతామిస్రము - అంధ (గ్రుడ్డి) తామిస్రము (చీకటి), నరక విశేషము}; రౌరవంబును = రౌరవము {రౌరవము – రురు రూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునది, నరక విశేషములు}; మహారౌరవంబును = మహారౌరవము {మహారౌరవము - మిక్కిలి రురు రూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునది, నరక విశేషములు}; కుంభీపాకంబును = కుంభీపాకము {కుంభీపాకము - కుంభము (కుండల)లో వేసి పాకము (వండుట), నరకవిశేషము}; కాలసూత్రంబును = కాలసూత్రము {కాలసూత్రము - ఇనప తంతులుగలది, నరక విశేషము}; అసిపత్రవనంబును = అసిపత్రవనము {అసిపత్రవనము - అసి (కత్తులే) పత్ర (ఆకులు)గా కలిగిన వనము, నరకవిశేషము}; సూకరముఖంబును = సూకరముఖము {సూకరముఖము - సూకరము (పందుల) ముఖము (నోటి) యందు పడుట, నరక విశేషము}; అంధకూపంబును = అంధకూపము {అంధకూపము - గ్రుడ్డిగొయ్యి, నరక విశేషము}; క్రిమిభోజనంబును = క్రిమిభోజనము {క్రిమిభోజనము - అసహ్యకర క్రిములను భుజింపజేయుట, నరక విశేషము}; సందంశంబును = సందంశము {సందంశము - పట్టుకొని కరచుటలు, నరక విశేషము}; తప్తోర్మియున్ = తప్తోర్మి {తప్తోర్మి - తెర్లుతూ కాగుతున్న నూనెలలో కాగించుట, నరక విశేషము}; వజ్రకంటకశాల్మలియున్ = వజ్రకంటకశాల్మలి {వజ్రకంటకశాల్మలి - వజ్ర (వజ్రమువలె కఠినమైన) కంటక (ముళ్ళు కల) శాల్మలి (బూరుగు చెట్లు)తో శిక్షించునది, నరక విశేషము}; వైతరణియున్ = వైతరణి {వైతరణి - నరకమందలి భయంకరమైన నదియందు శిక్షించుట, నరక విశేషము}; పూయోదంబును = పూయోదము {పూయోదము - చీము నెత్తురు మొదలగువాని యందు శిక్షించుట, నరక విశేషము}; ప్రాణనిరోధంబును = ప్రాణనిరోధము {ప్రాణనిరోధము - ముక్కుమొదలగు ప్రాణద్వారములను బందించుట, నరక విశేషము}; విశసనంబును = విశసనము {విశసనంబు - నరకుటలు, నరక విశేషము}; లాలాభక్షంబును = లాలాభక్షమును {లాలాభక్షణము - లాలాజలమును భక్షింపజేయుట, నరక విశేషము}; సారమేయాదనంబును = సారమేయాదనము {సారమేయాదనము - కుక్కలచే శిక్షించుట, నరక విశేషము}; అవీచిరయంబును = అవీచిరయము {అవీచిరయంబు - మానకవీచి - ఎత్తైన కొండపైనుండి విసరి శిక్షించుట, నరక విశేషము}; రేతఃపానంబును = రేతఃపానము {రేతఃపానము - రేతస్సును తాగించెడి శిక్షలు, నరక విశేషము}; అను = అనెడి; ఏకవిశంతి = ఇరవైఒక్క (21); మహానరకంబులును = మహానరకములు; మఱియునున్ = ఇంకను; క్షారకర్దమంబును = క్షారమర్దమంబు {క్షార కర్దమంబు - క్షార (అతికారపు) కర్దమము (బురద)ను భుజింపజేసెడి శిక్షలు, నరక విశేషము}; రక్షోగణభోజనంబును = రక్షోగణభోజనము {రక్షోగణ భోజనము - రాక్షస గణములచే భుజింపబడు శిక్షలు, నరక విశేషము}; శూలప్రోతంబును = శూలప్రోతము {శూలప్రోతము - శూలము పైన గుచ్చి శిక్షించుట, నరక విశేషము}; దందశూకంబును = దందశూకము {దందశూకము - పాములచే శిక్షింపజేయుట, నరక విశేషము}; అవటనిరోధంబును = అవట నిరోధము {అవట నిరోధము - మలమూత్రాది విసర్జకములను బంధిచెడి శిక్షలు, నరక విశేషము}; అపర్యావర్తనంబును = అపర్యావర్తనము { అపర్యా వర్తనము – అపచ్ఛిన్నంగా అదే పనినే చేయిస్తూ ఉండడము, నరక విశేషము }; సూచీముఖంబును = సూచీముఖము {సూచీముఖము - సూదిమొనలచే శిక్షించుట, నరక విశేషము}; అనన్ = అనెడి; సప్త = ఏడు (7); విధ = రకములైన; నరకంబుల్ = నరకముల; తోడన్ = తోటి; కూడి = కలిసి; అష్టావింశతి = ఇరవైఎనిమిది (28); నరకంబులు = నరకములు; కలవు = ఉన్నవి; అని = అని; కొందఱున్ = కొంతమంది; ఒడువుదురు = చెప్పెదరు; అందు = వానిలో;
భావము:
అంతేకాకుండా దక్షిణంలోనే ఉన్న అగ్నిష్వాత్తులు మొదలైన పితృదేవతలు కూడా తమ తమ గోత్రాలలో పుట్టిన వారికి శుభం కలగడం కోసం సత్యమైన దీవెన లిస్తుంటారు. అక్కడ పితృపతి అయిన యముడు కూడా తనలోకం చేరుకొనే జీవులకు జీవితకాలంలో వారు చేసిన కర్మలకు తగిన ఫలం ప్రసాదిస్తూ శిక్షిస్తుంటాడు. ఆ యమలోకంలో తామిస్రం, అంధతామిస్రం, రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రవనం, సూకరముఖం, అంధకూపం, క్రిమిభోజనం, సందంశం, తప్తోర్మి, వజ్రకంటకశాల్మలి, వైతరణి, పూయోదం, ప్రాణరోధం, విశసనం, లాలాభక్షణం, సారమేయోదనం, అవీచిరయం, రేతఃపానం అనే ఇరవై ఒక్క నరకాలున్నాయి. అవే కాకుండా క్షారమర్దమం, రక్షోగణభోజనం, శూలప్రోతం, దందశూకం, అవటనిరోధనం, అపర్యావర్తనం, సూచీముఖం అనే మరి ఏడు నరకాలున్నాయి. వెరసి దక్షిణంలో ఇరవై ఎనిమిది నరకాలున్నాయని కొందరు చెబుతారు. అందులో...
- ఉపకరణాలు:
పరపుత్రకళత్రంబులఁ
బరికింపక యపహసించు పాపాత్ముఁడు దు
ష్కరపాశబద్దుఁడై యమ
పురుషులచే నధిక బాధఁ బొందుచు నుండున్.
టీకా:
పర = ఇతరుల; పుత్ర = సంతానమును; కళత్రంబులన్ = భార్యలు అని; పరికింపక = చూడకుండగ; అపహసించు = వేళాకోళము చేసెడి; పాపాత్ముడు = పాపి {పాపాత్ముడు - పాపపు ఆత్మ (మనసు) కలవాడు, పాపి}; దుష్కర = దట్టమైన; పాశ = తాళ్ళతో; బద్ధుడు = కట్టబడినవాడు; ఐ = అయ్యి; యమపురుషుల = యమభటులు; చేన్ = చేత; అధిక = అధికమైన; బాధన్ = బాధలను; పొందుచునుండున్ = పొందుతుండును;
భావము:
ఇతరుల బిడ్డలు, భార్యలు అనే ఆదరభావం ఏమాత్రం లేకుండా అకారణంగా వారిని అపహసించే పాపాత్ముణ్ణి యమకింకరులు తాళ్ళతో బంధించి పరిపరి విధాలుగా బాధిస్తారు.
- ఉపకరణాలు:
మఱియు; నవ్విధంబున బాధితుం డగుచుఁ దామిస్రనరకంబునం బడి యనశనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలం జెంది కడు భయంబున మూర్ఛలం బొందుచుండు.
టీకా:
మఱియునున్ = ఇంకను; ఆ = ఆ; విధంబునన్ = విధముగ; బాధితుండు = బాధింపబడినవాడు; అగుచున్ = అగుచు; తామిస్రంబునన్ = తామిస్రమమునందు {తామిస్రమము - చీకటిలోకము, నరక విశేషము}; పడి = పడి; అనశన = ఆహారములేకపోవుట; అద్రి = కొండపైనుండి; పాతన = పడదోయబడుట; దండ = బెత్తములతో; తాడన = కొట్టుట; తర్జన = బెదిరించుట {తర్జన - తర్జని (చూపుడువేలు)తో బెదిరించుట}; ఆది = మొదలగు; బాధలన్ = బాధలను; చెంది = పొంది; కడు = మిక్కిలి; భయంబునన్ = భయముతో; మూర్ఛలన్ = స్పృహతప్పుటలు; పొందుచునుండున్ = పొందుతుండును;
భావము:
అంతే కాకుండా వారిని తామిస్రం అనే నరకంలో పడవేసి అన్నం పెట్టక, కొండపైనుండి దొర్లిస్తూ, కఱ్ఱతో చావమోదుతూ, బెదరిస్తూ యమకింకరులు నానావిధాలుగా శిక్షిస్తారు. ఆ బాధలకు తాళలేక జీవులు భయకంపితులై మూర్ఛ పోతుంటారు.
- ఉపకరణాలు:
పరకాంత నెవ్వఁడేనిం
బురుషుం డుండంగ మొఱఁగి పొందిన యమకిం
కరు లతనిఁ బట్టి వడిఁ ద
త్తఱమునఁ బడవైతు రంధతామిస్రమునన్.
టీకా:
పర = ఇతరుల; కాంతన్ = భార్యను; ఎవ్వడేనిన్ = ఎవరైనా; పురుషుండు = భర్త; ఉండంగన్ = ఉండగా; మొఱగి = వంచించి; పొందిన = అనుభవించినట్లయితే; యమకింకరులు = యమభటులు; అతనిన్ = అతనిని; పట్టి = పట్టుకొని; వడిన్ = విసురుగా; తత్తఱమునన్ = పట్టరాని కోపముతో; పడవైతురు = పడవేయుదురు; అంధతామిస్రంబును = అంధతామిస్రమునందు {అంధతామిస్రము - అంధ (గుడ్ఢి) తామిస్రము (చీకటి), నరక విశేషము};
భావము:
మగడు ఉండగానే అతణ్ణి మోసగించి అతని భార్యను లొంగదీసుకున్నవాణ్ణి పట్టుకొని యమకింకరులు సంకోచం లేకుండా కోపంతో అంధతామిస్రం అనే నరకంలో పడవేస్తారు.
- ఉపకరణాలు:
నరేంద్రా! యెవ్వఁడేనిం గుటుంబపోషణార్థంబు పరులకు ద్రోహంబు జేయు నా నరుండు రౌరవాదినరకంబునం బడు; నెవ్వం డిహలోకంబు నందు స్వేచ్ఛావిహారంబున సంచరించుచుఁ బరోపద్రవ పరాఙ్ముఖంబు లయి యుండు పశుపక్షి మృగాదుల బాధించు నాయా మృగంబులు రురురూపంబులఁ దాల్చి యట్టి పాపజనుల నానావిధ యాతనల బాధించుటం జేసి రౌరవ మహారౌరవ నరకంబులనం బడు; నెవ్వండేని దేహపోషణార్థంబు మూషకాదుల బిలనిరోధంబు జేసి వధించు, నా నిష్కరుణుం డైన పురుషునిం గుంభీపాకనరకంబుల యందుఁ గల తప్తతైలంబులం బెక్కు బాధలం బొందింతురు.
టీకా:
నరేంద్ర = రాజా; ఎవ్వడేని = ఎవరైనా; కుటుంబ = కుటుంభమును; పోషణ = పొషించుట; అర్థంబున్ = కోసము; పరుల్ = ఇతరుల; కున్ = కు; ద్రోహంబున్ = కీడుతలపెట్టుట; చేయున్ = చేయునో; ఆ = ఆ; నరుండు = మానవుడు; రౌరవ = రౌరవము {రౌరవమలు – రురురూపమున కల ప్రాణులచేత బాధింప పెట్టునవి, నరక విశేషములు}; ఆది = మొదలగు; నరకంబునన్ = నరకములలో; పడున్ = పడును; ఎవ్వండేని = ఎవరైనా; ఇహ = ఈ; లోకంబున్ = లోకము; అందున్ = లో; స్వేచ్ఛావిహారంబునన్ = ఇష్టమువచ్చినట్లు తిరుగుటలో; సంచరించుచున్ = వర్తించుతూ; పర = ఇతరులకు; ఉపద్రవ = ఆపదలు కలిగించుట యందు; పరాఙ్ముఖులు = వ్యతిరిక్తులు; అయి = అయ్యి; ఉండు = ఉండెడి; పశు = పశువులు; పక్షి = పక్షులు; మృగ = జంతువులు; ఆదులన్ = మొదలగువానిని; బాధించున్ = బాధపెట్టునో; ఆయా = ఆయా; మృగంబులు = జంతువులు; రురు = రాక్షస; రూపంబులు = స్వరూపములను; తాల్చి = ధరించి; అట్టి = అటువంటి; పాపజనులన్ = పాపులను; నానావిధ = అనేక రకములైన; యాతనలన్ = బాధలను; బాధించుటన్ = బాధించుట; చేసి = వలన; రౌరవ = రౌరవనకరము; మహారౌరవనరకంబులన్ = మహారౌరవనరకములందు {రౌరవమలు – రురు రూపమున కల ప్రాణులచేత బాధింపపెట్టునవి, నరక విశేషములు}; అనంబడు = అనబడును; ఎవ్వడేని = ఎవరైనా; దేహ = శరీర; పోషణ = పోషించుట; అర్థంబున్ = కోసము; మూషక = ఎలుకలు; ఆదులన్ = మొదలగువాని; బిల = రంధ్రములను; నిరోధంబున్ = మూసివేయుట; చేసి = వలన; వధించున్ = సంహరించును; ఆ = ఆ; నిష్కరుణుండు = కరుణ లేనివాడు; ఐన = అయిన; పురుషుని = మానవుని; కుంభీపాక = కుంభీపాకము యనెడి {కుంభీపాకము - కుంభము (కుండల)లో వేసి పాకము (వండుట), నరకవిశేషము}; నరకంబులన్ = నరకముల; అందున్ = లో; కల = ఉన్నట్టి; తప్త = కాగుతున్న; తైలంబులన్ = నూనెలలో; పెక్కు = అనేకమైన; బాధలన్ = బాధలను; పొందింతురు = కలిగించెదరు;
భావము:
రాజా! ఎవరైతే తమ కుటుంబపోషణ కోసం ఇతరులకు ద్రోహం చేస్తారో అటువంటివారు రౌరవ నరకంలో పడతారు. ఎవరైతే ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, ఇతరులకు అపకారం తలపెట్టని పశు పక్షి మృగాదులను బాధిస్తారో అటువంటి పాపాత్ములను ఆయా మృగాలు భయంకర రూపాలతో నానాబాధలు పెడతాయి. వారు రౌరవ, మహారౌరవ నరకాలలో పడతారు. ఎవరైతే తమ కడుపు నింపుకొనడానికి ఎలుకల కన్నాలు మూసి వాటిని చంపుతారో అటువంటి నిర్దయులను కుంభీపాక నరకంలో కాగుతున్న నూనెలో పడవేసి హింసిస్తారు.
- ఉపకరణాలు:
తల్లిదండ్రులకును ధరణిసురులకును-
నహితంబు జేసిన యట్టివాడు
కాలసూత్రం బను కడుఁ దీవ్ర నరకంబు-
నందును నందంద యయుత యోజ
నాయత పాత్రాదు లందుల సూర్యుఁ డా-
మీఁద గ్రిందను వహ్ని మిగుల మండ
నత్యంత క్షుత్పిపాసాదులచేతను-
బాధితుం డగుచుండుఁ బాయ కెపుడుఁ
- ఉపకరణాలు:
బరువు పెట్టుచున్నఁ బడియున్న నిలిచినఁ
గదలకున్నఁ జాల నొదిగి యున్న
బాధఁ బొందుచుండఁ బశురోమముల లెక్క
వరుస నపరిమేయ వత్సరములు.
టీకా:
తల్లి = మాతా; తండ్రుల్ = పితల; కున్ = కు; ధరణిసురుల్ = బ్రాహ్మణుల; కునున్ = కు; అహితంబున్ = కీడు; చేసినన్ = చేసినచో; అట్టి = అటువంటి; వాడు = జనుడు; కాలసూత్రంబున్ = కాలసూత్రము {కాలసూత్రము - ఇనప తంతులుగలది, నరక విశేషము}; అను = అనెడి; కడు = మిక్కిలి; తీవ్ర = తీవ్రమైన; నరకంబున్ = నరకము; అందున్ = లో; అందంద = అక్కడికక్కడే; అయుత = పదివేల; యోజన = యోజనముల; ఆయత = విస్తారముగల; పాత్ర = పాత్రలు; ఆదులు = మొదలగువాని; అందులన్ = లో; సూర్యుడు = సూర్యుడు; ఆ = ఆ; మీదన్ = పైనుండి; క్రిందన్ = క్రిందనుండి; వహ్ని = మంటలు; మిగులన్ = మిక్కిలి; మండన్ = మండుతుండగా; అత్యంత = అత్యధికమైన; క్షుత్ = ఆకలి; పిపాసల్ = దప్పుల; చేతను = వలన; బాధితుండున్ = బాధపడుతున్నవాడు; అగుచుండు = అగుచుండును; పాయక = విడువక; ఎపుడున్ = ఎప్పుడును; పరువుపెట్టుచున్నన్ = పరుగిడుతున్నను; పడియున్నన్ = పడిపోయి ఉండిపోయినను;
నిలిచినన్ = నిలబడిపోయినను; కదలకున్న = కదలకపోయినను; చాలన్ = మిక్కిలి; ఒదిగి = ఒదిగిపోయి; ఉన్నన్ = ఉన్నను; = బాధన్ = బాధలను; పొందుచుండన్ = పొందుతుండగా; పశు = పశువుల యొక్క; రోమముల = దేహమందలి వెంట్రుకలు; లెక్కన్ = లెక్కలలో; వరుసన్ = వరుసగా; అపరిమేయ = అపరిమితమైన; వత్సరములున్ = సంవత్సరములు;
భావము:
తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు కీడు తలపెట్టినవాడు కాలసూత్రం అనే భయంకర నరకంలో పడతాడు. అక్కడ పదివేల యోజనాల పొడవు గల లోహపాత్రలమీద అతణ్ణి నడిపిస్తారు. పైన ఎండ మండిపోతుండగా, క్రింద మంటలు భగభగ మండుతుండగా ఆ పాత్రల మీద పరుగెత్తుతూ, పడుతూ, లేస్తూ, నిలబడుతూ, పక్కకు తప్పుకుంటూ ఆకలితో, దప్పికతో అలమటిస్తాడు. ఆవు ఒంటిమీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అక్కడ యమకింకరులు అతణ్ణి బాధిస్తారు.
- ఉపకరణాలు:
మఱియు వేదమార్గంబు విడిచి పాషాండమార్గంబు లాచరించు పురుషుని నసిపత్రవనంబు నందు యమకింకరులు తఱట్ల నడచుచుఁ బరిహసించుచుం దోలునెడ నా యసిపత్రంబు లిరుగెలంకుల శరీరంబుఁ ద్రెంచుచుండ నడుగడుగున బిట్టు మొఱపెట్టుచుండ బాధించుచుండుదురు.
టీకా:
మఱియున్ = ఇంకను; వేద = వేదములందు విధించిన; మార్గంబున్ = దారిని; విడిచి = వదలివేసి; పాషాండ = వేదమార్గ దూరమైన; మార్గంబులన్ = విధానములను; ఆచరించు = ఆచరించెడి; పురుషుని = మానవుని; అసిపత్రవనంబున్ = అసిపత్రవనము {అసిపత్రవనము - అసి (కత్తులే) పత్ర (ఆకులు)గా కలిగిన వనము, నరకవిశేషము}; అందున్ = లో; యమకింకరులు = యమదూతలు; తఱట్ల = కొరడాలచేత; అడచుచు = మోదుచు; పరిహసించుచున్ = అవమానించుచు; తోలున్ = తరముచున్న; ఎడన్ = సమయములో; ఆ = ఆ; అసిపత్రంబులు = కత్తుల ఆకులు; ఇరు = రెండ (2); కెలంకులన్ = వైపులను; శరీరంబున్ = దేహ భాగములు; త్రెంచుచుండన్ = తెంపి వేయుచుండగా; అడుగడుగునన్ = ప్రతి అడుగు నందు; బిట్టు = మిక్కిలి; మొఱపెట్టుచుండన్ = హాహాకారములు చేయుచుండగ; బాధించుచుండుదురు = బాధపెడుతుందురు;
భావము:
ఇంకా వేదమార్గాన్ని వదలిపెట్టి పాషండమార్గం అవలంబించే పురుషుణ్ణి అసిపత్రవనం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ కత్తుల చెట్ల నడుమ ఇరుప్రక్కల కత్తుల వంటి చెట్ల ఆకులు తగిలి శరీర భాగాలు తెగిపోతూ ఉంటాయి. అపుడా జీవుడు అడుగడుగునా మొరపెడుతున్నా వినకుండా యమకింకరులు వాణ్ణి వేధిస్తుంటారు.
- ఉపకరణాలు:
దండింప దగని వారల
దండించిన విప్రవరుల తనువులు ముట్టం
దండించిన దుర్మతులం
దండింతురు కాలసూత్ర నరకము లందున్.
టీకా:
దండింపన్ = శిక్షించుటకు; తగని = తగనట్టి; వారలన్ = వారిని; దండించినన్ = శిక్షించినట్టి; విప్ర = బ్రాహ్మణులలో; వరులన్ = ఉత్తముల యొక్క; తనువులు = శరీరములను; ముట్టన్ = గట్టిగా; దండించినన్ = కొట్టినట్టి; దుర్ = చెడ్డ; మతులన్ = మనసులు కలవారిని; దండింతురు = శిక్షింతురు; కాలసూత్ర = కాలసూత్రము అనెడి; నరకములు = నరకములు; అందున్ = లో;
భావము:
దండింప దగని వారిని దండించి, బ్రాహ్మణ శ్రేష్ఠులను శారీరకంగా హింసించిన దుర్మార్గుణ్ణి కాలసూత్ర నరకంలో పడవేసి కఠినంగా దండిస్తారు.
- ఉపకరణాలు:
మఱియు నట్టి దుష్టమానవుఁ గింకరుల్
విఱిచి చెఱకుఁగోల విఱిచినట్లు
బాధపెట్టుచుండఁ బడి మూర్ఛఁ జెందుచు
మొఱలు పెట్టుచుండు భూపవర్య!
టీకా:
మఱియున్ = ఇంకను; అట్టి = అటువంటి; దుష్ట = చెడ్డ; మానవున్ = మానవుని; కింకరుల్ = యమదూతలు; విఱిచి = విరిచేసి; చెఱకుగోల = చెరకుగడ; విఱిచినట్లు = విరిచేసినట్లు; బాధపెట్టుచుండన్ = బాధపెడుతుండగా; పడి = పడిపోయి; మూర్ఛన్ = స్పృహతప్పి పడుటలు; చెందుచున్ = పొందుతు; మొఱలు = హాహాకారములు; పెట్టుచుండున్ = పెడుతుండును; భూపవర్య = రాజా;
భావము:
రాజా! ఆ కాలసూత్ర నరకంలో అటువంటి దుర్మార్గుణ్ణి పట్టుకొని యమకింకరులు చెరకు గడ విరిచినట్లుగా నడిమికి విరిచి హింసిస్తుంటే వాడు మూర్ఛపోతూ మొరపెడుతూ ఉంటాడు.
- ఉపకరణాలు:
నరేంద్రా! యెవ్వండేని నీశ్వరకల్పితవృత్తి గల జంతువుల హింసించు నట్టివాని నంధకూపం బను నరకంబునం బడ వైచిన నందు నతండు దొల్లి తాను జేసిన భూత ద్రోహంబున నచ్చట వివిధ క్రూర పక్షి మృగ పశు సర్ప మశక మత్కుణ మక్షికాదులచేత హింసంబొందుచు మహాంధకారంబునందు నిద్రానుభవ సుఖలేశంబును లేక కుశరీరంబు నందుల జీవుండునుం బోలె మృతప్రాయుండై యుండు; నంత.
టీకా:
నరేంద్ర = రాజా; ఎవ్వండేని = ఎవరైనా; ఈశ్వర = భగవంతునిచేత; కల్పిత = ఏర్పరచిన; వృత్తి = జీవిక; కల = కలిగిన; జంతువులన్ = జీవులను; హింసించున్ = సంహరించెడి; అట్టి = అటువంటి; వానిన్ = వాడిని; అంధకూపంబు = అంధకూపము; అను = అనెడి; నరకంబున్ = నరకములో; పడవైచినన్ = పడేయగా; అందున్ = దానిలో; అతండు = అతడు; తొల్లి = పూర్వము; తాను = తను; చేసిన = చేసినట్టి; భూత = జీవరాశులకు చేసిన; ద్రోహంబునన్ = ద్రోహముల వలన; అచ్చటన్ = అక్కడ; వివిధ = అనేక రకములైన; క్రూర = క్రూరమైన; పక్షి = పక్షులు; మృగ = జంతువుల; పశు = పశువులు; సర్ప = సర్పములు; మశక = దోమలు; మత్కుణ = నల్లులు; మక్షిక = ఈగలు; ఆదుల = మొదలగువాని; చేతన్ = చేత; హింసన్ = బాధలను; పొందుచున్ = పొందుతు; మహా = గొప్ప; అంధకారంబున్ = చీకటి; అందున్ = లో; నిద్రా = నిద్రను; అనుభవ = అనుభవించెడి; సుఖ = సుఖము; లేశంబున్ = కొంచముకూడ; లేక = లేకుండగ; కుశరీరంబు = చెడిపోయిన దేహము; అందులన్ = లోని; జీవుండునున్ = జీవుని; పోలెన్ = వలె; మృతప్రాయుండు = మరణించిన వానితో సమానమైనవాడు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అంత = అంతట;
భావము:
రాజా! విధి నియమించిన విధంగా తమ బ్రతుకు తాము బ్రతుకుతున్న జంతువులను హింసించేవాణ్ణి అంధకూపం అనే నరకంలో పడవేస్తారు. వాడు పూర్వం తాను చేసిన భూత ద్రోహం కారణంగా ఆ నరక కూపంలో దొర్లుతూ ఏ జీవులనైతే తాను బాధించాడో ఆ పక్షులు, పశువులు, పాములు, దోమలు, నల్లులు, ఈగలు వాణ్ణి క్రూరంగా పీక్కు తింటాయి. కటిక చీకటిలో నిద్రకు నోచుకోక, తిండికి మొగం వాచి, కుత్సిత శరీరంలోని జీవునిలాగా సగం చచ్చిపడి ఉంటాడు.
- ఉపకరణాలు:
తన కలిమి నెవ్వఁడేనియుఁ
దన బాంధవవరులఁగూడి తగఁ గుడువక తా
నును వాయసంబు భక్షిం
చిన మాడ్కిం దిన్నవాని శీఘ్రమె యచటన్.
టీకా:
తన = తన యొక్క; కలిమిన్ = కలిగినదానిని; ఎవ్వండేని = ఎవరైనా; తన = తన యొక్క; బాంధవ = బందువులలో; వరులన్ = ఉత్తములను; కూడి = కలిసి; తగన్ = అవశ్యము; కుడువక = భుజింపక; తానును = తను మాత్రమే; వాయసంబు = కాకి; భక్షించిన = భుజించిన; మాడ్కిన్ = వలె; తిన్న = భుజించిన; వానిన్ = వాడిని; శీఘ్రమే = తొందరలోనే; అచటన్ = అక్కడ;
భావము:
ఎవ్వడు తన సంపదను తన బంధువులకు పెట్టకుండా, తానొక్కడే కాకిలాగా భక్షించాడో అటువంటివాడు శీఘ్రంగా...
- ఉపకరణాలు:
క్రిమిభోజన మనియెడి నర
కమునం బడి క్రిములె కూడుగాఁ గుడుచుచుఁ దాఁ
గ్రిమి యగుచు లక్ష పరిమా
ణముఁ గల క్రిమిగుండ మందు నాఁటుక యుండున్.
టీకా:
క్రిమిభోజనము = క్రిమిభోజనము; అనియెడి = అనెడి; నరకమునన్ = నరకములో; పడి = పడిపోయి; క్రిములె = క్రిములనె; కూడుగాన్ = భోజనముగా; కుడుచుచున్ = తినుచు; తాన్ = తనే; క్రిమి = క్రిమిగా; అగుచున్ = అగుచు; లక్ష = లక్ష (1,00,000); పరిమాణము = యోజనముల కొలతలు; కల = కలిగిన; క్రిమిగుండము = క్రిములు కల గోతి; అందున్ = లోకి; నాటుకన్ = కూరుకుపోయి; ఉండున్ = ఉండును;
భావము:
క్రిమిభోజనం అనే నరకంలో పురుగుగా పడి లక్ష యోజనాల విస్తీర్ణం కల పురుగుల గుంటలో కూరుకుపోయి పురుగులను ఆహారంగా తింటూ ఉంటాడు.
- ఉపకరణాలు:
మఱియు నీ భూలోకంబున నెవ్వఁడేని నవిపన్నుండై చౌర్యవృత్తిచే బ్రాహ్మణాదుల హిరణ్యరత్నాది ద్రవ్యంబుల నపహరించు, నట్టి పురుషుని నగ్ని వర్ణంబులగు నయఃపిండంబుల నగ్ని తప్తంబు లగు శూలంబుల నతని శరీరంబునం దివియుచుండుదురు; మఱియును మదనాతురు లగుచు స్త్రీపురుషు లగమ్యాగమనంబు జేసిరేని నట్టి వారిని యమలోకంబున నతితీక్ష్ణ కశాతాడితులం జేసి యగ్నిమయంబు లయిన యుక్కు ప్రతిమల నాలింగనంబు చేయింతురు.
టీకా:
మఱియున్ = ఇంకను; ఈ = ఈ; భూలోకంబునన్ = భూలోకములో; ఎవ్వడేని = ఎవరైనా; అవిపన్నుండు = కష్టములలో లేనివాడు; ఐ = అయ్యి; చౌర్యవృత్తి = దొంగతనము; చేన్ = చేత; బ్రాహ్మణ = బ్రాహ్మణులు; ఆదుల = మొదలగువారి; హిరణ్య = బంగారము; రత్న = రత్నములు; ఆది = మొదలైన; ద్రవ్యంబులను = సంపదలను; అపహరించున్ = దొంగిలించునో; అట్టి = అటువంటి; పురుషుని = మానవుని; అగ్నివర్ణంబులు = నిప్పుల రంగు లోనికి మారినవి; అగు = అయిన; అయస్ = ఇనప; పిండంబులన్ = గుండ్లతోను; అగ్నిన్ = నిప్పులో; తప్తంబులు = కాలినవి; అగు = అయిన; శూలంబులన్ = శూలములతోను; అతని = అతని యొక్క; శరీరంబునన్ = దేహమున; తివియుచుండుందురు = కొట్టుచుందురు; మఱియునున్ = ఇంకను; మదన = కామముతో; ఆతురులు = ఆత్రుతలు కలవారు; అగుచున్ = అగుచు; స్త్రీ = స్త్రీలు; పురుషులున్ = పురుషులు; అగమ్య = దారితప్పి; గమనంబున్ = నడచుట; చేసిరేని = చేసినట్లయితే; అట్టి = అటువంటి; వారిని = వారిని; యమలోకంబునన్ = యమలోకములో; అతి = మిక్కిలి; తీక్ష్ణ = తీక్షణమైన; కశా = కొరడా; తాడితులన్ = దెబ్బలు తిన్నవారిని; చేసి = చేసి; అగ్నిమయంబులు = నిప్పులతో నిండినవి; అయిన = అయిన; ఉక్కు = ఉక్కుతో పోతపోసిన; ప్రతిమలన్ = బొమ్మలను; ఆలింగనంబున్ = కౌగలించుకొనుటలు; చేయింతురు = చేయించెదరు;
భావము:
ఇంకా ఈ భూలోకంలో ఎవడైతే తనకు ఎటువంటి కష్టం లేకపోయినా బ్రాహ్మణాదుల బంగారాన్ని, రత్నాలను, విలువైన వస్తువులను దొంగిలిస్తాడో అటువంటివాణ్ణి అగ్నితప్తం అనే నరకంలో పడవేస్తారు. ఎఱ్ఱగా కాలిన ఇనుపచువ్వలను గ్రుచ్చుతారు. మోహంతో, కామంతో కళ్ళు కనబడక వావి వరుసలు లేకుండా ప్రవర్తించిన స్త్రీ పురుషులను యమలోకంలో తీవ్రమైన కొరడాలతో కొట్టి కనకన మండుతున్న ఉక్కు బొమ్మలను కౌగిలించుకొమ్మని ఆజ్ఞాపిస్తారు.
- ఉపకరణాలు:
సర్వజంతుజాల సంగమ మొందెడు
వానిఁ బట్టి కట్టి వజ్ర దంష్ట్ర
కములు గలుగునట్టి ఘనతర శాల్మలీ
తరువులందుఁ జేర్చి దంతు రెపుడు.
టీకా:
సర్వ = అఖిలమైన; జంతుజాల = జీవజాలములతోను; సంగమము = సంభోగము; ఒందెడు = పొందెడు; వానిన్ = వాడిని; పట్టి = పట్టికొని; కట్టి = కట్టివేసి; వజ్ర = వజ్రమువలె గట్టివైన; దంష్ట్రలు = ముళ్ళు; కలుగున్ = ఉన్న; అట్టి = అటువంటి; ఘనతర = మిక్కిలి పెద్దవైన {ఘన - ఘనతరము - ఘనతమము}; శాల్మలీ = బూరుగు; తరువులు = చెట్ల; అందుజేర్చి = కి వేసి; దంతురు = దంచెదరు; ఎపుడున్ = ఎప్పుడును;
భావము:
జంతువులతో సంగమం చేసినవాణ్ణి పట్టుకొని, వజ్రాల మేకులు గల బూరుగుచెట్టుకు కట్టి చితుక కొడతారు.
- ఉపకరణాలు:
పార్థివేంద్ర! నరుఁడు పాషండదర్శనుఁ
డగుచు ధర్మమార్గ మడఁచెనేని
వాఁడు నరకమందు వైతరణీనది
నుడుగ కెపుడుఁ బొరలి పడుచునుండు.
టీకా:
పార్థివేంద్ర = రాజా; నరుడు = మానవుడు; పాషాండ = పాషాండమార్గ; దర్శనుండు = అనుసరించువాడు; అగుచున్ = అగుచు; ధర్మ = వేదధర్మము యొక్క; మార్గమున్ = మార్గమును; అడచెనేని = అణచివేసినచో; వాడు = వాడు; నరకము = నరకము; అందున్ = లో; వైతరణీ = వైతరణీ అనెడి; నదిన్ = నదిలో; ఎపుడున్ = ఎప్పుడును; ఉడుగక = విడువక; పొరలి = దొర్లి; పడుచునుండు = పడిపోతుండును;
భావము:
రాజా! ఎవడైతే పాషండమతం పట్ల ఆసక్తి పెంచుకొని ధర్మమార్గాన్ని పరిత్యజిస్తాడో అటువంటివాడు నరకలోకంలో వైతరణీ నదిలో పడి పొర్లుతూ ఉంటాడు.
- ఉపకరణాలు:
మఱియు నట్టి వైతరణీనది యందు జలగ్రాహంబులు దిగిచి భక్షింపం బ్రాణంబులు నిర్గమింపఁ దన పాపంబు లుచ్ఛరించుచు విణ్మూత్ర పూయ శోణిత కేశ నఖాస్థి మేదోమాంస వసా వాహిని యందుఁ దప్తుం డగుచునుండు; విప్రుండు శూద్రకామినులం బొంది శౌచాచారంబులం బాసి గతలజ్జుండై పశువుంబోలె జరియించెనేని నతండు నరకంబునుం బొంది యందుఁ బూయ విణ్మూత్ర లాలా శ్లేష్మ పూర్ణార్ణవమందు ద్రొబ్బంబడి యతి భీభత్సితంబు లగు నా ద్రవ్యంబుల భుజియించుచుండు.
టీకా:
మఱియున్ = ఇంకను; వైతరణీనది = వైతరణీనది; అందున్ = లో; జలగ్రాహంబులు = మొసళ్ళు; తిగిచి = లాక్కొని; భక్షింపన్ = తినుచుండగా; ప్రాణంబులున్ = ప్రాణములు; నిర్గమింపన్ = పైకిపోతుంటే; తన = తను చేసిన; పాపంబులున్ = పాపములను; ఉచ్చరించుచు = తలచుకొనుచు; విట్ = మలము; మూత్ర = మూత్రములు; పూయన్ = పాచి; శోణిత = రక్తము; కేశ = వెంట్రుకలు; నఖ = గోళ్ళు; అస్థి = ఎముకలు; మేదస్ = మెదడుకొవ్వు; మాంస = మాంసము; వసా = కొవ్వు; వాహిని = ప్రవాహము; అందున్ = లో; తప్తుండు = కాగుతున్నవాడు; అగుచునుండు = అగుచుండును; విప్రుండు = బ్రాహ్మణుడు; శూద్రకామినులన్ = శూద్రస్త్రీల; పొంది = పొందు పొంది; శౌచ = శౌచము, శుచి; ఆచారంబులున్ = ఆచారములను; పాసి = విడిచిపెట్టి; గత = పోయిన; లజ్జుండు = సిగ్గు కలవాడు; ఐ = అయ్యి; పశువున్ = పశువులు; పోలెన్ = వలె; చరియించెనేని = వర్తించినచో; అతండు = అతడు; నరకంబున్ = నరకమును; పొంది = పొంది; అందున్ = దానిలో; పూయన్ = పాచి; విట్ = మలము; మూత్ర = మూత్రము; లాలా = ఉమ్మి; శ్లేష్మ = శ్లేష్మములతో; పూర్ణ = నిండిన; ఆర్ణవము = ప్రవాహము; అందున్ = లోకి; ద్రొబ్బంబడి = త్రోసివేయబడి; అతి = మిక్కిలి; భీభత్సితంబులు = భయంకరములు; అగు = అయిన; ఆ = ఆ; ద్రవ్యంబులన్ = పదార్థంబులనే; భుజియించుచుండు = తినుచుండును;
భావము:
ఇంకా ఆ వైతరణీ నదిలోని మొసళ్ళు పాషండమతం పట్ల మోజు పెంచుకొన్నవాణ్ణి పీక్కుతింటాయి. వాడు తన ప్రాణాలు పోతూంటే తాను చేసిన తప్పులను తలచుకుంటూ మలమూత్రాలు, చీము, నెత్తురు, వెంట్రుకలు, గోళ్ళు, ఎముకలు, కొవ్వు, మాంసం కలిసిన ప్రవాహంలో మునుగుతూ తేలుతూ పడి కొట్టుకొంటూ ఉంటాడు. ఎవడైతే బ్రాహ్మణుడై కూడ సిగ్గు విడిచి పశువులాగా ప్రవర్తిస్తూ, శూద్రస్త్రీతో సంబంధం పెట్టుకొని శుచిత్వం, సదాచారం వదలిపెడతాడో అతడు నరకలోకంలో మలమూత్రాలు, లాలాజలం, కఫంతో కూడిన ప్రవాహంలో పడి అసహ్యమైన ఆ వస్తువులనే భుజిస్తూ ఉంటాడు.
- ఉపకరణాలు:
శునకములఁ బెంచి యెవ్వం
డనయంబును వేఁట సలిపి యాత్మార్థముగా
వనమృగములఁ జంపును నా
మనుజాధము నస్త్రములను మర్దింతు రొగిన్.
టీకా:
శునకములన్ = కుక్కలను; పెంచి = పెంచుతూ; ఎవ్వండు = ఎవరు; అనయంబున్ = ఎల్లప్పుడు, అస్తమాను; వేట = వేటాడుట; సలిపి = చేసి; ఆత్మ = తన; అర్థముగాన్ = కోసమై; వన = అడవి; మృగములన్ = జంతువులను; చంపును = సంహరించునో; ఆ = ఆ; మనుజ = మానవులలో; అధమున్ = అధముని; అస్త్రములన్ = అస్త్రములతో; మర్దింతురు = చితకగొట్టుదురు; ఒగిన్ = శీఘ్రమే;
భావము:
వేటకుక్కలను పెంచి ఎల్లప్పుడు వేటకు పోతూ తన తిండి కోసం అడవిలోని మృగాలను చంపిన నీచ మానవుని యమభటులు అస్త్రాలతో పొడుస్తారు.
- ఉపకరణాలు:
ద్రవ్యలోభమునను దంభార్థమై పశు
వులను జంపి జన్నములను జేయు
వానిఁబట్టి యమునివారలు గోయుచు
నుందు రెపుడు మిగుల సందడిలుచు.
టీకా:
ద్రవ్య = ధనము నందలి; లోభముననున్ = పిసినారితనముచేతను; దంభ = గొప్పలు; అర్థమై = కోసము; పశువులనున్ = యజ్ఞపశువులుగా; చంపి = బలి పేరుతో సంహరించి; జన్నములనున్ = యజ్ఞములను; చేయు = చేసెడి; వానిన్ = వాడిని; పట్టి = పట్టుకొని; యముని = యముని యొక్క; వారలు = భటులు; కోయుచునున్ = కోసివేయుచు; ఉందురు = ఉంటారు; ఎపుడున్ = ఎప్పుడును; మిగుల = ఎక్కువగా; సందడిలుచు = గొడవ చేయుచు;
భావము:
ఎవడైతే డాబు కోసం పశువులను చంపి ఆడంబరంగా యాగాలు నిర్వహిస్తాడో అతణ్ణి యమకింకరులు పొలికేకలు వేస్తూ రంపాలతో కోస్తుంటారు.
- ఉపకరణాలు:
కామమోహితుండై యెవ్వండేనిఁ దన భార్యచేత రేతఃపానంబు చేయించు నా పాపాత్ముని రేతోహ్రదంబునం ద్రోచి యా రేతంబునె పానంబు జేయింపుదురు; రాజపుత్రు లైనను జోరు లైనను ధనికుల గ్రామంబులపైఁ బడి యందు గృహదాహంబు జేయువారలను విషాదుల వలన నన్యులఁ జంపెడు వారలను వజ్రదంష్ట్రలు గల వింశత్యుత్తర సప్తశత శునకంబు లెడతెగక తిగిచి భక్షించుచుండు.
టీకా:
కామ = కామముచే; మోహితుండు = మోహమున పడినవాడు; ఐ = అయ్యి; ఎవ్వండేని = ఎవరైనా; తన = తన యొక్క; భార్య = భార్య; చేతన్ = చేత; రేతస్ = శుక్రమును, ఇంద్రియమును; పానంబున్ = తాగుటను; చేయించున్ = చేయించునో; ఆ = ఆ; పాపాత్ముని = పాపిష్టి మనసు కలవానిని; రేతః = ఇంద్రియ ద్రవముల; హ్రదంబునన్ = చెరువులో; త్రోచి = తోసేసి; ఆ = ఆ; రేతంబునె = ఇంద్రియమునే; పానంబున్ = తాగుట; చేయింపుదురు = చేయించెదరు; రాజపుత్రుల = రాకుమారులు; ఐనను = అయినను; చోరులు = దొంగలు; ఐననున్ = అయినను; ధనికుల = ధనవంతుల; గ్రామంబుల = ఊర్లు; పైబడి = పైనబడి; అందు = వానిలో; గృహ = ఇండ్లను; దాహంబు = కాల్చివేయు; వారలను = వారిని; విష = విషము; ఆదుల = మొదలగువాని; వలన = వలన; అన్యులన్ = ఇతరులను; చంపెడు = చంపివేయు; వారలను = వారిని; వజ్ర = వజ్రముల వలె గట్టవి ఐన; దంష్ట్రలు = పండ్లు, కోరలు; కల = కలిగిన; వింశత్యుత్తరసప్తశత = ఏడువందలఇరువై (720); శునకంబులున్ = కుక్కలు; ఎడతెగక = అనవరతము; తిగిచి = లాక్కొని, పీక్కొని; భక్షించుచుండు = తినుచుండును;
భావము:
ఎవడైతే కామంతో కళ్ళు మూసుకుపోయి తన భార్య చేత రేతఃపానం చేయిస్తాడో ఆ పాపాత్ముణ్ణి రేతస్సుతో కూడిన మడుగులో త్రోసి ఆ రేతస్సునే వానిచేత త్రాగిస్తారు. రాజభటులైనా, దొంగలైనా ధనవంతుల గ్రామాలపై పడి ఇళ్ళను తగులబెట్టేవాళ్ళను, విష ప్రయోగాదులతో ఇతరులను చంపేవాళ్ళను వజ్రాల కోరలున్న ఏడువందల ఇరవై కుక్కలు ప్రతిదినం చుట్టుముట్టి పీక్కుతింటాయి.
- ఉపకరణాలు:
లంచంబుఁ గొని సాక్షి వంచించి యనృతంబు-
పలికెడు పాపాత్ముఁ బట్టి కట్టి
యంత మానకవీచి యను నరకమునందు-
శతయోజనోన్నత శైల శిఖర
మునఁ దలక్రిందుగా నునిచి యధోముఖం-
బుగఁ బడద్రొబ్బిన బొబ్బలిడుచుఁ
గల్లోలములు లేని కమలాకరముఁబోలెఁ-
జదరమై యున్న పాషాణ మందుఁ
- ఉపకరణాలు:
బడిన యంతన దేహంబు పగిలి పెక్కు
తునకలై పాసి యది గూడుకొనుచునుండ
దండి యాకులతను బొందుచుండుఁ గాని
చావులేకుండు నా దుష్ట జంతువునకు.
టీకా:
లంచంబున్ = లంచమును; కొని = తీసుకొని; సాక్షి = సాక్ష్యము చెప్పువాడు; వంచించి = మోసము చేసి; అనృతంబున్ = అబద్దమును; పలికెడు = చెప్పునట్టి; పాపత్మున్ = పాపిష్టి మనసుగలవానిని; పట్టి = పట్టుకొని; కట్టి = కట్టివేసి; అంతన్ = అంతట; మానకవీచి = మానకవీచి {మానకవీచి - కొండపైనుండి విసరెడి శిక్షలు, నరక విశేషము}; అను = అనెడి; నరకమున్ = నరకము; అందున్ = లో; శత = వంద (100); యోజన = యోజనముల; ఉన్నత = ఎత్తైన; శైల = కొండ; శిఖరమునన్ = కొన యందు; తలక్రిందుగా = తలక్రిందులుగా; ఉనిచి = ఉంచి; అధోముఖము = కిందివైపునకు; పడద్రొబ్బిన = పడవేసిన; బొబ్బలు = కేకలు; ఇడుచు = వేయుచు; కల్లోలములు = అలలు కదలికలు; లేని = లేనట్టి; కమలాకరమున్ = సరస్సును; పోలెన్ = వలె; చదరము = చదునుగా; ఉన్న = ఉన్నట్టి; పాషాణము = కొండరాతి; అందున్ = అందు; పడిన = పడిపోగా;
అంతన = అంతట; దేహము = శరీరము; పగిలి = విరిగిపోయి; పెక్కు = అనేకమైన; తునకలు = చిన్నముక్కలుగా; పాసి = విడిపోయి; అది = అదే; కూడుకొనుచునుండన్ = కూడదీసుకొనుచుండగా; ఉండి = ఉండి; యాకులతను = వ్యాకులతను; పొందుచుండున్ = పొందుతుండును; కాని = కాని; చావు = మరణము; లేకుండు = లేకపోవును; ఆ = ఆ; దుష్ట = చెడ్డ; జంతువున్ = జీవి; కున్ = కి;
భావము:
లంచం పుచ్చుకొని దొంగసాక్ష్యం చెప్పి ఎదుటివారిని మోసగించిన పాపాత్ముణ్ణి వీచి అనే నరకంలో పడవేస్తారు. అక్కడ వాణ్ణి పట్టుకొని బంధించి నూరు యోజనాల ఎత్తైన కొండ శిఖరం నుండి తలక్రిందుగా క్రిందికి విసరివేస్తారు. అప్పుడు వాడు పెడబొబ్బలు పెడుతూ అలలు లేని కొలనులాగా నున్నగా ఉన్న చట్రాతి మీద పడిపోతాడు. అలా పడి శరీరం ముక్కలు ముక్కలై మళ్ళీ అవి అతుక్కొంటుంతే చావు రాక, బ్రతుకలేక వ్యాకులపాటుతో అవస్థ పడుతుంటాడు.
- ఉపకరణాలు:
సోమయాజి భార్యఁ గామించి పొందిన
వానిఁ గపట మద్యపాన సోమ
పాన మనుదినంబుఁ బానంబు జేయు వి
ట్క్షత్రియులను బట్టి సంభ్రమమున.
టీకా:
సోమయాజి = సోమయాజి యొక్క {సోమయాజి - యజ్ఞము చేసినవాడు}; భార్యన్ = పెండ్లామును; కామించి = పొందు కోరి; పొందిన = పొందినట్టి; వానిన్ = వాడిని; కపట = దొంగచాటుగా; మద్యపాన = మద్యపానము; సోమపానమున్ = సోమపానములను; అనుదినమున్ = ప్రతిదినము; పానంబున్ = తాగుట; చేయు = చేసెడి; విట్ = వైశ్యులు; క్షత్రియులను = రాజులను; పట్టి = పట్టుకొని; సంభ్రమమునన్ = తొట్రుపాటుతో;
భావము:
సోమయాజి పెండ్లాన్ని కామించి అనుభవించినవాణ్ణి, సోమపానం అంటూ దొంగచాటుగా మద్యపానం చేసే వైశ్యులను, క్షత్రియులను పట్టుకొని సంభ్రమంతో...
- ఉపకరణాలు:
ఱొమ్ముఁ దొక్కి మోము ఱిమ్మపట్టఁగ మోది
యనలముఖమునందు నగ్నివర్ణ
ముగను గాఁచి వక్త్రమున నిండఁగా నుక్కు
నీరు పోతు రేచి నిష్ఠురముగ.
టీకా:
ఱొమ్ము = వక్షస్థలమును; త్రొక్కి = తొక్కిపెట్టి; మోమున్ = ముఖమును; ఱిమ్మపట్టగన్ = రిమ్మని తిరుగునట్లు; మోది = మొత్తి; అనల = అగ్ని; ముఖమున్ = మంటల; అందున్ = లో; అగ్నివర్ణముగను = ఎఱ్ఱగా; కాచి = కాగబెట్టి; వక్త్రమున = నోరు; నిండగా = నిండిపోవునట్లుగా; ఉక్కు = ఇనుము; నీరు = కరిగిన ద్రవమును; పోతురు = పోయుదురు; ఏచి = విజృంభించి; నిష్ఠురముగన్ = నిందాపూర్వకముగా;
భావము:
వాళ్ళ రొమ్ము త్రొక్కి, ముఖం దిమ్మ తిరిగేటట్లు మొత్తి, అగ్నిలో ఎఱ్ఱగా కాల్చిన ఉక్కు ద్రవాన్ని నోట్లో పోస్తారు.
- ఉపకరణాలు:
మఱియు; నీచవర్ణుండు నిష్ఠ సలుపుచుఁ దపోదాన విద్యాచారంబులఁ బెద్దల కవమానంబు జేయువాఁడు క్షారకర్దమంబను నరకంబు నందు నధోముఖుం డగుచు బాధలంబొందు; స్త్రీ పురుషు లెవ్వరేని శరీరరక్షణార్థంబు పశువుల మానవుల బలి యిచ్చిరేని; వారల నిరయంబునందు యమకింకరులు సురియలం దునిమి తద్రక్తంబు పానంబు జేయుచుం బాఱాడుచుందురు; గ్రామారణ్యంబులయందు జంతువుల శూలప్రోతంబులం గావించి హింసించుచు హర్షించుచున్న వారలను శూలసూత్రంబను నరకంబు నందు శూలప్రోతులం జేసిన క్షుత్పిపాసా పరవశులగుచుండఁ గంక గృధాదులు దీక్ష్ణతుండాగ్రంబులం దిగిచి భక్షించుచుండు మఱియు ధూర్తస్వభావంబున జంతు పీడనంబుఁ గావించెడు పాపాత్ముల దందశూకం బను నరకంబు నందు వైవ నైదు నేడు ముఖంబుల సర్పంబులు గఱచుచుండు.
టీకా:
మఱియు = ఇంకా; నీచవర్ణుండు = తక్కువ కులమువాడు; నిష్ఠన్ = నియమ నిష్ఠలు; సలుపుచున్ = ఆచరించుచు; తపస్ = తపస్సు చేయుట; దాన = దానము చేయుట; విద్య = విద్య కలిగియుండుట; ఆచారంబులున్ = ఆచారములలోను; పెద్దల = పెద్దవారి; కున్ = కి; అవమానంబున్ = అవమానమును; చేయు = చేసెడి; వాడు = వాడు; క్షారకర్దమంబు = క్షారకర్దమము {క్షారకర్దమము - క్షార (మిక్కిలి కారముగల) కర్దమము (బురద)ను తిను శిక్ష, నరక విశేషము}; అను = అనెడి; నరకంబున్ = నరకము; అందున్ = లో; అధోముఖుండు = తలక్రిందులుగా ఉన్నవాడు; అగుచు = అగుచు; బాధలన్ = బాధలను; పొందున్ = పొందును; స్త్రీ = స్త్రీలుకాని; పురుషులున్ = పురుషులు కాని; ఎవ్వరేని = ఎవరైనా; శరీర = తన దేహమును; రక్షణ = కాపాడుకొనుట; అర్థంబున్ = కోసము; పశువులన్ = పశువులను; మానవులన్ = మనుషులను; బలి = బలిగా సంహరించుట; ఇచ్చిరేని = చేసినచో; వారల = వారిని; నిరయంబున్ = నరకము; అందున్ = లో; యమకింకరులు = యమదూతలు; సురియలన్ = చురకత్తులతో, ఛురికలతో; దునిమి = నరికి; తత్ = వాని; రక్తంబున్ = రక్తమును; పానంబున్ = తాగుట; చేయుచున్ = చేయుచు; పాఱాడుచున్ = తిరుగుతు; ఉందురు = ఉందురు; గ్రామ = గ్రామములు; అరణ్యంబుల = అడవుల; అందున్ = లోను; జంతువులన్ = జీవములను; శూల = శూలములచే; ప్రోతంబులన్ = గుచ్చబడినవిగా; కావించి = చేసి; హింసించుచు = సంహరించుచు; హర్షించుచున్న = సంతోషించుతున్న; వారలను = వారిని; శూలసూత్రంబున్ = శూలసూత్రము; అను = అనెడి; నరకంబున్ = నరకమున; అందున్ = లో; శూల = శూలములకు; ప్రోతులన్ = గుచ్చబడినవారిగా; చేసిన = చేయగా; క్షుత్ = ఆకలి; పిపాసా = దప్పులచే; పరవశులు = వశముదప్పినవారు; అగుచుండన్ = అగుచుండగా; కంక = రాంబందులు; గృధ = గ్రద్దలు; ఆదులు = మొదలగునవి; తీక్ష్ణ = తీక్షణమైన; తుండ = ముక్కుల; అగ్రంబులన్ = కొనలతో; తిగిచి = పీక్కొని; భక్షించుచుండున్ = తినుచుండును; మఱియు = ఇంకా; ధూర్త = చెడ్డ; స్వభావంబునన్ = స్వభావముతో; జంతు = జీవములను; పీడనంబు = బాధలుపెట్టుట; కావించెడు = చేసేటటువంటి; పాపాత్ములన్ = పాపిష్టి మనసుగలవానిని; దందశూకంబు = దందశూకము {దందశూకము - పాములపుట్ట, నరక విశేషము}; అను = అనెడి; నరకంబున్ = నరకమును; అందున్ = లో; వైవన్ = వేయగా; ఐదు = అయిదు (5); ఏడు = ఏడు (7); ముఖంబుల = పడగల, తలల; సర్పంబులు = పాములు; కఱచుచున్ = కరచుచు; ఉండున్ = ఉండును;
భావము:
ఇంకా తక్కువ కులం వాడు నియమ నిష్ఠలతో తపస్సు, దానాలు, విద్యార్జనం చేస్తూ పెద్దలను అవమానిస్తే అటువంటివాణ్ణి క్షారకర్దమం అనే నరకంలో తలకిందులుగా వ్రేలాడదీసి బాధిస్తారు. స్త్రీలైనా పురుషులైనా తమ ప్రాణాలు కాపాడుకొనడానికి పశువులను, మనుష్యులను బలి ఇస్తే వాళ్ళను నిరయం అనే నరకంలో వేసి యమకింకరులు చురకత్తులతో పొడిచి ఆ రక్తాన్ని త్రాగుతారు. గ్రామాలలోని, అడవులలోని జంతువుల కడుపులలో శూలాలను గ్రుచ్చి హింసిస్తూ ఆనందించినవాళ్ళను శూలప్రోతం అనే నరకంలో పడవేసి కడుపులలో శూలాలను గ్రుచ్చుతారు. వాళ్ళు ఆకలి దప్పులచే బాధపడుతుంటే రాబందులు, గ్రద్దలు పదునైన ఉక్కు ముక్కులతో వాళ్ళ దేహాలను పొడుచుకు తింటాయి. ఇంతేకాక ధూర్త స్వభావంతో జంతువులను హింసించిన పాపాత్ములను దందశూకం అనే నరకంలో పడవేస్తారు. అక్కడ ఐదు, ఏడు తలలు గలిగిన సర్పాలు వాళ్ళను కరుస్తూ ఉంటాయి.
- ఉపకరణాలు:
ఎనయ దొడ్డిలోన నిండ్లలో నైనను
బశు పతంగ హరిణ పంక్తి నెల్లఁ
బట్టి హింసజేయు పాపాత్ము విషవహ్ని
ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల!
టీకా:
ఎనయన్ = సరిపోలెడి; దొడ్డి = పెరడుల; లోనన్ = లోపల; ఇండ్ల = నివాసముల; లోనన్ = లోపల; ఐననున్ = అయినా; పశు = పశువులను; పతంగ = పక్షులను; హరిణ = లేళ్ళను; పంక్తిన్ = వరుసగా; ఎల్లన్ = అన్నిటిని; పట్టి = పట్టుకొని; హింస = బాధ; చేయు = పెట్టెడి; పాపాత్మున్ = పాపిష్టివానిని; విష = విషములు; వహ్ని = అగ్ని; ధూమ = పొగ; శిఖలన్ = కీలలో; ద్రొబ్బుదురు = తోయుదురు; నృపాల = రాజా;
భావము:
రాజా! తమ పెరళ్ళలో కాని, ఇండ్లలో కాని తిరిగే పశువులను, పక్షులను, లేళ్ళను హింసించే పాపాత్ములను విషాగ్ని జ్వాలలలో త్రోస్తారు.
- ఉపకరణాలు:
తన యింటికి వచ్చిన మను
జుని నతిథిం గ్రోధదృష్టిఁ జూచిన వానిం
గనుఁగవల వజ్రదంష్ట్రలఁ
దనరిన యా కంక గృధ్రతతి భక్షించున్.
టీకా:
తన = తన యొక్క; ఇంటి = నివాసమున; కిన్ = కు; వచ్చిన = వచ్చినట్టి; మనుజుని = మనిషిని; అతిథిన్ = అతిథిని; క్రోధ = క్రోధము కల; దృష్టిన్ = చూపులతో; చూచినన్ = చూసినచో; వానిన్ = వానిని; కను = కళ్ళ; గవలన్ = జంటను (2); వజ్ర = బహు గట్టి; దంష్ట్రలన్ = ముక్కులతో; తనరిన = అతిశయించిన; ఆ = ఆ; కంక = రాబందులు; గృధ = గద్ధల; తతి = గుంపు; భక్షించున్ = తినును;
భావము:
తన ఇంటికి వచ్చిన అతిథిని కోపంతో చూచినవాణ్ణి వజ్రాల కోరలు గలిగిన రాబందులు, గ్రద్దలు పొడుచుకొని తింటాయి.
- ఉపకరణాలు:
ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకారంబులన్
ఘనతం జేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం
బను నా దుర్గతిఁ బట్టి త్రోఁచి నిధిగా పై యున్న భూతం బటం
చును బాశంబులఁ బట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై.
టీకా:
ధనవంతుడు = సంపన్నుడు; అగు = అయిన; మానవుండు = మనిషి; కడకన్ = పూని; ధర్మ = దానధర్మములు; ఉపకారంబులన్ = ఉపకారములను; ఘనతన్ = మిక్కిలిగా; చేయక = చేయకుండగ; ఉండెన్ = ఉండెను; ఏని = అయినచో; యమలోకంబున్ = యమలోకము; అందున్ = లో; సూచీముఖంబు = సూచీముఖము; అను = అనెడి; ఆ = ఆ; దుర్గతిన్ = నరకమున; పట్టి = పట్టుకొని; త్రోచి = త్రోసేసి; నిధిన్ = నిధికి; కాపు = కాపాలాకాసెడివాడు; ఐయిన్న = అయినట్టి; భూతంబు = భూతము; అటంచున్ = అనుచు; పాశంబులన్ = తాళ్ళతో; పట్టి = పట్టుకొని; కట్టి = కట్టి; వడి = మెలితిప్పుట చేత; తో = తోటి; నొప్పింతురు = బాధపెట్టెదరు; అతి = మిక్కిలి; ఉగ్రులు = భయంకరులు; ఐ = అయ్యి;
భావము:
ధనవంతుడై ధర్మకార్యాలు, దానలు చేయకుండా ఉన్న మానవుణ్ణి పట్టుకొని యమలోకంలోని సూచీముఖం అనే నరకంలోకి త్రోసి “నిధికి కాపలా ఉన్న దయ్యమా!” అంటూ యమకింకరులు తాళ్ళతో కట్టి కోపంతో బాధిస్తారు.
- ఉపకరణాలు:
నరవరేణ్య! యిట్టి నరకముల్ యమలోక
మందుఁ గలవు మఱి సహస్ర సంఖ్య;
లందు శమనదూత లనిశంబు బాధింతు
రవని ధర్మదూరు లయిన నరుల.
టీకా:
నరవరేణ్య = రాజా; ఇట్టి = ఇటువంటి; నరకముల్ = నరకములు; యమలోకము = యమలోకము; అందున్ = లో; కలవు = ఉన్నవి; మఱి = ఇంకా; సహస్ర = వేలకొలది; సంఖ్యలలో = లెక్కల; అందున్ = లో; శమనదూతలు = యమదూతలు; అనిశంబున్ = నిత్యము; బాధింతురు = బాధపెట్టెదరు; అవనిన్ = భూమిపైన; ధర్మ = ధర్మమార్గమునకు; దూరులు = దూరమైనవారు; అయిన = అయినట్టి; నరులన్ = మానవులను;
భావము:
రాజా! ఇటువంటి నరకాలు యమలోకంలో వేలసంఖ్యలో ఉన్నాయి. ఆ నరకాలలో యమదూతలు అధర్మపరులను ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటారు.
- ఉపకరణాలు:
ధర్మవంతులెల్ల దప్పక స్వర్గంబు
నందు భోగసమితిఁ బొందుచుందు;
రెలమిఁ బుణ్యపాపముల శేషములవల్లఁ
బుట్టుచుందు రవనిఁ బుణ్యచరిత.
టీకా:
ధర్మవంతులన్ = ధర్మము కలవారిని; ఎల్లన్ = అందరను; తప్పక = తప్పకుండ; స్వర్గంబున్ = స్వర్గము; అందున్ = లో; భోగ = భోగముల; సమితిన్ = అనేకమును; పొందుచుందురు = పొందుతుందురు; ఎలమిన్ = వికాసముతో; పుణ్య = చేసికొన్న పుణ్యములు; పాపముల = చేసికొన్న పాపముల; శేషములన్ = మిగిలినవాని; వల్లన్ = వలన; పుట్టుచుందురు = పుడుతుంటారు; అవనిన్ = నేలపైన; పుణ్యచరిత = పుణ్యవంతమైన వర్తన కలవాడా;
భావము:
పుణ్యచరిత్రుడవైన ఓ రాజా! ధర్మపరులైన మానవులు స్వర్గంలో సుఖాలను అనుభవిస్తారు. వారు వారు చేసుకొన్న పుణ్యపాపాల శేషఫలం వల్ల తిరిగి భూలోకంలో పుడుతూ ఉంటారు.
- ఉపకరణాలు:
నరేంద్రా! మోక్షమార్గంబు మున్నె వినిపించితి; నిప్పుడు నీ కెఱింగించిన వెల్లను బ్రహ్మాండకోశంబునం జతుర్దశ కోశంబులుఁ గల వని పురాణంబులు పలుకుచుండు; నట్టి బ్రహ్మాండంబు శ్రీ మన్నారాయణుని స్థూలశరీరం బగుటంజేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతు రెవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులుం గలుగు; నీశ్వర స్థూలశరీరంబుఁ దెలిసిన వారికి శ్రద్ధాభక్తులంజేసి సూక్ష్మదేహంబు నెఱుంగవచ్చు; భూ ద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ లోకసంస్థితంబైన సకల జీవనికాయ్యంబై యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరప్రకారంబు వినిపించితి" నని
టీకా:
నరేంద్ర = రాజా; మోక్ష = మోక్షమును పొందెడు; మార్గంబున్ = విధానమును; మున్ను = ఇంతకు ముందు; వినిపించితిన్ = చెప్పితిని; ఇప్పుడు = ఇప్పుడు; నీకున్ = నీకు; ఎఱిగించినవి = తెలిపినవి; ఎల్లను = అన్నియును; బ్రహ్మాండ = బ్రహ్మాండము యనెడు; కోశంబున్ = భాండాగారములో; చతుర్దశ = పద్నాలుగు (14); కోశంబులున్ = భువనములు; కలవు = ఉన్నవి; అని = అని; పురాణంబులున్ = పురాణములు; పలుకుచుండున్ = చెప్పుతున్నవి; అట్టి = అటువంటి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండము; శ్రీమన్నారాయణుని = విష్ణుమూర్తి యొక్క {శ్రీమన్నారాయణుడు - శ్రీమత్ (శ్రీమంతమైన) నారాయణుడు, విష్ణువు}; స్థూల = భౌతిక; శరీరంబున్ = దేహము; అగుటన్ = అగుట; చేసి = వలన; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; ఎవ్వరున్ = ఎవరైతే; వర్ణింతురు = వివరించెదరో; ఎవ్వరున్ = ఎవరైతే; విందురు = వినెదరో; వారల = వారి; కున్ = కి; సకల = సమస్తమైన; శ్రేయస్సులున్ = శుభములును; కలుగున్ = కలుగును; ఈశ్వర = భగవంతుని; స్థూల = భౌతిక; శరీరంబున్ = దేహము; తెలిసిన = తెలుసుకొన్న; వారి = వారల; కిన్ = కు; శ్రద్ధా = శ్రద్ధ మరియు; భక్తులన్ = భక్తుల; చేసి = వలన; సూక్ష్మదేహమున్ = పరమాత్ముని; ఎఱుంగవచ్చున్ = తెలియగలరు; భూ = భూమండలము; ద్వీప = ద్వీపములు; వర్ష = వర్షములు; సరిత్ = నదులు; అద్రి = పర్వతములు; నభస్ = ఆకాశము, అంతరిక్షము; సముద్ర = సముద్రములు; పాతాళ = పాతాళము; దిక్ = దిక్కులు; నరక = నరకములు; తారా = తారల; గణ = సమూహములు; లోక = లోకములందు; సంస్థితంబు = చక్కగానున్నవి; ఐన = అయిన; సకల = సమస్తమైన; జీవ = ప్రాణి; నికాయంబున్ = సమూహములు; ఐ = అయ్యి; అద్భుతంబు = అద్భుతము; ఐన = అయినట్టి; శ్రీహరి = విష్ణుమూర్తి యొక్క; స్థూల = భౌతిక; శరీర = శరీరము యొక్క; ప్రకారంబున్ = వివరములను; వినిపించితిన్ = చెప్పితిని; అని = అని;
భావము:
రాజా! మోక్షమార్గాన్ని ముందే వినిపించాను. ఇప్పుడు నీకు తెలియజేసిన బ్రహ్మాండంలో పదునాలుగు లోకాలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నవి. అటువంటి బ్రహ్మాండం శ్రీమన్నారాయణుని స్థూలశరీరం. అందువల్ల ఆ బ్రహ్మాండాన్ని ఎవరు వర్ణిస్తారో, ఎవరు వింటారో వారు సకల శుభాలను పొందుతారు. ఈశ్వరుని స్థూలశరీరం తెలిసిన వారికి శ్రద్ధాభక్తుల వల్ల భగవంతుని సూక్ష్మశరీరం తెలుస్తుంది. భూగోళంలోని సప్తద్వీపాలు, తొమ్మిది వర్షాలు, నదులు, పర్వతాలు, ఆకాశం, సముద్రాలు, పాతాళం, దిక్కులు, నరకం, నక్షత్ర సముదాయం మొదలైన సకల జీవరాసులతో కూడి అద్భుతంగా ఉన్న శ్రీమన్నారాయణుని స్థూలశరీర స్వరూపాన్ని నీకు వినిపించాను.